ఈరోజు (ఏప్రిల్ 25) ప్రముఖ సాహితీవేత్త, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దాశరథి సాహిత్య పురస్కార గ్రహీత, కవి తిలక డా. తిరునగరి ప్రథమ వర్ధంతిని పురస్కరించుకొని వారికి స్మృత్యంజలి…
డా. తిరునగరి
ప్రముఖ కవి, సీనియర్ సాహితీవేత్త డా. తిరునగరి పూర్వ ఉమ్మడి నల్గొండ జిల్లా, ప్రస్తుత యాదాద్రి భువనగిరి జిల్లాలోని రాజాపేట మండలం బేగంపేట గ్రామంలో 24 సెప్టెంబరు 1945న జన్మించారు. పూర్తిపేరు తిరునగరి రామానుజయ్య. తిరునగరి పేరుతో ఐదు దశాబ్దాల పాటు వివిధ తెలుగు సాహిత్య ప్రక్రియలలో నిరంతరాయంగా రచనలు చేసి ప్రఖ్యాతిని పొందారు. విద్యాభ్యాసం తరువాత మూడు దశాబ్దాలకు పైగా ప్రథమ శ్రేణి తెలుగు పండితునిగా, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తెలుగు లెక్చరర్‌గా ఉద్యోగాలు చేశారు. ఆలేరులో స్థిరపడ్డారు. తన తండ్రి మనోహరస్వామి ప్రోత్సాహంతో చిన్ననాటి నుండే ప్రాచీన, ఆధునిక సాహిత్యాలపై ఆసక్తిని పెంచుకొని విస్తృతాధ్యయనం చేసి విశిష్ట సాహితీవేత్తగా ప్రస్థానం సాగించారు. బాలవీర, శ్రీషిరిడిసాయి త్రిశతి శతకాలు, శృంగార నాయికలు ఖండ కావ్యం, తిరునగరీయం 1,2,3,4, నీరాజనం, జీవధార పద్య సంపుటాలను, కొవ్వొత్తి, వసంతం కోసం, అక్షర ధార, తల్లిపేగు, గుండెలోంచి, ముక్తకాలు, మా పల్లె, మనిషి కోసం, వానా- వాడూ, ఈ భూమి, ప్రవాహిని, ఉషోగీత, ఒకింత మానవత కోసం, యాత్ర, కొత్త లోకం వైపు, కిటికీలోంచి సముద్ర మథనం, జనహిత, చెమట నా కవిత్వం వంటి పలు వచన కవితా సంపుటాలను వెలువరించారు. భారతి, చుక్కాని, కృష్ణా పత్రిక, ఆంధ్ర పత్రిక, ఆంధ్రప్రభ, స్రవంతి, జనధర్మ, వరంగల్‌వాణి, భాగ్యనగర్, ప్రజామిత్ర, తేజోప్రభ వంటి ఎన్నో ప్రఖ్యాత సాహిత్య పత్రికలలో అనేక కవితలు, ప్రామాణికమైన సాహిత్య విమర్శావ్యాసాలను తిరునగరి రాశారు. ఆలోచన, లోకాభి రామాయణం, లోకాలోకనం వంటి సమకాలీన అంశాలతో కూడిన కాలమ్స్‌తో పాటు వేయికి పైగా వివిధ పత్రికలలో ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా వ్యాసాలు రాశారు. ఆకాశవాణి, దూరదర్శన్ల కోసం 100కు పైగా లలిత, దేశభక్తి, బృంద గీతాలను రాసి పేరొందారు. ప్రైవేటు ఆల్బమ్‌ల కోసం భక్తిగీతాలు, ప్రబోధ గీతాలను ఎన్నో రాశారు. సాహిత్య సాంస్కృతిక, సామాజిక అంశాలపై వక్తగా అనేక ప్రసంగాలను వివిధ వేదికలపై చేశారు. ఉభయ తెలుగు రాష్ర్టాలలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలలో పాల్గొని ప్రసంగించారు. కవితిలక, మహావక్త వంటి బిరుదులను అందుకున్నారు. తిరునగరి రచనలు ఆంగ్లం, హిందీ భాషలలోకి అనువదింపబడటమే కాక ఆయన సాహిత్యంపై వివిధ విశ్వవిద్యాలయాలలో పరిశోధనలు జరిగాయి. నల్గొండ జిల్లా అధికార భాషా సంఘం సభ్యుడిగా 2002-2005, 2006 సంవత్సరాలలో పని చేశారు. యాదగిరిగుట్ట బ్రహోత్సవాలలో తిరునగరి అధ్యక్షతన ఎన్నో కవి సమ్మేళనాలు జరిగాయి. తన నిరంతర సాహిత్య కృషి ద్వారా ఆలేరు ప్రాంతానికే కాకుండా ఉమ్మడి నల్గొండ జిల్లాకు గుర్తింపును తీసుకువచ్చారు. దివాకర్ల, దాశరథి, సినారె, పేర్వారం మొదలుకొని పాటు ఆధునిక సాహితీవేత్తల వరకు తిరునగరి అందించిన సాహిత్యం ప్రశంసలందుకుంది. తెలుగు సాహిత్యంలోని వివిధ ప్రక్రియలలో ప్రచురితమైన పలు ప్రత్యేక సంచికలకు సంపాదకులుగా, సంపాదకమండలి సభ్యులుగా తిరునగరి వ్యవహరించారు. వివిధ విశ్వవిద్యాలయాలు, సంస్థలు నిర్వహించిన జాతీయ సాహిత్య సదస్సులలో ఆయన అనేక పత్ర సమర్పణలు చేశారు. ఉభయ తెలుగు రాష్ర్టాలతో పాటు పలు ఇతర రాష్ర్టాలలో తెలుగు సంఘాలు, సంస్థలు నిర్వహించిన అనేక సాహిత్య సదస్సులు, విశేష కార్యక్రమాలకు అతిథిగా