ఆమెను చూసే
చీమలు శ్రమించడం నేర్చుకున్నాయి
ప్రపంచం
ప్రేమించడం నేర్చుకుంది
ఆమె ఓర్పును
గుండె అరువడిగింది
కాలం ఆమెను గమనిస్తూ
నడుస్తూంది
ఆమె మౌనాన్ని
మూగజీవులు పోగేసుకున్నాయి
ఆమె వేదన
అంతరిక్షంలో నిక్షిప్తమైంది
ఆమె కన్నీరు
సముద్రాల
దాహం తీరుస్తూంది
ఆమె వ్యక్తిత్వం
ఆకాశానికి తలమానికమైంది
ఋతువులు
ఆమె జీవితమై చరిస్తున్నాయి
ఆమె కదలితే
సూర్యోదయం
కను మలిగితే
చీకటి
గాలి నీరు నిప్పు
ఆమెలోనే లీనమై ఉన్నాయి
భూమి కూడా
ఆమె చుట్టే తిరుగుతూంది
నిజానికి సూర్యుడు
ఆమెలానే దహిస్తున్నాడు
ఆమె మాత్రం
‘మనిషి’ కోసం చూస్తూంది