Home వ్యాసాలు స్వామి దయానంద సరస్వతి

స్వామి దయానంద సరస్వతి

వర్ధంతి(1833-10-30)సందర్భంగా ఒక స్మరణ:–

భారతదేశం తరతరాలుగా వేదాలు, పురాణాలు ఇతిహాసాలకు పెట్టింది పేరు. అలా వాటిని నిక్షిప్తం చేసిన పురాణ పురుషులు, ఋషి పుంగవులు కారణజన్ములు ఎందరో మహానుభావులు.. జీవితాన్ని త్యాగం చేసి చతుర్ముఖ బ్రహ్మ నాలుగు ముఖాల నుండి వెలువడ్డ నాలుగు వేదాలు కంఠస్తం చేసి తరవాత తరాలకు అందించారు.
వాటిన చదివి, అర్థం చేసుకొని మరొక తరానికి కాస్త సులభతరం చేసి, వేదంలో అన్నీ ఉన్నాయి, అని హేళన చేసే వారి నోళ్లు మూయిచడానికి… ఔను!! వేదంలో అన్నీ ఉన్నాయని తెలియజేసిన మహామహులు ఎందరెందరో…
వారిలో మూల్ చంద్ లేదా మూల శంకర అనే జన్మనామధేయులు, వీరి వాఙ్మయ సేవకు, వేద సారాన్ని గ్రంథాల ద్వారా అందించినందుకు స్వామి బిరుదు పొందిన పరమ పూజ్యులు స్వామిదయానంద సరస్వతి గారు.


దయానంద అని ఎందుకు పిలుస్తారు? అంటే చిన్నప్పుడు ఒక గురువు దగ్గర శిక్షణ పొందేవారు. ఆయన పేరు విరజానందుడు. ఈయన వ్యక్తిత్వాన్ని చూసి దయానందుడు అని వారు పేరు పెట్టారు. అలా పూర్తి పేరు స్వామి దయానంద సరస్వతిగా అందరికీ తెలిసిన వారు.
వీరు 1824 – 2-12 న గుజరాత్ లోని కతియవాడ్ లోని టంకర అనే గ్రామంలో జన్మించారు
దయానంద సరస్వతి సత్యార్థ ప్రకాశిక అనే గ్రంథాన్ని హిందీలోనూ,వేద భాష్య అనే గ్రంధాన్ని సంస్కృతంలోనూ, వేద భాష్య భూమిక హిందీ, మరియు సంస్కృతంలోనూ రాసారు. లఘు గ్రంథాలు వ్యవహార భానువు, స్వమంత వ్యామంతవ్య ప్రకాశములు.
శ్రీ దయానంద సరస్వతి గారు 1875 ఏప్రిల్ 10 బొంబాయిలో ఆర్య సమాజం స్థాపన చేసి, తర్వాత లాహోరు కు మార్చారు.
ఆర్య సమాజాన్ని ఎందుకు స్థాపించారు అంటే ఆయనకు చిన్నప్పటినుండి ఆధ్యాత్మిక మార్గంలోనే నడిచేవారు కనుక సత్యాన్వేషణలో భాగంగా ఆయన వివాహం కూడా వద్దనుకొని 1820లో ఒక శివరాత్రి రోజు ఈశ్వరాలయానికి వెళ్లి జాగారం చేస్తూ శివలింగం వైపే చూస్తూ కూర్చొని ఉండగా, ఒక ఎలుక వచ్చి శివలింగం మీద పరుగులు పెడుతుంది… అక్కడి పూలను కెలకడం, ప్రసాదం తింటూ గందరగోళం చేస్తుంటే….. శివుడే ఏమీ చేయడం లేదు ఏమిటి? అని అనుకుంటూ అసలు దేవుడు ఉన్నాడా? లేడా? అనే ఆలోచన ఆయనలో కలుగుతుంది. దాంతో తండ్రిని అడుగుతాడు “నాన్నా! ఈ ఎలుకను శివుడు ఎందుకు శిక్షించడం లేదు? అని అడిగితే “నీకు అన్ని సందేహాలే మెదలకుండా కూర్చో”! అని కసురుకుంటాడు తండ్రి.
