Home కవితలు 2022 – నూతన స్వాగతం

2022 – నూతన స్వాగతం

by dr. Lakkraju Nirmala

అంకెలు మారుతున్నాయి
ఆర్భాటాలు పెరుగుతున్నాయి
అక్షరం విలువ తరిగిపోతున్నది
అమ్మ విలువ కరిగిపోతున్నది
విలువల అంకెలు మారిపోతున్నాయి
అంకెల విలువలు వీగిపోతున్నాయి
మారిన అంకెలు తిరిగి రావని తెలిసిన నా మనసు మలుచుకొమ్మంటున్నది ఆనందమయ
భవిష్యత్తుగా –

అందరికీ ఓ విజ్ఞప్తి !!

ఆశల కిరణాల నిరంతర నిర్విరామ ప్రవహాలనే నువు చూసేది
ఆకాశానికి హద్దులు లేవు
మనసుకి హద్దులు లేవు
కావాలి అనుకునే అన్నీ
సాధించుకునే శక్తి మానవునిది భగవంతుడు ఇచ్చాడనో
నువ్వే తెచ్చుకున్నావనో
సందిగ్ధతల సంగతి అటుంచి
నా మాటలు తూటాలనుకోక వినండి –
కానీ కాలమే దేవుడుఅంటాను నేను
నేనే శక్తిని అంటావు నీవు
కరిగిపోయే కాలం శక్తి
కాలాన్ని సద్వినియోగం చేసుకోవడమే యోగ్యత
సకాల నిర్ణయం
యోగ్యత లక్షణం
కాలం సమస్యా పరిష్కర కర్త
ఇది పెద్దలమాట
ఇదే పెద్ద మూట
కాలమే మనిషిని
నియంత్రించే ఓ శక్తి!
అదే ఈ విశ్వాన్ని నడిపిస్తున్న ఓ అద్భుత శక్తి!
దానిని తెలుసుకున్నావో
ఇక అద్భుతాలు నీవే
అద్భుతానివీ నీవే

శోధించు
సాధించగలవు
సాధించు జీవించగలవు
కాలాన్ని సద్వినియోగం చేసుకో అన్నిట్లో విజయం నీదే
స్వీయ నియంత్రణ నీదైతే
ఓ మనిషీ నీకే సొంతం విజయం
నూతన సంవత్సరాన్ని
నూతనంగా ఆహ్వానిద్దామా !!

— డాక్టర్ లక్కరాజు నిర్మల

You may also like

1 comment

గురిజాల రామశేషయ్య January 11, 2022 - 11:19 am

అద్భుతానివీ నీవే … అని మనిషికి కాలజీవియైన మనసుకు చెప్పటం కవయిత్రిగా మీ ప్రత్యేకత. అభినందనలు.

Reply

Leave a Comment