Home వ్యాసాలు అష్టాంగ యోగము

అష్టాంగ యోగము

by Bandi Usha

ఇంద్రియాలు మనసుని బాహ్య ప్రపంచంవైపు లాగుతూ ఉంటాయి. దీనిని నిరోధించటమే మనో నిగ్రహం. యోగము అంటే మనసుని నిగ్రహించుకొని అంతర్ముఖ ప్రయాణం చేయటమే. మనసు తన సహజస్థితిని చేరటానికి నిరంతరం ప్రయత్నిస్తునే ఉంటుంది. అది యోగ సాధన ద్వారా సుస్థిరమవుతుంది.

యోగములన్నిటిలో పతంజలి మహర్షి యోగ శాస్త్రములోనే “రాజయోగము” ఉత్తమమైనదిగా పేర్కొనబడింది. పతంజలి మహర్షి యోగశాస్త్రాన్ని

  1. సమాధిపాదం, 2. సాధనపాదం (సాధన పాదం), 3. విభూతి పాదం, 4. కైవల్య పాదం

అవి నాలుగు భాగాలుగా విభజించారు. ఇందులో మొత్తం 196 యోగసూత్రాలు ఉన్నాయి. వీటి సాధనకు అష్టాంగ మార్గం సూచించారు.

సమాధి పాదం : “శ్రద్ధా వీర్యస్మృతి సమాధి ప్రజ్ఞాపూర్వకితరేషామ్”

శ్రద్ధ, తేజస్సు, తపోబలం, స్మృతులు, జ్ఞానం ద్వారా అంతఃకరణ ప్రవృత్తులను నిరోధిస్తూ సమదృష్టిని కలిగించే ఒక మానసిక స్థితి సమాధి. ఇది అత్యున్నత ఆధ్యాత్మిక అనుభూతి. ఇందులో 51 సూత్రములతో సమాధి తత్త్వము వివరించబడినది. చిత్తవృత్తులను నిరోధిస్తూ అనిర్వచనీయమైన ఆనందానుభూతిని పొందడాన్ని సమూలంగా ఈ పాదంలో తెలియచేయబడింది.

సాధనా పాదం : “సమాధి భావనార్థః క్లేశతను కరుణార్థశ్చ”

క్రియాయోగం ఆచరించడం ద్వారా ఇంద్రియాలను సంపూర్ణంగా జయించవచ్చు. తద్వారా పంచ క్లేశములు (తిరిగి) నశించి సమాధి స్థితి పొందవచ్చు.

ఈ పాదంలో నివృత్తి మార్గాలు అయిన యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహారములు వివరించబడినవి. 55 సూత్రాలతో ఉన్న పాదం సాధనా పాదం.

విభూతి పాదం : “దేశబంధశ్చితస్య ధారణా తత్ర ప్రత్యయైక తానతా ధ్యానమ్”

చిత్తమును ఒకే  ఒక స్థానంలో ఉంచటం ధారణ. ఏకాగ్రతతో దృష్టి నిలపటం ధ్యానం. ఇందులో ధారణ, ధ్యాన, సమాధులనే కాకుండా అష్టసిద్ధులను వివరించటం జరిగింది. 56 సూత్రాలతో ఉన్న పాదం విభూతి పాదం.

కైవల్య పాదం : “పురుషార్థ శూన్యానామ్ గుణానామ్ ప్రతి ప్రసవః కైవల్యమ్ స్వరూప ప్రతిష్ఠానా చిత్తశక్తిరితి”

ప్రాపంచిక విషయ ప్రభావాల నుండి విడివడి భగవత్పరమైన ఆత్మలో లయమవటమే సమాధి. అంతిమ లక్ష్యమైన మోక్షమును సాధించుటకు మార్గము చెప్పబడినది. ఈ కైవల్య పాదం 34 సూత్రాలతో వివరించటం జరిగింది.

