Home వ్యాసాలు అద్ధంకి గంగాధర కవి “తపతీ సంవరణము” : ఉత్తమ ప్రబంధం

అద్ధంకి గంగాధర కవి “తపతీ సంవరణము” : ఉత్తమ ప్రబంధం

నిర్వహణ:

– గురిజాల రామశేషయ్య రిటైర్డ్ అసోసియేట్ ప్రొఫెసర్ (తెలుగు)ఈ శీర్షిక క్రింద పరిచయం చేయబోతున్న తెలంగాణ ప్రబంధాలు:
1. చిత్ర భారతము- చరిగొండ ధర్మన్న
2. తపతీ సంవరణోపాఖ్యానము- అద్దంకి గంగాధరుడు
3. షట్చక్రవర్తి చరిత్ర – కామినేని మల్లారెడ్డి
4. యయాతి చరిత్రము – పొన్నిగంటి తెలగన్న
5. ముకుంద విలాసము – కాణాదం పెద్దన సోమయాజి

ఇవి ఈ శీర్షిక క్రింద పరిచయం చేయబోతున్న తెలంగాణ పంచ కావ్యాలు అనదగిన ఐదు ప్రబంధాలు

పరిచయ కర్తలు:
1. డా॥ సంగనభట్ల నరసయ్య, రిటైర్డ్ ప్రిన్సిపాల్.
2. డా॥బ్రాహ్మణపల్లి జయరాములు, రిటైర్డ్ ప్రిన్సిపాల్.
3. డా॥ మృదుల నందవరం, అసిస్టెంట్ ప్రొఫెసర్ (తెలుగు)
4. డా॥ సి.హెచ్ . లక్ష్మణ చక్రవర్తి, అసిస్టెంట్ ప్రొఫెసర్ (తెలుగు)
5. డా॥ గండ్ర లక్ష్మణరావు, రిటైర్డ్ అసోసియేట్ ప్రొఫెసర్.

ఈ రచయితల వ్యాసాలు తెలంగాణ ప్రబంధ మాలిక శీర్షిక లో వరుసగా ధారావాహికంగా వస్తాయి


ప్రవేశిక
భారతీయ భాషలలో తెలుగు ప్రాచీన భాషగా గుర్తింపు పొందిన ప్రసిద్ధమైన భాష. అనేకానేక విషయబాహుళ్యము వలన విస్తృతమైన సాహిత్య సంపదగలిగిన మధురమైన భాష. స్వరములు అంటే అచ్చులు .ఇవి నాద మాధుర్యానికి పుట్టినిండ్లు .అ,ఇ,ఉ కారాది స్వరాలతో ఆదిమధ్యాంతము సర్వవిధముల అలరారు మెలపులు గల పదాలతో కూడిన తెలుగు భాష పలుకు తీపికి తేనె పెర. మృదువైన పలుకుబడి పదములతో నవనీత సదృశ ‘రుచి’ర . ఈ కారణాలవల్లనే స్వభాషాభిమానానికి పరాకోటి ప్రాధాన్యతను పాటించే తమిళభాషా కవులలో సుప్రసిద్ధులైన సుబ్రహ్మణ్య భారతి వంటి ప్రామాణికులైన మాన్య సాహిత్యవేత్తలు సైతము “సుందర తెలుగు” అని వక్కాణించినారు. అంతకు’ముందెన్నడో “ఆంధ్రత్వమాంధ్రభాషా చ బహుజన్మ తపః ఫలమ”ని తెలుగును వేనోళ్ళ పొగిడిన అప్పయ్య దీక్షితులకు తెలుగు వారందరు కూడా కృతజ్ఞతాబద్ధులే! సుమారు రెండు వందల సంవత్సరాల కాలం భారతదేశంలో తిష్ఠ వేసిన బ్రిటీష్ , తదితర భాషా పండితులు మన తెలుగు భాషను “ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ “ అని ముచ్చటపడి మెచ్చుకున్నారు. ఇక్కడొక విషయం చింతనీయం -అంతకు ముందు వాళ్ళకు ఇటాలియన్ తెలిసి దానితో మన తెలుగును పోల్చుకొని మెచ్చుకున్నారు . కాని , వాళ్ళు రావడానికి వేల సంవత్సరాలకు ముందే మాధుర్యాన్ని పండించుకొటున్న తెలుగు భాషను ఇటాలియన్ తో పోల్చుకొని ఇటాలియన్ గురించి ” తెలుగు ఆఫ్ ద వెస్ట్”అని మార్చుకొనదగినంత మధురాతి మధుర మృదు మాధ్వీక రసనిష్యంద తుందిలమైన మన తెలుగు నిజంగా ప్రపంచ భాషలలోనే మధురమైన భాష.

ఇక దక్షిణ భారతదేశంలో అక్షీణ యశస్సును పండించుకొని, స్వయంగా కవియై , ఆముక్తమాల్యాది కావ్యరచయితయై, స్వర్ణయుగ కర్తగా పేరుపొందిన శ్రీకృష్ణదేవరాయలు కర్ణాటాది భాషాప్రాంతాలకు ఏలికయై ఉండి కూడా ‘“దేశభాషలందు తెలుగు లెస్స “అని ప్రశంసించటం సర్వజన సువిదితమే! అంతకుముందే శ్రీనాథ మహాకవి ఈ అభిప్రాయాన్నే ప్రకటించిన తీరు కూడా గమనార్హం.

మధ్యయుగాల వైభవమును ప్రతిబింబించిన 16 వ శతాబ్దపు ‘ ప్రబంధ పద్యము ’ పద్యరచనకు పరాకాష్ఠ స్థితి (climax) . ప్రబంధ పద్యం అంటే ప్రబంధం లోని పద్యం. ఇతిహాస,పురాణ , నాటకాది వివిధ ప్రక్రియలకు చెందిన గ్రంథాలన్నీ ప్రబంధ శబ్ద వాచ్యాలే అయినా కావ్యాలకే ప్రబంధము మారు పేరుగా, మరోపేరుగా ధ్రువపడింది. రూఢి అయింది .

వాస్తవానికి “సర్గబంధో మహాకావ్యమ్” అంటూ దండి అనే సంస్కృత లాక్షణికుడు చెప్పిన లక్షణాలే తెలుగు లాక్షణికులైన విన్నకోట పెద్దనాదులు కావ్య ప్రబంధ లక్షణాలుగా స్వీకరించారు.
క్రీ.శ. 16వశతాబ్ధమునందలి కావ్యములను ముఖ్యంగా మనుచరిత్రము ను పురస్కరించుకొని ప్రత్యేకంగా రూఢమైన “ప్రబంధ లక్షణముల”ను ప్రకటించినవారు 20 వ శతాబ్దపు తెలుగు విమర్శకులే కాని ప్రాచీన లాక్షణికులుకారు. ( తెలుగు అకాడమీ పత్రిక ‘తెలుగు’ మే 1995 సంచికలోని ప్రొఫెసర్ జి.వి.సుబ్రహ్మణ్యం గారి ప్రత్యేక వ్యాసం చూడండి.

పైన పేర్కొన్న కేంద్రసాహిత్య అకాడమీ విమర్శ పురస్కార స్వీకర్త గారి మాటలను అనుసరించి పర్యాలోచిస్తే ౼ కేవలం 16 వ శతాబ్దంలో క్రీ.శ. 1522 తదనంతరం శ్రీకృష్ణదేవరాయల కోరికపై అల్లసాని పెద్దన రచించిన మనుచరిత్ర ను మాత్రమే దృష్టిలో ఉంచుకొని “……మనుచరిత్రమే ప్రబంధ లతకు పూచిన తొలి పువ్వు“ అని తీర్మానించిన మాట వాస్తవమని ఆంధ్రసాహిత్య అభిజ్ఞ పండితవర్గము గుర్తించగలదు. ఈ విధంగా ప్రబంధ లక్షణాలివి అని , తమకు నచ్చిన కావ్యగతాంశాలను కొన్నిటిని ప్రామాణీకరించుకొని , అష్టాదశ వర్ణనలు ప్రధానంగా ఉండే స్వతంత్ర కథోచిత మనోహర పద్యగద్యాలున్న కావ్యాన్నే “ప్రబంధమ”ని నిర్వచించినారు. కాని, మనుచరిత్ర కంటే సుమారు దశాబ్దం పైబడిన కాలం ముందటిదైన , 16 వ శతాబ్దపు ప్రారంభాన ఓరుగల్లు ను పాలించిన చిత్తాపుఖానుని మంత్రియైన పెద్దనామాత్యునికి అంకితమైన చరిగొండ ధర్మన్న కవియొక్క ‘చిత్ర భారతం ‘ ను గుర్తించదలచరైరి.

కాలక్రమానుగుణంగా “చిత్రభారతము” (చరిగొండ ధర్మన్న) క్రీ.శ. 1503-12 మధ్యకాలములోనిది. “మనుచరిత్రము” క్రీ.శ.1522లో భువన’విజయము లో కొలువుండి శ్రీకృష్ణదేవరాయలు అల్లసాని పెద్దనను అడిగి వ్రాయించుకున్న ప్రబంధము. ఈ విధంగా కాల సన్నివేశాలను పోల్చిచూసినట్లైతే “చిత్రభారతము”తొలి తెలుగు ప్రబంధమగుట వాస్తవము.న్యాయము. ఈ ప్రామాణిక , చారిత్రక శాసనాధారాలుగల విషయాలను 2013 లో తెలుగు విశ్వవిద్యాలయంలో విజిటింగ్ ప్రొఫెసర్ గా పనిచేసిన డా॥సంగనభట్ల నరసయ్య గారు : ఉపకులపతి డా॥ ఎల్లూరి శివారెడ్డిగారి కోరికమేరకు పరిష్కరించి, విపులమైన పీఠికను చేర్చి వెలువరింప’చేసినారు.

ప్రస్తుతము 2014 నుండి తెలుగు భాషకు చెందిన రాష్ట్రాలు రెండు . ఒకటి తెలంగాణ , రెండు ఆంధ్రప్రదేశ్. తెలంగాణ ఆవిర్భవించిన తరువాత 2017 డిసెంబరు నెలలో రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్యశ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ప్రపంచ తెలుగు మహాసభలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన నిర్వహించుటకు సంకల్పించిరి. అంతకు కొద్ది నెలల ముందుగా డా॥నందిని సిధారెడ్డిగారు తొలి అధ్యక్షులుగా “తెలంగాణ సాహిత్య అకాడమీ” ప్రారంభించబడినది. ఈ క్రమంలో ప్రపంచ తెలుగుమహాసభలు డా౹౹నందిని సిధారెడ్డి గారి అధ్వర్యంలోనే మూడు రోజులు వివిధ ప్రసిద్ధ సాహితీవేత్తల పేరిట ఏర్పాటు చేయబడిన వేదికలపై నిర్వహింపబడినవి. అందులో భాగంగ “తెలంగాణ ప్రబంధాలు” శీర్షికన గతంలో ప్రచుర పఠన పాఠన పరంగా విస్తృత ప్రచారం లోకి రాని ప్రబంధములకు చెందిన ప్రత్యేక, విశిష్ట లక్షణములను గురించి నాకు : గురిజాల రామశేషయ్య కు ప్రసంగించుటకు అవకాశము లభించినది. ప్రముఖులైన తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ పండితుల సమక్షంలో తెలంగాణ ప్రక్రియా ప్రాదుర్భావ వికాస విశేషాంశములు పునర్మూల్యాంకన గణనం లోనికి రావలెనని నివేదింపబడినది . ఆ క్రమంలోనే నేను తదుపరి సంవత్సరములలో తెలంగాణ సాహితీ వేత్తలను సంప్రదించి ఒక్కొక్కరికి ఒక్కో ప్రబంధం చొప్పున అప్పగించి కవిపరిచయము–స్థల కాలాది’విశేష–కథాసంగ్రహ–ప్రబంధ నిర్మాణ విశేషాదిక పద్య’శిల్ప వైభవ విశేషములను వివరిస్తూ విషయవిస్తృతి గల వ్యాసములను వ్రాసి ఇవ్వవలసినదిగా కోరితిని .

