Home కథలు ఎల్బీడబ్ల్యు 

ఎల్బీడబ్ల్యు 

by Nandiraju padmalata

            ల్యాండ్ లైన్ ఫోను రిసీవర్ అప్పటికి పావుగంట నుంచీ రాజేశ్వరి చెవిని అంటిపెట్టుకునే ఉంది. ఈ మధ్య ఈ ఫోనుని వాడడం బాగా తగ్గిపోయింది. ఎప్పుడో తప్ప కాల్ చేసేవాళ్ళు ఎవరూ లేరు. అందుకే హిమబిందు కి ఆశ్చర్యంగా ఉంది. 

తల్లి వంకే చూస్తోంది. ఆవిడ ముఖంలో మారే రంగులు, భావాలు అర్థం కాక, సైగలతో అడిగింది బిందు, ‘ఎవరు అవతలి వైపు?’ అని. 

               కానీ, ఏకపక్షంగా సాగుతున్న ఆ సంభాషణలో, రాజేశ్వరి వినటంలోనే  నిమగ్నమయి పోయి ఉంది. ‘  అయ్యో ‘, ‘ అవునా ‘ ,’ నిజమా ‘లాంటి ఆశ్చర్యార్థకాలు తప్ప మరో మాట లేదు రాజేశ్వరి వైపు నుంచీ. 

            ఎట్టకేలకు ఫోను పెట్టేసింది రాజేశ్వరి. నీరసంగా వచ్చి సోఫాలో కూలబడింది. 

          “ ఎవరమ్మా? బాగా వాయించేశారుగా!”

          “ఏదో లే!   రాంగ్ నంబరు”

          “రాంగ్ నంబరుతో అరగంట మాట్లాడావా? చెప్పమ్మా ఎవరూ?” 

          ” ఏం లేదన్నాగా!” కూతురి వంక చూడకుండా, లేచి వంట గది లోకి వెళ్లి పోయింది రాజేశ్వరి. 

          సాయంత్రం అయిదున్నర అవుతుండగా చక్కగా తయారయ్యి బయల్దేరింది హిమబిందు.

        “ఎక్కడికీ?”

        “మర్చిపోయావా అమ్మా…? కేదార్,  నీ దగ్గర పర్మిషన్ కూడా తీసుకున్నాడుగా…! ఇద్దరం అలా షికారు వెళ్ళొస్తామమ్మా…!”

        “వద్దొద్దు….!”

        అర్థం కాలేదు బిందు కి. కాబోయే భర్త తో కాస్త మాట్లాడు కోవడానికి ప్రైవసీ కావాలని తెలియనంత అమాయకురాలు, చాదస్తురాలు కాదే అమ్మ! సరిగ్గా వారం క్రితమే నిశ్చితార్థం అయింది.  వచ్చే నెలలోనే పెళ్ళి. నిన్న సరే అని ఇప్పుడొద్దంటుందేంటి?

            “అదేంటమ్మా…నిన్న వస్తానని చెప్పి, ఇవాళ ‘ రాను ‘ అంటే, అతనేమనుకుంటాడు? ఏమయ్యిందమ్మా?”

          “ ఒద్దన్నాను. ఒద్దంతే! రావట్లేదు అని చెప్పేయి. నాతో వాదించకు.”

          “ అది కాదమ్మా….ప్లీజ్…అతను నా కోసం ఎదురు…..”

         “నువ్వు చెప్తావా…నన్ను చెప్పమంటావా….!” కోపంగా అంది రాజేశ్వరి.

         కళ్ళల్లో నీరు గిర్రున తిరిగాయి బిందూకి. లోపలికెళ్లిపోయింది.

                              ***

         “ఏవండీ…. ఇవాళ మధాహ్నం ఒక ఫోన్ కాల్ వచ్చింది. అప్పటినుండి నా మనసు మనసులో లేదు.” మధ్యాహ్నం నుండీ కొంగున కట్టుకున్న నిప్పు కణిక  ను విప్పింది రాజేశ్వరి.

