కదనరంగాన
కాలుదువ్వే సైనికునిలా
కవనం విప్లవమై వర్థిల్లాలి!
కిన్నెరసాని హొయలతో
ఆహ్లాదమూ కలిగించాలి!!
కీచకుల తలలు నరికేలా
కుయుక్తుల ఆటకట్టించేలా
క్రూర మృగాల తోలు ఒలిచేలా
కవనం కరవాలమై కదలాడాలి!
కుసుమ పరాగమై
మనసును ఓలలాడించాలి!!
కెరటమై నింగికెగరాలి
కేతనమై రెపరెపలాడాలి
కైతలెప్పుడూ స్ఫూర్తిదాయకమవ్వాలి!
కరుణామృతమునూ వర్షించాలి!!
కొమ్మన కూసే కోయిల పాటలా
కోనల అందాల వయ్యారిభామలా
కౌముది రాత్రుల చల్లదనంలా
కమనీయమై రమణీయమై రసఝరులు పారించాలి!
కలం సందేశాత్మక బాట నడవాలి!!
కూనిరాగాల కూనలమ్మై
కీరవాణి స్వరమధురిమై
కుహుకుహు రాగాల చక్కెరపాకమై
కలకాలం జీవించాలి!
కాదేది
కవితకు అనర్హమని
స్పందించే ప్రతిహృదయం
కవన సరిగమలను మీటాలి
హృదయాలనేలాలి!!
1 comment
కలకాలం జీవించాలని చాలా చక్కగా వ్రాశారు. బాగంది💐💐💐