మాస్టారూ నమస్కారం…ఈరోజు మిమ్మల్ని కలుసుకొని
మీతో మాట్లాడడం ఎంతో అదృష్టం. ఉత్తమ సాహిత్య దార్శనికులుగా తెలుగు సాహిత్యాన్ని తరతరాలకు పంచి
ఇచ్చిన మీ జీవిత విశేషాలను, మీ రచనా వైభవాన్ని మా పాఠకులకు తెలియ చేయాలనుకుంటున్నాము.
ముందుగా…
1. మీరు పుట్టి పెరిగిన ఊరు, విద్యాభ్యాసాల గురించి తెలపండి.
జ. మా ఊరు ప్రస్తుత వనపర్తి జిల్లాలోని శ్రీరంగాపురం గ్రామం. నేను జూన్ 5వ తేదీ 1941లో జన్మించాను. మా తండ్రి సూగూరు వాసుదేవరావు గారు, తల్లి రామచూడమ్మ గారు. హెచ్ ఎస్ సి వరకు నా విద్యాభ్యాసం వనపర్తి లోనే జరిగింది. నిజాం కళాశాలలో బీఏ పూర్తి చేశాను. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎమ్ ఏ, పి హెచ్ డి చేసి డాక్టరేట్ పొందాను. హైదరాబాద్ హిందీ ప్రచారసభ నుండి హిందీ భూషణ్, భారతీయ విద్యా భవన్ నుండి జర్నలిజంలో డిప్లొమా చేసాను. ఇక మాగ్రామం శ్రీరంగాపురం రంగనాయకస్వామి పుణ్యక్షేత్రానికి నెలవు. దీనిని 300 సంవత్సరాల కిందట వనపర్తి సంస్థాన రాజులు నిర్మించారు. అష్టభాషా కోవిదుడైన బహిరి గోపాలరావు గారు దీన్ని నిర్మించడం జరిగింది. ఆయన సంస్కృతంలో రంగనాయక స్వామి వారి గురించి నాటకాలు రాశారు.
2. మీ సాహిత్యాభిలాషకు పూర్వరంగం ఏమిటో వివరిస్తారా? మీ పూర్వీకుల్లో అలాంటి పాండిత్యం కలిగిన వారు ఎవరైనా ఉన్నారా?
జ. మా ఇంట్లో ఎవరికీ సాహిత్య వాసన లేదు. హఠాత్తుగా అది నాలో ప్రవేశించింది. ఆనాడు ఉమ్మడి పాలమూరు జిల్లాల సంస్థానాల్లో వనపర్తి, జటప్రోలు, ఆత్మకూరు, గద్వాల ఇవి సాహిత్య పోషణకు నెలవులుగా, కేంద్రాలుగా ఉండేవి. అట్లాంటి వాతావరణంలో జన్మించి ఉండడం చేత బహుశా నాలో కూడా సాహిత్యాభిలాష ఏర్పడి ఉండవచ్చునని భావిస్తున్నాను. నేను పుట్టిన కాల నేపథ్యం కూడా చూసుకుంటే రెండవ ప్రపంచ యుద్ధకాలంలో. మనకు స్వాతంత్య్రం రావడానికి ముందు పుట్టాను. ప్రైమరీ విద్యార్థిగా వున్నప్పుడు 6 ఏళ్ల వయస్సులో స్వతంత్రం వచ్చిన సందర్భంగా మేమంతా త్రివర్ణ పతాకం బ్యాడ్జీలు పెట్టుకొని ర్యాలీలో పాల్గొన్నాము. అట్లా జాతీయోద్యమ ప్రభావం, ప్రపంచ వాతావరణ ప్రభావం, మా వనపర్తి సాహిత్య ప్రభావం ఇవన్నీ ఒక రచయితగా ఎదగడానికి దోహదం చేశాయని నా అభిప్రాయం.
మరొకటి నా గ్రంథ పఠనం. చిన్నప్పడు స్కూల్లో ఉన్నప్పుడే చందమామ, బాల పత్రికలు చదివేవాడిని. ఆ తర్వాత ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ మొదలైన ఆనాటి పత్రికలన్నీ చదివేవాడిని. ఒక్కమాటలో చెప్పాలంటే పత్రికలు, సినిమాలు, పుస్తకాలు ఇవే నన్ను నడిపించాయి. వాటివల్ల ప్రభావితుడినై సాహిత్య రంగంలోకి దిగాను. సినిమాలు చూసే అలవాటు బాగా ఉండేది. గుణసుందరికథ, సంసారం, షావుకారు మొదలైన సినిమాలు చూడడమే కాక వాటి గురించి ఆంధ్రపత్రిక ,ఆంధ్రప్రభ లో వచ్చినటువంటి సమీక్షలు చదువుతున్నప్పుడు నాకు కూడా సమీక్షలు రాయాలని కుతూహలం కలిగింది. నా 14, 15 సంవత్సరాల వయసులో అప్పటి సినిమాలకు సమీక్షలు రాసి మద్రాసు పత్రికలకు పంపిస్తే అవన్నీ అచ్చు వేశాయి. అది నాకు ఎంతో గర్వకారణం అయిన విషయం. ఒక మారుమూల గ్రామం నుండి ఒక విద్యార్థి పంపించిన వ్యాసాలు మద్రాస్ లో ధనికొండ హనుమంతరావు, గొప్పవాళ్ళ పత్రికలు అయిన చిత్రసీమ, సినిమా రంగం నా సమీక్షలు అచ్చు వేశాయి. అట్లా నా సమీక్షలతో నా సాహిత్య రచన ప్రారంభమైందని చెప్పవచ్చు సినిమాను విమర్శనా దృష్టితో చూడడం మొదలుపెట్టి తర్వాత సాహిత్య రంగంలో కూడా ప్రవేశించాను.
3. విద్యార్థిగా దశలో మీకు ఆదర్శగురువులు ఎవరైనా ఉన్నారా? పుస్తకాలు ఏమైనా చదివారా?