అప్పటి నుండి దేవుడు ఉన్నాడా లేడా అనే అన్వేషణలోనే ఏది సత్యం అని తెలుసుకోవాలనుకుంటాడు.ఇంతలో అతని తల్లి మరణిస్తుంది. అయితే పుట్టిన ప్రతి మనిషి చనిపోవాల్సిందేనా? అని మరొక సందేహం కలుగుతుంది ఆయనకు.. చావును జయించలేమా? అని ఆలోచనలు సాగుతున్నప్పుడే సమాజంలో ధర్మం అనే ముసుగులో ఎన్నో అన్యాయాలు ఆయన దృష్టికి వస్తాయి.
అన్నిటికీ సత్యాన్వేషణే సమాధానమిస్తుందని అనుకొని, అందులో భాగంగా ఇల్లు వదిలి యావత్ భారత దేశ పర్యటన చేయాలనుకుని బయలుదేరుతాడు. ఎన్నో పుణ్య క్షేత్రాలు దర్శించుకొని, ఎందరో ఋషులను కలిసి చాలా విషయాలు తెలుసుకుంటాడు. అలా శృంగేరి పీఠానికి వచ్చినప్పుడు పరమానంద సరస్వతి దగ్గర వేదాల గురించి తెలుసుకొని, మన హిందూ మతం గొప్పదనాన్ని తెలుసుకొని ఇంకా జ్ఞానాన్ని సంపాదించాలనుకుని మధురలోని విరజానంద స్వామిని కలిసిన తర్వాత పూర్తిగా ఆయనలో ఒక మార్పు ఏర్పడుతుంది. అంతగా తనపై ప్రభావం చూపిన గురువుకు గురుదక్షిణ ఇవ్వాలనుకుని, స్వామీ! గురుదక్షిణగా ఏమివ్వను? అని అడుగుతారు.
దానికి ఆయన హిందూ మతాన్ని పునరుద్ధరించి ప్రచారం చేయమంటారు. అందుకోసం వేదాలను బాగా చదివాలనీ, సమాజంలోని సాంఘిక దురాచారాలను, మూఢనమ్మకాలను తొలగించడానికి కోసం 1875లో ఆర్య సమాజ స్థాపన తర్వాత హిందూ మతంలోని గొప్పతనాన్ని ప్రచారం చేయడంలో భాగంగా వేదాలకు తరలిపొండి అని నినాదం చేస్తారు స్వామి దయానంద సరస్వతి.
మూఢనమ్మకాలు, మూఢాచారాలు ఎందుకు ఎక్కువయ్యాయి అంటే? ఆ సంధి కాలంలో మంచిగా చదువుకొని పురోహితులు ఉండడం వల్ల
ధనం కోసం మూఢనమ్మకాలను ప్రజలలో సృష్టించి తమ పబ్బం గడుపుకునేవారు. దేవుడి పేరు చెప్పి ఎన్నో అవైదిక కార్యక్రమాలు చేసేవారు. ఎందుకంటే? వారు ఎవరూ వేదం చదవక అందులోని ధార్మిక విషయాలు తెలుసుకోకపోవడమే అనుకొని వేద ప్రచారం జరగకపోవడమే కారణమని గ్రహించి ప్రచారం చేస్తూ సాంఘిక దురాచారాలను అరికట్టాలని దయానందసరస్వతి అప్పుడే నిర్ణయించుకున్నారు.
అప్పుడు సమాజంలో బాధించే మూఢాచారాలు ఏమిటి అంటే? అస్పృశ్యత, బాల్య వివాహాలు… వీటిని అరికట్టడం కోసం స్వామిదయానంద సరస్వతి
స్వరాజ్య
స్వధర్మ
స్వభాష
అనే మూడు సందేశాలను ఇచ్చారు..
స్వరాజ్యము అని అంటే మన దేశాన్ని మనమే పాలించుకోవాలని, స్వధర్మము అంటే మన ధర్మాన్ని వదిలిపెట్టవద్దని, స్వభాష అంటే మన భాష -సంస్కృతిని చదవాలని, ఇంగ్లీష్ భాషను కాదని చెప్పారు!
