Home వ్యాసాలు చిత్ర భారత కావ్యము

చిత్ర భారత కావ్యము

తెలంగాణ ప్రబంధాలు – పరిచయ మాలిక

నిర్వహణ:

– గురిజాల రామశేషయ్య రిటైర్డ్ అసోసియేట్ ప్రొఫెసర్ (తెలుగు)ఈ శీర్షిక క్రింద పరిచయం చేయబోతున్న తెలంగాణ ప్రబంధాలు:
1. చిత్ర భారతము- చరిగొండ ధర్మన్న
2. తపతీ సంవరణోపాఖ్యానము- అద్దంకి గంగాధరుడు
3. షట్చక్రవర్తి చరిత్ర – కామినేని మల్లారెడ్డి
4. యయాతి చరిత్రము – పొన్నిగంటి తెలగన్న
5. ముకుంద విలాసము – కాణాదం పెద్దన సోమయాజి

Photo: గురిజాల రామశేషయ్య రిటైర్డ్ అసోసియేట్ ప్రొఫెసర్ 

ఇవి ఈ శీర్షిక క్రింద పరిచయం చేయబోతున్న తెలంగాణ పంచ కావ్యాలు అనదగిన ఐదు ప్రబంధాలు

పరిచయ కర్తలు:
1. డా॥ సంగనభట్ల నరసయ్య, రిటైర్డ్ ప్రిన్సిపాల్.
2. డా॥బ్రాహ్మణపల్లి జయరాములు, రిటైర్డ్ ప్రిన్సిపాల్.
3. డా॥ మృదుల నందవరం, అసిస్టెంట్ ప్రొఫెసర్ (తెలుగు)
4. డా॥ సి.హెచ్ . లక్ష్మణ చక్రవర్తి, అసిస్టెంట్ ప్రొఫెసర్ (తెలుగు)
5. డా॥ గండ్ర లక్ష్మణరావు, రిటైర్డ్ అసోసియేట్ ప్రొఫెసర్.

ఈ రచయితల వ్యాసాలు తెలంగాణ ప్రబంధ మాలిక శీర్షిక లో వరుసగా ధారావాహికంగా వస్తాయి

తొలి ప్రబంధం ‘ చిత్ర భారతం ‘ గురించిన ఉపోద్ఘాతం మయూఖ ప్రథమ సంచిక (click this)లో ఉన్నది ,గమనించగలరు


చిత్ర భారత కావ్యము

ఈ చిత్ర భారత కావ్యము, బహుదీర్ఘకాలం అజ్ఞాతంలో ఉండిపోయింది. అవతరణకాలంలో అద్భుతంగా, సర్వప్రబంధకవులకు అనుసంధాయకంగా, ఆదరణీయంగా ఉండింది. దీని కర్త చరికొండ ధర్మన్న, కౌండిన్యస గోత్రుడు, ఆపస్తంభసూత్రుడు. తల్లిదండ్రులు చరిగొండ తిమ్మనామాత్యుడు, మాదమ్మలు. నారాయణ ధ్యానతత్పరుడు. భట్టపరాశరుని శిష్యుడు. ‘శతలేఖినీ’ సురత్రాణ బిరుదాంకితుడు.

చరిగొండ మహబూనగర్ జిల్లా గ్రామం. ఈ గ్రామ నామం ఇంటి పేరై ఈతడు కరీంనగర్ జిల్లాలోని ధర్మపురిలో నివాసమేర్పరచుకొన్న వంశము వారింటివాడైనాడు. ధర్మన్న పూర్వీకులు ధర్మపురి నివాసుని (శ్రీ లక్ష్మీనారసింహుని) భక్తలైనందున ఆ వంశమున వ్యక్తుల పేర్లకు ధర్మపురి లేదా ధర్మన్న పేర్లు పెట్టికొని ఉండవచ్చును. ధర్మపురి గ్రామ నామము వ్యక్తి నామముగా క్రీ.. 13వ శతాబ్ధం నాటికే ప్రసిద్ధము. (మాచర్ల ధర్మపురి అనే చారిత్రక వ్యక్తి – ఇనుగుర్తి (వరంగల్ మండలం) నివాసి ఒకడున్నాడు. ఇతడు ఇనుగుర్తిలో నరసింహాలయ నిర్మాత ధర్మపురి లక్ష్మీనారసింహుని వృద్ధాప్యమున సందర్శించలేక తన గ్రామమునందు నెలకొల్పుకొన్నాడు. స్వామియే దీనికి ప్రేరణ.)

ఈ గ్రంథము తొలుత వీరేశలింగము పంతులుగారు అచ్చువేసినాడు. తన చింతామణి మాసప్రతిక యందు ప్రచురించి, 1898లో తిరిగి పుస్తకంగా తెచ్చినాడు. బహుజనపల్లి సీతారామాచార్యుల శబ్ద రత్నాకరంలో ఇది ఉదాహృతం. పంతులుగారికి పోలవరపు జమీందారంగారు శ్రీ రాజా కొచ్చెర్లకోట రామచంద్ర వేంకట కృష్ణారావుగారిచ్చినారు.  దీనిని పరిష్కరించి శిథిల భాగములు పూరించి వాటిని వలయితములు చేసి (కుండలీకరణములలో ఇచ్చి) ధారావాహికముగా ప్రచురించి, గ్రంథరూపంగా తెచ్చామని, శుద్ధ్రపతి మరొక్కటి ఉంటే పంపమని వేడుకొంటూ, ఎంతో వినయంగా, ప్రమాణబుద్ధితో, సాహిత్యోద్ధారణా కంకణబద్ధులై పంతులుగారు పీఠికలో పై అంశాలు పేర్కొన్నారు.

దీనికి 36 స. తరువాత ఓలేటి వేంకటరామశాస్త్రిగారు 1934లో వావిళ్లవారి కొరకు పరిష్కరించవలసి వచ్చినది. వావిళ్ళ వేంకటేశ్వరశాస్త్రిగారు కోరగా, తమ వద్ద గల సంపూర్ణ చిత్రభారత ప్రతిని ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారము నుండి అందించారు. దానితో తైపారువేసి మరింత శుద్ధమైన ప్రతినిది తీర్చిదిద్ది ఓలేటివారు ప్రచురణార్థం వావిళ్ళ వారికిచ్చినారు.

వీరేశలింగం పంతులుగారు కృతిభర్తను ఇనుములపల్లి వారని, ప్రభువుపేరు మానభూనాథుడని పేర్కొన్నారు. కాని వేటూరి వారిచ్చిన ప్రతినాధారంగా ఇది వెనుముల పల్లిగా, ‘మానభూపాల చిత్తాంబుఖానఘనుడు’ అని పాఠమును స్వీకరించి నావిళ్ళ ప్రతిలో సవరించబడినది.

వీరేశలింగం పంతులుగారు తనకు పూర్తి పాఠం లభించక కావచ్చు, రాజు పేరు మానభూపాలుడని, ఈ కవికాలము శ్రీ రంగరాయల కాలమని, అతని కాలపు ఒక మాండలిక ప్రభువని తన ఆంధ్రకవుల చరిత్రలో ఊహించినారు. దానికి శ్రీ రంగరాజ సేవాపారంగత హృదయ (VIII-1) అన్న అష్టమాశ్వాస ప్రథమ పద్యమును ఉదాహరించినారు. ఓలేటివారు దీనినే గ్రహిఁచినారు. మొదటి రెండవ శ్రీ రంగరాయ ప్రభువుల (విజయనగర రాజులు) కాలముగ భావించి, కృతి నాయక వంశవర్ణనములోని కందాళ అప్పలాచార్యులను స్వీకరించి, తెనాలి రామకృష్ణుని కాలముగ భావించినారు. పై ఇరువురి అభిప్రాయములు సరియైనవి కావు. మాన భూపాలుడన్నది చిత్తాపఖానుని విశషణము. “శ్రీ రంగరాజ” అన్నది రాజు పేరు కాదు, శ్రీ రంగేశుని పేరు. శ్రీ రంగధామ సదృశ భట్ట ఫరాశర ప్రభు అని 17వ పద్యములో మరొకమారు ఇదే అర్థములో ప్రయోగించినాడు. చిత్తాపఖానుడు నాటికి చారిత్రక వ్యక్తిగా వీరికి తెలియదు. చిత్తాపఖానుని శాసనం నాటికి లభించలేదు. అయినా అతడు ఓరుగల్లు పాలకుడన్న సంగతిని వివరించిన కృత్యావతారికా పద్యములను వారు పట్టించుకొనలేదు. స్వీకరించినచో  ‘ఒక మండలేశ్వరుడ’ని ఓలేటివారు చెప్పేవారు కాదు. పైగా వారే పీఠికలో ఉట్టంకించిన కృతికర్తృ పరిచయ పద్యములో (సీ. కౌండిన్యస గోత్ర….. అన్న పద్యములో) మూడవ పాదాంతములో “శ్రీ రంగధామసదృశ” ఇత్యాది అంశములలో (శ్రీ రంగ రాయలు అన్న ఊహ) సరికాదని తెల్పుచున్నది.  కందాళ అప్పగురుడు తెనాలి రామకృష్ణుని కాలమునకే కాదు, గురుస్థానముగా, విస్తృత విశిష్టాద్వైత కుటుంబీకుల నామముగా ముందు తరములలో కూడా ఉండుటకు అవకాశమున్నది. శాసనస్థాధారములను బట్టి కాల నిర్ణయము ఈ వ్యాసంలో ముందు ముందు నిర్ణయిస్తాను.

