Home కథలు తప్యాల చెక్క

తప్యాల చెక్క

by Vani Devulapalli

అప్పటివరకు కుమ్ముల బెట్టినట్టున్న వాతావరణం ఒక్కసారిగా చల్లబడ్డది. నీలాకాశం అంతా నల్లమబ్బులను కమ్ముకున్నది. హఠాత్తుగా చూస్తుండగానే ఉరుములు, మెరుపులతో వర్షం మొదలైంది. పశువుల కొట్టంలో గుంజకు కట్టేసిన ఆవు ఆందోళనగా ‘అంబా’ అని అరిచి తన లేగదూడ తలను నాలుకతో ప్రేమగా తడిమింది.

హాల్లో టీవి చూస్తున్న రామచంద్ర గబుక్కున లేచి కొట్టంవైపు నడిచాడు. అక్కడే గోలెం దగ్గర కుడిది కలుపుతున్న పాలేరు వెంకన్నతో “వెంకన్నా… వర్షం ఎక్కువయ్యేట్టుంది. ఈ లేగదూడను, ఆవును లోపల సాయబానుల గుంజకు కట్టేసి వెళ్ళు…” వెంకన్నను పురమాయించాడు. ” ఆ.. అట్లనే బాబు… అమ్మ సర్వపిండి చేస్తాన్నరు. పోయిల కట్టెలు గావాల్నాట. అమ్మ కిచ్చొచ్చి ఆవును గట్టేస్త బాబు..” అని అన్నాడు వెంకన్న.

“ఓ.. తప్యాల చెక్క చేస్తున్నదా అమ్మ” చిత్రంగా కళ్ళు ఎగరేస్తూ వంటింట్లోకి తొంగి చూసాడు రామచంద్ర. తల్లి కట్టెల పొయ్యి ముందాు కూర్చుని తప్యాల చెక్క చేస్తొంది. కమ్మటి నువ్వులతో కూడిన తప్యాల చెక్క వాసన ఆ వాతావరణంలో ఒక్కసారిగా గుప్పుమంటూ కమ్ముకొని నోరూరించింది. “అమ్మా… చాతగాక ఇప్పుడెందుకు ఈ పని పెట్టుకున్నట్టు? పైగా ఆ కట్టెల పొయ్యి పొగతో సతమతమవుతూ…! గ్యాస్ స్టవ్ వాడుకోవచ్చు కదా “వాతావరణం ఇట్లుంటే నీకు తప్యాల చెక్క ఇష్టం కదా చంద్రా…. ఇవ్వాళా అక్కకు నాకు గూడా ఉపవాసం. అందరికీ పనికొస్తుంది గదా అని చేస్తున్నా…. అయినా ఈ తప్యాల చెక్క కట్టెల పొయ్యి మీద సన్నని సెగమీద చేస్తేనే రుచిరా నాన్నా…” కొడుకు మాటలకు సమాధానమిస్తూ, మళ్ళీ “ఇదిగో… ఇది తీసుకో…” ఓ పళ్లెంలో వేడి వేడి తప్యాల చెక్కను బెట్టి కొడుకు చేతికిచ్చింది అనసూయమ్మ.

పళ్లెం అందుకొని ఒక ముక్క తుంచి నోట్లో వేసుకున్న రామచంద్ర ‘అబ్బా… అమృతమమ్మా… నీ చేతి తప్యాల చెక్క,  ‘కళ్ళెగరేస్తూ ప్రశంసాపూర్వకంగా తల్లివైపు చూశాడు రామచంద్ర. “ఊ. చాల్లే పొగడ్తలు, మురిపెంగా నవ్వుకూ అంటున్నా అనసూయమ్మ మొహంలో కించిత్ గర్వం తొణికిసలాడింది. “అందుకే అమ్మా నువ్వు చేసే ఈ తప్యాల చెక్కంటే మీనాకు ప్రాణం అనుకో….. తనెఁత బాగా చేసినా ఈ రుచి రాదు అంటుంది. పైగా అత్తయ్య చేతిలో ఏదో మంత్రదండముందండీ అంటుంది” తనను పొగడుతూనే భార్య గూర్చి మురిపెంగా చెబుతున్న కొడుకు మాటలు రుచించలేదు అనసూయమ్మకు. అప్పటివరకూ గల గలా మాట్లాడిన తల్లి మీనా ప్రస్తావన రాగానే ముభావంగా మారటం రామచంద్రను బాధించింది. “మామయ్య అత్త పిలుస్తోంది నిన్ను” అక్క కొడుకు పదేళ్ళ టీంకూ వచ్చి చెప్పగానే సగం తిన్న పళ్ళెం అక్కడే వదిలేసి వెళ్తున్న కొడుకుతో ‘అదేంటి చంద్రా… పూర్తిగా తిని వెళ్ళు” అంటున్న తల్లితో ‘చాలమ్మా’ అంటూ ముస్తసరిగా సమాధానమిచ్చి చెయ్యి కడుక్కొని వెళ్ళిపోయాడు రామచంద్ర.

