Home కథలు సహజ న్యాయం

సహజ న్యాయం

       “సూరీ, భోజనం చేస్తావా?” వంటింట్లోంచి తల్లి అనసూయమ్మ కేక.

         ” లేదమ్మా,   ఈ రోజు రాహుల్  బర్త్ డే, వెళ్ళాలి ” బెడ్రూం నుండి సూరి సమాధానం.

         “ఇంత రాత్రి టైములో  వెళ్తావా?”

       “ఫ్రెండ్స్ వస్తారు, నేనూ వెళ్ళాలి “.

       ” బర్త్ డే పార్టీ అయిపోగానే వెంటనే వచ్చేయ్.”  సలహా ఇచ్చింది అనసూయమ్మ.

*****

       “అక్కా,  రాహుల్ బర్త్ డే పార్టీకి వెళ్తున్నాను, అమ్మా నాన్న  మార్కెట్ నుండి రాగానే చెప్పు.” అంటూ సాయి శాండల్స్ తొడుక్కున్నాడు.

       “ఆల్రెడీ ఎనిమిది దాటింది.  మళ్లీ ఎప్పుడొస్తావు” అడిగింది స్నేహ.

       “డిన్నర్ చేసి వస్తాను.  సూరి  బైకు మీద రాహుల్ ఇంటికి వెళ్తాము.” అన్నాడు సాయి.

      “జాగ్రత్త”  స్నేహ తలుపు వేసుకుంటూ చెప్పింది.
*****

       సూరి  రెండున్నర లక్షల టీవీఎస్ అపాచీ బైకు వెనుక సీటు మీద సాయి కూర్చోగా  వాయువేగంతో జూబ్లీ హిల్స్  రోడ్ నెంబర్ 45 లో ఉన్న  రాహుల్ ఇంటికి బయలు దేరారు.   సూరి   ఖరీదైన మాంటేకార్లో టీ-షర్టు, లీవైస్ జీన్స్ ప్యాంటు వేసుకొని జులపాల జుట్టుతో ఉండగా, సాయి పోలో టీషర్ట్, మామూలు జీన్స్ ప్యాంటు, విరాట్ కోహ్లి హెయిర్ స్టైల్ తో ఉన్నాడు. రాహుల్ ఇంటికి  చేరేసరికి  మనో,  రాహుల్ ఇంటి ఆవరణలో తన మొబైల్ ఫోనులో మాట్లాడుతున్నాడు.

       “ఏంట్రా మనో గాడు ముందే వచ్చిండు,  ఈ రోజు కుంభ వృష్టి పక్కా” , బైకు పార్క్ చేసుకుంటూ అన్నాడు సూరి.

         “అవున్రా, నేను స్టేడియం నుండి డైరెక్ట్ గ ఇక్కడికే వచ్చిన, మా అయ్య ఇప్పుడే క్లాసు పీకిండు, ఇవన్నీ మనకు కొత్త కాదుగా,  ఇన్ని సార్లు విన్నం” అంటూ తన జుట్టు వైపు చూపించాడు మనో.

        “అరేయ్, వీనికి జుట్టే లేదు, జుట్టు చూపిస్తుండు ” అని సాయి అనగానే ముగ్గురూ పెద్దగా నవ్వుకున్నారు.

                   ****
రాహుల్, సూరి, సాయి, మనో నలుగురు హైదరాబాద్ శివార్లోని   ఇంజనీరింగ్ కాలేజీలో మూడవ సంవత్సరం చదువుతున్నారు.   సాయి ది  మధ్య తరగతి కుటుంబం.  మిగతా ముగ్గురివి బాగా బలిసిన కుటుంబాలే.
****

       రాహుల్ విశాలమైన ఇంటి డ్రాయింగ్ హాలు మధ్యలో బల్ల మీద ఖరీదైన బర్త్ డే కేకు, ప్లాస్టిక్ కత్తి, క్యాండిల్ ఉన్నాయి.  ముప్పై లక్షల రూపాయల ‘ టొయోటా ఫార్చ్యూనర్’  కారు బర్త్ డే  బహుమతిగా ముందు రోజే  వచ్చింది.  డ్రైవర్ సాంబ,రాహుల్, ఆంజనేయ స్వామి గుడిలో పూజ చేయించి తీసుక వచ్చారు.
****

       టైము తొమ్మిది కావస్తుంది.   రాహుల్ క్యాండిల్ ఆర్పి కేకు కట్ చేశాడు. రెండు నిమిషాలు కేకలతో, కేరింతలతో హాలు దద్దరిల్లింది.  రాహుల్ తల్లిదండ్రులు గ్రీటింగ్స్ చెప్పి పై అంతస్తుకు వెళ్ళారు.    స్నేహితులు రాహుల్ కి  బర్త్ డే శుభాకాంక్షలు చెప్పారు.  వాచ్ మన్ సత్తయ్య  కేకు కట్ చేసి తీసుక రాగా నలుగురు తిన్నారు.

       “కేకు తోటే సరిపెడ్తవ,  ముప్పై లక్షల రూపాయల కారు కొన్నవు, పార్టీ ఇయ్యవా?” అన్నాడు మనో.