          చంద్రమౌళి కి కూడా అనుమానంగానే అనిపించింది ఇంట్లో ఉన్న అసహజ వాతావరణం. ఎప్పటిలాగా, బిందు నవ్వుతూ ఎదురు రాలేదు. తన గదిలోనే ఉండి పోయింది.

         “ ఎక్కడి నుంచీ…?”

         “చెప్తాను! బిందు పడుకుందో లేదో చూసొస్తానుండండి.”

        “అక్కర్లేదులే….! చూసే వచ్చాను. నిద్ర పోతూంటే నేనే దుప్పటి కప్పి వచ్చాను. “

         “ ఎవరోనండీ…సుందరిట! అరగంట పాటు చెప్తూనే ఉంది. చాలా చెప్పింది. మన బిందుకి కాబోయే భర్త కేదార్ గురించి చెప్పింది.” కంగారు ఆమె గొంతులో.

       “ అంటే, బాడ్ క్యారెక్టర్ అనా?”

      “దాదాపు అంతే!  వాళ్ళ అమ్మాయితో ఎనిమిది నెలల క్రితం ఈ కేదార్ నాథ్ తో నిశ్చితార్థం జరిగిందట. ఈవిడ వద్దన్నా వినకుండా అతను ఆ పిల్లని షికార్లకీ సినిమాలకీ తీసుకెళ్ళాడట  ముందుగానే రెండు లక్షలు కట్నం కూడా తీసుకున్నారట. సరిగ్గా వారం రోజుల్లో పెళ్ళి అనగా ‘మీ అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదని తెలిసింది, మాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అన్నారట కేదార్ తల్లి, తండ్రి.’ ఎంత బ్రతిమిలాడినా ఒప్పుకోలేదట. పాపం చాలా రోజులు పట్టిందట వీళ్ళకి ఆ బాధ నుంచీ బయట పడడానికి.”

             షాక్ తిన్నాడు చంద్రమౌళి. 

            సాధారణ మధ్య తరగతి కుటుంబీకుడికి ఇది పెద్ద కష్టమే! రెండేళ్ల క్రితం పెద్దమ్మాయికి పెళ్ళి చేసి అమెరికా పంపాడు. రెండో అమ్మాయిని కూడా ఓ ఇంటిదాన్ని చేస్తే, తన బాధ్యత అయిపోతుందని అనుకుంటే ఈ వార్తతో ఆయన గుండె గుభేలుమంది. ప్రెస్ నుంచీ శుభలేఖలు కూడా వచ్చాయి . పెళ్ళి హాలు, వంట వాళ్ళూ, అన్నీ బుక్ చేయడం ఐపోయింది. పిలుపులే మిగిలాయి.

           “ కానీ రాజీ…ఆవిడకి మన ఫోన్ నెంబర్ ఎలా తెలిసింది? బిందూకి అతనితో  కుదిరిందని ఎవరు చెప్పి ఉంటారు? అసలు ఆవిడకేం సంబంధం మనతో? మన మంచి కోరడానికి ఆవిడకి మన గురించి ఎలా తెలుసని అడగాల్సింది “

           “అడిగానండీ! తోటి ఆడపిల్ల తల్లిని కనుక మన మంచి కోసం తెలుసుకుని చెప్తున్నాను అంది. వాళ్ళ అమ్మాయిని వద్దన్నాక వీళ్ళు ఎంక్వయిరీ చేస్తే తెలిసిందట, అతనికి వేరే అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయిట. ఆ ఫ్యామిలీనే అలాంటిదట. ‘మీ శ్రేయోభిలాషి గా చెప్తున్నాను. మరో ఆడపిల్లకి ఇలాంటి అన్యాయం జరగకూడదు అని, చాలా కష్టపడి మీ నెంబర్ కనుక్కున్నాను అని’ ఏమేమో చెప్పిందండీ. అప్పటినుండీ నాకు మనసు మనసు లో లేదు.”

భర్త చెవిన వేశాక, రాజేశ్వరి గుండె బరువు కొంత తగ్గింది. చంద్రమౌళి కాసేపు ఏమీ మాట్లాడలేదు.