ఇందుకోసం పతంజలి మహర్షి అష్టాంగ మార్గాన్ని సూచించారు. ఇది సామాన్యులు సైతం యోగ సాధన చేయటానికి అనువుగా విభజించారు.

అష్టాంగ యోగములోని అష్టాంగ మార్గాలు

“యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి యోష్టావంగాని”

ఇప్పుడు ఒక్కో మార్గం గురించి తెలుసుకుందాం.

యమ : అష్టాంగ మార్గంలో మొదటిది అయిన యమములో ఐదు విషయాలు ఉన్నాయి. అవి

“అహింసా ప్రతిష్టాయాం తత్సన్నిధే వైరత్యాగః” అహింసా ప్రవృత్తిని పాటించిన దాని సమీపంలో వైరభావాలు ఉండవు.   “సత్యప్రతిష్టాయాం క్రియా ఫలాశ్రయత్వమ్” సత్యవంతమైన కర్మలు సత్ఫలితాలనిస్తాయి.

“అస్తేయ ప్రతిష్ఠాయాం సర్వ రత్నోప స్థానమ్” చోర బుద్ధిని జయించినవానికి సకల సంపదలు సమకూరుతాయి.

“బృహచర్య ప్రతిష్టాయాం వీర్యలాభః” బ్రహ్మచర్యంతో శారీరక, మానసిక ధారుడ్యం కలుగుతుంది.

“అపరిగ్రహ స్థైర్యే జన్మకథంతా సంబోధః” పరుల సొమ్ము స్థిర చిత్తంతో తిరస్కరించినవాడు జన్మవృత్తాంతంను తెలుసుకోగలడు –

అహింస, సత్యము, అస్తేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము ఈ ఐదింటిని ప్రతి వ్యక్తి తప్పక ఆచరించవలసిన విధులు.

నియమః “శౌచ సంతోష తపః స్వాధ్యాయేశ్వర ప్రణిధానాని నియమాః”

పరిశుభ్రత, ఆనందము, తపస్సు, స్వాధ్యాయము, భగవంతుని యందు చిత్తము లయము చేయటం యమములోని నియమాలు.

“శౌచాత్స్యాంగ జుగుప్సా పరైర సంసర్గః మానసిక, శారీరక పరిశుభ్రతతోపాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవటం. ఇతరులతో సంపర్కం విషయంలో వైముఖ్యం లభిస్తాయి.

“సంతోషాతను తమ సుఖలాభః” నిత్య సంతుష్టునికి అత్యుత్తమైన ఆనందం లభిస్తుంది.

“కాయేంద్రియ సిద్ధిర శుద్ధిక్షయాత్తపసః” తపో నిష్ట శరీరాన్ని ఇంద్రియాలను అంటి ఉన్న మాలిన్యాన్ని తొలగిస్తుంది.

“స్వాధ్యాయాదిష్ట దేవతా సంప్రయోగః” స్వాధ్యాయము వలన ఇష్టదేవతలను చేరగలరు. ఇందుకోసం జ్ఞానదీప్తులైన ఆధ్యాత్మిక గ్రంథాలను చదవటం.

“సమాధి సిద్ధి రీశ్వర ప్రణిధానాత్” సర్వమూ ఈశ్వర స్వరూపమే అన్న భావనతో ఈశ్వరుని యందు చిత్తము లగ్నము చేయటం వలన సమాధి సిద్ధిస్తుంది.

ఈ ఐదు నియమాలతో మనసా, వాచా, కర్మణా త్రికరణ శుద్ధిగా భగవంతుని స్మరించటమే ఈశ్వర ప్రణిదానము.

ఆసనం : “స్థిరం సుఖం ఆసనం” సాధకుడు తన దేహానికి, మనసుకు ఎలాంటి ఇబ్బంది కలగనివ్వకుండా ఆరోగ్యంను, నిలకడ చేయనిదే ఆసనం. ఆధ్యాత్మికంగా ఎదగాలంటే శరీరం ఆరోగ్యంగా ఉండాలి. ఆసనము వేయటం వలన శరీరమునకు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది.

