ఓనాడు చిన్న మావయ్య దోస్తుల యెంట తోట బాయికి ఈతకి పోతుండు. నన్ను గూడ రమ్మన్నడు. ఎంటనే అమ్మమ్మ అన్నది “ఒద్దురా, వాణ్ణి తీస్కపోకు, వానికి ఈత రాదు!” అని. పక్కన్నుంచి పెద్ద మావయ్య సర్రున అన్నడు “ఏ… మా ఊళ్ళ లత్కోర్ పోరగాళ్ళకి గూడ ఈతొచ్చు; పట్నమోళ్ళకి రాదంటె ఇజ్జత్ కా సవాల్! చల్, నీకు ఒక్క దినంల ఈత నేర్పిస్త… నడు!” అన్నడు. నాక్కొంచం రేషం పుట్టుకొచ్చింది! “ఓ…, నాకు భయమనుకున్నవా? ఇట్ల నేర్చుకుంట, చూస్కో!” అని అన్న. ఇజ్జత్ కోసం ఏదో అన్నగాని, లోపల మాత్రం మస్తు గుబులైతుండె! అమ్మమ్మ అన్నది “వారీ, నీకసలే మోటుతనం ఎక్కువ. వాన్కి ఈతొద్దు గీతొద్దు! నా మాట ఇను” అంటె, పెద్ద మావయ్యన్నడు “ఏ…, బద్రంగనే ఉంట లేవే అమ్మా! ఉట్టిగ గాదు లే – లొట్టలు కడ్త!” అని నచ్చజెప్పిండు. “లొట్టలంటె ఏంది మావయ్య?” అన్న. “బాయి దెగ్గర చూపిస్త తీ రాదు? నువ్వైతె నడు” అని తోట బాయికి తోల్కపోయిండు.
________________________________________
తోట బాయి అంటె అదొక పెద్ద దిగుడు బాయి. చిన్న మావయ్య, దోస్తులు లంగోటీలు కట్టుకోని, బాయి గట్టు మీద నిలబడి అంతెత్తు మీంచి దుంకుతున్నరు. నీళ్ళల్ల ఈదుకుంట మస్తు ఆటలు ఆడుతున్రు: ముట్టిచ్చుకునే ఆట, నీళ్ళకింద ఊపిరి బట్టే ఆట, నీళ్ళకింద మట్టి తెచ్చే ఆట…; ఇట్ల దూం మచాయిస్తున్రు. నేను బాయి గట్టున నిలవడి వాళ్ళ ఆటలు చూసి ఒకటే దుంకుడు, అర్చుడు! పెద్ద మావయ్య నా ఎచ్చులు చూసి, నేను తయార్ ఉన్న అని అర్తమైంది! “ఆ…, ఇంకేంది, దుంకు!” అన్నడు. నాగ్గూడ వాళ్ళతోని ఆడాలని ఉంది గాని, గుబుల్ తోని గుండె గుడ్ గుడ్ ఐతుంది! “ఆ, నువ్వు ఏందో లొట్టలు కడ్త అని అమ్మమ్మకు చెప్పినవు, ఏవి?” అన్న. లొట్టలంటె ఏందో తెల్వదు గాని, అవి లేకుంటె బాగుండు, మెల్లగ పిస్లాయించొచ్చు అని లోపల అనుకున్న! పెద్ద మావయ్య అన్నడు “లొట్టలంటె గివి. నడుంకి కట్టుకోని ఈత నేర్చుకుంటరు” అని చూయిన్చిండు. అవి బొంగు కట్టెల్లెక్క ఉన్నై. వాట్ని ఒక కట్ట కట్టి, ఓ చాంతాడు తోని నడుముకి కట్టుకోవాల్నట!
“ఇది కట్టుకుంటె మునిగిపోరా?” అని ఒణుకుడు కుతికె తోని అడిగిన!