        “కానీయ్! ఈ విషయాలేవీ బిందూ కి తెలియనీయద్దు. చిన్నపిల్ల. బాధపడుతుంది. ఇందులో నిజమెంతో నేను కూడా ఎంక్వయిరీ చేస్తాను. నువ్వు తొందర పడకు!” భార్యతో చెప్పి, భోజనం పూర్తి కాకుండానే లేచాడు చంద్రమౌళి.

          తన గది గుమ్మం దగ్గరే కర్టెన్ వెనుక నిల్చుని అన్నీ విన్నది హిమబిందు.

        “నాన్నా…! అమ్మ ఎందుకింత డల్ గా ఉందో నాకిప్పుడర్థమైంది. నేనేం చిన్నపిల్లను కాదు. చూస్తూ, చూస్తూ ఒక వంచకుడితో జీవితాన్ని పంచుకుంటానా? కేదార్తో నేనే ముఖాముఖీ మాట్లాడుతాను. ఏది ఏమైనా నేనేం భయపడి, బెంబెలుపడను. మీరు మనసు పాడు చేసుకోవద్దు. అమ్మా! నాకు నువ్వు ఏదీ దాచకుండా విన్నది విన్నట్లు చెప్పాలి. భోజనం చేసి రా!” గబగబ అని గిరుక్కున తిరిగి తన గదిలోకి వెళ్ళిపోయింది.

              భార్యాభర్తలిద్దరూ అవాక్కయ్యారు.

                                **

            నేషనల్ హై వే మీద మెత్తగా దూసుకు పోతోంది ఇన్నోవా కారు.

            “నిన్ను అర్థం చేసుకోవడం చాలా కష్టమే! ప్లాన్ చేసిన నిన్నటి  ప్రోగ్రాం కాన్సిల్ చేశావు. ఈ రోజు నీ అంతట నువ్వే కాల్ చేసి లీవ్ పెట్టి మరీ రమ్మన్నావు. ‘ క్షణ క్షణముల్ జవరాండ్ర చిత్తముల్….’ ” నవ్వుతూ అన్నాడు కేదార్.

            నవ్వలేదు బిందు.

           “ఏమిటీ మూగనోము? మేడమ్ గారికి అలకా?”

           “కారాపండి. ఎక్కడయినా కూర్చుని మాట్లాడుకుందాం.” ముక్తసరిగా అన్న బిందు మాటలకి కాస్త ఖంగు తిన్నాడు కేదార్.

భుజం మీద చెయ్యి వేసి, “ఎనీ థింగ్ సీరియస్?”

            “ఎస్” చెయ్యి తీసి దూరం జరిగింది బిందు.

          కొద్ది దూరంలో హై వే ప్రక్కగా ఉన్న వేప చెట్టు దగ్గరగా కారాపాడు కేదార్. ఇద్దరూ అక్కడే ఉన్న సిమెంటు చప్టా మీద కూర్చొన్నారు.

        “రేఖ ఎవరు?” ఏ ఉపోద్ఘాతము లేకుండా అడిగింది బిందు.

         “ఏ రేఖ?” 

         “ఎందరు రేఖలు తెలుసేం? ప్రస్తుతానికి ఒక్క రేఖ చాలు. చెప్పండి. మీ పూర్వ ఫియాన్సీ . ఎంగేజ్మెంట్ అయ్యాక, మీరు వదులుకున్న శశిరేఖ .”

          “నీకు…తన గురించి ఎలా తెలుసు?” ఆశ్చర్య పోయాడు కేదార్. నిజానికి బిందు అతను తత్తరపడి అవాక్కవుతాడనుకుంది.

         “ ఆ విషయం తర్వాత. ముందిది చెప్పండి. ఆ అమ్మాయిని కాదన్నదెందుకు? నన్ను కావాలనుకున్నదెందుకు? మాకు ఈ విషయం తెలియకుండా దాచారెందుకు? ఎవరిని మోసం చేయాలని?” కోపం, దు:ఖం కలగలిసి ఆమె కళ్ళెరుపెక్కాయి.

