మయూఖ ముఖాముఖిలో రామచంద్రమౌళి
*******************************************
శ్రీమతి కొండపల్లి నీహారిణి సంపాదకత్వంలో వెలువడుతున్న తెలంగాణ తొలి అంతర్జాల సాహిత్య ద్వైమాసిక పత్రిక సాహిత్య రంగాన ఎన్నో రీతుల కృషి చేస్తున్నది. ప్రతీసారీ తెలంగాణా లోని బహుముఖ ప్రజ్ఞాశాలులైన కవిపండితులను ప్రేరణాత్మక మూర్తులుగా రేపటి తరానికి పరిచయంచేయాలనే సంకల్పంతో.. అన్ని రంగాల వారిని పరిచయంచేస్తూ… వారిలోని ప్రతిభా విశేషాలను తర్వాత తరానికి అందిస్తున్నది. ఈ కార్యక్రమంలో భాగంగా… పరిచయమే అక్కర లేని బహుముఖ ప్రజ్ఞాశాలులు, ప్రముఖ సాహితీవేత్త, కవి మాన్యులు విద్యా దిక్సూచి కాబట్టి సాహిత్య ప్రక్రియ ఏదైనా పాఠకుడు చదివినప్పుడు- *దాన్ని చదువక ముందున్న* *అతని *ఆలోచనలను* *సంస్కరింపబడాలి*!
అలా కాకపోతే ఆ సాహిత్య సృజన ప్రయోజనం లేనిదే!అని నిర్వచించిన సాహితీ ద్రష్ట మాన్యులు రామాచంద్రమౌళి గారి ద్వారా వారి జీవిత విశేషాలను తెలుసుకుందాం.
పద్మజ:– రామచంద్ర మౌళి గారూ! నమస్కారమండీ!
రామా చంద్ర మౌళి:- నమస్కారమండీ!
పద్మజ:— మీ రచనా వ్యాసంగం ఎంతో కాలంనుండి కొనసాగిస్తున్నారు. దీనికి ప్రేరణ కానీ మీ పూర్వీకుల నుండి మీకీ రచనా ప్రతిభ అబ్బిందా? మీ నేపథ్యం చెప్పండి!
రామాచంద్ర మౌళిగారు:– నేను వరంగల్లోనే పుట్టి, వరంగల్లోనే పెరిగాను! ఇక్కడే చదువుకొని, ఇక్కడే ఉద్యోగం చేశాను! అంటే పూర్తిగా ఈ నేలకు చెందిన వాడిని. వరంగల్లో పుట్టడం వల్ల జన్మతః కొన్ని వారసత్వాలు వచ్చాయి. ఎలా అంటే బమ్మెర పోతన వరంగల్ వాడు, ఆదికవి పాలకురికి సోమన మన వరంగల్ వాసి, వానమామలై వరదాచార్యుల నుండి మొదలు పెడితే కాళోజీ నారాయణరావు వరకు గొప్ప అద్భుతమైనటువంటి సాహిత్య పరిమళం ఈ నేలలో ఉంది. అటువంటి నేల పైన నేను జన్మించడం… కాళోజీ సమకాలికుడిగా కలిసి అనేక సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొనడం ఇవన్నీ అదృష్టంగా భావిస్తున్నాను.
మా నాన్నగారు ఆజంజాహి మిల్లులో పనిచేసేవారు. వరంగల్లో రెండే రకాల జీవన వృత్తులు ఉండేవి. మా చిన్నప్పుడు హనుమకొండలో జీవన విధానం వేరే విధంగా ఉండేది. అక్కడున్న వ్యక్తులు, నేపథ్యాలు వేరు! అక్కడ ధనిక కుటుంబాలు ఉండేవి. వరంగల్లో బీద కుటుంబాలు ఉండేవి. నికరంగా ఒక వృత్తి అనేది లేని కుటుంబాలు ఉండేవి.
ఇక్కడ కొన్ని ప్రాంతాలు అంటే గోవిందరాజుల గుట్ట, కాశీబుగ్గ, అబ్బని కుంట , ఇవన్నీ పెద్ద పరిశ్రమ నిజాం చేత ప్రారంభించబడిన ఆసియాలో అతి పెద్ద పరిశ్రమ ఉండేది. దానిలోనె మా నాన్న పనిచేసేవాడు. ఆ మిల్లు నిర్మించేటప్పుడు దాని పునాది నిర్మించిన కార్మికులలో ఒక కార్మికుడు మా నాన్న! ఈ విషయం చాలా గర్వంగా చెప్పుకుంటాను. అలా కార్మికుడికి జన్మించిన వ్యక్తిని కాబట్టి ఒక అద్భుతమైనటువంటి శ్రామిక నేపథ్యం నాకు సంక్రమించింది! నాకు కష్టాలు, కన్నీళ్లు దానితో పోరాటాలు నాకు జీవిత అనుభవాలుగా ఉన్నాయి. అటువంటి నేపథ్యంలో నుండి ఒక సాహిత్యకారుడిగా ఎదగడమనేది ఒక రాతి నేలలో నుండి మొలక వచ్చినట్టుగా పోల్చుకోవచ్చు! పుస్తకమే నన్నీ స్థాయికి తీసుకొని వచ్చింది! తప్ప వేరే నేపథ్యం లేదు.
మా నాన్న ఐదవ తరగతి వరకే చదివారు! కానీ చక్కని జ్ఞాపకశక్తి ఉండటం వల్ల తెల్లవారు ఝామున మేలుకొని తత్త్వాలు పాడేవారు. భాగవతంలోని దాదాపు వంద పద్యాల వరకు చదివేవారు. ఆయనకు అద్భుతమైన ధారణ శక్తి ఉన్నది. ఆయనకు గొప్ప ఆధ్యాత్మిక చింతన ఉండేది. వరంగల్ లో *అచల* గురు పీఠమని మా ఇంట్లో ఒకటుండేది. దాన్ని మా నాన్నగారు నిర్వహించేవారు. అంటే తాత్త్వికమైన నేపథ్యం ఉన్న కుటుంబం నాది.
మేము ఆరుగురు అన్నదమ్ములం, ముగ్గురు అక్క చెల్లెళ్ళు. మగవాళ్ళలో నేనే పెద్దవాడిని! ఇంటికి పెద్దై పుట్టడం కంటే అడవిలో మానై పుట్టడం మేలు అని మన తెలంగాణ సామెత కదా! అంటే జీవితంలో అంత కష్టం ఉంటుంది. కష్టాలు- కన్నీళ్లు అంటే ఏమిటో నాకు బాగా తెలుసు! కాబట్టి జీవితం అనేది పోరాడి గెలవాల్సిన ఒకానొక జీవన ప్రక్రియ అని నాకు ముందు నుండే ఉండే అభిప్రాయం… కాబట్టి మనిషి ఎదగాలంటే ఏం కావాలని ఆలోచించాను! చదువు ఒక్కటే మార్గమని నిర్ణయించుకున్నాను. చదువు లేకపోతే మనం ఏ విజయం సాధించలేము అని నా అభిప్రాయం. దానికి దైవం తోడై మంచి పాఠశాలలో చదవగలిగాను.
వరంగల్ లో మహబూబియా పాఠశాల అత్యున్నతమైనది. రెండే ఉండేవి ఏబీవీ పాఠశాల ఒకటి, మహబూబియా పాఠశాల ఒకటి! అందులో ఋషులవంటి ఉపాధ్యాయులు ఉండేవారు. బజారు హనుమంతరావు గారు మహబూబూబియా స్కూల్ కు హెడ్మాస్టర్.
Y K శాస్త్రి గారు ఏవి హైస్కూల్లో మానవ రూపంలో ఉన్న ఋషులు వాళ్ళు. ఈ స్కూల్ నుండి ఎందరో మహా మహులు తయారైనారు. కోవెల సుప్రసన్నాచార్య, సంపత్కుమార్యాచార్య , వంటి ఎందరో ఈ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పని చేశారు. అటువంటి వారి శిక్షణలో నాకు విద్యాగంధం అబ్బింది. సాహిత్య ఆసక్తులు కూడా వారి నుండే సంక్రమించాయి. కోవెల సుప్రసన్నాచార్య నాకు ప్రత్యక్ష గురువు కాదు! ఎందుకంటే నేను చదివింది ఇంజనీరింగ్…. అయినా నన్ను ఎంతగానో అభిమానిస్తారు. ఎందుకంటే? భావజాలం కానీ, సాహిత్య పరమైనటువంటి ఆసక్తి కానీ నాలో ఉండటమే కారణం. వారితో సన్నిహితంగా మెలగడం వల్ల ఇంకా లోతుల్లోకి వెళ్ళగలుగుతున్నాను. ఇలా చిన్నప్పటినుండి వరంగల్లో ఉన్న సాహితీకారులతో దగ్గర సంబంధాలు ఉండడం వల్ల సాహిత్యం మీద ఆసక్తి ఏర్పడింది.
అంతే కాదు ఏ పాఠశాలలో లేని సౌకర్యం ప్రాంతీయ గ్రంథాలయం మా పాఠశాలలో ఉండడం, అందులో 150 నుండి 200 పుస్తకాలు ఉండేవి. నేను క్లాస్ కు (monitor) గా ఉండడం, ఆ పుస్తకాలు నా ఆధీనంలో ఉండడం, నేను రిజిస్టర్ నిర్వహించే వాడిని. అది చాలా ఆనందంగా ఉండేది. ఎందుకంటే ఎన్ని పుస్తకాలు అయినా చదవవచ్చు… అని ఒక పెద్ద నిధి లభించిందని… సంబరం.
