Home కథలు ఒంటికి రెండు – రెంటికి ఐదు 

ఒంటికి రెండు – రెంటికి ఐదు 

“అరే  ఓ కిషన్ భయ్యా.. చలేంగే  క్యా .. “ నెత్తికి రుమాలు చుట్టుకుంటూ బయటకు వచ్చాడు తన నివాసం నుండి పర్తాప్   అనబడే ప్రతాప్.

నివాసం అంటే పెద్ద ఇల్లు కానీ గుడిసె కానీ కాదు, ఒక మనిషి నిలబడి ఒక వైపు నుండి ఇంకో వైపుకి నడిచేంత  పెద్ద సిమెంట్ పైపు.   హైదరాబాద్ కి దూరంగా మేడ్చల్ ప్రాంతంలో నివాసాసాలకు దూరంగా , అడవి లాంటి ప్రదేశంలో నీటి సరఫరా కోసం ఉపయోగించే పెద్ద పెద్ద  సిమెంట్ పైపులు తయారు చేసే ఫ్యాక్టరీ కాంపౌండ్  అది.   టెస్టింగ్ లో ఫెయిల్ అయిన లేదా  కొంత దెబ్బ తిన్న సిమెంట్ పైపులకు  ఒక వైపు తడకో, గోడో లేదా టార్పాలినో కట్టుకుని, పైపు ఇంకో వైపు ద్వారంగా ఉపయోగించే పైపుల్లోనే  వందలాది  వలస కుటుంబాలు తమ జీవితాన్ని గడుపుతుంటారు.

“అచ్చా .. చలో, చలో పర్తాప్  భయ్యా ” అనుకుంటూ తన భుజాలను పట్టుకుని  ఆడుతున్న  అయిదేళ్ల కొడుకు పర్మోద్  అనబడే  ప్రమోద్ ని పక్కన దింపి,   బీడీ కట్టను రుమాళ్ లో జొప్పుతూ వంగుతూ  బయటకు వచ్చాడు  కిషన్.

ఇద్దరు  కలసి ఫ్యాక్టరీ వైపు నడుస్తుంటే వారు నడుస్తున్న వైపు చూస్తూ పాత  సైకిల్ టైరుతో  ఆడుతున్నాడు ప్రమోద్.  కిషన్ బీహార్ కి చెందిన కాంట్రాక్టు లేబర్, అతని భార్య అంజు, కొడుకు ప్రమోద్ తో  గత నాలుగు సంవత్సరాలు గా  సిమెంట్ పైపుల కంపెనీలో పనిచేస్తూ ఫైపులోనే కాపురం.  దాదాపు గా అన్నీ కుటుంబాల్లో  భార్య భర్తలిద్దరూ అక్కడే పనిచేస్తారు.

కిషన్  నివాసం ఉండే పైపు కి పక్క నే ఇంకో  పైపులో నివాసం ఉండే ప్రతాప్ అతని భార్య శివంతి  కూడా నాలుగు సంవత్సరాలు గా అక్కడే పని చేస్తున్నారు. పక్క పక్కనే ఉన్న రెండు పైపుల్లో కాపురం వల్ల  ఈ రెండు కుటుంబాల మధ్య  వచ్చిన కొద్ది రోజులకే  స్నేహం ఏర్పడింది.

నెలలో జీతం వచ్చే  ఆ రెండు రోజులు ఈ రెండు కుటుంబాలు  కలిసే బజారుకి వెళ్లి సరుకులు తెచ్చుకోవడం, అప్పుడప్పుడు సినిమాకి వెళ్లడం జరుగుతుంది.  కొన్ని వందల  కుటుంబాల్లో, కొందరు మహారాష్ట్ర నుండి, కొందరు బీహార్ నుండి, ఇంకొందరు పాలమూరు నుండి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు.  బీహారీలు మరాఠీల మధ్య  గొడవలు,  చంపుకోవడం   లాంటి విషయాలు వార్తల్లో  చూస్తుంటాం  కానీ, కడుపు చేత పట్టుకొని వచ్చిన వీళ్లు,  కలిసిమెలసి   ఉండటం చూస్తుంటే, కేవలం  రాజకీయ  నాయకులు వాళ్ళ  పబ్బం గడుపు కోవడం కోసమే ఆ  తేడాలు సృష్టిస్తున్నారని అర్థంచేసుకోవచ్చు.

అలుపెరుగకుండా రోజూ మూడు షిప్టులో మిషన్ లు తిరుగుతూనే ఉంటాయి. చాలా మంది ఆడవాళ్లు  ఇంటి పనులు, వంట పనులు చేసి, రెండవ షిఫ్ట్ లో పనికి వెళ్తారు. వచ్చిన కూలీ  తినడానికి సరిపోగా పెద్దగా  ఏమీ  మిగలదు. ప్రతి రోజు పనికి పోయి, గొడ్డు చాకిరి చేసొచ్చి రావడం తప్ప వాళ్ల భవిష్యత్తు గురించి ఆలోచించే  అవకాశమేరాదు రాదు వారికి.

***

మూడు  పూటలు- ఆరు  పైపుల్లా  సాగుతున్న వందలాది సిమెంట్  పైపు నిర్మాణ కార్మికుల జీవితాల్లోకి  ప్రపంచాన్ని వణికించిన కరోనా  మహమ్మారి తొంగి చూసింది. మార్చి24,2020 కరోనా మూలంగా  దేశంలో సంపూర్ణ లాక్డౌన్  అమలు చేసిన రోజు.  గిరా గిరా తిరిగే   వందల మిషన్లు, అలుపు సోలుపు లేకుండా చకా చకా పనులు చేసే వేలాది చేతులు- కాళ్ళు ఎక్కడివక్కడ  ఒక్క సారిగా ఆగి పోయాయి.

Ilustration by Ahobhilam Prabhakar (9490868288)

అందరి బతుకులు ఆగి పోయినట్టే  కిషన్,  ప్రతాప్ జీవితాలు కూడా ఒక్కసారిగా స్తంభించాయి.  ఏదో ఇరవై ఒక్క రోజులే కదా .. ఎలాగో  బ్రతుకొచ్చులే అని కిషన్, ప్రతాప్ కుటుంబాలు ఒకరి కొకరు ధైర్యం చెప్పుకున్నారు.   వారి కాంట్రాక్టు యజమాని మహారాష్ట్ర కు చెందిన కిశోర్ బుండేలా,   కుటుంబంలో ఎవరిదో  పెళ్లి కోసమని మహారాష్ట్ర వెళ్లి  అక్కడే ఇరుక్కు పోయాడు లాక్డౌన్ వల్ల.

