శ్రీ ప్లవ వత్సరమ్ము శుభ
చింతనలిచ్చి, “కరోన” దౌష్ట్య దు
ర్విప్లవ కష్ట-నష్ట తతి
భేద మొనర్చెడు శక్తి నిచ్చి, శాం
తిప్లవ మందజేసి జగ
తిన్ తరియింపగజేసి శోకజా
లప్లుతినుండి గాచుత ని
లాతలమున్ సతతమ్ము ప్రేమతో!
“మానవజాతి యొక్కటి! ‘స
మానతకై’ ప్రతి భారతీయుడున్
పూనికతో శ్రమించవలె!”………
పుట్టెడు మాటలకంటె ముత్యమం
తేని యొనర్చి మేలుగను
డీభువినంచు హితమ్ముజెప్పుచున్
తా నరుదెంచె సర్వజన
తాప్రియు డీ “ప్లవ”, వత్సరాఖ్యతో.
“నరుడు ‘సమాజజీవి!’, మృదు
నాదము పుట్టినయిల్లు నాలుకే!,
పరుల గుణాల నెంచకు! ని
వాసము నీ హృదయమ్ము
ప్రేమకున్,
కరచరణాదు లన్నియు సు
ఖమ్ముల నిచ్చు పరార్థచింతచే!
తిరమగు ధర్మ మిద్ది” యని
ధీరత దెల్పు ‘ప్లవ’మ్ము! మిత్రమా!