Home అనువాద సాహిత్యం సారంగ పక్షులు

మనం పిల్లలకు కథలు చెప్పేప్పుడు జంతువులు, పక్షి కథలు చెప్తుంటాము. ఉదాహరణకు ఐకమత్యమే మహాబలం అనే నీతి కథ నాల్గు ఎడ్లు, ఒక పులి, ఆపద వచ్చినపుడు ఉపాయంతో పులి నుండి రక్షించుకున్న వడ్రంగి, వలలో చిక్కుకున్న పావురాలు, ఇద్దరు కొట్లాడితే మూడవవానికి లాభం రెండు పిల్లులు, రొట్టెముక్క కోతి కథ మొదలగునవి పిల్లలు ఆసక్తిగా వింటూ నీతిమంతులు అవుతారు.

ఇదే మాదిరిగా పురాణ కథల్లో వచ్చే ప్రాణులకు పూర్వజన్మ వృత్తాంతాలు కల్పించి చూపడం పురాణాల్లో ఆచారం. ఒక జింక పూర్వజన్మలో ఒక ఋషి అనీ లేదా ఒక నక్క పూర్వజన్మలో ఒక రాజనీ, ఇలా చెప్పడం పురాణాల్లో వాడుక. అప్పుడు జింక జింకగానూ నడుచుకుంటుంది, ఋషి లాగాను మాట్లాడుతుంది. ఇలాంటి వాటివల్ల కథకు కమ్మదనం వస్తుంది. ఎన్నెన్నో గొప్ప గొప్ప సత్యాలు వెల్లడి అవుతాయి. అటువంటిదే ఒక కథ – సారంగ పక్షులు.          

  • సుధామూర్తి

పాండవులు ఖాండవవనం చేరేవరకు అది చీమలు దూరని చిట్టడవి, కాకులు దూరని కారడవిగా ఉండింది. మృగాలకు, పక్షులకూ నెలవుగా ఉంది. దొంగలు దోపిడీగాళ్ళు అక్కడ చేరి వచ్చిపోయేవారిని హింసిస్తుండేవారు. అటువంటి కీకారణ్యాన్ని తగులబెట్టి, అక్కడ ఒక చక్కని నగరం కట్టించాలని కృష్ణుడూ, అర్జునుడూ నిశ్చయించారు.

ఆ అరణ్యంలో ఒక చెట్టు మీద రెండు సారంగ పక్షులు గూడు కట్టుకొని నివసిస్తున్నాయి. అందులో ఒకటి మగపక్షి, ఇంకోటి ఆడపక్షి. వాటికి నాలుగు పిల్లలు. ఆ పిల్లలకు ఇంకా రెక్కలు రాలేదు. ఇది అలా ఉండగా మగపక్షి, తన భార్యనూ, పిల్లలనూ విడిచిపెట్టి వేరొక ఆడపక్షితో చేరి ఉల్లాసంగా తిరుగుతూ వచ్చింది. తల్లి పక్షి మటుకు తానే తంటాలు పడుతూ ఆహారం తెచ్చి పిల్లలను పోషిస్తూ ఉంది. సరిగ్గా అదే సమయానికి కృష్ణార్జునులు ఉత్తర్వు ప్రకారం అరణ్యానికి నిప్పు అంటుకుంది. క్షణాల్లో మంటలు నలుదిక్కులా వ్యాపించాయి. అడవి అంతా కాలిపోతున్నది. ఆ మంటలు సారంగపక్షుల చెట్టువైపు వస్తుండెను. అది చూసి తల్లిపక్షి తల్లడిల్లిపోయింది. కన్నీరు జలజల కారుస్తూ వాపోయింది. అడవినంతా భస్మంచేస్తూ మంటలు దగ్గరగా వస్తున్నాయి. ఇంకా కాసేపట్లో ఇక్కడికి చేరుతాయి. మనందరిని మసి చేస్తాయి. చెట్లు ఫెళఫెళ విరిగి పడుతున్న శబ్దం విని అడవి జంతువులు అల్లకల్లోలమై అల్లాడిపోతున్నాయి. నా కూనల్లారా! ఇంకా రెక్కలు, కాళ్ళు రాని మీరు మంటల్లో కాలిపోతారు! మీ నాయన మనల్ని విడిచిపెట్టి పోయాడు! అయ్యో! నేనిప్పుడు ఏం చేసేదిరా దేవుడా! ఈ పిల్లలను మోసుకొని ఎగిరిపోదమన్నా నాకు అంత శక్తి లేదాయె. ఎం చెయ్యను? అని ఇలా ఆడపక్షి అంగలారుస్తూ కూచుంది. తల్లి అవస్థ చూసి పిల్లలు ఇలా చెప్పాయి.