“నీకు నమ్మకం లేకపోతె చూడు” అని ఒక బండరాయిని లొట్టల మీద ఉంచి కట్టి, నీళ్ళల్ల ఏసిండు. రాయి లొట్టల తోనే బుడుంగున మునిగి, దన్నుమని ఎంటనే తేలింది! పెద్ద మావయ్య అన్నడు “చూశ్నవా! ఇట్లనే నీ నడుం కి లొట్టలు కడ్త. నువ్వు అట్లనే తేల్తవు! కాల్జేతులు మాత్రం గిట్ల గిట్ల కొట్టాలె” అని గట్టిగ చేతులు, కాళ్ళు ఊపి చూయిన్చిండు! “బస్ గంతే, నీకు ఈత ఒచ్చినట్టే పో!” అన్నడు.
నా మొహం జెర్ర ఇచ్చుకుంది గాని కొంచం గుబుల్ ఇంక ఉండె! “నేను పైనుండి ఐతె దుంక!” అన్న. “ఐతె కిందికి పోదాం పటు!” అన్నడు. బాయి గోడ పొంటి మెల్లంగ మెట్లు దిగి నీళ్ళ పక్కకి ఒచ్చినం. రాంగనె పెద్ద మావయ్య నా నడుంకి చాంతాడు కట్టిండు. కట్టంగనె ఏమైందో గాని “లేడికి లేచిందే పరుగు” అన్నట్టు మస్తు జోష్ లకు ఒచ్చిన! “రెడీ స్టడీ వన్ టూ త్రీ!” అని, ఊపిరి మొత్తం బిగవట్టి, ఉరికి, నీళ్ళల్ల దుంకిన! ఖతం! ఆ మొదటి సారి ఒళ్ళు నీళ్ళల్ల మునుగుడు ఇప్పటికి యాదికున్నది! నోట్ల, ముక్కుల, కళ్ళల్ల, చెవులల్ల ఒక్కటే సారి నీళ్ళు పోయి పై ప్రాణాలు పైన్నే ఎగిరి పోయినట్టైంది! కాళ్ళు చేతులు ఆడలే…, దిమాక్ పనిజెయ్యలే! అంత నల్లగై పోయింది! దగ్గొస్తున్నది గాని అంతట్లనే మొహం నీళ్ళ కిందికి పోతుంది! అరుద్దామని నోరు దెరిస్తె జెరిన్ని నీళ్ళు లోపలి పోయి ఆగమాగమైతుంది! “ఇంగ ఐపోయింది రా దేవుడా” అనుకున్న! అమ్మా నాన్న యాదికోచ్చిన్రు! ఏడ్పొచ్చింది !! ఇంతల, గట్టు వైపు చూస్తె పెద్ద మావయ్య, చిన్న మావయ్య, ఆయిన దోస్తులు అందరు గట్టిగట్టిగ నవ్వుతున్రు. పక్కకు జూస్తె లొట్టలు అక్కడ్నే ఉన్నై! అంటె? నన్ను చిన్న పోరగాన్ని చేశి, లొట్టలు కట్టినట్టే జాదు జేసి, మొత్తం మీద లొట్టల్లేకుండనే బాయిలకు నూకిన్రన్నట్టు! ఇంగ నాకు రేషం పట్టలే! ఎట్లొచ్చిన్నో ఏమో గాని బైటికొచ్చి, గలీజ్ గలీజ్ శాపనార్దాలు ఒర్లుకుంట, పెద్ద మావయ్య పొట్టల గిప్ప గిప్ప గుద్దిన! పెద్దమావయ్యకేమో చీమ కుట్టినట్టు గూడ కాలే గాని, అందరు ఇంకా లాశిగ నవ్విన్రు ! అది చూశి నాకు ఏం జెయ్యాల్నో సమజ్ గాలే! ఏడ్చుదు శురూ చేశ్న!