జ. విద్యార్థి దశలో గురువులకంటే ముందు నేను చదివిన పుస్తకాల గురించి చెప్పాలి. వనపర్తి హైస్కూలు లో గొప్ప లైబ్రరీ ఉండేది. అక్కడ చదువుతున్నప్పుడే 15 ఏళ్ళ వయస్సులోనే విశ్వనాథ గారి ఏకవీర,బుచ్చిబాబు చివరకు మిగిలేది, గోపిచంద్ అసమర్థుని జీవయాత్ర మొదలగు ఎన్నో నవలలు, సాహిత్యమంతా చదివాను. చివరకు మిగిలేది, ఏకవీర నన్ను బాగా ప్రభావితం చేసాయి. వారే నా సాహిత్య గురువులు. ఆ తర్వాత నాకు పాఠశాలలో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ బోధించిన గురువులు. వాటివల్లే నేను పాస్ కాగలిగాను. మిగతా సైన్స్, జాగ్రఫీ సబ్జెక్టులలో నేను వీక్. వాటిల్లో అత్తెసరు మార్కులు వచ్చేవి (నవ్వుతూ). తెలుగు మీడియం విద్యార్థిని అయినా నిజాం కాలేజీలో ఇంగ్లీష్ మీడియం విద్యార్థిగా ఇంగ్లీష్ లో కూడా పియుసి లో అత్యధిక మార్కులు తెచ్చుకున్నాను. నిజాం కాలేజీ లో గొప్ప పండితులు, ప్రముఖ కవి, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డా. సి. నారాయణరెడ్డి గారు నాకు పియూసీ నుంచీ గురువు. నారాయణరెడ్డి గారు ” రామారావు నాకంటే పదేళ్ళు చిన్నవాడు. నా దగ్గరే చదువుకున్నాడు. నా వద్దనే పి హెచ్ డి చేసాడు. నావెంటే వస్తున్నాడు” అని చెబుతుండేవారు. అట్లాగే పల్లా దుర్గయ్య గారు. ఆయన రచించిన గంగిరెద్దు కావ్యం చదివాను. మంచికవి ఆయన. నారాయణరెడ్డి గారి నాగార్జున సాగరం, కర్పూర వసంతరాయలు మొదలగు కావ్యాలు చిన్నప్పుడే చదివా. ఆయన కవిత్వం కంఠోపాఠం నాకు. మొదటగా ఆయన పియుసి క్లాసులో మా గురువుగా పరిచయమైనప్పుడు ఆయన కావ్యం వినిపించడం మరపురాని సంఘటన. అప్పుడు చదివిన కావ్యం మళ్లీ ఎప్పుడూ ముట్టుకోలేదు అయినా ఇప్పటికీ మర్చిపోలేదు. “ఇక్ష్వాకు వంశ క్షితీంద్ర చంద్రుల కీర్తి కౌముదులు నల్గడల కలయ విరిసిన నాడు…..నేను జీవించి యున్నానంచు భావించి పలికింతు గేయ కావ్యమును హృదయము పెంచి” ( గేయ వాక్యాలను తలచుకుంటూ ) అట్లా వాళ్ళతో పరిచయం కలగడం నా అదృష్టం. నాల్గు సంవత్సరాలు వారి శిష్యుడిగా వర్ధిల్లాను. వారి ప్రోత్సాహంతో వ్యాసనరచన పోటీల్లో పాల్గొనేవాడిని. నిజాం కళాశాల పత్రికకు సంపాదకుడుగా వున్నాను. కాలేజీ దాటి యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు అదృష్టం కొద్దీ నారాయణరెడ్డి గారు బదిలీ అయి అక్కడికి వచ్చారు. అక్కడ కూడా ఆయనే నా గురువులు. పిహెచ్ డి అక్కడే పూర్తి చేశాను. యూనివర్సిటీలో చెప్పుకోవలసిన గురువులు ఖండవల్లి లక్ష్మీ రంజనం గారు, బి. రామరాజు గారు, చలమచర్ల రంగాచార్యులు గారు ( సంసృతం చెప్పేవారు ), పల్లా దుర్గయ్య గారు, నారాయణరెడ్డి గారు. అట్లా విశ్వవిద్యాలయంలో వీరందరి శిష్యరికంలో సాహిత్యాభిలాష పెంపొందించుకున్నాను. ఇట్లా సినిమా సమీక్షల నుండి సాహిత్యం మీదకు నా దృష్టి మళ్ళింది.
4. సాహిత్య విమర్శపై పి హెచ్ డి చేయాలనే సంకల్పానికి కారణం ఏమిటి? ఆ సిద్ధాంత గ్రంథం గురించి చెప్పండి.