“అమ్మా! మా మీది ప్రేమ వలన నీవేమి అంతగా పరితపించవద్దు. మాకేం ఫరవా లేదు. ఈ నిప్పుల పాలయి మేము ఇక్కడే కాలిపోయినప్పటికి వచ్చే నష్టమేమి ఉండదమ్మా. మేము పుణ్యలోకాలకు పోతాం. మాకోసం నీవు కూడా ప్రాణం పోగొట్టుకుంటే కులం వృద్ధి అయ్యే అవకాశం లేకుండా పోతుంది. నీవు వెంటనే బయలుదేరి ఏదైనా నిప్పులేని చోటుకు పోయి క్షేమంగా ఉండమ్మా. మేమిక్కడ నిప్పుల పాలయినా నీకు మళ్ళీ పిల్లలు కలుగుతారు. నీవు బాగా ఆలోచించి మన కులానికి ఏది బాగో అది చెయ్యి.”

పిల్లలు ఇంతగా చెప్పినా తల్లిపక్షికి వాటిని విడిచిపెట్టి వెళ్లడానికి మనసు రాలేదు. “నా చిన్నారి బిడ్డలారా! మిమ్మల్ని విడిచి వెళ్ళడానికి నాకు కాళ్ళాడటం లేదు. మీతో పాటు నేను కూడా ఈ అగ్నికి ఆహుతి అయిపోతాను” అని చెప్పి అక్కడే తిష్ట వేసుకుని కూచుంది.

మందపాలుడు అనే ఒక ఋషి నియమం తప్పకుండా జీవితమంతా బ్రహ్మచర్యవ్రతం కాపాడుకుంటూ వచ్చి, చివరకు అందరిలాగానే తనువు చాలించి ఊర్ధ్వలోకానికి వెళ్లాడు. అక్కడ ద్వారపాలకులు అతడ్ని చూసి “పుత్ర సంతానం పొందకుండా వచ్చినవారికి ఇచ్చడ చోటు లేదు, ఫో!” అని చెప్పి అతడ్ని తిప్పి పంపించారు. దానిపై ఆయన ఒక సారంగపక్షిగా పుట్టి ‘జరిత’ అనే ఆడపిట్టను కట్టుకున్నాడు. అది నాలుగు గ్రుడ్లు పెట్టగానే అతడు జరితను వదిలిపెట్టి ‘లపిత’ అనే వేరొక ఆడపిట్టతో స్నేహం చేశాడు.

కొన్నాళ్ళకు జరిత పెట్టిన నాల్గు గ్రుడ్లు పగిలి పిట్టలైనాయి. అవే ముందు చెప్పి అగ్నిప్రమాదం ముంచుకొని వచ్చిన సమయంలో, ఋషికి పుట్టిన పిల్లలమయి నందున మాకు ఏ ప్రమాదం రాదని తల్లికి ఆ విధంగా ధైర్యంగా చెప్పాయి.

తరువాత తల్లి పక్షి పిల్లలకు ఇలా చెప్పింది. “ఈ చెట్టు పక్కనే ఒక ఎలుక రంధ్రం ఉంది. మిమ్ములను దానిలో విడిచిపెడుతాను. అక్కడ అగ్నిభయం లేకుండా క్షేమంగా ఉండవచ్చు. ఆ కన్నానికి పైన మన్ను వేసి మూసేస్తాను. అప్పుడు మంటలు లోపలికి రావు. మంటలు చల్లారి పోగానే మన్ను తీసేసి మిమ్ముల్ని బయటికి తీస్తాను, సరేనా?”

తల్లి చెప్పిన మాటలు పిల్లలు ఒప్పుకోలేదు. ఆ కన్నంలో వుండే ఎలుకలు మమ్ముల చంపి తినేస్తాయి. ఎలుకల నోట్లో పడి చావడం కన్న ఈ మంటల్లో కాలిపోవడమే మేలు.