వరంగల్లో ఉన్న పేదవారు కాశిబుగ్గ మొదలైన ప్రాంతాలలో మగవారేమో ఆజంజాహీ మిల్లులో పనిచేసే వారు. ఆడవాళ్లేమో బీడీ పరిశ్రమలో పనిచేసేవారు అదే జీవనాధారం. అప్పుడు నిజాం ఆధీనంలో ఉన్నటువంటి ఏరియాలో ముస్లిం సంస్కృతి చాలా విస్తృతంగా ఉండేది. కానీ వైషమ్యాలు లేకపోయేవి. స్నేహభావంతోనే బంధువుల వలె కలిసి మెలిసి ఉండేవాళ్ళం. మా ఇంట్లో పనిమనిషి ఉండేవాడు. ఆయన నన్ను భుజం మీద కూర్చోబెట్టుకొని పాఠశాలకు తీసుకొని పోయేవాడు. ఆయనను షేక్ మామ అని పిలిచేవాడిని. పేరు షేక్ ఇమామ్ కానీ మా ఇంట్లో కలిసిపోయి షేక్ మామ అయ్యాడు. అప్పుడు లేని భేద భావాలు ఇప్పుడు ఎందుకు వచ్చాయి? ఇప్పుడు ఎలా అయిందంటే హైదరాబాద్ పాతబస్తీకి హిందువులు పోవాలంటే భయపడిపోతున్నారు. పోయినా, అవమాన పరుస్తున్నారు. ఈ ప్రాంతాలలో ఉన్నవారు ఉచితాలు పొంది ఒళ్ళు వంచి పని చేయడం లేదు. వలస వచ్చిన వారే చక్కగా పనిచేయడంతో వారినే పనిలో పెట్టుకోవడం వలసలు ఎక్కువైపోయినాయి. తెలవకుండానే సమాజంలో ఒక ఆక్రమణ వ్యాపిస్తున్నది. అలా సమాజాన్ని అల్లకల్లోలం చేస్తున్నాయి ఈ వలసలు.
మన చదువుకున్న కుటుంబాలలోని పిల్లలు బాగా చదువుకున్న వారు కూడా అంతస్తులు, స్థాయి పెంచుకోవడానికి విదేశాలకు ముఖ్యంగా అమెరికా వెళుతున్నారు. ఎందుకంటే మనం వలస బాధితులం… కనుక ప్రపంచమంతా ఇలా వలసల చేత సమాజానికేమీ ఉపయోగం లేకపోగా వైషమ్యాలు పెరుగుతున్నాయి. అక్కడ నివసించే పిల్లలు తల్లిదండ్రులను కూడా సరిగా చూడరు! బాధ్యత మీద వేసుకోవడానికి ఇష్టపడరు.
కానీ నేను నా పిల్లలను ఎక్కడ నివసిస్తే ఆ సమాజానికి ఎంతో కొంత సహాయం చేయాలని చెప్తాను!
అలా నా కూతురు అమెరికా ప్రభుత్వంలో ఒక భాగమై, తాను భారత పౌరురాలైనా తన సేవలను ఆ దేశపు ఉన్నతి కోసం ఉపయోగిస్తూ…. ఆ విధంగా ఆమె కూడా వృద్ధి పొందుతున్నది. చాలా కఠినతరమైన ఉద్యోగం అంటే ఆమె ఇక్కడికి వచ్చి ఏ ఆఫీసులో ఏ పనిచేసినా ఆ విషయం అక్కడ వారికి తెలుస్తుంది. అంత క్రమశిక్షణ ఉంటుంది. ముందు వెళ్లినవారు తమ పనులను బాధ్యతగా చేశారు.
ఇక్కడ ప్రశ్న ఏమిటంటే? నేనొక *వ్యాధి* అనే కథ రాసాను. విదేశాలకు పోవాలనే తల్లిదండ్రుల ప్రోద్బలం వల్ల కానీ, లేదా వాళ్ళకి ఇష్టం ఉండి కానీ వెళ్ళినా హానికరమైనదే! ఈ దేశంలో ఏమి తక్కువ లేదు! నేను ఆర్ఈసీ(R E C ) లో వరంగల్లో చదివినప్పుడు బెహరాన్ అనే దేశంలో పెద్ద పెట్రోలియం కంపెనీ ఆరాంకోలో ఉద్యోగం వచ్చింది. జీతం కూడా ఎక్కువ ఉండేది. కాంపస్ సెలెక్షన్ లో నాకు ఉద్యోగం వచ్చిందని, లెటర్ పట్టుకొని వచ్చి మా నాన్నకు సంతోషంగా చెప్పాను. అప్పుడు బి షిఫ్ట్ లో ఉండే అంటే 11 గంటలకు ఇంటికి వచ్చేవారు. అప్పుడు చెప్పిన ప్రపంచంలోనే చాలా పెద్ద పెట్రోలియం కంపెనీ అదట! తెలిసిన వారందరూ అదృష్టం అంత మంచి ఉద్యోగం వచ్చిందని అందరూ సంతోషపడితే… మా నాన్న కూడా బాగా సంతోషపడతాడు అనుకున్నాను. కానీ సంతోష పడలేదు! విచారంతో కంట్లో నీరు తీసుకున్నాడు. ఎందుకు నాన్నా? బాధపడుతున్నావని అడిగాను. అప్పుడు మా నాన్న ఇలా అన్నాడ.” నీవు R E Cలో చదివినావు అది జాతీయ కళాశాల! ఒక్క వరంగల్ స్వంతం కాదు! నిన్ను డిగ్రీ పూర్తి చేసేందుకు ప్రభుత్వం రెండు లక్షల రూపాయలు ఖర్చుపెట్టింది. రెండు లక్షలు పన్నుల రూపంలో పాలవాడు, పాన్ డబ్బా వాడు, పాకీవాడు ఇలా ప్రతి వాడు కట్టే వాళ్ల డబ్బుతో నువ్వు చదూవుకున్నావూ కదా! మరి నువ్వు చదువుకుని ఎదిగి బహరాన్ పోయి వేరే దేశానికి సేవ చేస్తానంటే ఈ దేశాన్ని ఎవరు బాగు చేస్తారు? అని అన్నాడు. ఆ మాటతో రాత్రంతా ఘర్షణ పడి, తెల్లవారి వెళ్లి నేను బెహరాన్ కంపెనీలో జాయిన్ కావడం లేదని నన్ను క్షమించండని ఆ ఉద్యోగాన్ని తిరస్కరించాను. అంటే తండ్రి కొడుకుల మధ్య సున్నితత్త్వం, సామాజిక వాతావరణం అంత అవగాహన ఉండేది! ఇప్పుడు లేదు! ఆ స్పృహే ఎవరికి లేదు. అంటే పెంపకం లోపమే! ఇప్పుడు తల్లిదండ్రులకు ఒక్క పిల్లవాడు లేదా ఇద్దరే కావడంతో గారాబం ఎక్కువై అడగకుండానే అన్ని సమకూర్చడంతో ఈ అతి గారాబం వల్ల పిల్లలు చెడిపోతున్నారు. విలువలు నేర్చుకోవడం లేదు ! వీటిమీద చాలా కథలు రాసిన. అందరూ నన్ను ప్రేమకథలు ఎందుకు రాయరు సార్ ? అని అడుగుతారు. మనమేమో యుద్దభూమిలో ఉన్నట్టు జీవన పోరాటం చేస్తున్నాము. అడుగడుగునా ఈ కష్టాల గురించి రాయకుండా వేరే అంశాలు రాయడానికి అక్కడ జాగా లేదు. బయట ప్రపంచంలో… సినిమాలలో… టీవీలలో… నిజజీవితంలో ప్రతి చోట ప్రేమలు -విఫలాలు, పెళ్లిళ్లు అవే నడుస్తున్నాయి కదా? మళ్ళా నేను ఎందుకు రాయాలి? అని అంటాను.
పద్మజ:—మీరు,రాసిన ఈ కథల వెనుక ఎంతో దుఃఖము ఉంటుంది. కరుణరసంతో సాగుతుంది మన ప్రమేయం లేకుండానే కంటి వెంట కన్నీరు రాలుతుంది. ఒక కన్నీటి చుక్క రాలని కథ అంటూ ఉండదు ఇలా ఎన్ని ఇతివృత్తాలు ఎలా సాధ్యమైంది?
మౌళి:— చాలా మంది ఇదే విషయం అడిగారు. వందల కొద్ది కథలు రాశాను. అన్నిటా వేదననే ఎక్కువగా ఉంటుంది వేరే సబ్జెక్ట్ ఎందుకు తీసుకోరు? అని అడిగారు. అంటే వందల కథలు రాయవలసినంత వస్తువు, దుఃఖపూరితమైన కథా వస్తువు ఈ నేల మీద ఉన్నది. ఇక్కడ ఉన్న జనంలో ఉన్నది. అది ఎప్పటికప్పుడు ప్రజ్వరిల్లుతూనే ఉంటుంది. మనం గ్రహించడం లేదు! ఎందుకంటే నీతిగా- నిజాయితీగా బతకడం అంటే ఈ సమాజంలో చాలా కష్టంగా ఉంది. వాటిని వదిలి బతకలేము! వాటిని భరించలేని పరిస్థితులున్నాయి. రానురాను బాగు పడుతుందేమో? అని అనుకుంటే వయసు గడిచిన కొద్దీ ఆశలు సన్నగిల్లుతున్నాయి. జాతీయ ఉద్యమప్పుడు దేశాన్ని పాలించిన వారే తప్పటడుగులు వేశారు. ఎవరికిష్టం లేకున్నా పాలకులయ్యారు. అక్కడ పలపక్షం- ప్రేమ- ఇలా ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి.
