నాల్గవ ప్రకరణ
గ్రంథకర్త:-ఒద్దిరాజు సీతారామ చంద్రరాయ శర్మ
సరళీకృతం:- రంగరాజు పద్మజ
సంతానాపేక్ష
శ్లోకం:–
కింతు వధ్వాంత వైతస్యా
మదృష్ట సదృష ప్రజం
న మా మవతి సద్వీపా
రత్నసూరపి మేదినీ.
–(రఘువంశము)
భావం:– అయినను ద్వీప సహితమైన ఈ భూమి రత్నాలను ఇచ్చినప్పటికీ తమ కోడలైన ఈ సుదక్షిణ యందు మాకు సదృశుడైన కుమారుడనే శ్రేష్ట రత్నం కలగక పోవడంతో నన్ను సంతోషంగా ఉండనివ్వలేదు.
వ్యాఖ్య:– రఘువంశంలో దిలీప మహారాజుకు ఎలాగైతే తమ కోడలైన సుదేష్ణకు సంతానం కలగాలని కోరిక ఉండేదో… అలానే రుద్రమదేవి తన కూతుళ్లకు సంతానం కలుగలేదని బాధపడుతున్నదని సూచిస్తూ రఘువంశ కావ్యం నుండి ఈ శ్లోకాన్ని ప్రకరణ శీర్షికగా రచయిత తీసుకోవడం భావి కథార్ధ సూచికగా పాఠకులకు ఈ కథాభాగంలోని కథ సూచింపబడుతున్నది.
కథాభాగం :— మదనమంజరి రుద్రమదేవి రాణీవాసంలో చక్కగా భక్తిశ్రద్ధలతో ఉంటున్నది. రుద్రమదేవి కూడా మదనమంజరి పట్ల ప్రేమ, ఇష్టం కలిగి ఉన్నది. గంధం తీయడం, ముమ్మడమ్మ, రుయ్యమ్మల కోసం పూల దండలను కట్టటం, పడకల ఏర్పాటు చేయడం, దేవుని గది అలికి ముగ్గులు పెట్టడం మొదలైన పనులను మదనమంజరి చేస్తున్నది. సమయం దొరికినప్పుడు రుద్రమదేవికి వింతైన కథలు చెబుతుండేది.
ఒకరోజు సాయంకాలం ప్రకృతి చాలా అందంగా ఉంది. సాయంత్రపు ఎరుపు రంగు ప్రపంచాన్ని ప్రేమ సామ్రాజ్యంలో ముంచి వేస్తున్నది. పక్షులు ఆకాశం నిండా పరుచుకుని ఎగురుతూ తమ నివాసాలైన గూళ్ళకు పోతున్నవి. ఆకాశంలో రకరకాల మబ్బులు కనపడుతున్నాయి. పిల్లలు ఆ మబ్బులు చూస్తూ” అదిగో రెండు గుర్రాలు! దాని మీద గుట్ట, దాని పక్కనే ఏనుగు, ఏనుగు మీద మనుషి, అదిగో తివాచీ, గుర్రం తలకాయ మాయమైపోయింది. ఏనుగు మీద మనుషి కోడిపుంజుగా మారాడు.” ఇలా మబ్బులు మారుతూ పోతున్నప్పటి ఆ మబ్బుల ఆకారాలకు తగినట్లుగా పేర్లు పెడుతూ ఆడుతూ సంతోష పడుతున్నారు పిల్లలు. ఆవులు” అంబా”అని అరుస్తూ వస్తున్నాయి. కూలి పనులకు వెళ్ళినవారు తమతమ ఇండ్లకు వస్తున్నారు. పశువుల మంద నడవడంతో వీధులలో దుమ్ము లేచి, ఇంకా కూలీనాలీ చేసుకునే ఆడవాళ్ళు వారి ఇంటిలో వంటలు వండుతున్నప్పుడు కమ్ముకున్న పొగా, ఈ రెండూ కలిసి ప్రకృతి అందంగానూ, ఒక వింతగానూ కనబడుతున్నది. వంట కోసం రకరకాల కట్టెలను కాల్చడం వల్ల ఒక రకమైన వాసన గుప్పుమని వస్తున్నది.