“ఆ కన్నంలోని ఎలుకను గద్ద తన్నుకపోయింది నేను చూశాను, ఇక అక్కడ మీకు ఏ అపాయం ఉండదు?” అని తల్లిపక్షి మళ్ళీ వాటిని ఒప్పించే ప్రయత్నం చేసింది.

అయినా పక్షిపిల్లలు ఒప్పుకోలేదు “ఒక్క ఎలుకను గ్రద్ద తన్నుకపోతే మాత్రం ఏం! ఇంకా కన్నంలో ఎన్ని ఎలుకలు ఉన్నాయోనమ్మా! కనుక జాగ్రత్త! ముందు నీ ప్రాణం కాపాడుకో. ఇక్కడి నుండి ఎగిరిపో, ఇక్కడికి మంటలు రాకముందే. మాపై భ్రమ పెట్టుకొని నీవు అనవసరంగా ప్రాణాలెందుకు పోగొట్టుకుంటావు? నీవెవరు? మేమెవరం? మేం నీకు ఏం సహాయం చేశాం? ఏమి లేదు, మేమే నీ కడుపున పుట్టి నీకు అష్టకష్టాలు కలిగించాం అమ్మా. అంటే! ఇక మమ్మల్ని వదిలి పెట్టిపో! నీదింకా చిన్నవయసు యవ్వనం తీరి పోలేదు. నీవు నీ భర్తతో కలిసి ఇంకా పదికాలాల పాటు సుఖించవమ్మా! మేము అగ్నిలో పడి చచ్చినా పుణ్యలోకాలకే పోతాం. మా గురించి విచారించకు! ముందు నీ ప్రాణాలు రక్షించుకో. అగ్ని చల్లారింతర్వాత ఒకవేళ మేం బ్రతికి ఉంటే మమ్ములను చూడవచ్చు” అని అవి తొందర పెట్టేవరకు, మరి లాభం లేదని తల్లి పక్షి తుర్రున ఎగిరిపోయింది.

అగ్నిజ్వాలలు వచ్చి చెట్టు చుట్టుముట్టాయి. పక్షి పిల్లలు ఏమాత్రం భయపడలేదు. చావుకు ఎదిరిచూస్తూ నిశ్చింతగా ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటున్నాయి.

తెలిసినటువంటి వాళ్ళు ఆపదలు రానున్నపుడు ముందే తెలుసుకుంటారు, మరియు మనస్సు స్థిరపరుచుకొని ఉంటారు. అంతేకాని తీరా ఆపద ముంచుకొచ్చి నపుడు ఆందోళన చెందరు. ఆరాట పడరు! అంది, పక్షుల్లో పెద్దది.

“నీవెలాగయినా ధీరుడవు, మేధావివి. నీలా ధైర్యంగా ఉండే వాళ్ళు లోకంలో నూటికో కోటికో ఒకరుంటారు!” అన్నాయి తక్కిన పిల్లలు.

అగ్నిజ్వాలలు వచ్చి చెట్టు చుట్టుముట్టాయి. పక్షి పిల్లలన్నీ కలిసి నవ్వు ముఖాలతో అగ్నిదేవుణ్ణి స్తోత్రం చేశాయి. “ఓ అగ్ని దేవుడా! మా తల్లి మమ్ము విడిచిపోయింది. మా తండ్రి ఎవరో మేం ఎరుగం. గ్రుడ్ల నుంచి బయట పడింతరువాత ఇంతవరకు ఆయన్ను చూడలేదు. ఓ ఆదిదేవుడా! మేమింకా రెక్కలు రాని పిల్లలం. ఇక మాకు నీవే గతి. మాకు వేరే ఆప్తులు లేరు. నిన్నే శరణు జొచ్చాం. మమ్మల్ని రక్షించు తండ్రీ!!” అంటూ వేదాధ్యయనం చేసిన బ్రాహ్మణ బ్రహ్మచారుల్లాగా స్తోత్రం చేశాయి. దీనంగా ప్రార్థించాయి.

అప్పుడు చెట్టును చుట్టిన అగ్నిహోత్రుడు ఆ పక్షిపిల్లలను అంటలేదు. కార్చిచ్చు కారడవినంతా కాల్చి పారేసి చల్లారిపోయింది. ఆ పిల్లలు మాత్రం చావలేదు!

