రేఖ కంప్యూటర్ ఇంజనీరింగ్ చదివి హైదరాబాదులో పేరున్న కార్పొరేట్ సంస్థలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా బాగానే సంపాదిస్తుంది. రేఖ తండ్రి సూర్య ప్రకాశ్ సిండికేట్ బ్యాంకు చీఫ్ మేనేజర్ కాగా తల్లి సరిత గృహిణి. రేఖ ఇద్దరు తమ్ములు కాలేజి చదువు కొనసాగిస్తున్నారు. సూర్య ప్రకాశ్, సరితలు ఉద్యోగ రీత్యా హైదరాబాదులో స్థిర నివాసం. ముగ్గురు పిల్లల చదువు హైదరాబాదులోనే జరిగింది. గత రెండు సంవత్సరాలుగా సూర్య ప్రకాశ్, సరితలు రేఖ వివాహ విషయంలో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగు మాట్రిమొనీలో కూడా రేఖ వివరాలు పొందు పరిచారు. కాకపోతే రెండు నెలలుగా సూర్య ప్రకాశ్ తల్లి ఆరోగ్యం బాగా క్షీణించడం వల్ల ప్రయత్నాలకు కొంత విరామం ఏర్పడింది. వృద్ధాప్యరీత్యా వచ్చిన జబ్బుల మూలంగా సూర్య ప్రకాశ్ తల్లిని ఆసుపత్రిలో చేర్పించ వలసి వచ్చింది. ఆవిడ వయస్సు తొంభై కి దగ్గరగా ఉంది. పదిహేను రోజుల పాటు వైద్యం చేసి, దాదాపు రెండు లక్షల రూపాయలు పిండుకొని తమతో కాదని ఇంటికి తీసుకెళ్లాల్సిందిగా కార్పొరేటు ఆసుపత్రి వారు సలహా ఇచ్చారు. ఒకటి రెండు రోజులు మించి బ్రతకడం కష్టమేనంటూ డాక్టర్లు వెల్లడించి ఇప్పటికీ నెల పదిహేను రోజులైంది. ఆవిడ ఆరోగ్యంలో ఎటువంటి మార్పు లేదు. కోమా నుండి తేరుకోలేదు. తల్లి ఆసుపత్రిలో చేరినప్పటి నుండి సూర్యప్రకాశ్ బాగా కుంగిపోయాడు. తండ్రి చిన్నప్పుడే చని పోవటంతో అన్నీ తానై సూర్య ప్రకాశ్ ను తల్లి బాగా చదివించింది.
********
భరణి నాలుగేళ్లుగా కాలిఫోర్నియాలో సాఫ్టువేర్ ఉద్యోగిగా ఐదంకెల జీతం సంపాదిస్తున్నాడు. హెచ్ వన్ బి వీసా ఉంది. అతడి చెల్లెలు స్మిత పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లల్ని కని ఇంగ్లాండులో స్థిర పడింది. తండ్రి కృపాకర్ పోలీసు శాఖలో గెజిటెడ్ హోదా ఉద్యోగం, తల్లి రవళి హైదరాబాదు రేడియో కేంద్రంలో మంచి పదవిలో ఉంది. తల్లిదండ్రుల పోరు భరించలేక పెళ్ళి చేసుకోవడానికి అమెరికా నుండి వారం రోజుల క్రితం హైదరాబాదు వచ్చాడు భరణి.
*******
మాట్రిమొనీలో రేఖ వివరాలు తెలుసుకొని సూర్యప్రకాశ్ కు ఫోను చేశాడు కృపాకర్. తనను తాను పరిచయం చేసుకొని భరణి వివరాలు, తమ కుటుంబ నేపథ్యం వివరించి, “అమ్మాయికి, అబ్బాయికి జాతక రీత్యా తగినన్ని పాయింట్లు కలిశాయని సిద్ధాంతి గారు చెప్పారు , అమ్మాయిని చూడటానికి పెళ్లి చూపుల కార్యక్రమం ఏర్పాటు చేయగలరా” అంటూ కృపాకర్ అడిగాడు. సూర్య ప్రకాశ్ కి ఏమి చెప్పాలో తోచక కాసేపు సందిగ్ధంలో పడ్డాడు. తన తల్లి కోమాలో ఉండి కొన ఊపిరితో ఉందనే విషయం, తాము కొంత కాలం పాటు అమ్మాయి వివాహం వాయిదా వేసుకున్నట్టు చెప్పకుండా “ప్రస్తుతానికి మేము ఊళ్ళో లేమండి, రావటానికి వారం రోజులు పడుతుంది” అని దాట వేశాడు.