యువకులే పాలించాలి! ఎందుకంటే కొత్త రక్తంలో ఎన్నో ఆశయాలు ఉంటాయి కొత్త ఆలోచనలతో దేశాన్ని చక్కగా నడిపిస్తారని యంగ్ఇండియా పాలసీ( Yung India policy) అని యువ భారతం రావాలని ఒక తీర్మానం చేశారు. దాని ప్రకారం పాలకులను నియమించాడు గాంధీ. ఒకవేళ పటేల్ అప్పుడు ప్రధాని అయితే ఈ దేశం తీరుతెన్నులే మారేవి! మన దేశంలో 560 సంస్థానాలు ఉండేవి. హిందువులవి, ముస్లింలవి, రాజస్థాన్లో పఠాన్లవి, వీళ్ళు ఎంత వరకు వ్యాపించారంటే? భారతదేశంలో 45% భూమిని వాళ్లే ఆక్రమించారు. భూములన్నీ సంస్థానాల కిందనే ఉండేవి. కట్టుబానిస వ్యవస్థగా రూపుదిద్దుకున్నది. అంటే స్వంత భూములు లేకపోయేవి! అందులో నుండే దుఃఖపూరిత నేపథ్యం అనే కథలు వచ్చాయి. ఎన్ని ఒడిదుడుకులున్నా కానీ, నేల యొక్క స్వాభావిక స్వభావం ఏదైతే ఉన్నదో? భూమి వలె *నువ్వు నన్ను నాగలితో దున్ని గాయపరచు*
*నేను నీకు ఆహారాన్ని ఇస్తాను కొడకా*! అనే తత్త్వం ప్రకారమే అభివృద్ధి చెందుతున్నది.
తెలంగాణ రక్తంలో ఎవరైనా ఏదైనా కానుక ఇస్తే.. ఎందుకు ఇస్తున్నావు? అని అడుగుతారు! అంటే తీసుకో అన్నారనుకో! నేనేమైనా బిచ్చగాడినా? అని అంటాడు. అంత రోషం ఉంటుంది ఈ నేలలో ఉందంటే మనకది గర్వకారణం.

పద్మజ:– మీ నవలల గురించి వివరించండి! మీ తొలి రచన ఎప్పుడు చేసారు?
మౌళి :—36 నవలలు రాశాను ఈ వరంగల్లో నవీన్ గారి దరిదాపుల్లో ఉన్నాను. 400 కథలు రాశాను. నేను 9వ తరగతి చదువుతున్నప్పుడు నా మొదటి కథ చందమామలో ప్రింట్ అయింది. అప్పుడు చందమామ ధర పావలా ఉండేది. ఆ పావలా నా దగ్గర ఉండకపోయేది. నా పక్క సీట్లో పురుషోత్తమ్ అని నా స్నేహితుడు ఉండేవాడు. వాడి తండ్రి డాక్టర్ కనుక డబ్బున్న వాళ్ళే! అతను లంచ్ టైంలో వెళ్లి మా నాయన చందమామ తెచ్చిండు… అందులో నీ పేరు ఉన్నదిరా! అన్నాడు వాడు. ఏదీ చూస్తాను తీసుకొని రమ్మంటే… మళ్ళీ పోతే సార్ కొడతాడు అన్నాడు. “ఏం కాదు పో! ” అన్నా! కొడితే కొట్టనీ అని వాడు పోయి చందమామ తెచ్చిండు. వెనుక కూర్చొని చూస్తున్నం… అచ్చులో నా పేరు చూసుకొని చాల సంబరమైంది. అప్పుడు మా రాఘవరెడ్డి సార్ కోపంగా చూసి అరేయ్! పాఠం చెప్తుంటే ఏంచేస్తున్నరు? ఏం మాట్లాడుతున్నారు? అనగానే చందమామలో వీడి కథ పడింది సార్! అని అన్నాడు పురుషోత్తం. ఏందిరా! చందమామలో వీడి కథనా? ఏదీ చూపించు! అనగానే గజగజ వణుకుతూ నిలబడ్డాను!
అరేయ్ నువ్వే రాసినావురా?ఏదీ కథ పేరు చెప్పు!
అనగానే కథ పేరు *సువర్ణ శతదళపుష్ప రహస్యం* అని కథ పేరు చెప్పిన.
భాష మీద చాలా మక్కువ ఎక్కువ కనుక అలా పేరు పెట్టాను. అందులో నేను చెప్పిన కథనే ఉంది. నేనే రాసిన అని నిర్ధారించుకున్నాడు సార్ . ఆయన చదివి నావైపుకు ప్రేమగా చూసి రా! రా! అని నన్ను భుజం పట్టుకొని, చివరి బెంచి ఖాళీగా ఉంటే దానిమీద నిలబెట్టిండు. భయపడుతూ నేను మనసులో ఇగ కొడతాడు రా! భయ్! అనుకున్నా… కానీ ఆయన ముందు నేను చిన్నగా ఉన్నందున బెంచి మీద నిలబెట్టి, నన్ను ప్రేమగా బిగుతుగా కౌగిలించుకున్నాడు. అరేయ్ నీకు మంచి భవిష్యత్తు ఉంది రా! చంద్రమౌళీ! అని అన్నాడు. నీకు సరస్వతీ కటాక్షం ఉంది! బిడ్డా కొనసాగించు! ఆపకు అన్నాడు. ఇటువంటి అనుభవాలు చాలా ఉన్నాయి. అరటి పండ్లు అమ్మేవాడు వచ్చిండు. నేను రోజు ఆయన దగ్గర పండ్లు కొంటాను. అరటి పండ్లు కట్టే పేపర్లో నా ఫోటో కనపడిందట. ఈ సార్ నా దగ్గర పండ్లు కొంటాడని ఆ పేపర్లో కట్టి ఇవ్వకుండా, పక్కకు పెట్టి గిరాకీ లేనప్పుడు అది చదివిండట… చదివి ఆ మూలకు బండి ఆపి నా దగ్గరకు వచ్చి కాళ్లు మొక్కిండు. అతనికి ఆ కథలో ఏం అర్థమైందో? తెలియదు! ఇలాంటివి జరిగినప్పుడు ఒళ్ళు పులకరిస్తుంది.
450 కథలు 18 వాల్యూమ్ లు కవితలు, విమర్శ గ్రంథాలు, వ్యాసాలు, ఎన్నో ఉన్నాయి. అంత వస్తువు… అటువంటి జీవిత శకలాలు నాకు రోజూ కనపడుతున్నాయి. రచయితలకు మనసులో బాధ ఉంటే పాఠకులతో పంచుకునే దాక లోపల మండుతూనే ఉంటుంది. రాసాక ఫ్రీ అయిపోతాము. కాబట్టి అదే సృజనగా బయటకు వచ్చింది.
పద్మజ:— ఇటువంటి ఉపాధ్యాయ జీవితాన్ని జీవించడం వల్ల ఎటువంటి అనుభూతి కలుగుతుంది?మయూఖ పాఠకులకు మీ విద్యా- ఉద్యోగ విశేషాలు చెప్పండి!
మౌళి:— సమాజానికి ఉపయోగకరమైన పని నేను చేస్తున్నాను అని చాలా గర్వంగా ఉంటుంది. ఇంజనీరింగ్ విద్యార్థులకు నేను టీచర్ గా గొప్ప క్యారెక్టర్ ను. 99లోరాష్ట్రపతి అవార్డు విన్నర్ ను. 36 సంవత్సరాలు పాలిటెక్నిక్ కాలేజీకి ప్రిన్సిపాల్ గా పని చేశాను. తర్వాత 13 సంవత్సరాలు ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలో ప్రిన్సిపాల్ గా పని చేశాను. మొత్తం కలిసి 50 సంవత్సరాల అధ్యాపక జీవితం. ఎందుకు ? ఈ అధ్యాపక వృత్తిలోకి వచ్చానంటే …. చాలా మంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఉద్యోగం చేస్తారు. వాళ్ళకు ఆ ఉద్యోగాలు ఎలా వచ్చాయంటే? ఎవరికి వారు కోరిన ఉద్యోగం దొరకదు… ఏది దొరుకుతే అది చేస్తూ పోతున్నారు. 90% ఇలాగే ఉంటుంది. నా విషయంలో మొట్టమొదట ఆరాంకో ఉద్యోగం వద్దనుకున్న తర్వాత భిలాయి ఉక్కు కర్మాగారం మధ్యప్రదేశ్లో దుర్గ్ అనే జిల్లాలో ఉంటుంది. అక్కడ ఉద్యోగం చేసిన!
అక్కడ దాదాపు భారతదేశంలోని అన్ని ప్రాంతాల వారితో కలిసి, అన్ని సంస్కృతులతో కలిసి ఉండే సమిష్టి సమాజం ఉంటుంది. చాలా బాగా ఉండేది! కానీ , నా అంతరాత్మ ఒకటే గోల *ఇది! నువ్వు చేసే పని* *కాదు! వేరే ఉంది*! అని ఎందుకని నన్ను నేను ప్రశ్నించుకుంటే? నేను చేసేది చార్జ్మెన్ అనే ఉద్యోగం. అందులో పై స్థాయికి వెళ్లే అవకాశం చాలా ఉండేది. దాంతో నా అంతస్తు ( States)పెరుగుతుంది…. కానీ సమాజానికి ఏం వస్తుంది? ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించి బోధనా వృత్తి ఒకటే సమాజానికి సేవ చేసే అవకాశం ఉన్నదని, ఒక తరాన్ని ప్రభావితం చేస్తే దాంతో సమాజాన్ని ఇంకా ప్రభావితం చేసి అలా తరాలను తయారు చేసేటటువంటి వృత్తికే ఉంటుంది. కాబట్టి అదే ఉద్యోగం చేస్తాను అని గట్టిగా నిర్ణయించుకొని నాకు నచ్చిన ఉద్యోగం పీ.వీ నరసింహారావు గారి ద్వారా వచ్చింది. లేబరేటరీ ఇన్చార్జిగా ఉన్నా వాణ్ణి డిమాన్ స్టేటర్ అంటారు. అందులో చేరాను. అలా పిల్లలకు పాఠం చెప్పా అవకాశం దొరికింది. అలా అంచెలంచలుగా ఎదిగి ప్రిన్సిపాల్ అయ్యాను. ఆ క్రమంలో పాఠ్యాంశాల పుస్తకాలు రాశాను. వీటి వల్ల బెస్ట్ టీచర్ అవార్డు వచ్చింది. జాతీయ స్థాయిలో కే ఆర్ నారాయణన్ ఇచ్చారు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా అవార్డు ఇచ్చింది. చంద్రబాబు నాయుడు గారి చేతులమీదుగా అందుకున్నాను.