ఇదిలా నడుస్తూ ఉండగానే 1852 లో గోవధ సంరక్షణ ఉద్యమాన్ని, గోవద నిషేధం అనే ఉద్యమాన్ని తీవ్రంగా చేపట్టారు.
వీటికి తోడు శుద్ధి ఉద్యమాన్ని కూడా నడిపారు. అంటే ఇతర మతాలలో చేరిన వారిని తిరిగి హిందూమతంలోనికి చేర్చుకోవడం జరిగింది. కేరళలో 2000 మంది ముస్లింలను హిందువులలో చేర్చుకున్నారు. దాంతో ముస్లిం, క్రిస్టియన్ లకు హిందూమతం వారితో తీవ్ర విభేదాలు చెలరేగుతాయి.
హిందూ మతం గురించి అందరికీ అవగాహన కలిగించడానికి, అలాగే వేద విద్యను నేర్పించడానికి, అభివృద్ధి చేయడానికి
దయానంద ఆంగ్లో వేదిక్ పాఠశాలను స్థాపించారు. దీనికి లాలాజపతిరాయ్, మదన్మోహన్ మాలవ్య కూడా సహకరించారు.
ఉత్తరప్రదేశ్ లోమదన్మోహన్ మాలవ్య ప్రచారం చేశారు,
1892లో ఆర్య సమాజం రెండుగా విడిపోయింది.
1- గురుకుల ఆర్య సమాజ్,
2- కళాశాల ఆర్య సమాజ్ గా చీలిపోయింది.
ఎందుకంటే? వేదం నేర్చుకుంటే జీవన భృతి ఇవ్వదని మిగతా ఆంగ్ల సబ్జెక్టులు నేర్పించాలనే తీవ్ర పట్టింపులతో చివరకు వేదాలను గురుకుల ఆర్య సమాజంలో నేర్పించాలని, లాలా మున్షీరామ్ ( స్వామి శ్రద్ధానంద)హరి ద్వార్ లో వేద పాఠశాలను స్థాపించారు. అదిప్పటికీ నడుస్తున్నది.
ఈ శ్రద్ధానందకు హిందీ భాషను జాతీయ భాషగా చేయాలనే సంకల్పం ఉండేది.
ఈ విశాలమైన భారతంలో
సాధన- సభ్యత అనేవి తత్త్వానుభూతి మీద ఆధారపడి ఉన్నాయి. భారతీయ సాహిత్యం, శిల్పం, విజ్ఞానం, దర్శనము, కుల, మత సమాజాలు,వారి యొక్క ధర్మాలు, ఆర్థికపరమైన విషయాలు, మంచి మాటలు చెప్పే నీతులు మొదలైన అన్ని విషయాలు వేదాలను నుండి ఉపనిషత్తులు వాటి ద్వారా మనకు తెలిసాయి! కాబట్టి వాటినితెలుసుకొని, ఆచరణలో పెట్టుకోవడం మన సంస్కృతిని మనం కాపాడుకోవడమే!
మహర్షులు ఏ ఆధ్యాత్మిక తత్త్వాలను జ్ఞానదృష్టితో సాక్షాత్కరించుకున్నారో? వాటిని తాము తమ వేద భూమిక, వేద రహస్య, వేద భాష్య గ్రంథాలలో చక్కగా తెలిపారు దయానందులు.
మీరు తమ జీవితాన్ని త్యాగం చేసి రేయింబవళ్లు వేద రహస్యాలను తెలుసుకోవడంలోనే గడిపారంటే అతిశయోక్తి కానే కాదు!