“వారం రోజుల తర్వాత మళ్లీ కాల్ చేస్తానండి” అంటూ ఫోను కట్ చేశాడు కృపాకర్. ఇదే విషయం కృపాకర్ తన భార్య రవళికి చెప్పాడు.
“నెల రోజుల్లో పెళ్లి చేసుకొని భరణి అమెరికాకు వెళ్లాలి కాబట్టి మనకు ఉండే తొందర వారికెందుకు ఉంటుంది” అంటూ నిట్టూర్చింది రవళి.
******
వారం రోజుల పిదప కృపాకర్ సూర్య ప్రకాశ్ కి ఫోను చేశాడు. “నేను కృపాకర్ ను మాట్లాడు తున్నాను. పెళ్లి చూపుల కార్య క్రమం ఏర్పాటు చేయగలరా” అని అడిగాడు. మరో సారి అబద్దం చెప్పలేక ఏమైతే అయిందిలే అనే ధీమాతో “మంచిరోజు చూసి పెళ్లి చూపుల కార్య క్రమం ఏర్పాటు చేస్తాను” అంటూ అయిష్టంగానే సంసిద్ధత తెలిపాడు సూర్య ప్రకాశ్.
“ఆ విషయంలో మీకు శ్రమ అక్కర్లేదు. నేను సిద్ధాంతి గారిని విచారించాను. ఎల్లుండి సాయంత్రం ఐదు గంటలకు దివ్యమైన ముహూర్తం ఉంది, వర్జ్యం కూడా లేదు . అదే రోజు ఖాయం చేయండి. ఎందుకంటే మా వాడికి ఎక్కువ సమయం కూడా లేదండి” బ్రతిమిలాడే ధోరణి లో అంటూ సూర్య ప్రకాశ్ కి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా పెళ్లి చూపుల తేదీ నిర్ణయం చేశాడు కృపాకర్. పెళ్ళి చూపుల కార్య క్రమం యదావిధిగా అనుకున్న సమయానికి సూర్య ప్రకాశ్ ఇంట్లో జరిగింది. రెండో రోజు కల్లా అమ్మాయి, అబ్బాయి తమ అంగీకారం పెద్దలకు తెలియ జేశారు. ఇక మిగిలింది పెళ్ళి ముహూర్తం నిర్ణయించటమే. ఓ ప్రక్క సూర్య ప్రకాశ్ తల్లి చావు బతుకుల్లో ఉంది. మరో వైపు భరణి పెళ్లి చేసుకొని కొద్ది రోజుల్లో కాలిఫోర్నియా వెళ్లాల్సి ఉంది. కృపాకర్ సిద్ధాంతి గారిని సంప్రదించి వివాహ ముహూర్తం తేదీ నిర్ణయించి సూర్య ప్రకాశ్ కు ఫోను చేశాడు. ” సూర్య ప్రకాశ్ గారూ, అమ్మాయి, అబ్బాయి ఒకరినొకరు ఇష్ట పడ్డారు. వచ్చే ఆదివారం ఉదయం 10.32 నిమిషాలకు మంచి ముహూర్తం ఉన్నట్టు సిద్ధాంతి గారు చెప్పారు. ఆ ముహూర్తానికి పెళ్లి కానిద్దామా” ప్రశ్నించాడు కృపాకర్.
“సుముహూర్తానికి కేవలం వారం రోజుల గడువు మాత్రమే ఉంది. ఇంత తక్కువ వ్యవధిలో ఈ మహా నగరంలో కన్వెన్షన్ హాలు, ఇతర పెళ్లి ఏర్పాట్లు అసాధ్యమేమో” సందేహం వెలిబుచ్చాడు సూర్య ప్రకాశ్.