* * *

మీనా పట్ల అమ్మ కోపానికి కారణం వుంది. కట్న కానుకలేమీ ఇవ్వలేని దూరపు బంధువు రాజు మామయ్య కూతురుపై తను మనసు పారేసుకోవటం, ఆ అమ్మయానే పెళ్ళి చేసుకుంటాననటం అమ్మకు సుతరామూ ఇష్టం లేదు. చివరకు, తను మీనానే పెళ్ళి చేసుకుంటా అని పట్టుబట్టడంతో, అన్నయ్యల బలవంతం కూడా తోడై తప్పనిసరై ఒప్పుకుంది అమ్మ పెళ్ళికి. అయితే, మీనాను మాత్రం మనస్ఫూర్తిగా కోడలిగా అంగీకరించలేకపోతుంది ఇప్పటికీ. అమ్మ కోపం, అయిష్టం తాత్కాలికమేనని తరువాత పరిస్థితులు వాటంతటవే చక్కబడతాయని ఆశించాడు తను. అట్లని అమ్మ పట్టుదల తనకు తెలియంది కాదు. అమ్మ పట్టుదల ముందు నాన్నగారే తలవంచేవారు. అయితే, ఆయనకు అమ్మమీద వున్న ప్రేమ, అనురాగం కూడా ముఖ్య కారణంగా చెప్పుకోవాలి. నాన్నగారు అమ్మను ఎత్తెత్తు మాణిక్యంలా చూసుకునేవారు. ఆయన సాహచర్యంలో హాయిగా సాగిపోతున్న అమ్మ జీవితం నాన్నగారి హఠాతం మరణంతో నడిసంద్రంలో నావలా అయింది. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయి మేనమామలుచ ేసిన పెళ్ళితో పన్నెండేళ్ళకే నాన్న చెయ్యి పట్టుకుని వచ్చిన అమ్మ, ఆయనే తన సర్వస్వంగా పిల్లలే తన లోకంగా మలుచుకుంది జీవితాన్ని. ఇదిలా వుంటే “ఉరువు ఉరిమి మంగళం మీద పడ్డట్టు” నాన్నగారు పోయిన సంవత్సరానికే అక్క పంకజం భర్తను పోగొట్టుకొని పిల్లాడితో పుట్టిల్లు చేరడం అమ్మను మానసికంగా కృంగదీసింది. నాన్నగారున్నప్పుడే తెల్సిన సంబంధం అంటూ హడావిడిగా పెళ్ళి చేసిన చెల్లెలు మంజు అత్తింటి వారితో సరిపడక మాట మాటికి అలిగి పుట్టింటికి రావడం, వచ్చినప్పుడల్లా నెలలకొద్ది ఇక్కడే వుండిపోవడం కూడా అమ్మ అశాంతికి మరో కారణం. కొడుకులు చదువుల పేరిట దూరంగా వుండడం వల్లనేమో, పెద్దగా చదువులబ్బని కూతుళ్ళు ఇంటి పట్టునే వుండడంవల్ల వాళ్లను కంటికి రెప్పలా గారాబంగా సాదుకుంది అమ్మ. కానీ ఇద్దరి కూతుళ్ళ జీవితాలు ఇలా సవ్యంగా లేకపోవడంతో మూలిగే నక్కమీద తాటిపండు పడ్డట్టయింది అమ్మ జీవితం. అట్లని వాళ్ళను తను ఏమీ అనలేని స్థితి. తానే తన రెక్కల కింద వాళ్ళని సురక్షితంగా