Home కవితలు జీవితపు సరిహద్దుల దగ్గర

జీవితపు సరిహద్దుల దగ్గర

మనిషి ఎదురుపడితే
పులి ఎదురుపడ్డట్టే
ఆత్మీయ ఆలింగనాలు
సోదర కరచాలనాలు కాదు
‘ఆత్మకు శాంతి కలుగుగాక ‘
సానుభూతుల వెల్లువ –

కడప దాటితే
అమావాస్య అడవిలో ఆగమయినట్టే
ఏ ముట్టడి నుండి
ఏ స్ట్రైన్ కమ్ముకుంటుందో (స్ట్రెయిన్)
భయపడినట్టే ఇల్లు ఇల్లంత వేడెక్కి
ఎవరికి వారు ఒంటరై
అంబులెన్సుల్లో ఆసుపత్రుల్లో
వింత వింత శబ్దాల మధ్య
నల్ల బజార్లో, ప్రార్థనా స్థలాల్లో
ప్రాధేయపు చూపుల ఆశల మిధ్య –

చివరికి శ్వాసకూ శ్వాసకూ మధ్య
ఊపిరాడని పెనుగులాట
చావుకీ బతుక్కీ మధ్య
సమయం దోబూచులాడుతుంది
అది విముక్తో
ఈ నేలను విడిచి పోతున్న విషాదమో –

జీవితమంతా ‘క్యూ’ ల్లో నిలబడీ నిలబడీ
చితి మంటల సాక్షిగా
చివరి యాత్ర ‘క్యూ’ల్లో చిక్కుకుంది
ఇప్పుడు ఏ ఓదార్పులు లేవు
ఓటికుండలు లేవు
ప్రభుత్వాలకు మనం ఒక అంకె మాత్రమే
ఇంతకూ మన ఊపిరితిత్తుల మీద
మృత్యు సంతకం చే‌స్తున్నది ఎవరు !?
అంతిమ సంస్కారాలకు అడ్డు పడుతున్నది ఎవరు !??

You may also like

8 comments

Kk August 26, 2021 - 5:17 pm

Superb poet

Reply
రామమూర్తి August 26, 2021 - 5:37 pm

చక్కని అభివ్యక్తి. అభినందనలు సర్..

పానుగంటి రామమూర్తి
జనగామ

Reply
సుభాష్ ఒద్దిరాజు August 27, 2021 - 1:58 am

బాగున్నది ప్రవీణ్

Reply
గోపగాని రవీందర్ August 27, 2021 - 9:18 am

కవిత బాగుంది మిత్రమా అభినందనలు..

Reply
వేణు గోపాల్ రావు August 27, 2021 - 5:58 pm

బాగుంది

Reply
డా.టి.రాధాకృష్ణమాచార్యులు, హైదరాబాద్ August 28, 2021 - 5:20 am

చివరి యాత్ర ‘క్యూ’ల్లో చిక్కుకుంది..అభివ్యక్తి చిక్కగా చక్కగా ఉంది.మంచి కవిత నిచ్చారు కరోనా కల్లోల సమయంలో.ఎవరికి వారు ఒంటరైన సమూహంలో దాగుడుమూతలే కడప దాటిన..బాగుంంది ఈ కవిత.అభినందనలు మిత్రమా ప్రవీణ్

Reply
ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్ September 4, 2021 - 2:31 pm

మీ అమూల్యమైన స్పందనకు కృతజ్ఞతలు

Reply
విలాసాగరం రవీందర్ September 26, 2021 - 8:36 am

ఇంకెవరు సార్ కరోనా కంటే భయంకరమైన మనుషులు

Reply

Leave a Comment