సంస్కృత భాష భారతీయ సంస్కృతికి మూలం అని అనుకొని, ఆ సంస్కృత భాషను ఎలా చదవాలో అలా ఒక క్రమాన్ని తయారు చేసి పెట్టిన సంస్కృత భాషా ప్రేమికుడు దయానంద సరస్వతి. అందుకే ఆయన ఈశ్వర, దేవ, సోమ, సూర్య, బ్రహ్మ, విష్ణు, శివుడు మొదలైన నామాలకు ఉత్పత్తి అర్ధాలను తన సత్యార్థ ప్రకాశమనే గ్రంథంలో రాసి పెట్టారు. ఈ గ్రంథం ఋక్, యజు స్సామ, అధర్వవేదముల ఆధారంగా రాశారు.
వీటిని చదివి, గురుకుల ఆర్య సమాజ నిర్మాణ ఆవశ్యకతను గమనించిన మాన్యులు డా॥ సర్వేపల్లి రాధాకృష్ణగారు భారత నిర్మాతలలో దయానంద సరస్వతి ఒకరని వ్యాఖ్యానించారు. అంతటి గొప్ప దార్శనికులు స్వామిదయానంద సరస్వతి.
మరొక విశేషం ఏమిటి అంటే? దయానంద సరస్వతి ఆర్య సమాజం స్థాపించినప్పుడు అది సక్రమంగా కొనసాగేందుకు దశ నియమాలతో అవగాహన ఉండేలా ఒక నియమావళిని రూపొందించారు. ఆ నియమావళి లేకపోతే ఆర్య సమాజం ఇంతవరకు కొనసాగక పోయేది అని ఖచ్చితంగా చెప్పవచ్చు! ఈ నియమాలు ఎంతో గొప్ప నియమాలు. ఎందుకంటే? వీటిల్లో కర్తవ్యాన్ని, మార్గదర్శనాన్ని కూడా చేశాయి. ఈ నియమాలు చదివితే చాలు. ఆర్య సమాజం గొప్పదనం తెలుస్తుంది.
వేద ధర్మాలు ప్రచారం చేయడం అనేది మామూలు మాట కాదు! అన్ని కాలాలలోనూ అన్ని ప్రదేశాలకు తగినట్టుగా వేదం ఉంటుంది. ఎందుకంటే వేదం యొక్క ముఖ్య ఉద్దేశమే ప్రపంచానికి మేలు చేయడం కదా! ఎక్కడెక్కడ మానవజాతి నివసిస్తుందో అక్కడక్కడ వేద వాక్కులు అవసరమౌతాయి! ఈ ఉపకారమనేది శరీర ఉన్నతికే కాక, ఆత్మ ఉన్నతికి , సమాజం ఉన్నతికి కూడా ఎంతో ముఖ్యం. అంతేకాదు ఈ ఉపకారం జాతి, మతం, కులం, స్త్రీలు, పురుషులు అనే తేడా లేకుండా అందరికీ ఉపకారం తలపెట్టే వేదం, అటు మానవజాతికే కాకుండా భూతయజ్ఞంలో భాగంగా ఏ ప్రాణిని హింసించకూడదని ఆదేశిస్తుంది.. అంటే మనుషులకే కాదు అన్ని ప్రాణులకు ఉపకారం చేయాలని లక్ష్యం ఉన్న వేద సంస్కృతి సాగించాలనే లక్ష్యం ఉన్న ఈ సంస్థ స్వార్థం లేకుండా సంకుచిత భావంలేకుండా కొనసాగడానికి ఈ నియమాలు ఎంతో ఉపకరిస్తాయి.
స్వామి దయానంద సరస్వతి ఇలా వేదమంత్రాలకు భాష్యం రాసి వాటి ఆధారంగా వైదిక ధర్మాలను ప్రచారం చేయడం ప్రారంభించారు. హిందూ ధర్మ సంస్కృతికి వేదమే మూలమని వేదపఠనం చేయాలని వేదం వినాలని ఒక నియమం పెట్టారు.
అలా వేదం ద్వారా సత్యమేమిటో తెలుసుకోవచ్చని, అంటే (సత్యం అంటే భగవంతుడే సత్యం) ( ఆర్య జగత్తుకు నిమిత్త కారణం పరమేశ్వరుడు) ఇంకా స్పష్టంగా తెలిపేందుకు సృష్టికర్త ఆధారం పరమేశ్వరుడే అనేందుకు ఒక ప్రమాణాన్ని ఇలా తెలియజేశారు.