పొదుపు కోవలసిన పరిస్థితి రా చంద్రా అంటుంది కన్నీళ్ళతో అమ్మ. సమస్యంతా ఇక్కడే మొదలైంది. వీళ్ళిద్దరి ఆడపిల్లల రాకతో ఇంట్లో పరిస్థితులన్నీ తారుమారయ్యాయి. మునుపటి ప్రశాంత వాతావరణం మచ్చుకైనా లేదు. ఇంట్లో అన్ని విషయాల్లో పంకజం అక్క, మంజుల పెత్తనం వదినెలకు వాళ్ళకు మధ్య మనస్పర్థలకు, గొడవలకు దారితీసిఁది. తప్పు చేస్తున్నప్పుడు చూస్తూ మంచి చెప్పాల్సిన ఇంట్లో పెద్ద దిక్కు కూతుళ్ళను గుడ్డిగా వెనకేసుకురావడం వదినెలనే కాదు అన్నయ్యలనూ బాధించింది. అట్లని అన్నయ్య అమ్మను గట్టిగా ఏమీ అనలేని అసహాయత, అశక్తత, అనునిత్యం ఇట్లాంటి యుద్ధపూరిత వాతావరణంలో ఇమడలేక వదినెలను, పిల్లల్ని తీసుకుని బదిలీ పేరుతో ఇంటికి దూరంగా వెళ్ళిపోయారు, ఇద్దరన్నయ్యలూ, పీజి చదివి అప్పటికింకా పెళ్ళికాని తను కూడా ఏ ఉద్యోగమో, వ్యాపారమో చూసుకుని వెళ్ళిపోయే అవకాశమున్నప్పటికీ అమ్మను, కుటుంబాన్ని వీధిన పడవేయలేని సంస్కారం కుటుంబ బాధ్యత నెత్తిన వేసుకొని ఉన్న ఊళ్ళోనే వ్యవసాయం చెయ్యడానికి పురికొల్పింది. సహజంగానే ఇంట్లో చిన్నకొడుకుగా అమ్మ ఆప్యాయత, ప్రేమ కుటుంబ సభ్యులందరి గారాబంతో పెరిగాడు తను. అమ్మ, తోబుట్టువుల బాధ్యత చేపట్టి కుటుంబాన్ని నిలబెట్టి బంధువుల్లో తలెత్తుకునేలా చేసిన తనంటే అమ్మకు, అక్క, చెల్లెలికి ఎంతో ప్రేమ. అయితే, తన పట్ల వాళ్ళు కన్పరచే ఈ ప్రేమ తన భార్య పట్ల కూడా చూపుతారని ఆశించాడు తను. కానీ మీనా వీళ్ళ ప్రేమరాహిత్యానికి, అకారణ ద్వేషానికి అడుగడుగునా బాధపడ్తూనే వుంది అనే విషయం తెలిసినప్పుడు హతాశుడయ్యాడు. ముఖ్యంగా అక్క పంకజం, చెల్లెలు మంజు అహర్నిశలూ చిన్న చిన్న విషయాలను కూడా సూటీపోటీ మాటలతో అమ్మను కూడా మాటలనేట్టు రెచ్చగొడ్తూ మీనాను ఏడిపిస్తున్నారని టింకూ ద్వారా తెల్సినప్పుడు మనసు బాధతో పిండేసినట్టయింది. ఎవరి కోసమైతే తన జీవితాన్ని పణంగా పెట్టాడో వారే తన బాగోగుల గూర్చి ఆలోచించక, తన ఆనందాన్ని హరించాలని చూడటం అతన్ని తీవ్ర ఆవేదనకు గురిచేసింది. ఆలోచిస్తున్న రామచంద్ర మనసు మనసులో లేదు.

