జ్యోతికి పన్నెండు, పదమూడు సంవత్సరాలు. చాలా చలాకీ పిల్ల. అమెరికా నుండి తల్లిదండ్రులతో సహా ఒక నెలరోజులు గడపటానికి హన్మకొండ వచ్చింది. వాళ్ళ బామ్మ, అమ్మమ్మ, తాతమ్మలతో వారి అనుభవాలను తెలుసుకొని ఒక వ్యాసమో, కథో వ్రాయాలని ఒకటే ఉబలాటం. తాతమ్మ శాంతాదేవి దగ్గర చనువెక్కువ. మీ తరానికి యిప్పటికి పోలికలు, తేడాలు తెలుపమని ఒకటే గొడవ. ముని మనవరాలు పోరు పడలేక శాంతాదేవి ఇలా చెప్పసాగింది. మా అప్పుడు తొమ్మది, పది సంవత్సరాల వయసుకే పెళ్ళిళ్ళు చేసేవారు. నాకు మా అత్తలు ముగ్గురు అక్కచెళ్ళెలు.
ఒకామె ఇగో హన్మకొండ, మీ ముత్తాత గారి తల్లి, ఇంకొకామె దేశముఖుగారి భార్య. మూడవ ఆమె బాలవితంతువు.
జ్యోతి వెంటనే అడిగేసింది : అయ్యో తాతమ్మా! మరి ఆ తాతమ్మకు మళ్లీ పెళ్ళి చేయలేదా?
శాంతాదేవి : ఆ కాలంలో చెయ్యలేదే. మాటికి అడ్డం రాకు. చెప్పేది విను. మా మావగారు కరణం. చాలా నిక్కచ్చి మనిషి. చాలామందికి సహాయం చేసేవారు. ఎంతోమంది ఈ యింట్లో తిని వెళ్ళినవారే. తమ పనులన్నియు చక్క దిద్దుకున్నవారే. మాకు ఐదుగురు ఆడబిడ్డలు. నాకు యిద్దరు యారాండ్లు. భూములు వ్యవహారాల్లో మామగారికి వారి ముగ్గురి కొడుకులకి పొరపొచ్చాలు, గొడవలు, పంచాయతీలు వచ్చినా, మేం ముగ్గురం ఎప్పుడూ గొడవలు పడలేదు.
జ్యోతి : ఓహో! సరే తాతమ్మా, మీరెంతమంది అక్క చెల్లెళ్ళు, ఎంతమంది అన్నదమ్ములు,
శాంతాదేవి : మా అమ్మకు ఆరుగురు కొడుకులు, నలుగురు కూతుళ్ళు. అందులో ఒక పిల్లాడేమో పుట్టగానే చనిపోయాడు. ఆ విధంగా నాకు ఐదుగురు అన్నయ్యలు. ముగ్గురక్కలు.
జ్యోతి : ఐతే తాతమ్మా, మీతరం చదువుకోలేదు. అయితే అమ్మమ్మ లందరూ చదువుకున్నారు కదా! అందులో ముగ్గురు కూడా టీచరుద్యోగాలే చేశారు.
శాంతాదేవి: ఔనే. మా తరానికి యీ యింటికి ఏడుగురు కొడుకులు. అందులో నలుగురు ఇక్కడ వున్నారు. ముగ్గురు అమెరికాలో స్థిరపడ్డారు.
జ్యోతి : ఓ తాతమ్మా, అమ్మ, బామ్మ వాళ్ళు, వేయి స్థంభాలగుడికి, భద్రకాళి గుడికి వెళ్ధామంటున్నారు.
శాంతాదేవి : సరే వెళ్ళిరావే. అక్కడి వివరాలు, విశేషాలు వాళ్ళనే అడుగు. ఒక్క నా ఒక్కదాని బుర్రతింటే ఎలా! వాళ్ళను కూడా ప్రయత్నించు.
జ్యోతి : సరే తాతమ్మా! బై.
* * *
ఆ రోజంతా వేయి స్థంభాల గుడి, భద్రకాళి గుడి సందర్శనలతోనే గడిచింది. జ్యోతివాళ్ళ బామ్మ, అమ్మమ్మలకు ఎక్కువ విషయాలు తెలియవు కాబట్టి ఆయా గుళ్ళ శంకుస్థాపన వివరాలు, పురాతత్వ బోర్డులు చూపించి తప్పుకున్నారు. సాయంత్రం ఈ సీమటపాకాయ పేపరు, పెన్నుతో సిద్ధం.