        “కొత్త కారులో బంజారా హిల్స్ తబ్లా బార్ కెళ్లి  మూడు పెగ్గులు తాగి నెక్లెస్ రోడ్డుకు పోదాం” సలహా ఇచ్చాడు సూరి.

         “మా పేరెంట్స్ వార్నింగ్ ఇచ్చిండ్రు రా డ్రైవర్ లేకుండ  కారు తీయొద్దని” అన్నాడు రాహుల్.

       ” నీకు డ్రైవింగ్ వస్తది కదా,  కారు కొన్నదే నీకోసం , వాండ్లు అట్లనే అంటరు, చలో పోదాం” అన్నాడు మనో.  నలుగురు లేచి బయటకు వచ్చారు.

      “సత్తయ్యా, మేము బయటకు పోతున్నం ” అంటూ కారు డోర్ తీశాడు రాహుల్.

        ” డ్రైవర్ సాంబకు ఫోను చెయ్యమంటారా” అడిగాడు సత్తయ్య.

        “వద్దు, మేమే పోతాం” అంటూ డ్రైవర్ సీట్ లో కూర్చున్నాడు.  ప్రక్క సీట్లో మనో కూర్చోగా, వెనుక  సూరి, సాయి కూర్చున్నారు.  కారు తబ్లా బార్ వైపు దూసుకు పోయింది.

       రాహుల్  బ్లాక్ లేబెల్ స్కాచ్,  సోడా, బుడ్వైజర్ బీరు,  తందూరి చికెన్, అపోలో ఫిష్  ఆర్డరిచ్చాడు.  సాయి బీరు తీసుకోగా  మిగతా ముగ్గురు స్కాచ్ తీసుకున్నారు.   నలుగురు మందు తాగుతూ వారి వారి మొబైల్లో లీనమైనారు. చలి కాలం మూలాన బార్ కిక్కిరిసి ఉంది. ఫ్యామిలీస్ తో వచ్చిన వారిలో కొందరు ఆడవారు కూడా బీరు సేవిస్తున్నారు.   రాహుల్, సూరి, మనో తలో మూడు పెగ్గులు లాగించగా, సాయి మరో బీరు తీసుకున్నాడు.  టైము పదకొండు కావస్తుండగా బిల్లు పే చేసి నలుగురు బయట పడ్డారు.

           “నెక్లెసు రోడ్డులో మంచి ఐస్క్రీమ్ దొరుకుద్ది.  అక్కడికి పోనియ్ కారు” ఆర్డరేశాడు సూరి.

        కారు పంజగుట్ట, ఖైరతాబాద్ మీదుగా  అక్కడికి చేరుకుంది.  కార్లు, మోటారు బైకులతో  ఆ ప్రాంతం రద్దీగా  ఉంది.  ఐస్క్రీమ్ పార్లర్లో  ఎవరికి కావలసినవి వారు తిన్నారు.  తాగిన మత్తు స్లోగా  పని చేయటం  మొదలైంది.  మనో పూర్తిగా అదుపు తప్పాడు.  సాయి భుజం మీద చెయ్యి వేసి భారంగా అడుగులు వేస్తున్నాడు.  సూరి మాట తడబడుతుంది.  రాహుల్ కళ్ళు ఎర్రబడ్డాయి. కష్టంగా  డ్రైవర్ సీట్లో కూర్చున్నాడు.

            “రాహుల్, నువ్వు నడుపుతవ, నన్ను నడ్పమంటవ” అడిగాడు మనో .

          ” నేను పక్కా హోష్ లో ఉన్న.  నా కారు నీకిస్తే కుప్ప జేశి పెడ్తవు” అన్నాడు రాహుల్.

       ” ఓఆర్ఆర్ మీద నడిప్తే నీ దమ్మేందో తెలుస్తది” ఉడికించాడు మనో.

         “మనో, నువ్వెందుకు రెచ్చ గొడ్తున్నవు రాహుల్ ని.  ఇంటికి పోనియ్ రాహుల్” అన్నాడు సాయి.

          రాహుల్ ఇదేదీ వినిపించుకునే స్థితిలో లేడు.  120 కిలో మీటర్ల వేగంతో మొదలైన  కారు స్పీడో మీటర్ ఓఆర్ఆర్ మీద  160ని టచ్ చేసింది. సాయి భయంతో  మాట్లాడటం లేదు. ఏదైనా అంటే పిరికోడు అంటారు. సూరి వెనుక సీట్లో జారగిలబడి మత్తులో ఉన్నాడు.   మనో స్టీరియో ఆన్ చేసి ఫుల్ వాల్యూంలో సల్మాన్ ఖాన్ “సీటీమార్”  హిందీ పాట వింటూ అప్పుడప్పుడు రాహుల్ ని ఆట పట్టిస్తున్నాడు.