* * *

ఒక్క ఉదుటున గదిలో కొచ్చి దబాల్న తలుపేసుకుని విసురుగా మంచం మీద వాలిపోయింది మీనా. బలవంతంగా కన్నీళ్ళు ఆపుకోవడం వల్లనేమో ఆమె కళ్ళు ఎర్రటి జీరలు పులుముకున్నాయి. ఇంక ఆమెవల్ల కాలేదు. దిండులో తలదాచుకొని బావురుమన్నది ఒక్కసారిగా! ఆమె కళ్ళు ఉధృతంగా ఎగిసిపడ్తున్న జలపాతాలయ్యాయి. అలా ఎంతసేపు ఏడ్చిందో ఆమెకే తెలియదు. కాస్సేపటికి లేచి మొహం కడుక్కుని వచ్చింది. ఏంటీ మనుషులు? ఎందుకు తనని ఏదో ఒక వంకతో అనరాని మాటలతో చిత్రవధ చేస్తారు? అసలిప్పుడు తను చేసిందాంట్లో తప్పేముంది? ఇంటెనక సాయబాను దగ్గర గచ్చు అంతా ఊడ్చి తను శుభ్రం చెయ్యాలనుకోవడమే నేరమా? తను చీపురు పట్టుకుని ఊడుస్తుంటనే పంకజం వదిన ‘అమ్మా….ఈ మహాతల్లి నీ మడిచీర అంట్లుచేసిందే’ అంటూ అరిచింది. తనకేం అర్థం కాలేదు. తనెక్కడో ఊడుస్తోంది. అత్తయ్య మడిచీర అల్లంత దూరాన గుమ్ములర్రకు వేళ్ళాడుతూ వుంది. తను దాన్ని తాకే అవకాశమే లేదు. ఇంతలో అత్తయ్య రానే వచ్చింది ఆదరాబాదరగా. తనవైపు ఈసడింపుగా చూస్తూ నీ శుభ్రం తగలేసినట్టే వుంది.  నీకెన్నిసార్లు చెప్పాలి ఇటువైపు రావద్దని. నీకిక్కడేం పని…. వద్దని చెప్పినా పదే పదే మొండిగా ప్రవర్తిస్తావెందుకు. “మనిషికో మాట గొడ్డుకోదెబ్బ” అని వూరికే అనలేదు పెద్దలు.  ఇంతలో అక్కడికొచ్చన మంజు అందుకుంది. “అసలావిడ గారికి ఈ పెత్తనాలెందుకు? తన గదిలో తను పడుండి వేళకి నువ్వింత పెడితే తిని వుండలేక….” తను మంజు మాటల్ని పట్టించుకోదల్చుకోలేదు. “ఇప్పుడు నేనేం చెయ్యకూడని పనిచేశానత్తయ్యా. మీ మడిచీర నేను తగలనే లేదు. నేనక్కడికి రాను కూడా లేదు… “తను సంజాయిషీ ఇచ్చుకోబోయింది.” అంటే నువ్వు తగలందే నా కూతురు అబద్ధం చెప్పిందంటావా? అబద్ధాలాడటం మీ ఇంటా వంటా వున్నాయేమో… నా పిల్లలకయితే లేవు. అయినా మీ తల్లిగారింట్లో మీకు మడి, దడి, ఆచారం పద్ధతులు తెల్సి ఏడిస్తే గద… అయినా నా బంగారం మంచిది గాక అవుసలిని అనడం దేనికిలే… నా కొడుకుకు చిలకకు చెప్పినట్లు చెప్పి… ఓ ఆచారం వ్యవహారంలేని కుటుంబంలా వుంది… వద్దురా… అని… వాడు వింటే గదా… నువ్వేమో చిన్న నా పొట్టకు శ్రీ రామరక్ష అని చాటుకు మాటుకు ఏ చిరుతుండో తింటావు పొద్దున్నే. నేను మళ్ళీ మడిబట్ట పిండుకునేదెప్పుడు… అందరికీ వండి నేను తినేదెప్పుడు… ఛీ…. ఛీ… ఇదంతా నా ఖర్మ….” గుమ్ములర్రకు వేలాడుతున్న చీరను లాగి విసురుగా నల్లాకింద పడేస్తూ అంటున్న అత్తయ్య మాటలకు ఏడుపొస్తున్నా బలవంతంగా ఆపుకుంది మీనా. ఇంక అక్కడ వుండలేక తన గదిలోకి పరిగెత్తుకొచ్చింది. అసలు వీళ్ళ సమస్య ఏంటి? ఆలోచిస్తే ఎంతకూ అంతుపట్టదు తనకు. అత్తయ్యకు కూతుళ్ళంటే ఆరోప్రాణం. వాళ్ళెన్ని తప్పులు చేసినా సరే వాళ్ళమీద ఈగ కూడా వాలనివ్వదు. కానీ నిస్వార్థంగా తన సుఖం చూసుకోకుండా వీళ్ళ బాగోగులు పట్టించుకుంటున్న బావ పట్ల, బావ ఇల్లాలి పట్ల వీళ్లు ప్రవర్తించాల్సిన తీరేనా ఇది? తమ ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్ళి చేసుకున్నంత మాత్రాన ఇంత విద్వేషం విరజిమ్ముతారా ఎవరైనా? అసలేంటి వీళ్ళ స్వభావం? వీళ్ళ  స్వేచ్ఛకూ, సామ్రాజ్యానికి తనను ఓ అడ్డంకిగా భావించడమే తన పట్ల వీళ్ళకున్న కోపానికి, విద్వేషానికి కారణమా?

