(వచన కవిత)
మేఘాల చాటుకొండకోనల్లో పుట్టినా
దాహపుగొంతుల వెతుక్కుంటూ వచ్చే గంగమ్మ
ప్రాంతీయ గాథల ఉరవడినీ కలుపుకొని…
పలుపేర్లతో అలరిస్తూ అఖిలప్రాణి సమూహాలకు
ఆదరువుగా ప్రవహిస్తుంది!
సరళంగాసాగే మైదానాల్లో పసిడివరి పంటలకు కారణం
ఇసుక ఒండ్రునేలల్లో పుచ్చ, ఖర్భుజా, గెనుసు గడ్డల పహరా హుషార్ !
వేసవిపంటలకు వాణిజ్యమై
కొబ్బరి, అరటితోటలఆర్ధిక ఆహ్లాదమే !
నది నిశ్శబ్దమిత్రుడు,తీరంలో జాలరికుటుంబాలకు
తాటిమానులతెప్ప నుండీ మరపడవవరకూ..
ఆటుపోట్లజలధికి అనుచరగణంనదులు!
ఇసుకతిన్నెల్లో కృష్ణపక్షం వెన్నెల
భావకవిత్వం అలలుగా తేలే సమయం !
పాపికొండల మధ్య గోదావరి అందం
విహారయాత్రా విషాద గీతం !!
చిన్ని చిన్ని గుడులున్న తీరాలలో జనసముద్రంగా..
తిరుణాల తీర్థం
ఎంకితో నాయుడుబావ సంకలో పిల్లాడు సంబరాలు
జానపద భవ్యదృశ్యాలు !
అవధిలేని వర్షాభావంతో,
నదీ గర్భం ఎండినా
చెలిమల్లో శ్రామిక జీవుల సంజీవని గానే !
నదిముఖం ముడుచుకొని..
ఫ్యాక్టరీ వ్యర్ధాలకూపంలో గిలగిల కొట్టుకునే పాయలు..
స్వార్థశక్తులు ముందు తరాలకు చేసే ద్రోహాన్ని,
వరదలుగా ముంచి ప్రశ్నించే నది,
లోయల్లో నాగరికతకు
నిదర్శనంగా మృణ్మయపాత్రలా
బండలపై నిలిచిన శిలాజమై
పుష్కరరేవుల్లో బురదతొక్కిసలాటల విస్మయ దుర్ఘటనలై
పాలకుల పాపపుకీర్తి తురాయిని ముంచేసింది!
ఏ బంధం అంటించుకోని నది
పల్లె జనం భక్తితో చల్లిన పసుపు కుంకుమల్లో.. దివ్యంగా !!