పద్మజ:–మీ ఇతర రచనల విశేషాలు, *కాలనాళిక* ఏ అంశంపై రాసారు?
మౌళి :— తెలంగాణ చరిత్ర రాసాను.ఎందుకంటే? మనం ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమం చేసి దాని ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఈ నేపథ్యంలో తెలంగాణ చరిత్రని రాయాలనుకొని 1947 నుండి 2017 వరకు సాగింది ఈ నవల. అదే *కాలనాళిక* తెలంగాణ సామాజిక చరిత్ర కథాకృతి. తెలంగాణ నేపథ్యంలో ప్రజల సమీప విముక్తా పోరాట చరిత్రను వస్తువుగా తీసుకొని ఎన్నెన్నో ప్రతిఘటన ఉద్యమ ఘట్టాలను, ఘటనలను ఈ తరానికి తెలియజేస్తూ నిజాం కాలంనాటి రజాకార్ల, జమీందారుల, దొరల దేశ్ ముఖుల, దోపిడీని అక్షరబద్ధం చేస్తూ ప్రపంచ ప్రసిద్ధి చెందిన చారిత్రాత్మక తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం బైరాంపల్లి ఘటన, కమ్యూనిస్టుల ప్రజా పోరాటం, ఆంధ్ర మహాసభ ప్రతిఘటన, సాయుధ తిరుగుబాటు, 4500 మంది ప్రాణ త్యాగాలు, పోలీసు యాక్షన్, ప్రజల ఊచ కోత, భారత స్వాతంత్రం తర్వాత తెలంగాణ నిప్పుల కొలువై, సెప్టెంబర్ 17న 1948లో విముక్తం కావడం, కాంగ్రెస్ అవతరణ, ఆంధ్రుల దోపిడి, 1969 లో తొలి దశ తెలంగాణ ఉద్యమం, కుట్రలు ఉద్యమాన్ని అణిచివేత, సృజనా ద్రోహం,
369 మంది అమరులవ్వడం, తెలుగుదేశం ప్రభుత్వ నిశ్శబ్దకుట్ర, శాసనసభలో తెలంగాణ పదాన్ని కూడా ఉచ్చరించని పరిస్థితులు, దమన కాండ, 2001 నుండి మలిదశ తెలంగాణ అవిముక్త పోరాటం, 14 ఏళ్ల నిరంతర అహింసాత్మక ఉద్యమ ప్రభంజనం, అంతిమంగా తెలంగాణ రాష్ట్ర సాధన ఇదంతా ఒక సుదీర్ఘ గర్జనతో సాగిన కల్లోల వర్తమాన చరిత్ర. 1934 నుండి 2017 మార్చ్ వరకు ఇందులో అన్నీ సజీవ పాత్రలు కాళోజీ, జయశంకర్, కెసిఆర్ ఎందరో ఉన్నారు. ఎంతో పరిశోధించి తేదీలతో సహా అతి జాగ్రత్తగా రాసిన జరుగుతున్న చరిత్ర. ఈ నవల ఎక్కడ చిన్న తప్పు దొర్లినా విమర్శకులు ఈ సజీవ పాత్రలు తప్పులను లెక్కిస్తారు. ఇటువంటి సాహసోపేతమైన కథ వస్తువుతో వాస్తవిక కల్పనకు- వృత్తాంత్తాన్ని తీసుకొని ఇంతవరకు ఎవరూ రాయని నవల ఇది! అందుకే విజ్ఞులైన విమర్శకులు దీనిని ఇతిహాసం అని అంటున్నారు. గత దశాబ్దాల బీభత్సకర విరోచిత తెలంగాణ విముక్తి పోరాట చరిత్రను భావితరాలకు తెలియజేయడమే ఈ నవల యొక్క ఉద్దేశం. ఇందులో మొదటి ముఖ్య మంత్రి నుండి మొన్నటి వరకు ముఖ్యమంత్రుల వరకూ రాసాను.
పద్మజ:— ఈ కాలనాళిక వరంగల్ నగరానికి సంబంధించిన చారిత్రక కథాత్మక నవల. గతించిన కాలపు సామాజిక, రాజకీయ, సంఘటనలను ఏర్చి కూర్చి రాయడమంటే మాటలు కాదు!
ముఖ్యంగా నైజాం ప్రభువు చేసిన అకృత్యాలు అన్నీ, రజాకార్ల రాక్షసత్వాన్ని, వీటికి ఎదురు నిలిచిన పోరాడిన కమ్యూనిస్టుల కార్యకలాపాలను, సాయుధ రైతాంగ పోరాటాన్ని,అలాగే ఇటీవల జరిగిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని కళ్ళకు కట్టినట్టు రాయడం ఆషామాషీ వ్యవహారం కాదు! దీనికి వీరి కథాత్మక ప్రణాళిక మూడు కుటుంబాల జీవిత విశేషాలు జతచేస్తూ రాసిన వైనం అద్భుతం.
పద్మజ :—- మీరు కొంతకాలం నడిపిన వార్షిక విశేషాలు మయూఖ పాఠకులతో పంచుకోండి!
మౌళి:— మనం ఈతరం రచయితలను ప్రేరేపించగలగాలి! కొన్ని పనులు చేసాము. 2004లో *కవితా వార్షిక* అనే ఒక వచన కవిత్వంలో మేలైన కవిత్వాన్ని ఎంపిక చేసి ఒక సంపుటిగా వేయడం చేసాను. చాలా ఖరీదైనది అంతర్జాతీయ స్థాయిలో పుస్తకాన్ని వేసాము. శ్రమతో కూడిన పని. సారంగ వంటి ఆన్లైన్ పత్రికను నడిపాము. దాని వెనుక ఒక టీం కృషి ఉంది. దానికో సంపాదక వర్గాన్ని ఏర్పాటుచేసి, నేను ప్రధాన సంపాదకుడిగా, అంపశయ్య నవీన్ గారు గౌరవ సంపాదకులుగా… ఇంకా సంపాదక వర్గంలో నెల్లుట్ల రమాదేవి గారు, ఎస్ఆర్ ప్రసాద్ గారు, పొట్లపల్లి శ్రీనివాసరావు గారు, విఆర్ విద్యార్థి వీరంతా సంపాద వర్గ సహచరులు. ఇలా అందరం మేమే డబ్బులు ఖర్చులు భరించి అద్భుతంగా నిర్వహించాము. అలా చేస్తూ చేస్తూ ఎంత దూరం వచ్చిందంటే? కవిత వార్షిక వచ్చే నెలలో ఆవిష్కరణ జరుగుతున్నది. ఈ సంచికలోఅరవై -డెబ్బై కవులను ఎంపిక చేసి, ఆంధ్రజ్యోతిలోని వివిధ అనే సాహిత్యపుటలో అచ్చు వేసేవాళ్ళం. ఆజాబితాలో పేరు కనపడితే కవులకు ఎంత ఆనందమో? పేరు రాకుంటే బాధపడేవారు
అలా పది సంవత్సరాలు నిర్వహించాము. సంస్థ నడవాలంటే టీం వర్క్ చేయాలి! ఎన్నో కారణాలవల్ల కవితా వార్షిక ఆపేయవలసి వచ్చింది. 2010 వరకు వచ్చింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే? ఉత్తమమైన కవిత్వాన్ని కూడా మనం గుర్తించి, అభివృద్ధి పరచి, గౌరవించి ఆ రీతిలో మంచి కవిత్వాన్ని రాయదగ్గ తరాన్ని తయారు చేయాలి!ఆ ఆకాంక్షతో బాగా నిబద్ధతతో పనిచేశాము! కానీ కొనసాగలేదు నెల్లుట్ల రమాదేవి చాలా డైనమిక్ పాత్ర వహించింది.ఒక మహిళా సంపాదకురాలుగా చాలా సేవ చేసింది. మంచి వ్యక్తి ఆమె.
పద్మజ:—-కవితాభిమానులు మీ *కిటికీ తెరిచిన* తర్వాత* కవితా సంపుటి గురించే మాట్లాడుకుంటారు. దాని విశేషాలు చెప్పండి!
మౌళి:— పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2006లో ఈ *కిటికీ తెరిచిన తర్వాత* పుస్తకానికి పురస్కార ప్రదానంచేసారు. 2009లో సినారె అవార్డు వచ్చింది. కరీంనగర్లో *గౌతమి* అనే సాహిత్య సంస్థ ఉంది దాని ద్వారా విజయేందర్ రెడ్డి అనే డాక్టర్ గారు 10, 116 రూపాయలు బహుకరించారు.అది నారాయణ రెడ్డిగారి స్వహస్తారతో అందించారు.అది రావడం చాలా గర్వ కారణం.
నాకు సాహిత్యంతో సంబంధం ఉన్న వాళ్ళు ఎవరంటే సంబంధం అంపశయ్య నవీన్ గారు, నేరెళ్ల వేణు మాధవ్ గారు. ఆ సభలో సినారే ఏమన్నారంటే *వీడు చాలా చిత్రమైన కవి అండి! ఇతని పేరు చూపెట్టకుండా ఒక పది పదిహేను వరుసలు చదవమని వారిని ఎవరు రాసారంటే? పాఠకులు ఠక్కున రామాచంద్ర మౌళి గారిదని చెప్తారు. అలా గుర్తుపట్టేలా స్వంత స్వరమున్నది*
ఇంత మంచి కవి నా శిష్యుడు ఎందుకు కాలేదంటే? నేను గమనించింది వీడు ఒక ఇంజనీరు. తెలుగు చదువుకోలేదు కాబట్టి నా శిష్యుడు కాలేదు అన్నారు. ఒక తల్లికి ప్రజ్ఞ కలవాడిని చూస్తే “వీడు నా కొడుకు అయితే మంచిగుండు”అని అనుకుంటుంది. మాతృహృదయంతో నా శిష్యుడు కాలేదని తపిస్తున్నాను అని అన్నారు.