“మీకు నచ్చిన కన్వెన్షన్ హాలు చూడండి. నేనున్నాను కదా బావ గారూ. అవసరమనిపిస్తే నిర్మొహమాటంగా నా సహాయం తీసుకోండి” ధైర్యం చెప్తున్నట్లుగా సమాధాన మిచ్చాడు కృపాకర్.
వీటన్నిటి కంటే ముఖ్యంగా తన తల్లి ఆరోగ్యం విషమించి మరణిస్తే పెళ్లి ఆగి పోతుందేమో అనే శంక సూర్య ప్రకాశ్ కి ఎక్కువగా ఉంది. భార్య సరిత, కూతురు రేఖను సంప్రదించి పెళ్లి సింహాచల క్షేత్రంలో జరపాలని నిర్ణయించుకున్నాడు. మంచానికే పరిమితమైన తల్లిని హైదరాబాదులోనే పని మనుషుల సంరక్షణలో ఉంచి మిగతా బంధువులతో సింహాచలం వెళ్తే ఎటువంటి టెన్షన్ ఉండదని తన ఆలోచన. అనుకున్నదే తడవుగా ఆలోచన అమలు పెట్టాలను కున్నాడు. కృపాకర్ కు ఫోను కలిపాడు .
“బావ గారూ, మీకో విషయం చెప్పడం మరిచాను. మా ఆవిడ గుర్తు చేసేంత దాకా నాకు ఆలోచన రాలేదు. మా అమ్మాయి సంబంధం నిశ్చయమైతే వివాహం సింహాచల క్షేత్రంలో చేయాలని ఎప్పుడో మొక్కు కున్నాం. మరి ఈ ప్రతిపాదన మీకు సమ్మతమేనా నిదానంగా ఆలోచించి తెలపండి” అంటూ ఫోను పెట్టేశాడు సూర్య ప్రకాశ్.
భరణికి ఈ ప్రతిపాదన నచ్చలేదు. కృపాకర్, రవళి కూడ ఈ విషయంలో ఆసక్తి కనపరచలేదు. అయినా సరే దేవుడి సన్నిధిలో లగ్నం అనేటప్పటికి వ్యతిరేకించ లేని పరిస్థితి వారిది. కేవలం దేవుడి సన్నిధిలో పెళ్లి చేస్తారనే నెపం చేత ఇంత మంచి సంబంధాన్ని వదులుకోవడం సుతరామూ వారికి ఇష్టం లేదు. పైగా భరణి మరో పదిహేను రోజుల పాటు మాత్రమే ఇండియాలో ఉండేది, ఇప్పుడు కాలిఫోర్నియా వెళ్తే మరో రెండేళ్ల దాకా తను ఇండియా వచ్చే అవకాశం లేదు. పెళ్లి రెండేళ్ల పాటు వాయిదా వేసే ప్రసక్తి లేదు. సూర్య ప్రకాశ్ ప్రతిపాదనకు కృపాకర్ కుటుంబ సభ్యులు కాదనలేక పోయారు. “బావ గారూ మీరు దేవుడి సన్నిధిలో పెళ్లి చేయాలని తీసుకున్న నిర్ణయం మాకు సమ్మతమే. త్వరగా ఏర్పాట్లు చేయండి” చెప్పాడు కృపాకర్.