పెళ్ళయిన మొదటిరోజు నుండి తను అత్తయ్య మనసు గెల్చుకోవడాన్కి చెయ్యని ప్రయత్నం లేదు. కానీ ఆమె చూపులతోనే అల్లంత దూరాన నిలువరిస్తుంది తనను. దానికి తోడు తనకు అత్తయ్యకు మధ్య పంకజం వదిన, మంజుల ప్రమేయం కొరకరాని కొయ్యలా మారింది. తన పట్ల ఎప్పటికప్పుడు విషం చిమ్ముతూ అత్తయ్యను ప్రభావితం చేస్తున్నారిద్దరూ. అత్తయ్యకు కూతుళ్ళ మాట వేదవాక్కు కావటం,  పరిస్థితులు రోజు రోజుకు చేయి దాటిపోతుండడం మీనాను కలవరపరుస్తున్న అంశం. చరిత్ర చెప్పినట్లుగా ధర్మరాజు జూద వ్యసనం, దుర్యోధనుడి దురభిమానం, ధృతరాష్ర్టుడి మితిమీరిన పుత్రవ్యామోహం, దక్షప్రజాపతి దురహంకారం, రావణుడి కాముకత, కీచకుడి మూర్ఖత్వం విశ్వామిత్రుడి ద్వేషం, అశ్వత్థామ పగ, కుమార్తె దేవయానిపై శుక్రాచార్యుడి వల్లమాలిన మమకారం… ఇలా మనిషిలోని ఎన్నో స్వభావాలు మానవత్వ పతనానికి కారణమవుతున్నాయి. మానవ జీవన ఔన్నత్యాన్ని చివరికి మానవ మనుగడనే ప్రశ్నించే స్థితికి తీసుకెళ్ళాయి. ఈ స్వభావాల్లో ఏది మితిమీరినా అది మానవ సంబంధాలను, బాంధవ్యాలనూ విధ్వంసం చేస్తుంది. అత్తయ్యకు కూతుళ్లపట్ల వున్న అలవికాని ప్రేమ కూడా అట్లాంటిదేనా? ఆలోచిస్తున్న మీనా ధారగా ప్రవహిస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూనే వుంది. పెళ్ళికి ముందు ఎంతో చలాకీగా, ఉత్సాహంగా, ఉరుకుల పరుగుల నదిలా వున్న తను పెళ్లితో ఓ కల్లోల సముద్రంలా మారిపోయింది.  మనిషిలోని ఇదివరకటి కళ లేదు. కళ్ల క్రింద నల్లని చారలు వయసును అమాంతం ఓ పదేళ్ళు పెంచేసాయి. పెళ్ళికి ముందు పాలరాతి బొమ్మలా వున్న తను ఇప్పుడు జీవనం కోల్పోయిన నల్లరాతి బొమ్మలా మారింది. రోజు రోజుకు ఏ పరిస్థితులలో మార్పు లేకపోగా, మానసికంగా తను చాలా చిత్రవధ ననుభవిస్తోంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే తను నిరాశావాదంలో కూరుకుపోయి బ్రతుకుమీదే విరక్తి కలిగినా ఆశ్చర్యం లేదు… లేదు… లేదు… అలా జరగడాన్కి వీల్లేదు. ఇంటి పరిస్థితులను తను చక్కదిద్దలేకపోతే, పరిస్థితుల నుండి తప్పుకొని అయినా తనను తాను కాపాడుకోవాలి. ఇప్పుడు తన ముందున్న సవాల్‌ అదే! ఇక లాభం లేదు పరిస్థితి బావకు చెప్పాలి. ఇంతకాలం చెప్పకపోవడమూ తాను చేసిన తప్పేనేమో… వీళ్ళ మీద పితూరీలు చెప్పినట్టవుతుందేమో అని, బావ మనసు విరుగుతుందో ఏమో అన్న సందిగ్ధంతో తనలో తనే మధనపడుతూ ఇంత కాలం నటించింది. చాలు… ఇక చాలు… ఈ రోజు దీనికి ఫుల్‌ స్టాప్‌ పెట్టాలి. ఆలోచిస్తూ పడుకున్న మీనాకు కడుపులో వికారంగా అన్పించింది. నీరసంగా కూడ అన్పించింది. నాల్రోజులుగా ఎందుకో నలతగా ఉంటోంది ఒంట్లో. డాక్టర్‌ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటూనే అలాగే నిద్రలోకి జారుకుంది మీనా.

* * *

రాజ్యం పిన్నిని తీసుకుని ఊళ్ళో డాక్టర్‌ దగ్గరికి వెళ్ళినప్పుడు పరీక్షలు చేసి ‘మీరు తల్లికాబోతున్నారు’ డాక్టర్‌ చెప్పిన విషయం. ప్రతి స్త్రీ జీవితంలో అత్యంత మధురమైన, ముఖ్యమైన ఈ విషయం తనకెందుకో సంతోషాన్ని పంచలేదు సరికదా మరింత ఆందోళనకు గురిచేసింది. నిన్నటి సంఘటన కళ్ళ ముందు మెదిలింది.

అత్తయ్య ధిక్కార స్వరం, ఈసడింపు చూపు, కూతుళ్లతో కలిసి ఆమె సూటీ పోటీ మాటలు… మనసును మెలిపెడ్తున్నాయి. మనుషుల్లో ఈర్ష్యాసుయాలు, క్రోధ విద్వేషాలు సహజాతాలు అని తెలుసు. కానీ, అవసరానుగతంగా ఏర్పరచుకున్న ప్రవర్తనారీతులు మనిషి స్వార్థపరత్వాన్నీ, ప్రేమరాహిత్యాన్ని ప్రతిబింబిస్తూ మనిషి అసలు నైజాన్ని బట్టబయలు చేస్తున్నాయా? ముఖ్యంగా సాంకేతికత, యాంత్రికతతో నిండిపోయిన ఆధునిక జీవన విధానం సాక్షిగా మానవ సహజ లక్షణాలయిన ప్రేమ, ఆత్మీయత, ఆప్యాయత, స్నేహం లాంటి మధురిమలను సమాధి చేస్తూ కుటుంబ బంధాలు కూడా ఈ ‘ప్రేమ రాహిత్య మనే వరదలో కొట్టుకు పోతున్నాయా? తన కల్లోల హృదయ స్పందనలు తెలియని రాజ్యం పిన్ని ప్రేమగా హత్తుకుని అభినందించి, ఇప్పటి నుండే తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెబుతూ గల గల మాట్లాడుతూనే వుంది ఇల్లొచ్చేదాకా.