పద్మజ:– మీ కథలలో మీదైన ముద్ర ఉంటుంది. ఉదాహరణకు కథలలో ప్రతీకలు వ్యవసాయ సంబంధించిన, లేక కష్టజీవుల బాధతో కూడిన ఉపమానాలను వాడుతారు. దాంతో వెంటనే గుర్తుపట్ట వస్తుంది. నేను నవ్య దినపత్రిక దీపావళి ప్రత్యేక సంచికలో దుఃఖాగ్ని కథను చదివినప్పుడు కింద నేను పేరు చూడలేదు! అంతా చదివిన తర్వాత రామచంద్రమౌళి సార్ కథ వలె ఉన్నది అని కింద పేరు చూస్తే అది మీదే! అలా ఉంటుంది మీ సృజన.
మౌళి :— ఒక్కోసారి అనపిస్తుంది. సృజన అనేది ముఖ్యంగా కవిత్వం రాసినప్పుడు ఎక్కువ అనిపిస్తుంది. ఎక్కువగా రాత్రి పూట రాస్తాను. తెల్లవారి నేను రాత్రి రాసిన కవితను చూస్తే నేను రాసిందేనా? అని అనిపిస్తుంది. ఒక అజ్ఞాత శక్తి మనల్ని ఇలా చేయిస్తుందేమో? అనిపిస్తుంది. ఒక రకమైన దైవ బలం ఉంటుంది. నాకు ఇండియా గవర్నమెంట్ మినిస్టర్ ఆఫ్ కల్చర్ వారు నాకు *సీనియర్ ఫెలోషిప్* ఇవ్వాలని ఒక ప్రతిపాదన పంపారు. అంటే భారతీయ సంస్కృతీ- సంప్రదాయాలు, పురాణ సాహిత్యం, వేదాలు, ఉపనిషత్తులు, వాటిని కూడా కలుపుకొని అంటే ఇంకా భూమిని తాకనివి ఏమైనా ఉంటే వాటి మీద పరిశోధన 36 నెలలు చేస్తే మీకు ఫెలోషిప్ ఇస్తామన్నారు. రేపటి తరానికి కొత్త అంశాలు పరిచయం చేయండి! అని అడిగారు? నేను ఒక ప్రపోజల్ పంపాను. వాళ్లకు. అది వారు అంగీకరిస్తే దాన్ని రాస్తాను. దీనిలో ఏముందంటే ఒక భారతీయ చింతనలోనే జీవులకున్న జీవం అంటే ప్రాణం ఎక్కడుంది? అంటే మనం చూపించలేము! ఊపిరి ఎక్కడ ఉందంటే చెప్పలేము! ఏదో ఒక శక్తి అంతర్లీనంగా నడుస్తున్నది. దాన్నే మనం జీవం అంటాము, ప్రాణం అంటాము, ఆత్మ అని అంటాము, ఇంకేదో అని అంటాము…
పద్మజ:— కథా రచయిత అనగానే మొదటి వరుసలో మీ పేరు వినపడుతుంది.కనుక *నిర్వాణ* కథల సంపుటి గురించి రెండు మాటలు పంచుకోండి!
మౌళి :— రచయితగాని ఏ వృత్తిలో ఉన్నవారైనా ఆరంభ దశలో ఉన్నటువంటి ప్రతిభ కంటే పోను పోను అనుభవం వల్ల పరిపక్వత సాధించగలుగుతారు. పరిణితి చెందడం వల్ల ఆ రచనలు అదనపు శోభ సంతరించుకుంటుంది. మొదట నేను రాసిన చందమామ కథకు ఈ నిర్వాణ రచనలో చాలా తేడా కనపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు జీవితపు లోతులు తెలిసాయి! ఇంత వయసు వచ్చిందంటే రెండు మూడు జీవితాలను జీవించాను. అయితే ఈ పరిణిత దశలో రాసిన కథలు కాబట్టి దానిలో పరిపూర్ణత వచ్చింది. ఈ కథ ఏమిటంటే? ఒక ముసలతను డాక్టర్ మానసిక నిపుణుడైనదగ్గరకు వెళ్ళి తన నంబర్(1) రాయిస్తాడు. డాక్టర్ ఒకటో నెంబర్ ని పిలుస్తాడు, కానీ అతను వెళ్ళడు. రెండు, మూడు ,నెంబర్ల వాళ్ళు వస్తారు ఒకటో నెంబర్ అతను అలాగే కూర్చుని ఉంటాడు. ఎందుకు రావడం లేదు? అని అనుకుంటే చివరగా వస్తాడు. డాక్టర్ అతనిని నీ సమస్య ఏమిటని అడుగుతాడు. అడిగితే *నేను మనుషులను* *ప్రేమించలేకపోతున్నాను* అంటాడు ఒకటో నెంబర్ రోగి. ఏమిటి మళ్ళీ చెప్పు! అని అడుగుతాడు డాక్టరు. నేను మనిషిని ప్రేమించలేకపోతున్నాను. అంటాడు రోగి ! మీకు ఎలా తెలుస్తున్నది? అని అడిగాడు డాక్టర్. ఇదివరకు నాకు ప్రేమించిన అనుభవం ఉంది కదా! ఆ అనుభవం ఇప్పుడు లేదు…. కాబట్టి ప్రేమించలేకపోతున్నాను అంటాడు. ఇలా మొదలవుతుంది ఈ కథ ఎన్నో భాషల్లోకి అనువదించబడ్డాయి. నిర్వాణకు ఎన్నో అవార్డులు వచ్చాయి. ఇది మనసులోపలి కార్యం.
నిర్వాణ అనే కథ మరొకటి ఉంది. అది కూడా అసాధారణమైన కథ! మనిషికి ఒక స్టేజికి పోయిన తర్వాత డబ్బు, హోదా, పరువు- ప్రతిష్ట, ఇలా అన్నీ వస్తాయి. ఒకతనికి అంతర్జాతీయ ఖ్యాతి వస్తుంది. అతను ఒక్కడే ఉంటాడు. భార్య చనిపోయింది.
ఒక కొడుకు ఉంటాడు కానీ అతను అంతర్జాతీయ ప్రతిభాశాలి !లండన్ లో ఉంటాడు. తండ్రి భారతదేశంలో ఉంటాడు. పదవీ విరమణ పొంది వృద్ధుడు అవుతాడు. తండ్రి మంచాన కదలలేని పరిస్థితిలో ఉంటాడు. కొడుకు ఉద్యోగం వదిలిపెట్టి తండ్రిని చూసుకోవడానికి రాలేని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అతని అవసరం ఆ సమాజానికి ఉంటుంది. ఏం చేస్తాడంటే తండ్రికి ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తాడు! మంచి ఇల్లు ఆటోమేటిక్ గా అన్ని పనులు జరిగేలా మిషన్లు తయారు చేయించి, రిమోట్ ద్వారా ఏర్పాటు చేస్తాడు. కదలలేని రోగి కూడా రిమోట్ ద్వారా తెరవవచ్చు- మూయవచ్చు! బయట జోరున వర్షం కురుస్తున్నది. ఈయన కనుగొన్న మందులకు పేటెంట్ హక్కులుంటాయి. అతనికి వాటికి కోట్ల రూపాయలు వస్తాయి. డబ్బు సమస్య లేదు. ఆరోగ్యం మాత్రం చెడిపోయింది. చివరి దశలో ఉన్నాడు. ఆకలి అవుతున్నది. అతని దగ్గర ఉండే నర్సు స్వంత పని మీద ఊరు వెళ్ళిపోయింది. ఆమెకు బదులుగా మరో నర్స్ ను ఆమె పెట్టిపోయింది ఆమె సక్రమంగా పని చేసే రకం కాదు! డ్యూటీ కి రాదు. ఈ రోగి చాలా కష్టంతో స్విగ్వి అనే కంపెనీకి పెరుగన్నం ఆర్డర్ పెడతాడు. దానికోసం ఎదురు చూస్తుంటాడు. ఇలా కథ ప్రారంభమవుతుంది. గంట తర్వాత బెల్ డోర్ మోగితే రిమోట్ సాయంతో తలుపు తీస్తాడు వృద్ధుడు.
ఒక యువతి 25 -37ల మధ్య వయసు ఉన్న అమ్మాయి వచ్చి *సిగ్వి* డెలివరీ గర్ల్ అన్న మాట అతని దగ్గరకు వచ్చి చూస్తే దయనీయంగా ఉన్న అతన్ని చూసి ఆశ్చర్య పోతుంది. బాధపడుతుంది. అలా ఊహించలేదు డబ్బా ఇచ్చి పోవాలనుకుంటుంది. కానీ అతన్ని చూసి ఎంతో గౌరవంతో, ఎనలేని ఆదరణతో ఒక వేళ ఈయనే నా తండ్రి కనక అయితే ఏం చేసేదాన్ని? అని అనుకోని ఈయనకు కావలసిన సహాయం చేస్తానని అతనితో మాట్లాడుతూ కాస్త ఆయన సామాన్లు సర్దుతుంది… మీరు ఏమనుకుంటే నేను తెచ్చిన పెరుగన్నం నీకు తినిపించనా? అని అడుగుతుంది. అంతకన్నా అదృష్టం ఏమున్నది? అన్నట్టు చూస్తాడు. అతనికి తినిపిస్తుంది. ఏమైనా స్పర్శ అనేది ఎంత మహత్తరంగ ఉంటుందనేది చెప్పేదే నిర్వాణ కథ!