జ. నిజాం కాలేజీ విద్యార్థిగా ఉన్నప్పుడే రాళ్లపల్లి అనంత కృష్ణశర్మ, విశ్వనాథ సత్యనారాయణ గార్ల విమర్శనావ్యాసాలు చదవడం వల్ల పియుసి లోనే సాహిత్య విమర్శ మీద పి హెచ్ డి చేయాలనే కోరిక కలిగింది. ఎమ్ ఏ పూర్తి కాగానే నా గురువులు లక్ష్మీ రంజనం గారు, దివాకర్ల వేంకటావధాని గారు, నారాయణ రెడ్డి గారు నన్ను ప్రోత్సహించారు. నారాయణరెడ్డి గారికి మొట్టమొదటి పి హెచ్ డి విద్యార్థిని నేనే. తెలుగులో సాహిత్య విమర్శ అనే అంశాన్ని పరిశోధనాంశంగా తీసుకొని పట్టా పొందాను. అది నా జీవితాన్ని గొప్ప మలుపు తిప్పింది. ఈ అంశంపై అంతకుముందు ఎవ్వరూ పరిశోధన చేయలేదు. అది చాలా కఠినమైన అంశం. మొత్తం సాహిత్యం తెలిసి ఉండాలి. అప్పుడే సాహిత్య విమర్శ చేయగలం. అందువల్ల ఏది మంచి, ఏది చెడు తెలుసుకోవడానికి తెలుగు సాహిత్యాన్ని అధ్యయనం చేసాను. విమర్శ గ్రంథాలను చదివాను. దాదాపు. అందరూ 4,5 సంవత్సరాల్లో పి హెచ్ డి. పూర్తి చేస్తారు. కానీ నేను ఎక్కువ సమయం తీసుకొని 7 ఏళ్ళు కష్టపడ్డాను. అన్ని లైబ్రరీలు తిరిగాను. వేటపాలెంలో మంచి లైబ్రరీ ఉంది. తర్వాత రాజమండ్రిలోని గౌతమి గ్రంధాలయం, మద్రాసు యూనివర్సిటీ లైబ్రరీ, తంజావూరు లైబ్రరీలకు వెళ్లి అన్ని పత్రికలు, విమర్శ గ్రంథాలు పరిశోధించి, ఒక ఉత్తమమైన సిద్ధాంత గ్రంథం తయారు చేసాను. దీని గురించి చెప్పుకోవాలి. ‘సాహిత్య విమర్శ గ్రంథం’ అచ్చయిన నా తొలి గ్రంథం. అటు తర్వాత 40 గ్రంథాలు రాశాను. నారాయణ రెడ్డి గారు 80 సంవత్సరాల జీవితంలో 80 గ్రంథాలు రాస్తే, ఆయన శిష్యునిగా కనీసం 40 గ్రంథాలైనా రాయాలనుకున్నా. నా సాహిత్య విమర్శ గ్రంథం అత్యంత జనాదరణ పొందింది. విశ్వవిద్యాలయాల్లో టెక్స్ట్ బుక్ గా,రెఫరెన్స్ బుక్ గా, పరిశోధకులకు మార్గదర్శకంగా ఇప్పటికి కూడా సాహిత్య విమర్శ అంటే గుర్తుకు వచ్చేది నా పుస్తకమే. అదే మొట్టమొదటి ఏకైక గ్రంథం. ఆతర్వాత ఎవరూ రాయలేదు. అసలు సాహిత్యం ఎట్లా ప్రారంభమైందో మొదలుకొని ఎవ్వరికీ తెలియని విమర్శకులను అందులో పరిచయం చేశాను. 19 వ శతాబ్దంలో తొలి విమర్శ గ్రంథం, తొలి నాటకం, తొలి నవలా విమర్శ ఇవి ఎవరికీ తెలియవు. వీటిని గురించి తెలిపి ఆధునిక విమర్శకులైన విశ్వనాథ, రాళ్లపల్లి వారి గురించి తెలిపాను. ఒక పి హెచ్ డి థీసిస్ అచ్చవడమే విశేషం. అటువంటిది ఆరు ముద్రణలు పొంది, ఏడవ ముద్రణకు సిద్ధంగా ఉంది. ఎప్పటికప్పుడు రివైజ్ చేస్తున్నాను. నా జీవిత సాఫల్య గ్రంథం ఏదైనా ఉందంటే “తెలుగులో సాహిత్య విమర్శ” అని చెప్పొచ్చు.
5. ప్రత్యేకంగా తెలంగాణ సాహితీ వైశిష్ట్యం, సాంస్కృతిక వైభవం గురించి రాయాలని ఎందుకు అనుకున్నారు?
జ. తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావానికి ముందు, అంతకు ముందు కోస్తాంధ్ర రచయితలు తెలుగు పట్ల నిరాదరణ భావంతో ఉన్నారు. తెలంగాణ వారికి తెలుగు రాదని ఇక్కడ తెలుగు సాహిత్యం లేదని వారి అభిప్రాయం. తెలంగాణాలో కవులు పూజ్యమన్న అపప్రథను తొలగించడానికి మా పాలమూరు జిల్లాకే చెందిన సురవరం ప్రతాపరెడ్డి గారు గోలకొండ కవుల సంచిక వెలువరించారు. తెలంగాణలో సంస్కృత కవులు, తెలుగు కవులు వందలాది మంది ఉన్నారు. వారి కవితలు సేకరించి మొట్టమొదటగా గోలకొండ కవుల సంచిక వేశారు. అందుచేత తెలంగాణ సాహిత్యాన్ని మొదటగా వెలుగులోకి తీసుకువచ్చింది ఆయనే. వారి ప్రభావం నామీద ఉంది. నేను వనపర్తి హైస్కూలులో విద్యార్థిగా వున్నప్పుడు వారు వనపర్తి నుండి ఎమ్ ఎల్ ఏ గా కాంటెస్ట్ చేశారు. అప్పుడే ఆయన పుస్తకాలు చదివాను. వారు తెలంగాణ సాహిత్యం మీద గొప్ప పరిశోధన చేశారు.11వ శతాబ్దికి చెందిన నన్నయ్యభట్టును ఆదికవిగా చెప్తున్నారు. కానీ ఆయనకు ముందు నూరు సంవత్సరాల క్రితమే ఇక్కడ కరీంనగర్ బొమ్మలగుట్ట శాసనంలో మల్లియరేచన అనే కవి తన ‘కవిజనాశ్రయం’ అనే తొలి తెలుగు గ్రంథం రాసారని ఉంది. నేను ఆ గ్రంథాన్ని పరిష్కరింపజేసి, దాని వ్యాఖ్యానం రాయించి, తొలి తెలుగు కావ్యం ఇదేనని నిరూపిస్తూ మొట్టమొదటి సారి అచ్చు వేయడం జరిగింది. అందువల్ల తెలంగాణా తొలి తెలుగు కావ్యాన్ని వెలుగులోకి తెచ్చిన అదృష్టం నాకు లభించింది. తెలంగాణలో గొప్ప పండితులు వున్నారు. వనపర్తి, గద్వాల మొదలగునవి సాహితీ కేంద్రాలని చెప్పాను కదా! వనపర్తి సంస్థానంలోనే కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి, కేశవపంతుల నరసింహ శాస్త్రి గారు (ఆల్ ఇండియా రేడియోలో సంస్కృతం అమరవాణి వినిపించేవారు) వంటి వారు సాహితీ సేవ చేశారు. అందుకే ఈ సాహిత్యాన్ని పరిచయం చేయాలనే ఉద్దేశ్యంతో పాలమూరు జిల్లా సాహిత్య చరిత్ర, పూర్వకవుల చరిత్రను రాశాను. నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అప్పుడు పాలమూరు ఎంపీగా ఉన్నారు. 2010 లో ఆయనకు పాలమూరు జిల్లా సాహిత్య చరిత్రను అంకితం చేసాను. ఆ తర్వాత పాలమూరు ఆధునిక కవులు సురవరం ప్రతాపరెడ్డి, బూర్గుల రామకృష్ణారావు, గడియారం రామకృష్ణ శర్మ ఇట్లా ఒక వందమంది కవులను పరిచయం చేస్తూ ఆధునిక కవుల చరిత్ర రాశాను. ఇంతటితో ఆగిపోలేదు నేను. తెలుగు సాహిత్య విమర్శ ఎంత అభిమానమో, తెలుగు సాహిత్య చరిత్ర కూడా నాకు అంతే అభిమానం.అవి రెండూ రెండు కళ్ళు.
