Home వ్యాసాలు స్త్రీ విద్య

స్త్రీ విద్య

ఒద్దిరాజు సోదరులు వంద సంవత్సరాల క్రితమే తెనుగు పత్రిక( 12-8-1925) లో ఒక ఆదర్శవంతమైన సంపాదకీయం రాశారు. అదేమిటంటే స్త్రీ విద్యా వ్యాప్తి కోసం సమాజానికి కనువిప్పు కలిగించేలా ఉంది ఆ సంపాదకీయం ! అంతే కాదు! స్వాతంత్ర్యోద్యమం, గ్రంథాలయోద్యమం గురించి చెప్పిన సంపాదకీయం!
ఆ సంపాదకీయాన్ని వంద సంవత్సరాలైనాఎందుకు ఆ విషయం చెప్పుకుంటున్నామంటే…? ఈ సంవత్సరం తెనుగు పత్రిక శత జయంతి జరుపుకుంటోంది. అంతేకాదు స్త్రీ విద్యావశ్యకత చెబుతూనే మగవారి బాధ్యతలను తెలిపారు.అందుకే ప్రత్యేకంగా ఈ అంశాన్ని పాఠకులకు మరియొక సారి తెలియజేయదలచుకున్నాన
మహిళల విద్య గురించి ఇప్పటికీ బాహటంగా
కాకున్నా లోలోపల ..అక్కడక్కడా …పల్లెల్లో కాకున్నా
బాగా చదువుకున్న వారి మధ్య చర్చలు జరుగుతూనే ఉన్నాయి.
తమ వాదాలు పరిగణనలోకి తీసుకోవాలనీ, నిజా నిజాలు బయట పడాలనీ,కాని పక్షంలో నిందా పాత్రులేననీ, స్త్రీలు విద్యావంతులైతే ఆ సంసారం ఆనందంతో గడపుతూ,సుఖవంతమైన జీవితం జీవించవచ్చనీ,ముఖ్యంగా స్త్రీ విద్య తప్పనిసరనీ,
అప్పుడే మహిళ అంతులేని మెప్పులు పొందుతుందనీ అందరికీ తెలుసు.
ఐనా కొందరు అహంభావులై మహిళలు విద్యావంతులైతే అవిధేయులుగా అవుతారనీ చెడు ప్రచారాలు చేసే వారికి స్వాభిమానం లేదేమో?
చదువుకొన్న యువతులకు మాత్ర స్వాభిమానం తప్పక దెబ్బతింటుంది అనడంలో సందేహమేలేదు.ఆ విషయంలో చర్చకు తావేలేదు.సరే ఆవిషయం వదిలేసి, సాధ్యమైనంత వరకు తమ భార్యా- బిడ్డలను
చదివించడం మంచిదని ఈనాటి కాలానికి అక్కరకొచ్చేది చదువేనని అనుభవం ద్వారా తెలుసుకున్నవారందరూ స్త్రీ విద్య ఆశపడుతున్నారు.
విద్య కొరకు తాపత్రయ పడుతున్న సమాజంలో
నిజామాంధ్ర ప్రదేశ్ లలో ఉన్న చదువుకోవాలనుకునేమహిళల వంటి ( తెనుగు పత్రిక సంపాదకుల జనయిత్రి వంటి ) అంటే ఒద్దిరాజు సోదరుల తల్లిగారైన రంగనాయకమ్మ గారివంటి వారెందరో ఉన్నారు.
వాళ్ళు కేవలం పెద్ద వారి ఆచారమని. మంచిదైనా కాకున్నా దానికి కట్టుబడి ఉన్నారు కాబట్టి ఇక్కడే కాదు ప్రపంచమంతటా అందరూ చదువుకోలేకపోతున్నారు. ఇలా తెలియని వారెందరో ఉన్నా…బహిరంగ సభలలో వేదికలమీద భయమే లేకుండా ఉపన్యాసం చేసేలా స్త్రీ విద్యను సాటి తోటి మహిళలకు తెలిసేలా శ్రీమతి చాట్రాతి లక్ష్మీ నరసమాంబ, శ్రీమతి సత్యవతీబాయి మొదలైన ఏ కొద్దిమంది మాత్రమో మహిళలు అదీ వేళ్లమీద లెక్కబెట్టేంత మంది మాత్రమే నిజాంరాష్ట్రాంధ్ర దేశంలో స్త్రీ విద్య ఉందనేది కొంచమైనా అపవాదు తొలగించగలుగుతున్నారు.
