రాయి పూలను పూయించలేదు
కానీ తీగల్ని మోస్తూ ఆవాసమౌతుంది
ముళ్ళకంచెకూ పుష్పించే శక్తిలేదు
కానీ నేలజారే పూల తీగకు
తానొక ఆధారమవుతుంది…
మదిలో వేల వెతలు పయనిస్తున్నా
చిరునవ్వు పూలు కొన్ని దోసిట పడితే
ఆనంద సౌరభాలు పంచవచ్చు..
వేదన నదులను ఈదడం
జీవితానికి అలవాటవుతుంటేనే
అనుభవాల గవ్వలను సేకరించవచ్చు
ఆత్మవిశ్వాసమనే బలం
గుండెలో ఉదయించనిస్తే
ఒడిదుడుకులెన్నున్నా ఒడ్డుచేరవచ్చు..
కన్నుల కన్నీటి జలపాతాలతోనే
పెదవంచుల పూదోటను
నిత్యం సాగు చేయవచ్చు…!!
— అనూశ్రీ