కోరినవెంటనే సమ్మతించి ఆయా ప్రబంధములను కూలంకషముగా అధ్యయనము చేసి తత్ ప్రబంధ సంబంధిత చర్చనీయాంశాలకు చెందిన వివిధ సాహిత్య చరిత్రాది గ్రంథములను సంప్రదించి రచించి విద్వన్మిత్రులు వ్యాసములను పంపినారు . అయితే ఇంతలోనే వచ్చిపడిన కరోనా గండ సమయములో ప్రచురణ -ఆవిష్కరణాదులకు చెందిన సమయసందర్భ అవకాశాలు కుంటు పడుటచే ఏదైన పత్రిక ద్వారా మొదటి విడతగా ఈ ఐదు వ్యాసాలను వెలువరించ దలిచితిని. ఇంతలో దైవికముగా అమెరికాలో తమ పిల్లల దగ్గర ఉన్న ప్రసిద్ధ తెలంగాణ స్త్రీవాద రచయిత్రి,కవయిత్రి, ఒద్దిరాజు సోదరులపై విశేష శ్రమకోర్చి పరిశోధన చేసిన విద్వాంసురాలు డా॥ కొండపల్లి నీహారిణి ఒక రోజు ఫోన్ ద్వారా సంభాషిస్తూ , తాను ఒక ద్వైమాసిక అంతర్జాల పత్రికను ప్లవ ఉగాది నుండి ప్రథమ సంచికను వసంత సంచికగా ప్రకటించ’దలచినానని చెప్తూ , మీరు ఏదైనా ఒక ప్రత్యేక అంశానికి చెందిన తెలంగాణ సాహిత్య శీర్షికను నిర్వహింపవలెనని కోరినారు. వెదుకబోయిన రత్నము చేతికి దొరికినట్లు భావించి : వెంటనే నేను సేకరించిన తెలంగాణ ప్రబంధాలకు చెందిన విషయ విస్తృతిగల వ్యాసములను తమ ‘ మయూఖ ’ అంతర్జాల పత్రికలో ధారావాహికముగా ప్రచురించుకొన’వచ్చునని చెప్పినాను. అందుకు సంపాదకులు డాక్టర్ నీహారిణిగారు అంగీకారము తెలిపినారు .

తెలంగాణ ప్రబంధాలు శీర్షికతో తొలివిడతగా _తెలంగాణ పంచకావ్యాలు_ అనదగిన తెలంగాణ సాహిత్య వికాసరూపాలనదగిన ఐదు ప్రబంధాల పరిచయమాలికను సహృదయులకు అందించగలుగుతున్నందుకు ఎంతో సంతోషిస్తున్నాను.

ఈ పరిచయ మాలికను తమ మయూఖ తెలంగాణ సాహిత్య ద్వైమాసిక అంతర్జాల పత్రిక లో ప్రచురించుకొనుటకు అంగీకరించిన మయూఖ సంపాదకులకు తదితర నిర్వాహక కుటుంబ సభ్యులకు : హృదయపూర్వకంగా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. జయంతి తే సుకృతినో రససిద్ధాః కవీశ్వరాః

గురిజాల రామశేషయ్య రిటైర్డ్ అసోసియేట్ ప్రొఫెసర్ తెలుగు హైదరాబాద్ +91 70326 79471

 

డా॥ బి. జయరాములు గారి పరిచయం
ఆధునిక తెలుగు సాహిత్యవేత్తలలో, ప్రవచన కర్తలలో సుప్రసిద్ధులైన వారిలో డా|| బి. జయరాములు  గారు ఒకరు. హైదరాబాద్ మహానగరం కేంద్రంగా నిర్వహింపబడే ప్రముఖ సాహిత్య సంస్థల విశేష కార్యక్రమాలలో నిర్వహణ రీత్యా తన ప్రతిభా పాటవాలను ప్రకటించుకొని మెప్పు పొందిన అతి కొద్దిమందిలో జయరాములు గారొకరు.  వీరు డాక్టర్ మాడుగుల నాగఫణిశర్మ గారి ద్విశత, సహస్ర, బృహత్ ద్విసహస్ర, పంచశత తదితర అవధానాల నిర్వహణలో ప్రముఖ పాత్ర  వహించిన సంగతి  పృచ్ఛకులుగా పాల్గొన్న వేలమందికే కాక తదితర ప్రేక్షక వర్గ మహాశయులెందరెందరికో తెలిసిన విషయమే. ఆ విధంగా సభా సమన్వయంలో సమర్థుడని పేరు పొందినారు.
ధార – ధారణ అసాధారణంగా  కలిగిన మహో అవధానులలో డాక్టర్ మాడుగుల నాగఫణి శర్మ గారు ఒకరని జగద్విదిత విషయమే. తెలుగు ఠీవి మన పీవీ అంతటివారు పృచ్ఛకులుగా పాల్గొన్న ఘనత అవధాని డాక్టర్ మాడుగుల నాగఫణిశర్మ గారి అవధానానికి గొప్ప మెప్పు శాలువా !  అవధాన సభల నిర్వహణలో  అవధానిగారు ప్రశాంత మనోజ్ఞా వాతావరణంలో  సఫలీకృతం కావటానికి కావలసినంత సమయస్ఫూర్తి, పర్యవేక్షణ దక్షత కలిగినవారు.  సాహిత్యాంశాల సమాకలన – సముచిత వర్గీకరణ వ్యుత్పన్నతలు కలిగినా సభాసమయ సాహిత్య వక్తలు ఉన్నప్పుడు మాత్రమే సాధ్యం అని వేరే చెప్పనక్కర లేదు.  డా|| జయరాములు గారు “ఇటువంటి సమన్వయ కర్త”.  ఇట్లే డా|| మేడసాని మోహన్, డా|| మలుగు అంజయ్య, డా|| జి.ఎం. రామశర్మ, శ్రీ అష్టకాల నరసింహ రామశర్మ మొదలైన పెద్దల అవధానాలలో సభా సమన్వయంతో పాటు అప్రస్తుత ప్రసంగ పృచ్ఛకులుగా వీరి దోహదం పేర్కొనదగినది.
ఇక ఉద్యోగవృత్తి నిర్వహణ పరంగా అసోసియేట్ ప్రొఫెసర్ గా, ప్రిన్సిపాల్ గా అభ్యుదయ ప్రాచ్య కళాశాలలో 34 సం|| సుదీర్ఘ అనుభవమున్న వారు డా|| జయరాములు గారు.
వీరు సుప్రసిద్ధ విమర్శకులు డా|| జి.వి.సుబ్రహ్మణ్యం గారి పర్యవేక్షణలో “ఆంధ్ర ప్రబంధాలు – శృంగారం – ప్రయోగాలు” అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పట్టాను పొందారు.  ‘రస’ చర్చ చాలా లోతైన విషయమని తెలుగు ప్రబంధాలలో  ‘శృంగారం’ ప్రధాన రసమని తజ్ఞులకు వేరే చెప్పనక్కర లేదు.  వీరి కూలంకష పరిశోధన గురువుల మెప్పును అందుకున్నది.
ఇదే వరుసలో సత్యభామ తదితర పాత్రలకు చెందిన వీరి మరో గ్రంథము : “సాంత్వన కావ్యాలు – శృంగార నాయికలు” చెప్పుకోదగిందే. ఇట్లే పాఠశాల స్థాయి నుండి ఉన్నత విద్యా స్థాయి వరకు పాఠ్యరచన, బోధనా పద్ధతుల గ్రంథాలు రచించినారు. వివిధ పత్రికలలో అసంఖ్యాకంగా వైవిధ్యభరితమైన వ్యాసాలను ప్రచురించినారు.
భక్తి, పూజ, సివిఆర్, హిందూధర్మం,  జెమిని, జయ జయ శంకర మొ|| టి.వి. ఛానల్స్ లో దేవాలయాల్లో ఆధ్యాత్మిక ప్రవచనాలు, చర్చలు వీరివి ఎన్నో ఎన్నెన్నో. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ అధ్యాపక పురస్కారం పొందిన డా|| జయరాములు గారిని ‘విశ్వసాహితి’ తదితర సంస్థల పురస్కారాలెన్నో వరించినవి.  హైదరాబాద్ మహా నగరంలో ప్రసిద్ధి పొందిన గొప్ప సాహిత్య, కళారంగ సంస్థలకు కొదువ లేదు. అయితే వృద్ధాప్య కారణంగా ఆయా సంస్థల వ్యవస్థాపక అధ్యక్షులు తగినంత చేవతో ఆ సంస్థలను నిర్వహించలేని స్థితిలో రెండవతరం నిర్వహణ సామర్థ్యశాలిగా డా|| జయరాములు గారు విశ్వసాహితి, యువభారతి సంస్థల అధ్యక్షులుగా, కార్యదర్శిగా వ్యవహరించడం గమనార్హం.
“విశ్వసాహితి” పక్షాన “నాటి పురాణం – నేటి సమాజం” శీర్షికన ప్రసంగాలను చేయించి గ్రంథాలుగా వెలువరించటం తొలి సంపుటం వెలువడడం జరిగింది.
“యువభారతి” పక్షాన “విశ్వనాథ సాహితీ సమాలోచనం” గురువుగారైన జి.వి.సు. గారితో సహ సంపాదక స్థాయిలో వెలువరించినారు. ఈ క్రమంలో “నేను-నా కళా ప్రస్థానం” ఒక గొప్ప ప్రయోగం. నటులు, కవులు, గాయకులు, సంగీత దర్శకులు, జానపద కళాకారులు, సినీ దర్శకులు, నాట్య కళాకారులు, చిత్రకారులు, శిల్పులు మొదలైన సీనియర్ మోస్ట్ అనుభవజ్ఞులతో నేటి యువ కళాకారులకు స్ఫూర్తిదాయకమైన రోల్ మోడల్ విధాన ప్రసంగ పరంపర ఎంతో ప్రయోజనకరమైనది. ఇటువంటిదే మరో అడుగు “సాహిత్య కళా రసవాహిని” కార్యక్రమ పరంపర. ఆనందం – సందేశం జమిలిగా కళ యొక్క ప్రయోజనమని అనుభవంలోనికి తెచ్చే సరళీ స్వరకల్పనం ఈ కార్యక్రమాల లక్ష్యం.
“ఆధునికాంధ్ర కవులు” 51 మందిని గురించిన గ్రంథం వీరి గ్రంథాలలో ఒక ప్రత్యేక గ్రంథం. తమ గ్రామమైన చిత్తలూరులోని నల్లగొండ జిల్లాలోని కాకతీయ చారిత్రక ప్రసిద్ధమైన మిని నిర్మాణ రీతిలో  ఉండే “శంభులింగేశ్వరాలయ” దైవము పైన రచించిన శ్రీ శంభులింగేశ్వర శతకం మొదలుగా అనేక కావ్యాల విమర్శన వ్యాసాలూ, పరిశోధన వ్యాసాలూ, అమెరికా పర్యటన సంబంధ విశేషాల గ్రంథాలు వీరివి 15 వరకు ఉంటాయి. పల్లె నుండి మహా నగరం దాకా;  అమెరికా TANTEX దాకా వీరికి జరిగిన సన్మానాలు వీరి సాహిత్య సేవకు సహృదయులందించిన ప్రతిస్పందనల కలికితురాయిలే.
తెలంగాణ ప్రబంధాలలో మేటి ప్రబంధముగా ప్రసిద్ధ విమర్శకులచే ప్రశంసలు పొందిన “తపతీ సంవరణోపాఖ్యానం” గురించి సమగ్ర పరిశీలనతో – చర్చా పూర్వక అంశాలతో నిగ్గుదేల్చినట్లు కొన్ని అంశాలను తేల్చివేసి ఉత్తమ ప్రబంధంగా తపతీ సంవరణాన్ని నిర్ధారించిన డా|| బ్రాహ్మణపల్లి జయరాములు గారికి “తెలంగాణ ప్రబంధాలు”  పరిచయ మాలిక నిర్వహణకర్తగా అభినందనలు, అభివందనములు తెలుపుకుంటున్నాను.  కృత శ్రములకు వందనములు తెలుపుకొనుట కృతజ్ఞతయే.
తెలంగాణ ప్రబంధ వ్యాసపరంపరలో ఇది రెండవ వ్యాసము. సకాలంలో వ్యాసం అందించిన జయరాములు గారికి సాహితీ బంధువుగా ఆప్తవాక్యం పలుకుతూ సహృదయ విద్యాంసులైన పాఠక మహాశయులకు నమోవాకములు సమర్పిస్తూ….