నేను కూడా నీకు ఒకసాయం చేస్తా అంటాడు. ఏమిటనట్టు చూస్తుంది. ఆలమర రిమోట్ తో ఓపెన్ చేసి అరోలో డబ్బా ఉన్నది తీసుకో అంటాడు. ఆ డబ్బాలో రూపాయల నోట్ల కట్టలుంటాయా? నీకు ఎంత కావాలో తీసుకో! అంటాడు. ఆమె డబ్బు తిరిగి యధా స్థానంలో పెడుతుంది. ఇంకొక డబ్బాను తీయమంటాడు. అందులో చెక్ బుక్ లు, ఇంకో ఆరలో భగవద్గీత పుస్తకం ఉన్నాయి. వాటిని తీసిచూసి మళ్ళీ అరలో పెడుతుంది. ఏమీ తీసుకోకుండానే అతని కుర్చీ దగ్గరకు వస్తుంది. నాలుగవ అరలో ఒక పుస్తకం ఉంటుంది. అదితెచ్చింది. దాని తెరువు అంటాడు! అదొక ఇంగ్లీష్ నవల! Empty dye అని ఉంటుంది. అర్థం ఏమిటంటే చనిపోయే ముందు ఖాళీ అవాలని… ఖాళీ కావడం అనేది అంత తేలిక కాదు! నేను ఖాళీ కావాలి దయచేసి నువ్వు ఇవన్నీ తీసుకొని పో! అంటాడు. ఆమె ఓ క్షణం చూసి లేదు సార్! అని తన బ్యాగులో నుండి ఒక బుక్ తీసి చూపిస్తుంది. అది కూడా Empty before Die .
నేను పని కోదల్చుకోలేదు అని వినయంగా పుస్తకం అలమరలో పెట్టి కళ్ళ వెంట నీరు కారుతుంటే బయటకు వెళ్ళిపోతుంది ఇది నిర్వాణ. ఇలాంటివి 21 కథలు ఈ సంపుటిలో ఉన్నాయి.
వీలైతే మీకిష్టమైన ఓ కవిత వినిపిస్తారా?
మౌళి:– అలాగే
పద్మజ:— దూరదర్శన్ టెలిఫిల్మ్ *స్వర్ణ నంది* పొందిన కథ
పద్మజ :—- *భూమి దుఃఖం* నిజంగా జరిగిన నిజంగా జరిగిన కథనా?
మౌళి :— లేదు! ఊహించి రాశాను. హైదరాబాదు చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు, ఆర్ఆర్ ఏమీ లేనప్పుడు నాకు హైదరాబాద్ తో పరిచయం ఉన్నప్పుడు చూస్తే ఇవన్నీ కుగ్రామాలు.హైదరాబాద్ చుట్టూ ఉండేవి. కోకాపేట చిన్న హామ్లెట్! నార్సింగ్ అనేది విమానాశ్రయం దగ్గరే చిన్న ఊరు.మహేశ్వరం చిన్న ఊరు. కేశంపేట ఆది చిన్నదే! కొండాపూర్ గుట్టలలో, బోళ్లలో ఉండేది. రోడ్డు లేదు !ప్రయాణం చాలా కష్టం. ఫ్రీగా ఇచ్చినా తీసుకోని ఈ భూమి ఇప్పుడు వంద కోట్లు ఎకరానికి కొంటున్నారు. ఎకరం వందేమిటి? ఏం చేస్తారు? అని ఆశ్చర్య పోవడం మన వంతు టాటా వాళ్ళు ఎకరానికి 25 కోట్లు పెట్టికొని, దాని చుట్టూ విలువైన మైక్రోసాఫ్ట్ అనే కంపెనీ అక్కడ స్థాపించారు. అక్కడే గూగుల్ సంస్థ కూడా నిలిపారు. ఇలాంటి ప్రపంచ స్థాయి కంపెనీలు రావడంతో దాని విలువను పెంచి, సాధారణ వ్యక్తులకు అందకుండా ఆకాశానికి తీసుకొని పోయారు. జీవితం వ్యాపారంగా మారింది. ఆ క్రమంలో ఇద్దరు కొడుకులు వచ్చి తండ్రితో ఊర్లో ఎవరో పెద్ద వ్యాపారవేత్త వచ్చి మన ఊరి భూములన్ని కొంటున్నారు…. కొనడం కూడా అయిపోయింది . మన ఒక్కటే పొలం ఉన్నది. ఇది కూడా అమ్మమ్మని నా వెంట పడుతున్నారు… అంటే *భూమిని అమ్మడం ఏందిరా*? *నమ్ముకోవాలి* కానీ అంటాడు తండ్రి అలా కథ మొదలవుతుంది. చాయ గుడిసెలు పెద్ద హోటల్ అయిపోయింది. కార్లు,మోటార్ సైకిళ్ళు వచ్చినాయి. ఈ మార్పు అంత ఏంది? అసలు అని మొదలవుతుంది… చివరకు కొడుకు తండ్రి కిష్టం లేకుండా పొలం అమ్మి మారుతి కారు కొనుక్కొని డిక్కి నిండా డబ్బులు నోట్ల కట్టలతో వస్తాడు. తమ్ముడు పట్నంలో ఉంటాడు. కూల్ డ్రింక్ సీసాలు, మిఠాయిలు కొని తెస్తాడు. తల్లిదండ్రులుదిగాలుగా కూర్చొని ఇదంతా చూస్తుంటారు.
తమ్ముడికి వాటా ఇవ్వాల్సి వస్తుందని మిఠాయిలో విషం కలిపి ఇస్తాడు. డబ్బు కనబడే సరికి విచక్షణ ఉండదు. ప్రేమలు- విలువలుండవు. భూమి విలువ పెరగడం….మనిషి విలువలు తరగడం ఈ కథ. ఈకథను దూరదర్శన్ వారు టెలీఫిల్మ్ తీశారు. తండ్రి తన వాటా అడుగుతాడు. ఈ వయసులో నీకు వాటా ఎందుకు? అని కసిరుతాడు. తండ్రి బతిమిలాడి ఒక్క 500 ఇయ్యరా! అంటాడు. ఓస్! ఐదొందలేనా ? సరే పోనీలే అని నిర్లక్ష్యంగా 500 నోటు తండ్రి మీదికి విసిరేస్తాడు. తెల్లారి తల్లి తండ్రి కనపడరు. ఎక్కడో దూరంగా వెళ్లి ఒక ఎకరం భూమి కొంటారు తండ్రి ఇదికథ.

పద్మజ:—‘జనన బీభత్సం- మరణ సౌందర్యం అనే కవితల పుస్తకం పేరు వెనుక ఏదైనా కారణం ఉందా?
మౌళి :— నా పుస్తకాలు చాలా B తెచ్చాయి. అందులో *ఒక దేహం అనే కమరణాలు* కవితల పుస్తకం.కొలకలూరి ఇనాక్ గారు పెద్ద రచయిత. తిరుపతి యూనివర్సిటీ విశ్రాంత వైస్ ఛాన్సలర్. ఆయనకుఇద్దరు కూతుళ్లు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లోనే ఉన్నారు.
*కొలకలూరి భాగీరథి* పురస్కారం ఏర్పాటు చేశారు. పదివేల రూపాయలు పారితోషికమిచ్చారు. ఈ అవార్డ్ తెలుగు యూనివర్సిటీ వారు ప్రదానం చేస్తారు. పురస్కారమందిస్తూ… “ఆ అమ్మాయి ఏమన్నదంటే ఇది నాలుగో అవార్డు రామచంద్రమౌళి గారికి ఇస్తున్నామంటే… ఇందులో ఒక విశేషం ఉన్నది.
మేము సామాన్యంగా ఒక సాహిత్య పుస్తకానికి నవల, కథ, కవితల పుస్తకాల కిచ్చేటప్పుడు ఆ రంగంలో నిష్ణాతులైన వారిని సీనియర్లను ఎంపిక చేసుకొని నిష్పక్షపాతంగా న్యాయనిర్ణయం చేయమనివాళ్లకు 3 సెట్లు పుస్తకాలను పంపుతాము.
కవితలకు పురస్కార నిర్ణయం కోసం మేము సాహిత్యకారులు కాని వారికి, కవిత్వం గురించి కవులకంటే బాగా అవగాహన ఉన్నవారికి పంపాము. వారికి మార్కులు వేయమని చెప్పాను ఈసారి న్యాయానిర్ణేతలు ఈ పుస్తకానికి 95- 96 95మార్కులు వేశారు. ఇంతకుముందు ఇన్ని మార్పులు ఏ పుస్తకానికి రాలేదు. ప్రామాణికంగా చూస్తే కవిత్వ సాంద్రత గాని, కవిత్వం యొక్క ఉత్తమ గుణం ఏ స్థాయిలో ఉందని చెప్పడానికి చెప్తున్నాను” నేను బహుమతి నిర్వాహకురాలినైనా కూడా ఇందులో మూడు నాలుగు కవితలను ఇంగ్లీషులోకి అనువాదం చేసి అవార్డు ఇచ్చే రోజు ఈ మూడు కవితలను పత్రికలో ప్రింట్ చేయించాను. హన్స్ ఇండియా మొదలైన పత్రికలలో…
పద్మజ:— ఒక దేహానికి అనేక మరణాలు ఎలా ఉంటాయి?
మౌళి :– ఈ పురస్కారం అందుకున్నప్పుడు వేదిక మీదకు రచయితలను పిలిచినప్పుడు వాళ్ళ కవితా పాదాలను చెపుతూ పిలుస్తారు.