స్త్రీ విద్యను గురించి శ్రద్ధ తీసుకోవలసిన ఈ సమయంలో సులువైనది, భావుకతతో కూడిన ఉన్నత విద్యాభిరుచికి మూలమైన , అంతులేని లాభాలున్నటువంటి, అందరికీ ఆమోదమైనట్టి ఇంట్లోనే విద్య నేర్చుకునే విధానం ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఇలా ఇంట్లో ఉండి విద్య నేర్చుకోవడం చాలా తేలిక!కాబట్టి ఆడపిల్లలే కాకుండా గృహిణులు కూడా చదువు నేర్చుకోవచ్చును. అక్షరం ముక్క రాని ఆడవారుసైతం తక్కువ సమయంలోనే తన ఇంటి
కుపయోగపడే పనులను అవలీలగా చేసుకునే శక్తి సామర్ధ్యాలు కలుగుతాయి.
స్త్రీ విద్యపై అభిమానమున్న అన్ననో, కుమారుడో? భర్తనో? తండ్రో ఇంటినుండి చదివి పరీక్ష రాసి ఉత్తీర్ణులు కావాలనుకునే వారికి కాస్త సహాయం చేయడమేమంత కష్టం కాదు!
ఇలా ఇంట్లో ఉంటూనే చదువుకొని పరీక్షలు రాసే అవకాశము మన రాష్ట్రంలోనూ వ్యాప్తి చెందుతున్నది. అందుకుగాను చాలా సెంటర్లు ఏర్పడ్డాయి. వాటి ద్వారా కావలసిన సమాచారము దొరుకుతుంది. అయినా కూడా యువతులందరికీ ఈ విషయం గురించి తెలిసింది అనుకోవడానికి వీలు లేదు. అందుకే ఎక్కువమంది మహిళలు ఈ పరీక్షలు రాసి పాస్ అవుతారని చెప్పలేము. కానీ ఇలాంటి అవకాశము అందిపుచ్చుకోవడానికి ముందుకు రావడానికి ఎన్నో ఆటంకాలున్నాయి.. అయినా ఎక్కువమంది ఈ విషయం తెలుసుకొన్నారనీ… వారు ముందుకు వస్తారనీ చెప్పలేము. ఎందుకంటే ఎక్కువమంది తెలియని వారే ఉండడంవల్ల అంచనా వేయలేం. ప్రస్తుతం కాదు కూడదని ఈ నలుగురో ఐదుగురో ఈ పరీక్షలలో పాల్గొన్నంతమాత్రాన సరిపోదు.
ఈ పరీక్షలు జాతి లింగ వివక్షత లేకుండా సౌకర్యం కోసం ఏర్పాటు చేయబడినప్పుడు మగవారు పరీక్ష రాయడం కంటే వారు తమ కోసం ఇంట్లో శ్రమ పడుతున్న మహిళలకు బోధించడంలో సమయాన్ని ఎక్కువ కేటాయిస్తే ఉపయోగం ఎక్కువగా ఉంటుంది. కానీ అంతటి ఓపిక ఆడవాళ్ళ లోను మగవాళ్ళ లోనూ ఉండాలి!
విద్యావ్యాప్తి స్త్రీలలో లేకపోవడం వల్ల ఈనాటి గృహ విద్య పరీక్షలో ఆసక్తి కలగాలంటే… కొంత శ్రమ పడాలి! ఇటువైపు స్త్రీల వైపు నుండి కూడా శక్తి కలిగి ఉండి ఉంటే విద్య నేర్చుకోవడానికిఅవకాశాలున్నాయి. స్త్రీ పురుషులు విద్య నేర్చిన వారైతే దేశానికి ఉపకార దీక్ష పూని, పల్లెటూర్లలో కి వెళ్లి అక్కడ సభలను సమావేశాలను ఏర్పాటు చేసి ఉపన్యాసాలు ఇచ్చి స్త్రీలకు విద్య పట్ల ఆసక్తి ముఖ్యంగా ఇంటి నుండి పరీక్షలు రాయాలనే అభిరుచి కల్పించవచ్చు. కానీ అది అంత సులువు కాదు! ఎందుకంటే ఎవరికి తగ్గ పనులలో వారు తలమునకలయ్యే ఈ సమయంలో తమ పనులు విడిచిపెట్టి ఇంకొకరికి విద్యా బోధన, అవగాహన కలిగించడం కష్టమైన పనే.. అయినా సంవత్సరానికి ఒకటి రెండు సార్లు పర్యటన చేసినా సరిపోదు! ఇది చాలా మంది కూడి జరపవలసిన ఒక బృహత్తర కార్యక్రమం… అందుకే ఈ పని అనుకున్నంత సంతృప్తి కరంగా ఈ విధానంలో వ్యాప్తి చెందదేమో అనిపిస్తున్నది.