యతో వా ఇమాని భూతాని జాయంతే
యేన జాతాని జీవంతి యత్ప్రయంత్యభి–
సంవింశంతి తద్విజిజ్ఞాసస్య తద్రబ్రహ్మ
తై.ఉ.భృ.8-1
భావమేమిటంటే.. ఏ పరమాత్మ రచన చేత ఈ సమస్త పృథ్వివ్యాది భూతములు ఉత్పన్నమవుచున్నవో? ఎవని జీవనమును- ఎవని యందు ప్రళయం పొందుచున్నదో అతడే బ్రహ్మము అని ఇష్టంగా చెప్పు!!
ఇలా ఈ సృష్టికర్త, రక్షణము చేయువాడు పరమేశ్వరుడని శృతి -స్మృతి ఎన్నో ప్రమాణములను చెప్పింది.
దయానందుల వారు ఈ జగత్ వ్యాపారానికి మూలం పరమేశ్వరుడని బోధించేవారు. సంపూర్ణ జ్ఞానానికి, జ్ఞానంవల్ల తెలియపడే సమస్త ఙ్ఞేయ ( తెలియదగినది) పదార్థాలకు ఆదిమూలం కూడా పరమేశ్వరుడే! ఎలా అంటే?
ఋగ్మంత్రం
ఋతంచ సత్యం చాభీద్ధాత్తపసోధ్యజాయత (1-190-1)
ఇటువంటి మంత్రాలతో పది నియమాలు ఏర్పరిచారు.
ఒకచోట
పరమేశ్వర నిర్వచనం ఇలా చేశారు.
య ఈశ్వరేషు సమర్ధేషు పరమః శ్రేష్ఠః *పరమేశ్వరః అని… అంటే సమర్థవంతునకు ఈశ్వరుడని పేరు. సమర్థులలో సమర్థుడై తనతో సమానుడైన వాడెవ్వడు లేని వాడని, వాడిని పరమేశ్వరుడు అని అంటారు. సమర్ధత అంటే స్వభావాలలో వ్యవహారాలలో అందరికంటే అధికుడిని శ్రేష్ఠుడు అని అంటారు. ఇటువంటి శ్రేష్టుల అందరిలో అత్యంత శ్రేష్టుడు పరమేశ్వరుడని, అతనితో సమానమైన వాడు లేడని, ముందు రాబోడని అర్ధమని సత్యార్థ ప్రకాశిక లో పరమేశ్వర పదాన్ని వివరించారు.
వీరి నియమాలను చదివినప్పుడు పెద్దలకు అనిపించిన భావాన్ని వారి ఉపన్యాసాలలో మనం విన్నప్పుడు… మనకు అర్థమయ్యేది ఏమిటి అంటే? వేదం అపౌరుషేయమని, ఈశ్వరీయమని, పరమేశ్వరుడే కార్య జగత్తుకు నిమిత్త కారణమని, కారణరూపంలో జగత్తు సత్యం అని తెలుస్తుంది. ఇంత గొప్పవిశేషాంశాలన్నీ తమ నియమాలలో తెలిపారు.
జీవులు చేసిన పుణ్యపాపాలన్నింటికీ సుఖదుఃఖ రూప ఫలాన్ని ఈశ్వరుడిస్తాడని, ఏ ఒక్క కర్మ కూడా ఫలము అనుభవించకుండా నశించదని, తన న్యాయకారి శబ్దానికి నిర్వచనం చేశారు.
ఈశ్వరునికి జన్మ లేదనడానికి వేద శాస్త్ర ప్రమాణాన్ని మనం ఎక్కువగా వినే ఒక మంత్రంలో చక్కగా వివరించారు. ప్రజాపతి శ్చరతి గర్భే అంతరజాయ మానో బహుధా విజాయతే ( యజు -31 -19 )
అంటే ప్రజాపతి గర్భస్థ జీవుని యందు వ్యాపించి ఉన్నాడు- స్వస్వరూపంతో అనుత్పన్నుడైనా అనేక ప్రకారములతో యోగుల అంతఃకరణములలో విశేషముగా కనపడుచుండును అని భావం.