మిగుల్చు కున్న అరకొర డబ్బులన్నీ ఖర్చు అయిపోతున్నాయి ఇద్దరి దగ్గర.  కంపెనీ నుండి రావలసిన జీతం వారి యజమాని కిశోర్  వస్తే కానీ ఇవ్వమని చెప్పిండ్రు కంపెనీ యాజమాన్యం.   కిషోర్ కి ఫోన్ చేస్తే ఎలా రావాలి అని  తిరిగి ప్రశ్నించాడు.  చేసేదేమీ లేక ఫోన్ కట్ చేసాడు నర్సింగ్.   మిగుల్చుకున్న కొన్ని డబ్బులు రోజుకు కొన్ని  ఖర్చు అవుతుంటే దిగులు మొదలయ్యింది కిషోర్ కి.

పిల్లవాడి కి అవసరం అయిన పాలు బిస్కట్ ల కోసం  బయటకు వెళ్ళిన కిషన్  ముడ్డి  పై  మూడు పోలీసు  లాఠీ మార్కులు పడ్డాయి కానీ కావాల్సిన దినుసులు ఏవీ దొరకలేదు.  క్రమంగా హైదరాబాద్, సికింద్రాబాద్ లో కరోనా మరణాలు ఎక్కువవుతున్నాయి.  రోజు రోజుకీ పెరుగుతున్న కరోనా మరణాల వల్ల  ప్రపంచమంతా   భయం తో వణకి పోతుంది.

ఇరవై ఒక్క రోజులు మాత్రమే అనుకున్న లాక్డౌన్  క్రమంగా పెరుగుతుంది.  మళ్ళీ ఫ్యాక్టరీ ఎప్పుడు తెరుస్తారో తెలియని పరిస్థితి. వారి యజమాని ఎప్పుడు వస్తాడో తెలియదు, కంపనీ నుండి రావాల్సిన డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియదు.  పరిస్థితి దిక్కు తోచకుండా ఉంది.  కనుచూపు మేరలో సమస్యకు పరిష్కారం కనపడటం లేదు.

రోజు రోజుకీ పెరుతున్న కరోనా వల్ల  అందరిలో తెలియని భయం పట్టుకుంది.  చూస్తుండగా  ఒక  పైపుల్లో కాపురం ఉంటున్న రెండు  ముసలి ప్రాణాలు  గాల్లో కలసి పోయాయి. అవి కరోనా మరణాలు అని కొందరు, కాదని కొందరు.  ఏది ఏమయినా కనీసం శవాలను చూడడానికి కూడా ఎవ్వరూ సాహసించలేదు. విషయం తెలిసి ఒక స్వచ్చంద సంస్థ వాళ్లు  శవాలను ఖననం చేశారు.  ఈ సంఘటనతో అందరిలోనూ భయం ఒక్కసారి పడగ విప్పింది, అందరి  ఆలోచనలు పదునెక్కాయి.  ఎట్లాగూ చావు  తప్పేట్లు లేదు, ఆ చచ్చేదేదో  మన ఊర్లోనే సద్దాం అని కొందరు  వలస కార్మికులు మూట ముల్లె సర్దుకుని వేల  కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ స్వంత ఊరికి కాలి బాట పట్టారు.

ఎప్పుడు చేరుతారో తెలియదు, ఎక్కడ పడుకోవాలో తెలియదు, ఎక్కడ తినాలో, ఎవరు తిండి  పెడతారో ఏదీ  ఆలోచించే స్థితిలో లేరు. ఉన్న ఆలోచనంతా  తమ స్వంత గూటికి చేరాలి, తమ కన్న  వాళ్ళ ను చూడాలి.  చావైనా , బ్రతుకైనా తమ వాళ్ళ మధ్యే!  అనుకున్నదే తడువు అందరూ కలసి కట్టుగా బయలు దేరారు, వారితో  పాటు కిషన్, ప్రతాప్ కుంటుంబాలు కూడా.

రోడ్డు పై నడవడానికి కూడా అనుమతి లేదు, హైవే ఎక్కితే పోలీసులు లాఠీలకు పని చెపుతున్నారు.   సందుల నుండి,  గొందుల నుండి , కాళ్లకు చెప్పులు కూడా లేకుండా కొంత మంది, నెత్తి  మీద మూటలతో, సంకలో  పిల్లల్తో కొందరు –  నడక, నడక, నడక … ఆకలి దప్పులను కూడా మరచి నడక… అలుపెరుగని నడక …  సందులలో కూడా పోలీసు లాఠీ దెబ్బలు  తప్పట్లేదు కొందరికి.  మానవత్వం మచ్చుకైనా కనపడని కొందరు భక్షక భటులు, లంచాలు తినడంలో మరిగిన వారు వలస కార్మికులనూ వదల లేదు.  కొంగు ముడుల్లో దాచుకున్న పదీ  పరక కూడా లాక్కున్నారు.  పిల్లాడి పాలకోసం దాచుకున్నచిల్లర డబ్బులు కూడా దోచుకున్న పోలీసులు కొందరయితే, కరోనా కి భయపడక,  రోజుల తరబడి భార్యా పిల్లల కి దూరంగా ఉండి తమ విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు ఇంకొందరు!

తమ స్వంత గూటికి చేరాలనుకుని ఇంటి దారి పట్టిన  వలస కార్మికులు , పలు ప్రాంతాల నుండి, ఎన్నో వేల సంఖ్యలో చేరడంతో, ఒకరికొకరు అండగా ఉండగా, మరింత ఆత్మ విశ్వాసం పెరిగింది వారిలో.  ఈ ప్రయాణాలు  ఆపడానికి ప్రయత్నించిన  ప్రభుత్వం,  వలస కార్మికుల మొండి పట్టుదల, మెజారిటీ  ముందు ఓడిపోయింది.   అప్పటికే కొన్ని స్వచ్చంద సంస్థలు వీరికి కావాల్సిన ఆహరం, నీళ్లు ఇవ్వడానికి సిద్ధం అయ్యారు.

గుంపులు గుంపులుగా వేలాది మంది జనం  సమ్మక్క సారక్క జాతరలా  ప్రతీ రోడ్డుపై ఒక జాతర దృశ్యం ఆవిష్కృతమైంది.  అందరితో పాటు కిషన్,ప్రతాప్ కుటుంబాలు కూడా అప్పటికే పదిహేను రోజులకి పైగా అయ్యింది రోడ్డెక్కి.