* * *

తను తండ్రి కాబోతున్నానన్న శుభవార్త విని సంతోషంతో తబ్బిబ్బయాడు రామచంద్ర. ”ఈ దెబ్బతో అమ్మ నిన్ను నెత్తిలో పెట్టుకుంటుంది మీనా” అంటూ మీనాను ప్రేమలో ముంచెత్తాడు. కానీ, అతని మాటలు నమ్మాలన్పించలేదు మీనాకు. ఇంట్లో జరిగే విషయాల తీవ్రత అతనికి తెలియదు. తను నిన్న చెప్పాలనుకుంది కానీ ఇంతలో డాక్టర్‌ దగ్గరికి వెళ్ళటం మూలాన కుదర్లేదు. ”మీనా ఈ సమయంలో ఏవేవో తినాలని కోరికలుంటాయట గదా…. నీకేదైనా తినాలన్పిస్తే నాకు చెప్పు” భర్త మాటలకు నవ్వింది మీనా. మీనా మొహంలో ఆనందం లేకపోవడం రామచంద్ర దృష్టిని దాటి పోలేదు. అయితే అది నీరసం వల్లేమో అనుకున్నాడు.

* * *

స్వాతి మెటర్నిటీ హాస్పిటల్‌ వెయింటింగ్‌ హాల్‌లో అసహనంగా కూర్చున్న రామచంద్ర ఆపాదమస్తకం కంపిస్తోంది. లోపలకు తీసికెళ్ళిన మీనాకు ఎలా వుందో? ఆలోచనలతో నరాలు తెగిపడ్తాయన్న టెన్షన్‌కు గురవుతున్నాడు. అసలు తప్పంతా తనదే! మీనాకు అమ్మ చేతి తప్యాల చెక్క ఇష్టం కదా అని మీనాకు తెలియకుండా అమ్మతో చేయించాలనుకున్నాడు. పాపం అమ్మ కూడా చాత గాకున్నా, మీనా కోసం రెండు మూకుళ్ళు పెట్టి బాక్స్‌లో పెట్టి ఇచ్చింది. మీనాకు ఎప్పుడు తినాలన్పిస్తే అప్పుడు తినొచ్చని. ఏమైందో ఏమో తెలియదు కానీ అది తినగానే మీనా అస్వస్థతకు గురైంది. వాంతులు, విరేచనాలతో పరిస్థితి తీవ్రమై ఇదిలో ఇలా హాస్పిటల్‌లో అడ్మిట్‌ చెయ్యాల్సి వచ్చింది. ‘ఫుడ్‌పాయిజనింగ్‌’ అన్నారు డాక్టరు ఎందుకిలా జరిగిందో తనకంతు పట్టడం లేదు. ‘రామచంద్ర మీరేనా?’ అన్న మాటకు తలతిప్పి చూశాడు. నర్స్‌! తలుపాడు అవునన్నట్టు. ”పేషంట్‌కి ఈ బ్లడ్‌ గ్రూప్‌ రక్తం అర్జంటుగా అవసరం. హాస్పిటల్‌లో ఈ బ్లడ్‌ గ్రూప్‌ రక్తం అందుబాటులో లేదు” ఒక్కసారిగా ఆమె ఏం చెప్తుందో తనేం వింటున్నాడో అర్థం కాలేదతనికి. అదే అడిగాడు.

”అవును ఫుడ్‌ పాయిజనింగ్‌ వల్ల బ్లడ్‌ వామిటింగ్స్‌తో చాలా రక్తం పోయింది. పెషెంట్‌ అనిమిక్‌ అయింది.

వెంటనే బ్లడ్‌ ఎక్కించాలి” ఆ మాటలు వింటూనే స్థాణువుగా మారాడు ఒక్క క్షణం. కానీ వెంటనే తేరుకొని, బైక్‌ తీశాడు, ఫ్రెండ్స్‌ అందరినీ ఫోన్‌లో అలర్ట్‌ చేస్తూ విషయం వాట్సాప్‌ గ్రూపుల్లో పెట్టమని చెప్పాడు రామచంద్ర.

‘బి’ నెగెటివ్‌ చాలా అరుదైన బ్లడ్‌ గ్రూప్‌! ఎంత ప్రయత్నించినా రామచంద్రకు ఈ గ్రూప్‌ బ్లడ్‌ కానీ, డోనర్స్‌ కానీ దొరకలేదు. ఊసూరుమంటూ హాస్పిటల్‌ చేరుకున్నాడు. ఎదురుగా వస్తున్న రాజ్యం పిన్నితో ‘పిన్నీ…’ బేలగా మారాడు రామచంద్ర. ”రక్తం ఎక్కించారు. కోలుకుంటోంది. ఇంకో గంట తర్వాత చూడొచ్చన్నారు రా చంద్రా… అంతా ఆ భగవంతుడి దయ… కాకపోతే అబార్షన్‌ అయిందట…. పెద్ద ప్రాణం బాగుంది చాలురా… అంటున్న రాజ్యం పిన్నితో ”ఎంత వెదకినా రక్తం దాతలుదొరకలేదు పిన్నీ… అయితే వీళ్ళే అరేంజ్‌ చేశారన్నమాట… నా మీనా బావుంటే చాలు పిన్నీ… మనసులోనే భగవంతుడికి శతకోటి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. రామచంద్ర.