అప్పుడు పెద్ద మావయ్యకు పాపం అనిపించింది! నన్ను దెగ్గరికి తీస్కున్నడు! “లే లే లే…, ఊర్కో ఊర్కో…, ఇప్పుడేమైంది? బానే ఉన్నవు గద? చిన్న పిల్లల్లెక్క ఏడుస్తరా?” అని బుజ్జగించిండు. నేను ఎక్కెక్కి ఏడ్చుకుంట “నన్ను లొట్టల్లేకుండ బాయిలకి దొబ్బినవు లే? ఉండుండు, మా నాన్నకి చెప్త! నీ లగ్గమైతది తీ!” అని అన్న!
పెద్ద మావయ్య మళ్ళ గట్టిగ నవ్విండు “ఓ…, మీ నాయిన పెద్ద తీస్ మార్ ఖాన్ తీ గాని…! ఒక ముచ్చట చెప్పు! నీకు లొట్టలు కట్టలే గద, బైటికి ఎట్లొచ్చినవు ర?” అన్నడు. నాకు షాగ్గోట్టినట్టైంది! ఆలోచించేంతల్నే మళ్ళీ అందరు నవ్విన్రు! ఈ సారి మాత్రం పెద్దమావయ్య నా తరఫ్ దారీ తీస్కోని, తత్తిమ్మా ఓళ్ళతోని అన్నడు: “ఏం రో?! పండ్లు జోర్ గ ఇకిలిస్తున్రు ! మీరందరు మొదట్ల ఇట్లనే చెయ్యలే?” అని! అప్పుడు వాళ్ళు జెర్ర గప్ చుప్ ఐన్రు! చిన్న మావయ్య దోస్తుల్ల ప్రసాదు అని ఒకడున్నడు. వాడు “మా అందరికి ఈ పంతులు గిట్లనే ఈత నేర్పిండు! ఇట్లైతెనే జెల్ది ఒస్తది, జెబర్దస్త్ గ ఒస్తది” అని అన్నడు. పెద్ద మావయ్య మస్తు షాన్ గ నవ్విండు “నేన్జెప్పలే!! ఒక్క దినంల ఈత నేర్పిస్త అనలే?!” అని అన్నడు. అప్పుడు ఇంగ నేను ఖుష్ “నాకు ఈతొచ్చిందోచ్…!!” అని అమ్మమ్మకి, తాతయ్యకి, అమ్మకి, నాన్నకి, దునియ మొత్తానికి అర్చి చెప్ప బుద్ది ఐంది !
పెద్ద మావయ్య తోని ఎదో అనాలె, కాని ఏమనాలె? షుక్రియ చెప్పుడు గూడ తక్కువ! దెగ్గరికి పొయ్యి, గట్టిగ పట్టుకున్న! మావయ్య నా నెత్తిమీద చెయ్యేసిండు!
మళ్ళ అంతల్నే పరాష్కం లకి దిగిండు. “ఇదంత ఉట్టిగ గాదు బిడ్డా! మీ నాయినకి చెప్పు, దావత్ ఇయ్యాల్నని!” అన్నడు! నేను తగ్గుతనా?! కళ్ళు తూడ్చుకుంట, నవ్వుకుంట, అదే షాన్ తనం తోని అన్న “ఇస్తం ఇస్తం…, మా హైద్రాబాద్ రా! జోర్దార్ దావత్ ఇస్తం!” అన్న! ఎంబడే, నేను చిన్న మావయ్య దెగ్గరికి పొయ్యి, చెయ్యి పట్కోని, గుంజుకుంట అన్న: “చల్, మనం నీళ్ళల్ల ముట్టిచ్చుకునే ఆట ఆడుకుందాం! నాకు ఈత ఒచ్చింది గద? ఇంగ లొట్టలొద్దు కట్టెలొద్దు…”!!
-కస్తూరి గౌతమ్ చంద్ర
Edication: MS (Syracuse University), MBA (UT Austin)
Occupation: Director of Operations at Sentient Energy (Electric Utilities Industry)
+1-972-998-7791