వీటన్నిటి వలన పరమాత్మ పుట్టుక లేనివాడని తెలుస్తుంది.
ఉపాసనా పద్ధతులు వాటి ఫలితాలు మొదలైనవి కూడా ఈ నియమాలలో ఉన్నాయి.
వేదం సమస్త విద్యల గ్రంథం. దీనిని చదవాలని, చదివించాలని, వినాలని, వినిపించాలని ఇది శ్రేష్ఠులు ఆచరించే పరమధర్మమని సందేశాన్ని ఇచ్చారు. ఇలా వేద పఠనం జరగాలంటే వేదం (గ్రంథం) ప్రతి ఇంట్లోనూ ఉండాలని, లేకపోతే ఉత్తముడు కాడని తన నియమాలలో తెలిపారు. ఎందుకంటే పురాణాలు, రామాయణం, భగవద్గీత మొదలైన గ్రంథాలు వేదాలను గురించి చెప్తున్నాయి. ఇవి చదువుతున్నారు.. కానీ వేదం ఎందుకు చదవడం లేదని అంటే మధ్యకాలంలో ఎవరిష్టం వచ్చిన మతాన్ని వారు అనుసరించటం వల్ల వాటిని చదవడం మానేశారని, దాంతో వేదం మరుగున పడిందని, దాన్ని తిరిగి పునరుద్ధరించాలని ఈ నియమాలలో చేర్చారు. దీని వెనుక ఒక గొప్ప ఆశయం ఉన్నది! అది ఏమిటంటే? వేదం ఉంటేనే హిందువులంతా ఒకే సూత్రంపై నడవాలని… నడుస్తారని.. అనే ఈ ఆలోచన దయానంద సరస్వతికి మాత్రమే వచ్చింది. అందుకే తన సత్యార్థ ప్రకాశం
ఏడవ సమూల్లాసంలో “ఎవరైనను నీ మతమేమని? ప్రశ్నించినచో… నా మతము వేదమతము! దానిలో ఏముందో దాన్ని ఆచరిస్తామని” సమాధానము ఇయ్యవలెను అని రాసారు.
మానవ జాతిని ఉద్ధరించడానికి, దేశ క్షేమం కోసం ఎంతో కష్టపడి వేదమంత్రాల అర్థాలను చెప్పడానికి… బ్రాహ్మణములు చదివి వాటికి, వేదములకు వ్యాఖ్యానాలు రాసిన ఋషుల వంటి వారు స్వామి దయానంద సరస్వతి.
వేద విధి ప్రకారం సత్యం గ్రహించి, అసత్యాన్ని వదిలేయాలని మరో నియమంలో చెప్పారు.
सतय कं ग्रहण कर ने और असत्य को छोड़ने मे सर्वदा उदयत रहना चाहिए।* భావమేమిటి అంటే? సత్యము గ్రహించుటకు- అసత్యము త్యజించుటకు ఎప్పుడు సిద్ధంగా ఉండాలి! అని…
మనం నివసించి ఉండే ఈ జన్మలోనూ… వచ్చే జన్మలలోను.. పరలోకంలోనూ.. అభివృద్ధి, నిశ్రేయసనము- మోక్షము కావాలనుకునే వారు జీవితాన్ని ఒక వ్రతం వలె గడపాలని, అందులోనూ సత్యం ముఖ్యమైనదని చెప్పారు.
స్వామి దయానంద సరస్వతి సంఘశాంతికి ఎంతో కృషి చేశారని ముందే చెప్పుకున్నాం కదా! తన యొక్క తపశ్శక్తితో మంత్రార్ధం తెలుసుకొని వేదాలకు భాష్యం రాశారు.