శ్రీ వీరేశలింగంపంతులుగారు ఈ పరిష్కరణలో ఒక విశేషమైన మార్పును సూచించినాడు. చిత్తాంబుఖాన విభుడన్న రాజు పేరును ‘చిత్తాబ్జభాను’డని మార్చినాడు. అలా ఎందుకు మార్చినాడో తెలియదు. చిత్తాంబుఖానుడన్నది అర్థము సరిగా కుదరక మార్చినాడా? అర్థము కుదరకున్నను మార్చకూడదన్నది,  భవిష్యత్పరిష్కర్తలకు వదిలివేయాలన్నది పరిష్కర్త ప్రాథమిక నియమం కదా! పంతులుగారికిది తెలియదా? ఖాను / భానుల మధ్య అక్షర లేఖనం గురి్తంచలేనివారు కూడా కాదు, ఎందుకో మార్చారో కాని తరువాత శివతత్త్వసార పరిష్కరణ పీఠికలో శ్రీ కొమర్రాజువారు దీనిని నిర్మొహమాటంగా ఖండించి పంతులుగారిని తప్పుబట్టినారు. 13,14,67,72 సంఖ్య గల పద్యాల్లో 20వ సంఖ్య గల వచనంలో చిత్తాంబుఖానుడు (మూడుసార్లు పేర్కొనబడటం) పంతులుగారు గమనించలేదనేలేం.  కాని ఈ చిత్తాంబుఖానుడన్నది తురకరాజన్న సంగతి అంత సులభంగా గుర్తుపట్టలేం. హిందూ మతోద్ధారకునికంటే మిన్నగా హిందూ ధర్మమును ప్రతిష్ఠించినాడాతడు.

‘అనువత్సరంబు బ్రాహ్మణులకు గోసహస్రములిచ్చు, దేవభూదేవ తార్థిశ్రేణి కగ్రహారములిచ్చు, ఇందు శేఖర పాదారవింద యుగళ భావనాపరుడు (13వ పద్యం) మొదలైన విషయములు పంతులుగారు స్వీకరించి ఇతడు ఖాన్ అని భావింపక హిందూ రాజుగా ‘భాను’డని దిద్దినాడేమో!

కవికాలం :  చరిగొండ ధర్మన్న కాలం క్రీ.శ. 15వ శతాబ్ధి అంతం. చిత్రభారతం తొలి ముద్రణ 1934లో వావిళ్ళవారు ఓలేటి వేంకటరామశాస్త్రిగారి పరిష్కరణంలో ధర్మన్న మొదటి శ్రీ రంగరాయల కాలం (క్రీ.శ.1574-1585) వాడని భావించారు. కాని ఈ కాల నిర్ణయంలో ప్రామాణికత లేదు. సరియైంది కాదు. ధర్మన్న ఎక్కడివాడో వారికి తెలియదు. చిత్తాపుఖానుని గూర్చి నిశ్శబ్దంగానే ఉన్నారు. ఆనాటికి వనరులు లభ్యమానంగా లేవు. చరిగొండ ధర్మన్న కృతినంకితం చేసిన ఎనుములపల్లి పెద్దన్న చిత్తపుఖానుని మంత్రి.  ఈ రాజుకు షితాబుఖాన్ అని మరో పేరు. ఈతడు తొలుత హిందువే. సీతాపతిరాజు. చిత్తాంబుఖానుడని చిత్రభారతం తెల్పింది. ఈతనిని ఓరుగంటి ప్రభువుగా పేర్కొంది. వరంగల్ కోటలో షితాబ్ ఖాన్ సభామందిరం ఖుష్ మహల్ పేరుతో ఉంది. ఈ సుల్తాన్ శాసనం క్రీ.శ. 1504 నాటిది ఓరుగల్లు కోటలో ఉంది.

ఆ శాసనంలో

శాకాట్టే తత్త్వదేవ ప్రజి విభుగణితే రక్తసంవామి వర్షే

మాఘే పక్షా సితాఖ్యే…..

భోగే చిత్తా పఖాన క్షితిపతి….

ప్రాస్కందద్రాజధానీం….. రమ్యమేకోలపలఖ్యాం

  • వరంగల్ జిల్లా శాసనాలు, పే. 291, 111 శాసనం,

ఆర్కియాలజీ, ఆం.ప్ర. ప్రభుత్వ ప్రచురణ.

ఏకోపలాఖ్యాం = ఏకశిల అను పేరు గల, రాజధానీం = రాజధానిని

తత్త్వ = 25, దేవప్రజ విభు = 14, గణితే = లెక్కించగా = 1425 శ.సం. + 78 = 1504 క్రీ.శ.

రక్త సంవామి = రుధిర + ఉద్గారం

రుధిరోద్గాదరి మాఘశు. పంచమి 21 జనవరి, 1504 శాసనం. (ఈ శాసనం పూర్తి పాఠం, దానిలోని విశేషాలు వ్యాసం తరువాత అనుబంధంగా ఇచ్చాను.)

షితాబుఖానం రాజ్యకాలం క్రీ.శ. 1503-12 మధ్యలో ఉంది. పేరు మార్పిడికి కారణం తెలియదు కాని ఓరుగంటి నేలినప్పుడు హిందూ మతాభిమాని. ఆలయ నిర్మాత. ధర్మపురి ఆలయాన్ని ధ్వంసం చేసిన తురకలను శిక్షించిన పెద్దనను మంత్రిగా నియమించుకొన్నాడు. కుతుబ్ షాహీ ప్రభువులకు శ్రతువుగా మసలినాడు. ఓఢ్రగజపతి ప్రభువులకు విధేయుడు, సామంతుడు. వారి పక్షాన శ్రీకృష్ణదేవరాయలతో ధనుర్బలంతో పోరాడినాడని రాయవాచకం తెలిపింది. షితాబుఖాన్ ధనుర్విద్యాపారంగతుడు. (శాసనంలో ఈ వివరాలున్నాయి.) క్రీ.శ. 1500-1505 నడుమ చిత్రభారత రచన నడిచింది. కాలాన్ని ఇలా నిర్ధరించడానికి గల కారణం చరిగొండ ధర్మన్న తన కావ్యావతారికలో చిత్తాపఖానుడు ఓరుగల్లు నేలుతున్నాడని వర్తమాన కాలాన్ని సూచించాడు.

సీ.      అనువత్సరంబు బ్రాహ్మణులకు గో సహ

స్రములిచ్చు నృగ నరేశ్వరుని రీతి

గంధులకెనగ పాకాల చెర్వాదిగా

చెఱువులు నిలుపు సగరుని కరణి

దీవ్యత్పృతాపుడై దిగ్విజయంబుగా

వించు మాంధాతృభూ విభూనిలీల

దేవభూదేవతార్థి శ్రేణి కగ్రహా

రములిచ్చు భార్గవ రాము పగిది

తే.      నిందు శేఖర పాదార వింద యుగళ

భావనాపరుడంగనా పంచ బాణు

డతుల ధైర్యాభిభూత హిమాచలుండు

మన భూపాల చిత్తాంబు ఖానఘనుడు

– చిత్రభా – అవతా – 13

ముస్లింల ఏలుబడిలో పలు తెలంగాణా దుర్గములను పరిహృతంచేసి (జయించి) ఏలుతున్న చిత్తనభానుడు ఒక గొప్ప వీరుడైన రాజు, అతని మంత్రిగా ఏనుములపల్లి పెద్దన.

“ఆ రాజేంద్ర శిఖాపతంస నిజ బాహాయత్త విశ్వంభరాధేరేయుండు

ఎమ్ములపల్లి మాదవిభు పెద్దామాత్యుడు” (పీఠిక – 15వ వ.) అని చిత్రభారతము పేర్కొన్నది. “నిజ బాహా…..” అనడంలో పెద్దన కత్తి పట్టిన వీరుడని తెలుస్తోంది.

పెద్దనామాత్యుడే కాదు అతని వంశంలోని పూర్వులు కూడా యోధులే.  ఈతని పెత్తండ్రి కుమారుడు నరసింగ “సంగర స్థల విధారిత శాత్రపుడు” అని పేర్కొనబడ్డాడు. పెద్దన స్వంత తమ్ముడు సింగ కూడా మంత్రే.