* * *

హాస్పిటల్‌ నుండి రామచంద్ర ఇంటికొచ్చే వరకు అనసూయమ్మ పెద్ద గొంతుతో ఆవేశంగా మాట్లాడడం విన్పించి ఏం జరిగిందోనని ఆందోళన చెందాడు. రాజ్యం పిన్నితో అంటోంది అమ్మ ”వాళ్ళింక ఈ ఇంట్లో ఒక్క క్షణం వుండటానికి వీల్లేదు రాజ్యం… నా మీదనే అనుమానపడ్డక ఇక ఈ ఇంట్లో నా కొడుకైనా సరే… వుండటానికి వీల్లేదు వెళ్ళిపొమ్మను. ఈ క్షణమే పట్నం వెళ్ళి వేరు కాపురం పెట్టుకొమ్మను. అప్పటిదాకా నేను పచ్చి మంచినీళ్ళయినా ముట్టను ఆఁ…అంతే… ఈ అనసూయమ్మ మాటకు తిరుగులేదని చెప్పు…” రాజ్యం పిన్ని అమ్మను సముదాయిస్తోంది. ఊరుకో అక్కయ్య… సర్లే … బాధపడకు. అలాగే వెళ్తాడులే… వాడి ప్రాణాలన్నీ నీ మీదే. నిన్నొదిలి వెళ్లటం అంటే వాడెంత బాధపడ్తడో ఆలోచించు. బావగారు పోయినప్పటి నుండి నిన్నూ, కుటుంబాన్ని పట్టించుకుని మీరే లోకంగా బతుకుతున్నాడు… ఉన్న ఫళంగా వెళ్ళిపోమంటే…” ”అందుకే వెళ్ళి పోమంటున్నా.. మా బాగోగులు మేం చూసుకోగలం.. అయినా పట్నమెంత దూరమని. ఎప్పుడు రావాలన్పించినా వచ్చి పోవచ్చు. పొలం వ్యవహారాలు చూసుకోవచ్చు. కానీ ఈ ఇంట్లో వుండడనికి మాత్రం వీల్లేదు. అంతే….” తనకు నెత్తిన పిడుగు పడ్డట్టయింది అమ్మ మాటలకు. తనకు… అమ్మ మీద అనుమానమా? ఛ… అమ్మ తనను అపార్థం చేసుకుంది. అమ్మను అనుమానిస్తే తనను తను అనుమానించుకున్నట్టే…! తను అమ్మతో మాట్లాడ్డనికన్నట్టు నాలుగడుగులేశాడో లేదో రాజ్యం పిన్ని వచ్చి తనను పక్కకు తీసుకెళ్ళింది. అమ్మ మనసేం బాగా లేదని, బాగా కోపంగా వుందని, కోపం చల్లారాక వచ్చి కలవచ్చనీ సర్ది చెప్పి పట్నంలో వాళ్ళ తమ్ముడి అపార్ట్‌మెంట్‌ ఖాళీగా వుందని అందులో వుండోచ్చాని చెప్పింది. అమ్మ మాటకు ఎదురుచెప్పకు అంది. ఇంకా ఏమోమో అంది పిన్ని. తన బుర్ర పనిచేయడం మానేసింది. ఏం జరుగుతుందో, ఎందుకో అనేది తెలియలేదు.

ట్రాలీ ఆటో రావడం, గ్యాస్‌ స్టవ్‌, బియ్యం, పప్పులు, సామాన్లన్నీ అందులో సర్దేయించటం, మరో ఆటోలో ఇల్లు సర్ది పెట్టి వస్తానంటూ రాజ్యం పిన్ని తనతో రావడం ఒక పీడకలలా చక-చకా జరిగిపోయాయి. అమ్మ ఎందుకంత కఠిన నిర్ణయం తీసుకుందో ఎందుకంత నిషౖసరంగా మాట్లాడిందో ఎంత ఆలోచించినా రామచంద్రకర్థం కాలేదు. ఉబికి వస్తున్న కన్నీళ్ళను పంటి బిగువున ఆపడం సాధ్యం కాలేదతనికి. ఆటో కదుల్తుంటే, ఆశగా తల బయటపెట్టి తొంగి చూసిన తనకు కన్నీళ్ళ మసకలో పరిగెత్తుకుంటూ వచ్చి గుమ్మంలో నిలబడి చూస్తున్న అమ్మరూపం అస్పష్టంగా కన్పించింది.

* * *

అప్పుడే పదిహేను రోజులైంది.పట్నంలో మకాం పెట్టి. మీనా కోలుకుంటోంది నెమ్మదిగా. ఆ రోజు వచ్చి ఇల్లు సర్దిపోయిన రాజ్యం పిన్ని మీనాను చూసి పోదామని వచ్చింది మళ్ళీ. చదువు కోసం హాస్టల్‌లో వున్నప్పుడు తప్ప, పుట్టి బుద్దెరిగినప్పటి నుండు అమ్మను చూడక, మాట్లాడక పదిహేను రోజులుండటం తనకిదే మొదటిసారి. బాధగా అన్పించింది. అసలేం జరిగిందో తెలియక అయోమయానికి గురవుతుంది మీనా.