కొంతసేపటికి ఆకాశం నిండా వేల కోట్ల నక్షత్రాలు మినుకుమినుకుమంటూ వెలుగుతున్నాయి. ఆనాడు పౌర్ణమి తెల్లవారి కావడంవల్ల నక్షత్రాల వరుస చాలాసేపు తమ అందమైన రీతి ప్రపంచానికి కనిపించకుండా చల్లని చంద్రుని వెలుగుకు లొంగిపోయి ఒకటొకటే కనిపించకుండా మాయమై పోయాయి. అమృతమయుడైన చంద్రుడు ఆకాశాన వెలుగుతూ వేలవేల తన చల్లని కిరణాలు భూమిపై ప్రసరింపజేసి, తెల్లని రాళ్ళను నేల మీద పరిచినట్టుగా కనబడుతున్నవి. ఆ వెన్నెలలో ఓరుగల్లు నగరం గొప్పగా సింగారించుకున్నట్టు ఉన్నది.
పిల్లలు ఆనందంగా వీధులలో ఆటలు ఆడుతున్నారు. సామాన్య యువత గుంపు గూడి చప్పట్లు కొడుతూ పాటలు పాడుతున్నారు. కూర్చున్న యువకులు తీగలతో ఉన్న యంత్ర వాయిద్యాలతో సంగీతం వాయిస్తున్నారు. కొందరు గుమ్మటెలు ( కుండ వాయిద్యం ) వాయిస్తూ… వీరుల చరిత్రలు పాటలుగా పాడుతున్నారు. కొందరు జంగములు మహావీరులను ఆనంద పరుస్తున్నారు.
దాదాపు మూడు గడియల రాత్రి అవుతున్నది. రుద్రమదేవి, ముమ్మడమ్మ, రుయ్యమ్మ, మదనమంజరి ఇంకో ఇద్దరు చెలికత్తెలు మేడ మీద కూర్చుని ఉన్నారు. ప్రకృతి వారికి ఉల్లాసం కల్గిస్తున్నది. మదనమంజరి ఏవేవో ముచ్చట్లు చెప్పి, అక్కడ ఉన్న వారిని నవ్విస్తున్న ది.
మదనమంజరీ! ముచ్చట్లు చెప్పి కాలక్షేపం చేయడంలో నిన్ను మించిన వారు లేరు. చాలా సమర్థురాలువే! నువ్వు పుట్టినప్పటినుండి మోటు ప్రదేశాలలో తిరిగానని చెప్పినావు! కానీ చక్కగా చాతుర్యంతో మాట్లాడుతూ, హాస్యసంభాషణలతో పొద్దు పుచ్చడం చాలా పాతకథలను చెప్పడం, ఇంకా నీకు బాగా తెలుస్తుంది. చిన్నతనం నుండి నువ్వు అంతఃపురాలలో ఉంటే ఇంకా నీకు ఎంతో నేర్పుగా మాట్లాడడం వచ్చి ఉండేదో? నేను చెప్పలేను” అని రుద్రమదేవి అన్నది.
ఏదో ” మీ దయ నేను అంత నేర్పుగా మాట్లాడక పోయినా, నా మీద మీకున్న దయతో అలా అనిపిస్తున్నదని మదనమంజరి అన్నది.
ఈరోజు ఏదైనా కథ చెప్తావా? కథ అంటే కథ కాదు! జరిగిన విషయం నీకు ఏదైనా తెలిస్తే చెప్పు! కల్పిత కథల కన్నా జరిగిన కథలు సంతోషం కల్పిస్తాయి! రుద్రమదేవి అడిగింది.
మీరు అడిగితే అలాగే చెప్తాను. చాలా పాతకాలం నాటి కథ ఒకటి చెప్పనా? అది అనుమకొండకు సంబంధించిన కథ. అని మదనమంజరి అన్నది.
రుద్రమదేవి చెప్పమన్నది.
రుద్రమదేవి ,మిగతా వారు అందరూ శ్రద్ధగా వింటున్నారు. ఈ విధంగా కథ చెప్పటం మొదలు పెట్టింది..
