ఈ రోజు నేను ఆవకాయ గురించి వ్రాయబోతున్నాను. ఆవకాయ అంటే ఇష్టపడని తెలుగువారు ఉంటారా అసలు? ఆ మిథునం సినిమా పాట ఎంతో సమయోచితంగాను, తెలుగువారికి ఓ కితాబు ఇచ్చినట్లే ఉంటుంది. ఆ పాట విన్నప్పట్నుంచి మనందరికీ ఆవకాయమీద ప్రేమాభిమానాలు పొంగి పొర్లాయంటే ఒప్పుకుంటారా? అసలైనా తినబోతూ రుచిలెందుకు లెండి! నేను ఇప్పుడు రాయబోయే మా ఇంట్లో ప్రతి ఏడాది జరిగే ఆవకాయ ప్రహసనం చదివారంటే, మన భానుమతి అత్తగారి కథలు బలాదూర్ అనుకొని నాకు కూడా ఒక స్పెషల్ బిరుదు ఇచ్చేస్తారు తెలుసా!
సరే, అసలు విషయానికి వద్దాం. పోయిన సమ్మర్ లో మాకూ కరోనా రావడంవల్ల నేను ఊరగాయలు ఓ మాదిరిగ పెట్టాను. ఇంతకీ మీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. అదేటంటే మాకు ఇద్దరు ఆడపిల్లలండి. ఒకళ్ళు U.S అయితే ఇంకొకరు ఎవరూ అంతగా పట్టించుకోని కానీ world అంతా మెచ్చుకొనే బుల్లి దేశం ఉందే…. అదే న్యూజిలాండ్ అండీ…. పోయి పోయి అక్కడ సెటిలైంది. పైగా అక్కడ వాతావరణం సీనిక్ బ్యూటి అంతా నాకు నచ్చాయి పో. (అంటే మా అల్లుడుగారికి కూడా లెండి) అని ఒక్క అక్షరంలో తేల్చిపారేసింది. ఇంకా ముఖ్యమైన కారణం అక్కడ ఇండియాలో లాగా దోమలుండవట (మా అమ్మాయికి దోమల ఎలర్జీ ఉంది లెండి). అందుకని అక్కడకి వెళ్ళాక అది సుఖసంతోషాలతో వర్థిల్లుతోంది. మనకి, అంటే తల్లిదండ్రులకి కూడా కావల్సిందదేగదండి!
ఇకపోతే అప్పట్నుంచి నేను ప్రతి ఏడాది కిలోలకి కిలోలు ఊరగాయలు ఇటు అటు ఎడాపెడా పెట్టేసి, వాళ్ళకి కొరియర్లో పంపించటం అలవాటైపోయింది. (మా వాళ్ళకి, అల్లుళ్లకీ, మనవళ్లకి ఆవకాయన్నా, దానితోపాటొచ్చే రకరకాల పచ్చళ్ళన్నీ కూడా చాలా ఇష్టమండీ). పంపించాక వాళ్లకి అందడం పెద్ద process అన్నమాట.