                                                                                                                                   భవదీయుడు
– గురిజాల రామశేషయ్య

 

 

 


తెలుగు సాహిత్యంలో ప్రబంధం ఒక ప్రత్యేక ప్రక్రియ. సంస్కృత లాక్షణిక సంప్రదాయంలో ప్రబంధం అంటే కావ్యమే. కాని 16వ శతాబ్దంలో కవులు రచించిన కావ్యాలకే ప్రబంధాలు అనే రూఢి ఏర్పడింది. ప్రకృష్టమైన బంధం కలది ప్రబంధం. ఆ బంధం శబ్దార్థాలలో పద్యాలలో ప్రధానంగా కనబడుతుంది. వస్త్వలంకారాలలోనూ దాన్ని దర్శింపవచ్చును. అయితే రూఢినిబట్టి ప్రఖ్యాత వస్తుకం, శృంగారరస ప్రధానం, ధీరోదాత్త నాయకం, అష్టాదశ వర్ణన భూయిష్టం, ఆలంకారిక రచనాబంధురం, పంచాశ్వాస పరిమితమైన చంపూ కావ్యాన్నే తెలుగువారు ప్రబంధంగా భావిస్తారు.

ప్రసిద్ధమైన ఏ ఉపాఖ్యానాన్నో గ్రహించి, స్వీయకల్పనలతో పెంచి, అష్టాదశ వర్ణనలతో శృంగార రసబంధురంగా ఆలంకారిక శైలిలో ప్రబంధ రచన చేయడం ప్రబంధ కవి పద్ధతి. వారు ఎన్నుకొనే కథలో ఓ కొత్తదనం, నిర్వహణలో నిండుదనం ఉంటుంది. ఈ లక్షణాలన్నీ మనం అద్దంకి గంగాధర కవి రచించిన “తపతీ సంవరణము” అనే ప్రబంధంలో దర్శించవచ్చు.

కవి – కాలం – స్థలం :

అద్దంకి గంగాధర కవి 16వ శతాబ్ది కవి. ఈయన ఈ ప్రబంధాన్ని 1550-65 మధ్య రచించి ఉంటాడని మల్కిభరాముని పాలనా కాలాన్నిబట్టి నిర్ణయించారు పాటిబండ మాధవశర్మగారు. కాని “ఏలిక ఆసక్తి మేరకు ఆనాటి సాహిత్య లోకపు ‘ఫ్యాషన్’లకు లోబడి వసుచరిత్ర మూసలోనిదా అనిపించేటట్టు ఈ కావ్యాన్ని రచించాడు. అందుకే సాహిత్య చరిత్రకారులూ, విమర్శకులూ కొన్ని కొన్ని అభిప్రాయాలకూ వచ్చారు” అంటూ ఆరుద్రగారు తమ సమగ్రాంధ్ర సాహిత్యం రెండవ సంపుటిలోను, కందుకూరి వీరేశలింగంగారు ఈ ప్రబంధం “వసుచరిత్రమును బోలి వరలుచున్నది” అన్న మాటను కూడా పూండ్ల రామకృష్ణయ్యగారు ఖండిస్తూ “వసుచరిత్రకు వసుచరిత్రమే సాటిగాని మరియొక గ్రంథము మన భాషలో నిప్పటికీ లేదు” అన్న వాక్యాల్ని ఉటంకించారు. అయితే పాటిబండ మాధవశర్మగారు ఈ ప్రబంధ పీఠికలో ఆ అభిప్రాయాలను ఖండించి, “ముందు వచ్చిన చెవులకన్న వెనుక వచ్చిన కొమ్ములు వాడి” అన్నట్లు తపతీ సంవరణమే ముందు పుట్టినను, తరువాత పుట్టిన వసుచరిత్రమునకు ముందు ప్రచారము కలిగినది. వసుచరిత్ర పద్యములు ముందుగా చదివి ఉన్నవారు తపతీ సంవరణ పద్యములు చదివి గంగాధరుడు “రామరాజ భూషణుని” అనుసరించెననుట సహజము’’ అనే వాక్యాలను ఉదాహరించారు.  అలా చెబుతూనే ఆరుద్రగారు “…. గంగాధరుడు సత్యమే. ఇతని కావ్యం రస బంధురమే. సుప్తమీన జలాశయంబు చందంబున కనబడే ఈ కావ్యంలో వెతికితే వసుచరిత్రలో లాగా కొన్ని గడుసు పోకడలు కనబడుతాయి” అని మళ్ళీ తరువాత వచ్చిన వసుచరిత్ర పొకడలు “తపతీ సంవరణము”లో కనబడతాయనడం గడుసుదనమే. తర్వాత వచ్చిన ప్రబంధం పోకడలు ముందు దానిలో ఎలా కనబడతాయి? ముందు వచ్చిన (1550-1565) ప్రబంధపు పోకడలే తరువాత వచ్చిన (1580) ప్రబంధంలో కనబడతాయనడం సమంజసం. పాటిబండ వారు చెప్పినట్లు “గంగాధర కవి వసుచరిత్రమును చూడలేదు, అనుకరించను లేదు. రామరాజ భూషణుడే పూర్వకవుల భావములను పెక్కింటిని అనువదించినట్లు గంగాధర కవి భావములను కూడా కొన్నింటిననుకరించెనేమో” అనడం సమంజసం, సత్యం. ఈ తెలంగాణ ప్రబంధమునకు గౌరవ ప్రదం. గర్వకారణం.

గంగాధర కవి తండ్రి వీరయామాత్యుడు. ఇంటి పేరు అద్దంకి. ఆయన గురువు కేదారశ్రీ. ఇంతకుమించిన వివరాలు కవి గురించి లభించడం లేదు. అద్దంకి నెల్లూరు జిల్లాలో ఉండడంవల్ల ఈ కవి పూర్వులు అక్కడ ఉండేవారని పాటిబండవారు ఊహించారు. గంగాధర కవి తాతగారి కాలంలోనో, తండ్రిగారి కాలంలోనో గోలకొండ ప్రాంతానికి వచ్చి ఉంటారని శర్మగారన్న మాటలు సమర్థనీయాలే. దీన్నిబట్టి గంగాధర కవి నూటికి నూరుపాళ్ళు తెలంగాణ ప్రాంతపు కవే. గంగాధర కవి వేదాలు, భాష్యం, మీమాంసాశాస్త్రం బాగా చదువుకున్న పండితుడు. కులీకుతుబ్ షా వంశీయుడైన ఇబ్రహీం (ఇభరాముడు)కు గంగాధర కవి తన తపతీ సంవరణాన్ని అంకితమిచ్చాడు. ఇభరాముడే స్వ యంగా, “….భారతాఖ్యానమందు గలుగు తాపత్య చరితంబు ఘనత నరసి వివిధ శృంగార మహిమల విస్తరించి కబ్బమొనరింపు నా పేర గవివరేణ్య” (1-19) అని అడిగి, ఈ రసవత్పబంధాన్ని అంకితం గొన్నాడు.

ప్రబంధం – సామాజిక నేపథ్యం :

‘పదహారవ శతాబ్దంలో ఆవిర్భవించిన ప్రబంధ సాహిత్యం మాత్రం చాలా ‘విలాసం’గా నింపాదిగా పుట్టింది. రాజుల్లాగా  రాజోద్యోగులు కూడా కృతుల్ని రచింపిం చేశారు. అంకితాలు పుచ్చుకున్నారు. అందుచేత ‘కవి’ సమాజం నుండి ప్రేరణ పొందింది చాలా తక్కువ’ అంటారు ప్రసిద్ధ విమర్శకులు హెచ్.ఎస్. బ్రహ్మానందం (ప్రబంధ సాహిత్యాన్ని సృష్టించిన సమాజ స్వరూపం).

ప్రబంధ కవులు ఎలాంటి వాతావరణం ఉండాలని కోరుకున్నారో పెద్దన చాటు పద్యం చెబుతూంది.

“నిరుపహతి స్థలంబు రమణీ ప్రియదూతిక తెచ్చియిచ్చు క

ప్పుర విడెమాత్మ కింపయిన భోజన ముయ్యల మంచ మొప్పు త

ప్పరయు రసజ్ఞులూహ తెలియంగల లేఖక పాఠకోత్తముల్

దొరికినగాక యూరక కృతుల్ రచియింపు మటన్న – శక్యమే?”