చాలా కాలం క్రితం కంధార పట్టణంలో సోమదేవరాజు అనే ఒక రాజు సత్యసంధుడై రాజ్యపరిపాలన చేస్తున్నాడు. సోమదేవ మహారాజుకు బ్రాహ్మణులంటే చాలా భక్తి. ఆవులంటే ఎంతో ఇష్టం. వాటి మీద ప్రేమ ఎక్కువగా చూపేవాడు. ఆరాజు చాలా ఆవుల మందలను మంత్ర కూటం( మంథెన), భద్రాచలం మొదలైన గోదావరి ఒడ్డున ఉన్న పట్టణాలకు మేతకోసం పంపించేవాడు. ఈ వార్త కటకపురం రాజధానిగా ఉత్కల దేశాన్ని పాలించే బల్లహుడు విని ససైన్యంగా వచ్చి సోమ దేవరాజు యొక్క ఆవులను చుట్టుముట్టాడు. ఆవులను మేపేవారు అతనిని అడ్డుకున్నారు. కానీ చక్కని శిక్షణ పొందిన చాలా మంది సైనికుల ముందు శిక్షణ పొందని పశువుల కాపరులు సైనికుల ముందు నిలువ గలరా? కొందరు గాయపడ్డారు. కొందరు చనిపోయినారు. బల్లహుడు మందలను తోలుకొని కటకపురానికి పోయాడు. చావగా మిగిలన పశువుల కాపర్లు వచ్చి కంధార రాజయిన సోమదేవరాజుకు చెప్పారు. రాజు సైన్యం సిద్ధం చేసుకొని బల్లహుడితో పోరాడటానికి బయలుదేరాడు. కానీ బల్లహుడు చాలా దూరం వెళ్ళిపోయాడు. అలాగే తరుముతూ తరుముతూ పోయి, సోమ దేవరాజు కటకపురిని ముట్టడించాడు. బల్లహునకు సోమదేవరాజు యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో సోమదేవరాజు ఓడిపోయి కంధారానికి వచ్చి ఎక్కువ బలమైన మరింత సైన్యాన్ని తీసుకొని రెండవ సారి కటకపురిని ముట్టడించాడు. ఇప్పుడు సోమదేవరాజు గెలుపొందాడు. నాలుగు సంవత్సరాల దాకా యుద్ధ ప్రస్తావన వస్తే ఒకసారి కటకపుర రాజు గెలుస్తూ మరొకసారి ఓడిపోయేవాడు. సోమ దేవరాజు అంతటితో యుద్ధతలంపు మాని, తన నగరానికి వచ్చి సంతానం పొందేందుకు మరియు శత్రువును ఓడించటం డానికి పుత్రకామేష్టి యజ్ఞం జరిపించాడు. వైశ్వానరుడి దయ వల్ల సోమదేవరాజు భార్య గర్భవతి అయ్యింది. ఈ సమాచారం కటకపురి బల్లహునకు తెలిసింది. బల్లహుడు తనకు ముప్పు తప్పదనుకొని గొప్ప సేనతో వచ్చి కంధారాన్ని ముట్టడించినాడు. సోమదేవరాజుకు, బల్లహునకు ఇరవై రోజులు అతి భీకరంగా యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో సోమదేవరాజు వీరమరణం పొందాడు.కంధార పట్టణం బల్లహునకు మనకు స్వాధీనం అయింది. భర్త చెప్పిన విధంగా సిరియాళదేవి దేశం నుండి పారిపోయింది. బల్లహుడు ఆమెకోసం ఊరంతా గాలించాడు. కానీ ఆమె జాడ తెలియలేదు.సిరియాళదేవి కంధారం నుండి పారిపోయి వచ్చి మన అనుమకొండకు చేరుకున్నది. అనుమకొండ మనకి అప్పుడు లేదు. ఊరు కూడా ఇప్పటి వలే పెద్దగా లేదు. శ్రీశైల అడవుల దగ్గర నివసించే వ్యాధుడు అనే వాడు వచ్చి ఇక్కడ ఒక బోయపల్లెని ఏర్పాటు చేసి, దానిని అభివృద్ధి చేశాడు. అతని వంశం వాడే ఎరుకు దేవరాజు అనే పేరుతో రాజ్యాన్ని పాలిస్తున్నాడు. సిరియాళదేవి ఎరుకు రాజు దగ్గరికి వెళ్లి,”బల్లహునకు” భయపడి పోయి పారిపోయి వచ్చాను. నా భర్త నన్ను చావవద్దని అన్నాడు. నన్ను కాపాడుమని వేడుకుంది. కానీ బల్లహుడికి భయపడి సిరియాళదేవికి అతను ఆశ్రయము ఇవ్వలేదు. సిరియాళదేవని ఎరుకు రాజుకు తెలుస్తే ..