జ్యోతి : తాతమ్మా! ఈ నీరెడి కొమురయ్య వాళ్ళట ఎవరు, వారికి ముత్తాత గారికి చాలా దగ్గరట ఎందుకు?
శాంతాదేవి : నీకీ విషయం ఎవరు చెప్పారే?
జ్యోతి : అదే గుడిలో నీరెడి కొమురయ్య వాళ్ళ వాళ్ళు పెద్దమ్మమ్మను గుర్తుపట్టి మాట్లాడారు.
వాళ్ళ మాటల్లో గ్రహించాను.
శాంతాదేవి : మరి పెద్ద అమ్మ్మనే అక్కడే అడగక పొయ్యావా, తీరిగ్గా గుర్తుపెట్టుకొని అడుగుతున్నావ్.
జ్యోతి : ఆఁవాళ్ళనడిగితే నీకెందుకే ఇవన్నీ పొట్టిబుడంకాయం అన్నారు, తాతమ్మా.
శాంతాదేవి : ఆహాఁ, అలాగా, ప్రతి గ్రామంలో చెరువు నీరు పారకం, బాగోగులు చూడటానికి వుండేవారినే నీరెడివారు అంటారు. నీరు + ఇడి నీరు యిచ్చేవారే నీరెడివారు. కరణం ఆధ్వర్యంలో గ్రామపరిపాలనంతా సాగేది. యెలవాళ్ళు, షేకం సింధీలు కరణం చేతి క్రింది వుండి తోడ్పడేవారు. శిస్తు వసూళ్ళు పై అధికారులు వచ్చినపుడు ఏర్పాట్లు చూసేవారు. మా మామగారు రైతు అనుకూలురుగా మంచి పేరు నిలుపుకున్నారు. అప్పటి నీరెడివారి వయసు, మీ ముత్తాత వయసు ఒకటే సమ వయస్కులవటం వల్ల వారి మధ్య చనువెక్కువ. మీ ముత్తాత గారు పదవతరగతి కాగానే ఉద్యోగంలో చేరిపోయారు. ఆ తర్వాత క్రమక్రమంగా పరీక్షలు ప్యాసై యం.ఎ.బి.ఇడి అయ్యారు. గెజిటెడ్ హెడ్మాస్టర్గా పదవీ విరమణ చేశారు.
జ్యోతి : భద్రకాళి గుడిలో మన ఊరి వారట తాతయ్యతో కలిసి చాలాసేపు, చాలా ఆత్మీయంగా మాట్లాడారు. మీరు పదిహేను సంవత్సరాలు ఆ ఊరిలో ఉన్నారట కదా! ఎందుకు, చాలామంది ఊళ్ళళ్ళ నుంచి హన్మకొండకొస్తే మీరెందుకు ఊరికి వెళ్ళారు తాతమ్మా!
శాంతాదేవి : మీ తాతయ్యనే అడుగక పోయావానే సీమ టపాకాయ్.
జ్యోతి : అది కాదు తాతమ్మా! నీ కొడుకు కొంత చెప్పేసి నీ కెందుకే వివరాలు అని అధరగొడతాడు. నీ దగ్గరున్నంత మాలిమి, చనువు నాకెవ్వరి దగ్గరా లేవు. అందుకే నిన్ను అడుగుతున్నాను.
శాంతాదేవి : సరేనే నా తల్లి. ఆ రోజుల్లో మా మావగారికి మీ ముత్తాతగారికి ఏవో పొరపొచ్చాలు, పట్టింపులు వచ్చి మా మామగారు, మీ ముత్తాతగారిని ఊరి భూముల సేద్యానికి పంపించారు. అక్కడ మీ ముత్తాతగారు అందరితో మంచిగా వుండి మంచి పేరు తెచ్చుకున్నారు. మేము ఊరికి వెళ్లిన తర్వాతే అక్కడ విద్యుత్ సౌకర్యం, తారు రోడ్లు వచ్చాయి.
జ్య్తోతి : మరప్పుడు నీవు గోల చేయలేదా, తాతమ్మా.