కానీ, ఈ రోజు రాజ్యం పిన్ని చెప్పిన విషయం విన్నప్పట్నించీ మనసు అమ్మ మీదికే వెళ్తోంది పదే…

పదే! అమ్మ ఇదంతా రాజ్యం పిన్నితో కల్సి తన సుఖం కోసమే తన సంతోషం కోసమే చేసిందని… ఇంట్లో వున్న అసహన పరిస్థితుల నుండి తాను, మీనా దూరంగా వెళ్ళి ఆనందంగా జీవించాలని తాపత్రయ పడిందనీ, ఊరికే తనను పట్నం వెళ్ళి వేరు కాపురం పెట్టమంటే తనొప్పుకోడనీ, ఆమె కోపంతో వెళ్ళిపొమ్మన్నట్లు నాటకమాడిందనీ తెలిసినప్పటి నుండు హృదయం బరువెక్కింది. తనకు తెలిసిన మరో కొత్త విషయం మీనాకు రక్తం అమ్మనే ఇచ్చిందని! ఈవిషయం ఎవరికీ తెలియనీయవద్దని డక్టర్లను కోరిందట.’అమ్మా…’ రామచంద్ర మనసు తల్లి పట్ల కృతజ్ఞతతో నిండిపోయి, మూగగా రోదించింది.

‘నేను మీనా సుఖంగా వుండటం కోసం ఇదంతా చేశావా అమ్మా…. నేను లేకుండ నువ్వెలా ఉండగలుగుతున్నావమ్మా… ధారగా ప్రవహిస్తున్న కన్నీళ్ళను తుడుచుకునే ప్రయత్నం కూడ చెయ్యలేదు రామచంద్ర. చాలా సేపటికి తేరుకొని ‘మీనా లేచి తయారవు…అమ్మను చూసొద్దాం’ మీనాకు చెప్పి ఫోన్‌ తీశాడు క్యాబ్‌ బుక్‌ చేయ్యడానికి.

* * *

సాయబానులో పట్టెమంచంపై నీరసంగా పడుకొని వుంది అనసూయమ్మ. కళ్ళు మూసినా, తెరచినా కొడుకు చంద్ర బేల చూపులే కదలాడుతున్నాయి కళ్ళముందు. తాను తీసుకున్న ఈ అతి పెద్ద నిర్ణయం వెనక ఆమెకు, పంకజంకు తప్ప ఎవ్వరికీ తెలియని రహస్యం ఒకటుంది. కోడలుకు తప్యాల చెక్క చెయ్యమని కొడుకు అడిగినప్పుడు తనకు చాత కాక, పంకజం సహాయం తీసుకున్న అనసూయమ్మ, పంకజం మీనా పట్ల కోపంతో, ద్వేషంతో లోగడ ఫలహారాలు చేసి వాడి పక్కకు పెట్టిన ముతక నూనెతో తప్యాల చెక్క చేసిచ్చిందని, దానివల్లే ఇంత ఉపద్రవం జరిగిందనీ తెలుసుకున్న అనసూయమ్మ హతాశురాలైంది. అయితే, తాను చేసిన పనివల్ల పర్యవసానం ఇంత తీవ్రంగా ఉంటుందని తాను అనుకోలేదని బావురమంది పంకజం తనను క్షమించమని తల్లిని వేడుకుంది. ధారాపాతంగా ప్రవహిస్తున్న పంకజం కన్నీళ్లలో మీనా పట్ల కోపం కొట్టుకుపోయింది. ఆమె కళ్లలో పశ్చాతాపం కనిపించింది. మీనా పట్ల కూతుళ్ళ అసహనం రోజు రోజుకూ హద్దులు దాటుతోందని గ్రహించిన అనసూయమ్మ బాధ్యతలు గుర్తెరిగిన బంగారు మనసున్న రామచంద్ర కాపురం సుఖంగా సంతోషంగా సాగాలని మనస్పూర్తిగా కోరుకుంది. అంతులేని ఆవేదన ఆవహించినా, కొడుకును, కోడలును, ఆ పరిస్థితుల నుండి దూరంగా పంపడనికే నిశ్చయించుకుంది. తన నిర్ణయం వల్ల కొడుకు సంసారం సాఫీగా సాగుతుందని తలచి, వాళ్ళు ఆనందంగా పిల్లా పాపలతో నిండు నూరేళ్ళు చల్లగా వుండాలని కోరుకుంది. తన మనసు ఇప్పుడు తృప్తిగా వుంది. మూసుకున్న ఆమె కళ్ళల్లోంచి రెండు కన్నీటి బొట్లు జల జలా రాలాయి. ఇంతలో అమ్మా అంటూ పిలుపు! సందేహం లేదు… అది తన చంద్రదే…

గబుక్కున లేచి కూర్చుంది మంచంలో. అనసూయమ్మ మనసు ఆనందంతో పురివిప్పింది.

(సమాప్తం)

You may also like

Leave a Comment