సోమదేవ రాజు సహాయం తాను ఎన్నోసార్లు పొంది ఉన్నాడు కాబట్టి తప్పక ఆశ్రయం ఇచ్చి ఉండేవాడు. ఎరుకు దేవరాజు ఆశ్రయం ఇవ్వకపోవడంతో సిరియాళదేవి బయలుదేరి వెళ్లిపోతూ ఉండగా అనుమకొండ నివాసి సదాచార సంపన్నుడైన మాధవశర్మ సిరియాల దేవిని రమ్మని ఆదరించి భయపడకని ధైర్యం చెప్పి తన ఇంటిలో ఉండుమనీ ఆమెకు ఎటువంటి శ్రమ కలుగకుండా కాపాడుతున్నాడు. ఈ వార్త బల్లహుడు విని, అనుమకొండపైకి దండెత్తి వచ్చాడు. బల్లహుడికి భయపడి ఎరుకురాజు తన ఊరిలో సిరియాళదేవి లేదని చెప్పాడు. బల్లహుడు అనుమకొండలోని అందరి ఇళ్లకు ఆయా జాతుల వారిని పంపి సిరియాళదేవిని వెతికించాడు.మాధవశర్మ ఇంట్లో ఉన్న సిరియాళదేవిని , మాధవశర్మను ఒక బ్రాహ్మణుడు తీసుకొని వచ్చి రాజుకు చూపించాడు. బల్లహుడు ఆమెనే సిరియాళదేవి అని అనుమానించాడు. ఎరుకుదేవరాజు కూడా అనుమానించాడు. అప్పుడు అనుమకొండలోని బ్రాహ్మణులందరు కూడబల్కొని ఈమె సిరియాళదేవి కాదని మాధవశర్మ కూతురైన లలిత అని, ఒకవేళ ఈ లలితతోనే మీరు అనుకుంటే తీసుకొనిపోండి! మేమేమీ అడ్డు చెప్పము. మీరు చేసిన ఈ పనిని శాసనాల మీద చెక్కించి అందరం అగ్ని పేర్చుకుని అందులో దూకుతామని బ్రాహ్మణులు అన్నారు. ఆ మాటలకు బల్లహుడు అదిరిపోయి ఈమె మీ లలిత అయినా, సిరియాళ దేవైనా మాకు పని లేదు. సిరియాళదేవి జాడ తెలుసుకోవడం ఆమెకు మానహాని కానీ, ఆమె కడుపులో ఉన్న సంతానానికి హాని చేయడానికి కానీ కాదు. ఆమెను మేము మా ఇంటికి తీసుకుని పోయి ఆమె కడుపులో బిడ్డ కలిగితే మాకు విధేయుడిగా ఉండేలా పెంచుతామని, కంధార పట్టణానికి రాజుగా చేస్తామని అది నిజంగా నిజం అని అన్నాడు.
బ్రాహ్మణులు అతని మాట నమ్మక తమ పట్టుదలను వదిలిపెట్టలేదు. తరువాత బల్లహుడు ఆమె మీ కూతురు అయితే ఆమె చేతితో వడ్డించిన అన్నం తినమని అన్నాడు. అప్పుడు వారంతా సరే అన్నారు.
తెల్లవారి సింగేశ్వరాలయానికి పోయి గర్భిణీ చేత అన్నం తినడం ఆచారం కాదని, బల్లహునకు చెప్పి బెల్లం, నేతిని సిరియాళదేవి చేత వడ్డింపించుకొని తిని అనుమానం తీర్చారు.
బల్లహుడు వెళ్ళిపోయిన తరువాత ఒకానొక శుభ ముహూర్తంలో మాధవశర్మ ఇంటిలో సిరియాళదేవి కొడుకును కన్నది. ఆ పిల్లవాడికి మాధవవర్మ అని పేరు పెట్టారు .
మాధవశర్మ ఇంట్లో సకల వేదాలను, శాస్త్రాలను, ధనుర్విద్యను నేర్చుకొని మొదట ఎరుకు రాజును వెళ్లగొట్టి అనుమకొండను వశపరచుకొని, చాలామంది సంస్థానాధీశులు వెంటరాగా కటకాన్ని ముట్టడి చేసి,
> బల్లహుని చంపి, అతని కుమారుడైన”భండికి” రాజ్య పట్టం కట్టి తన చెప్పుచేతుల్లో ఉండేట్లుగా చేసుకొని, కంధారానికి వచ్చి, కంధారాన్ని , అనుమకొండను ఒకే తీరుగా న్యాయ పరిపాలన చేస్తూ సుఖంగా ఉన్నాడు.