శాంతాదేవి : ఆఁ ఆ రోజుల్లో అత్తమామలకీ, భర్త, ఆడబిడ్డలకీ ఎదురు చెప్పలేదు. మా రోజుల్లో పద్ధతులావిధంగా ఉండేవి. మెల్లమెల్లగా మన ఊరు కూడా పట్టణంలో కలిసిపోయింది. అక్కడ కళాశాల, ఇంగ్లీషు మీడియం హైస్కూల్స్ వచ్చాయి. అంతకుముందే ఉన్న ప్రభుత్వ పాఠశాల క్రమక్రమంగా ఉన్నత పాఠశాలయింది.
జ్యోతి : ఓహో, అందుకేనా తాతయ్య, అమ్మమ్మ వాళ్ళకు ఆ ఊరిలో స్నేహితులున్నారు. ఆ ఊరితో చనువెక్కువన్న మాట.
శాంతాదేవి : ఔనే, క్రమక్రమంగా ఊళ్ళో పిల్లలందరూ చదువుకొని ఉద్యోగరీత్యా అంతటా వ్యాపించారు. మీ ముత్తాత దగ్గర చదువుకున్నవారు చాలామంది ఉన్నత స్థాయికి చేరుకున్నారు. ఆ రోజుల్లో పండుగలంటే ఊరంతా కలిసిమెలిసి కలిమిడిగా బాగా జరుపుకునేవాళ్లం.
జ్యోతి : ఐతే తాతమ్మా! అక్కడ అమెరికాలో అంటే మా దగ్గర కొంతమంది పిల్లలకు, తల్లో, తండ్రో ఒకరే ఉంటారు. ఇక్కడ ఆ పద్ధతులింకా రాలేదా!
శాంతాదేవి : ఏమోనే, బొంబాయి, హైదరాబాదుల్లో వచ్చినట్లుంది. ఇక్కడ కూడా అక్కడక్కడ ఉందేమో నాకు తెలియదు. ఐనా అటువంటి పద్ధతులు మంచివి కావు. పిల్లలకి తల్లిదండ్రులిద్దరి అవసరం, ఆజమాయిషీ కావాలి.
జ్యోతి : తాతమ్మా! మీ మామగారి నుంచి నీ మనవడి వరకు పరిస్థితులు ఎలా మారాయో, మీ పరిశీలనలేంటో తెల్పండి.
శాంతాదేవి: ఏముందే ఆస్థులు తరిగాయి. అంతస్థులు పెరిగాయి. మా మామగారు ఫ్యూడల్ ప్రజాస్వామ్యవాది. మూడు ఊళ్ళలో ఆస్థులుండేవి. ఎక్కువగా కాలినడకన, ఎప్పుడో కాని రిక్షాలో వెళ్ళేవారు. రెవిన్యూ విషయాలు, కరణీకం, కోర్టు వ్యవహారాలు ఎప్పుడూ వారికి చేతినిడా పని. ఆయన సైకిల్ కూడా వాడలేదు. కానీ పెద్దొర, పెద్దొర అని చాలా పేరు ప్రతిష్టలు ఉండేవి. ఇంక ఆయన కొడుకులు ముగ్గురూ బడిపంతుళ్ళే. ఫ్యూడల్ వాసనలు పోని ప్రజాస్వామ్యవాదులు. ఇంక మీ తాతయ్యలు, అమ్మమ్మలందరూ సోషలిస్టు ప్రభావజాలంతో స్నేహితులతో మెదిలి పెద్ద చదువులు చదివి ఉద్యోగస్థులయ్యారు, ఇంక మీ నాన్నలు విదేశాల్లో స్థిరపడి, మీరు అక్కడే పుట్టారు. మా మావగారి హయాంలో ఎందరో రాజకీయ నాయకులు, కవులు మన ఇంటి దగ్గరికి వస్తుండేవారు. బంధువులు కూడా బాగా వచ్చేవారు. ఐతే ఆ చుట్టరికాలు, కలిమిడులూ, కలుపుగోలు తనాలూ, ఆస్థులూ అన్నీ తగ్గిపోయి, కార్లూ, ఫ్లాట్లూ, ఉద్యోగాలూ, విదేశాలకు వలస వెళ్లటాలూ పెరిగాయి. మీ ముత్తాతలు సైకిలు పైబడులకెళ్లేవారు. మీ తాతల హయాంవరకు బండ్లు వచ్చాయి. మీ నాన్నల కాలానికి కార్లు వచ్చాయి. నీ తరానికి విమానాలూ, హెలికాఫ్టర్లు వచ్చాయే సీమటపాకాయా!