సాహిత్య విమర్శ, సాహిత్య చరిత్ర, తెలంగాణ సాహిత్యాన్ని వెలికి తీసుకు రావాలని మొత్తం తెలంగాణ సాహిత్య చరిత్రను సేకరించి తెలంగాణ సాహిత్య వైశిష్ట్యం, తెలంగాణ సాహిత్య చరిత్ర అనే రెండు గ్రంథాలను రాయడం జరిగింది. తెలంగాణా సంస్కృతి కూడా చాలా గొప్పది. ఇక్కడి శిల్పాలు, కట్టడాలు, ఆలయాలు, సాంస్కృతిక వైభవం గురించి కూడా ఒక పుస్తకాన్ని రాశాను. అది’నవచేతన’ వాళ్ళు అచ్చువేశారు. అట్లా పాలమూరు జిల్లాతో మొదలుపెట్టి మొత్తం తెలంగాణా సాహిత్య, సంస్కృతుల గురించి విలువైన పుస్తకాలు రాశాను. ఇవాళ అందరూ తెలంగాణ చరిత్ర అన్నా, తెలుగు సాహిత్య చరిత్ర అన్నానా పుస్తకాలు చదవాలి. కష్టపడి చరిత్రను సేకరించి వాస్తవ దృష్టితో రాశాను. ప్రత్యేకంగా నేను ఏ వర్గ దృష్టితోనో, ఏ ప్రాంత దృష్టితోనో రాయలేదు. తెలంగాణా, ఆంధ్ర భేదాలు నాకు లేవు. నిజం చెప్పాలంటే నా అభిమాన కవి నన్నయ్య, అభిమాన రచయిత విశ్వనాథ సత్యనారాయణ. విశ్వనాథ వారే నన్ను ముందుకు నడిపిస్తున్నారు. నా లోపల ఆయనే ఉన్నారు. ఫ్రెంచ్, ఇంగ్లీష్ లాంటి ఎన్నో భాషల గొప్ప గొప్ప నవలలను చదివాను. ప్రపంచంలో అందరికన్నా గొప్ప రచయిత అని చెప్పుకోవాలంటే అది విశ్వనాథ గారేనని నా ఏకైక అభిప్రాయం. దానికి తిరుగు లేదు. విశ్వనాథ గారి అభిమాని అంటే నన్ను సాంప్రదాయ వాదిగా, ఛాందసుడుగా అనుకుంటారు. ఆయన సంప్రదాయవాదీ కాదు, ఛాందసుడు కాదు. స్త్రీలకు ఎంతో ప్రాధాన్యమిచ్చాడు. ఆయన చేపట్టని ప్రక్రియ లేదు. చరిత్రను రేడియో రూపకాలుగా రాశాడు.
అందుచేత తెలంగాణ సాహిత్యంతో పాటు తెలుగు సాహిత్య చరిత్ర కూడా రాయాలని నన్నయ్య దగ్గరనుండి ఈనాటి వరకు ఉన్న చరిత్రను ‘సమగ్ర తెలుగు సాహిత్య చరిత్ర’ 19 వ శతాబ్దం వరకు అని రాశాను. నా కృషి చెప్పాలంటే అటు సాహిత్య విమర్ధ చరిత్ర, ఇటు పాలమూరు జిల్లా సాహిత్య చరిత్ర, తెలంగాణా సాహిత్య చరిత్ర ఇవన్నీ నా చేతిమీదుగా వచ్చాయి. ఇప్పటికీ రాస్తునే ఉన్నా..
6. తెలుగు సాహిత్యంలో అప్పటికీ ఇప్పటికీ చోటు చేసుకున్న పరిణామాలు ఎటువంటివి?