కాళ్ళు రక్తాలు కారుతున్నాయి, ఒక నిండు గర్భవతి రోడ్డు పైనే ప్రసవం అయ్యింది, కళ్ళ ముందే ఒక స్త్రీ నడుస్తూ పడి పోయి క్షణాల్లో కన్ను మూసింది.  అలసి సొలసి,  రైలు పట్టాలపై  విశ్రమిస్తున్న ఇరవై కి పైగా వలస కార్మికుల పై నుండి వెళ్లిన రైలు, వారి శరీరాలను ఛిద్రం చేసింది.  దారి మధ్యలో ఎన్నో భయంకరమైన వార్తలు, సంఘటనలు తెలుస్తున్నాయి,   అయినా మొక్కవోని ధైర్యంతో కిషన్, ప్రతాప్ కుటుంబాలు  కష్టాలను ఓర్చుకుంటూ  వేలాది మంది తోటి వలస కార్మికులతో  పాటు  ముందుకి నడుస్తూనే ఉన్నారు.  ఎక్కడయినా గ్రామస్తులు పంచిన ఆహారం తినడం , లేదంటే పస్తులతో నడవడం.

దాదాపు తెచ్చుకున్న డబ్బులన్నీ  అయిపోయాయి రెండు కుటుంబాల్లో.   పిల్లవాడి కోసం ఒక వంద రూపాయల వరకు తన  చీర బొడ్లో దాచుకుంది అంజు.  ఆకలై ఏదన్న కొనుక్కోవాలనుకున్నా, కేవలం పిల్లవాడికి మాత్రం కొనిచ్చి దాచిన   ఆ డబ్బుని  మాత్రం ముట్టలేదు.

నీది నాది అని చూడకుండా  ప్రతాప్, నర్సింగ్ లు ఏ అవసరానికి వెనుకకి పోయే  వారు కాదు. ఇంత కష్ట కాలంలో కూడా ఉన్నంతలో అందరూ కలసి తింటున్నారు, లేనప్పుడు ఎండుతున్నారు.    కొన్ని సార్లు రెండు రోజుల వరకూ నీళ్లు మాత్రమే తాగుతూ నడచిన రోజులు ఉన్నాయి.  అయినా తమ స్వంత గూటికి చేరుకోవాలనే ఆశల మధ్య  నడక మాత్రం  ఆగట్లేదు.

ఎన్నో ప్రజా సంఘాల విన్నపాలు,  విజ్ఞప్తులు వలస కార్మికుల  కష్టాలు విన్న తర్వాత ప్రభుత్వం కూడా దిగి వచ్చి వారి వారి స్వంత ఊర్లకు పోవడానికి బస్సులు,రైళ్లు  సమకూర్చింది ప్రత్యేకంగా.   వేలాది మంది వలస కార్మికుల కష్టాలు తీరే సమయం ఆసన్నం అయింది.  వారి  ఆనందానికి హద్దు లేదు, అందరి ముఖాల్లో ఒక ఆశాజనికమయిన  చిరునవ్వు.

ఆ  సంతోషం ఎంతోసేపు నిలవలేదు ప్రతాప్, నర్సింగ్  కుటుంబాల్లో!  ఎందుకంటే తెచ్చుకున్న డబ్బులన్నీ అయిపోయాయి.  గత నెలలో చేసిన పని తాల్లూకు డబ్బులు, ఈ నెలలో చేసిన పని తాలూకు డబ్బులు కంట్రాక్టు   యజమాని వస్తే గానీ  ఇవ్వమని అనడం వల్ల , రావలసిన వేల  రూపాయలు వదిలేసి , ప్రాణాలు అరచేతిలో పట్టుకుని రోడెక్కారు.

ఇప్పుడు బస్సెక్కి తమ ఊరికి  పోవాలంటే కనీసం అందరికీ వెయ్యి రూపాయలన్న కావాలి.  కానీ కొడుకు కోసం దాచిన వంద మినహా, ఎవ్వరి  చేతిలో చిల్లి గవ్వ లేదు.  కాళ్లు  బొబ్బలెక్కి రక్తాలు కారుతున్నాయి.   తమ రెక్కల కష్టాన్ని నమ్ముకున్న వాళ్లు, ఎప్పుడూ ఎవర్నీ చేయి చాపి అడిగింది లేదు.  ఉన్న దానిలో కలో, అంబలో  కాచుకుని సంసారాలు లాక్కొస్తున్న వీరి జీవితాల్లో ఎప్పుడూ రాని ఈ విపత్కర పరిస్థితికి మనసులోనే తిట్టుకుంటున్నారు.

ఇన్ని రోజులు  బస్సులు లేక తమ ఊరికి పోలేక పోయారు, ఇప్పుడు బస్సులు నడుస్తున్న సమయంలో చేతిలో చిల్లి గవ్వ లేదు.  ఇంత బాధను ఎప్పుడూ చూడని శివంతి కి దుఃఖం ఆగలేదు,  అంజు భుజం పై తల పెట్టి బావురు మంది.   శివంతి  బాధని చూసి అంజుకి కూడా  దుఃఖం ఆగలేదు., ఒకరినొకరు పట్టుకొని దుఃఖం తగ్గేవరకూ ఏడ్చారు.

ఈ గండం నుండి ఎలా గట్టెక్కడం?  ఊర్లో ఉన్న తన వృద్ధ తల్లి తండ్రులని ఎలా చేరుకోవడం? తీవ్రంగా ఆలోచిస్తున్నాడు  కిషన్.  ఈ బస్సుల వెసులు పాటు కేవలం రోడ్ల మీదున్న వలస కార్మికుల్ని ఇండ్లకు చేర్చడం వరకే.  అంటే ఆలస్యం చేస్తే, ఈ బస్సులు వెళ్లి పొతే మళ్లీ  బస్సులు నడుస్తాయనే  గ్యారంటీ లేదు.  హాయిగా కష్టాన్ని నమ్ముకుని జీవిస్తున్న తమ జీవితాలని బిక్షగాళ్ల కన్నా హీనంగా మార్చిన  ఈ కరోనా రేపిన కల్లోలం తలచుకుంటేనే దుఃఖం తో పాటు కనపడని ఆ శత్రువు పై  కోపం ఆగట్లేదు కిషన్ కి.

ఫోన్ రీచార్జ్ కి కూడా డబ్బులు లేక,ఫోన్ ఎప్పుడూ స్విచ్ ఆఫ్ లో పెట్టి  ఇద్దరూ ఒకటే ఫోన్ ని వాడుకుంటున్నారు చాలా పొదుపుగా అవసరం అయినప్పుడు మాత్రమే.    మరొక్క సారి తమ యజమాని  కిశోర్ బుండేలా తో మాట్లాడి చూద్దాం అని రింగ్ కలిపాడు కిషన్.  అవతల వైపు నుండి ఆయన భార్య ఫోన్ ఎత్తి, కిషోర్ వారం రోజుల క్రితమే కరోనా వల్ల  చనిపోయాడని ఏడుస్తూ చెప్పింది.