జ్యోతి : హమ్మ! ఎంత మార్పు చెప్పావు తాతమ్మా, మరి మీ కాలంలో మీరు ఎలా వెళ్లగలిగారు?
శాంతాదేవి : మాకు మొద్దుబండ్లు, సవారి కచ్చరాలుండేవి. ఆ తర్వాత టాంగాలు, రిక్షాలుండేవి. బస్సులు, ఆటోలు ఆ తర్వాత వచ్చాయి.
జ్యోతి : మరిప్పుడు తాతమ్మా! మీ మావగారి తరం నుంచి నా వరకు ఎన్ని తరాలయ్యాయి. ఊ…..1,2,3,4,5 తరాలయ్యాయి. ఇంక రెండు తరాలయితే ఏడుతరాలౌతుంది కదా.
శాంతాదేవి : ఆఁ అటు ఏముందీ మా మావగారి తండ్రిగారు గ్రామ కరణం. మా మావగారు పట్నం ఇల్లరికపు టల్లుడు. దాంతో పట్నం కర్ణీకం కూడా మా మావగారికే వచ్చి చేరింది. మా మావగారి తల్లికి అన్నదమ్ములు లేరు. వాళ్లిద్దరూ అక్క చెల్లెలు. అందువల్ల మా మామగారి తల్లి ద్వారా కూడా ఆస్థి సంక్రమించింది.
జ్యోతి : భలే, భలే, తాతమ్మా, మీరూ తాతయ్యలూ మాత్ర సంబంధ ఆస్తి అనుభవించారు. మరి మీ తరానికీ యిప్పటి తరానికీ ఆడవారి విషయాల్లో తేడాలేమిటి?
శాంతాదేవి : ఎందుకు లేవే, హస్తిమశకాంతరం ఉంది. మా అప్పుడు చదువులే లేవు. మీ బామ్మలు, అమ్మమ్మలు మంచిగా చదువుకొని ఉద్యోగాలు చేశారు. మీ అమ్మలు, అత్తయ్యలు సరేసరి. ముందంజలో ఉన్నారు. మీరు ఇంకా మంచి పరిస్థితుల్లో ఉన్నారు.
జ్యోతి : తాతమ్మా! చాలా మంచి విషయాలు చెప్పావు. ఇది కథో, వ్యాసమో వ్రాసిం తర్వాత నీకు పంపిస్తా!!!
శాంతాదేవి : సరేనే తల్లీ, జాగ్రత్తగా విశ్లేషిస్తే, ఇది ఏడు తరాల భోగట్టా ఔతుంది. సరే, సరే!! ఇంక అన్నం తిని విశ్రాంతి తీసుకో. మీకు అన్నీ ప్రయాణాలే కదా!!!!
జ్యోతి: పరవాలేదులే, ఇంకా చెప్పవా, మరి తాతమ్మా !! ఇలా మూడు ఊళ్ళ ఆస్థి చేరితే మీ కుటుంబంలో డాక్టర్ , ఇంజనీర్లు , లాయర్లు తయారు కాలేదా
శాంతాదేవి: అప్పట్లో స్వాతంత్ర్యం వచ్చి దేశం అప్పుడప్పుడే కుదుటపడుతోంది. ఆకాలంలో మీ ముత్తాతలు ఆ మాత్రం చదువుకొని ఉద్యోగాలు చేయడమే ఎక్కువ. నేనింతకుముందు చెప్పినట్లు ఆ ప్రజాస్వామ్య భావాలు దేశపరిస్థితుల గురించి ఇంట్లో చిన్నగా చర్చలు జరిగేవి. కమ్యునిస్టు నాయకులు మనింటికి వచ్చేవారు. ఎక్కువగా ప్రజాక్షేత్రంలో పనిచేసేవారు.మన బంధువులందిరివిషయాలు ఇక్కడే అందరికీ తెలిసేవి. అందుకే అప్పట్లో ఈ ఇంటిని ఆలిండియా రేడియో అనేవారు.ఇల్లు
జల్ జలాటంగా సాగింది. వాళ్ళ నెల వారీ ఖర్చు ఈ ఇంటి చాయనీళ్ళ ఖర్చంత కాదని పేరు పోయింది.