        “కమాన్…బిందూ….చెప్పకూడదనేమీ లేదు. నీకు చెప్పాల్సిన అవసరం లేదనుకున్నాను. నువ్వనుకునే అంత సీరియస్ కాదు కాబట్టి చెప్పాలనిపించలేదు. దట్సాల్ .”

చాలా కోపం వచ్చింది బిందూకి.

           “ఎంత సీరియస్ కాకపొతే వాళ్ళు, మా ఫోన్ నెంబర్ తెలుసుకుని మరీ మీ చరిత్ర తెలియజేస్తారు? ఒక ఆడపిల్లని అలా మోసం చేసి మరో అమ్మాయికి తాళి కట్టేందుకు సిద్ధమయ్యారే …! మై గాడ్…’చదువుకున్నారు. మంచి జాబ్ చేస్తున్నారు’ అని పొరపడ్డారు మా వాళ్ళు..రియల్లీ అయాం సేవ్ డ్.” ఆమె ముక్కు పుటాలు ఆదరుతున్నాయి.

         “మోసమా…?నేనా…?ఎవరిని చేశాను? ఎవరు చెప్పారు? ఏం చెప్పారు? నాకు అర్థమయ్యేలా చెప్పు హిమబిందూ!”

        “ఏం చెప్పాలి? అప్పుడు  రేఖని, ఇప్పుడు నన్ను! రేపెవరినో? ఎంత మందిని మోసం చేస్తారిలా ?”

       “నాకు కాస్త స్పష్టం చెప్పగలవా బిందూ….! నీకెవరెవరు ఏమేమి  చెప్పారో…!.నేనెవరినీ మోసం చెయ్యలేదు. నిజానికి మోసపోయింది మా కుటుంబం. ముందు నువ్వు చెప్పాక, నేను చెప్తాను.”

           జరిగిన విషయం అంతా చెప్పింది హిమబిందు  కేదార్ కి. 

         కాసేపు మౌనంగా ఉండి  పోయాడు కేదార్.

         “హిమబిందూ ! ఇలా జరగడం చాలా మంచిదయ్యింది. ఔను. నీకు తెలియడమే మంచిది. అవసరం కూడా అనిపిస్తోంది ఇప్పుడు. విను. నాకు రేఖతో నిశ్చితార్థం జరగడం నిజం. అది విఫలం అవడం ఇంకా నిజం. తనూ నా లాగే సాఫ్ట్ వేర్ ఇంజనీర్. నాలాగే క్రికెట్ పిచ్చి తనకి. ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం కోసం మూడు సార్లు బయట తిరిగాం. బాగా షాపింగ్ చేసింది తను. పెళ్ళి  చీరలు, డ్రెస్సులు వగైరాలన్నీ నా చేత కొనిపించుకుంది. ఇక వారంలో పెళ్ళి. మా  ఇంట్లో దగ్గర బంధువులున్నారు. చాలా హడావిడిగా ఉన్న సమయంలో రేఖ ఫోన్ చేసింది. మాట్లాడాలి రమ్మని పిలిచింది. వెళ్ళాను. నా చేతులు పట్టుకుని కన్నీళ్ళతో షాకింగ్ వార్త చెప్పింది. ‘తనకి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని, అతను దినకర్ అని, తామిద్దరికీ ఎప్పటి నుంచీనో నెట్ స్నేహం ఉందనీ ,  అతడినే తను పెళ్ళి చేసుకుంటాను’ అని. . మరి ముందుగానే నాకు గానీ మా  వాళ్లకి గానీ ఎందుకు చెప్పలేదు అని అడిగితే, యు ఎస్ లో ఉన్న అతడు రెండు నెలల తర్వాత ఇండియా వస్తాను అన్నాడనీ, అతను రాకపోతే, ఇక తన గతి ఇంతే అని నాతో జీవితం పంచుకుందాం అనుకున్నానని, ఈ విషయం తన పేరెంట్స్ తో చెప్పే ధైర్యం లేకపోయిందని అంది. కానీ, ఇప్పుడు అతడు ముందుగానే తన కోసం భారతదేశం వచ్చాడని చెప్పింది. అంటే స్టాండ్ బై గా నన్ను ఉంచుకుందన్నమాట. చాలా బాధపడ్డాను. అప్పటికే తనకి మేము ఇద్దామనుకున్న బంగారు ఆభరణాల కోసం డబ్బు కూడా ఇచ్చేశాం. ఇంత వరకూ వచ్చాక పెళ్ళి రద్దు అయితే పరువు పోతుందని, దినకర్ని మరచిపోమని ప్రాధేయ పడ్డాను.      కానీ రేఖ  కన్నీళ్ళతో వేడుకుంది. మనసు ఒకరితో, మనువు మరొకరితో పంచుకోలేనంది. ఆది చాలనట్లు నా నెత్తి మీద మరో భారం వేసింది.”