కానీ U.S.వాళ్లు ఏవన్నా అనండి, చాలా మంచివాళ్ళు కరెక్టుగా మూడు, నాల్గు రోజులలో చేరిపోతాయి. కానీ ఈ న్యూజిలాండ్ కస్టమ్స్ వాళ్ళేమో పరమ దుర్మార్గులండీ! మన పికిల్స్ చేరడం చేరతాయి. కాని వాళ్ళ చేతుల్లో పడ్డాయంటే చాలు. ఇక మనం రామనామ జపం చేయాల్సిందే లేక ఆ క్షణ క్షణంలో సినిమాలో లాగా ‘దేవుడా! దేవుడా!’ అంటూ కూర్చోవాల్సిందే. మొన్నైతే మేము న్యూజిలాండ్ కు పికిల్స్ పంపినపుడు ఓ వారం రోజుల ఎదురు చూపుల అనంతరం మా అమ్మాయి దగ్గరనుండి ఒక ఫన్నీ మెసేజ్ వచ్చింది. అదేంటంటే ‘అభిమన్యు హాజ్ రీచ్ డ్ కురుక్షేత్ర బాటిల్ ఫీల్డ్” అని వచ్చింది. మేము ఫోన్ చేసి అడిగితే అప్పుడు చెప్పింది. కష్టమ్ వాళ్ళమో కురుక్షేత్ర్ యుద్ధభూమి, పద్మవ్యూహంలో చేరిన అభిమన్యుడేమో ఆవకాయ. ఇక వాటిని పరిక్షించేందుకు కస్టమ్స్ అధికారులు మొదలుపెడతారని దాని సారాంశం. అది విని మాకు నవ్వాగలేదు. అసలు మహాభారతంలో, అభిమన్యుడు చనిపోతాడు కదూ. కానీ మా చిన్నమ్మాయి భారతంలో మాత్రం చావడు. ఏదో కొన్ని రోజులు హోరా హోరీ కష్టమ్స్ ఆఫీసర్సతో యుద్ధం చేశాక విజయుడై ఇంటికి చేరతాడన్నమాట.
ఇక ఊరగాయల పార్సెల్ దగ్గర్నుంచి ఊరగాయలన్నీ బయటికి తీసాక వాటిని బాటిల్స్‌లో పెట్టాక వాటిని కూడా ఫోటో తీసి మాకు వాట్సప్ లో పెట్తారన్నమాట. అవి చూసుకని మేము ఆనందంతో తబ్బిబ్బై ఇక డాన్స్ చేయడమే తరువాయి.
మీకు ఇంకో విషయం చెప్పాలి. అదేంటంటే ఈసారి నన్ను అందరూ బెల్లం ఆవకాయ గూర్చి అడగడం, దాని రెసిపీ చెప్పడంతో నేను కూడా బెల్లం ఆవకాయ పెడదామని ఉబలాటపడ్డాను. ఒకరైతే బెల్లం పాకం పట్టాలి వగైరా – వగైరా అని చెప్పారు. ఆ సింగినాదం – జీలక్రర అదేం అక్కర్లేదండీ, మన రెగ్యులర్ ఆవకాయలోనే బెల్లం కలపండి, అదే బెల్లం ఆవకాయ అంటే అంతే ఇంకేం లేదు మరొకరూ చెప్పారు. ఇంకేం, అంతే కదా వెరీసింపుల్ అనుకుంటూ కొంచెం ఆవకాయ జాడిలోంచి విడిగా తీసి అందులో తగినంత మోతాదులో బెల్లం కలిపేసి, బెల్లం ఆవకాయ జిందాబాద్ అనుకుని నన్ను నేనే అభినందించుకున్నాను. తీరా పిల్లలకి పంపేందుకు వాళ్లనడిగితే ‘వామ్మో అదేంటి ఎప్పుడూ వినలేదే. బెల్లం మాగాయ విన్నాంగాని బెల్లం ఆవకాయ గురించి వినలేదు. తినలేదు. అయినా మేము రిస్క్ తీసుకోదల్చుకోలేదు. మా కొద్దంటే మాకొద్దని ఇద్దరూ ముక్తకంఠతో సెలవిచ్చారు. దాంతో నా గుండెల్లో రాయి పడింది. ఇప్పుడేం చేయడం అంత ఆవకాయలో బెల్లం కలిపానే అదంతా ఎవరు తింటారు? ఇంతలో నాకొక బ్రిలియంట్ ఐడియా తట్టింది. అది వినే ముందు తెనాలి రామకృష్ణులవారి కథ తెలుసుండాలి.