ఒక్క సారిగా కుప్పకూలి పోయాడు కిషన్. మూలిగే నక్కపై తాటిపండు పడినట్టు,  విషయం తెలిసి ప్రతాప్ కూడా నిశ్చేష్టుడయ్యాడు.   నేడు కాకపొతే రేపన్నా  డబ్బులు వస్తాయనే ఆశ ఉండేది, ఇప్పుడు ఆ ఆశ కూడా లేకుండా పోయింది అని కుమిలి కుమిలి ఏడ్చారు అందరూ.

ఏ మార్గం కనపడటం లేదు,   రేపొక్క రోజే బస్సులు నడుస్తాయని, బస్సులు  ఎప్పుడు ఎక్కడ నుండి బయలు దేరుతాయో టీవీల్లో, రేడియోలో ఆ  వివరాలు చెపుతున్నారు.  ప్రతాప్, శివంతి మహారాష్ట్ర వెళ్ళాలి,  కిషన్, అంజు  బీహార్ వెళ్లాలంటే  చాలా రాష్ట్రాలు  దాటి పోవాలి.  టికెట్ రేటు కూడా చాలా ఎక్కువే.  ఒంటి పై ఉన్న బంగారం అమ్ముకోవడం కన్నా వేరే మార్గం కనిపించలేదు వాళ్ళకి.

ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని వ్యాపార సంస్థలు మూసి వేయబడి ఉన్నాయి కాబట్టి ఎక్కడ అమ్మాలో కూడా తెలియడం లేదు.   వెదకగా,  వెదకగా ఒక గల్లీలో చిన్న దుకాణం అతను బంగారం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ దాదాపు సగం నష్టానికి.  ఎంతో  కష్టపడి సంపాదించుకున్న ఆ గొలుసుని సగం నష్టానికి అమ్మడానికి  ఎవ్వరికీ మనసొప్పలేదు.

చాలా మంది వలస కార్మికులకి   ఊర్లకు పోవడానికి కూడా డబ్బులు లేవు అనే విషయం తెలుసుకున్న ఒక జర్నలిస్టు, ఈ విషయాన్ని టివీల్లోనూ, సోషల్ మీడియాలోనూ చేసిన ప్రకటనకు కొన్ని స్వచ్ఛంద  సంస్థలు  ముందుకు వచ్చి కొందరికి టికెట్ డబ్బులు సమకూర్చారు, అందులో కిషన్, ప్రతాప్ రెండు కుటుంబాలకు పూర్తి టికెట్లను ఒక సంస్థ కొనిచ్చింది.   ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఆ బంగారాన్ని అమ్మకుండా సమస్య తీరినందుకు చాలా సంతోష పడ్డారు అందరూ.   గుంపులు  గుంపులుగా ఉన్న వలస కార్మికులు  తాము ఎక్కాల్సిన  బస్సుకోసం ఎదురుచూస్తున్నారు.

కరోనా   విపత్కర సమయంలో  ఎన్నో భయంకరమైన వార్తలు వింటూ , భవిష్యత్తును తలచుకుంటూ మరింత దగ్గరయ్యాయి ఈ రెండు కుటుంబాలు. ఊరు కాని  ఊరు,  బాష తెలియని ప్రాంతం, ప్రతి దానికి ఒకరికొకరు  చేదోడు వాదోడు  గా ఉండటం వల్ల ఇన్ని రోజులు  ఏ లోటు తెలియలేదు.

కీచు మని హారన్  కొడుతూ రివ్వున తీసుకొచ్చి  బస్సుని  రోడ్డు పై ఒక పక్కన ఆపాడు డ్రైవర్.

“ ఆ మహారాష్ట్రా..మహారాష్ట్రా – కొల్లాపూర్,రత్నగిరి ,సింధుదుర్గ్ “ కండక్టర్  అరుస్తున్నాడు బస్సులోనుండి దిగుతూ. ఒక  మొబైల్  మైక్ ని  భుజాన  వ్రేలాడదీసుకొని బస్సు పక్కన నిల్చొన్న ఇంకొక  సేవా సంస్థ ప్రతినిధి  గుంపులు, గుంపులుగా బస్సుల కోసం ఎదురు చూస్తున్న వలస కార్మికులకు వినబడేట్టు కండక్టరు చెప్పిన దాన్నే మళ్లీ మళ్ళీ   చెపుతున్నాడు  మైక్  లో అందరికీ వినబడేట్లు.

అప్పటి వరకు ఎక్కడెక్కడో కూర్చున్న మహారాష్ట్ర వలస కార్మికులు హడా విడిగా , వారి వారి మూట ముల్లె సర్దుకుని, చిన్న పిల్లలని ,  ఎత్తుకుని పరుగెడుతున్నారు బస్సు వైపు.  మహారాష్ట్ర కాకుండా  వేరే రాష్ట్రాలకు పోవాల్సిన వారిలో కొంత నిరాశ,  వాళ్ళ బస్సు ఎప్పుడు వస్తుందా అనే అసంతృప్తి వారి కళ్ళల్లో కనపడుతుంది.

గత నాలుగేళ్ళ నుండి మంచిలో  చెడులో అన్నదమ్ముల లాగా కలిసి ఉన్న రెండు  కుటుంబాలు  ఇప్పుడు విడిపోయే  సమయం వచ్చింది.  కొద్ది సేపట్లోనే మహారాష్ట్ర  పోయే బస్సు వచ్చి ఆగింది.  మహా రాష్ట్ర   బస్సు వచ్చిందని మైక్ లో అనౌన్స్  చేయగానే , ఇన్ని రోజుల  స్నేహానికి ఇక చరమగీతం పాడటం తప్పదని తెలిసి  అంజు, శివంతి ఒకరినొకరు పట్టుకుని బావురుమన్నారు.  వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారో  తెలియని పసివాడు ప్రశార్థకంగా ఇద్దరినీ చూస్తున్నాడు.

ప్రతాప్, శివంతి  కి వారి స్వంత ఊరికి చేరుతున్నామనే సంతోషం ఉన్నా ఇన్ని రోజుల స్నేహాన్ని విడి పోతున్నామనే  బాధే ఎక్కువయింది.    ఎవరి ఇండ్లకు వాళ్ళు వెళ్లడం సంతోషమే, కానీ బాధంతా  ఒకరికొకరు చెప్పుకోక పోయినా అందరి  మనస్సులను కలచి వేసేది ఒకటే “జీవితంలో మళ్ళీ కలుస్తామో లేదో! కరోనా మమ్మల్ని వదుల్తుందో లేదో, బతికి బట్టకడతామో లేదో!!” అనే దిగులు  మాత్రమే.  కిషన్ ప్రతాప్ లు గట్టిగా కౌగిలించుకున్నారు. ఇన్ని రోజుల స్నేహం ఒకవైపు కాగా,  ఈ నెలరోజుల ప్రయాణ జ్ఞాపకాలు రెండు కుటుంబాలని వదలట్లేదు.