సప్త సంతానాలలో నశించనిది ‘కృతి’ కాబట్టి రాజులు తమ పేరు ఆచంద్రార్కం నిలుపుకునేందుకు కవులకు ప్రోత్సాహం ఇచ్చారు. ప్రబంధం ఒక ప్రక్రియగా విశిష్ఠ స్థానం పొంది, తెలుగు సాహిత్య చరిత్రలో చిర, స్థిరస్థాయిని సాధించుకున్నది. ప్రబంధాలు సామాజిక దృష్టితో చూస్తే నాటి పరిస్థితులను కొంత చిత్రించినా, సాహిత్య స్పృహతో వ్రాయడంవల్ల ఆనంద పర్యవసాయులుగా అంటే ఆనందం (సద్యఃపరనిర్వృతి) అనే కావ్య ప్రయోజనాన్ని ప్రధానంగా నెరవేర్చేవిగానే దర్శనమిస్తాయి. అయితే ఆకలిదప్పులు మనిషికి ఎంత సహజాతాలో ఒక విధంగా కళానంద లాభము అటువంటిదే కనుక ఆనంద పర్యవసాయి కళలు నిరంతరకాల ప్రయోజనకరాలేనని చెప్పవచ్చును.

శ్రీ కృష్ణదేవరాయల యుగం (16శ.) తెలుగుసాహిత్య చరిత్రలో స్వర్ణయుగంగా ఖ్యాతి గడించింది. నాటి మహమ్మదీయ ప్రభువుల ప్రభావంతో పాలకులలో, కవులలో రసిక జీవనం అలవాటై శృంగార రసప్రబంధాలు రావడానికి మూలమైంది. మొత్తం మీద ప్రబంధ కాలం నాటి రచనలు తమ స్వతంత్ర ప్రతిపత్తిని నిలుపుకొని ఒక యుగంగా సాహిత్య చరిత్రలో స్థిర చిరకీర్తిని పొందాయి. పాఠకునికి మానసోల్లాసం కలిగించడానికి, కవితాతత్త్వం అందించడానికి, నాటి సామాజిక నేపథ్యం తెల్పడానికి ప్రబంధాలు దోహదం చేస్తాయి.

తపతీ సంవరణము – కథా సంగ్రహం :

సంవరణుడు అనే రాజు హస్తినాపురాన్ని పరిపాలిస్తున్నాడు. ఒకనాడు ఆ రాజు ప్రమదా వనానికి వెళ్ళి ఒక సహకార (మామిడి) వృక్షం కింద కూర్చున్నాడు. ఇంతలో ఒక చిలుక వచ్చి ఆతని చేతి మణికట్టుపై వాలింది. దాని అందానికి మురిసిన రాజు దాన్ని తన సహచరులకు చూపిస్తూండగా అది మానవభాషలో సూర్యుని కూతురైన తపతి సౌందర్యాన్ని వర్ణించి చెప్పింది. ఆ చిలుక, తపతి కోసం తగిన రాకుమారుని వెదుకుతూ దేశాలన్నీ తిరిగి, అలసిపోయి ఈ చెట్టుపై విశ్రాంతి తీసుకుంటున్నానని, ఇంతలో అతిలోక సుందరుడవైన నిన్ను చూశానని, నువ్వే తపతికి తగిన పతివని చెప్పింది.

సంవరణుడు చిలుక పలుకులు విని మోహపరవశుడై దాన్ని, దాని మాటలను ప్రశంసించాడు. కాని, తపతి దేవకన్య కాబట్టి మానవుణ్ణైన తాను ఆమెను పొందలేనన్నాడు. ‘దైవయోగం ఉంటే ఏదైనా సాధ్యమే’ – అని మీరామెను వరిస్తే పూవుకు తావి అబ్బినట్లు ఉంటుందని రాజునుత్సాహపరిచి, వారిద్దరినీ కలపడానికి యత్నిస్తానంది చిలుక. తపతి తల్లిదండ్రులు అంగీకరిస్తారో లేదో నువ్వే ఏదైనా చేయుమని చిలుకను సంవరణుడు వేడుకున్నాడు. సూర్యుడు తపతిని ఆ రాజుకివ్వడానికి అంగీకరిస్తాడని నచ్చచెప్పగా, చిలుకను వెంటనే వెళ్ళి తిరిగి రమ్మని పంపించాడు. చిలుక ‘నీ కోరిక నెరవేరుతుంది’ అని వెళ్ళింది. సంవరణుడు విరహంలో పడి బాధననుభవిస్తుండగా ఆయన పరిచారకులు శిశిరోపచారాలు చేశారు. రాజు తపతి తల్లిదండ్రుల మాట వింటుంది అనే విశ్వాసంతో సూర్యోపాసన ప్రారంభించాడు. సూర్యుడు సంతసించి, తన కూతుర్ని అతనికే ఇవ్వాలనుకున్నాడు.

చిలుక, తపతి ఉన్న చోటుకు వెళ్ళి ఆమె చేతిమీద వాలింది. తపతి, ఇన్నాళ్ళు నువ్వు ఎక్కడికెళ్ళావు?’ అని చిలుకను అడిగింది. చిలుక, ‘నీకోసం వరుణ్ణి వెదుకుతూ, అన్ని దేశాలు తిరిగి, హస్తినాపురంలో బహు సుందరుడైన సంవరణుడనే రాజును చూశానని” అతని సౌందర్యాన్ని వర్ణించింది. తపతి, ‘ఆ మనోహరాకారుడు తనను వరిస్తాడా?’ అని సందేహిస్తుండగా చిలుక, ‘తానామె సౌందర్యాన్ని వర్ణించగానే అతడు మోహ పరవశుడయ్యాడని’ చెప్పింది. తపతి కూడా విరహవేదన పొందింది. చిలుక సంవరణుని దగ్గరకు వెళ్ళి, ‘కార్యం ఫలించింది’ అని చెప్పి తానుండే చోటుకు వెళ్ళిపోయింది. తపతిని వెదుకుతూ చెలికత్తెతోపాటు అందరూ ఆమె చెంతకు వచ్చారు.  ఆమె తాపానికి కారణం అడిగారు. ఆమె మౌనాన్ని అర్థం చేసుకున్న ఒక చెలికత్తె అందరినీ  దూరంగా పంపించి, ‘నీ మనోహరుడెవడు?’ అని అడిగింది. తపతి జరిగిందంతా పూసగుచ్చినట్లుగా చెప్పింది. ‘దీనికింత బాధెందుకు? అతడు నీవాడయ్యేటట్లుగా చేస్తా’ నంది చెలికత్తె. ఇంతలో సాయంత్రం కావటం, చీకటి వ్యాపించడం, చంద్రుడుదయించడం జరిగింది. తపతి చంద్రతాపాన్ని తట్టుకోలేక చంద్రోపాలంభన చేసింది. బాధించే మన్మథుని తిట్టి బాధపడింది.  చెలికత్తెలు ఉపచారాలు చేశారు. సూర్యోదయం కాగానే చెలికత్తెలు ఆమెను కాలక్షేపం కోసం భూలోకానికి తీసుకొని వచ్చారు. అది వసంత ఋతువు. చెలికత్తెలు పూలు కోస్తుండగా తపతి మాత్రం విరహవేదన పడుతుంది. వారు మదన పూజ చేశారు. ఇంతలో వేటకు బయలుదేరిన సంవరణుడు వనమంతా తిరిగాడు. అపుడు ఒక వనమయూరం అక్కడికి రాగా దాన్ని పట్టుకోవడం కోసం రాజు ఒక డేగ (సాళువా)ను పంపించాడు.  వాటిని వెన్నంటాడు రాజు. కొంత దూరం వెళ్ళాక అవి కనిపించకుండా పోయాయి. తన గుర్రం అలసిపోవడంతో రాజు, దాన్ని వదలి తాను నడుస్తూ, తపతి, ఆమె చెలికత్తెలున్నచోటికి చేరుకున్నాడు.

సంవరణుడు: ఆ దివ్యకాంతలు, వారి మధ్య తపతిని చూసి ఒక చెట్టు మాటున దాగి వారిని చూశాడు. తపతిని చూసి ఆమె చిలుక చెప్పిన సుందరాంగే అయ్యుంటుందని భావించి, కామ పీడితుడై ఆమెను చేరరాగా చెలికత్తెలంతా మాయమయ్యారు. తపతి మాత్రం ‘చిలుక చెప్పిన రాకుమారుడతడే అయ్యుంటాడని భావించి అక్కడే తను యోగమాయచే దాగి ఉంది. సంవరణుడు ఆమెను కానక దుఃఖిస్తూ నేలపైబడి దొర్లాడు. తపతి జాలిపడి తనను దాచుకొన్న తాను అతని దగ్గరకు వచ్చింది. ఎందుకిలా బాధపడుతున్నావని అడిగింది. రాజు ఉన్న విషయం చెప్పి, గాంధర్వ పద్ధతిలో తనను పెళ్ళి చేసుకొమ్మన్నాడు. ఆమె, తాను తండ్రి చాటు పిల్లనని, సూర్యునారాధించుమని చెప్పింది. మూర్ఛిల్లిన సంవరణుడు తేరుకొని, తన సేనలను నగరానికి పంపి, రత్నకూటంలో తాను తపస్సు చేయడం ప్రారంభించాడు.

వశిష్ఠుడు అరుంధతీ సహితుడై వచ్చి, ఎందుకిలా తీవ్ర తపస్సు చేస్తున్నావనగా, రాజు తమ దివ్యదృష్టికి తెలియనిదేమున్నది?  అన్నాడు. వశిష్ఠుడు విషయం గ్రహించి, ఇంత మాత్రానికి తపస్సెందుకు నేను తపతిని తీసుకొని వస్తానని సూర్యమండలానికెళ్ళాడు. వచ్చిన పని తెల్పగా సూర్యుడు సంతసించి, ఆ దంపతులకు తన కూతురు తపతిని అప్పగించాడు. ఆ ముని దంపతులు తపతిని తీసుకొని వచ్చి తపతీ సంవరణులకు అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు. తానే కన్యాదానం చేశాడు. రాజు తన భార్య తపతితో తన భవనానికి వెళ్ళాడు. ఆమెతో కామ్య భోగాలనుభవిస్తూ మలయ పర్వతంపై విహరిస్తున్నాడు. రాజు పరిపాలనను వదిలేయడంవల్ల రాజ్యంలో అనావృష్టి ఏర్పడి, రాజ్య సంక్షోభం కలిగింది. వశిష్ఠుడు రాజు దగ్గరకు వచ్చి, సదుపదేశం చేసి, పాలన చేయుమన్నాడు. రాజు భార్యతో నగరం చేరి, రాజ్యాన్ని సుభిక్షంగా పాలించాడు. తపతి గర్భం ధరించింది. శుభలగ్నంలో కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడు యువకుడు కాగానే అతనికి సంవరణుడు రాజ్య పట్టాభిషేకం చేశాడు.