*****
సింహాచలం లోని తన బంధువుకు ముహూర్తం తేదీ తెలియజేసి కావలసిన ఏర్పాట్లు చేయించుకున్నాడు సూర్య ప్రకాశ్. ముహూర్తం తేదీకి మూడు రోజులు ముందుగానే బంధు మిత్ర బృందంతో బయలు దేరడానికి ప్రైవేటు టూరిస్ట్ బస్సును అద్దెకు మాట్లాడుకున్నాడు. ముహూర్తం సమయానికి చేరుకునే విధంగా పెళ్లికొడుకు కుటుంబ సభ్యులకు మరో టూరిస్ట్ బస్సును అద్దెకు మాట్లాడి ఆ వివరాలు కృపాకర్ కు అంద జేశాడు. రెండు కుటుంబాల వారు వాయువేగంతో అన్ని పనులు పూర్తి చేసుకున్నారు. సూర్య ప్రకాశ్ తల్లిని తన ఇంట్లో కొన్నేళ్ల నుండి నమ్మకంగా పని చేస్తున్న శాంతమ్మ, ఆమె భర్త రాగయ్య సంరక్షణలో ఉండే విధంగా శాంతమ్మకు అన్ని జాగ్రత్తలు తెలిపారు. తల్లి ఆరోగ్యం విషమించి కన్ను మూస్తే ఆ విషయం తొందరపడి ఎవరికీ తెలియజేయ వద్దని, కేవలం సూర్య ప్రకాశ్ కు మాత్రమే ఫోను ద్వారా చెప్పాలని శాంతమ్మకు హితవు పలికారు. తమ ఫ్యామిలీ డాక్టరుకు కూడా ముందు జాగ్రత్త గా తల్లిని తన ఇంట్లోనే ఉంచి తాము సింహాచలం వెళ్తున్నట్లు తెలిపాడు. “ఎటువంటి ఇబ్బంది లేకుండా రోజుకో సారి ఆవిడ ఆరోగ్యం చూసుకుంటాను. మీరు అధైర్య పడవద్దు. నిశ్చింతగా మీ పనులు పూర్తి చేసుకోండి” అంటూ హామీ ఇచ్చాడు డాక్టరు.
తల్లికి చెప్పకుండా ఎన్నడూ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోలేదు సూర్య ప్రకాశ్. ఇప్పుడు తల్లి కోమాలో ఉంది. అనుకోని పరిస్థితుల్లో తల్లికి తెలియకుండానే రేఖ వివాహ ముహూర్తం నిర్ణయమైంది. బయలుదేరే ముందు బరువెక్కిన గుండెతో తల్లి కాళ్ళకు మొక్కిన సూర్య ప్రకాశ్ కుటుంబ సభ్యులను, బంధువులను హడావిడి చేసి ముహూర్తానికి మూడు రోజుల ముందుగానే సాయంత్రం నాలుగు గంటలకు సింహాచల క్షేత్రానికి టూరిస్ట్ బస్సులో బయలుదేర దీశాడు.
*****
సూర్య ప్రకాశ్ తల్లిని తన పర్యవేక్షణలో ఉంచడంతో శాంతమ్మది ఎటూ కదలలేని పరిస్థితి. శాంతమ్మ, రాగయ్యలు మొదటి నుండి సూర్య ప్రకాశ్ కుటుంబానికి నమ్మిన బంటుల్లాగా ఉంటున్నారు.
“మేము తిరిగి వచ్చే దాకా ఇక్కడే ఉండి వంట చేసుకొని తినండి ” వెళ్ళే ముందు సరిత తన ఇంటిని శాంతమ్మకు అప్పజెప్తూ సలహా ఇచ్చింది.
అదేమిటో గాని గత రెండు నెలలుగా నోటి మాట లేని సూర్య ప్రకాశ్ తల్లిలో పెళ్లివారి బృందం బయలు దేరిన మరుసటి రోజే కదలిక వచ్చింది. “ఒసేయ్ శాంతా ” అంటూ పిలిచింది. అదే గదిలో అమర్చిన టీవీ చూస్తున్న శాంతమ్మ ఒక్క సారిగా ఉలిక్కి పడింది. “ఎవరబ్బా నన్ను పిలిచింది” అని స్వగతం లోనే అనుకుంటూ కూర్చున్నదల్లా లేచి బయటికొచ్చి చూసి ఎవరూ లేరని నిర్ధారించుకుని గదిలోకి తిరిగి వచ్చి టీవీ చూస్తూ కూర్చుంది.
“ఏమే శాంతా, నేనేనే నిన్ను పిలిచింది” అంది మరోసారి సూర్య ప్రకాశ్ తల్లి. టీవీ లోకం నుండి బయట పడిన శాంతమ్మ మంచం దగ్గరికి వెళ్ళి సూర్య ప్రకాశ్ తల్లిని నివ్వెరపోయి చూస్తూ నిలుచుంది.