చిత్తాపఖానుని వద్దే పని చేశాడు. రెండో తమ్ముడు ఓరుగల్లులో పాంచలీశ్వర దేవాలయ ప్రాంగణంలో లక్ష్మీదేవికి మందిరం కట్టినాడు. పెద్దనాన్న నారయ రెండో కుమారుడు రంగనాథుడు కూడా సైన్యాధిపతే. అతడు “దండనాథకుల శేఖరుడు…..” ఇతడు కొరవి నగరంలో నరసింహాలయం కట్టించాడు. కుటుంబం అంతా యోధులే. ఓరుగల్లు తురుష్కా కాలాంతం అయినాక తెలంగాణలో హిందూ మతస్థులకు రక్షణ కరువైంది. అనేక దేవాలయాలు పాడు చేశారు. హిందూ మతానికి పట్టిన దుర్గతి గూర్చి మిసతామ్ర శాసనం, మధురా విజయం అని తల్లి కలువచెరు శాసనం, వేదాంత దేశికుల అభీతిస్తవం మొదలగు గ్రంథాలు వేదాంత దేశికుల అభితిస్తవం మొదలగు గ్రంథాలు వివరంగా రాశాయి.

ముస్లిం సైన్యాలు క్రీ.శ. 1425లో ధర్మపురిలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని ధ్వంసం చేసి స్వామి యొక్క అపురూపమైన విగ్రహం పాడు చేయడం ‘స్వామి ద్రోహం’గా పేర్కొనబడింది. ఈ విగ్రహం గోదావరిలో పారవేయగా, 2010లో నది ఎండిపోయిన తర్వాత దొరికింది.  శిల్పం అద్భుతంగా అసిత చంద్రకాంత శిల పై చెక్కి ఉంది. షడ్భుజ నారసింహుడు హిరణ్యకపుని పొట్ట చీల్చిన పేగులను రెండు చేతులతో పైకెత్తినపుడు అవి హారాలుగా శిల్పి మలిచాడు. ఈ 1000 సం. ఈనాటి విగ్రహం తరువాతి విజయనగర రాజుల కాలపు ఆలయాల్లో కూడా శిల్పీకరించబడి మెరిసింది. హంపి విఠలాలయంలో, ఒంటిమిట్ట రామాలయంలో దీని ప్రతికృతులున్నాయి. ఈ ధర్మపురి లక్ష్మీనరసింహాలయాన్ని శిథిలంగా మార్చినాక ఒక 200 సం. పిదప క్రీ.శ.1693లో రుస్తుం దిల్ ఖాన్ మసీదుగా (మధ్యకాలంలో మారినదానికి) నిర్వహణ విధానాన్ని నిర్ధేశిస్తూ ఒక మౌజమ్ (మసీదు నిర్వాహకుణ్ణి)ను నియమించి వంద భీగాల భూమిని ఏర్పాటుచేసి దానపత్రం రాయించినాడు.

ఈ గ్రంథంలోని ఇతర అశ్వాసాది పద్యాల్లో ధర్మపురి నరసింహస్వామి ఆశీస్సులను వాంఛించి వర్ణించినారు.  ఎనుములపల్లి పెద్దన పూర్వీకులు కూడా స్థానిక దైవాన్ని కొలిచినవారే. స్వామివారి అనుగ్రంహంతో పుట్టినవారేనని పేర్కొనబడ్డారు. తాత సింగన నరసింహుని వరం చేత పుట్టినాడట. లతాయిలో అయి అనేది అమ్మ శబ్దం. ఇది మరాఠీ పదం. ధర్మపురిలో బ్రాహ్మణ స్త్రీలకు పేరు పక్కన ఉంటుంది. లక్ష్మింబాయి, అమృతాబాయి, రుక్కాబాయి, రాధాబాయి వంటి పేర్లు నేటికీ ఉన్నాయి. స్త్రీలకు సింగమ్మ, సింగపాని వంటి పేర్లున్నాయి.  స్వయంగా పెద్దన భార్య పేరు సింగసానే. పెద్దన వంశంవారు కుందాళ వంశీకుడైన గురువునను (కండాళప్పను) దీక్షాగురునిగా స్వీకరించారు. పెద్దన పెద్దనాన్న, తండ్రి అయిన నారయ, మాదయులు కందాళప్ప శిష్యులని చరిగొండ ధర్మన్న పేర్కొన్నాడు. ఈ కందాళ వంశీకులు నేటికీ లక్ష్మీనరసింహాలయంలో ఆస్థాన పురోహితులుగా కొనసాగుతున్నారు.

తాత నరసింగన్న కొరవిలో నరసింహాలయం కట్టించాడు. ఇది క్రీ.శ.14వ శ. ఉత్తరార్థంలో చివరి దశకంలో జరిగింది. ఈతని మనుమడుగా పెద్దన్న 1410 ప్రాంతాన పుట్టి ఉంటాడు. ధర్మపురి ఆలయ ధ్వంసం నాటికి 25 సం. కుర్రవాడు. అనేక యుద్ధాలు చేసిన ఈ పరాక్రమశాలికి గల బిరుదులు చిత్రభారతంలో పేర్కొనబడ్డాయి. 50 సం. వయస్సులో బహుశ షితాబ్ ఖాన్ కు మంత్రి అయినాడు. క్రీ.శ. 1475 ప్రాంతానికి ఓరుగంటి ప్రభువుకు మంత్రిగా, దండనాథునిగా ఉన్నాడు. ధర్మన్న చిత్రభారతాన్ని ఇదే సమయంలో రాసినాడు. షితాబ్ ఖాన్ కి ఓరుగల్లును అద్భుత వైభవోపేత రాజధాని నగరంగా వర్ణించినాడు. ఈ కావ్యకాలం నాటికి పెద్దన వృద్ధుడైనాడు. ఆ విషయం ఎలా తెల్సిందంటే ఈ పెద్దన ‘తత్పూర్వ రాజుల వద్ద పనిచేసి ప్రశంసలు పొందినాడట’ అని చిత్రభారతంలో పనిచేసి (ఎ-1) పేర్కొనబడ్డది. పెద్దన సైన్యాధిపతిగా శూరునిగా పేరుగాంచిన అనుభవంతో చిత్తాపఖాన్ మద్దతు చేరినాడు.

చిత్తాప్ ఖానుడు హిందూరాజు. ఖాన్ శబ్దం బహమనీల సైన్యంలో ప్రదర్శించిన పరాక్రమానికి లభించిన బిరుదు. అతడు ఓరుగల్లులో స్వయంభూ దేవాలయం. అలాగే పాంచల రామాలయం ‘కుజన తురుష్కులు ’ పాడు చేసిన వాటిని పునరుద్ధరించినట్లు వరంగల్ శాసనంలో పేర్కోబడ్డాడు. తురకల ఆలయమత విధ్వంసాలను ఇష్టపడని వీరిద్దరి రాజు, సైన్యాధిపతులుగా ఓరుగంటినేలి, హిందూ ధర్మాన్ని ఆలయాలను పునరుద్ధరించారు. షితాబ్ ఖాన్ పాకాల చెరువును బాగు చేసినట్లు శాసనంలో ఉంది.

పెద్దన మహారాజ వైభవంతో ఉన్నాడు. అతని వైభవం ఈ కావ్యంలో వర్ణించబడింది. ఈ వైభవం అంతా యుద్ధాల్లో విజేత కావడంవల్ల వచ్చింది. ఆ విషయం “సంగ్రామోపార్జిత భూరి భూవర సమగ్ర ప్రాభవా!” అని చిత్ర భారతంలో కృతికర్త చరిగొండ ధర్మన ఎనుముల పల్లి పెద్దనామాత్యుని (కృతిభర్తను) ప్రశంసించడం ధృవపరుస్తోంది. ఈ ప్రాభవం అంతా సంగ్రామాల్లో (యుద్ధాల్లో) ఉపార్జితం (సంపాదించినది)గా పేర్కొనడంబట్టి తెలుస్తుంది. పెద్దనామాత్యుని తమ్ముడు సింగన కూడా అన్నగారివలెనే, తాతగారివలెనే యోధుడై షితాబ్ ఖాన్కు విజయాలు చేకూర్చి, ఛత్ర చామరాందోళికాది సత్కారాలు పొందినాడని ఈ కావ్యంలో రాసి ఉంది.

పంపమహాకవికి వేములవాడనేలిన చాళుక్య ప్రభువు ఇమ్మడి అరికేసరి చేత ధారా-దత్తం ఐన గోదావరి తీరస్థ ధర్మపురి గ్రామం నేటికి గొప్ప చారిత్రక సాంస్కృతిక కేంద్రం. పింగళి సూరన తన కళాపూర్ణోదయంలో నాలుగు వేదాలు నలుగురు బ్రాహ్మణ కుమారులుగా ఈ గ్రామంలో పుట్టినట్టు రాసినాడు. ఈ ఊరిలోనే పుట్టిన చతుర్వేదులు నరసింహ భట్టు విజయనగర సామ్రాజ్యంలో చక్రవర్తి సదాశివరాయలచే మంత్రి అళియ రామరాయల చేత పల్లకీ మోయించుకున్న వేద స్పర్థా విజేత. ఇలాంటి పోతుగడ్డపై పుట్టిన బ్రాహ్మణుడు ఎనుములపల్లి పెద్దనామాత్యుడు యోధునిగా, ఖడ్గవీరునిగా, యుద్ధవిజేతగా, మహామంత్రిగా మనోహర కావ్యకృతి భర్తగా, పదిహేనవ శతాబ్దిలో మెరిసి శాశ్వత యశస్సంపన్నుడైనాడు.