జ. సాహిత్యం ప్రగతిశీలం. సమాజానికి అనుగుణంగా మారుతూ ఉంటుంది. ప్రాచీన కవులు గొప్పవాళ్ళు, వాళ్లకున్న పాండిత్యం ఆధునిక కవులకు లేదు అన్న దురభిప్రాయం చాలామందిలో ఉంది. కాలానుగుణంగా సాహిత్యం మారుతూ ఉంటుంది. మహాకవి శ్రీశ్రీ యే “నిన్నటి మహాకావ్యం 18 పర్వాలుంటే, ఈనాటి మహాకావ్యం 18పంక్తులే ఉండవచ్చు” అన్నారు. ప్రాచీన సాహిత్యంలో మహాభారతం ఎంత గొప్పదో ఆధునిక యుగంలో శ్రీశ్రీ మహాప్రస్థానం అంత గొప్పది. విశ్వనాథ గారి కిన్నెరసాని పాటలు, ఆంధ్రప్రశస్తి, ఆంధ్ర పౌరుషం మొదలగు కావ్యాలు గొప్ప కావ్యాలు. అయితే ఆధునిక యుగంలో కూడా పాండితీ ప్రభావంతో కూడుకున్న కవులు ఉన్నారని చెప్పడానికి విశ్వనాథ గారి రామాయణ కల్పవృక్షమే అని నా అభిప్రాయం. అందుచేత సాహిత్య కృషి ఆధునిక కాలంలో తక్కువ స్థాయిలో ఉందని వీలు లేదు కాలనుగుణంగా ప్రక్రియలు పెరుగుతున్నాయి ముఖ్యంగా ఒకనాడు నిశితమైన గ్రంథపఠనం అధికంగా ఉండేది. ఇవాళ సాంకేతికంగా పెరిగిన అభివృద్ధి వలన పుస్తక పఠనం తగ్గింది. అయినప్పటికీ మినీ కవితల రూపంలో నానీల రూపంలో సంక్షిప్త కథలు, కథానికలు, ఆధునిక ప్రక్రియలు విశిష్టమైన రీతిలో ఈనాడు సమాజానికి సందేశాత్మకంగా, ప్రబోధాత్మకంగా వస్తున్నాయి. ప్రాచీన సాహిత్యం గొప్పదని ఆధునిక సాహిత్యాన్ని నిరాదరణ చేయకూడదు. మొదటి నుండి నాది సమదృష్టి గురువు గారే చెప్పారు రామారావుది సమదర్శనమని. సమవీక్షణం, అన్వీక్షణం అని నా పుస్తకాల పేర్లే ఉంటాయి. సమదృష్టితో సాహిత్యాన్ని చూడవలసిన అవసరం ఉంది. ఈనాడు కొత్త కొత్త ప్రయోగాలు వస్తున్నాయి కొత్త కొత్త రచయిత్రులు అనేకమంది వస్తున్నారు. ప్రాచీన సాహిత్యంలో రచయిత్రులు తక్కువ. ఆధునిక కాలంలో నవలా రచయిత్రులు వచ్చారు. మాలతీ చందూర్, యద్ధనపూడి సులోచనారాణి, మాదిరెడ్డి సులోచన, పాకాల యశోదా రెడ్డి మొదలగువారు సాహిత్యాభివృద్ధికి దోహదం చేశారు. ఇంకా అనిశెట్టి రజిత, కొండపల్లి నీహారిణి ఇట్లా ఎంతోమంది రచయిత్రులు, కవయిత్రులు సాహిత్యం పై తమ వంతు కృషి చేస్తున్నారు అందువల్ల ఆధునిక సాహిత్యాన్ని కూడా చదివి అందులో ఉన్నటువంటి సామాజిక దృక్పథాన్ని, సామాజిక సందేశాన్ని అలవర్చుకోవడం ఎంతైనా అవసరం అని నేను భావిస్తున్నాను.
7. సాహిత్య విమర్శ సిద్ధాంతం గురించి నిర్వచనం చెప్పండి.
జ. విమర్శ అంటే కావ్య ప్రకాశానికి దోహదం చేసేది. విమర్శకుడు లేకపోతే కావ్య ప్రకాశం లేదు. కాళిదాసు రాసిన కావ్యాలు మల్లినాథ సూరి వ్యాఖ్యానాల ద్వారా వెలుగులోకి వచ్చాయి. భాసుడు సంస్కృతంలో గొప్ప నాటక కర్త. కాళిదాసు, భాసుడు, భవభూతి ప్రపంచ నాటక చరిత్రలో మహా రచయితలు. ఆధునిక కాలంలో కన్యాశుల్కం ఎంత గొప్ప నాటకమో, క్రీస్తుశకం ఒకటో శతాబ్దంలో శూద్రకుని మృచ్ఛకటికం గొప్ప సాంఘిక నాటకంగా పేరొందింది. వాటిని వెలుగులోకి తేవడానికి విమర్శకులే కారణం. కేరళలో గణపతి శాస్త్రి అనే పండితుడు శిథిలావస్థలో ఉన్న దాదాపు 30 భాస నాటకాలను సేకరించి ‘భాసనాటక చక్రం’ అనే పేరుతో 1915లో భాసుని మనకు పరిచయం చేశాడు. విమర్శ అనేది సాహిత్య ప్రకాశానికి, కావ్య ప్రకాశానికి దోహదం చేసేది. సూక్ష్మంగా చెప్పాలంటే “కప్పి చెప్పేది కవిత్వం విప్పి చెప్పేది విమర్శ” కావ్యం లోకాన్ని ప్రతిబింబిస్తుంది లోక జీవితాన్ని చిత్రిస్తుంది. లోక జీవితాన్ని కావ్యం ఎట్లా చిత్రించింది? దానిలోని బాగోగులు మంచి చెడులు ఏమిటి? అనేది విమర్శ చెబుతుంది. అంటే ఒక విధంగా కవి కన్నా ఒక అధిష్ఠానం సంపాదించి, ఆయన ఒక వ్యాసుని లాగా సమవీక్షణంతో చూడాలి. ఏ సాహిత్యం గొప్పది? ఎందులో మంచి లక్షణాలు ఉన్నాయి? కేవలం రంధ్రాన్వేషణ చేస్తూ తప్పులు వెతకడం కాకుండా సమదృష్టితో చేయడం సాహిత్య విమర్శ యొక్క అసలైన తత్వం. అందుచేత నేను ఆ దృష్టితోనే కొనసాగిస్తూ ఉన్నాను.
8. సంపాదకులుగా మీ తొలి పత్రిక లేదా పుస్తకం ఏది?