దాంతో అశాంతి ఎందుకు కలుగుతున్నదో కారణం తెలుసుకొని, దానికి ఉపాయం మిధ్యారూపణ అని తన భూమికలో
సత్యాన్ని సత్యముగా- మిధ్యను మిధ్య
గా ప్రతిపాదించడానికి సత్యార్థ ప్రకాశం రాసానని, అందులో ఉన్నది ఉన్నట్టుగా చెప్పడమే సత్యమని, ఎవరైనా పక్షపాత దృష్టితో అసత్యాన్ని- సత్యంగా ఋజువు చేయాలనుకుంటాడో.. అతను సత్యాన్ని చూడలేడు!” అని నిర్ధారణ చేశారు.
ఈ వాక్యాలతోనే దయానందుల వారి సత్యాభిలాషిత్వం తెలుస్తుంది.
సత్యమేవ జయతే నానృతం
సత్యేన పంథా వితతో దేవయానః
అనే సూక్తికి కట్టుబడి ఉన్నారు. ఈ విషయం తన స్వమంత వ్యామంతవ్య ప్రకాశంలో రాసారు.
ఇలా సంఘం శాంతిగా ఉండాలంటే సత్యం ముఖ్యమని దాన్ని తప్పక ఆచరించాలని తన నియమాలలో చెప్పారు. దీన్ని ఆచరించాలంటే దృఢ సంకల్పం, స్వాధ్యాయం ఈశ్వర ప్రణిదానం అవసరమని వాటిని ఇవ్వమని భగవంతుని ప్రార్థించి పొందాలని తెలిపారు.
స్వాధ్యాయము= స్వస్య + అధ్యాయః =స్వాధ్యాయః = బాగా చదువవడం.
ఈ సత్యాన్ని పరిక్షించేదుకు మరో ఐదు పద్ధతులను సూచించారు.
సర్వ కార్యాలను ధర్మానుసారంగా చేయాలని, అంటే సత్యాసత్యాలను విచారించి చేయాలని, మరో నియమంలో సూచించారు. గుడ్డి నమ్మకంతో కాక బుద్ధిని ఉపయోగించి విచారించి కర్మలు ఆచరించాలని భావం…
ధర్మ ఏవ హతోహన్తి ధర్మో రక్షతి రక్షితః ౹
తస్మా ధర్మో న హంతవ్యో మానో ధర్మో హతవధీత్॥ మను – 13 -15.
అంటే ధర్మహానే జీవనహాని, ధర్మరక్షణే- జీవన రక్షణ… కాబట్టి ధర్మానికి హాని కలిగించకూడదు! హత ధర్మము మానవ జీవనమును హతము చేయకుండగాక! అని ఈ మంత్ర భావము.
ఇలా సత్య- ధర్మాల గురించి ఎన్నో మంత్రాలలో వివరించారు.
సమాజానికీ, ప్రపంచానికీ ఉపకారం చేయాలని అంటే శరీరోన్నతికి -ఆత్మోన్నతికి- సామాజికోన్నతికి పాటుపడాలని నియమం ఏర్పాటు చేశారు.
ఈ ఉపకారాలను మూడు రకాలుగా చేయవచ్చని, ప్రాణుల శక్తులను వృద్ధిపరచడం, ఆత్మోన్నతి సాధించడం, ఎలా ఐతే తన కుటుంబాన్ని ఉన్నతిగా నిలబెట్టడానికి తాము ప్రయత్నిస్తారో? అలాగే సమాజంలో ఉన్న మూఢాచారాలను తొలగించడానికి అందరూ కలిసికట్టుగా మాట్లాడుకుని, ఆలోచించి, ఐకమత్యంగా సాధించాలని, సమాజ అభివృద్ధికి తన వంతు సహాయాన్ని అందించాలనే నియమం పెట్టారు.
మనిషి సంఘజీవి కనుక ఇతరుల సహకారంతోనే తాను ఎదుగుతాడు కనుక వారితో ప్రవర్తించే తీరు ప్రేమగా, ధర్మానుసారంగా, యోగ్యతగా ఉండాలని, అంటే స్వ- పర బేధం లేకుండా అందరితో కలిసికట్టుగా ఉండాలని ఈ నియమం చెప్పింది.
