ఈ భూమి పుట్టినప్పుడే నా దేశం పుట్టింది
నేల నాగరికత నేర్చినప్పుడే ఇక్కడ నాగరికత విలసిల్లింది
ప్రపంచ పటంలో చిన్న భాగమే అయినా
అధిక మానవ వనరుల్ని అందిస్తున్న దేశం
రణక్షేత్రం నడుమ గీతోపదేశం అందించిన దేశం
మూడు సముద్రాల మధ్యనున్న మానవ మహా సముద్రం
కోహినూర్ వజ్రంతో బాటు కోట్లాది అపురూప వ్యక్తులకు జన్మనిచ్చిన రత్నగర్భ
వేదాలను అందించడమే కాదు వేదాంతాన్ని తెలియజేసిన నేల
సున్నాను కనిపెట్టి శూన్యంలో అనంతం ఉందని చాటి చెప్పిన భూమి
తిరిగొచ్చే దారి తెలియక పోయినా పద్మవ్యూహం లోకి
చొచ్చుకు పోయే యోధులు పుట్టిన గడ్డ
హంసను బాణంతో బాధించిన దేవదత్తుడి పేరు చరిత్రలో మాసిపోయినా
లేపనం పూసి ఊరడించిన సిద్దార్ధుణ్ణి మరవక బుద్ధుణ్ణి చేసి నెత్తికెత్తుకున్న నేల
గాయం చేసిన వాడిని మరిచినా గాయం నయం చేసిన వాడిని మరువని ఔదార్యం కల జాతి
హంసలు నడయాడిన అవని
పరమ హంసల బోధనల పావని
ప్రపంచమంతా చెట్ల బెరళ్లు కట్టుకుని తిరిగినప్పుడు చీనాంబరాలు ధరించిన ధరిత్రి
సింధు నదీ లోయల్లో చిందులేసిన నాగరికతను సృజించిన భూమాత
సప్త సాగరాలకు సప్తస్వరాలను బహూకరించిన భరత మాత
కంప్యూటర్లు పుట్టక మునుపే మానవ కంప్యూటర్ ను కన్న మాతృ మూర్తి
జీలం నది సాక్షిగా కట్టించుకున్న ఒక్క దారపు పోగుకు
కట్టుబడిన పురుషోత్తముల సౌభ్రాతృత్వం
నరేంద్రుడే వివేకానందుడై చిన్న ఊరి నుండి చికాగో దాకా పాకిన విజ్ఞానం
మొక్కల్నీ కుక్కల్నీ పెంచడమే కాదు మొక్కుకునే ప్రజలున్న దేశం
నీళ్లకూ పూలకూ హారతులిచ్చే ధరణి
పుట్టలనూ గుట్టలనూ పూజించే పుడమి
ఎలుకలకూ , ఏనుగులకూ ఒకేలా దండం పెట్టే దేశం
ఆహారమడిగిన డేగకు సైతం తొడను కోసి ఇచ్చిన శిబి దాతృత్వం
పర్యావరణ స్పృహ లేనప్పుడే ‘వృక్షో రక్షతి రక్షిత ‘అని చాటిన ధరిత్రి
జీవ వైవిధ్య రక్షణ మాట తెలియనప్పుడే పాములకు సైతం పాలు పోసి పూజించిన భూమి
నల్లని రాళ్ళనూ , నల్లని దేవుళ్లనూ ఆరాధించే వర్ణ వివక్షత లేని వసుధ
యోగాతో ఆరోగ్యాన్నీ గీతతో వైరాగ్యాన్నీ గీతాంజలితో సాహిత్యాన్నీ
బహుమతి నిచ్చిన మహీమండలం
చుట్టుపక్కల మానవబాంబులు పుట్టుకొస్తున్న వేళ
మానవ ప్రేమే పరమావధిగా భావించిన నేల
నెత్తురోడుతున్న దేశాల దేహాలకు
శాంతి లేపనాన్ని పూసిన శ్వేత కపోతం
బక్క చిక్కిన దేహంతో బానిసత్వపు సంకెళ్లను తెంపిన
కారుణ్య మూర్తిని కన్న తల్లి
జగతికి శాంతి కాంతిని ప్రసరించి అహింసా మంత్రాన్ని బోధించిన అమృత మూర్తి నా భరత మాత !!
ఏడు దశాబ్దాల క్రితమైనా .. ఇప్పుడైనా నా దేశ పతాకానికి మూడే రంగులు
సత్యం .. శాంతి … అహింస ..
నా దేశ జెండా మధ్యలో ఎప్పటికీ అశోక చక్రమే !
నా జాతి లక్ష్యం శోకమే లేని సరి కొత్త ప్రపంచమే !!
శోకం లేని లోకం …
previous post