         “ఏమిటది?” అడిగింది బిందు .

        “రేఖకి  తల్లితండ్రుల దగ్గర తమ కులం కాని వాడిని పెళ్ళి చేసుకుంటాను అని చెప్పే  ధైర్యం లేదు. ఇంత దాకా వచ్చాక వాళ్ళు తనని ఎట్టి పరిస్థితులలోనూ బయిటికి రానివ్వరు, బలవంతంగా నాతోనే పెళ్ళి చేస్తారు కనుక, నన్ను బ్రతిమిలాడింది ‘ దయచేసి, మీరే ఏదో ఒకటి చెప్పండి. నేను మీకు నచ్చలేదని చెప్పెయ్యండి. పెళ్ళి కాన్సిల్ చేయండి.’ అంటూ ఏడ్చింది. కాళ్ళా వేళ్ళా పడింది. ఆలోచించాను. మనసు లేని పెళ్ళి నేనూ చేసుకోలేను కదా! అందుకే, తను చెప్పినట్లే చేశాను. వాళ్ళ వాళ్లకి నామీద చాల కోపం వచ్చింది. బాగా గొడవలయ్యాయి. మేమిచ్చిన సోమ్ములేవీ మేం అడగలేదు. వాళ్ళివ్వ లేదు.  ఆడపిల్ల జీవితం అల్లరి పాలు కాకూడదని నా తల్లితండ్రులకు తప్ప ఈ విషయం ఎవరికీ తెలియనీయలేదు. నాకూ ఓ చెల్లెలుంది బిందూ!  మీకు ఎవరు ఏమేం చెప్పారో నాకు అనవసరం. నమ్మితే ముందుకు వెళ్దాం. లేకపోతే, ఇక్కడితో వదిలెయ్యి. ఫ్రెండ్స్ గా ఉందాం!“ నిజాయితీ ఉంది అతని స్వరంలో.

          “ఇది నిజమని నమ్మేదెలా?” ఇంకా అనుమానంగానే ఉంది బిందుకి .

         “నమ్మించేదెలా? ఆగు.  నా దగ్గర తన ఫోన్ నెంబర్ ఉంది. “ అంటూనే డయల్ చేశాడు కేదార్.

         “హాయ్ కేదార్! హవ్వార్యూ? ఎంత హ్యాపీ గా ఉందో నువ్వు కాల్ చేస్తే! బట్, నాకు తెలుసు ఎప్పటికయినా నువ్వు నా కాంటాక్ట్ లోకి వస్తావని. యూ ఆర్ మై మ్యాన్. “ రేఖ స్వరం మొబైల్ ఫోన్ స్పీకర్ లో నుంచీ బిందుకి స్పష్టంగా విన్పిస్తోంది.

        “జస్ట్ ఏ కర్టెసీ కాల్….ఎలా ఉన్నావు రేఖా? ఎలా ఉంది లైఫ్? నువ్వూ, దినకర్…. యు ఎస్ లోనేనా?”