“మదనమంజరీ!” సిరియాళదేవి పడరానిపాట్లు పడింది కదా!బ్రాహ్మణుల ధైర్యం కూడా చాలా గొప్పది.
మాధవశర్మ గారు ఎంతో పరోపకారి. ధీనులను ఆదరించి అక్కున చేర్చుకునే గుణం ,ఎంతో పట్టుదల! ఎంతో నేర్పరులు! వారే లేకుంటే సిరియాళదేవి గతి ఏమై ఉండేదో కదా! కన్నబిడ్డల వలె అనుకొని సిరియాళదేవిని పెంచిన మాధవశర్మ గారు మనందరం ఉదయాన్నే వారిని తలుచుకోవాల్సిన వారు కదా !అని రుద్రమదేవి అన్నది.
అందులో అనుమానమే లేదని అన్నది ముమ్మడమ్మ “. మాధవశర్మ చాలా ప్రేమతో పోషించినట్టు, సిరియాళదేవి కుమారుడు జన్మించడం వల్లనే కదా! చాలాకష్టాలన్నీ తొలగిపోయినవి. లేకపోతే ఇంకేమున్నది, ఒకవేళ కూతురు పుట్టి ఉంటే ఆమెకు పెళ్లి, మనుమడు కలగడం అతను భూమియందు పరాక్రమవంతుడైనప్పుడు కదా! మనవడిగా అధికారియై కంధార రాజ్యానికి రాజైనప్పడు కదా! సుఖం కలిగేది. అంత దాకా సిరియాళదేవి కూతురుతో మాధవశర్మ గారి ఇంట్లో ఉండాల్సి వచ్చేది కదా! కుమారులు లేని జన్మ వృధా అనడంలో అనుమానం ఎందుకు? నా సంగతి చూడు! నాకు ఏమున్నది, ఇద్దరు కూతుర్లు లేకపోతే నాకు ఎంత రాజ్యసంపద ఉన్నా ఎంత ధర్మం ఆచరించినా లాభమేమిటి? అని రుద్రమదేవి అన్నది.
పుత్రులు లేకుంటే పున్నామ నరకం తప్పదని పెద్దలు నిశ్చయంగా చెప్పారు. అయినా కూడా భగవంతుడు మీకు ఇద్దరు పుత్రికలను వరంగా ఇచ్చాడు. వారి కడుపులు పడితే మీకు ఇంక లోపమే లేదు! అని మదనమంజరి అన్నది.
అవును నీవన్నది నిజమే! ఇంకా నాకు ఆ భాగ్యం కలగలేదు. నా కూతుర్లకు పుత్రులు పుట్టడం చూసే భాగ్యం నాకు లేదేమో? అని రుద్రమదేవి అన్నది.
మీరు విచారించకండి! దేవుడు మీ కూతుళ్లకూ త్వరలోనే బిడ్డలనిస్తాడు. ఇప్పుడే మీరు ఇంత బాధ పడటం ఎందుకు? కూతుళ్ళకు ఏమంత ఈడు గడిచిపోయిందని బెంగ?అని మదనమంజరి అన్నది.
అయ్యో !వెర్రిదానా! ఇంకెంతకాలం గడవాలి? ఈ వయసులో ఉన్న ఆడవారు ఇప్పటికే ఇద్దరు పిల్లల్ని కన లేదా? అటువంటి వారిని చాలా మందిని చూశానని రుద్రమదేవి అన్నది
అవును పేదవారికి అధిక సంతానం కలుగుతుంది. శ్రీమంతులకు ఎంతో ఎదురు చూస్తే తప్ప సంతానం కలిగే భాగ్యం ఇవ్వడు భగవంతుడు. రుయ్యమ్మ దొరసానికి ఏమంత వయసు మీరినది? కనే ఈడు ఏమి మించిపోలేదు. లేత ప్రాయంలోనే ఉన్నారని మదనమంజరి చెప్పింది
ఔనే ! మదనమంజరీ! మా రుయ్యమ్మకింకా ఈడు గడవ లేదనడం నిజమే. మరి ముమ్మడమ్మ పరిస్థితి ఏమిటి? ఆమె పెద్ద బిడ్డ కాబట్టి ఆమె వయసు కొంచెం ఎక్కువ అయింది. ముమ్మడమ్మకు ఇదివరకే సంతానం కలగలిసి ఉండేది! ఈ విచారం తప్ప నిజానికి వేరు విచారాలు నాకు లేవు.ఈ చింత ఎన్నడు తీరుతుందో తెలియదు. వీళ్లిద్దరితో ఎంతో మంది దేవతలను స్థాపింప చేశాను. ఎన్నో దానాలు చేయించాను. నా బిడ్డల బిడ్డలను ఎత్తుకొని ముద్దాడుతూ ఉంటే నేను చూడగలనో?లేదో? అన్నది రుద్రమదేవి.