ఇతివృత్తానుశీలనం – కల్పనా చమత్కృతి :

ప్రఖ్యాతమైన ఇతివృత్తాన్ని గ్రహించి, వర్ణనాదులచే పెంచి, శృంగార రసబంధురంగా, స్వీయ కల్పనా చమత్కృతితో ప్రబంధంగా తీర్చిదిద్దడమే ప్రబంధ కవి రచనా పద్ధతి. మహాభారతం ఆదిపర్వంలోని సప్తమాశ్వాసంలో 68 నుంచి 90వరకున్న కేవలం 23 గద్య పద్యాలలో ఉన్న ఇతివృత్తాన్ని గ్రహించి, గంగాధర కవి సుమారు 500 గద్య పద్యాలున్న ఐదాశ్వాసాల ప్రబంధంగా తీర్చిదిద్దాడు. భారతంలో తపతీ సంవరణం ఒక ఉపాఖ్యానం. దాన్ని స్వతంత్ర ప్రబంధంగా మలిచాడు తెలంగాణ అద్దంకి గంగాధర కవి. అలా మలచడానికి గంగాధర కవి కథలో చేసిన కల్పనలు, పాత్రలను చిత్రించిన విధం, శృంగారాన్ని పోషించిన రీతి, వర్ణనా వైదగ్ధ్యం, కమనీయ కవితా శిల్పం తదితరాలను పరిశీలిద్దాం. వ్యాసపరిధిని బట్టి స్థాలీపులాకన్యాయంగా వీటిని అనుశీలిద్దాం.

ఎ) కథాకల్పనం – సన్నివేశ చిత్రణం : కథా కథనంలో పూర్వాపరాల సమన్వయం కుదరడానికి, కార్యకారణ సంబంధం పొసగడానికి ప్రబంధ కవి కొన్ని సన్నివేశాలను కల్పించాల్సి ఉంటుంది. గంగాధర కవి కథాకల్పనలో – చిలుక రాయబారం, శ్యేన మయూరాల పోరాటం, తపతి చెలికత్తెలు, అనేక వర్ణనలు – అనే నాలుగు అంశాలు మూలకథ కంటే రసపరిపోషక కథన పరంగా  అధికంగా ఈ ప్రబంధంలో దర్శనమిస్తాయి.

  1. చిలుక రాయబారం : ఈ గ్రంథంలోని కల్పనలో ఇది ముఖ్యమైనది. ఈ కల్పన వల్ల నాయికా నాయకుల ప్రేమకు అంకురాది ఫల పర్యంతమైన దశాక్రమం చక్కగా సమకూడింది. ఈ చిలుక ఒకరి సౌందర్యాన్ని మరొకరికి వర్ణించి చెప్పి, పరస్పరం వలపు కలిగేటట్టుగా చేసింది. దాని సౌందర్య వర్ణనారీతి ప్రభావవంతమైంది. అందువల్లనే వనంలో కలుసుకున్నప్పుడు ఒకరినొకరు గుర్తించగలిగారు. ఆ చిలుక సామాన్యమైన చిలుకగాదు చిత్రవర్ణ విహంగ పుంగవం, దివ్యమైన రాజకీరం. వాక్ నైపుణ్యం, విద్యా సంపద బాగా కలిగింది. దాని గురువు తపతే. తన గురువు తపతి గురించి సంవరణునికి చిలుక చెప్పిన మాటలు పరికిస్తే, ఆ చిలుక సామాన్యమైన చిలుక కాదని, విద్యావివేకాలు కలిగిన తెలివైన చిలుకని మనం గ్రహిస్తాం.

“వాచావధూ విడంబిని

యా చారు కటీ రథాంగ యా సకల కళా

వైచిత్రిణి గావున నా

కాచర్యత్వము వహించెనయ్య మహీంద్రా! (ఆ2-37ప)

ఆఱంగములతోడు బారంగతంబుగా

నిగమములను సరహస్యముగను జదివి

కావ్యజాలము లలంకార మిశ్రంబుగా

గరతలామలకంబుగా నొనర్చి

భాష్య ఫక్కిక పాఠ పాతంజలి జలంబు

లాలాజలంబుగా లీలగ్రోలి

మీమాంస లేకుండ మీ మాంసయు బఠించి

బ్రహ్మ సాక్షాత్కార భావమంది

పేరు బలమున దత్వ విచారగరిమ

శుక మహాద్విజ ముఖ్యుతో సూడువట్టి

యున్ననాకిక నితరాంధ్రయుక్తియెంత?

హస్తిపదమున నడగవే యడుగులెల్ల!! (2 ఆ   – 38 ప)

ఈ పద్యంలోని విద్యా విశేషాలు నాయికకు, ఆమె శిష్యుడైన చిలుకకు మాత్రమే ఉన్నట్లు కాదు,  ఇవి పరోక్షంగా గంగాధర కవి పాండిత్య గరిమను తెలిపేవిగా కనపడతాయి. ఇదొక చమత్కార ఇష్టరచన విధానం.

నలోపాఖ్యానంలో హంసరాయబారం ఈ కవికి ప్రేరణ కలిగించి ఉంటుందని పాటిబండ మాధవశర్మగా రన్నారు. నాయికా నాయకుల వినుకలి ప్రేమకు, వారి సమాగమానికి, సంధానకర్తగా వ్యవహరించింది చిలుక. అది మొదట సంవరణుని మణిబంధంపై వాలి, అతడిని సంసిద్ధుడిని చేసి తిరిగి వచ్చి తపతి మణిబంధంపై వాలింది. తపతీ సంవరణుల ‘పాణిగ్రహణా’నికి ఈ విధంగా ప్రతీకాత్మకంగా చిలుక సంధాన కారణమైంది. ఆ చిలుక తపతి సౌందర్యాన్ని వర్ణిస్తూ,

“సారస సంభవుండఖిల సర్గ నిమిత్తము గూర్చియున్న శృం

గార రసంబు నెల్లనిడి కౌతుక మొప్పగ నీతలోదరిం

గా రచియించి….” (2-11) అని చెప్పినట్లుగానే,

ఆమెతో సంవరణుడి సౌందర్యాన్ని వర్ణించి చెబుతూ

“అహహ! ఈ రేడు లోకంబులందుగలుగు

సకల లావణ్య రసమెల్ల సంగ్రహించి

గరిమ నారాజు గావింపఁ గరువు గట్టి

చేసెగాబోలు నేర్పుతో సృష్టికర్త’’ (3-28)

అని చెప్పింది. తపతి శృంగార రసమూర్తియని సంవరణుడు లావణ్య రసస్ఫూర్తియని వారి వారి అందాలను వర్ణించి, ఒకరి రూపం మరొకరి హృదయంలో హత్తుకొనేటట్లుగా చేసింది చిలుక. “స్త్రీ సౌందర్యం పురుషుణ్ణి చురుకుగా స్పందింపజేసే విధమే శృంగార రసమూర్తియని చెప్పినాడు. పురుషుని మెరుగారు లావణ్యమునకు లవణ స్ఫటికములకు తళుకు గుణము ఎక్కువ. పురుషుని తేజో తనము స్త్రీని ఆకర్షించును. కనుక గంగాధర కవి సంవరణుని లావణ్యమూర్తియని పేర్కొని వధూవరుల పరస్పరాకర్షణ సన్నివేశమును బలిపరచినాడు. ఇది ప్రబంధ నిర్మాణ శిల్పమునందలి ఒక ముఖ్య లక్షణము.” చిలుక పాత్ర కల్పనంవల్ల ప్రబంధ కథకు కథనపరమైన ఔచిత్యం శృంగార రసపోషణావకాశం ఏర్పడ్డాయి.

  1. శ్యేన మయూరాల పోరాటం : ఈ పన్నివేశ కల్పనవల్ల వేటకు వచ్చిన సంవరణుని తపతి, ఆమె చెలికత్తెలు ఉన్న చోటికి చేర్చి ‘కనుకలి’ అనే ప్రయోజనాన్ని సాధించాడు కవి. ఇది స్వల్ప కల్పనే అయినా మంచి ఫలాన్ని సాధించిందని, కథాగతికి దోహదం చేసిందని చెప్పవచ్చును.
  2. తపతి చెలికత్తెలు: ఆమె చెలికత్తెల కల్పనవల్ల నాయికా నాయక సమాగమానికి సులభ మార్గం లభించింది. ఆమె హృదయాన్ని తెలుసుకొని, వారు ఆమెను భూ లోకానికి కాలక్షేపం కోసం తీసుకొని రావడంవల్లనే సంవరుణని దర్శించగలిగింది. వారు అతడు కనబడగానే అదృశ్యమైనా, తపతి మాత్రం అతనితో మాట్లాడి, అతని హృదయం గ్రహించి, ఇద్దరి పెళ్ళికి అనువైన మార్గాన్ని సూచించి వెళ్ళగలిగింది.
  3. వర్ణనలు : ఈ ప్రబంధంలోని అనేక వర్ణనలు, ప్రబంధపు గరిమను పెంచడానికి, రసపోషణకు, కవిభావుకతా శక్తిని వెల్లడించడానికి దోహదం చేశాయి. వాటి విశిష్టతను తర్వాత ప్రత్యేకంగా పరిశీలిద్దాం.

శృంగార రస పోషణం : తపతీ సంవరణములో శృంగారం అంగి, తక్కిన వీరాదులు అంగాలు. “విభవాను భావ వ్యభిచారి సంయోగాద్రస నిష్పత్తి:” – అనే భరతుని రస సూత్రం ప్రకారం ఆయా భావాల పోషణ ఈ ప్రబంధంలో అద్భుతంగా జరిగింది. తపతీ సంవరణులు ఆలంబన విభావాలు. ప్రబంధనామమే ఇది శృంగార ప్రధానమైందని తెలుపుతూంది. నాయికా, నాయకుల వర్ణన, వారి ఆభిజాత్యం, వారి వినుకలి ప్రేమ, వారి విరహం (పూర్వరాగం), వారి కలయిక, నాయకుని తపస్సు, వారి వివాహం అనే విషయాలు క్రమపద్ధతిలో సాగిపోయాయి. ఉద్దీపన విభావంగా చిలుక వర్ణించిన నాయికా నాయకుల సౌందర్యాది గుణాలు, అడవిలో వారు కలుసుకోవడం కనిపిస్తుంది. వారిలో అంకురించిన ప్రేమవల్ల వారి మాటలలో, చేష్టలలో భ్రూ విక్షేపకటాక్షాది అను భావాలు దర్శనమిస్తాయి. అలాగే నిర్వేదాది సంచారి భావాలు నాయికా నాయకుల మాటల్లో విరహబాధలో వ్యక్తమయ్యాయి. చిలుక నాయికను వర్ణించి వెళ్ళగానే నాయకునిలో విరహం ఏర్పడింది. శ్రవణం వల్లగాని, దర్శనంవల్లగాని రాగం ఏర్పడితే దాన్ని పూర్వరాగం అంటారు.  నాయిక గుణాలు విని నాయకునిలో పూర్వరాగం ఏర్పడ్డట్లే, నాయిక కూడా చిలుక చెప్పిన సంవరణుని సౌందర్య గుణాలను విని పూర్వరాగానికి లోనయింది. అదే అభిలాష విప్రలంభం. “న వినా విప్రలంభేన శృంగార: పుష్టిమశ్నుతే” అనే ఆలంకారిక వచనం ప్రకారం ఈ విప్రలంభ చిత్రణతో శృంగార రసానికి పుష్టి కలిగింది.