జ.చాలా మంచి ప్రశ్న, మంచి విషయం అడిగారు. నా సంపాదకత్వంలో ఎన్నో పుస్తకాలు వచ్చాయి. మొట్ట మొదటిసారిగా ఎం.ఏ పాస్ కాగానే ‘జ్యోతిర్మయి’ అనే సంస్థను స్థాపించి పాలమూరు జిల్లా కవుల కవితలు సేకరించి ‘జ్యోతిర్మయి’ అనే పేరుతో 1966లోనే (57 సం.కిందటే బహుశా మొట్టమొదటి జిల్లా కవుల సంకలనం అదే అని చెప్పవచ్చు ) నా సంపాదకత్వంలో వెలువడిన మొట్టమొదటి పుస్తకం. దానికి మా గురువుగారైన డా. శ్రీ నారాయణ రెడ్డి గారు పీఠిక రాశారు. “భారతికి పసిడి కింకిణులు కట్టిన 33 కవుల లలిత భావాంశ సంపుటి ఇది”అని ఆయన ప్రశంసించారు. ఇందులో పాలమూరు జిల్లాలోని దిగ్గజాలు సురవరం ప్రతాపరెడ్డి, బూర్గుల రామకృష్ణారావు, కేశవపంతుల నరసింహ శాస్త్రి, కప్పగంతుల లక్ష్మణ శాస్త్రితో పాటు ఆధునికులైన ముకురాల రామారెడ్డి మొదలగు 33 కవుల గురించి ఈ పుస్తకంలో వివరించాను. కవితా సంకలనం తర్వాత కథా సంకలనం కూడా నా సంపాదకత్వంలో వెలుడింది. జ్యోతిర్మయిలో పాలమూరు రచయితలు ఇందులో ప్రముఖ రచయిత్రి పోల్కంపల్లి శాంతాదేవి కథ మరికొన్ని ఇతర కథలు చేర్చి సమర్పణ అనే పేరుతో కథా సంకలనం కూడా చేశాను ఆ తర్వాత ఎంతోమంది మహానుభావులు, రచయితల గురించి గడియారం రామకృష్ణ శర్మ గారి షష్ఠిపూర్తి సంచిక,బూర్గుల రామకృష్ణారావు గారి సంచిక, సురవరం ప్రతాపరెడ్డి గారి వ్యాసాలు వీటన్నింటికి నేను సంపాదకత్వం వహించాను సంపాదకత్వ లక్షణం నాలో మొదటి నుండి ఉన్నది. నిజాం కాలేజీలో ఉన్నప్పుడు కాలేజీ మ్యాగజైన్ కి ఎడిటర్ గా ఉన్నాను కాబట్టి ఒక పత్రిక ఎట్లా నడపాలి, ఎట్లా అచ్చువేయాలనేవి పూర్తిగా అవగతమైనవి. రచనలు సేకరించడం, వాటిని ఎడిట్ చేయడం, అచ్చు వేయడం, కవర్ పేజీని అందంగా తీర్చిదిద్దడం.. ఇట్లా మూడు సంవత్సరాలు నిజాం కళాశాల విద్యార్థి పేరుతో మంచి సంచికలు తీసుకువచ్చాను. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖ అధిపతిగా ఉన్నప్పుడు’ వివేచన ‘ అనే తెలుగు శాఖ పత్రిక వచ్చేది. దానికి కూడా సంపాదకత్వం వహించాను. తర్వాత ఈనాటి ఆధునిక కవులు రావుకంటి వసునందన్ వంటి వారి గ్రంథాలకు కూడా సంపాదకత్వం వహించాను. ముఖ్యంగా ఇంతకుముందే చెప్పినట్టు మొట్టమొదటి తెలంగాణ కవి అయిన మల్లియరేచన ‘కవిజనాశ్రయా’నికి సంపాదకుడిని. కొంతమంది కవులు, రచయితలు అపరిచితులుగా అజ్ఞాతంగా ఉన్నారు. బూర్గుల రామకృష్ణారావు ఎంత గొప్ప కవి, రచయితో ఆయన కుమారుడైన రంగనాథరావు కూడా గొప్ప కవి, రచయిత. ఆయనను గురించి ఎవరికీ తెలియదు. ఆయన కథలు, కవితలు, రేడియో ప్రసంగాలు, ఆనాటి వ్యాసాలు అన్నీ సేకరించి రంగనాథరావు సాహిత్యం మూడు సంపుటాలుగా వేశాను. సంపాదకుడిగా నాకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాను. నా సంపాదకత్వంలో దాదాపు పాతిక గ్రంథాలైనా వెలువడి ఉంటాయి మొదటి నుండీ సాహిత్యమే నా జీవితం. పుస్తకమే నన్ను నడిపించింది.
9.సంపాదకులుగా పొందిన మీ అనుభవాలతో అప్పటికి ఇప్పటికీ సంపాదకత్వంలో వచ్చిన మార్పులను గురించి చెప్పండి.
జ. పూర్వ పరిశోధనలు చేశారు వేటూరి ప్రభాకరశాస్త్రి గారు, మానవల్లి రామకృష్ణ కవి గారు. రామకృష్ణ కవిగారు మా వనపర్తి సంస్థానంలోనే రాజావారికి కార్యదర్శిగా ఉండేవారు. అక్కడ ఉన్నప్పుడే నన్నె చోడుని కుమార సంభవాన్ని మొట్టమొదటిసారి ముద్రించి వెలుగులోకి తెచ్చాడు. నన్నయ ఆదికవి కాదని అంతకుముందే నన్నె చోడుడు ఉన్నాడని వాదించాడు. కానీ దానిని ఎవరూ ఒప్పుకోలేదు. వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు, మానవల్లి రామకృష్ణ గారు, మల్లంపల్లి సోమశేఖర శర్మగారు వీళ్లు సంపాదకత్వంలో చాలా కృషి చేసి, పరిష్కరణలు చేసి,పాండిత్యంలో కృషి చేసే గ్రంథాలు తీసుకువచ్చారు. ఈనాటి సంపాదకుల్లో పరిశోధనా కృషి కొరవడిందని చెప్పొచ్చు. ఈనాటి సంపాదకత్వంలో వస్తున్న గ్రంథాల్లో ఏదో కొరత కనిపిస్తోంది. వారు సమగ్రంగా పరిశీలించి పరిష్కరించడం లేదు. అందుకే కొంత జాగ్రత్త వహించడం అవసరం. తెలంగాణ సాహిత్య అకాడమీ, తెలుగు అకాడమీ తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత తెలంగాణ సాహిత్యం గురించి అనేక పుస్తకాల ప్రచురించారు. కానీ వాటిల్లో అనేక లోపాలు, దోషాలు ఉన్నాయి. వాటిని పరిహరించుకోవలసిన అవసరం ఉంది. మనం మన చరిత్రను చెప్తున్నప్పుడు తప్పుదోవ పట్టించకుండా వాస్తవ చరిత్రను తెలిపాలి. కవిజనాశ్రయం వచ్చిన తర్వాత కూడా వేములవాడ భీమకవి తొలి తెలుగుకవి అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అవి సరైనవి కావు. అందుకే సంపాదకత్వంలో మంచి చెడులను చూడవలసిన ఆవశ్యకత ఉంది ఇది ప్రస్తుతం కొరతగానే ఉంది.