దేవత మాత్రమేం చేస్తుంది? భగవంతుడు అందరి పట్ల ఒకే తీరుగా చూస్తాడు. మనుష్యులు వారు చేసిన పాపాలకు వారికి తగిన ఫలితాలను ఇస్తాడు. సమయం వచ్చేదాకా దేవుడు కూడా శ్రద్ధగా ఉంటాడు. ఇది మనకు తెలిసినా ఫలించే రోజు వచ్చే దాకా చూస్తూ ఊరుకోకూడదు. ఫలం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కాబట్టి మనకు తోచినంత దానధర్మాలు చేస్తూ… దేవతలను ఉపాసించాలని అన్నది మదన మంజరి.
నువ్వు చెప్పింది నిజమే! అందుకే సంతాన గౌరీవ్రతం చేయిస్తున్నాను. మూడు సంవత్సరాల నుండి చేస్తున్నారు. ఇంకేం చేయాలో తెలియడం లేదు. ఒకటి మాత్రం నిజం అనుకుంటున్నాను. ఏమిటంటే వడ్డేపల్లిలో బుద్ధ గణపతి అనే దేవుడు ఉన్నాడు.ఆ దేవుడు చాలా మహిమగల వాడు. కొన్ని రోజులు అక్కడ ఉండి ఆ దేవుని పూజించమని నా కూతుర్లకు చెప్తాను. చూద్దాం! ఏ దేవుడికైనా దయ రాకపోతుందా? అని అన్నది రుద్రమ్మ దేవి.
మంచి ఆలోచన చేశారు ఇక ఆలస్యం చేయకుండా ఆ దేవుడిని పూజించడం మంచిది .ఆ దేవుడు మంచి ప్రభావం కల దేవుడు. నేను వచ్చినప్పుడు ఆ ఊరు నుండి వచ్చాను. నాతో వచ్చిన వారు ఆ దేవుని దర్శించుకోవడానికి వెళ్లారు. వారివెంట నేను వెళ్ళి దర్శించుకున్నాను. వారందరూ ఆ దేవుని ప్రభావం చాలా గొప్పగా పొగుడుతూ నాకు చెప్పారని మదనమంజరి అన్నది.
అప్పటికి దాదాపు జామురాత్రి దాటింది ఎవరి పడక గదులకు వారు వెళ్లి విశ్రమించారు.
ఐదవ ప్రకరణ
[ అన్యోన్య సంభాషణం]
ఇతి వ్యాహృత్య విబుధాన్
విశ్వయోనిస్తిరోదధే ౹
మనస్యాహితకర్తవ్యాః
తే౽పి దేవా దివం యయుః ౹౹ 2-62
కుమారసంభవము.
భావం:-ఈ విధంగా బ్రహ్మ దేవుడు ఇంద్రాదిదేవుళ్లను గురించి చెప్పి అంతర్ధానమయ్యాడు. ఆ ఇంద్రాది దేవుళ్లు కూడా మనస్సులో కర్తవ్యబుద్ధిని పొందినటువంటివారై స్వర్గలోకానికి వెళ్లారు.
అనుమకొండకు పడమటివైపున దాదాపు నాలుగు మైళ్ళదూరంలో వడ్డేపల్లి అనే గ్రామమున్నది.ప్రస్తుతం ఓరుగల్లు నుండి వడ్డేపల్లి దాకా దాదాపు ఇండ్లు కట్టుకున్నారని చెప్పవచ్చు.మన కథాకాలంలో ఇప్పటివలె కాకుండా దట్టమైన అడవి ఉండేది.
ఈ గ్రామానికి దక్షిణ దిక్కులో ఒక చెరువు ఉన్నది. అయినా అందులోని నీళ్ళు ఉపయోగించడానికి ఆ చెరువు కింద పొలాలు లేవు.గ్రామం చిన్నదవడం వల్ల అక్కడ నివసించే వారు కొంత మంది కాపురస్తులు కొంత మోతాదులో భూమిని వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.