నీళ్ల దగ్గరా , తిండి దగ్గరా  ఒకరి కోసం ఒకరు త్యాగం చేస్తూ సగం కడుపుతో పడుకున్న రోజులు, ఒకరికి ఆరోగ్యం బాగాలేనప్పుడు ఇంకొకరు పడిన వేదన, మందుల కోసం తిరిగిన వీధులు అన్నీ గుర్తుకొచ్చాయి.  పిల్లోడికి ఆకలిగా ఉన్నప్పుడు, దారిలో జ్వరం  వచ్చినప్పుడు ఆడవాళ్లు ఇద్దరూ పడిన మథనం అంతా ఇంతా కాదు.   కష్టాల్లో ఏర్పడిన స్నేహమే  కలకాలం నిలుస్తుంది అనడానికి ఈ రెండు కుటుంబాల స్నేహమే ఒక ఉదాహరణ.   కష్టకాలంలో  వందల కిలోమీటర్లు నడచిన వారి స్నేహం, దగ్గరయిన ఆ హృదయాలు ఇప్పుడు విడిపోవడానికి ఎవ్వరూ  సిద్ధంగా లేరు.

అతి కష్టం మీద మూట ముల్లె పట్టుకుని అందరూ  బస్సువైపు భారంగా అడుగులేస్తున్నారు.  పిల్లవాడి కోసం పార్ధు , శివంతి చేసిన సేవలు,  తిండి దగ్గర నీళ్ల దగ్గర, వాడు నడవ లేనప్పుడు,ఎత్తుకొని నడిచిన సంగతులన్నీ గుర్తుకొచ్చాయి అంజు కి.  తాను  అలసిపోయి ఒళ్ళుతెలియకుండా పడుకున్నప్పుడు శివంతి ప్రమోద్ ముడ్డి కడిగిన  సంగతులు  గుర్తుకొచ్చి కండ్ల లో నీళ్లు తిరిగాయి. అంతటి ఆత్మీయతని చూపిన  పార్థు ,  అంజు లు తమ నుండి దూరంగా వెళ్లి పోవడం తట్టుకోలేక పోతుంది.

కండక్టర్ తొందర చేస్తున్నాడు త్వర త్వరగా ఎక్కు మని.  అప్పటికే బస్సు కదలడానికి సిద్ధంగా ఉంది.    వాళ్ళ ఋణం ఏమిచ్చి తీర్చుకోవాలో అర్థం కాలేదు అంజుకి. రోజు రోజుకీ పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు  వింటుంటే  ఇంకొక వైపు జీవితంలో మళ్ళీ కలుస్తామో లేదో అని దిగులు ఇంకోవైపు పెరిగింది అంజుకి.     పార్థు- శివంగిల  దగ్గర ఒక్కపైసా లేదనే విషయం తెలుసు అంజుకి.   దారి ఖర్చుల కోసం ఏదో ఒకటి ఇవ్వాలని ఉంది, బొడ్లో దాచుకున్న డబ్బులు చూసింది ఎన్నున్నాయా అని? లెక్కపెట్టి చూస్తే యాభై రూపాయలు, అందులోంచి వెంటనే  ఇరవై అయిదు రూపాయలు తీసి శివంగి చేతిలో పెట్టింది.

“అందర్  చలో – అందర్  చలో !”  కండక్టర్ తొందర  చేస్తున్నాడు.  అసలు చేతిలో  ఏమి పెట్టిందో కూడా చూసుకునే వీలు లేదు శివంగికి.  మనసు తృప్తి గా ఉంది అంజుకి.   బస్సు కదులుతుంటే ఆ జనాల  మధ్య లోంచి చూస్తూ చేయి ఊపుతున్నారు  శివంతి, పార్థు.  ఎవ్వరి ముఖాలకీ మాస్కులు లేవు,   ఆరు ఫీట్ల దూరం పక్కకిపెడితే,, ఆరుఇంచుల దూరం కూడా లేదు ప్రయాణికుడికి, ప్రయాణికుడికి మధ్య.

చిన్న తొక్కిసలాటల మధ్య  వాళ్ళు  బస్సులోపలికి నడుస్తుంటే అలాగే నిలబడి భారంగా చూస్తున్నారు బస్సు లోపలికి.   అంతలోనే  బీహార్ .. బీహార్ అని  కండక్టర్ అరుస్తుండగా  ఇంకొక  బస్సు వచ్చి ఆగింది రోడ్డుకి ఇంకొక పక్కన.

మైక్ పట్టుకున్న  వాలంటీర్  మహారాష్ట్ర బస్సు దగ్గరి నుండి  బీహార్ వెళ్లే బస్సుదగ్గరికి వెళ్లి  “బీహార్ .. బీహార్ .. పాట్నా  ‘ అని అరుస్తున్నాడు చాలా దూరంగా  చెట్ల క్రింద,  షాపుల షెడ్డులకింద కూర్చున్న వందలాది వలస కార్మికులకు వినిపించేట్టు.  బీహార్ అని వినపడగానే, పరుగు పరుగున కదిలి వచ్చారు వందలాది మంది వలస కార్మికులు.

బస్సు రాగానే ఒక సీటు చూసుకొని కూర్చుంటే చాలు ఈ జన్మకి ఇంతకన్నా పెద్దకోరిక  ఏది ఉండబోదు అన్నట్టుగా అందరి ముఖాల్లో కొంత తృప్తి మాత్రం  కనిపిస్తుంది. ప్రమోద్ ని ఎత్తుకుని మూట ముల్లె తెచ్చుకోవడానికి పరుగెడుతున్నాడు కిషన్, అంజు కిషన్ వెంట పరుగు అందుకుంది.

మొత్తానికి  లగేజీ తెచ్చుకొని బస్సు ద్వారం వద్ద నిలుచున్నారు.  దాదాపు ముప్పై గంటల ప్రయాణం, తిండి ఎక్కడ దొరుకుకుతుందో  తెలియదు.   పెద్ద వాళ్ళు అయితే ఆకలికి తట్టుకోగలరు , మరి పిల్ల వాడి పరిస్థితి ఏంటి?   ఆలోచన వచ్చిందే తడువు  పిల్లవాణ్ణి కిషన్ పక్కన  సీటు లో కూర్చుండబెట్టి   బస్సు పక్కనే ఒకబండి పై బిస్కట్ లు, పాప్ కార్న్ లు అమ్ముతుంటే కొనడానికి దిగింది.  డబ్బులు చూసికుంది  , ఇరవై అయిదు రూపాయలు, బిస్కట్   పాకెట్  కి  పది రూపాయలు , పాప్ కార్ కి 5 రూపాయలు చెల్లించి పది  రూపాయలు మిగుల్చు కొని బస్సు ఎక్కింది.