కృతి భర్త పెద్దన గ్రంథం అంకితం స్వీకరించేనాటికి వయసులో చాలా పెద్దవాడు. ఆ సంగతి చిత్రభారతంలో ఓ పద్యంలో అంతస్సాక్ష్యం ఉంది. షితాబుఖాన్ కు మంత్రి అయ్యేనాటికే ఇతర పూర్వ ప్రభువులకు మంత్రిత్వము నెరసి ప్రశంసలు పొందినాడని “పూర్వక్ష్మానాయక వినుత చరిత! మాదయ పెద్దా!” (చతుర్థా-1) అని ధర్మన్న సంభోదించినాడు. అంతేకాదు ఎనుములపల్లి పెద్దనామాత్యుడు కేవలము బ్రాహ్మణుడైన అమాత్యుడు మాత్రమేగాక ఖడ్గము పట్టిన శూరుడు. “సంగ్రామోపార్జిత భూరి భూవర సమగ్ర ప్రాభవా” అని చి.భా.(VIII-142) అని ప్రశంసింపబడినవాడు. సుమారు 15 బిరుదములున్నవాడు. ఎనుములపల్లి పెద్దన తండ్రి మాదన, అన్న నారనలు కందాళప్ప గురుని వద్ద శుశ్రూష చేసినారు.

శా. వందారు వ్రజదోష మేఘపవనున్ వారాశి గంభీరున్ నా

నందాత్మున్ హరిపాదభక్తు నిఖిలామ్నాయజ్ఞు విశ్వంభరా

వందార క్షితిజాతమున్ నిగమ సన్మార్గ ప్రతిష్ఠా పరున్

కందాళప్ప గురున్ వివేకనిధి లోక ఖ్యాతు వర్ణించుచున్

కం. ఆదేశిక పద కమలము…. 1-36, 37ప.

అని కావించిన గురు ప్రశంసలోని కందాళప్ప గురువు తెనాలి రామకృష్ణుని కాలపు కందాళప్ప అని ప్రథమ సంపాదకులు పొరపడినారు. దానితో కాలనిర్ణయం తలకిందులై మొదటి శ్రీ రంగరాయల కాలానికి పోయింది. అంటే క్రీ.శ.1574-85 కాలము నాటికి కృతిభర్త పెద్దన తండ్రి మాదయామాత్యుడు తరలించబడినాడు. 1503 నాటి షితాబుఖాను మంత్రి పెద్దన ఓరుగల్లు నగరానికి మహామంత్రిగా ఉన్న విషయం నాటి కాల నిర్ణయములో పరిష్కర్తలకు తెలియదు. నాటికి పెద్దవాడైన పెద్దన 1425 ప్రాంతాల్లో పుట్టినాడు. ఆయన తండ్రి 1400 ప్రాంతంవాడు. అతని గురువు కందాళప్ప ఆ కాలమువాడే. ఈ కందాళప్ప సుప్రసిద్ధ వైష్ణవ క్షేత్రమైన ధర్మపురిలో స్థిరనివాసమేర్పరచుకుని దేవాలయ విధులలో స్వామికి నిత్యకళ్యాణాదులు నిర్వహించు పురోహిత కుటుంబమునకు మూలపురుషుడైన గురువు.  ఈయన కుటుంబీకులు నేటికి కందాళవారు దేవాలయ పౌరోహిత్యమును నిర్వహించుతున్నారు. కన్నడ మహాకవి పంపనికి ధారాదత్తమైన ఈ ధర్మపురి గ్రామము వేములవాడ చాళుక్యుల కాలమునుండే కన్నడ ప్రభావము ఎక్కువగా ఉన్న ప్రాంతం. కరీంనగర్ జిల్లాలో లభించిన శాసనములలో సగం కన్నడ శాసనాలే. దీనికి కారణం ఉత్తర తెలంగాణములోని నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలు కళ్యాణి చాళుక్యుల పాలిత ప్రాంతాలు. ధర్మపురికి 20 కి.మీ. దూరంలోని పొలవాస రాజధాని మేడెరాజు నుండి కాకతి రుద్రుడు గెలిచిన తరువాత (కాకతిరుద్రుని హనుమకొండ వేయిస్తంభాల గుడి శాసనము.) ఈ నేలపై తెలుగు శాసనములు కన్పట్టుచున్నవి. అందువల్ల ధర్మపురిపై కన్నడ ప్రభావం అధికమే. అప్పశబ్దవాచ్యులు కందాళప్ప మాత్రమే గాక, ధర్మపురి నారసింహునిపై నరసింహ శతకము రాసిన శేషప్ప కూడా అప్పశబ్దవాచ్యుడే. శేషప్పలోని అప్పశబ్దమునుబట్టి ఈతడు కన్నడ ప్రభావము గల రాయలసీమ ప్రాంతీయుడని కొందరు భావించుట తప్పు. అతడు క్రీ.శ.1735లో జన్మించి, 1825వరకు జీవించి ధర్మపురిలోని నివసించి, స్వామి కోవెలలో దీపరక్షకునిగా 3 రూ. వేతనముతో ఉద్యోగించిన మహాభక్తుడు. (శ్రీ ధర్మపురి చరిత్ర  –పే. 94) పెద్దనకు సమకాలికుడు లేదా కొంచెం చిన్నవాడైన చరిగొండ ధర్మన 1450-1500 ప్రాంతం వాడు. శ్రీ కృష్ణరాయల పట్టాభిషేక వత్సరము (1509)నకు ఇంచుమించు ఒక దశాబ్ది ముందు చిత్రభారతమును రాసినాడు.

చరిగొండ ధర్మన శతావధాని. వేదంలో అవధానం చరిత్రలో ఉంది. కాని సాహిత్యంలో తానొక శతావధానినని ప్రాచీన కాలంలో చెప్పుకొన్న కవి ఈతడే.

“శతాలేఖిన్య వదాన పద్య రచనా సంధా సురత్రాణ చిహ్నిత నామా!” అని కృతికర్త, మిత్రుడు, సహగ్రామవాసియైన పెద్దన నోరారా పిల్చినట్లు రాసికొన్నాడు. శతావధాని మాత్రమే కాదు, శతావధానులలో సురత్రాణు (సులతాను)డట. అంటే ఆనాడు తెలంగాణలో శతావధానులనేకులున్నారని తెలుస్తోంది. ఈయనకు ముందువాడైన రెండో ప్రతాపరుద్రుని ఓరుగల్లు నగరంలో ఆతని ఆశ్రయంలో మూడువందల మంది కవి పండితులుండేవారని తెలుస్తోంది. వారిలో వ్యాఖ్యాతృ చక్రవర్తి కోలాచలమల్లినాథుని తాత కోలాచల మల్లినాథయ్య రుద్రునిచేత స్వర్ణాభిషేకం చేయించుకున్నాడు.

శ్లో. కొలి చెల్మాన్వయాబ్దీందుః

మల్లినాథో మహాయశః

శతావధాన విఖ్యాతో

వీరరుద్రాభి వర్షితః

అన్న శ్లోకం సాక్ష్యమిస్తోంది. అతనికి మల్లినాథ ‘శతావధాని’ అన్నది పేరు.

ఇతన్ని చూసి భట్టుమూర్తి (రామరాజు భూషణుడు) ధర్మన వాడిన నాలుగు పదాలు వాడుతూ –

“శతలేఖినీ పద్య సంధాన ధేరేయు” అని రాసికొన్నాడు. ధర్మన అయితే బాహాటంగా “అవధాన” శబ్దమే వాడినాడు. అంతేకాదు ధర్మన “ప్రతిపద్య చమత్కృతి”తో ఒక శతావధానివలె ఎన్నో పద్యాలు గ్రంథం నిండా రాసినవి సాక్ష్యాలున్నాయి.

తెలుగునాట చిత్రభారతం తొలి ప్రబంధం అనువాద కావ్య ఫక్కి నుండి కవిత్రయమాదిగా శ్రీనాథుని వరకు గల పురాణాలు, శ్రీనాథాదుల కావ్యాలు ఒక్కసారిగా శిల్ప వైవిధ్యంతో ప్రబంధాలుగా మారినవి. ఈ మార్పుకు ఒక రకంగా సంస్కృతంలో ఉత్తమ కావ్యమైన శ్రీ హర్షుని ‘నైషధీయ చరితా’న్ని ఇష్టపడిన తెలుగు కవులు శ్రీనాథుని తదనువాదంతో ఉత్తమకావ్య శైలిని ఇష్టపడినారు. అదే ఆధునిక కాలపు ప్రబంధవాచ్య“ ప్రాచీనకావ్యము. తద్ జ్ఞులు ఈ రకమైన కావ్యములు రాయలయుగమువనిరి. ఎఱ్ఱనతో ప్రారంభమైన ప్రాథమిక లక్షణములతో సెలయేరువలె పారి, జీవనది ఐనదనిరి. కాని ఈ అభిప్రాయాలతోవారు చెప్పిన ప్రబంధాలే అవ్యాప్తి, అతివ్యాప్తి దోషాలతో లక్షణములు సరిపడనివైనవి. కాని చరిగొండ ధర్మన చిత్రభారతము మాత్రము ప్రబంధ లక్షణాలు మెండుగా, నిండుగా నిండిన తొలి కావ్యమై నిలిచినది.

