అన్నమయ్య కేవలం వాగ్గేయకారుడు మాత్రమే కాదు. పదానికి లక్షణాలను వివరిస్తూ గ్రంథాలు రచించాడు. వాటికి లక్ష్యాలుగా వందలాది పదాలను రచించాడు. తాను రచించిన పదాలను భక్తి, శృంగార రచనలుగా ఆయన విభజించినప్పటికి పద్యం అంటే ఆ కాలానికి భక్తి రచన అన్న అర్థంలోనే వ్యవహరింపబడింది. శృంగాలు పదాలు క్షేత్రయ్య నాటికి వాడుకలోకి వచ్చాయి. అవే పదాలు త్యాగరాజ స్వామి కాలం నాటికి ఆధ్యాత్మిక కీర్తనలుగా పేరు పొందాయి. ఈ వివరాలు ముందు వ్యాసాలలో తెలుసుకుందాం. పదాల అనంత స్వరూపాన్ని అన్నమయ్య అతి మనోహరంగా ప్రదర్శించారు. వైష్ణవ భక్తిని, సంగీతాన్ని, సాహిత్యాన్ని కలిపి త్రివేణి సంగమం చేశారు. తర్వాత ఈ సంప్రదాయాన్ని వీరి వంశస్థులు అంటే అన్నమయ్య పత్ని తిమ్మక్కతో బాటు వారి కుమారులు పెద తిరుమలాచార్యులు, మనుమడు చిన తిరుమలాచార్యులు కొనసాగించారు. అన్నమయ్య కేవలం తన కుటుంబంలోని వారిని మాత్రమే ప్రభావితం చేయలేదు, తర్వాతి కాలంలో వచ్చిన ప్రతీ వాగ్గేయకారుడు వీరి ప్రభావానికి లోనయినవారే. అందుకే పదం అన్నా, సంకీర్తనం అన్నా అన్నమయ్య మొదటగా గుర్తుకొస్తారు. 12 సంవత్సరాల వయస్సులో శ్రీ వేంకటేశ్ర స్వామిని ప్రత్యక్షం చేసుకున్న వీరు తన జీవిత కాలంలో 32 వేల సంకీర్తనలను రచించారు. ప్రస్తతం అన్నీ కాకపోయినా రాగి ఫలాకాల మీద దొరికిన సంకీర్తనల నాధారంగా పరిశీలించినట్లయితే అన్నమయ్య కవితా వైభవం అర్థమవుతుంది. అన్నమయ్య రచనలలో నవవిధ భక్తి మార్గాలు కనిపిస్తాయి.
తను హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనా
ర్ఛనముల్ సేవయు నాత్మలో నెరుకయన్ సంకీర్తనల్ చింతనం
బను నీ తొమ్మీది భక్తి మార్గముల సర్వాట్మున్ హరిన్ నమ్మిస
జ్జనుడై యుండుట భద్రమంచు దలతున్….. అన్న ప్రహ్లాదుని ఈ భక్తి ప్రకటనలో మనకు ఈ తొమ్మది భక్తి మార్గాలు తెలుస్తున్నాయి. భక్తికి ఇంతకంటే గొప్ప నిర్వచనం ఇంకొకటి లేదు. అన్నమయ్య రచనలలో ఈ భావాలన్నీ గోచరమవుతాయి. ఉదాహరణకి చూడండి,
సఖ్యము :
పల్లవి : కూరిమి గలిగితే చాలు కోపించినా మేలువో
అరయ నో రమణుడ అంతాను మేలువో
చరణం : మనసున నీవు నన్ను మరవకున్న జాలు
యేనసి నీ వేడ నున్నా వియ్యకలే పో
ననువు వలపు నీవు నాపై జల్లితే చాలు
వెనుక నీవేమన్నా వేడుకనే పో.
శ్రవణం :
పల్లవి : ఇందు నుండి మీ కెడ లేదు
సందడి చేయక చనరో మీరు
చరణం : నాలుక శ్రీహరి నామంబున్నది
తూలుచు బారరో దురితములు
చాలి భుజంబున చ్రకంబున
తారిమి భవబంధములటు దలవో,
దాసత్వము :
పల్లవి : పాప పుణ్యముల పక్వమీదెరుగను
నా పాలిటి హరి నమో నమో
చరణం : మానస వాచక కర్మంబుల
తానకముగా నీ దాసుడను
పూని త్రీ సంధ్యల భోగ భాగ్యముల
నానా గతులను నమోనమో
వందనం :
పల్లవి : నీ యంత వాడనా నేను నేరము లేమెంచేవు
యీ యెడ నిరుహేతుక కృప జూడు నన్నును.
చరణం : నిరతి నిన్నెరుగను నీవు నన్నెరుగుదువు
ధర యాచకుడ నేను దాతవు నీవు
వరస యాచకుడ నేను వైకుంట పాటివి నీవు
నరుడ నేను నీవు నారాయణుడవు
అర్చనం :
పల్లవి : భావించి తెలుసుకుంటే భాగ్య పలము
ఆవలీవలి ఫలములంగజ జనకుడే
చరణం : దానములలో ఫలము తపములలో ఫలము
మోసములలో ఫలము ముకుందుడే
జ్ఞానములలో ఫలము జపములలో ఫలము
ఆత్మలో ఎరుక :
పల్లవి : హరి శరణాగతి యాతు మది
సరుస నిదియే పో సతమయ్యేడది.
చరణం : దిన దిన రుచులివి దేహముది
చెనకేటీ కోరిక చిత్తముది
యెనసేటి కాంతలు యింద్రీయంబులు లవి
పనివి యాత్మ కవి పని లేదయ్యా.
సంకీర్తన : వినుడిదే రఘుపతి విజయములు
పనుపడి రాక్షస బాధలుడిగేను.
చరణం : కుల గిరు లదిరెను కుంభిని వడకెను
ఇల రాముడు రథ మెక్కినను
కలగె వారధులు కంపించె జగములు
బలు విలునమ్ములు పట్టినను.
చింతనం :
పల్లవి : వెరపులు నొరవులు వృథా వృథా
ధరపై మరి యంతయును వృథా,
చరణం : తడయక చేసిన దానంబులు వృథా
యెడ యెడ నెరిగిన యెరుక వృథా
ఒడలిలోన హరి నొనరగ మతిలో
దడవని జీవమ తనకు వృథా.
అన్నమయ్య పదాలు లేదా సంకీర్తనలలోని సంగీతం మనకు పూర్తిగా లభించలేదు. వేటూరి ప్రభాకరశాస్త్రిగారి అపార కృషివలన సంగీతబద్ధమైన సాహిత్యంతో కూడిన రాగిరేకులు లభించినప్పటికీ వాటి గురించి సంపూర్ణమైన సమాచారం ఇంకా వెలుగులోకి రాలేదు. అంతవరకు అన్నమయ్య సంగీతపు పోకడల గురించి ఒక అభిప్రాయానికి రాలేము. సాహిత్యానికి సంబంధించినంత వరకు అన్నమయ్య రచనలు ఎంతో లలితమైనవి, సుకుమారమైనవి. అందరికీ అందుబాటులో ఉన్న ప్రజాభాష ఇది. సామాన్యమైన భాషను ఉపయోగించినప్పటికీ ఈ కీర్తనలు అన్నమయ్యను పదకవితా పితామహునిగా చేసినాయి. వచ్చే వ్యాసంలో ఇంకొక వాగ్గేయకారుని గురించి తెలుసుకుందాం.
డా. కృష్ణ కుమారి 9885451014