నా దేశం వేద పునీత ` భగవద్గీత
నా జెండా శాంతి, అహింసల ‘ఎజెండా’ !
భరతుడు, రాముడు, కృష్ణుడు పరిపాలించిన
గౌతమ, ఆది శంకరాదులు ప్రవచించిన
గంగా, గోదావరి, కావేరి ప్రవహించిన
పావన జీవనక్షేత్రం ` నా దేశం,
విశ్వశాంతి సందేశం ` నా దేశం!
పురుషోత్తమ, చంద్రగుప్తుల ప్రతిఘటనల మార్గం
శివాజీ, ఝాన్సీల స్వాతంత్య్ర ఖడ్గం
సిపాయీల తిరుగుబాటుతత్వం
గాంధీజీ, నేతాజీ నేతల స్వాతంత్య్ర మనస్తత్వం
నా జెండా జవసత్వం !
హిమవన్నగం తలమానికంగా
వింధ్య గిరీంద్రం ఒడ్డాణంగా
కన్యాకుమారి పాదపీఠంగా
అలరారే భారతావని నా దేశం,
పాడిపంటల తులతూగే శ్రీకోశం ` నా దేశం!
హరిత భరిత సస్యశ్యామలం ఆకుపచ్చగా
త్యాగచరిత అరుణవర్ణం లేత ఎరుపుగా
శాంతి ` అహింసల సంకేతం స్వచ్ఛమైన తెలుపుగా
కలగలిసి ఎగిరే మువ్వన్నెల నా జెండా,
పులకిత భారతి మెడలో విరిసే పూదండా !
సాధించుకున్న స్వాతంత్య్ర విజ్ఞానంతో
నా దేశం నాకంలా వర్ధిల్లాలి,
నా జెండా ధర్మచక్రంగా విలసిల్లాలి.
1 comment
అద్భుతంగా ఉంది సార్ దేశ ఔన్నత్యాన్ని చక్కగా వివరించారు