        “ఓ ! అయాం సో అన్ లక్కీ కేదార్! వాడొట్టి చీట్. పెద్ద ఫ్రాడ్. అన్ని కబుర్లు చెప్పాడా…! ఇండియా వచ్చాడా! నన్ను చూసాడా! వాడేదో ప్రిన్స్ లాగా ఉన్నట్లు ఫీలింగ్ ఒకటి! ‘నువ్వింకా చాలా అందంగా ఉంటావనుకున్నాను. అయినా సరే, ఏదో అడ్జస్ట్ అవుతాను. యాభై లక్షలు కట్నం తెమ్మన్నాడు. ఎక్కడినుంచి తెస్తాను? అందుకే ఇంకేం చేస్తాను? బ్రేకప్ చెప్పి బయట పడ్డాను. నిన్ను మిస్ చేసినందుకు నేను  ఎంత ఫీల్ అవుతున్నానో…! రియల్లీ ఐ రిపెంట్” బాధగా అంది రేఖ.

           “ సో స్యాడ్ రేఖా…! ఒక్కో సారి అంతే! అనుకున్నట్లు జరగదు. బీ బ్రేవ్!” చెప్పాడు కేదార్.

           “కేదార్! ఒక మాట చెప్పనా….!నాకు ముందు నుంచీ నువ్వంటే నాకిష్టం. నీతో క్రికెట్ మ్యాచెస్ చూస్తూ లైఫ్ మొత్తం వన్డే మాచ్ లాగా జరిగిపోవాలి. ఎస్…,నువ్వు నన్ను నమ్మాలి. మరెందుకు ఎలా చేశావ్ అని అడగొచ్చు నువ్వు. వాట్ టు డు ? ఆ దినకర్ నీకన్నా క్వాలిఫైడ్. ఫారిన్ లో మంచి జీతం. అందుకే అప్పుడటు మొగ్గాను. అంతా ఉల్టా అయ్యింది. ప్చ్! కేదార్ డియర్… ప్లీజ్!  లెటజ్ గెట్ మారీడ్! మా అమ్మతో అదే చెప్పాను. ప్లీజ్, కేదార్, ఒక్క సారి మనం కూర్చుని మాట్లాడుకుందాం. నాకు తెలుసు నువ్వు ‘ కాదు’ అనవని.    లవ్యూ కేదార్….”ఇంకా ఏదో చెప్తూనే ఉంది రేఖ.

           హిమబిందు, కేదార్ చేతిలో ఉన్న మొబైల్ ఫోనుని తీసుకుంది. 

        “మిస్ రేఖా…! నేనేవరా అని ఆశ్చర్య పోతున్నట్లున్నావు కదూ…. నా పేరు హిమబిందు. కొద్ది రోజుల్లోనే మిసెస్ కేదార్ నాథ్ ని .   పాపం. మా ఫోన్ నెంబర్ వెతికి మరీ మమ్మల్ని తప్పిద్దానుకున్నారు. చాలు   మీరాడిన జూదం. చూడూ …పెళ్ళికి కావాల్సినది ప్రేమ. నమ్మకం.   ఆస్తి, అంతస్తు కాదు. నువ్వు, మీ అమ్మా మీ తెలివితేటలని  కాస్త మంచి పనులకి వాడుకోండి.  మంచిమనిషిని వంచించడానికి కాదు. ఏదేమైనా నా జీవిత భాగస్వామి ఔన్నత్యాన్ని తెలుసుకున్నాను. వివాహబంధాన్ని వ్యాపారంగా మార్చేసే మీలాంటి వాళ్ళ వల్లే సమాజంలో ఆడవాళ్ళ పట్ల గౌరవభావం తగ్గుతోంది. బై !“  

          ఫోనుని తిరిగి కేదార్ చేతికిచ్చి, ఆ చేతిని గట్టిగా పట్టుకుంది హిమబిందు.

          అనుమానపు తెరలు తొలిగిన  ఆమె కళ్ళల్లో  ప్రతిఫలిస్తున్న అభిమానాన్ని చూశాడు కేదార్.

         “థాంక్యూ “ అతని కళ్ళు చెప్పాయి ఆమెకి. కారు వైపుగా ఇద్దరి అడుగులో సాగాయి.

You may also like

Leave a Comment