శ్రీకృష్ణుని విజయగాథ ఏక వస్తుకంగా (వస్త్వైక్యం), వీరశృంగార రసాలు కావ్యగత కథాంశములలో నిర్భరమైనవి. ఇది కార్ణ్ష్య ప్రబంధము. అనగా కృష్ణుని వీరగాథ. శ్రీ కృష్ణుడే నాయకుడు (ఏక నాయకాశ్రితం), ఉపకథలు కేంద్రకథకు ఉపబలకంగా (పారిజాతాపహరణాదులు) ఉన్నాయి. అష్టాదశ వర్ణనలు రాజు, యుద్ధం, నది, ఋతువులు, వనం (కాననం), మ్నగయ, యాత్రలు, కథాసందర్భంగా వర్ణించబడ్డాయి. శబ్దాలంకారాలు, భావ చిత్రాలు ఎడనెడా ఉన్నాయి. సంవాద శైలి గురించి చెప్పే పనే లేదు. శ్రీకృష్ణార్జున యుద్ధం, తుల్య రంభాసంవాదాలు, కౌరవపాండవ సంవాదాలు నాటకీయతతో నిండినవి. రాజనీతి వర్ణన, నాయిక ఏడ్పు తొలుత ప్రవేశపెట్టినది ధర్మన్నే. ఇవన్నీ ప్రబంధ కవులకు ఒజ్జబంతుయ్యాయి. కృష్ణరాయలు, అల్లసాని పెద్దన, నంది తిమ్మన, రామరాజభూషణుడు, పింగళి నూతన ఇతనిని అనుకరించారు. అనుసరిఁచారన్నచో ఇంకా చెప్పే పనే లేదు.

తెలుగు సాహిత్యంలో తొలి కల్పిత కథా కావ్యం చిత్ర భారతమే. ఇది బ్రహ్మాండ పురాణోక్తమని ధర్మన (1-11) చెప్పినా అది ఔపచారికమే. పురాణాల్లో ఇది ఎక్కడా లేదు. తెలంగాణ కల్పిత పురాణగాథలకు గుడి వంటిది. బుద్ధారెడ్డి తన రామాయణంలో అనేక అవాల్మీకి గాథలను కల్పిత స్థానిక గాథలను చేర్చినాడు. కొరవిగోపరాజు మూలభిన్నంగా కథల్లో మార్పు చేసినాడు. సుప్రసిద్ధ కల్పిత కథా కావ్య నిర్మాత పింగళి సూరన మూలాలు తెలంగాణవే. చివరి ఇద్దరు, ఏకంగా తమ గాథల్లో ధర్మపురిని పేర్కొన్నారు. వీరి కఁటే ముందు ఈ గ్రామంపై అభిమానం ప్రకటించిన వీరిద్దరికి ఆదర్శమైన పూర్వజుడైన ధర్మపురివాసి ధర్మన ఏకంగా కావ్యమే విచిత్ర భారతంగా కల్పనగా రాసినాడు.  “కేవల కల్పనా కథలు కృత్రిమ రత్నములు” అని ఈసడించిన రామరాజభూషణుడు పింగళి సూరనను కాక ధర్మనను దృష్టిలో పెట్టుకొనే అని ఉంటాడు. ధర్మన, భట్టుమూర్తులు శతావధానులు.

రావిపాటి త్రిపురాంతకుడు రాసిన ధనాభిరామాన్ని తెనిగించిన నూతన కవి పేరయ. తొలి కల్పిత కథా కావ్య నిర్మాత అని సాహిత్యజ్ఞులు చెప్పినది తప్పు. అతడు అనువాదకుడు మాత్రమే. పైగా ధర్మనకు ముందు వాడని కాల నిర్ధారణ చేయలేం.

ఐతే చిత్ర భారతమే తొలి కల్పిత గాథ అనరాదు. వ్యాసమహర్షి శిష్యుడైన జైమిని ఒక కల్పిత (అబద్ధాల) భారతాన్ని సృష్టించి, గురువుకు అపచారమని భావించి, నదిలో గ్రంథాన్ని నిల్పగా వ్యాసుడే ప్రోత్సహించి వెలికి తీస్తే అశ్వమేధపర్వం మాత్రం మిగిలిందని అదే జైమిని భారతమని చెబుతారు. జైమినీ భారతమంతా కల్పితగాధ. అలాగే హరివంశపురాణంలో బాణాసుర గాథ, పౌండ్రకవామ దేవగాధ, శివకేశవ యుద్ధం (శివుని ఓటమి) వంటివి కాల్పనికాలు.

ధర్మనకు తరువాత ఈ చిత్ర భారత గాథను (శ్రీకృష్ణార్జున యుద్ధాన్ని నాదెండ్ల గోపమంత్రి శ్రీ కృష్ణార్జున సంవాదం అనే).

 

 

­­­­­­చరిగొండ ధర్మన్న రాసిన ఈ ‘చిత్రభారత’ కృతి నిజంగా విచిత్ర భారతమే. వ్యాస మహర్షి రాసిన మహాభారతానికి ప్రతికృతిగా జైమిని మహర్షి రాసిన అబద్ధాల చిత్ర విచిత్ర కథలతో భారతం రాసినాడు. దాన్ని తానే తిరిగి గంగానదీ సమర్పణం చేసి, గురువు ఆజ్ఞతో వెదకగా నదిలో ఒక అశ్వమేధ పర్వం మాత్రం దొరికిందని, దాన్నే జైమినీ భారతం అంటారని లోకగాథ. ఇది అబద్ధాల భారతమే. వ్యాసప్రోక్తం కాదు. ఈ జైమినీ భారతాశ్వమేధ పర్వం ధర్మనకు ప్రేరణ కావచ్చు. అశ్వమేధ పర్వంలోని అర్జున – ఉలూచిలకు పుట్టిన ఇలావంతుణ్ణి శ్రోతను చేసి పాతాళంలో శుకమహర్షి ఈ చిత్ర భారతాన్ని చెప్పినట్టు రాసినాడు. “పాక్తన రాజావళీ విశేష చరిత్రములలోన మిగుల నాశ్చర్యహేతువయిన కథ” (చి.భా.I-38) అని ధర్మనే పేర్కొన్నాడు. ఈ కథకు ఛాయాగాథలు ఇతఃపూర్వ పురాణములలో లేకపోలేదు.

తుల్యుడనే ముని తపస్సు చేసుకొంటూ ఉండగా, అతని తపస్సుకు తన సింహాసనం పోతుందని ఇంద్రుడు రంభాద్యప్పరసలను తపోభంగానికి పంపినాడు. రంభ తపోభంగ యత్నంలో తాను భంగపడి, తుల్యునిచేత శప్తురాలై గుఱ్ఱమైపోతుంది. క్షమించమని ప్రార్థించిన రంభకు, తుల్యుడు శాపవిమోచనం అనుగ్రహిస్తూ కుండినపురం ఏలే చతుర్ధన మహారాజుకు అశ్వమై, ముల్లోకాలు తిప్పితే పూర్వరూపం వస్తుందని చెపుతాడు. రంభ చతుర్ధన మహారాజుకు తర్వాతి కాలంలో వేటకు వెళ్ళినప్పుడు లభించి, అశ్వమై ముల్లోకాలు తిప్పుతూ, అలసటతో ఆకాశమార్గాన నురగ కక్కుతుంది. ఆ నురగ ద్వారకలో రాజ్యమేలే కృష్ణుడు ఓ ప్రభాతవేళ సూర్యునికి అర్ఘ్యమిస్తుండగా అతని దోసిట పడుతుంది. (నీ హయోత్తమంబు నెమ్మొగంబున బుట్టి ఫేనఖండమనిల వేగవశము; నందదంబు తర్పణము సేయు కృష్ణుని; హస్తయుగళ జలము లందుబడియె అని చిత్రభారతం, పంచ (162). కృష్ణుడు కోపించి చతుర్ధనుణ్ణి చంపడానికి శపథం చేస్తాడు. రంభ ఇచ్చిన మంత్రబలంతో వివిధ దేవతలనాకర్షించి శరణు అడుగుతాడు. ఇంద్రుడు కృష్ణునితో యుద్ధమునకు అశక్తత తెలిపి గతంలో తాను పారిజాతాపహరణ గాథ ప్రసక్తం తెస్తాడు. శివుని శరణు కోరగా తానూ తన అశక్తతను తెలిపి, గతంలో ఉషా పరిణయ సందర్భమున బాణాసుర రక్షణలో యుద్ధము చేసి విఫలుణ్ణయ్యానని చెపుతాడు. (107-106 ప. చిత్రభారతం, ఉషాపరిణయ గాథ), బ్రహ్మను శరణు కోరగా గోహరణగాథను (173-179 ప.) శ్రీ కృష్ణుని బాల్యంలో తను విఫలుణ్ణయ్యానని (గోవర్ధనగిరి కథ – భాగవతం) తన అశక్తతను తెలుపుతాడు. చతుర్ధనుడు ఒక భిల్లుని వలన తన రాజ్యానికి వచ్చిన అర్జునుని గూర్చి విని, అర్జునుని శరణు కోరుతాడు. అభయమిచ్చి, ఆ వెనుక విషయం తెలిసి, కృష్ణునితో వైరానికి ఇష్టం లేకున్నా, అర్జునుడు తన శరణాగత వత్సల బిరుదు వ్యర్థమవుతుందని భావించి, పాండవ కౌరవ సమేతంగా కృష్ణునితో యుద్ధం చేస్తాడు. యాదవ పాండవ రణంలో కృష్ణుడు అందరినీ వధిస్తాడు. ఒక్క ధర్మరాజును చంపడు. ధర్మజ ప్రార్థనతో తిరిగి అందరూ పునర్జీవితులై కథ సుఖాంతం అవుతుంది.