ఆ చెరువు వెనుక ఒక మఱ్ఱి చెట్టున్నది.అది చాలా పెద్దది. దాని కొమ్మలెంత పెద్దగా ఉన్నాయంటే… ఊడలు కిందకు దిగి ఇంటి స్తంభాలవలె ఉండి రంధ్రాలున్న ఆకులు చెట్టు బోదెపై ఇంటి కప్పు వలె ఉన్నది. అంతగా ఎత్తు లేని పరపు బండ ఒకటి ఆ మఱ్ఱి చెట్టు కింద పరచినట్టుగా ఉండి రెండు కుటుంబాలు సునాయాసంగా కాపురం చేయవచ్చు.
ఆ చెట్టు కింద ఇద్దరు మగవారు ఒక స్త్రీ కూర్చుని ఉన్నారు. ఒకని పేరు హరిహరుడు, రెండోవాని పేరు మురారి దేవుడు.ఆమె పేరు కమల.వాళ్ళు ఎందుకు అక్కడ ఉన్నారో తెలియదు. వాళ్ళు మాట్లాడుకునే మాటలు వింటే తప్ప తెలిస్తే తెలియవచ్చు.వాళ్లు ఇలా మాట్లాడుకుంటున్నారు.
మురారి:– కమలా! కొరతేమీ లేదు కదా!
కమల:– మీదయ ఉండగా కొరతేముంటుంది ?
మురారి:– ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది?
కమల:- పాచిక పారింది.
మురారి:- ఎలా?
కమల:- మనమనుకున్నట్టే !
మురారి:-ఆ ఉపాయం చక్కగా పనిచేసిందా?
కమల:- తృప్తిగా .
మురారి:- ఇంకా విశేషాలు ఏమిటి?
కమల:- మీకు తెలియనివి ఏమున్నాయి?
మురారి:- తపస్సు చేస్తున్నావా?
కమల:- చాలా శ్రద్ధగా.
మురారి:- మనం ఇక్కడి నుండి ఎప్పుడు బయలుదేరుదాం ?
కమల:- మీకు దయ వచ్చినరోజు.
హరి:- నువ్వు ఎన్ని రోజులుంటావు ?
కమల:- ఎక్కడ?
హరి:- వడ్డేపల్లిలో…
కమల:- ఇవాళ మాత్రమే.
హరి:- ఈ రోజు మనం వెళ్లి పోవడానికి మంచి అనువుగా లేదా?
కమల:- లేదు.
మురారి:- ఎందుకు లేదు?
కమల:- కొందరు మనలను కనిపెట్టుకుని ఉన్నారు.
హరి:- వారు అడ్డమా?
కమల:- ఎవరికెరుక?
హరి:- మరి ఇవాళ ఇక్కడ నుండి బయలు దేరి ఎక్కడకి వెళ్లాలి?
కమల:- మొగిలిచెర్లకు…
హరి:- ఏమో? మా ప్రాణాలు నీ చేతిలో ఉన్నవి.చివరకు ఆశ నిరాశవతుందో ఏమో?
కమల:- మీ అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుతుంది.
మురారి:- నీ చేతిలో ఉన్నదానికి మా అదృష్టం అంటావేమిటీ?
కమల:- ఉంటే మాత్రం?
హరి:- మొగిలిచెర్లలో ఎన్ని రోజులుంటాము?
కమల:- ఐదు రోజులు.
మురారి:- అక్కడనుండైనా నిజమైన ప్రణాళికేనా?
కమల:- సమయానికి మీదగ్గరకు రాకుండా ఉంటానా?
మురారి:- తప్పనిసరి వస్తావా?
కమల:- వస్తాను…ఇప్పుడు రాలేదా?
మురారి:-ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే …నువ్వు దరిద్రంతో బాధపడకుండా…ఉండేలా చేస్తాం.
కమల:- సాయంత్రం అయింది. ఇక నేను వెళ్లుతాను.
మురారి:- దయ ఉంచు !
కమల అక్కడి నుండి వెళ్లి పోయి చెరువు కట్టనెక్కి ఊరుకు చక్కగా వెళ్లి పోయింది.
(సశేషం)
★★★★★★★★★★★★★★★