రెండు చెవులపై బారజాపుకుని
ముక్కుమీద దర్జాగా కూర్చునే కళ్ళజోడు
నా దృష్టికి ప్రతి సృష్టి.
అలుక్కుపోయిన అక్షరాలను
ఆణిముత్యాల్లా మెరిపిస్తుంది
వాన తెరపిచ్చిన నీలాకాశమంత స్పష్టంగా
ప్రపంచాన్ని చూపిస్తుంది.
ఆలోచిస్తే ఇదొక అద్భుత ఆవిష్కరణే!
నాలుగు దశాబ్దాల ప్రాయంలో
నయనాలకు అనివార్యమైన నెచ్చెలిగా వచ్చి చేరింది
పదాలు, వ్యుత్పత్తుల సంగతేమో గానీ
నాలుగు పదుల వయసులో
మంచు తెరలాంటి మసకచపును ‘చత్వారం’ అంటారు కదా!
పారదర్శకమైన తన గుండెల్లో నుండీ
ఎన్ని క్రోధారుణ దృక్కులు దూసుకెళ్లినా,
తాను గాయపడలేదు.
ఎన్ని ప్రేమామృత శీకరాలు తరలివెళ్ళినా
తాను పులకించలేదు
ఎన్ని ఆవేదనల అశ్రుకిరణాలు ప్రతిఫలించినా
తాను ద్రవించలేదు
ప్రశాంత ఆహ్లాద వీక్షణాలు స్పృశించినా
తాను దరహసించలేదు.
ఈ కళ్ళజోడు
ప్రతి జీవితానుభూతికీ సాక్షిగా ఉన్నా
దేనికీ స్పందించని ‘ఉదాశీన’
ఏ వీక్షణ నేపథ్యాన్నీ నిక్షిప్తం చేసి ఉంచని
నిశ్చల నిర్లిప్త సహచరియైన సులోచన
కానీ, మా నాన్న వదలివెళ్ళిన కళ్ళజోడు
ఆ చల్లని చూపుల్ని
ఇంకా నాపై ప్రసరిస్తూనే ఉంటుంది.
3 comments
నీ ఎం. ఏ., క్లాస్ మేట్ ను. గుర్తించగలవనుకుంటా.
నీవు ప్రతిభావంతుడవు. వ్యుత్పన్నుడు. మన తరం వేంకటావధాని దివాకర్ల, సినారె తదితర గురువుల సాహిత్య బానలో సాహిత్యం పండించుకున్న మేలిగింజల ఉత్పత్తి దళం. నీ కవిత్వం నీ విమర్శ అంటే నాకెంతో గర్వం-ఇష్టం.
Corrections @ above comment
వ్యుత్పన్నుడవు. √√√
బానలో× బోధనతో√√√
Corrections @ above comment
వ్యుత్పన్నుడవు. √√√
బానలో× బోధనతో√√√