ఆశ్చర్య హేతువైన కథా నిర్మాణం : ధర్మన్న చెప్పినట్టే ఇది “మిగుల ఆశ్చర్యహేతువైన” కథ. తెలుగువారికి ప్రసిద్ధులైన వ్యక్తులు జగడమాడితే చాలా ఇష్టం. అర్జునుడు, కృష్ణుడు ఇందులో జగడమాడినారు. కృష్ణార్జునులే కాదు. కృష్ణాంజనేయులు, రామాంజనేయులు, రామలవకుశులు యుద్ధాలు చేయడం ఈ కథలన్ని సృష్టించి, కావ్యాలుగా, నాటకాలుగా, యక్షగానాలుగా తెలుగువారు మలచుకొన్నారు.

ఈ చిత్ర భారత కల్పిత కథ పింగళి సూరనకు మరో కల్పిత కావ్యం (కళాపూర్ణోదయం) రాయడానికి ప్రేరణ అయింది. అల్లసాని పెద్దన ప్రబంధాల్లో వేట వర్ణనకు, కృష్ణదేవరాయలు ఆముక్త మాల్యదలో రాజనీతి రాయడానికి, నంది తిమ్మనకు పారిజాత పహరణ గాథ రాయడానికి, కనపర్తి అబ్బయామాత్యుడు అనిరుద్ధ చరిత్ర రాయడానికి, ఇంకా ఎందరికో కథాభిక్ష, వర్ణనాభిక్ష ప్రసాదించిన ఘనకావ్యం ఇది. నురుగు దోసిట్లో పడిందని ధర్మన్న రాయగా, ఉమ్మిపైనుంచి పడిందని చిలకమర్తి రాశారు. చతుర్ధన మహారాజుకు బదులు, గయుడు దోషి ఇక్కడ. యక్షగానంలో మరో పేరు. ఈ విధంగా కథలో చిన్న చిన్న మార్పులు జరిగాయి. దైవమైన కృష్ణుని చేతిలో గయుడు ఉమ్మివేయడం కంటే, పై లోకాల్లో విహరించే గుర్రం అలసి, నురగలు కక్కి, గాలికి జారి, కృష్ణుని చేతిలో పడిందన్న ధర్మన్న కథే ఔచిత్యవంతంగా ఉంది. చిలకమర్తి కాలానికి కృష్ణార్జునులు విరగ దిట్టుకున్నారు. ధర్మన్న కాలానికి పాత్రల ఔచిత్యానికి భంగం కలుగలేదు. ధర్మన్న ఔచిత్యాన్ని పాటించే సుకవి. రాను రాను తెలుగువారికి దూషణయుద్ధాలే రుచించాయి. కాలప్రభావమది.

ఇది చిత్రభారతం . కథ విచిత్రం. భారత పాత్రలే కాని, వ్యాసుని భారత పాత్రల లక్షణాలున్నవే కావి, భారతంలో లేని వింత సంఘటనలుంటాయి. చతుర్ధనుణ్ణి ముందుగా తెలియక అతనికి అభయమిచ్చి తత్కారణంగా ప్రాణసఖుడు, బావ, పాండవ రక్షకుడైన శ్రీ కృష్ణునితో యుద్ధ సన్నద్ధుడు కావడం ఓ వింత కథ. దీని వెంబడి అనేక చిత్రాలు.

ఆధునిక కథ (చిలుకమర్తి వారిది) లోని ప్రతి నాయకుడు గయుడు అన్ని లోకాలు తిరుగుతాడు శరణుకోసం. ధర్మన్న కథలోని ఈ గయుని స్థానములో ఉన్న చతుర్ధనుడు భూలోక ప్రభువు. అతనికి రంభ ఇచ్చిన మంత్రం వల్ల అందరూ దేవతలను తన వద్దకే రప్పించుకుంటాడు. అర్జునుడు కూడా కుండిన రాజ్యహద్దుల్లోకే వస్తాడు. భిల్లుని వల్ల సమాచారం తెలిసి రాజైన చతుర్ధనుడు అర్జునుని శరణు వేడుతాడు.

ఘోషా యాత్రలో మూలభారతంలో చిత్ర రథుడు దుర్యోధనాదులను బంధించి పట్టుకుపోయినప్పుడు ధర్మరాజు తమ్ములతో “వయం పంచాధికశతం” (మనం నూట ఐదుగురం) అని శ్రతువు నిర్జించేందుకు కౌరవులు పాండవులు ఏకం కావాలంటాడు. ఇక్కడ చిత్రభారతంలో నిజంగా కృష్ణునితో యుద్ధానికి ఏకం అయినారు.  దుర్యోధనులు పాండవ పక్షాన పోరాడుతారు. ధర్మజార్జునులు భీష్మునితో యుద్ధం గూర్చి అనుమతి, సంప్రదింపులు చేస్తారు. అర్జునుడు సర్వసైన్యాధ్యక్షుడుగా ఉంటాడు. భీష్మాదులు మామూలు యోధులు. కర్ణుడు అర్జునుని పరాక్రమాన్ని ప్రశంసిస్తాడు. ఇది భారతంలో మనం చూడని అంశం. “నిర్జర కోటులెత్తి వచ్చినా గెలవలేరీ అర్జునుని, కృష్ణుడెంతపాటి” అంటాడు. భారత యుద్ధంలో లాగే వ్యూహాలు, మానుషవ్యూహం, సూచీవ్యూహం, శకట వ్యూహం, పద్మవ్యూహం- ఇలా ధర్మన్న కొన్ని కొత్త వ్యూహాలు సూచించినాడు.

కృష్ణుడు అక్రూరుని రాయబారంకు పంపితే, ధర్మరాజు సహదేవుణ్ణి రాయబారానికి పంపుతాడు. మహాభారతంలో కృష్ణుడు పాండవుల పక్షాన రాయబారానికి వెళ్ళి వైరిపక్షస్తుతిలో దుర్యోధనాదులకు కోపం తెప్పించి సంధి చెడగొట్టినట్టే సహదేవుడు సంధి చెడగొట్టుతాడు. కృష్ణుడు యుద్ధంలో అందరినీ చంపినాడు. ఒక్క ధర్మరాజును చంపలేదు. భీష్ముని కూడా చంపినాడు. ధర్మరాజు అందరు తమ్ములు చనిపోయాక హృదయ విచారకంగా ఏడుస్తాడు. తాత భీష్ముని పట్టుకొని నీ ఇచ్ఛామరణం కూడా మొక్కపోయెనని బాధపడతాడు. కృష్ణునికే జాలివేసి, ధర్మరాజును అనుగ్రహించి, ఒక్కరిని బ్రతికిస్తానని కోరుకొమ్మంటే ధర్మరాజు ఒక్క చతుర్ధనుణ్ణి బతికించమంటాడు. ధర్మరాజు ధర్మానికి మెచ్చి, కృష్ణుడు అందరినీ బ్రతికిస్తాడు. ‘పోరి దైవోపహతుండు పోవు కడకుం బోవుంగదా యాపదల్’ అన్నట్టు తుల్యుని వల్ల ఇంద్రునికి ముప్పు, ఇంద్రుని వల్ల రంభకు ముప్పు, రంభ (గుఱ్ఱం) వల్ల

చతుర్ధనునికి, అతనివల్ల అర్జునునికి, అర్జునునివల్ల భీష్మాదులకు ముప్పువాటిల్లింది. చతుర్ధనుడు నిజంగా దైవో (కృష్ణో) పహతుడే. ఇలా కథలో ఎన్నో విచిత్రాలు.

నోరూరించే కవిత్వం :

తరువాత ప్రబంధ కవులందరికీ నోరూరించిన ధర్మన కవనం, సుమనోహరం. ‘తెనె సోక నోరు తీయన అగురీతి’ ఉంటుంది. శైలి, శిల్పం, సంవిధానం, ఎత్తుగడలు, అలంకారాలు,భావాలు చాలా మధురంగా ఉంటాయి. కవిత్వ శైలి గుఱ్ఱంలా ఉండాలని, గుఱ్ఱం (రంభ) సత్ర్పబంధంలా ఉందని చెపుతాడు.

