యాంత్రిక మనస్తత్వాల
అమానవీయ వలయాలు
ఆహాకార ఆర్తనాదాల నడుమ
ఈ దేశపు భవిష్యత్తు భావనలు ?
*
ఉయ్యాలలో పసిపాప నవ్వుతో
రోడ్డుపక్క చెట్టు కొమ్మకు వేలాడుతూ
వాహన ధూళి మేఘాల మధ్య
ఈ దేశపు భవిష్యత్తు భావనలు ?
*
కన్న కడుపుకు కనే కడుపు బరువెక్కింది
కాలువ మురుగు నీళ్లను మింగి
కళ్లు తేలేసిన శిశువు అంతరంగంలో
ఈ దేశ భవిష్యత్తు భావనలు ?
*
కాలుష్య కోరల ఖనన క్రియ
ఖలుని చూపుల్లో జనవనం
ఊపిరి ఉరికొయ్యలలో
ఈ దేశపు భవిష్యత్తు భావనలు ?
*
నెత్తుటి గీతాలాపనలో
తుపాకుల రాజ్యస్థాపన
గుండెల మీద దిగిన కత్తులలో
ఈ దేశపు భవిష్యత్తు భావనలు ?
*
వృద్ధాశ్రమ కూపంలో
జీవితదాతల నిట్టూర్పులు
విలువలు చిలువలు చేసే చేతులలో
ఈ దేశపు భవిష్యత్తు భావనలు ?
*
ధనామోహపు దారుల వెంట
మోసపు కళ్ళ మనిషి ప్రయాణం
అవకాశవాదుల ఉచ్చుల మధ్య
ఈ దేశపు భవిష్యత్తు భావనలు ?
*
నగరాల వెంట అనాగరికుడై
నేలతల్లి గౌరవాన్ని మంటగలుపుతున్నాడు
మాతృదేశ జెండాకే జై కొట్టనివానిలో
ఈ దేశపు భవిష్యత్తు భావనలు ?
2 comments
చాలా బాగుంది…. ప్రస్తుత కాలంలో దేశ లో జరుగుతున్న పరిస్థితులు కళ్ళకు కాట్టి నట్లు గా వుంది…మనిషి స్వార్థం ముందు అన్నీ ఆగమవుతున్నయి.. ఎదుగుదల ముఖ్యం కాని , ఆ ఎదుగుదల కోసం మానవ విలువను మంట కలిపే పనులు ఎక్కువగా జరుగుతున్నాయి
Thank you sir