తిరునగరి హాజరయ్యారు. హైద్రాబాదులో 2017లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలలో తెలంగాణ శతక సాహిత్యంపై తిరునగరి ప్రసంగించి తెలంగాణ శతక వైభవాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు. సమకాలీన వర్తమాన అంశాలపై తిరునగరీయం పేరుతో తిరునగరిది మాట తిరుగులేదు అన్న మకుటంతో డాక్టర్ తిరునగరి రాసిన పద్యాలు తెలుగునాట ప్రతినోటా ఎంతో పాపులర్ అవ్వడమే కాకుండా అవి సంకలనాలుగా కూడా ప్రచురితమయ్యాయి. తిరునగరీయం సమాజాన్ని విశ్లేషిస్తూ వచ్చిన మంచి పద్యకావ్యం అన్న ప్రశంసలను సాహితీలోకంలో అందుకుంది. తిరులో సంప్రదాయాన్ని, నగరిలో నాగరికతను దాచుకొని తేజస్వంతములు, ఓజస్వంతములైన కవిత్వాన్ని పద్యం, గేయం, వచనం వంటి ప్రక్రియలలో అందించి ప్రాచీన, ఆధునికతల మేళవింపుగా హృద్య రచనలతో సహృదయులను అలరింపజేసిన నిష్కామ దార్శనికత కలిగిన మధురకవి, సాహితీవేత్త డాక్టర్ తిరునగరి. పలు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారాలను ఎన్నింటినో తిరునగరి తన సాహిత్య ప్రయాణ పరంపరలో భాగంగా అందుకున్నారు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సత్కారం (1975), నల్గొండ జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడుగా రెండు సార్లు సత్కారం (1976, 1978), యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పండిత సత్కారం (1992), బి.ఎన్.రెడ్డి సాహిత్య పురస్కారం (1994), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కళానీరాజన పురస్కారం (1995), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విశిష్ట (ఉగాది) పురస్కారం (2001), విశ్వసాహితి ఉత్తమ పద్యకవి పురస్కారం (2003), భారత్ భాషాభూషణ్ (డాక్టరేట్) అఖిల భారత భాషా సాహిత్య సమ్మేళన్, భోపాల్, మధ్యప్రదేశ్ (2003), అటా (అమెరికా తెలుగు అసోసియేషన్) సత్కారం (2006), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికార భాషా సంఘం సత్కారం (2006), రాచమళ్ళ లచ్చమ్మ స్మారక మాతృమూర్తి అవార్డు, నల్గొండ (2008), పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారం (2014), వేదాచంద్రయ్య తెలంగాణ రాష్ర్టస్థాయి సాహిత్య పురస్కారం (2015), పద్మశ్రీ ఎస్.టి. జ్ఞానానందకవి సాహిత్య పురస్కారం (2016), మహాకవి దాశరథి పురస్కారం (2016) హైద్రాబాద్, శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయం వారి దాశరథి పురస్కారం (2017), గిడుగు తెలుగు భాషా పురస్కారం – ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట ప్రభుత్వం – అమరావతి (2017), తెలంగాణ ప్రభుత్వ యాదాద్రి భువనగిరి జిల్లా స్థాయి ఉత్తమ సాహితీవేత్త పురస్కారం – (2 జూన్ 2017), సారిపల్లి కొండల్రావు ఫౌండేషన్, యువకళా వాహిని సాహిత్య పురస్కారం (2019), డా. దాశరథి – వంశీ జీవిత సాఫల్య సాహితీ పురస్కారం – 2019 (డా. వాసిరెడ్డి సీతాదేవి) – వంశీ గ్రంథాలయం, ఆరాధన సాహిత్య పురస్కారం – 2019, సినారె సాహితీ పురస్కారం – 2019 (అభినందన సంస్థ) వంటి పలు పురస్కారాలను తిరునగరి పొందారు. తిరునగరికి 2000లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన మహాకవి దాశరథి పురస్కారాన్ని అందజేసింది. తిరునగరి రాసిన చివరి కవిత నా తెలంగాణ తల్లీ శీర్షికతో చైతన్య సాక్షి తెలుగు మాస పత్రిక, ఏప్రిల్ 2021 సంచికలో ప్రచురితమైంది. పద్యం, గేయం, వచనం వంటి తెలుగు సాహిత్య ప్రక్రియలలో అందెవేసిన సాహితీవేత్తగా పేరొందిన తిరునగరి 25 ఏప్రిల్ 2021న స్వర్గస్తులయ్యారు.
https://youtu.be/5_8s5xFSAaQ
డా.తిరునగరి వర్దంతి యాదిలో…