10. రచయితగా, విమర్శకులుగా, ఎన్నెన్నో పుస్తకాలు రాశారు. ఇంకా ఏదైనా రాయాల్సింది మిగిలిపోయిందని మీరు భావిస్తున్నారా?
జ. ఇప్పటికీ నా సాహితీ రచన ఆగిపోలేదు. 80కి పై బడిన వయస్సులో ఇంకా చేయవలసిన కృషి చాలా ఉంది అని అనుకుంటున్నాను. ఇంకా ఎంతో చరిత్రను వెలికి తీసుకొని రావాలని నా కోరిక. ప్రస్తుతం తెలుగు సమగ్ర సాహిత్య నిర్మాణంలో మునిగి ఉన్నాను. ఇంతకు ముందు తెలుగు సాహిత్య చరిత్రను 19వ శతాబ్దం వరకు ఉన్న కవుల సాహిత్యాన్ని తీసుకొని రావడం జరిగింది. 19వ శతాబ్దంలో జన్మించి 20వ శతాబ్దంలో సాహిత్య కృషి చేసిన కవులున్నారు. విశ్వనాథ సత్యనారాయణ, కృష్ణశాస్త్రి, బసవరాజు అప్పారావు, నండూరి సుబ్బారావు, నాయని సుబ్బారావు వంటి భావ కవులందరూ 19వ శతాబ్ది చివరి పుట్టారు. జాషువా, విశ్వనాథ మొదలైన వారు సాహిత్య సేవ చేశారు. వీరందరి కృషిని వెలుగులోకి తీసుకురావాలి. శ్రీశ్రీ, ఆరుద్ర తర్వాతి తరం వారు. వీళ్ళ సాహిత్యమంతా వెలికి తీయాలి. పిలకా గణపతి శాస్త్రి, రావిశాస్త్రి, ఆత్రేయ లాంటి వారి కవిత్వమంతా రికార్డు చేయాలి.
అందరి జీవిత విశేషాలను సమగ్రంగా “శతజయంతి సాహితీమూర్తులు” అని రెండు సంపుటాలు రాశాను. 19, 20శతాబ్దాలలో ఉన్న ఉత్తరాంధ్ర, తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమ ఇలా అన్ని ప్రాంతాల వారిని ఇందులో చేర్చాను. ఇక్కడ ప్రాంతీయ దృష్టి కూడా చాలా అవసరం. ఎందుకంటే ఒక్కొక్క ప్రాంతంలో సాహిత్యం, పరిస్థితులు వేరు. ప్రాంతీయ అస్తిత్వాన్ని నిలుపుకోవాలి. తెలంగాణాకు ఎంత అస్థిత్వముందో మిగిలిన ప్రాంతాలకు అంతే ఉంటుంది కదా…ఉత్తరాంధ్ర తెర మరుగున పడింది. ఆంధ్ర సాహిత్య చరిత్ర అంటే ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర రచయితలను కలిపి రాశారు. ఉత్తరాంధ్ర రచయితలు తాపీ ధర్మారావు, గిడుగు రామమూర్తి, గిడుగు సీతాపతి, గురజాడ అప్పారావు..కందుకూరి, విశ్వనాథ, జాషువా కోస్తాంధ్ర రచయితలు. వీటిపైన కూడా ప్రత్యేకమైన అధ్యయనం చేయవలసి ఉంటుంది. పక్షపాతం లేకుండా 19, 20 శతాబ్దాలలో జన్మించిన అన్ని ప్రాంతాల వారిని పరిగణనలోకి తీసుకున్నా. అంతటితో ఆగకుండా దక్షిణదేశం కూడా..ఎందుకంటే తంజావూరు, మైసూరులలో తెలుగు కవులు ఉన్నారు. తెలుగు సాహిత్యమంతా మద్రాసులోనే పుట్టింది. కాశీనాథుని నాగేశ్వరరావు అక్కడి వారే. శ్రీశ్రీ, ఆచార్య ఆత్రేయ, ఆరుద్ర సినిమా పాటలన్నీ అక్కడ వుండే రాశారు. అందువల్ల దక్షిణ దేశ చరిత్రపై కూడా దృష్టి పెట్టాను. ఈ దృష్టిలో ఎవ్వరూ సాహిత్య చరిత్ర రాయలేదు. ప్రాంతాల వారీగా, కాలక్రమాన్ని పాటిస్తూ ఉ:-నన్నయ్య 11 వ శతాబ్ది అయితే 16వ శతాబ్దం కృష్ణదేవరాయలు, తర్వాత రఘునాథరాయలు ఇలా శతాబ్దాల వారీగా తీసుకున్నా. కాలక్రమమనేది సాహిత్య పరిణామాన్ని చెబుతుంది. ఈ రకంగా సాహిత్యచరిత్ర నిర్మాణం జరగాలన్న ఉద్దేశ్యంతో ఒక ఉద్యమంగా ఈనాటికీ నేను రచన కొనసాగిస్తూ ఉన్నాను. ఇంకా చేయవలసింది ఎంతో ఉంది. సాహిత్యానికీ, రచనకు విశ్రాంతి లేదన్న ఉద్దేశ్యంతో (నవ్వుతూ) ఈ విశ్రాంత జీవితాన్ని యథాశక్తి సాహితీ సేవకు వినియోగిస్తున్నాను.
11. ప్రస్తుతం ఎంతోమంది రచనలు చేయడంలో ఆసక్తి చూపిస్తున్నారు. అలాంటి వారు మంచి రచయితలుగా ఎదగడానికి మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు?
