స్వార్థం గొడుగు నీడలో…
లోకమంతా
ఇచ్చి పుచ్చుకునే సంత బేరాలవుతుంటే…ఒకనాటి
అనుబంధాలు…నేడు
చూద్దామన్నా…కనబడక..
కనుమరుగవుతున్నాయి!
అనుకోని అతిథి రాకోయి
అంటూ..
సన్నాయి రాగాలు వినిపిస్తుంటే..
రాటు దేలిన
మనసుల మధ్య…
ఆప్యాయతా చివురులు
చిగురించ లేక పోతున్నాయి!
తోలు బొమ్మలాట వంటి..
బతుకులో…నటిస్తూ
మసలటం రివాజైపోతుంటే..
నాలుకపై మాట గుండెలో దిగనీయక…
గుండెలో మాట పెదవి గడప దాటక…
భావం…గొంతు ముడిలో
ఉరి వేసుకుంటున్నాయి!
బంధాలు అనుబంధాలు..
ఎండుటాకులై రాలిపోతూ
నటించే వానికే…
హారతి పడుతుంటే..
ఆనందాల..
ఆత్మీయతల అర్థాల
స్వరాలు మారుతున్నాయి!
ఇకనైనా..
సంకుచిత గుహ నుండి
బయట పడదాం!
మసక బారుతున్న
బంధాలకు…
మానవత్వపు
మెరుగులు అద్దుదాం!!
దాస్యం సేనాధిపతి
హైదరాబాద్