సాహిత్యం సార్వజనీనమైనది, సాహిత్యం ఓ అంతశ్చేతన, మనః స్పందనల నుండే చక్కటి భావాలు అక్షరీకరించబడతాయి. ప్రతిలేఖనంలో వాస్తవికత,
కళాత్మకత, జన జాగృతి
కలిగిస్తూ,సమాజహితాల్ని నిజ దర్పణంలో చూపేదే సాహిత్యం. సాహితీ సభలు నిర్వహించడం వల్ల ఎన్నో విషయాలు తెలుస్తాయి. సాహితీవేత్తలు తమ అనుభవాల్ని వెల్లడించే క్రమంలో, వర్ధమాన రచయితలు తమ కలాలను పదునెక్కించుకుని స్ఫూర్తి పొంది తమను తాముతెలివిగా మలుచుకునే అవకాశం ఉంటుంది. శ్రీమతి నిహారిణిగారి పుస్తకావిష్కరణ సభలో ప్రసంగిస్తున్న డబ్బీకార్ గారిని చూసాను.
మృదు గంభీర స్వరం, వాక్పటిమ, సందర్భోచిత వాగ్ఝరి ఒక వక్తకు కావలసిన ప్రధాన లక్షణాలని నా భావన .ఆ కోవలోని వారే పెద్దలు శ్రీ రూప్ కుమార్ డబ్బీకార్ గారు.
వారితో నా మొదటి పరిచయం తెలంగాణా రచయితల సంఘం,
జంట నగరాల శాఖ వారు శ్రీ కందుకూరి శ్రీరాములు గారు, శ్రీ బెల్లంకొండ సంపత్ కుమార్ గార్ల ఆధ్వర్యంలో, ప్రతి సోమవారం అంతర్జాలం వేదికగా నిర్వహించే సోమవారం కవి సమ్మేళనంలో.
అందరి కవితలు వింటూ ,తాము సైతం ఓ కవిత చదివి చివరగా తమ అభిప్రాయం చెప్పే కొద్ది మందిలో వీరొకరు. నిక్కచ్చిగా చెప్తారు, ఒక్కోసారి కవితాఛాయలు లేక కేవలం వచనంలా ఉన్నాయంటారు. ఒక సద్విమర్శకుడు దిక్సూచి లాంటివాడని నా అభిప్రాయం. సద్విమర్శ ఎప్పుడూ ఆహ్వానించ తగ్గదే ! తమలోని రచనాపటిమకు మెరుగులద్దుకునే అవకాశానికి ఇది తొలిమెట్టు లాంటిది .
నేను ఈమధ్య చాలా వేదికలమీద డా. రూప్ కుమార్ డబ్బీకార్ గారు
ప్రసంగించడం చూస్తున్నాను. వాగాడంబరం ఉండదు, చెప్పాలనుకున్నదాన్ని సంక్షిప్తంగా, సరైన రీతిలో, ప్రశాంతంగా వెల్లడిస్తారు. సోదరి శ్రీమతి కొండపల్లి నిహారిణి గారి నాలుగు పుస్తకాల ఆవిష్కరణ సభలో వీరు మూడవ సెషన్ కు ఆత్మీయ అతిథిగా విచ్చేసి’ కథామయూఖం’, ‘బాలమయూఖం’ పత్రికల కథా సంకలనాల ఆవిష్కరణ సభలో ప్రసంగిస్తూ, తమ మృదుగంభీర వచనాలతో సోదరి నిహారిణిని విదుషీమణిగా అభివర్ణించారు. వివిధ ప్రక్రియల్లో తన అసామాన్య ప్రతిభాపాటవాలతో ముందుకు దూసుకెళ్తున్న తీరుకు హర్షం వ్యక్తం చేస్తూనే, వేదికలపై సాహితీ దిగ్గజాలు ,ఆమెను గూర్చి ఎన్నో విశేషాలు చెప్పారంటూ ఇంకా తాను ఏది మాట్లాడినా పునరుక్తం ఔతుందనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ, పొదుపైన తమ మాటలతో ‘కథామయూఖం’, ‘బాలమయూఖం’ పుస్తకాలకంటే ముందుగా స్త్రీవాద సాహిత్య వ్యాసాల్ని’ అనివార్యం’ పేరుతో వెలువరించడం సముచితమైన నిర్ణయంగా పేర్కొన్నారు.
