1. పోనీ ! పోనీ !
కోల్ కతా ఓ మహానగరం. పెద్ద సంఖ్యలో.. చాలా పెద్ద సంఖ్యలో జనం అక్కడ నివసిస్తూ ఉంటారు. అలాగే అక్కడికి వచ్చిపోయే వారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు. లక్షల మంది బస్సులు, స్టీమర్ల, హ్రంలు, ట్రైయిన్లు, ఇలా ఏ వాహనం దొరికితే దానిలో, ఆఫీసులకి, ఇతర పనులకి వెళ్తూ – వస్తూ ఉంటారు. రవాణా సాధనాలన్నీ ఎప్పుడూ క్రిక్కిరిసిపోయి ఉంటాయి.
రామం, సుధీర్, జేమ్స్, అయూబ్ – నలుగురూ వేర్వేరు ఆఫీసుల్లో పనులు చేస్తూ, రోజూ ప్రొద్దున్నే వెళ్ళడం, తిరిగి ఇళ్ళకు రావడం చేస్తూ ఉంటారు. పరస్పరం పరిచయాలైతే లేవు, కాని ఇవ్వాళైతే నలుగురూ ఒకే బస్సులో ప్రయాణం చేస్తున్నారు.
బస్సు ప్రయాణీకుల్తో కిటకిటలాడుతోంది. సూదిమొనంత ఖాళీ కూడా లేదు. రామం, సుధీర్, అయితే ఎలాగో అలా త్రోసుకుంటూ లోపలికి వెళ్ళ గలిగారు. జేమ్స్ కొంచెం కష్టపడితే ఇక లోపలికి వచ్చేస్తాడు కాని పాపం ! అయూబ్ బస్సు ద్వారం దగ్గరే కడ్డీ పట్టుకుని వ్రేలాడుతూ ఉన్నాడు.
ఇంతలో బస్సు కదిలింది. రోడ్డు మీద జనం బస్సుల్లో జనం. ప్రజల మానసిక థ కూడా దిగజారి పోయింది. ఎవరూ ఎవర్ని లెక్క చేయరు. ఎవరి స్వార్థం వారిదే. ఇలా ఆలోచిస్తూ ఉన్నాడు రామం.
అంతే ! ధడేలన్న శబ్దం. ఏదో పడిపోయినట్టయింది. ఎవరిదో భయం నిండిన ‘కేక’ హృదయ విదారకంగా వినబడింది. బహుశా అయూబ్ పడిపోయినట్టున్నాడు. అలా క్రింద రోడ్డు మీద పడిపోయిన అయూబ్ మీది నుండి – వెనకాలే వచ్చిన ఒక వాహనం, వేగం నియంత్రణ కోల్పోయినందున, వెళ్ళిపోయింది. అయినా….
రామం, సుధీర్, జేమ్స్ మాట్లాడుకుంటున్న మాటలు స్పష్టంగా వినబడుతున్నాయ్…
అరే ! భయ్యా ! మా ఆఫీసుకు లేటయి పోతోంది.
పద, పద !! పోనీ ! పోనీ !! బస్సు పోనీ !!
2. మీ గొప్ప కోసమని…
ఒకప్పుడు గురు శిష్యులిద్దరూ ఒక ఊర్లో ఉండేవారు. ఇద్దరూ ప్రతిరోజూ జ్ఞాన సంబంధమైన చర్చ జరుపుతూ ఉండేవారు.
ఒకరోజున గురువుగారు శిష్యుణ్ణి పిలిచి – ”ఇవాళ నేను ఓ గంటసేపు నీ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతా.. నువ్వు జాగ్రత్తగా విని విశ్లేషిస్తూ, నేనేం చెప్పానో సరిగ్గా చెప్పాలి” అని అన్నాడు.
ఓ గంటసేపు గురువుగారు తన గురించి చెప్పాక, విశ్లేషించమని కోరగా, ”అయ్యా ! మీరు ఎక్కువగా మీ గురించే మీరు పొగుడుకున్నారు. ఆత్మస్తుతి ఎక్కువైంది. మీకు ”నేను” అనేది ఎంత ఇష్టమని తేలిందంటే, సుమారుగా ప్రతి వాక్యంలోనూ దాన్ని ఉపయోగించారు. ఇక ఇతరుల్ని చాలాసేపు నిందించారు, విమర్శించారు. మీకు మీలోని మంచితనం మాత్రమే కనిపించగా, ఇతరుల్లోని లోటుపాట్లు, తప్పులు మాత్రం మీకు కనిపించాయి”.
”మీ వ్యక్తిగత జీవితం గురించి విన్నాక ”మీరు మీ కీర్తి కోసం, మీ గొప్పత కోసం ఇతరుల్ని విమర్శకు గురిచేస్తూ, వారిలో ఏవో తప్పులు వెదుకుతూ ఉంటారని నాకు అర్థమైంది” అని అన్నాడా శిష్య పరమాణువు.
3. స్వర్ణ యుగం
భూమ్మీద ఒక్కో మతానికి చెందిన ఒక్కో వ్యక్తి మిగిలాడు. పరస్పరం పోట్లాడుకున్న దాని ఫలితంగా ఇలా జరిగింది. ఇప్పుడు వారి కళ్ళల్లో ఈర్ష ్యకి బదులు భయం చోటు చేసుకుంది. తమలో తాము పోట్లాడుకుని, పోట్లాడుకుని మనుషుల ఎత్తు బాగా తగ్గిపోగా, చుట్టూ ఉన్న జంతువుల ఎత్తు బాగా పెరిగిపోయింది. ఆ పశువులన్నీ మనుషుల్ని చుట్టుముట్టాయి.