కం||   పదముల చొప్పున వడి యొ

ప్పిదము నలంకార లక్ష్మి పేర్మియు ధారా

స్పద భావము గల్గి శుభ

ప్రదమై హయమమరె సత్ర్పబంధము రీతిన్ (III-160)

శ్లేషచమత్మృతులు కొల్లలు

కం||   వినుడానది శ్రుతి బాహ్యులు

అనవరతము కుటిలగతులు నగు భోగివరుల్

తనవారిలోన మెలగిన

తనవారిగ జేసి హరుని తల యెక్కించెన్

శ్రుతిబాహ్యులు = వేదనిందకులు, చెవులు లేని పాములని

కుటిల గతులు = సత్ర్పవర్తనా హీనులు, వంకరగా పాకే పాములు

భోగివరులు = భోగలాలసులు, పడగలు గల పాములు

తన వారిలోన = తన నీళ్ళలో, తనవైపు వారుగా

(వారి = తెలుగులో వారు, సంస్కృతంలో నీరు) అని చాలా సరళం ద్వ్యర్థి సాధించాడు.

అనుప్రాస సౌందర్యం కావ్యమంతటా ప్రదర్శించినాడు. పోతనకు సమకాలికుడైన ఈ కవి పోతన భాగవతం చూసాడో లేదో కాని ‘పోతన శైలి’ని ప్రదర్శించినాడు.

హరి పెకిలించి తెచ్చి వివాహగాధిపుపై నిడియెన్ముందంబునన్

స్మరహరమౌళి చంద్ర సహజాతము, బంధుర గంధలుబ్ధ ష

ట్చరణ పరీతమున్, సతత సత్ఫల పోషిత దేవజాతమున్,

తరుణ పలాశ పుష్ప సముదాయ సమేతము, పారిజాతమున్ (చి.భా.V-98)

 

మలయము నేలి, పద్మినుల మంజుల సౌరభములగ్రోలి, పు

ప్వుల గనుపట్టు మేలి తరువుల్ముదమందగవ్రాలి, కైతకం

బుల బొడకట్టు ధూళి దివిబోవగద్రోలి, మృదుతశీలియై

కలయజరించె చల్లనగు గాలి సదాను సరన్మదాలియై      (చి.భా.V-109)

 

ప్రతి సీస పద్యం చివరలో యమకాన్ని ప్రదర్శించినాడు.

సీ||    కొలది మీరిన యట్టి కొమ్ములు నెమ్ముల

తోరంబులైతోచు తొడలు మెడలు

గరమమై చూపట్టు శిరములు సురములు

పలు తెరంగుల మించు పండ్లు రొండ్లు

ఇంకో విశేషమేమంటే మొత్తం సీసం 8 అర్థాల్లోని శరీరాంగాలే. ఔరా అనిపించేలా ఉందీ పద్యం.

పోతన్న ప్రసిద్ధ పద్యం జ్యావల్లీ ధ్వని గర్జనంబుగ, సురల్ సారంగ యూధంబుగా’ అన్న సత్యభామాయుద్ధ ఘట్టంలో యుద్ధాన్ని వర్షంతో పోల్చినది ధర్మన్న భారతంలోనూ ఉంది.

 

ము|| రమణీయంబగు పాంచజన్య జనితారవంబు గర్జా విశే

షముగా, ఖడ్గమరీచీజాలము తటిత్సంఘంబుగా, నుగ్రచా

పముగా, ఖడ్గమరీచీజాలము తటిత్సంఘంబుగా, నుగ్రచా

పము దేవేంద్ర శరాసనంబుగను, శుంభత్కృష్ణ మేఘంబు పా

ర్థ మహాగ్నిచ్చట మీది కేగ శరధారా ఖేలనోన్మాదియై                 (VII-55)

రంభ అశ్వంగా మారినాక వర్ణిస్తూ….

సీ||    ప్రియుని కెమ్మోని చుంబింప నోపని లేమ

కఠిన ఖలీన మేగతి వహించు                  (కళ్ళెం)

హారంబు బరువని అలయు లతాతవ్వి

వాగ్ల నెట్టికైవడి ధరించు                         (జీను)

అని రాసిన ఈ పద్యం

‘వీణె చక్కగ బట్టు వెరవెరులగని కొమ్మ

బాణాసంసంబెట్లు పట్ట నేర్చు…’

అన్న పోతన పద్యాన్ని తలపిస్తోంది.

వర్ణనలు అతి వేలంగా వర్ణించడు. సందర్భం వస్తే వదలడు. ఔచిత్యానికి పెద్ద పీట. స్త్రీ అంగాంగ వర్ణనలు, అతివేల శృఁగారాలు ఇష్టపడడు. తుల్యుని తపోభంగం చేయడాన్కి వచ్చిన వేశ్యులు అతనిని లోబర్చుకోవడానికి ఎన్నో శృంగారాంశాలు పలికినారు. కాని వాటిని ధర్మన వర్ణించడు. “వ్రాయగారాని పలుకులు పలికెనపుడు (III-30)” అని ఔచిత్యవంతంగా ముగించాడు.

సమకాలీనాంశాలు కావ్యాల్లో పొదిగే లక్షణం ఉంది. నాటి సామాజికాంశాలైన అప్పులు, వడ్డీలు, అప్పుపత్రాలు, అర్జంటు పద్దులు, మొండి బాకీలు ఈ క్రింది రెండు పద్యాల్లో శ్లేషతో వర్ణించాడు.

కరములు చాపి వడ్డిడుటకై బుధశుక్రుల సాక్షివెట్టి య

యయ్యరుణుడు భూమిచేత తగ నప్పులు గైకొని యియ్యికున్నచో

ధర తనమూల వృద్ధులకు దక్కక సాగిన వారి గూర్చి “య

క్క ఱగుడి” వ్రాసియాగె ననగా పరిశేషము చుట్టెనాతనిన్  చి.భా. II-16

బుధుడు = పండితుడు; శుక్రుడు = నీతివేత్త వీళ్ళిద్దరు సాక్ష్యంగా భూమి అరుణునికి అప్పు (నీరు) ఇచ్చింది. ఇవ్వక అరుణుడు పారిపోయినాడు. సూర్యుని సారధి ఉంటాడా మరి! చెయ్యి చాపి తీసికొన్నాడు. వడ్డీ ఇస్తానన్నాడు. ఎండాకాలంలో తీసికొన్న నీటికి మరిన్ని జలాలు (వర్షకాలంలో) భూమికి అందాలి. ధరకు (భూమికి) తన మూలవృద్ధులు అసలూ వడ్డీ (వృద్ధి ప్రకృతి, వడ్డి వికృతి పదాలు) రెండు పొయ్యాయి. ఉన్న నీళ్ళన్నీ భూమి మీద ఎండిపొయ్యాయి. అరుణుడు ‘అర్జంటు పద్దు’ ఐనాడు. అందుకని వాడి పేరును చిట్టాలో గుండం (అక్కర గుడి) పెట్టిందట. సూర్యునిచుట్టు గూడు కట్టడాన్ని ఇక్కడ వర్ణించినాడు. (కరములు = చేతులు, కిరణాలు; బుధ = పండితుడు; బుధ శుక్రులు సాక్షి = బుధ శుక్రవారాల్లో మూలవృద్ధులు = అసలు + వంశమూలాలైన ముసలివారికి తాగడానికి నీరు లేక అని).

పంటలకు అప్పులు, పత్రాలు మరో చోట వర్ణించాడు.

తరుపులకు మేఘడప్పులు దానొసగి

యవి వసంతునికిమ్మని యప్పగింప

దానికి ఫలములియ్య పత్రంబులిచ్చె

ననగ దరువుల పత్రంబులవని రాలె           (చి.భా.II-102)

చరిగొండ ధర్మన్న తన భారతంలో అంతకుపూర్వం భారతాదుల్లో చెప్పినట్టు రాజనీతులు, సంఘనీతులు, రాజసేవక లక్షణాలు నారదుడు చతుర్ధన మహారాజుకు చెప్పినట్లు రాసినాడు. రాయబారి లక్షణాలు ఇలా ఉండాలట.

వినయ వివేక భూషణు, ప్రవీణు, కులీను, పరేంగితజ్ఞు, స

త్యనిరతు, బుద్ధిమంతు, నుచితప్రదు, గార్యధురంధరున్, కృపా

త్ము, నతి గుణాకరున్, పతిహితున్ జననాథుడు రాయబారి జే

సిన నతడెట్టులైన ఫలసిద్ధిగ జేయు సమస్తకృత్యముల్              చి.భా.VI-92

భూపాలుడు ప్రజల  నుంచి భూఫల సాయం (ధాన్యరూపంలో పన్ను = కోరు) తీసికునేటప్పుడు ప్రజలను బాధపెట్టక తుమ్మెద పూల తేనెను పూల నుండి స్వీకరించినట్టు స్వీకరించాలన్నాడు.

అరి కోరు గొనెడుతరి భూ

వరుడు ప్రజల మనసు నలపవలదు దలపన్

ధరణి కుసుమముల గలిగిన

పరిమళములు గొనెడు తేటి బాగున నధిపా!                 V-52

ధర్మన్న కవితా భిక్ష :

అనంతర ప్రబంధ కవులకు అనుకరణీయంగా ధర్మన రచన సాగింది. ధర్మన చతుర్థనమహారాజు తన తప్పిదానికి వగచే ఘట్టం, అల్లసాని ప్రవరుని వగపు ఘట్టంతో, చతుర్ధనుని వేట, స్వరోచివేటతో సంవదిస్తాయి. నంది తిమ్మన పారిజాతాపహరణ ఘట్టం – ధర్మన పారిజాతాపహరణ ఘట్టం నుండి చాలా అనుకరించిందే.