ఒక స్వచ్చంద సంస్థ  వాటర్ బాటిల్స్ ఇస్తుంటే రెండు బాటిల్స్ తీసుకుని బస్సు ఎక్కింది. బస్సులో ఎక్కి కూర్చుని ఒక సారి కళ్లు మూసుకుంటే  గత నెలరోజుల తమ కష్టాలు, ఎండనకా , వాననకా, రోడ్డు పైనే నిద్రించిన రోజులు అన్ని కండ్లకు  కట్టి నట్టు గుర్తుకు వస్తుంటే,  తలుచుకుని లోలోపలే   కుమిలి పోయింది.  బస్సు కదులుతుంది.  తమ తల్లి తండ్రులని  కలసి నట్టు, వారితో మనస్పార్తిగా మాట్లాడుతున్నట్టు .. ఎన్నో  మధుర మైన ఊహలు ..బస్సు తో పాటు కిషన్ మనసు పరుగెడుతోంది.   ఎన్నో రోజుల నిద్ర లేని రాత్రుల తర్వాత, బస్సులో కూర్చునగానే ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియ లేదు ఇద్దరికీ.

***

“మామా .. బస్స్టాండ్  దాకా పోయేద్దాం దాం ! వలస కార్మికులకు గవర్నమెంట్ బస్సులేసిందట ఒక స్టోరీ చేసుకు రావాలి, చాలా రోజుల తర్వాత నాకు ఒక పని దొరికింది”  తన ఇంటి ముందు కుర్చీ ఏసుకుని ఫోన్ లో పబ్జీ  ఆట ఆడుతున్న నరేందర్ తో అన్నాడు జర్నలిస్టు సురేష్ తన బైక్ ని బయటకు తీస్తూ.   సురేష్, నరేందర్ చిన్నప్పటి ఫ్రెండ్స్ పక్క పక్క ఇండ్లలో నివసిస్తారు.

“సరే మామ, నడువ్..అదే చూస్తున్న..  ఇంట్ల కూసుండి- కూసుండి  బోరు కొడుతుంది” అని బైక్ పై కూర్చున్నాడు. సురేష్ బైక్  స్టార్ట్ చేసి బస్టాండు వైపుకి తీసుకుపోతున్నాడు తన బైక్ ని.

“నెల రోజుల పైనే అయ్యింది  మామ జీతం  లేక, పని మాత్రం చెప్తున్నరు, ఎప్పుడిస్తారో ఏమో జీతం“  అన్నాడు కొంత దిగులుగా సురేష్.

“ గదేంది మామ,  నన్ను అడగద్దా  ఒక సారి?  వారం రోజుల కింద రైతుబంధు పథకం పైసలు పడ్డయి బ్యాంకుల. మందుకొడదాం అంటే బార్లు బందు అయినాయ్. నాలికంత ఎండి పోయింది మామ మందు లేక నెలరోజుల నుండి” అన్నాడు నరేందర్ అసహనంతో.

నరేందర్  గత నాలుగేళ్ళ నుండి రియల్ ఎస్టేట్,  కన్స్ట్రక్షన్  కాంట్రాక్టర్  గాచేస్తున్నాడు.    తండ్రి నుండి వచ్చిన ముప్పై ఎకరాలకుపైగా  వ్యవసాయ భూమి ఇంతకుముందు కౌలుకిఇచ్చేవాడు. రైతుబంధు పథకం ప్రవేశపెట్టిన తర్వాత కౌలుకివ్వడం కూడా మానేసి ప్రభుత్వం నుండి సంవత్సరానికి రెండుసార్లు వస్తున్న లక్షల రూపాయలతో కాలక్షేపం చేస్తున్నాడు.

“నీకేంది మామ , మస్తు ఎంజాయ్ చేస్తున్నావ్, మస్తుంది లైఫ్” అన్నాడు సురేష్ ఏదో ఒకటి మాట్లాడాలని.

“వద్దంటే పైసల్ ఇస్తుంటే తీసుకుకోకుంటే ఏం  చేస్తం మామ?” అన్నాడు లాజిక్ గా నరేందర్.

“కరెక్టే కదా. కొన్ని  సేవింగ్స్ ఉన్నాయి మామ,  లేనప్పుడు అడుగుతానులే”  అన్నాడు మామూలుగానే  సురేష్.  అనవసరంగా  అప్పుచేసే అలవాటు లేదు సురేష్ కి.

“ పంటలేసే వారికీ, వేయని  వారికి అందరికీ ఊరికే  డబ్బులిస్తుంటే ఎవరయినా ఎందుకు తీసుకోరు?  ఒకరికి ఊరికే వచ్చిన డబ్బులు ఎక్కువ అయి ఖర్చు పెట్టడానికి ఇబ్బంది, ఇంకొకరికి చేసిన శ్రమకి డబ్బులురాక ఇబ్బంది” మనసులో అనుకున్నాడు తన పరిస్థితి ని బయటకి చెప్పలేక సురేష్.

అంతలోనే  బస్స్టాండ్  చేరుకున్నారు. “ఆదిలాబాదు బస్సు స్టాండు “ అని పెద్దగా రాసి ఉన్న సైన్ బోర్డు క్రింద   ఒక పక్కన బైక్ ని పార్క్  చేశాడు  సురేష్.   నరేందర్ కి ఇంకెవరో కలిస్తే  మందు దొడ్డి దారిలో ఎక్కడ దొరుకుతుందో కనుక్కుంటున్నాడు.  నరేందర్ ని  అక్కడే  ఉండమని, బస్సు లు దిగుతున్న , ఎక్కుతున్న వందలాది  మంది వలస కార్మికుల్ని చూస్తూ బస్టాండు లోపలి వెళ్ళాడు. ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలా అని ఆలోచిస్తుంటే   టాయ్లెట్ కనపడింది పక్కనే.

ఒక సిగరెట్ వెలిగించుకుని కొద్దిసేపు అక్కడే నిల్చున్నాడు.   ఆ తర్వాత టాయ్లెట్  లోపలికి వెళ్తుంటే  అక్కడ శుభ్రం చేసే స్త్రీ చేయి బయటకి పెట్టి “ ఒంటికి రెండు, రెంటికి అయిదు” అంది చాలా నిర్లక్షంగా.     ఓ.. ఇదోటి ఉంటుంది కదా బస్స్టాండులో అనుకుని పది నోటు ఇస్తే  అయిదు రూపాయల బిళ్ళ తిరిగి చేతిలో పెట్టింది ఆవిడ.