ఒకసారి రాయలవారు వారి తల్లిగారి ఆబ్దికమప్పుడు భోక్తలకు ఒక బంగారు మామిడిపండు తలా ఒకటి చొప్పున ఇద్దామనుకున్నారు. కారణం వారి తల్లిగారు చనిపోతూ మామిడిపండు తినాలన్న తన కోరికను వెలిబుచ్చారట. కాని ఆ కోరిక తీరకుండానే కాలం చేశారు. రాయలవారందుకు చాలా వ్యథ చెంది ఆబ్ధికం రోజున తల్లిగారి ఆత్మశాంతి కోసము అందరికీ బంగారు మామిడి పండ్లు దానమిస్తున్నారు. కాని అక్కడ కొంత మోసము జరగనారంభించింది. భోక్తలందరూ పేరాశతో రెండోసారి కూడా తీసుకొనడం మొదలుపెట్టారు. అది గమనించి రామకృష్ణులవారు ఇలాగైతే ఖజానా ఖాళీ అవుతుందని భయపడి వీరికి గుణపాఠం చెప్పాలని ఒక ట్రిక్ చేస్తారు. వెంటనే ఏమని ఎనౌన్స్ చేశారంటే, రామక్రిష్ణులవారి తల్లిగారు చనిపోయే ముందు తనకు వాతలు పెట్టమని కోరుకున్నారట. (బహుశా ఆ రోజుల్లో అదో రకం వైద్యం అయి ఉండవచ్చు). కానీ చూస్తూ చూస్తూ తల్లికి వాతలు పెట్టే బాధాకరమైన పని చేయనంటే చేయనని భీష్మించుకు కూర్చున్నారట. దాంతో ఆవిడ కోరిక తీరకనే పరమపదించారట. కానీ ఎవరూ వాతలు పెట్టించుకోవడానికి ఒప్పుకోరు కనక తన తల్లి కోరిక తీర్చుటకిదే తగిన సందర్బం అని తలచి ఒక బంగారు మామిడి పండుకి ఒక వాత తీసుకోవాల్సిందిగా ఒక నిబంధన పెట్టారు. దాంతో కొంతమంది పెట్టించుకున్నారు. కానీ అందరూ సాహసించలేకపోయారు. దాంతో ఖజానా ఖాళీ అయిపోతుందన్న రామకృష్ణులవారి భయానికి చెక్ పడింది.
సో, ఆ కథ లాగ నేను కూడా మా పిల్లలకి నేను పెట్టిన పికిల్స్ కావాలంటే బెల్లం ఆవకాయ కూడా ఒక్కో కిలో చప్పున తీసుకోవాలని ఒక కండిషన్ పెట్టాను. దాంతో పిల్లలు తప్పనిసరి ఒప్పుకోవల్సి వచ్చంది.
తరువాత ఆ రుచిలేని బెల్లం ఆవకాయ తీసుకున్నారేగాని దాన్నలాగే ఉంచి మిగతావి లాగించడం మొదలెట్టారు. కానీ నేను ఊరుకోక రోజూ బెల్లం ఆవకాయ తిన్నారా? లేదా? అని ఫోన్ లో సతాయించే దాన్ని – అది భరించలేక వారం వారం గెష్ట్లలని భోజనానికి పిల్చి ఆ బెల్లం ఆవకాయ వాళ్లకి వేసి ఖర్చు చేశారు. అప్పట్నుండి ఆ బెల్లం ఆవకాయ బాధితులెవరూ వారింటిపై కన్నెత్తి చూడ్డానికి కూడా సాహసించలేదు. నేను కూడా బెల్లం ఆవకాయ మాట కలలో కూడా తలచడం మానేసాను.
ఇంతకీ నేను స్టార్టింగ్ లో చెప్పినట్లు నాకు ఏం బిరుదునిస్తున్నారు? చెప్పరూ।।
4 comments
चला बावनदंडी
బెల్లం ఆవకాయ తయారు చెయ్యడం నేర్చుకుని దానికి హాస్య రసం జోడించి కథ రూపంలో అందించడం
ఇంకా బాగుంది super ushaa gaaru
Story haasyamgaa baagundi.rachayitriki abhinandanalu.
Thanks for the hilarious story – enjoyed your writing style too 👌