తపతీ సంవరణుల పూర్వరాగంలో దశవిధ మన్మధావస్థలు – అభిలాష, చింత, స్మృతి, గుణకథనం, ఉద్వేగం, సంప్రలాపం, ఉన్మాదం, వ్యాధి, జడత, మృతి (మూర్ఛ) అనే కామావస్థలు – కనబడతాయి. ఈ చిన్న వ్యాసంలో లక్ష్య లక్షణ సమన్వయం కుదరదు. విజ్ఞులు వాటిని నాయికా నాయకుల విరహంలో దర్శంచవచ్చును.

వర్ణనా వైదగ్ధ్యం : తపతీ సంవరణములో గంగాధర కవి ప్రబంధోచిత వర్ణనలు అనేకం చేశాడు. వాటిలో నగర, శైల, ఉద్యానవన, ఋతు, వనవిహార, జలక్రీడ, వేట, సూర్యాస్తమయ, అంధకార, చంద్రోదయ, మలయానిల, సూర్యోదయ, వివాహ వర్ణనలు ఉన్నాయి. ఇవి కాక నాయక వర్ణన, నాయికా వర్ణన, సురత వర్ణన, గర్భవర్ణన, పుత్రోదయ, తపోవర్ణనలు కనిపిస్తాయి.

ఈ ప్రబంధంలోని వర్ణనలలో విశిష్టమైనవి: తపతీ సంవరణుల రూప – గుణవర్ణనలు, వారి విరహ వర్ణనలు, నగర వర్ణన, సంవరణుని సూర్యోపాసన, వారి వివాహ సంభోగ వర్ణనలు, గంగాధర కవి వర్ణనలలోని వైదగ్ధ్యం గ్రహించడానికి కొన్ని ఉదాహరణలిస్తాను.

ఎ. నగర వర్ణన : హస్తినాపురాన్ని ఒక సీస పద్యంలో కవి చక్కగా వర్ణించాడు –

“శ్రీ భా విశేష మిశ్రీభావి భవనంబు

సారస కవిత కాసార సమితి

ప్రాకార వజ్ర దీప్రాకార హర్మ్యంబు

కుంజరంజిత భద్రకుంజరంబు

రమణీయతావాస రమణీయుత విలాసి

కాంచన సౌధాది కాంచనంబు

రాజ హంస కులీన రాజహంస కులంబు

బంధు రమ్య గృహస్థ బంధురంబు

కల్పనానల్ప శోభనా కల్పకంబు

గోపుర ద్వార చుంబిత గోపురంబు

సింధుజన్మాశ్వ దేశీయ సింధుజంబు

గజపురం బొప్పు జితమరుదజపురంబు” (1-46)

హస్తినగరంలోని దుర్గ, పరిఖ, హర్మ్యాదులు, చాతుర్వర్ణ్య ప్రజలు, రథగజ తురగ భటాదులు, విటవేశ్యాపుష్పలావికాదుల వర్ణనలు మనోహరంగా చేశాడు కవి.

బి. నాయక వర్ణన : ఈ ప్రబంధంలోని నాయకుడు సంవరణుడు. ఆయన వీర, కరుణ, దానాదిగుణాలను అనేక పద్యాలతో కవి అద్భుతంగా వర్ణించాడు. ఆ రాజు యొక్క ఐశ్వర్యం, ఆకారం, శౌచం, సహనం దాతృత్వం అనే గుణాలను వర్ణించిన ఈ పద్యం చూడండి.

“సారవిభూతి రెండవ వృషధ్వజు, డాకృతిచే దృతీయబృం

దారక వైద్యు, డిద్ధ శుచితా గుణమందు జతుర్థ పావకుం,

డారయ భూమి మోచుటకు నైదవదిక్పతి, దానరేఖచే

నారవ కల్పవృక్షమన నన్నర పాలుడుమించె గీర్తులన్” (1-72).

సంవరణుడు ధీరోదాత్తుడు, సర్వగుణ సంపన్నుడు. అందుకే శృంగార రసానికి తగిన నాయకుడుగా నిలిచాడు. కవి ఉత్తమ విభావంగా రాజును తీర్చిదిద్దాడు.

సి. నాయిక వర్ణన : తపతిని ఉత్తమ నాయికగా ఈ ప్రబంధంలో చిత్రించి నిరూపించాడు కవి.

“బంగారు మయమైన బ్రహ్మాండ భాండంబు” (2-10)

అనే పద్యం మొదలుకొని అనేక పద్యాలలో తపతి రూప సౌందర్యం, అంగాంగ వర్ణన (2-35) చేసి, ఆమె విద్యా వైభవాన్ని (2-38) చిలుక ద్వారా వర్ణింపచేశాడు కవి. నాయికా సౌందర్యం చిత్రించిన ఈ క్రింది పద్యం చూడండి.

“సారస సంభవుండఖిల సర్గ నిమిత్తము గూర్చియున్న శృం

గార రసంబు నెల్లనిడి కౌతుక మొప్పగ నీ తలోదరిం

గా రచియించి యొండొక సుగంధి సృజింపగలేమి, జుట్టుచే

బారలు నెట్టు బిమ్మటను బశ్చిమ బుద్ధులు గారె బ్రాహ్మణుల్ (2-11).

ఇలా చిలుక వర్ణించిన పద్యాల్లోనే గాక, సంవరణుడు వనంలో తపతిని చూసినపుడు వర్ణించిన అనేక పద్యాల్లో, ఆమె రూప, సౌందర్యాది గుణాలను మనం దర్శించవచ్చును. నాలుగో ఆశ్వాసంలోని 55 పద్యం నుంచి 62వ పద్యం దాకా  నాయిక వర్ణన చక్కగా సాగింది.

“మగువ కన్బొమ్మలు మరుడు గానడు గాక

కనిన వర్ణింపడే కమ్మవిల్లు

శుకసాది సతిమోవి చూడడుగాక చూ

చిన చేతబట్టునే చిగురువాలు….” (4-62)

లాంటి పద్యాలు గంగాధర కవి వర్ణనా వైదగ్ధ్యాన్ని వేనోళ్ళ చాటుతున్నాయి.

డి. విరహ వర్ణన : నాయకుని విరహం, నాయికా, విరహం రెండూ అద్భుతంగా చిత్రించాడు గంగాధర కవి. చిలుక తపతిని గురించి చెప్పి వెళ్ళిపోయాక సంవరణుడు విరహంలో పడ్డాడు. ఈ సందర్భంలో అనేక పద్యాలున్నా ఒకటి మాత్రం –

“ఆ యవనీశుడీ కరణి నంగభవానల బాధ్యమానుడై

హాయని వెచ్చనూర్చు, నకటా! యని దైవముదూఱు, బచ్చపు

ల్గాయెడ నడ్డమైన దనయర్మిలి దూత యటంచుఁ గాయొ పం

డోయని కార్యపద్ధతుల నొయ్యన వేడును భ్రాంత చిత్తుడై (2-97)

దీనిలో ఉన్మాదం అనే మన్మధావస్థ ధ్వనిస్తూంది. అలాగే నాయిక విరహ వర్ణనలోంచి ఒక పద్యం చూద్దాం.

“చిక్కని మోము, మేలిమగు చెక్కులు, చొక్కపుహార వల్లిచే

నెక్కొను పేరురంబు, రమణీయ విశాల విలోచనంబులున్

జక్కుగమించు రాసుతుడు నాదుకవుంగిటి కాపురంబున

జిక్కిన నేలనే? మకర చిహ్నము తారుపట్టుగన్” (3-52)

దీనిలో గుణకథనం, సంప్రతాపం అనే మన్మథావస్థలు మనం చూడవచ్చు. ఇలా కావ్య శాస్త్రోచితమైన ఎన్ని వర్ణనలైనా ఉదహరించవచ్చును. ‘వర్ణనా నిపుణః కవిః’ అన్నారు కదా!

పాత్ర చిత్రణం :  ప్రబంధ వస్తువు ఏక నాయకాశ్రయమై ఉండాలి. తపతీ సంవరణము ఏకనాయకాశ్రితమే అనడంలో ఎలాంటివి ప్రతిపత్తి లేదు. అలాగే ప్రబంధాలలో అపూర్వ పాత్రలుండడం కూడా ఒక లక్షణమే ఈ ప్రబంధంలోని చిలుక, తపతి – రెండూ అపూర్వ పాత్రలే. వశిష్ఠుడు ఆదర్శపాత్ర, పాత్ర చిత్రణలో కూడా గంగాధర కవి అపూర్వ వైశిష్ట్యాన్ని ప్రదర్శించారు. కొన్ని పాత్రోచిత రేఖాంశాలను పరిశీలిద్దాం.

ఎ) రాయబారి చిలుక : ఈ ప్రబంధంలో, తపతీ సంవరణుల సంధానంలో కీలకపాత్ర పోషించింది చిలుక. ఈ చిలుక నాయికా నాయకుల్లో వలపు కలగడానికి, తద్వారా అనుసంధానానికి పూలబాట నేర్పరచింది. ఈ చిలుక గొప్ప మేధావి. మానవ భాషలో మాట్లాడగలిగిన సమర్థురాలు. మానవులను, దివ్యులను ఒకచోటికి చేర్చగలిగిన, ఒకటి చేయగలిగిన అఘటనాఘటన సమర్థురాలు. మాటల మాంత్రికురాలు. తపతికి జీవిత భాగస్వామిని గురుదక్షిణగా తెచ్చుటకు శ్రమించిన బ్రహ్మచారి. అందుకే తపతిచే స్వయంగా తాను కోరిన “వరదక్షిణ”నే గురుదక్షిణగా ఇమ్మని అడిగించుకొంది.

“గురు దక్షిణ భావంబున

గురు దక్షిణ మున్నెయీయ కోరితి విపుడా

వర దక్షిణ యిమ్మదియే

వరదక్షిణ మాకు మదనావాహ వతంసా” (3-43)

ఇది తెలుగు ప్రబంధాలలో మణిపూస వంటి పద్యము. చిలుకకు చెందినది కనుక చిలుకు కొలికి కలికి మణిపూసయనిన మరింత ఒప్పిదము.

బి. సంవరణుడు :  ధీరోదాత్తుడైన నాయకుడు. సకల గుణసంపన్నుడు రాజ్యపాలనాదక్షుడు.

సి) తపతి :  దివ్యనాయిక. అయినా మానుషభావంతో మెలిగిన శృంగార నాయిక. సకల విద్యలు నేర్చిన జాణ విదుషి.

డి) వశిష్ఠుడు :  పురోహితుడుగా, గురువుగా తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించిన మునీశ్వరుడు.

ఇ) తపతి చెలికత్తెలు : తపతిని భూమ్మీదికి తీసుకొచ్చి, సంవరణుని కలవడానికి వీరు కీలకపాత్ర పోషించారు.