జ. ఇప్పుడిప్పుడు నానీలు, మొగ్గలు అని కొత్త కొత్త ప్రయోగాలు వస్తున్నాయి కవితలు కథలు కూడా మైనారిటీ దృక్పథంతో వస్తున్నాయి. స్త్రీవాద కథలు దళితవాద కథలు కూడా వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఈనాటి సమాజాన్ని చిత్రించడానికి, సందేశాన్ని అందించడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ చిత్రణలో ఒక సమగ్రమైన అవగాహన ఉండాలి. ప్రాచీన సాహిత్యాన్ని మనం చదివినప్పుడు మనకు భాష మీద పట్టు ఏర్పడుతుంది. సాహిత్య రచన మీద ఒక అవినివేశం కలుగుతుంది. ఒక దృష్టి ఏర్పడుతుంది. ప్రాచీన సాహిత్యాన్ని చదవకుండా ఆధునిక సాహిత్యంలోకి వెళితే అది పరిపూర్ణమైన సాహిత్యం కాదని నా అభిప్రాయం. అందుచేత ప్రాచీన, ఆధునిక సాహిత్యాలను బాగా అధ్యయనం చేయాలి. అలా చేస్తేనే ఈనాటి ఆధునిక సమకాలీన రచయితలు మంచి రచనలు చేయగలుగుతారు. వారి స్థాయిని అందుకోగలుగుతారు.ఆ దృష్టితో రచనలు చేయాలని నా అభిప్రాయం.
12. మీ సతీమణి స్వయంప్రభ గారు కూడా మంచి రచయిత్రి, కవయిత్రి…ఆమెకు అది ఎలా పట్టువడింది?
జ. నిజమే. ఆమెలో కూడా సాహిత్య వాసన కొంత ఉంది. ఆమె రెడ్డి మహిళా కళాశాలలో చదువుకుంది. పాఠశాల స్థాయిలో మంచి రచయితలు ఆమె గురువులు. సి. ఆనందారామం గారు ఆమెకు హైస్కూలులో టీచరు. ఆ పాఠాలను ఇప్పటికీ గుర్తు చేసుకుంటుంది. నాలాగే ఆమె సినారె గారి విద్యార్థి. ఆ ప్రభావం వలన, వివాహం తర్వాత నా ప్రభావం వలన తెలుగు ఎమ్ ఏ కూడా చేయడం జరిగింది. నేను ఏవిధంగా సాహిత్య సంస్థల పట్ల అభిరుచి ఏర్పరచుకున్నానో ఆమె కూడా నాలాగే ఆ అభినివేశాన్ని కలిగివుండేది. ‘తరంగిణి’ అనే ఒక సాహిత్య సంస్థను ఆరంభించి నేను ఏవిధంగా పాలమూరు జిల్లా కవుల సంకలనం వేశానో అలాగే కవయిత్రుల కవితలను ఆమె సేకరించి ‘తరుణి’ పేరుతో వెలువరించింది. స్వయంగా ఆమె రాసిన కవితలు ‘తరంగిణి’ అనే కవితా సంకలనంగా వచ్చింది. ముఖ్యంగా ఆమెకు ఆధ్యాత్మిక దృష్టి ఎక్కువ. మా కుటుంబమంతా పుట్టపర్తి సాయిబాబా భక్తులం. ఆమె సత్యసాయి బాల వికాస్ విద్యార్థులకు నీతి పాఠాలు చెప్పేది. స్వామివారి ఆధ్యాత్మిక రచనల ప్రభావంతో మంచి సాహితీ వ్యాసాలు రాసింది. అవి వ్యాస ప్రసూనాలు పేరుతో అచ్చు అయినాయి. ఇప్పటికీ నాతో పాటు ఆమె కూడా ఉడుతా భక్తిగా సాహిత్య కృషి చేస్తున్నది.
అడిగిన వెంటనే కాదనకుండా మీ ఇంతటి సమయాన్ని మాకోసం సద్వినియోగపరిచినందుకు మా తరఫున, మా మయూఖ పాఠకుల తరఫున మరీ మరీ హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మీరు కొనసాగిస్తున్న సాహిత్య కృషికి ఆ భగవంతుడు పరిపూర్ణమైన ఆయురారోగ్యాలను అనుగ్రహించాలనిప్రార్థిస్తున్నాము.
ఎస్వీ రామారావు గారి రచనలు సాహిత్య విమర్శలు: 1. తెలుగులో సాహిత్య విమర్శ (సిద్ధాంత గ్రంథం). 2. శతాబ్ది కవిత, 3. విశ్వనాథ దర్శనం, 4. విమర్శక వతంసులు 5. The Evolution of Telugu Literary Criticism సాహిత్య చరిత్రలు: 1. పాలమూరు సాహితీ వైభవం, 2. పాలమూరు ఆధునిక యుగకవుల చరిత్ర, 3. తెలుగు సాహిత్య చరిత్ర, 4. తెలంగాణ సాహిత్య వైశిష్ట్యం, 5. తెలంగాణ ప్రాచీన సాహిత్య కరదీపిక, 6. మా ఊరి కవులు 7. తెలంగాణ సాహిత్యచరిత్ర, 8. వనపర్తి జిల్లా సాహిత్యచరిత్ర, 9. సమగ్ర తెలుగు సాహిత్యచరిత్ర, 10. 20వ శతాబ్ది సాహిత్య చరిత్ర, 11. స్వాతంత్ర్యోద్యమంలో తెలుగు రచయితలు, , 12. శతజయంతి సాహితీమూర్తులు 1,2, 13. సాహితీ కదంబం, సాంస్కృతిక చరిత్రలు: 1. శ్రీ సత్యసాయి అవతారం – దశావతార గాథలు, 2. పరిశోధనోత్సవం, 3. నూటపది వసంతాల శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం, 4. తెలుగు భాష ప్రాచీనత-విశిష్టత, 5. తెలంగాణ సాంస్కృతిక వైభవం, 6. తెలంగాణ సినిమా బంగారు కాంతులు ఇవేకాక.. వ్యాస సంపుటాలు 4, పీఠికలు 2, వ్యాఖ్యానాలు 3, మోనోగ్రాఫులు 4, అనువాదాలు 3, పురస్కృతులు 4