అయితే ఇవన్నీ చేయడానికి విద్య ఆవశ్యకత ఎంతో అవసరమని, అవిద్యను తొలగించి విద్యను పెంచాలని మరో నియమంలో చెప్పారు.
అనిత్యా శుచి దుఃఖానాత్మసు నిత్య శుచి సుఖాత్మ ఖ్యాతి రవిద్యా…* (యో.ద.2-5)
అంటే అనిత్యమును- నిత్యమని; అశుచిని- శుచి అని; దుఃఖాన్ని- సుఖమని; అనాత్మను- ఆత్మ అని తలవడమే అవిద్య అని అంటారు. దీని గురించి విశేషంగా చర్చించారు…
సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్దుఃఖభాగ్భవేత్॥
అర్థం ఏమిటి అంటే? సమస్త జనులు ఆరోగ్యంగా ఉండి, సుఖాలను, శుభాలను సదా పొందుదురుగాక! ఏ ఒక్కరు దుఃఖమును పొందకుండు గాక! అనే దివ్య భావనలతో కలిసి మెలసి ఉండాలని నియమం రాశారు.
ఇదే కదా! తన ఉన్నతితో పాటు సమాజం యొక్క ఉన్నతికి పాటు పడగలగడం
మరో నియమంలో ప్రతి వ్యక్తి తన ఉన్నతితోనే సంతృప్తి చెందక అందరి ఉన్నతిలోనే తన ఉన్నతి ఉందని అనుకోవాలని నియమం ఏర్పాటు చేశారు. మంత్రంతో విశేషించి చర్చించారు. జగత్ అంటే ప్రపంచంలో ఏ మాత్రం పదార్థం ఉన్నా అది చలనంలోనే ఉంటుందని దాని ఆధారంగా విస్తారంగా రాసారు.
అయితే తే వ్యక్తి ధర్మానికి -సమాజ ధర్మానికి విరోధ భావం కలిగితే… ఏ మార్గాన్ని అవలంబించాలి? అనే సందేహం కలిగినప్పుడు మరో నియమంలో ఆసందేహ నివృత్తిచేసారు.
మనిషి సంఘజీవి కనుక తనకు ఏది మంచిదనిపిస్తుందో దాన్ని పాటించడం మంచిదే కానీ, దాని వల్ల సమాజానికి కీడు కలుగకూడదని, తనకు మాత్రమే లాభం కలిగేవి సమాజహితానికి ఉపయోగపడకపోతె మానుకోవాలని నియమాన్ని రాసారు.
ఇలా స్వామి దయానంద సరస్వతి సదా సమాజ శ్రేయస్సు కొరకే పాటుపడుతూ , అధర్వణ, యజుర్వేదం భాష్యం చేసిన భాష్యకారుడు దయానందులు.
వేద ధర్మాలు ప్రచారం చేస్తూ… తన వాదనలను, ఉద్యమాన్ని కొనసాగిస్తూ హిందూ ధర్మానికి పిలుపు నివ్వడంతో కొందరికి కంటగింపుగా మారాడు. ఎన్నోసార్లు విషప్రయోగాలు జరిపారు. యోగ క్రియల ద్వారా విషాన్ని ప్రక్షాళన చేసుకుని బతకగలిగారు. కానీ చివరకు 1883 – 10 -30 న దీపావళి రోజున సాయంత్రం విష ప్రయోగంతో క్షీణించి, ఓంకారం చేస్తూ.. సమాధి అవస్థలో మోక్షాన్ని పొందారు.
వంద సంవత్సరాలు దాటి ఎంతో కాలమైనా.. దయానందులు స్మరణీయులే! అంతేకాదు సంఘ శాంతినే కాంక్షించిన ఋషి తుల్యులు స్వామి దయానంద సరస్వతి గారి కృషిని భారతీయ జాతి ఉన్నంత కాలం మరచిపోదు!
ప్రతి హిందువు మదిలో శాశ్వతంగా సుస్థిరంగా నిలిచిపోయే మూర్తిమత్వం వర్ధంతి సందర్భంగా నమస్సుమాంజలులు అర్పిస్తూ…

You may also like

Leave a Comment