గంగాధరుని కవితా శిల్పం : పద్య రచనా విధానంలో, భావుకతలో గంగాధర కవి గొప్ప ప్రతిభను కనబరిచాడు. “ఆ తపతి దివ్య కన్య. తాను మానవుడు. తననెలా చేరుతుంది” అన్న సంవరణుని సంశయానికి చిలుక చెప్పిన సమాధానం అద్భుతం –

“జలజదళ నేత్ర రెండవ చంద్రరేఖ

ధరణి తలమున రాజశేఖరుడ వీవు

ఇంతకన్నను విధియోగ మేమి కలదు?

కైలాసంలో ఉన్న రాజశేఖరుని ఒక చంద్రరేఖ చేరింది. తపతి రెండో చంద్రరేఖ. భూలోకంలో రాజశేఖరుడవైన నిన్ను ఆమె చేరక తప్పదు. ఇదే దైవయోగం – అని చెప్పడమేగాక మన్మథ, వసంతులు ఇరువురూ తపతిని నీతో కూర్చకుంటే మన్మథుడేమి సంధాన కర్త? ఏమి విలుకాడు?? అతనికి వసంతుడేం స్నేహితుడు? అని ప్రశ్నించింది చిలుక. పద్యంలోని సొగసులను (విరుపులను) చూసి, పాఠకుడు ఓహో! అని మెచ్చుకోవలసిందే.

“వనరుహనేత్ర తోడుత నవశ్యమునిన్నిట గూర్చెనేని న

మ్మనసిజుడే ధనుర్ధరుడు, మాధవుడే చెలికాడు వానికిన్

వనరుహ నేత్ర తోడు నవశ్యమునిన్నిట గూర్పకుండినన్

మనసిజుడే ధనుర్ధరుడు? మాధవుడే చెలికాడు వానికిన్?

పాత్రోచితముగానే కాక సందర్భోచితముగా సంభాషణలను రచించినప్పుడు మాత్రమే కవి ప్రతిభ వెల్లడియగును. ఈ ప్రతిభ పద్య నిర్మాణ వ్యుత్పన్నతతో అనుసంధింపబడుట కవి సమగ్ర రచనా శక్తికి తూనికయని చెప్పక తప్పదు. అద్దంకి గంగాధరుడు ప్రామాణిక ప్రబంధ పద్యరచనా ధురంధరుడు.

సంవరణుడు విరహవేదనను అనభవించినపుడు అతని పరిచారకులు అతనికి శిశిరోపచారాలు చేశారు. శిశిరోపచారానికి పరిచారకులు ఉపయోగించిన ద్రవ్యాలన్నీ తపతి అవయవాలకు ప్రతిబింబాలు కావడంవల్ల రాజుకు కొంత ఉపశాంతి లభించి ఉంటుంది. కవి భావనా చమత్కృతిని దర్శించండి.

వెలదినవ్వుల చాయ వెలది వెన్నెల గాయ

గపురంపు ధూళిమై గప్పెనొకడు

చెలువ కౌగిలి పాటి చెలువైన పన్నీట

నొకడు సర్వాంగంబు లోలలార్చె

బద్మాక్షి ముఖ సామ్యజాలంబుల

నురమున నిండార నునిచెనొకడు

పల్లవాధర హస్త పల్లవంబుల బోలు

పల్లవంబు లొకండు పాన్పుపఱచె

సాత్త్వికోదయ వేళ నా పతికి నొడల

దోడవెడజారు చెమరు బిందువుల వంటి

లలిత మకరంద బిందువుల చిలికె నొక్క

డంగ నా మన్మథునకు బ్రత్యంగకముల

ఇలాంటి అద్భుతమైన పద్యాలెన్నో నాయికా నాయకుల విరహ వర్ణనలో దర్శనమిస్తాయి. “కొమ్మ యల్లాడిన – కొమ్మయలదెయని, తరువనానంతరముల తగిలి తగిలి….” (4-76) లాంటి అనేక పద్యాలను ఇందుకు నిదర్శనముగా చూపించవచ్చును.

భాషా ప్రయోగ నైపుణ్యం : పద్రపయోగంలో, సమాన ఘటనలో, ఆలంకారిక పద ప్రయోగంలో, న్యాయాలు, నానుడులు, లోకోక్తులు, జాతీయాలు ప్రయోగించడంలో గొప్ప కౌశలాన్ని కనబరిచాడు గంగాధర కవి. చిలుక సంవరణునితో తన వృత్తాంతాన్ని చెబుతూ, తపతికి తగిన వరుని అన్వేషిస్తూ తిరిగి తిరిగి అలసిపోయి, ఆకాశంలో దాహంతో ఉండగా “అంధునకు దివ్యదృష్టి గలిగిన విధంబున నయాచితోపనతంబయిన యీ సహకార భూజంబు సంజీవ నౌషధంబైయవతరించినన్”  ` (2-45)  అనే గద్యంలోని “అంధునకు దివ్యదృష్టి గలిగిన విధంబున” – అనే ఉపమానం భావనారమ్యంబని పాటిబండవారే సెలవిచ్చారు. “ఈయెల మావికతంబున….” (2-47) అనే పద్యంలోని “తోయధిగంభీర మనసు” అనే సమాస ప్రయోగం కూడా కవిభావుకతకు, ప్రయోగ నైపుణ్యానికి ఉదాహరణ.

చిలుకల  పలుకులు రసములు

చిలుకును భువినెట్టివారి చెవులకుఁ జవులై

చిలుకల కొలికి ప్రసంగము

చిలుక ప్రశంసించెనేనిఁ జెప్పగనేలా?

అనే పద్యంలోని అర్థాపత్త్యలంకారంతోడి పద ప్రయోగం, ఔచిత్యవంతంగా ఉంది. అసలే చొక్కపు బంగారం…. అదనంగా పరిమళం…అన్నట్లుందీ అలంకార సన్నివేశం. మహా కవిత్వమన్న యిది కదా! అలాగే పోతన లాగా వ్యత్త్యనుప్రాసతో కూడిన పదప్రయోగంలోనూ ఈ కవి మేటి –
“మలయాచల నిలయానిల

వలయాలస గతుల రాలె వనకుసుమంబుల్

వెలిచాగ విలుతుడవ్విభు

చెలువున వెలుగంది వదలు చేదూపులనన్ – (1-89)

పీఠిక ఉపసంహారంలో కొన్ని పదాలు శబ్దారత్నాకరంలో లేవని పాటిబండవారు సెలవిచ్చారు. వీటిలో కొన్ని పదాలు – కోరికె, లండరి, పటారము, వతారుపట్టు – లాంటివి నాటి తెలంగాణ ప్రాంతంలో జనులు వాడేవి అయ్యుంటాయని నా భావన. లండరి – పదం లండు + అరి అని విడదీస్తే మనకు పద స్వరూపం, ప్రత్యయం తెలుస్తాయి. చిన్న పిల్లలను పెద్దవాళ్లను ఆ పిల్లల ప్రవర్తనను గూర్చి చెప్పేటప్పుడు ‘వాడుత్తలండు’ అనే వారు.  పనికిమాలినవాడు, గలీజుగాడు అనే అర్థంలో వాడడం, మా బాల్యంలో నల్లగొండ జిల్లాలో నేను విన్నాను. ఆ ‘లండు’ అనే పదం మీద మతుబర్థంలో (జాలరి) లాగా ‘అరి’ ప్రత్యయం చేరి ‘లండరి’ అవుతుంది. “లండరి కుకవులు కొందరు….” (1-9) అనే పద్యంలో లండుతనం కలిగిన, పనికిమాలిన కుకవులు అనే అర్థంలోనే కవి దీన్ని వాడినట్లు కనిపిస్తుంది. అలాగే తక్కిన పదాలు తెలంగాణలో నాడు వినవచ్చేవి ఎన్నో ఉంటాయని నా అభిప్రాయం. బంగారు సలాక (5-46)లోని సలాక – తీగ కూడా తెలంగాణ ప్రాంతపదమే.

పశ్చిమబుద్ధులు గారె బ్రాహ్మణుల్ (2-11), తోక లెగబట్టుదు రేమనవచ్చు…. (2-12), పైనిపటారమెకాక వానికిలోన లొటారమౌట (2-23), దుఃఖ మిహపంచభిస్సహ – (2-25) పులుగడిగిన ముత్తియంబు (2-35), కరతలామలకంబుగా (2-38), బొమ్మ వెట్టెదన్ (2-40), అంధునకు దివ్యదృష్టి కలిగిన విధంబు (2-45), అందని మ్రాని పంటి పయినాసలు చేయుట (2-58), విధియోగము (2-64), ఉష్ణముష్ణేన శీతలమ’ను (2-67), పూవును దావియు గూడిన కైవడి (2-69), గాలిమాట, పలు గాకులు (2-80), కడుపు చల్లన (2-84), ‘నానృతాత్పాతకంపరంబు (2-86), పిలువని పేరంటము (2-91), కాయొపండో (2-97), పవన విరహిత నిభృతదీపంబు (3-10), సుఖము దుఃఖంబు కార్యార్థి చూడడెందు (3-13), దుఃఖితే మనసి సర్వమసహ్యం (3-47), కొంగు బంగారు (3-51), పూసగ్రుచ్చిన రీతి (3-63), నీట గలసె (3-89), బూడిదెలోని హోమమయిపోయె (3-96), కొసరు మాటలు (4-13), గోరుచుట్టుపై రోకటి పోటుకైవడి (4-49), ఆవద్రావినట్లు (4-76), ఉఱ్ఱూతలూగ (4-79), ఆకుమఱుగుపిందె (4-88), లోకలోచనుకనుమూయ గలేక (4-89), గోటనైన పనికిగొడ్డలేల? (5-12), పేద పెన్నిధిగనినక్రియన్ (5-21) – ఇలాంటి సంస్కృతాంధ్ర ప్రయోగాలవల్ల తన పద్య రచనకు వన్నె తెచ్చాడు కవి. పై వాటిలో లోకోక్తులు, న్యాయాలు, నానుడులు, జాతీయాలు, సంస్కృతాంధ్ర సూక్తులు మొదలైనవన్నీ ఉన్నాయి. వాటిని విశ్లేషించి చూపడానికి వ్యాసపరిధి సరిపోదు.

మొత్తంమీద గంగాధర కవి ‘తపతీ సంవరణము’ అనే గ్రంథము ప్రబంధ లక్షణాలతో కూడి ఉందని, కవి కల్పనా చమత్కృతి ఇతివృత్తంలోనూ, వర్ణనలలోనూ కనిపిస్తుందని, సన్నివేశ చిత్రణంలో ఈ కవి అందెవేసిన చేయి అని, విభావాను భావసంచారీ భావయుక్తంగా శృంగార రసాన్ని చక్కగా పోషించాడని, వర్ణనల్లో ఆయన భావుకత చాలా ఉన్నతంగా, ఉత్తమంగా ఉందనీ; పాత్రలను చిత్రించడం, వాటిని ప్రవేశపెట్టడంలో ఔచిత్యం పాటించాడని; గంగాధర కవి కవితాశిల్పం, భాషా ప్రయోగ నైపుణ్యం అత్యంత విశిష్టమైనవని చాలా కొద్ది ఉదాహరణలతో వివరించడం జరిగింది.