దాదాపు ఆరు గంటల  ప్రయాణం తర్వాత అంజు, కిషన్ లు ప్రయాణిస్తున్న  బస్సు అప్పుడే ఆదిలాబాదు   బస్టాపు లో ఆగింది. సమయం సాయంత్రం  ఏడు అవుతుంది.  రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుండి కూడా  చాలా  బస్సులు వచ్చి ఆగాయి.  ముప్పై నిముషాలు  బస్సు ఆగుతుందని, ఈ లోపల  అన్ని పనులు పూర్తి చేసుకుని రావాలి ఆదేశించాడు డ్రైవర్.   కొన్ని స్వచ్చంద సంస్థలు అక్కడ వలస కార్మికులకు కావలసిన పులిహోర ప్యాకెట్లు, మంచినీళ్లు ఇస్తున్నారు.   అప్పటికే అయిదు  గంటలకు పైగా కూర్చున్న  వారు   బాత్రూం కోసం చూస్తున్నారు.

అంజు కిషన్ , ప్రమోద్ తో పాటు బస్సు దిగారు, అప్పటికే పిల్లవాడు  ఒంటికి పోవడానికి  తొందర పెడుతున్నాడు. ఏమాత్రం   ఆలస్యం చేయకుండా   వెంటనే బస్సు దిగి  బస్స్టాండ్  పక్కనే   ఉన్న  చెట్ల పొదల్లో కి పోయి తండ్రీ  కొడుకులు ఇద్దరూ  కానిచ్చారు.  అప్పటికే  ఇద్దరు ముగ్గురు  గుర్రుగా చూసారు తండ్రి కొడుకులని.

ఈ ప్రత్యేక  బస్సుల వల్ల బస్టాండు మొత్తం చాలా రద్దీగా ఉంది.   ఎదురుగానే  టాయిలెట్ బోర్డు కనపడింది.  టాయిలెట్ లోకి వెళ్ళడానికి లోపల అడుగుపెట్టింది అంజు.    “ఒంటికి రెండు – రెంటికి ఐదు” ఎటో  చూస్తూ  చెపుతుంది లోపల ఒక టేబుల్ పై కూర్చున్న  ఆవిడ  నిర్లక్ష్యంగా .  ఆపుకోవడం చాలా కష్టముగా ఉంది  అంజుకి.  ఉన్నవే పది రూపాయలు, ఈ పది ఖర్చు అయితే మళ్లీ  పిల్లవాడికి ఏదన్న కొనాలంటే ఎలా? అని ఆలోచించుకొంది.  “లాక్ డౌన్  లో కూడా పైసలు వసూల్ చేస్తున్నారా?” అంది హిందీలో కొంత కోపంగా బయటకు వస్తూ.

“బస్సులు బందు అయినాక మాకు కూడా నెల రోజుల నుండి ఒక్క పైసా ఆందాని లేదు, మాదేమన్న సర్కారు నౌకరీనా? మేమేమి తిని బతికాలి? మాది మాత్రం కడుపు కాదా?”   అంది అంతే కోపంగా.    అది కూడా నిజమే కదా అని పించింది అంజుకి.   అప్పుడే పురుషుల టాయిలెట్  నుండి బయటకు వస్తున్న సురేష్ వారి సంభాషణ విన్నాడు.

కిషన్, ప్రమోద్ టాయ్లెట్ బయట నిలబడి ఉన్నారు.  “ఏమైంది వెళ్ళలేదు” అన్నాడు ప్రశార్థకంగా లోపలికి వెళ్లకుండా తిరిగి వచ్చిన అంజుని  చూసి.  మనదగ్గర ఉన్నయి మొత్తం పది రూపాయలు. ఈడ అయిదు రూపాయలు పెడితే బుడ్డోనికి  ఏమికొనియ్యాలి?  మనం ఇంకా ఇరవై గంటలకు పైగా ప్రయాణించాలి.  మీరు ఎక్కడ పోయిండ్రో చూపియ్యి, నేను కూడా అక్కడే పోతాను. నువ్వు నిలబడి చూస్తుండు అటు దిక్కు ఎవ్వరు రాకుండా “    అంది అయిదు రూపాయలు ఎలా పొదుపు చేయాలా అన్న విషయం ఆలోచిస్తూ.

హిందీలో  జరుగుతున్న  ఆ భార్య,  భర్తల  సంభాషణని  చాలా ఇంటరెస్టింగ్ గా వింటున్నాడు సురేష్.   వారి దయనీయ పరిస్థితి అర్థం అయ్యింది వారి మాటల ద్వారా.   ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే  జేబులో ఉన్న అయిదు రూపాయల బిళ్ళని టాయ్లెట్ అటెండెంట్  లేడీకి ఇచ్చి వచ్చాడు.

“నేను డబ్బులిచ్చాను నువ్వు వెళ్లొచ్చు” అని అంజు వైపు, కిషన్ వైపు చూసాడు జర్నలిస్టు.  అంజు భర్తవైపు చూసింది, సరేవెళ్ళు  అన్నట్టు కళ్ల తోటే సైగ చేసాడు.  ఇంకేమాత్రం ఆలోచించకుండా వెళ్ళింది కొంత ఇబ్బందిపడుతూ.

“ఈ ఊర్లో టాయ్లెట్ లో కాకుండా  బయట పొతే అయిదు వందల  రూపాయలు ఫైన్”  అంజు లోపలికి వెళ్ళాక చెప్పాడు కిషన్ కి పక్కనే రాసి ఉన్న బోర్డు చూపిస్తూ.   ఒక్కసారి జడుసుకున్నాడు కిషన్  ఆ మాటలు విని.

ఎక్కడి నుండి  వస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారని వివరాలు  కనుకున్నాడు సురేష్.  జరిగిన అన్ని వివరాలు చెప్పాడు కిషన్  బాధపడుతూ.   వారి దయనీయ  పరిస్థితికి  బాగా జాలేసింది సురేష్ కి.  జాలి పడితే అది కడుపు నింపదు  కదా ..? ఆలోచిస్తున్నాడు సురేష్ ఈకుటుంబానికి ఎలా సహాయపడనా అని. కరోనా కష్ట కాలంలో ఎవరినీ కదిలించినా  అన్నీ కన్నీటి కథలే!  ఉద్యోగం ఊడిన వారి కథలు ఒక విధంగా,  చిన్న చిన్న స్వంత వ్యాపారాల కథలు ఇంకోవిధంగా  అటు  కరెంటు బిల్లులు,  అద్దెలు  కట్ట లేక,  బ్యాంకులకు  ఇ.ఎం.ఐ లు కట్టలేక ఎన్నో అవస్థలు.   పర్సులో చూసాడు , ఒక అయిదు వందల నోటు ఉంది.