వక్తలందరూ చెప్పినట్లుగా నిహారిణి గారి కుటుంబనేపథ్యం ప్రేరణత్మకమైనా, పుట్టింటి పోరాట చైతన్యాన్ని ,మెట్టినింటి కళా చైతన్యాన్ని ఒద్దిరాజు సోదరుల సాహితీ చైతన్యాన్ని (సృజన శీలత) తనలో నింపుకొని, ‘సామాజిక చైతన్యం’తో కొత్త ఊపిరి పోసుకొని తనకు తానే దిశా నిర్దేశం చేసుకున్న ఓ ఆశావాది అంటూఅభివర్ణించారు. ‘వర్జినియా వూల్ఫ్’ అనే ఓ స్త్రీవాద రచయిత్రి ,ఉద్యమకారిణి మాటలను ఉటంకిస్తూ – సుప్రసిద్ధ నాటక రచయిత షేక్స్పియర్ సోదరి ‘జుడిత్’ పాత్ర ను సృష్టిస్తూ ఆమె ఇలా అంటారు. అంత గొప్ప రచయితకు సోదరి, ఒకే డి.ఎన్.ఏ . కలిగిన జుడిత్ మామూలు రచయిత్రిగా కూడా ఎందుకు కాలేకపోయిందని ప్రశ్నిస్తూనే, పితృస్వామ్య, పురుషాధిక్య ప్రపంచంలో ఆమెను ఇంటి వరకే పరిమితం చేయడం అంటారు
‘వూల్ఫ్ ‘.
సరైన పరిస్థితులు, అవకాశాలు ఉండి ఉంటే ఆమె కూడా అద్భుత సాహిత్యం సృష్టించేదేమో అంటారామె. “A Room Of One’s Own ” అనే తమ రచనలో స్త్రీకి కొంత ఆర్థిక సౌలభ్యం మరికొంత ఏకాంత వాతావరణం ఉంటే ప్రశాంతంగా సాహితీ సేవ చేసుకునే వెసులుబాటు ఉంటుందనేది ఆమె భావన. అదే రీతిలో నిహారిణిగారు కూడా లౌక్యంగా వాటిని భాగస్వామి సహకారంతో సొంతం చేసుకున్న నేర్పరి అంటూ చమత్కరిస్తూనే ఆమెకు అన్నీతానై వెన్నంటిఉన్న శ్రీ వేణుగోపాలరావు గారిని అభినందిస్తున్నానన్నారు డబ్బీకార్ గారు. తండ్రి ప్రేరణ ,మామగారి స్ఫూర్తి, భర్త సహకారాలతో గట్టి మనోబలంతో దూసుకుపోతున్న ఆమె, మరిన్ని అద్భుతాలు సృష్టించాలని మనసారా ఆకాంక్షిస్తున్నానని పేర్కొన్నారు. తనకిచ్చిన ఆత్మీయ సభాతిథ్యానికి ధన్యవాదాలు అంటూ చక్కని భాషణం చేసారు శ్రీ రూప్ కుమార్ డబ్బీకార్.
నాకు తెలిసి సోదరి శ్రీమతి నిహారిణిగారు పెళ్ళితో చదువుకు స్వస్తి చెప్పకుండా, ఉన్నత చదువులు కొనసాగిస్తూనే వ్యాసంగానికి కూడా అంతే ప్రాధాన్యతనిచ్చి తన జ్ఞానతృష్ణను తీర్చుకునే క్రమంలో సాహితీ ప్రక్రియ లెన్నిటినో స్పృశిస్తూ ,తన కలం ద్వారా సమాజాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు.వారి నిరంతర సాధనే నేటి ఈ విజయ సోపానం అని నా భావన. ఇదే విషయాన్ని రూప్ కుమార్ గారూ అనడం గమనిస్తాం. ఎన్ని సౌకర్యాలు ఉన్నా కవిత్వం అంటే మక్కువ, భాష మీద పట్టు సాహిత్య సృజన చేయాలన్న శ్రద్ధాసక్తులు లేకుంటే ఇలా ఇన్ని పుస్తకాలు, గ్రంథాలు నీహారిణి వెలువరించేవారా? అనే అభిప్రాయం వ్యక్తం చేసారు. ఒక రచయితను సరిగ్గా అంచనా వేయగలిగేది మరో రచయితనే అనడానికి నిదర్శనం రూప్ కుమార్ డబ్బీకార్ గారు ఉదాహరణగా నిలుస్తారు. రచనలపై లోతైన విశ్లేషణ చేయడం వల్ల కొత్త రచయితలకు ఎంతో మేలు చేకూరుతుందనేది నిర్వివాదాంశం.