ఆరుద్ర, గంగాధర కవి గురించి వ్రాస్తూ, “కృతిపతి ఇభరాముడు సంగీత రసైకలోలుడు (1-99) కనుక అద్దంకి గంగాధరుడు కూడా తన నైపుణ్యం ఇలా వెల్లడిస్తున్నాడు –

“భాస్వరంబైన మదకోకిల స్వరంబు

పంచమంబని పెద్దలు వల్క విందు

మీ మధుర భాషికీ మధ్యమంబౌట

యాశ్చర్య మహిమ యెపుడు (4-6)

గంగాధరుని నాయక విషయంలోనే కాదు, కవిత్వంలో కూడా ‘మధ్యమం’ అనువైన మాటేమో!” అని అనుమానాస్పదంగా తమ సమగ్రాంధ్ర సాహిత్యం రెండవ సంపుటిలో వ్రాశారు. కాని లోతుగా పరిశీలిస్తే, గంగాధర కవి నాయకుడుగాని, గంగాధర కవి కవిత్వంగాని “ఉత్తమం”గానే ఉన్నవని పరిశీలకులు గ్రహిస్తారు. ఆరుద్ర గడుసుగా పరిభాష సంగీత పదమైన “మధ్యమం” అనే దాన్ని ఉపయోగించుకొని చమత్కారంగా చెప్పినా, గంగాధర కవి కవిత్వం “ఉత్తమం” ఆయన స్థానం “ఉన్నతం” అని నా అభిప్రాయం.

అద్దంకి అలంకార ప్రయోగ శిల్పం : తపతీ సంవరణంలో గంగాధర కవి కేవలం అలంకారాల కోసమే అలంకారాలను ప్రయోగించలేదు. సన్నివేశం, సందర్భం, పాత్ర, భావం, రసం మొదలైనవాటిని చక్కగా అభివ్యక్తం చేయడానికి, అలంకారాలను మనోహరంగా ప్రయోగించాడు. అసలు గంగాధర కవే స్వయంగా తన ప్రబంధ నిర్మాణ విధానం గురించి ప్రారంభంలోనే – “…నవరసాలంకార భావానుబంధ బంధురంబుగా నొక్క ప్రబంధంబు నిర్మింప సమకట్టి” నాడు (1-10). అందువల్ల ఆయన ప్రబంధంలో అలంకారాలు రసభావానుబంధ బంధురంగా ఉంటాయని విడిగా చెప్పవలసిన అవసరం లేదు. కొన్ని అలంకారాలను స్థాలీవులక న్యాయంగా పరిశీలిద్దాం-

ప్రథమాశ్వాసంలోని 72వ పద్యం “సారవిభూతి రెండవ వృషధ్వజ….. కల్పవృక్షమున నన్నర పాలుడు మించెగీర్తులన్” ఈ పద్యంలో ఐశ్వర్యంలో రెండో శివునిగా, ఆకారంలో మూడో దేవవైద్యునిగా, శుచిలో నాలుగో అగ్నిగా, భూభారవహనంలో అయిదో దిక్పాలకుడుగా, దాతృత్వంలో ఆరో కల్పవృక్షంగా సంవరణుని ఊహించడంవల్ల అద్భుతమైన ఉత్ర్పేక్షాలంకారం చక్కగా కుదిరింది.

రెండో అశ్వాసంలోని “సారస సంభవుండఖిల….. పశ్చిమ బుద్ధులుగారె బ్రాహ్మణుల్’’ (2-11) అనే పద్యంలో సృష్టిలోని శృంగార రసమంతా తపతి నిర్మాణానికే వాడి తర్వాతి స్త్రీ నిర్మాణానికి ఏమీ లేకపోవడంతో బ్రహ్మచేతులు బార్లా చాపాడు – అనేది విశేష విషయం. దాన్ని లోకంలోని సామాన్య విషయమైన ‘పశ్చిమ బుద్ధులుగారె బ్రాహ్మణుల్’ అనే దానితో చెప్పడంవల్ల అర్థాంతర న్యాసం సహజాతి సహజంగానే అమరింది – అలాగే,

“ఆరంగములతోడ బారంగతంబుగా

నిగమముల్ సరహస్యముగను జదివి….

…………………………………………

…………………………………………

శుక మహాద్విజముఖ్యుతో సూడువట్టి

యున్న నాకిక నితరాంధ్రయుక్తి యెంత?

హస్తిపదమున నడగవే యడుగులెల్ల’ (2-38)

అనే పద్యంలోనూ చక్కటి అర్ధాంతర న్యాసం చక్కగా ఇమిడిపోయింది.

“చికిబికి వెండ్రుకల్ వలెను జిన్న చిగుళ్ళు…. డెన్నగన్” (2-95) అనే పద్యంలో అద్భుతమైన ఉపమానాలతో చూతం భూతంవలె కన్పించిందని చెప్పడంవల్ల ఉపమాలంకారం అత్యంత చమత్కార విచ్ఛిత్తి పూర్వకంగా మనోహరంగా ప్రయోగింపబడింది.

“ఘన వితత స్ఫురత్పదవి గైకొని రాజు తమఃకదంబకం

బనుకుజన వ్రజంబు దెగటార్చి, దిశాచయ సాధుమండలం

బొనర వెలుగజేసె, నదియుక్తమె కాదె నృపాల ధర్మ వ

ర్తునునకు శిష్టదుష్ట పరిరక్షణ శిక్షణ దక్షణ క్రియల్ (3-80)

ఈ పద్యంలోని బహు అలంకార ప్రయోగ శిల్ప ప్రౌఢి గంగాధర కవిని సర్వ ప్రౌఢకవి మూర్ధన్యునిగా నిలబెట్టింది. ఈ ఒక్క పద్యంలోనే శ్లేష, రూపకం, అర్ధాంతరన్యాసం, వృత్త్యనుప్రాస; వృత్త్యనుప్రాస గర్భిత క్రమలంకారం అనే అయిదు అలంకారాలు ప్రయోగించబడి, కవి అలంకార ప్రయోగ శిల్పచాతురిని వేనోళ్ళ చాటుతున్నాయి. పద్యరచనా పరమైన శ్రద్ధయందిది కవి వ్యక్తిత్వమును ప్రకాశింపజేసే సులక్షణ సారమే కదా! విలక్షణ ప్రతిభా చాతుర్యమే కదా!!

శ్లేష : ‘రాజు’ అనే పదానికి చంద్రుడు, పాలకుడు అని అర్థాలు, చీకటిని తొలగించి వెలుగునివ్వడం చంద్రుని ధర్మం. దుష్టులను శిక్షించి, శిష్టులను రక్షించడం రాజు (పాలకుడి) పని. రాజుకున్న రెండు అర్థాలను గ్రహించి చక్కటి శ్లేషాలంకారాన్ని ప్రయోగించాడు కవి.

రూపకం : తమః కదంబకంబను కుజన వ్రజంబు చీకటి సమూహం అనెడి చెడ్డవారు. చీకటి అజ్ఞానానికి చిహ్నం.  అజ్ఞానులే చెడ్డవారుగా మారుతారు. తమః కదంబకంపై కుజన వ్రజ లక్షణాన్ని ఆరోపించడం దీనిలో కనిపిస్తుంది. అందుకే (ఆరోపాత్తు రూపకం) ఇది రూపకం.

అర్థాంతరన్యాసం : రాజు (చంద్రుడు) చీకటిని లేకుండా చేసి వెలుగునిస్తున్నాడు; రాజు (పాలకుడు) దుష్టులను శిక్షించి శిష్టులను కాపాడుతున్నాడు. ఈ ఇద్దరు చేసే పని విశిష్టమైంది. దీన్ని ‘అదియుక్తమెకాదె’ అంటూ  ‘నృపాలధర్మవర్తనునకు శిష్ట దుష్ట పరిరక్షణ శిక్షణ దక్షణ క్రియల్’ అనే సామాన్య వాక్యం ద్వారా చెప్పడం వలన అర్ధాంతరన్యాసం.

వృత్త్యనుప్రాస: “శిష్ట దుష్ట పరిరక్షణ శిక్షణ దక్షణ క్రియల్” ఈ పాదంలో ‘ష్ట’ కార, ‘క్ష’ కార ఆ వృత్తివల్ల మనోహరమైన వృత్త్యనుప్రాసను ప్రయోగించాడు కవివర్యుడు.

వృత్త్యనుప్రాస గర్భిత క్రమాలంకారం : ఈ వృత్త్యనుప్రాస పాదంలో  “శిష్టపరిరక్షణ దుష్ట శిక్షణ క్రియల్” అనే పద్ధతితో కాక “శిష్ట  దుష్టః పరిరక్షణశిక్షణ” అనే క్రమాన్ని పాటించి, వృత్త్యనుప్రాస గర్భిత క్రమలంకారాన్ని అద్భుతంగా ప్రయోగించాడు అద్దంకి గంగాధరుడు. ఈ కవి అలంకార ప్రయోగ శిల్ప నైపుణ్యానికి ఈ ఒక్క పద్యం చాలు. ఇంకా “అటజనికాంచె…” (4-91) అనే పద్యంలో అంత్యప్రాస, వృత్త్యనుప్రాసలు; “నెమ్మదికుందనేమిటి?….” (5-14) అనే పద్యంలో ఉపమాలంకారం మనోహరంగా నిర్వహించాడు కవి గంగాధరుడు.

ఇంకా అనేక పద్యాల్లో శబ్దార్థాలంకార ప్రయోగాలవల్ల భావస్ఫూర్తి రసదీప్తి కలిగింది. ఇలా ఏ అంశం గ్రహించినా, ఏ కోణం నుంచి చూసినా, ఏ పార్శ్వతలాన్ని పరిశీలించినా ఏ విధంగా తపతీ సంవరణాన్ని అనుశీలిఁచినా గంగాధర కవి ప్రతిభను, ఆయన కవనశక్తిని, కథాకథన రీతిని, ప్రబంధ లక్షణ బద్ధ నిర్మగ్న మనస్కతను, రచనా, వ్యగ్రతను, రసపోషణ విధానాన్ని, అలంకార ప్రయోగ శిల్పాన్ని దర్శించి ఆనందించవచ్చును. కవిని అభినందించవచ్చును. ఎంతటివారైనా గంగాధరుని ‘మధ్యమ’ స్థాయికి చెందిన కవి అంటే మొహమాటం లేకుండా ఖండించి, ఆయన ఉత్తమ ప్రబంధ కవి అని తెలంగాణ ప్రాంతంలోనే కాదు, తెలుగు సాహిత్యంలోనే ఉత్తమ కవుల సరసన నిలవదగిన శక్తియుక్తులు కలవాడని ఘంటాపథంగా చెప్పవచ్చును. తెలంగాణ ప్రబంధ సరస్వతికి జయము జయము.

  • డాక్టర్ బ్రాహ్మణపల్లి జయరాములు

సుప్రసిద్ధ విమర్శకులు, ప్రవచన కర్తలు                     

 

 

 

 

 

You may also like

Leave a Comment