అంజు వెళ్లి  స్వచ్చంద సంస్థ  ఇస్తున్న పులిహోర ప్యాకెట్లు తెచ్చి కిషన్ కి, ప్రమోద్ కి ఒకటి ఇచ్చి తానూ ఒకటి తింటుంది. మనిషికి ఒకటి మాత్రమే ఇస్తున్నారు.   ఆవురావురుమని పులిహోర తింటున్న తీరు చూస్తే వారి ఆకలి ఎలాంటిదో అర్థం అయ్యింది సురేష్ కి.

 

పక్కనే ఉన్న షాపులో కొన్ని  బిస్కట్లు, కొన్ని పండ్లు కొని ఒక వంద తన దగ్గర పర్సులో పెట్టుకొని మిగతా  మూడు వందల రూపాయలని కిషన్ చేతిలో పెట్టాడు. ఇదంతా ఊహించని కిషన్ ఒక్క సారిగా ఆశ్చర్యానికి గురయ్యాడు.

“ భయ్యా”  అని  కళ్ళలో  నీరు సుడులు తిరుగుతుంటే సురేష్ రెండు చేతులని ఆప్యాయతతో తాకాడు ఇంకేమీ మాటాడలేక. అంజు క్రతఙ్ఞతగా రెండు చేతులు జోడిస్తూ  ఒక బిస్కెట్   పాకెట్ని  ప్రమోద్ చేతిలో పెట్టింది.  బిస్కట్ పాకెట్ ని చూడగానే  వాడి కళ్ళు సంతోషం తో మెరిసాయి.   డ్రైవర్ బస్సు హారన్  కొడుతున్నాడు అందరినీ లోపలికి రమ్మని.   కళ్ళలో నిండా కృతజ్ఞతతో బస్సు ఎక్కుతున్నారు కిషన్, అంజు, ప్రమోద్   సురేష్ వైపు చూస్తూ, చేతులు జోడిస్తూ !

బస్సులేశారని  వాళ్ళ సంతోషాన్ని కవర్ చేసుకునేందుకు వచ్చిన సురేష్ కి ఎక్కడా అలాంటి సంతోషం కనపడలేదు,  సరిగదా  శ్రమ చేసి సంపాదించడం మాత్రమే నేర్చిన లక్షలాది శ్రామికులు ఈ రోజు పైసాపైసాకు పడుతున్న తపన, బిక్షగాళ్లుగా మారి ఎవరి దయాదాక్షిణ్యాల పైననో  ఆధారపడటం కళ్ళముందు కనిపిస్తుంది. ప్రధాన మంత్రి చెప్పిన ఇరవై లక్షల కోట్లు ఎక్కడ ఎవరికి సహాయ పడుతున్నాయో తెలియదు.   వారి గమ్య స్థానాలకు చేరడానికి  వారు పడుతున్న  ఆవేదన,  దయనీయ పరిస్థితి కొట్టొచ్చినట్టు కనపడుతుంది.  ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు సురేష్ కి బాత్రూమ్ విషయం బాగా ఆలోచింపచేస్తుంది.

 

రెస్టారెంట్  తన కష్టమర్ల కు టాయ్లెట్ సౌకర్యం తప్పని సరిగా కల్పించాలి అని, టిక్కెట్టు పెట్టి సినిమా చూస్తున్న  ప్రేక్షకులకి థియేటర్లు విధిగా టాయ్లెట్ సౌకర్యం కల్పించాలి అని, అంతెందుకు ఒక నిమిషం  వెహికిల్ లో పెట్రోల్ కోసం ఆగే  కస్టమర్ల కోసం ప్రతి పెట్రోల్ బంక్ లో ఉచితంగా ఉపయోగించు మరుగుదొడ్లు  ఉండాలనీ నిబంధనలు పెడుతున్న ప్రభుత్వం, తమ నిర్వహణలో నడుస్తున్న ప్రభుత్వ బస్సుల్లో  టికెట్టు కొనుక్కొని  ప్రయాణిస్తున్న వారికోసం ఉచితంగా ఎందుకు టాయిలెట్లు నిర్వహించడం లేదు?  తమకో రూలు, పరులకో రూలు అన్నట్టు ఉంది ప్రభుత్వ నిర్వాకం.

రాయాలని వచ్చిన టాపిక్ ఒకటయితే, దానికన్నా ఇప్పుడు ఈ టాయ్లెట్ విషయమే  సురేష్ ని  మరింత గా ఆలోచింపచేస్తుంది.   రైతులని  ప్రభుత్వం  ఆదుకోవడం అవసరమే, అయితే వ్యవసాయం చేయని, ఎప్పుడూ నాగలి కూడా పట్టని భూస్వాముల  బ్యాంకు అక్కౌంట్ లో లక్షలు లక్షలు జమ చేయడం ఎంత వరకు అవసరం?  డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలో తెలియని  జల్సా రాయుళ్ల కోసం  లక్షలు, కోట్ల  ప్రభుత్వ సొమ్ము వృధా చేస్తుంటే,  మనిషి కనీస అవసరం అయిన  టాయ్లెట్ కోసం డబ్బులు చెల్లించి వెళ్లడం ఎంత దారుణం?

 

తనకు తోచిన మాటలన్నిటిని , మొబయిల్  ఫోన్లో ఆడియో రూపంలో రికార్డు చేసుకున్నాడు సురేష్.   బస్సు ముందుకు  వెళ్ళడానికి  డ్రైవర్ రివర్స్ గేరులో వెనుకకి వస్తుంటే , బస్సు గ్లాస్ విండో నుండి, అంత మంది మధ్యలోంచి కిషన్ కృతజ్ఞతతో తన వైపే చూస్తున్న చూపు, ఊపుతున్న చేయి  ఇప్పుడు తన కలానికి  ఒక కొత్త బాధ్యతని గుర్తుచేస్తున్నట్లనిపించింది సురేష్ కి, గుండె నిండా సంతృప్తి తో తాను రాయబోయే కథనాన్ని మనసులో ఊహిస్తూ తన బైక్ దగ్గరికి వెళ్తున్నాడు సురేష్.   నరేందర్  కళ్ళలో ఆనందం  పొంగి పొర్లుతుంటే  ఎదురు చూస్తున్నాడు సురేష్ కోసం చేతిలో రెండు ఫుల్ బాటిల్స్ తో!

-వేణు నక్షత్రం (U.S.A.)

 

You may also like

Leave a Comment