పైకి శిశిరం అశుభంగా నియంతగా
చెట్టు చెట్టును ఎండగొట్టినట్లు
దృష్టి దృష్టి దోషం లోకానికి . . .
శిశిరం పాతబడ్డ పండుటాకులను మట్టిలో కలగలిపి
భూమిలో సారం సారం చేసి వేరు వేరుకు అందిస్తుంది
కొమ్మ కొమ్మను చిగురుల ఊయల చేస్తుంది
ఇకేం ! కోయిల వాలి ఊగనే ఊగుతుంది
ఇదంతా ఎవరికి ఎరుకా ??
శిశిరం పై అంతా దోసిల్ల కొద్ది దుమ్ము పోస్తారు
సింగారమైన వసంత ఋతువుకూ తెలియదు
అనామక శ్రామికురాలు శిశిరం
ఎండు ముఖమట
శిశిరానికి ఏ పండుగా లేదు
ఋతు చక్రంలో ఆడంబరం లేక
మంచు తెరలో ఏదో ఒక మూలకు
శ్రమ ఒకరిది
అందలం మరొకరికి
కవులైనా అంతే ! వసంతం పై కవిత్వం చెప్పి
సన్మానాలు చేయించుకుని పేరుకు వస్తారు
శిశిరం పై ఒక్క పద్యమూ అల్లుకోదు
ఎవరికి తెలుసు
అసలు వసంతం అంటే
పేరు మార్చుకుని వచ్చిన శిశిరమే
ఈ రహస్యం ఎప్పటికీ రహస్యమే