ఎ)              ఈసున గోపమున నన్మదివహించి పులోమజ వేడి మాటకై

గాసిలి మేన సొమ్ముడిపి కన్నుల గ్రమ్మెడు నీట చందనం

బోసరిలంగ జేసి శిరమొయ్యెన వంచి కపోల  పాళిపై

చేసమకొల్పి యొక్క యెడ చింతిలుచుండె నంతలోపలన్

ఈసునబుట్టి డెందమున…..

గాసిలియెడ్చె…. అని తిమ్మన రాసినాడీ పద్యభావమును. సొమ్ముడిపి అని ధర్మన అంటే నిరస్తభూషయై అని తిమ్మన రాసినాడు.

బి)              ఆరమి శిరోమి బ్రియంబున గౌగిట జేర్చి, కంటినీ

రారిచి, చిక్కువడ్డ కురులల్లన కొప్పున దోపి, యక్కునం

బేరులు చక్కదిద్ది, వలిపెంబు చనుంగవ గేలగొల్పి, యం

భోరుహ పత్రలోచనుడు మోము గరంబున నెత్తి, యిట్లనున్

అని ధర్మన రాయగా దీనిని తిమ్మన పారిజాతాపహరణంలో

ఆరమణీలాలామ మదినంటిన కోపభరంబున నిల్పగా

నేరక నెవ్వగం బొగుల నీరజనాభుడు నిండు గౌగిటం

జేరిచి బుజ్జగించి నునుజెక్కుల జాలుకొనంగ జారు క

న్నీరు కరంబు నందుడిచి నెయ్యము దియ్యము దోపనిట్లనున్

రెండూ ఉత్పలమాలలే, ఆద్యంత శబ్దాలు సమానం. ప్రాసాక్షరం సమానం. కౌగిట చేర్చడం, కన్నీరార్చడం వగైరాలు సమానం. ధర్మన యొక్క కృష్ణుని బుజ్జగింపులు అధికంగా (ఆరువిధాలుగా) ఉన్నాయి.

సి) “పారిజాతంబె నీ యుద్యాన వీధి బెట్టెద ననుచున్” అని ధర్మన్న అంటే, “పెరటి చెట్టుగ నాటింతు పెంపుగనుము” అని తిమ్మన అన్నాడు.

డి) ప్రబంధ నాయకల ఏడ్పు ధర్మన్నతో ప్రారంభమైంది.

ఏమిటి కింతవంత తరళేక్షణ చెప్పుమటన్నలేచి య

బ్భామిని చన్నుదోయిపై పయ్యెద కొంగు దలంగి జాఱ, నె

మ్మోమరవాల్చి, యూరుపుల ముంగర ముత్యము గంద, నేడిచెన్

గోమల నూతన స్వరము గ్రోలుచు కోయిల పిల్లయో యనన్       V-94

ఏమిటి కింతవంత అని ధర్మన అనగా

ఇంతవంత నీకేల అని తిమ్మన రాసినాడు.

ఇ) కోయిల పిల్ల ఏడ్చినట్టని ధర్మన అంటే ఆడకోయిల (కలకంఠ వధువు) అని తిమ్మన రాసినాడు. నాయిక అందంగా ఏడ్చే విధానం ధర్మన్నే తొలుత ప్రవేశపెట్టినాడు. ధర్మన పారిజాతపహరణ గాథ (సంక్షిప్తంగా చిత్ర భారతంలో రాసిన దానిని), తిమ్మన పారిజాతపహరణ గాథగా మలచుకొని సంబోధనలు, ఎత్తుగడలు, భావాలు, పాత్రల అంగచాలనాలు మొ|| వాటిలో అనుసరించడం జరిగిందనేది దాచేసే దాగని సత్యం.

మహాభారత యుద్ధం మిగతా యుద్ధాలకంటే భిన్నంగా అన్నదమ్ముల మధ్య యుద్ధం. చిత్రభారత యుద్ధం బావ బావమరదుల మధ్య. అందువల్ల రాయబారాలు, రాయబారుల మధ్య బాంధవ్య మర్యాదలు క్షేమ సమాచారాలు, కుశల ప్రశ్నలు, ఆ తరువాతే యుద్ధ రాయబారాలు, సందిమాటలూ, చరిగొండ ధర్మన్న చిత్ర భారత రాయబారాలూ రెండూ (అక్రూర, సహదేవ రాయబారాలు) ఇలాగే నడిచాయి. ఈ మర్యాదలను కృష్ణరాయబారంలో తిరుపతి వేంకటకవులు (పాండవోద్యోగ నాటకం), అక్రూర రాయబారంలో చిలకమర్తి లక్ష్మీనరసంహం (గయోపాఖ్యానం) వాడుకున్నారు.

హరికిన్ సేమమె, సీరికిన్ ముదమె సాత్యక్యాది తత్సోదరుల్

పరిణామంబున నున్నవారె, శుకుడున్ ప్రద్యుమ్నుడున్, సాంబుడున్

తరుడున్ మోదముతో జెలంగుదురే, యోధ శ్రేణికిన్ లెస్సయే

తరుణీ సంఘము సంతసంబొదవ నిత్యశ్రీల వర్తిల్లునే                చి.భా. VI-53.

ఈ పద్యం ‘బావా ఎప్పడు వచ్చితీవు’లో తొంగి చూస్తుంది.

ముదమేయత్తకు, ధర్మరాజునకు సమ్మోదంటె, భీముండు స

మ్మద లీలన్ విహరించునే, కుశలమ మత్ర్పాణమై, పొల్చునా

త్రిదశాధీశ్వర సూతికిన్, నకులుడుం బ్రీతాత్ముడే, సౌఖ్య సం

పదబాంచాలి మెలంగునే, పరిజనుల్ భవ్యాత్ములే యెప్పుడున్   చి.భా. VI-102

అన్న పద్యం

ధర్మపరావతారుడగు ధర్మజుడున్నె ప్రమోదియై, గదా

మర్మ విదుండు భీమునకు మంగలమే కదా, సేమమౌనె స

త్కార్ముకపాణి పార్థునకు, ధన్యసురూప విలాసులాకవల్

నిర్మల సౌఖ్యపాత్రులే, నీరజలోచన కృష్ణకేరునే!

అన్న చిలకమర్తి వారి (గయోపాఖ్యాన) పద్యాన్ని జ్ఞాపకం చేస్తోంది. సహదేవుడు ఎదురుగా ఉన్నాడు, కనుక నకులుని మాత్రము సేమమడిగినాడు. పైగా అత్త కుంతి కుశలం అధికంగా ధర్మన్నలో కనబడుతుంది. “కౌరవ బలము నుగ్రత – 1-18 అన్న ధర్మన్న పద్యము “ధార్త రాష్ట్రులు వృకోదరు నీసుమై జంప విషబోఝనంబు పెట్టునాడు…” అన్న చిలకమర్తి వారి పద్యము ఒకే ఎత్తుగడ, ఒకే ఛందము (సీసము) ఒకే భావముతో (కృష్ణాధిక్యతను గుర్తుచేస్తూ) సాగుతాయి. “మనుజాధీశుల జెప్పనేల…. (V-191), ఏమి చేయువాడనిట్టి …. (V-200), నిటలాక్షుండిపుడెత్తి వచ్చినను రానీ వంటి గయోపాఖ్యాన పద్యాలతో సంవదిస్తాయి. ఘట్టాలకు ఘట్టాలు సంవదించడం విశేషం.

మధ్యయుగాల్లో విఖ్యాతుడై, కవిత్వ విశేషాలతో, ప్రతిభాయుత ప్రయోగాలతో ధన్యుడైన ధర్మనకు తెలుగు సాహిత్య చరిత్రలో రావల్సినంత ఖ్యాతి రాలేదన్నది వాస్తవం.

శతలేఖిన్యవధాన పద్య రచనా సంధా సురత్రాణ చి

హ్నితనామా! చరిగొండ ధర్మసుకవీ! నీ వాగ్విలాసంబులా

శితికంఠోజ్జ్వల జూటకోటరకుటీ శీతాంశురేఖ సుధా

న్విత గంగా కనకాబ్జ నిర్భర రసావిర్భూత మాధుర్యముల్!

  • డా|| సంగనభట్ల నర్సయ్య

You may also like

2 comments

మంత్రవాది వీరవెంకట సత్యనారాయణ November 16, 2021 - 7:05 am

సర్….నమస్కారం…శ్రీమాన్ శిరిశినహళ్ కృష్ణమాచార్యుల వారి చిత్రప్రబంధం దొరుకుతుందా…అవకాశం ఉంటే పీడీఎఫ్ పెట్టగలరు

Reply
Radhakrishna Rao yareeda May 15, 2023 - 2:04 am

అద్భుతమైన చిత్రభారత కావ్యాన్ని దుమ్ము దులిపి ఎఅంతో కష్ట పడి వెలుగు లోకి తెచ్చిన మీకు పాదాభివందనాలు

Reply

Leave a Comment