*అమ్మ చెప్పింది స్త్రీకి రెండు జీవితాలని*
*ఒకటిక్కడ ఒకటక్కడ*
*కానీ అమ్మ చెప్పలేదు స్త్రీకి మరణాలు ఎన్నో* ఇలా కవితా పాదాలను చదివి, అద్భుతమైన మార్మిక కవి ప్రొఫెసర్ రామా చంద్రమౌళి గారిని వేదిక మీకు ఆహ్వానిస్తున్నాము అంటూ పిలిచారు! మరో కవితను చదివారు!
*సగం జీవితం నన్ను కన్న వాళ్ళ కోసం*
* సగం జీవితం నేను కన్న వాళ్ళ కోసం*
* మరి నా జీవితమేది*?
ఆ కవితలో ఇట్లాంటి పాదాలు ఉన్నాయి స్త్రీకి మరణాలు సంభవిస్తుంటాయి, ప్రతి ప్రసవంలోనూ మరణం, భర్త కొడితే మానసిక మరణమే, ఆమె తక్కువ సార్లు జీవిస్తుంది. ఇప్పుడు మహిళల పరిస్థితి కొద్దిగా మారింది. ఆర్థిక స్వాతంత్రం వచ్చింది. కానీ మరణాలు మరో తీరుగా మారాయి… ఇలా ఆడది అడుగడుగుకు చేస్తుంది!
పద్మజ:– లోపలి ఖాళీ గురించి చెప్పండి!
మౌళి :– కేంద్రానికి నాకు ప్రత్యేక అనుబంధం ఉంది నాలుగు సంవత్సరాల క్రితం అప్పటి స్టేషన్ డైరెక్టర్ గారు జయపాల్ రెడ్డి గారు రెండు పనులు చేశారు ఒకటి ప్రసార భారతి వారు ఒక్కో కేంద్రానికి ఒక్కో టాపిక్ వస్తువుని ఇచ్చి దానికి నాటకాన్ని రూపొందించండి అని కావలసిన ఆర్థిక సాయం చేస్తామన్నారు. చారిత్రక నేపథ్యంలో ఉన్నటువంటి నాటకం రాయాలి అన్నారు. ఈ మధ్య ఎవరైనా చారిత్రక నాటకాలు రాశారా? అని చూస్తే ఎవరూ రాయలేదు! ప్రభుత్వం ఇచ్చిన *జాయపసేనాని* గురించి రాయమన్నారు. దాన్ని రాశాను. దాన్ని అఖిలభారత నాటక సప్తహాన్ని ప్రతిఏటా ఉత్సవాలు చేస్తారు.దాంట్లో నాటకాన్ని ప్రదర్శించారు! దానికి ఉత్తమ నాటక అవార్డు వచ్చింది. వరంగల్ కళాకారులు నటించారు. వేదాంతం జగన్నాథాచార్యులు సంగీత స్వరకల్పన చేశారు.అందరూ కలిసి విజయవంతం చేశారు. దాని తర్వాత ఆకాశవాణికి నా పట్ల గురి ఏర్పడింది. నా 13 కథలు వారానికి ఒకటి చొప్పున కథా స్రవంతి పేరు మీద ప్రసారం చేస్తామని అలా చేశారు. దీన్ని కూడా ఆంగ్ల భాషలో అనువదించారు. అలాగే బెంగాలీ భాషలో కూడా అనువదించి, అక్కడి రేడియోల ప్రసారం చేశారు. మార్చిలో *లోపలిఖాళీ* లోని కథలను ప్రసారంచేసారు.ఇవి కూడా ఆంగ్ల భాష లో అనువదించారు.అలాగే బెంగాలీ భాషలోనూ అనువదించారు. తాత్పర్యం అనే రచనకు శ్యామ సుందర పురస్కారం, ఇలా అందరి కవుల పేరు మీద ఉన్న పురస్కారాలు అందుకున్నాను. దేవులపల్లి, కృష్ణశాస్త్రి, గుంటూరు శేషేంద్ర శర్మ పురస్కారం అందుకున్నాను. ఇటీవల తెలంగాణ సారస్వత పరిషత్తు వారిచే *వరిష్ట* పురస్కారం అందుకున్నాను.
పద్మజ:– కథా రచయితలకు మీరిచ్చే సలహా ఏమిటి?
మౌళి:– కథ అనేది మొదటి రెండు వాక్యాలలోనే పాఠకుడిని పట్టేయాలి! చదివించేలా ఉండాలి ! ఉదా॥ ఆత్మ అనే కథలో ఆత్మ అనేది *అగ్ని* అది తప్పు చేస్తే దహిస్తుంది. అంతిమంగా నిన్ను నిశ్శేషం చేస్తుంది! ఆ కథను ఇలా ప్రారంభించాను. ఆత్మ అనేది దాగి ఉంటుంది దానికి ఒక గుర్తింపు ఉన్నది. ఒక రూపాయల కట్ట ఎవరికైనా ఇచ్చి లెక్కపెట్టమంటే ఒకటి, రెండు, మూడు అని ఇలా లెక్క పెడతాం కదా! పెదిమలు కదలించకుండా లోపల ఏదో లెక్కబెడుతుంది. దానికి రూపం ఉండదు! కానీ ఆ సంఖ్య చెబుతుంది. ఇన్ని ఉన్నాయని…. కళ్ళకు కనపడేఆ రాశి ఏమిటి? దాని ఆత్మ అనుకోవచ్చు! ఊహాత్మకంగా అని రాశాను. ఆత్మ అనేది ఒక శక్తి! అది ఎన్నో రూపాలలో ఉంటుంది. విద్యుత్తు ఒక శక్తి! దానితో ఫోటో తీస్తాము! అక్కడ మనకు ఏమీ కనపడదు. కానీ చిత్రం వస్తుంది. ఇలా కాంతి ఒక శక్తి! ఉష్ణము ఒక శక్తి! రసాయనిక శక్తి !అయస్కాంత శక్తి! ఇలా అనేక రూపాలలో ఉంటుంది. దీనికి ఒక సిద్ధాంతం ఉంటుంది అదే *శక్తి నిత్యత్వ సూత్రము* అని అంటారు. అంటే(Law of Congervetion )లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఇది ఏం చెప్తుంది అంటే, *శక్తికి నాశము లేదు అది* *ఒక రూపంలో అంతర్ధానమైన చో వెంటనే మరో* *రూపంలో ప్రత్యక్షమగును.* అని ఉదాహరణకు స్విచ్ వేయగానే విద్యుత్ శక్తి ప్రసారమై లైట్ వెలుగుతుంది. కాంతి శక్తిగా మారింది. నాబ్ తిప్పగానే స్టవ్ వెలుగుతుంది. శక్తి అక్కడే ఉంటుంది.ఎక్కడా పోదు! రూపు మారుతుంది. ఆ విధంగా శక్తి ఎన్ని రకాలుగా ఉన్నదనేది అధ్యయనాలు ఉన్నాయి. దానికి శాస్త్రం ఉంది అయితే కొన్ని శక్తి ఇవి శక్తేనా అని ఊహించలేని సందేహంలో పడే శక్తి ఒకటి ఉంటుంది!అది ఏమిటంటే పురాణాలలో ఏముందంటే తపస్సు చేయటము అని ఉంటుంది. రావణుడు శివుడు గురించి తపస్సు చేశాడు. భస్మాసురుడు తపస్సు చేసెను ఇలా ఉంటాయి కదా! కథలు.
ఈ తపస్సు అనేది ఒక ప్రక్రియ పద్ధతి ప్రొసీజర్. శివుడు ఒక శక్తి నేను ఆయనను పిలవాలి! అంటే ఒక పద్ధతి ఉం.ది కొన్ని నియమాలు ఉన్నాయి. ఒకవేళ బ్రాహ్మను పిలవాలంటే అది మరో పద్ధతి! ఈ లోతుల్లోకి పోతే తంత్రశాస్త్రం అని ఒక తంత్ర శాస్త్రం ఉంది మంత్ర శాస్త్రం కూడా ఉంది హైయర్ మ్యాథమెటిక్స్ వలె ఉంటుంది.
శివుడి గురించి తపస్సు చేస్తే ఆయనను సంతృప్తిపరిస్తే ఆయన వస్తాడు! తప్పక రావాల్సిందే! రావణుడు దుర్మార్గుడు అని తెలిసినా కానీ…. ఒక పద్ధతి ప్రకారం అతను తపస్సు చేసి మెప్పించాడు కాబట్టి శివుడు వస్తాడు! ఎలా అంటే ఉదాహరణకు టికెట్ తీసుకొని మనం సినిమా హాల్లోకి పోతే మనకు తప్పకుండా సినిమా చూపించాలి! నేను ఎలాంటి వాడినైనా సరే! దుష్టుడినైనా, దుర్మార్గుడినైనా నా దగ్గర టికెట్ ఉంది కాబట్టి సినిమా చూడనివ్వాలి. అలాంటిదే ఇది. శంకరుడితో భస్మాసురుడు నీ భార్యని ఇవ్వమంటాడు. ఆయన ఇవ్వనని అనకుండా…. అనకూడదు కదా! భార్యని ఇచ్చి వెళ్ళాడు. సరే తర్వాత కథ ఉన్నది! అది వేరు!
ఇక్కడ చెప్పేది ఏమిటంటే రావణుడు తపస్సు చేస్తే ప్రత్యక్షం అవడమేమిటి? అంటే కోరిన కోరికలు ఇచ్చి మాయమైపోయాడు కదా! అంతర్ధానం అయ్యాడు అంటే ఏమిటి? అంటే ఈ *అంతర్దాన- ప్రత్యక్షా*లు అంటే ఏమిటి? అంటే శక్తి యొక్క మారు రూపాలుగా మారుతున్నాయి. *శక్తి నిత్యత్వ* సూత్రం కిందికి వస్తాయా? తపస్సు అనేది శక్తి రూపమా? ఈ విషయం చాలామందితో చర్చించాను. ఇంత ఆలోచన చాలా తక్కువ మందిలో ఉంటుంది. వీటి మీద ఆధారపూరిత సాహిత్యం లేదు. కొందరున్నారు ఇది ఆలోచించేవారు.
