నాజూకు అందాలసీతా స్వయంవరం
విల్లును ఎత్తలేక యువరాజుల కలవరం
చివరికి రాముని కరమున విరిగింది శివధనస్సు
చిరునవ్వుల మురిసింది సీతమనస్సు
మిధిలా నగరిని
అయోధ్యాపురిని
ముడివేసింది నవమి
మురిసిపోయింది పుడమి
అమాయక కన్నుల బిలబిలచూపులు
నవవధువు జానకి మిలమిల మెరుపులు
పుట్టినింట అప్పగింతల కన్నీళ్లు
మెట్టినింట సంతోషాల సవ్వళ్లు
ఆనందశోభన సంరంభం
శృంగారరసయోగ జీవనం ఆరంభం
కైకేయి తలలో కన్నపేగుఅనురాగం
ఇలలో భరతుని పట్టాభిషేకం
మాటతప్పని రాఘవుడు
అయోధ్య విడిచివెళ్లాడు అరణ్య వాసం
రామపాలన మిధ్య
ఇక అడవే భుమిజకు అయోధ్య
చెట్టుచేమలు, మూగ జీవుల మధ్య
వైదేహి వైవాహికజీవితం
అష్టకష్టాల కన్నీటి గీతం
సీత అందానికి లంకాపతి అల్లాడే నిలువెల్లా
మతిపోయిన పదితలల రావణుడు
వేశాడు బంగురు లేడి వల
చెదిరింది సీతమ్మకల
సీతాపహరణంతో శ్రీరాముడే విలవిల
భర్త దూరమై భగ్నహృదయంతో
అశోకవనంలో ఆగని శోకం సీత
కలలుగన్న కాపురం
కమ్ముకున్నది గడ్డుకాలం
ఐనా వీడలేదు విభుని పై విశ్వాసం
హనుమంతుని నిండైన స్వామి భక్తి
వానరసేనల యుక్తి,ఉడతభక్తి
వానరచెలిమికి ఉప్పొంగిపోయే దాశరథి
నిర్మించెను లంక పై ఘన వారధి
దశరధపుత్రుడి సమర శంఖాపూరణం
తిరుగులేదు రామబాణం
నేలచూపేసింది రావణ అహం
లంకలో దశకంఠుని అంతం
అడవిలో అవనిజ పైవివక్ష
అనుమానంతో నిలువునా అగ్నిపరీక్ష
కాల్చి తేల్చింది అంగారం
సీతమ్మతల్లి మేలిమిబంగారం
అయోధ్యపురిలో రామ పట్టాభిషేకం
పులకించే అయోధ్య ప్రజానీకం
నాలుగు పాదాల పై ధర్మం
నడిచి తెలిపింది మనుగడ మర్మం
నెలలు నిండిన జానకి
ఎల్లలులేవు ఆనందానికి
రాముని మనసు కల్లోలం చాకలి నిందకి
నిండు చూలాలు లక్ష్మణుడితో నడిచే నట్టడవికి
సీత వాల్మీకి ముని ఆశ్రమంలో
ధరణిజ మరల రాముడు లేని వనవాసంలో
కుశలవుల జననంతో మురిసింది సీతమ్మతల్లి
ఆనందవర్షం కురిసి పులకించే పుడమితల్లి
సీతలేని రాముడు అయోధ్యలో
రాకుమారులు మునిఆశ్రమం లో
తండ్రికి,తనయులు దూరం
తుదకు తీరింది తల్లి దుఃఖ భారం
పరీక్షించిన పాడుకాలానికి
తల్లడిల్లిన సీతమ్మతల్లి
అమ్మ( భూమి) ఒడిని చేరింది మళ్లీ
తండ్రితనయులకు మిగిలింది నిట్టూర్పు
కాలానికి ఇది సీతా తీర్పు
రామాయణంలోఇది సీతాయణం.