“శార్వరి బతుకు చీకట్లో సాగిపోయే
ప్లవరు జనులంత పడరాని పాట్లుపడిరి
నేటి కైనను బతుకాశ నిజము చేయ
శుభకృతే తెంచె ప్రజలకు సుఖముగూర్ప
కోవిడను వ్యాధి బీదల కొంపముంచె
చేయ పనులేవి లేకను చెదిరె మనసు
ఉసురు సురని బతుకువారి యుసురు నిలుప
శుభకృతేతెంచె ప్రజలకు సుఖముగూర్ప
రెండువత్సరాలుగ ప్రజలేమి తోడ
చెప్పలేనట్టి బాధల చిన్నబోగ
ఊపిరిని పీల్చు కొనజేసి యుత్సవముగ
శుభకృతేతెంచె ప్రజలకు సుఖము గూర్ప
రోగ బాధలు లేనట్టి రోజు లొచ్చి
కష్టజీవులు సుఖపడుకాలమొచ్చి
లోకమంతట శుభములు కేకవేయ
శుభకృతేతెంచె ప్రజలకు సుఖముగూర్ప
రైతు శ్రామిక జనులంత రేయి పగలు
శ్రమకు తగిన ఫలితములు సొంతమవగ
సర్వవృత్తుల జనులెంతొ సౌఖ్యమొంద
శుభకృతే తెంచె ప్రజలకు సుఖముగూర్ప
భారతీయులందరునిక బాధలేక
సుఖము సంతోషములనెంతో చూరగొనగ
ఈ యుగాదియు నూరట నిచ్చుచుండ
శుభకృతే తెంచె ప్రజలకు సుఖముగూర్ప
వెలుగుల వేళ – శుభకృతేతెంచె
previous post