ప్రాణాయామము: “తస్మిన్ సతి శ్వాస, ప్రశ్వాస మోర్గతి విచ్చేదః ప్రాణాయామః”

ప్రాణము అనగా ఉచ్ఛ్వాస, నిశ్వాసలు. ప్రాణాయామము అనగా ప్రాణశక్తిని పొడిగించటం. ఉచ్ఛ్వాస, నిశ్వాసలను క్రమబద్దీకరించటమే ప్రాణాయామము. అనగా పూరక, కుంభక, రేచక మరియు శూన్యకముపై పట్టు సాధించటం. పూరకమనగా గాలిని పీల్చుట కుంభకమనగా గాలిని నిలిపి ఉంచుట రేచకమనగా గాలిని వదులుట

శూన్యకమనగా గాలిని తీసుకోకుండా ఉండగలగటం.

ప్రత్యాహారం : “స్వస్య విషయా సంప్రయోగే చిత్త స్వరూపాను కార ఇవేంద్రియాణాం ప్రత్యాహార”

మనసు చంచలమైనది. బుద్ధి దానిని ప్రోత్సహిస్తుంటుంది. మానవుని వివేచనా శక్తి ఇంద్రియాలకు లోనైతే వినాశనమే. మనసును ఇతర ఆలోచనల నుంచి మరల్చి ఆత్మవైపు ప్రయాణం చేయటమే ప్రత్యాహారం. అనగా ఇంద్రియ నిగ్రహమే ప్రత్యాహారం.

ధారణ: “దారణా సుచ యోగ్యతా మసినః” చిత్తం ఆలోచనా రహితం అయ్యాక అంతరేంద్రియాలు ఉత్తేజితం అవుతాయి. ఆ సమయాన అంతర్ముఖంగా గోచరించే దృశ్యాలను అంతర్ముఖంగా గోచరించే దృశ్యాలను గమనించడం ధారణ. మనసు నిశ్చల స్థితిలో ఏకాగ్రతను పొందెడి స్థితి ధారణ. దీనిని ఆచరించడం ద్వారా తగిన సామర్థ్యం, యోగ్యత పొందగలము.

ధ్యానము : “ధ్యాన హేయాస్తద్వ్యతయః” క్లేశములను ధ్యానంలో వివ్తింపజేయాలి. ధారణలో స్థాయి పెరిగి ధ్యానం కొనసాగుతున్నప్పుడు సూక్ష్మశరీరం విడివడుతుంది. అప్పుడు రాగద్వేషాలు, అహంకారం మొదలగు క్లేశములు ఉండవు. ఎందుకంటే ఏ పాత్రలో నీళ్ళుపోస్తే ఆ ఆకారం వచ్చినట్లు మనము ఏ విషయంపై ధారణ చేస్తామో అదే సిద్ధిస్తుంది. ఏకాగ్రతకు ఆటంకము లేకుండా సాగివచ్చు స్థితియే ధ్యానము.

సమాధి : “తస్యాది నిరోధే సర్వన్నిరోధాన్నిర్చిజస్సమాధిః”

ధారణ, ధ్యానం ఉన్నత స్థాయిలో కొనసాగినపుడు పూర్వ ప్రవృత్తులను, స్మృతులను నిరోధిస్తుంది. దానిని నిరోధించిన తరువాత అంతిమ లక్ష్యమైన సమాధి స్థితిని చేరగలము. ధ్యానము యొక్క స్థితిలో సమాధిని పొందగలము. అప్పుడు నిద్రావస్థలో ఉన్నప్పుడు శరీరము, ఇంద్రియాలు ఏ విధంగానైతే విశ్రాంతి పొందునో మేల్కొన్నప్పుడు కూడా అదేవిధంగా విశ్రాంతి పొందును. “నేను” అనే భావన విడనాడి అనిర్వచనీయమైన, అనంతమైన ఆనందానుభూతి పొందడమే సమాధి.”

 

 

You may also like

Leave a Comment