విద్యా పక్షపాతి అని పేరు పొందిన నిజాం ప్రభుత్వం ఏ చిన్న ఊళ్ళోనో కాకుండా మిగిలిన ప్రతి గ్రామంలోనూ బాలల పాఠశాల తోపాటు బాలికల పాఠశాల ఏర్పాటు చేసి ఉంటే బాగుంటుంది . దాంతో స్త్రీ విద్య అతి తక్కువ కాలంలోనే వ్యాపించవచ్చు అనే ఒక నమ్మకం కలగవలసిన అవసరముంది. కానీ ఏ బస్తీలోనో తప్ప బాలికల పాఠశాలలో గల ప్రతి గ్రామమునందైనా బోధన, పరీక్షల నిర్వహణకై స్థలాన్ని కేటాయించవలసి వచ్చినప్పుడు ఉపాధ్యాయులకు బదులు ఉపాధ్యాయినులను తక్కువ చూపు చూడకూడదు. పల్లెటూరులలో వాతావరణం వేరుగా ఉంటుంది. సామాన్యంగా ఏ బాలిక అయినా వివాహం ముందు మాత్రమే విద్య అభ్యసించాలని అనుకుంటారు పెద్దలు. తరవాత కుటుంబ పరిస్థితులు సహకరిస్తేనే ఆ విద్య కొనసాగుతుంది… లేని పరిస్థితుల్లో ఆమె చదువుకు అంతరాయం ఏర్పడుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో భర్త, కుటుంబం ఆమెకు సహకరిస్తే అత్యున్నత విద్య ఆమె సొంతం అవుతుంది.
స్త్రీ విద్యాధికురాలైనప్పుడు ఆ కుటుంబం సవ్యదిశలో నడుస్తుంది. పిల్లలు విద్యాధికులు అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకుగాను ప్రోత్సాహం కూడా ఎక్కువ లభిస్తుంది. అంతేకాదు కుటుంబ అవసరాల కోసం డబ్బులు ఖర్చు పెట్టాల్సి వచ్చినపుడు చక్కటి బేరీజు వేస్తుంది. ఏఖర్చుకుఎంత డబ్బు కేటాయించాలి? అనే స్పష్టత ఉంటుంది.కొండొకచో చేదోడువాదోడుగా సంపాదిస్తుంది. అప్పుడు కుటుంబం వీధిలో పడకుండా చక్కని ఆర్థిక పరిపుష్టితో నిలదొక్కుకుంటుంది.
కాబట్టి మన తెలుగు రాష్ట్రంలో మహిళలకు విద్య ఎంతో అవసరమని గుర్తించి మన పాలకులు ప్రతి గ్రామంలోనూ బాలికల పాఠశాలలను స్థాపించాలని సర్కారుకు విజ్ఞప్తి చేస్తున్నాము.
ఇలా ఎంతో అవగాహనను కలిపించే సంపాదకీయం రాయడం ఆనాడు ఒద్దిరాజు సోదరులకే చెల్లును.
అంతేకాకుండా నిజాం నవాబుకు బాలికల పాఠశాల నెలకొల్పాలని అర్జీతో పాటు ఒక హెచ్చరిక కూడా చేశారు. పట్టుబట్టి ఇనుగుర్తి గ్రామంలో” “ప్రయోగాత్మక బాలికల ప్రాధమిక పాఠశాల” వచ్చే లా కృషిచేసి, ఏర్పాటు కూడా చేశారు.
ఇలా స్త్రీ విద్యావ్యాప్తికి ఎంతగానో తోడ్పడింది ఈ తెనుగు పత్రిక.

You may also like

Leave a Comment