అగ్ని యావత్తు చల్లారిపోయింతరువాత తల్లిపక్షి వచ్చింది . తన పిల్లలు క్షేమంగా ఉండి మాట్లాడుకుంటూ ఉండడం చూసి ఆశ్చర్యపడింది. అక్కడ తండ్రి పక్షి తన కొత్త ప్రియురాలితో “అయ్యో! నా పిల్లలు ఏమయిపోయారో కదా! అగ్నికి ఆహుతి అయిపోయారేమో!” అని కుమిలి కుమిలి దుఃఖించడం మొదలుపెట్టింది. అందుకు లపిత వెంటనే “అలాగా! నీ సమాచారం నాకు పూర్తిగా తెలిసింది. ఇప్పుడు నీకు జరిత మీదికి మనస్సు పోయినట్లుంది. నాపైన వెగటు పుట్టినట్లుంది. అందుకే అగ్నిప్రమాదమనీ, పిల్లలనీ చెప్పి, లేనిపోని వంకబెట్టి అబద్దాలాడుతున్నావు. ఎందుకీ అబద్ధాలు? నీవు ముందే చెప్పావుగా? జరిత పిల్లలను అగ్ని దహించదనీ, అగ్నిదేవుడు నీకు వరం ఇచ్చాడనీ. నీవు ఒకసారి నాతో చెప్పలేదూ? నన్ను విడిచిపెట్టి నీకు ప్రాణప్రియురాలైన జరిత వద్దకు వెళ్ళాలని నీకు ఉంటే ఆ సంగతి చెప్పి నిర్భయంగా వెళ్ళవచ్చుగా! ఎందుకీ లేనిపోని అబద్ధాలు? నమ్మకూడని మగవాళ్ళను నమ్మి మోసపోయిన ఆడవారిలో నేనూ ఒకతినయి ఆడవులు పట్టి, నా దారిన నేను పోతాను. నీవు మహారాజుగా పోవచ్చు” అని ఏడుస్తూ చెప్పింది.

 “నీ ఊహ సరికానే కాదు” అని వెంటనే అందుకుంది మందపాల పక్షి. “అసలు సంగతి విను. నేను పుత్ర సంతానం కోసమే, ఈ పక్షి జన్మ ఎత్తాను. నా బెంగంతా పిల్లల గురించే, వెళ్ళి చూసివస్తాను” అని ఎలాగైతేనేం, ఆ కొత్త ప్రియురాలిని సమాధానపరిచి తన భార్య జరిత ఉన్న చెట్టు దగ్గరికి వెళ్ళాడు, మందపాలుడు.

జరిత తన భర్త వచ్చిన సంగతి గమనించనే లేదు. పిల్లలు గండం తప్పించుకొని బయట పడ్డారన్న ఆనందంలో ఇంకా అలాగానే మునిగి ఉంది. కాసేపటికి తిరిగి చూసింది. భర్త కనిపించాడు. ఏం? ఎందుకు వచ్చారు? అని అలక్ష్యంగా పలకరించింది.

“నా నాయినలు సుఖంగా వున్నారు కదా! ఇందులో ఎవరు పెద్దవాడు?” అంటూ ఆప్యాయంగా పక్కన వచ్చి నిలుచున్నాడు మందపాలుడు.

“ఎవరు పెద్దవారైతేనేమి? ఎవరు తరువాత వాడైతేనేం? ఏ తోడూ లేకుండా నన్ను వదిలేసి, ఎవతి కోసమైతే వెళ్ళారో దాని దగ్గరికే పోయి దానితోనే ఉండండి! వెళ్లండి” అని జరిత, కోపంగా భర్తను కసిరింది.

పిల్లలు పుట్టింతరువాత ఏ స్త్రీ అయినా పురుషుణ్ణి లెక్కపెట్టుడు. ఇది లోకంలో ఉన్నతీరే. ఏ పాపం ఎరుగని వసిష్ఠుణ్ణి కూడా అరుంధతి ఇలాగే అవమాన పరిచింది అన్నాడు, మగ పక్షి రూపంలో ఉన్న మందపాలుడు.

XXXXXX XXXX

You may also like

Leave a Comment