ఇప్పుడేముందే ఉద్యోగాలున్నాయి. ఉద్వేగాలు పెరిగాయి.
రాను రాను సమాజంలో హింస , దౌర్జన్యం పెరిగిపోయాయి. మూర్ఖత్వం , భీభత్సం మూర్తీభవిస్తే ఏ ఉద్యమమైనా ఈ ప్రజాస్వామ్య యుగంలో అణిచి వేయబడుతుందే తల్లీ. ఏదైనా విచక్షణ తో అందర్నీ కలుపుకుపోయేదిగా ఉండాలి.
జ్యోతి : ఆ రోజుల్లో చిన్న చిన్న విషయాలకు కూడా కోర్టు ల్లో చాలా యేళ్ళు పట్టేదట కదా
శాంతాదేవి: ఔనే తల్లీ ! ఇదేమిటే నీ పొట్టనిండా ప్రశ్నలే ఉన్నాయేమే ,నీ పొట్ట ఓ ప్రశ్నల పుట్టయిందే తల్లీ.
జ్యోతి: తాతమ్మా మా స్కూల్లో నేను NTRగారి డైలాగులతో సుయోధన ఏకపాత్రాభినయం చేశాను . తెలుగు రాకున్నా మా బడి పిల్లలంతా నా హావభావాలు ఉచ్ఛారణ , అభినయం బాగున్నాయని మెచ్చుకున్నారు తాతమ్మా.
శాంతాదేవి: ఆహా ! అట్లానా ,నీకు భారత రామాయణాలు ఏం తెలుసే బుడంకాయా ?
జ్యోతి: ఆ( అందులో ఏముంది తాతమ్మా కుటుంబంలో ఐకమత్యత లోపిస్తే అష్టకష్టాలపాలవుతారనీ పాపం వ్యాసవాల్మీకులు ఎంతో ఓపికగా పురాణేతిహాసాలుగా మలచి మనకందించారు. మన దేశంలో కుటుంబ విలువలకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తామని అమెరికా వంటి దేశాలకు చాలా ఆశ్చర్యం తెలుసా.
శాంతాదేవి:ఏమే బుడంకాయ , నువ్వెంత ,నీ వయసెంత అన్నీ పెద్ధ పెద్ద మాటలు మాట్లాడుతున్నావేమే.
జ్యోతి: నీ మనవడు అదే మా నాన్నే విడువకుండా , వదలకుండా రోజూ అరగంటపాటు మన విషయాలన్నీ ఇండియా గురించి చెప్పి నేర్పిస్తున్నాడు తాతమ్మా.
శాంతాదేవి: అసలివన్నీ ఎందుకు చెప్పాడట నీకూ!!!?
జ్యోతి: అదే తాతమ్మా కౌరవ పాండవులు కలిసి మెలిసి ఐకమత్యం గా ఉంటే కర్ణ,శకునిలు , కృష్ణుడు లాంటి వారికి జోక్యం చేసుకునే అవకాశమే రాదనే వారు.
శాంతాదేవి: సరే ఇగ అది అలా జరిగితే భారతమే ఉండేదికాదు. భగవద్గీత, విష్ణుసహస్రనామాలు వచ్ఛేవే కావు ,కానీ సరే జరిగిన దాని గురించి గుణపాఠాలు తెలుసుకుని ప్రతి కుటుంబం ఐకమత్యం తో అభివృద్ధి సాధించాలి.
జ్యోతి : థ్యాంకూ తాతమ్మా, చాలా విషయాలు చెప్పావు. ఆ కాలపు విషయాలను ఈ కాలంలో ముడిపెట్టక తేడాలన్నీ పోయేటట్లు చెయ్యాలని నా ఆలోచన తాతమ్మా! భారతదేశమే ఒక పెద్ద కుటుంబం లాంటిది కదా తాతమ్మా!
తాతమ్మా : ఔనే! మారుతున్న కాలం విలువను ఇద్దరూ మనస్సులో తర్కించుకుంటూ బాగా చెప్పావు.
ఇక పడుకో తల్లీ!!
నిద్రలోకి జారుకున్నారు. రేపటి వెలుగులు స్వాగతిస్తుంటాయని వాళ్లకు తెలుసు!
1 comment
తరతరాలకు వారధిగా మంచి కథను అందించిన రంగారావు గారికి ధన్యవాదములు.