        స్ట్రీట్ లైట్లు వెలగనందున   రోడ్డు  చాలా వరకు చీకటిగా ఉంది.  ఎదురుగా వచ్చే వాహనాల లైట్ల వెలుతురు, మత్తులో ఉన్న రాహుల్ కి చిరాకు కలిగిస్తున్నాయి.  ముందు వెళ్తున్న పెద్ద ట్రక్కును ఎడమ వైపు నుండి ఓవర్ టేక్ చెయ్యాలనే ఉద్దేశంతో కారును ఎడమ వైపుకు కట్ చేసే ప్రయత్నంలో ప్రక్క నుండి వెళ్తున్న  మారుతి ఆల్టోను ఢీ కొట్టడంతో  ఆల్టో కారు రెండు పల్టీలు కొట్టి రోడ్డు చివరగా ఉన్న రైలింగ్ కు గుద్దుకొని ఆగింది. రాహుల్ కారు ముందు వెళ్తున్న ట్రక్కును వెనక నుండి గుద్ది డివైడర్ మీదుగా అవతలి రోడ్డుపై పడింది. అదృష్ట వశాత్తూ  ఎయిర్ బ్యాగులు తెరుచు కోవటంతో పెద్ద గండం నుంచి బయట పడ్డారు. రాహుల్  రెండు కాళ్లు, మనో ఎడమ చేయి విరిగాయి.  సూరి, సాయి చిన్న గాయాలతో బయట పడ్డారు. ముప్పై లక్షల రూపాయల కొత్త కారు నుజ్జు నుజ్జయింది.

       ముందు వెళ్తున్న ట్రక్కు డ్రైవర్ ప్రక్కకు ఆపి, ఆల్టో కారు దగ్గరికి వెళ్లి చూసాడు.  నలభై సంవత్సరాల మనిషి డ్రైవర్ సీట్లో రక్త సిక్తమై ఉన్నాడు.  ఎమర్జెన్సీ నంబర్ కు కాల్ చేసి విషయం చెప్పాడు.  పోలీసు జీపు, రెండు 108 వాహనాలు కొన్ని నిమిషాల్లో ఘటనాస్థలికి చేరుకున్నాయి. తదుపరి చర్యలకు రాహుల్  బృందాన్ని, ఆల్టో వాహనంలోని శవాన్ని  108 వాహనాల్లోకి  ఎక్కించారు.

******
పోలీసు వారు  రాహుల్, అతని తల్లి దండ్రులు, మనో, సూరి, సాయి  పై నమోదు చేసిన క్రిమినల్ కేసు కోర్టులో విచారణకు వచ్చింది.  సాక్షుల విచారణ, వాదోపవాదాల అనంతరం కోర్టు తీర్పు వెలువరించింది.  మనో, సూరి, సాయి ప్రత్యక్షంగా నేరం చేయకున్నా పరోక్షంగా మద్యం సేవించిన రాహుల్ ని  ప్రేరేపించి కారు అజాగ్రత్తగా నడపటానికి  కారకులైనందున ఒక్కొక్కరికి ఆరు నెలల  కఠిన కారాగార శిక్ష విధించింది.  రాహుల్ మద్యం సేవించి, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కారు నడిపి ఒకరి మరణానికి, ముగ్గురి గాయాలకు కారకుడైనందున అతనికి మూడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష తో పాటు మృతుని కుటుంబానికి నష్ట పరిహారంగా ఇరవై లక్షల రూపాయలు మూడు నెలల్లోగా చెల్లించాలని ఆదేశాన్నిచింది.

         రాహుల్ తల్లిదండ్రులు  డ్రైవింగ్ లైసెన్స్ లేని కొడుక్కి కారు తాళాలు అందుబాటులో ఉంచి, పరోక్షంగా సంఘటనకు బాధ్యులై,  మృతుని కుటుంబం ఆసరా కోల్పోటానికి కారకులైనందున  అతని ఇద్దరు మైనర్ పిల్లలు  మేజర్లు అయ్యేంత వరకు వారి పోషణకై ప్రతి సంవత్సరం వారి తల్లి బ్యాంకు అక్కౌంట్ లో యాభై వేల రూపాయలు డిపాజిట్ చెయ్యాలి.   మృతుని కుటుంబానికి జరిగిన అన్యాయం  సరిదిద్దలేనిది కాబట్టి, కేవలం కారాగార శిక్షతో సరి పెట్టకుండా,  తమ పిల్లల పట్ల తల్లిదండ్రుల బాధ్యతను గుర్తు చేస్తూ, తండ్రిని కోల్పోయిన  మైనర్ పిల్లల భవిష్యత్తు కోసం, చట్టం నిర్దేశించని సరి కొత్త సహజ న్యాయం కల్పించాల్సి  వచ్చిందని న్యాయమూర్తి తన చారిత్రాత్మక తీర్పులో పేర్కొన్నారు.

       రాహుల్ తల్లిదండ్రులు తమ కొడుక్కి  ఖరీదైన కారు కొనిచ్చి ఒక   కుటుంబానికి తీరని అన్యాయం చేసినందుకు పశ్చాత్తాప పడుతూ కోర్టు తమకు విధించిన శిక్ష సరైనదిగా భావించి నైతికతగా  మృతుని భార్యను ఓదారుస్తూ, అండగా ఉంటామని హామీ ఇస్తూ పిల్లలను అక్కున చేర్చుకున్నారు.

You may also like

Leave a Comment