“అమ్మా ఇన్నాళ్లు లేనిది ఇప్పుడు మాట్లాడే శక్తి వచ్చిందమ్మా మీకు” అంది శాంతమ్మ.
“అబ్బాయి ప్రకాశాన్ని పిలువు” అంటూ హుకుం జారీ చేసింది సూర్య ప్రకాశ్ తల్లి.
“అయ్యగారు వాళ్లు సింహాచలం ఎళ్లారమ్మా, మన రేఖమ్మది లగ్నం ఆడే చేస్తున్నారు, ఇంకో మూడు దినాలే ఉందమ్మా” జవాబిచ్చింది శాంతమ్మ.
“అదేమిటి ప్రకాశం నాకు ఈ విషయం చెప్పలేదే. ఒక సారి ప్రకాశానికి ఫోను కలుపు నేను మాట్లాడతా” అంటూ మంచం మీద నుండి లేవటానికి ప్రయత్నం చేసింది. సూర్య ప్రకాశ్ తల్లి శాంతమ్మ సహాయంతో లేచి కూర్చుంది. శాంతమ్మ సూర్య ప్రకాశ్ కి ఫోను కలిపింది.
“అయ్యా, పెద్దమ్మ మాట్లాడుతున్నారు, లేచి కూర్సున్నారు. మీతో మాట్లాడుతరంట” అంటూ ఫోను సూర్య ప్రకాశ్ తల్లికి ఇచ్చింది.
సూర్య ప్రకాశ్ తన తల్లి మాట్లాడు తుందన్న విషయం తెలియగానే కొద్ది క్షణాలు నివ్వెర పోయి సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. “హలో” అన్నాడు.
“అరేయ్ ప్రకాశం, నాకు చెప్పకుండానే మనవరాలి కళ్యాణం చేస్తున్నావా, నాకు దాని కళ్యాణం చూసే యోగం లేదా” అంటూ ప్రశ్నించింది.
“అమ్మా, సింహాద్రి అప్పన్న చలవ వల్ల కోలుకున్నావు. చాలా సంతోషం. ఇన్నాళ్లు నీవు కోమాలో ఉండటం మూలాన రేఖ పెళ్లి విషయం నీకు చెప్పలేక పోయాను. అంతా అనుకోని పరిస్థితుల్లో జరిగింది. ఎక్కువగా మాట్లాడకు నీరసించి పోతావు, అన్ని విషయాలు మేము తిరిగి వచ్చినాక మాట్లాడుకుందాం. నీ ఆరోగ్యం జాగ్రత్త” అంటూ ఫోను కట్ చేశాడు. అప్పన్న స్వామి దర్శనానికి వెళ్తున్నాం కాబట్టి ఆయనే కరుణించి చావుకు దగ్గరగా వెళ్లిన తల్లికి ఎవరూ ఊహించని విధంగా మాట్లాడే శక్తి నిచ్చాడని సూర్య ప్రకాశ్, సరితలు తమ సంతోషాన్ని తమతో పాటు ఉన్న బంధువర్గంతో పంచుకున్నారు.
*****
కృపాకర్ దంపతులు కుటుంబ సభ్యుల సహితంగా ముహూర్తం రోజు ఉదయం ఎనిమిది గంటలకల్లా చేరుకునే విధంగా హైదరాబాదు నుండి సూర్య ప్రకాశ్ నియమించిన టూరిస్ట్ బస్సులో బయలు దేరారు. పెళ్లికొడుకు తరపు వారికి బస్సు సరిపోనందున అప్పటి కప్పుడు ఒక కారు ఎంగేజ్ చేసుకున్నారు. కారులో కృపాకర్ ఇద్దరు బాబాయిలు, మేనమామ టూరిస్ట్ బస్సు వెనకాలే బయలుదేరారు. కృపాకర్ తల్లిదండ్రులు పది సంవత్సరాల క్రితమే కాలం చేశారు.