కల్లూరి భాస్కర్ రావని పాత్రికేయుడు ఉన్నారు. ఈ మానవ జీవితాన్ని కనుక అన్వయిస్తే భారతమే ఒక మంత్ర శాస్త్రం అని రాశాడు. లోతైన అధ్యయనాలు చేసి* ఇదండీ జీవితం* కల్లూరి భాస్కర్ జెనటికల్ సైన్స్ మీద ఒక పుస్తకం రాశారు. సైన్స్ ఏం చెప్తున్నది అంటే ?రచయితగా మారినామంటే రచయితకు సంబంధించిన ఏదో జెనిటికల్ ఎలిమెంట్ నాలో ఉన్నది! అది నా వెంటనే ఉన్నది. అది రాయిస్తున్నది నువ్వు నిమిత్తమాత్రుడు అని చెప్తుంది. ఒకతను బలవంతుడన్నా, గాయకుడన్నా, ప్రతిదానికి ఒక ఎలిమెంట్ ఉంటుంది. తనంతాను గుర్తించుకుని అభివృద్ధి పరుచుకుంటే ఆయా రంగాలలో గొప్పవాడు అవుతాడు. తనలో ఉన్న కళను గ్రహించి దాన్ని మెరుగుపరుచుకోవాలి! శిక్షణ ద్వారా కానీ,అధ్యయనం వల్ల కానీ, విపరీతమైన సాధనల వల్ల, కొందరు విని నేర్చుకుంటారు.
కాలేజీలో నేను ఫిజిక్స్ పాఠం చెప్తుంటే ఒక ప్యూన్ తన పని చేస్తూ అటు ఇటు తిరుగుతూనే నేర్చుకున్నాడు. అంటే సాధనమున పనులు సమకూరు ధరలోన! అలా సాధనల వల్ల రచయితలు కథలు చక్కగా రాయగలుగుతారు. ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలతో తనను తాను మలచుకొని,మనదైన ప్రత్యేకత ఉండాలి! ముఖ్యంగా ఒక కథో, కవితో రాసి,సన్మానాలు, పురస్కారాలు ఆవించకూడదు! మన కృషి మనం చేస్తే అవి వాటంతట అవే వస్తాయి.యువతరం వీటన్నిటినీ గుర్తుపెట్టూకోవాలి.

పద్మజ:– మయూఖ పత్రిక మరింత రాణించాలంటే ఏం చేయాలంటారు?
మౌళి :— శ్రీమతి కొండపల్లి నిహారిణి సంపాదకత్వంలో వస్తున్న మయూఖ పత్రిక అభివృద్ధిలోకి రావాలంటే దానికి ఒక గొప్ప అవకాశం ఉన్నది. ఎందుకంటే ఆమెనే పద్యం అలాంటిది ఒక వస్తువు పుడుతున్నదంటే ఉదాహరణకు టాటా వాడు సబ్బు తయారు చేసే నీతిమంతులైన పారిశ్రామికవేత్తలు భారతదేశంలో ఉన్నారంటే ఒక టాటా వారు మాత్రమే అలాగే కొండపల్లి నిహారుని పత్రిక నడుపుతున్నదంటే ఆమె అభిరుచులు వాళ్ళ నాన్న రాఘవరావు గారు మామగారు శశిధర్ రావు గారు వారినే పద్యం వారవరరావు కుటుంబ సంబంధాలు ఇవన్నీ చూస్తే ఆమెకు జన్మదిన కొన్ని సంస్కారాల అబ్బాయి ఆధునిక భావాలు ఉన్నాయి ఉత్తమమైన సాహిత్యకారుని కనుక ముందు నుండి నాకు పరిచయం ఉంది ఉత్తమ అభిరుచి గల రచయిత్రిగా ఒక స్త్రీగా ఆమె పుత్రికనే ఈ రెండు పత్రికలు అవి ఆరోగ్యంగా ఉంటాయి సమాజానికి ఆరోగ్యవంతమైన విషయాలు అందిస్తుంది మంచి రూపురేఖలను సంతరించుకొని ఉంటుంది సాహిత్య ప్రమాణాలు మైంటైన్ చేస్తుంది అల్లాటప్పగా చేయదు ఆమె నిర్వహణలో పత్రికలు చాలా ఉజ్వలంగా నడుస్తాయి అందులో సందేహమే లేదు నాలాంటి వారి సహకారం ఎప్పటికీ ఉంటుంది.
ఇలా ఎన్నోగ్రంథాలు, నవలలు, కథలు కవిత్వ సంపుటాలు,నాటకాలు,విమర్శా గ్రంథాలు వెలువరించారు.గ్రీస్ లో జరిగిన ప్రపంచ కవుల సదస్సులో భారత ప్రతినిధిగా పాల్గొన్నారు.2016 లో తైవాన్ లో జరిగిన *ప్రపంచ కవుల సదస్సు* లో పాల్గొన్నారు.2011 వ సంవత్సరపు ఉత్తమ టెలిఫిల్మ్ గా ఎంపిక చేయబడి రాష్ట్ర పతి చేతులమీదుగా బంగారు పతకం అందుకున్నారు.
రాష్ట్ర స్థాయి అత్యున్నత పురస్కారం- 2007 లో తెలుగు విశ్వవిద్యాలయ కవితా పురస్కారం, 2008 లో ‘సినారే’ కవిత్వ పురస్కారం,2008 లో ఆవంత్స సోమసుందర్ కవిత్వ పురస్కారం,2012 లో గుంటూరు శేషేంద్ర శర్మ పురస్కారం, 2015 లో ఫ్రీవర్స్ పురస్కారం, 2012 లో కొలకలూరి భాగీరథీ పురస్కారం,పొందారు. అలాగే ఫిలిప్పీన్స్ ప్రభుత్వ *జీవిత సాఫల్య పురస్కారం, 2017 లో ది ఆంధ్రమహాసభ, ముంబై జీవిత సాఫల్య పురస్కారం,2015 -2018లో కళారత్న, ఇంకా ఇంజనీరింగ్ విద్యార్థులకు 6 పాఠ్య గ్రంథాలను రచించడం వల్ల 1999 లో రాష్ట్ర పతి నుండి, 2000 లోఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి నుండి *ఉత్తమ ఇంజనీరింగ్ అధ్యాపక* పురస్కారాలను స్వీకరించారు. ఇంతటి ప్రతిభా శాలి ప్రముఖ సాహితీవేత్త శ్రీ రామా చంద్ర మౌళి గారిది బహుముఖీన ప్రతిభ!
చక్కని భాష,తనలోని భావాన్ని పదాలలో దృశ్యంగా మలుస్తూ…సహజ సిద్ధమైన ప్రతీకలతో ఉదా॥ *భూములు మనుషుల చేతుల్లో కాగితపు* *ముక్కలకంటే హీనంగా పీలికలు పీలికలై పోవడం*…మరో ప్రతీక *మట్టికి రెక్కలు రావడం* మరో ఉదా! ఒర్రెలు,బోళ్ళు;వాగులు,గుట్టలు అన్నీ డబ్బుగా మారడం…ఇలాంటివి ఆ భావానికి అతికి మన మనసులలో హత్తుకుంటాయి! వీరి వ్యక్తీకరణ వైవిధ్యంగా ఉంటుంది. అడిగిన వెంటనే సహృదయతతో ముఖాముఖి కి అంగీకరించి , తమ విలువైన సమయాన్ని మయూఖ పాఠకులకోసం తమ అమూల్యమైన అభిప్రాయాలను ఏదీ దాచుకోకుండా అన్నింటికి ఓపికగా సమాధానమిస్తూ..సూచనలు, సలహాలు, మార్మిక- ధార్మిక విషయాలు ఒకటేమిటీ? నేను వారితో సంభాషించిన విషయమంతా రాస్తే ఒక ఉద్గ్రంథమౌతుంది…అలా చేసి పాఠకులను విసిగించ వద్దని సంక్షిప్తంగా వారి మాటలు- నా మాటగా చేసి చెప్తున్నాను. ఇలాంటి గొప్ప సాహితీవేత్తను పరిచయం చేయడం నా భాగ్యంగా భావిస్తూ….వారకి మయూఖ పత్రిక ఎంతైనా ఋణపడి ఉంటుందనేది మాత్రం యథార్థమైన విషయం పాఠకులనుండి శెలవు కోరుతూ…

31 comments
https://shorturl.fm/VFxPV
https://shorturl.fm/KT818
https://shorturl.fm/3JKWr
https://shorturl.fm/kaXl7
https://shorturl.fm/yZQAg
https://shorturl.fm/0NDPm
https://shorturl.fm/9437k
https://shorturl.fm/fz6w7
https://shorturl.fm/2WdWS
https://shorturl.fm/C1zio
https://shorturl.fm/fUQcv
https://shorturl.fm/2iPl0
https://shorturl.fm/esh1Y
https://shorturl.fm/CV9qc
https://shorturl.fm/bweOu
https://shorturl.fm/2aab5
https://shorturl.fm/8uAwG
https://shorturl.fm/G3BYu
https://shorturl.fm/hLYJs
https://shorturl.fm/dpAA6
https://shorturl.fm/biMhZ
https://shorturl.fm/VugkS
https://shorturl.fm/eWJNZ
https://shorturl.fm/wwxz2
https://shorturl.fm/BBFly
https://shorturl.fm/uUMaZ
https://shorturl.fm/puj7W
https://shorturl.fm/fNs3a
https://shorturl.fm/kl3gu
https://shorturl.fm/aUY9c
https://shorturl.fm/wEtMB