Home కవితలు అమ్మ — బ్రహ్మ.  . .

అమ్మ — బ్రహ్మ.  . .

బలమైన పదార్థాలంటూ నా 
యోగ క్షేమం వహామ్యహంగా 
కొసరి కొసరి తిన్నవన్నీ నేనే   
అమ్మ కడుపులో ఉండి
గుట్టు చప్పుడు కాకుండా ఆరగిస్తున్నాను
 లొటుకలు వేసుకుంటూ !

ఎంత బరువు పెరిగి పోతున్నానో ఏనుగు గున్నలా!
అమ్మ కడుపులో కాలు మీద కాలు వేసుకుని ఎంత సుఖంగా పెరుగుతున్నానో !
జోర్ దార్ నవాబు దర్జా !

అమ్మకు పాదాలు ఉబ్బుతున్నాయట
ఎంత భారంగా నడుస్తుందో!
నా పాదాలూ నొప్పెడుతున్నాయి
అమ్మకు ఏమైతే నాకూ అదే !

నేను కడుపులో ఉన్నా నాకు 
బయటవన్నీ వినిపిస్తునే ఉంటాయి !
నావి పాము చెవులనుకుంటా !
మా అమ్మ క్షేమ సమాచారం 
ఎప్పటికప్పుడు నా కెరుకే 
దివ్య శ్రవణం నాది

అమ్మ ఒడిలో పడ్డాకా పెద్ద పెరిగి 
అమ్మను సుఖ పెడుతాను 
అమ్మ కంట నీరు రానీయను
ఉల్లి గడ్డ కూడ కోయనీయను
చిన్న నోరు పెద్ద మాట మరి !  
తప్పదు కదా 
తప్పు కాదు కదా

బ్రహ్మ దేవుడు ఉపదేశమిచ్చాడు నాకు!
నీకు అమ్మనే బ్రహ్మ 
నేను పేరుకే బ్రహ్మ 

అమ్మను ప్రపంచ మహా రాణిలా చూసుకుంటాను
కాలు కింద పెట్టకుండా రెడ్ కార్పెట్ పై నడిపిస్తాను 
మీకు తెలుసా  !
అమ్మలను మనం సుఖపెడితే 
నాన్నలకు ఎంత సంతోషమో
                      – కందాళై రాఘవాచార్య
                           8790593638  

You may also like

Leave a Comment