“బావ గారూ, ఇక్కడ అన్ని పనులు పూర్తయినాయి. ముహూర్తానికి అన్ని సిద్ధం చేశాము” అంటూ సింహాచలం నుండి సూర్యప్రకాశ్ కృపాకర్ కు ఫోను ద్వారా తెలియ జేశాడు. “థాంక్యూ బావ గారూ, ముహూర్త సమయానికి రెండు మూడు గంటలు ముందుగానే మేము అక్కడికి చేరుకుంటాము” అంటూ కృపాకర్ బదులిచ్చాడు.
పెళ్లికొడుకు బృందం బస్సు కేరింతలతో, అంత్యాక్షరి ఆటలతో సాగుతుంది. టూరిస్ట్ వెనకాల కారు భారంగా వెళ్తుంది. విజయవాడ కు పదిహేను కిలో మీటర్ల దూరంలో ఉండగా బహుశా నిద్ర లేనందువల్ల నేమో అలసిపోయిన కారు డ్రైవర్ కళ్ళు ఒక్క క్షణం మూసుకోవటంతో కారు గతి తప్పి రోడ్డు డివైడర్ కు గుద్దుకుని ఎగిరి రోడ్డుకు మరో వైపు బోల్తా పడింది. కొద్ది దూరంలో వెళ్తున్న టూరిస్ట్ బస్సు డ్రైవర్ వ్యూ మిర్రర్ లో ఘటన చూసి బస్సును రోడ్డు ప్రక్కన ఆపాడు. డ్రైవరు, కొంత మంది పెళ్ళి వారు పరిగెత్తు కుంటూ ఘటనా స్థలికి చేరుకున్నారు. సెల్ ఫోన్ల లైట్ల వెలుతురులో చూడగా అప్పటికే వెనుక సీట్లో కూర్చున్న కృపాకర్ ఇద్దరు బాబాయిలు తీవ్ర రక్త గాయాలతో మరణించారు. సీటు బెల్టులు ధరించిన కారు డ్రైవరు, ముందు సీట్లో కూర్చున్న కృపాకర్ మేన మామ ఎయిర్ బలూన్లు విచ్చుకోవటంతో రక్త గాయాలతో బయటపడ్డారు. పెళ్లి బృందంలోని ఒక సభ్యుడు 108 కి డయల్ చేసి ఘటన విషయం తెలియజేశాడు. పోలీసు వారు కొద్ది సేపట్లో అక్కడకు చేరుకొని వారు చేయ వలసిన విధులను నిర్వర్తించారు. ఘటనాస్థలి పెళ్లి వారి ఏడుపులతో నిండిపోయింది.
కృపాకర్ కాసేపటికి తేరుకొని సూర్య ప్రకాశ్ కు ఫోను కలిపాడు. “బావ గారూ అనుకోని దురదృష్ట కర మైన సంఘటన జరిగింది. మా బస్సు వెనకాలే వస్తున్న కారు ఆక్సిడెంట్ కు గురైంది. అందులో కూర్చున్న మా ఇద్దరు బాబాయిలు మరణించారు. కారు డ్రైవరు, ముందు సీట్లో కూర్చున్న మా మేన మామ గాయాలతో బయట పడ్డారు. ఈ పరిస్థితుల్లో మనం పెళ్లి కార్య క్రమం పెట్టుకోలేము కదా. పైగా మాకు సూతకం ఉంటుంది. సూతకం తర్వాత మిగతా విషయాలు మాట్లాడు కుందాం” అంటూ ఫోను కట్ చేశాడు.
పోలీసు శాఖలో అధికారి కావటం మూలాన కృపాకర్ తన పరపతిని ఉపయోగించి మరణించిన వారి మృత దేహాలు, గాయపడిన వారిని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపజేశాడు.
సూర్య ప్రకాశ్ ప్రక్కనే ఉన్న సరిత భర్త ఆందోళన గమనించి “ఏం జరిగింది” అని అడిగింది. విషయం చెప్పిన సూర్య ప్రకాశ్ “సరితా, మా అమ్మ ఆరోగ్య పరిస్థితి గురించి మనం ఆందోళనలో ఉంటే ఇప్పుడేమో ఇలా జరిగింది”.
