*వంటిల్లు*
నేను భోజన ప్రియుణ్నే కాదు
జనప్రియుణ్ని కూడా.
తినేటప్పుడు
ఎవరైనా తోడుండాలి.
వంటింట్లో అన్నం ఉడుకుతుంటే
ఆ చుట్టు పక్కల్నే
పచారులు చేసేవాణ్ని
వీడికి ఆకలెక్కువ అనేది మా అమ్మ.
కొత్తిమీర సువాసన నాకిష్టం
వాటి ఆకులు
కళాత్మక రమ్యంగా కూడా వుంటాయి.
వాటి నెవరో కత్తిరించి
ట్రిమ్ చేశారన్నాడు నలిమెల భాస్కర్.
పోపులో
పసుపు వేసి కలుపుతుంటే
బంగారాన్ని కరిగించి నట్టుంటుంది.
ఉల్లిపాయలను
ఓపిగ్గా గోలిస్తాను గాని
కోసేటప్పుడు రాలే
కన్నీటి చినుకులను మాత్రం తట్టుకోలేను.
తినేటప్పుడు
ఒక్క మెతుకు కూడా
కింద పడనివ్వను.
పడ్డా, మళ్ళీ పళ్లెంలో వేసుకొని
పండించిన రైతును తలుచుకుంటాను.
నాలుక పొడవు జానెడే కావచ్చు
కాని వేలాది సంవత్సరాల
పాకశాస్త్ర ప్రస్థానానికది
తిరుగు లేని సూచిక.
వంటింటి దినుసులకు
పునరుక్తి దోషం ఉండదు.
అన్నం పాతదే కావచ్చు
ఆకలి మాత్రం కొత్తది.
అయితే ఒకటి
భోజనానికే కాదు నేను
పనికి కూడా తయారు.
అందుకే నాపైన
మా ఆవిడ ప్రేమ చెక్కు చెదరలేదు.
— *డా౹౹ ఎన్. గోపి*
2 comments
Nice lines
రుచికరమైన కవిత సార్