Home కవితలు దిక్సూచి

దిక్సూచి

by వారాల ఆనంద్

బయట
ఆకాశం తేటగా నిర్మలంగా వుంది
గాలి స్వచ్చంగా మంద్రంగా వీస్తోంది
వెన్నెల చల్లగా కురుస్తోంది

లోపల
గది ప్రశాంతంగా వుంది

కవే
తన అసంపూర్ణ కవితను ముందేసుకుని
దుఖంగా వేదనగా కోపంగా
చిన్న పిల్లాడిలా
కాళ్ళూ చేతులూ ముడుచుకుని
నిద్రలోకి జారుకున్నాడు

అసంపూర్ణ కవితలోని పదాలు
హార్మోనియం మెట్ల లాగా
ఒక్కోటీ లయబద్దంగా కదులుతున్నాయి
సవ్య రాగాన్ని పలుకుతున్నాయి
నవ్య భావాల్ని ధ్వనిస్తున్నాయి

అన్ని పరిధులూ దాటి
కాలం స్థబ్దతలోకి
అన్ని పరిమితులూ దాటి
మనుషులు స్వార్థం లోకి
దిగజారి పోయినా

ఒక్క కవే తన
అసంపూర్ణ అసమగ్ర కవితకు తోడుగా
మరిన్ని తెల్లకాగితాల్ని ముందేసుకుని
కొత్త మాటల్ని చెక్కుతాడు

నిద్దట్లోంచి మెలకువలోకి
చీకట్లోంచి వెలుతురులోకి
సరికొత్త దారులు తీస్తాడు

కవి దివిటీ అయితే
కవిత దిక్సూచి

You may also like

Leave a Comment