దేశం కాని దేశంలో
ఈ శీతలోష్ణపు సాయంత్రం వేళ
అంతగా పరిచయం లేని దారిలో
విచ్చుకున్న చూపునై నడుస్తుంటే
ఎదురుపడి
‘ హాయ్ ‘
అని నన్ను పలకరిస్తూ
చిర్నవ్వై సాగిపోయిన
అతనెవరు
పూర్వ పరిచయమా ? లేదు,
మళ్లీ మరెక్కడో కలుస్తామా ?
తెలియదు
అతనొస్తూ వస్తూ నన్ను చూసాడు
అంతే, అతని పెదాలు విచ్చుకున్నాయి,
అప్పటికప్పుడు పూలు పూసాయి
గొంతులో కూడా!
హాయ్!
పలకరిస్తూంటే అతనిలో
హాయి సమీరం వీచినట్లుంది
అది అక్కడే అంతర్థానం కాక
నా దాకా వచ్చి నను తాకి
పలకవోయీ అన్నట్లుంది
అంతే! నా పెదాలూ విప్పారాయి,
పలుకూ పూసింది సుతారంగా!
హాయ్!
రెండు పిలుపుల కలయిక
ఎంత సరళం, పరిమళ భరితం!
ఏ ఒప్పందాల పత్రాల్లేవు
ప్రయోజనాల లెక్కల్లేవు
హెచ్చూ తగ్గుల యోచనల్లేవు ,
ముందూ వెనకాల వ్యూహాల్లేవు
యోగ్యతాయోగ్యతల తూకాల్లేవు
అప్రయత్నంగా హాయిగా
పెదాల తోటల తలుపులను తెరిచి
పలకరించడానికి పెద్ద కారణాలెందుకు
తోటి మానవుణ్ణి కలిసిన
ఆనంద తన్మయపు పులకరింత చాలు
తోటి మానవుడికి గుప్పెడంత
ఉల్లాస గంధాన్ని అందిస్తున్న ఆ వేళ
పొందే అగణిత తృప్తి చాలు
మనుషులే కాదు,
దేశాలూ పలకరించుకోవచ్చు మెత్తగా!
అపుడు సరిహద్దుల్లోనే కాదు,
ఆ వైపూ ఈ వైపూ
మనిషి నడిచే ప్రతీ దారిలో
పూల వనాలు పలకరిస్తాయి
హాయ్! హాయ్! హాయ్!