*****
కర్మ కాండలు సంజీవరెడ్డి నగర్ లోని కృపాకర్ ఇంట్లో జరిగాయి. బాబాయిలకు వారసులు లేనందున తానే ముందుండి వారి కర్మ కాండలు జరిపించాడు. మాశికం కార్య క్రమంతో కృపాకర్ కుటుంబానికి మైల తొలగిపోయింది. ద్వాదశ దిన కర్మ రోజు బంధుమిత్రులు బాగానే తరలి వచ్చారు. బంధుత్వం కలిసింది కాబట్టి సూర్య ప్రకాశ్, సరితలు కూడా హాజరయ్యారు. అనుకోని సంఘటన వల్ల భరణి తన అమెరికా ప్రయాణాన్ని మరో నెల రోజుల పాటు వాయిదా వేసు కున్నాడు. సాయంత్రానికి దూరపు బంధువులంతా వెళ్ళిపోయారు. సూర్య ప్రకాశ్ అవకాశం కల్పించు కొని పెళ్లి విషయం కృపాకర్ తో ప్రస్తావించాడు. అయితే ఒకే ఇంటి పేరు గల వారు మరణించారు కాబట్టి సంవత్సరం లోపు భరణి పెళ్లి చేయవచ్చునా అనే విషయం ప్రస్తావనకు వచ్చింది. అదే విషయం అక్కడే ఉన్న సిద్ధాంతి గారిని అడిగాడు కృపాకర్.
“అయ్యా, మన సందేహాలు తీర్చటానికేమో సమయానికి ధర్మ సందేహాలు కార్య క్రమం టివి లో ప్రసార మవుతుంది. సర్వదమనశాస్త్రి గారు శ్రోతల సందేహాలకు సమాధానాలు చెప్తున్నారు. మీ సందేహానికి కూడా సమాధానం దొరక వచ్చు. వినండి.” అన్నాడు సిద్ధాంతి గారు.
“శాస్త్రి గారూ, నల్గొండ నుండి సురేష్ అనే శ్రోత ఈ విధంగా అడిగాడు, తాత చనిపోతే మనవడికి సూతకం ఎంత కాలం ఉంటుంది, వివాహం ఎంత కాలం దాకా చేసుకోగూడదు” ప్రశ్న సంధించింది సంధాన కర్త .
“ఇంటి పేరు గల వారు మరణిస్తే సూతకం లేదా మైల 12 రోజులు, 13 రోజులు,15 రోజులు ఇలా ఒక్కొక్కరి ఇంట్లో వారి వారి ఆచారం ప్రకారం ఒక్కో రకంగా ఉంటుంది. తండ్రి మరణిస్తే సంవత్సరం పాటు, తల్లి మరణిస్తే ఆరు నెలల పాటు కుమారుడు వివాహం చేసుకోగూడదు. నిత్య పూజలు మాత్రం సూతకం అయిపోయిన తర్వాత నిర్విఘ్నంగా చేసుకోవచ్చు. కాకపోతే వ్రతాలు, పండుగలు ఏడాది పాటు ఉండవు. అయితే తాత లేదా ఒకే ఇంటి పేరు గల వారు చనిపోతే సూతకం ముగిసిన అనంతరం మనవడి పెళ్లికి ఎటువంటి ఆక్షేపణ ఉండదు. నిరభ్యంతరంగా చేసుకోవచ్చు” అంటూ సమాధాన మిచ్చాడు శాస్త్రి గారు.
“కృపాకర్ గారూ, సర్వదమన శాస్త్రి గారు అంత పెద్ద వారు చెప్పింది విన్నారు కదా, ఇంక మీరు నిరభ్యంతరంగా ప్రొసీడ్ అవ్వండి” అంటూ శలవిచ్చాడు పంతులుగారు.
సూర్య ప్రకాశ్, కృపాకర్ లు తమ రెండు కుటుంబాల సంబంధం బలపరచుకోవడానికి సిద్ధాంతి గారు నిర్ణయించిన పెళ్లి సుముహుర్తానికి ఓకే చెప్పారు.
******
తడకమళ్ళ మురళీధర్,
విశ్రాంత జిల్లా జడ్జి,
F306 HNo 13-10-95,
Vaishnavi Dvivedi Apartments,
Gaddiannaram,
Hyderabad-500060
Ph.9848545970.