”ఇక మనం బ్రతికి బట్ట కట్టలేం. ఈ జంతువులు మనల్ని తినేస్తాయి” అని అన్నాడో మనిషి.
మరొకడు కొంచెం తెలివిగలవాడు ”అసలు ఇన్ని శతాబ్దాలుగా మనిషి ఎలా తప్పించుకున్నాడో గదా అని ఆలోచిస్తే, మనుషుల్లోని ఐకమత్యమే దీనికి కారణమని తెలుస్తుంది. కానీ… మతం పేర, కలహాలు ప్రారంభం అయినప్పట్నించే మనిషి పరిస్థితి ఇలా అయిపోయింది” అని అన్నాడు.
”సరే ! మనం ఇప్పుడేం చేద్దాం?” అన్నాడు మూడోవాడు.
”రండి! మళ్ళీ అందరం ఏకమౌదాం. ఐకమత్యమే బలం. అప్పుడు బహుశా మనమే మళ్ళీ గెలుస్తాం” అన్నాడు నాలుగోవాడు.
పశువులు చాలా తెలివి గలవి. మనుష్యులంతా ఒకటైతే మనం వారిముందు నిలబడలేం. ఓడిపోతాం అని అనుకుని మనుష్యుల చుట్టూ ఉన్న కట్టడిని తొలగించి వారికి స్వేచ్ఛనిచ్చాయి.
అంతే ! భూమ్మీద కేవలం మానవతా మతం మాత్రమే నిలబడింది. నవనిర్మాణం, మానవ ప్రగతికి సంబంధించిన స్వర్ణయుగం మరల తిరిగొచ్చింది.
4. సంతాప సభ
స్కూల్లో ఒక విచిత్రమైన ప్రశాంత వాతావరణం నెలకొని ఉంది. పిల్లలంతా లైన్‌లలో నిలబడి మౌనంగా ఉన్నారు. ఇంతలో ఓ కారు హారన్ శబ్దం వారి నిశ్శబ్దానికి భంగం కలిగించింది.
గోపీ ఇవాళ మళ్ళీ ఆలస్యంగా వచ్చాడు. రాగానే కారు దిగి భయం భయంగా వెళ్ళి లైన్లో నిలబడ్డాడు. మెల్లగా తన ప్రక్క ఉన్న బాలుని అడిగాడు.
”ఏమైంది?”
”కనబట్టంలా? సంతాప సభ నడుస్తోంది” అని గుసగుసలాడాడు బాలు.
”ఎవరు పోయార్రా?”
”మన రామయ్య మాస్టారు నిన్న రాత్రే కాలం చేసారట”. సంతాప సభ ముగిసింది. ”ఇవాళ స్కూల్ మూసేస్తున్నాం” అని ప్రకటించారు హెడ్మాస్టర్ గారు.
గోపీకి పట్టలేనంత ఆనందం కలిగింది. బాలు భుజం మీద చెయ్యేసి నవ్వుతూ – ”భలే ! స్కూల్ బంద్ ! సరేగాని మెట్రోలో క్రొత్త సినిమా విడుదలైందిరా ! పోదామా !
బాలు నిశ్చేష్టుడై అలా చూస్తూ ఉండిపోయాడు.
5. పలాయనం
డాక్టర్ సారథి తీరిక అస్సలులేని మనిషి. ఇవాళెందుకో బాగా అలసిపోయాడు. రేయింబవళ్ళూ రోగులు, పరీక్షలు, చికిత్స… ఇదే గొడవ. అసలైతే ఎప్పుడూ నవ్వుతూ త్రుళ్ళుతూ ఉంటాడు. మంచిగానే రోగులతో ప్రవర్తిస్తాడు. ఇవాళ… విసిగిపోయాడో ఏమో, ఎటైనా దూరంగా, వెళ్ళి ఏకాంతంగా ఉండాలని అనుకున్నాడు.
అప్పుడే ఆయనకి తన మిత్రుడు సుందరం గుర్తుకొచ్చాడు. స్కూల్ రోజుల నుండి ఫ్రెండ్. ఎన్నిసార్లు ఇంటికి రమ్మని ఆహ్వానించినా సారథి వెళ్ళలేక పోయాడు. ఇవాళ ఎలాగైనా సరే, వెళ్ళి ఓ 2-3 గంటలు ఆయనతో గడపాలని భావించాడు. కాదు… గట్టిగా అనుకున్నాడు. సారథి ఓ పది నిముషాల తర్వాత సుందరం గారింటి ముందు నిలబడి, కాలింగ్ బెల్ నొక్కాడు. మొహంలో ఆనందం. ఇక్కడ తననెవరూ… ఏ రోగీ… వచ్చి విసిగించదు” అని అనుకున్నాడు.
ఇంతలో తలుపు తెరుచుకుంది. శ్రీమతి సుందరం డాక్టర్ సారథిని చూసి, గుర్తుపట్టి నమస్కరించింది.
అరె ! మీరు రావడం చాలా మంచిదైంది. మీ స్నేహితుడి ఆరోగ్యం అస్సలు బాగాలేదు. నిన్నట్నించి బాగా జ్వరం ఉంది. రండి.. రండి…” అన్నదావిడ.