అదేంటీ పోలీసు కస్టడీలో వినాయకుడా………??? అని ఆశ్చర్యపోతున్నారు కదూ! ఇది కలా నిజమా లేక నేనేమైనా జోకు జోకాననుకుంటున్నారా? అలా అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్లే! ఇదస్సలు జోకు కాదు, వైష్ణవ మాయా కాదు.ఇది అక్షరాలా నూటికి నూరుపాళ్ళు నిజం. నమ్మలేరా…..?
అయితే మనస్సు ఉగ్గపట్టుకుని , నిర్భయంగా ముందుకు సాగి పొండి. చదవండి చివరిదాక!!!
అసలయినా ప్రపంచమంతా ఈ మాయదారి కరోనా…చాపక్రింద నీరులా ప్రాకి , యావత్ ప్రపంచాన్నీ ఓ కుదుపు కుదిపేస్తుంటే, కాలచక్రం మాత్రం తన పని తాను చేసుకుపోతోంది. ఫలితంగా రావలసిన పండగలన్నీ వస్తున్నాయి పోతున్నాయి. మనం అనుకుంటున్నట్లుగానే ఈ సారి వినాయక చవితి కూడ వచ్చేసింది.
ఇక చూసుకోండి నా సామిరంగా, దేశంలో అందరిలోనూ ఒకటే కలకలం……ఈ సందర్భంలో వినాయకుడి విగ్రహాలు తయారు చేసేసి , పెద్ద ఎత్తున ఆర్భాటంగా పండగ చేసుకోవాలా వద్దా అన్న మీమాంస అందరిలోనూ తలెత్తింది.
ప్రభుత్వాలు మాత్రం, ఈ కరోనా కారణంగా , మునుపటిలాగా పండుగ ఉత్సవాలుగా చేయవద్దనీ, ఎక్కడైనా సరే జనం గుంపులు గుంపులుగా పోగయే వ్యవహారాలేవీ పెట్టుకోవద్దని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాయి. అందరూ పూజలు ఇంటివరకే పరిమితం చేయాలని హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది.
కానీ మన ఈ పామర జనం ఊరుకుంటారా? అసలు ఎవరి మాటైనా వినే అలవాటు మన ప్రజలకు ఉంటే , మన దేశం ఇలా ఎందుకుంటుంది? ఎప్పుడో బాగు పడి ఉండేది కదా!!!
అది సరే ముందు విషయం చెప్పండి……ఉపోద్ఘాతాలు వద్దు అంటారా…..? అదే అక్కడికే వస్తున్నా…….కాస్త ఓపిక పట్టండి మరి….!
అనగనగా ఒక మహానగరంలోని ఒకానొక గేటెడ్ కమ్యూనిటీ అయిన సొసైటీ. అందులో యదార్థంగా జరిగిన కథ ఇది. ఇంకా ఈ జాగేలనో అని మీలో మీరు హమ్ చేస్తున్నారా? ఇదిగో చెప్తున్నా…..చెప్పేస్తున్నా……కాచుకోండి! ఆ సొసైటీలో రీసెంట్గా మ్యానేజింగ్ కమిటీ ఎన్నికలు జరిగాయండీ!
అందులో గెలిచిన వాళ్ళకు , ఉన్నమాట చెప్పొద్దూ…..ఈ సొసైటీని పరిపాలించడంలో అస్సలు అనుభవం లేదంటే నమ్మండీ! ఆ గెలుపుకూడ చాలా కుట్రలు పన్ని సంపాదించిందే కానీ, న్యాయబద్ధమైన గెలుపు కాదు.
విపక్షాలను దెబ్బకొట్టి తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలన్న దురుద్దేశంతో చేసిందే కానీ మరోటి కాదు. ఆ సంగతి అలా ప్రక్కన పెట్టి మనం అసలు కథకి వద్దాము.
ఈ గెలిచిన కమిటీ అధికారంలోకి వచ్చి రెండు నెలలుకూడకాలేదు వినాయక చవితి రానే వచ్చింది. ఇక చూసుకోండీ వీళ్ళ ఉత్సాహానికి అంతులేదు. ఓ ప్రక్క పూర్వంలానే వినాయకుడ్ని ప్రతిష్ఠించాలి….అంటూ ఈ పాత మేనేజ్మెంట్ పుణ్యమా అని రెండేళ్ళనుంచీ ఒక పండగాలేదు….పబ్బమూ లేదు….ఎందుకని అడిగితే ఈ కరోనా ఉన్నంతవరకూ, ఈ పండుగలూ, గిండుగలూ జాన్తా నై అని చెప్తారా…..ఇప్పుడు చూడండి మా తఢాకా …….అని కొత్త కమిటీ వాళ్ళందరూ ఒకటై సొసైటీలో ఉన్న రెసిడెంట్స్ ఎవరినీ సంప్రదించకుండానే వాళ్ళకి వాళ్ళే నిర్ణయం తీసేసుకుని, అందుకు కావలసిన ఏర్పాట్లు చేయసాగారు.
ఇదంతా గమనిస్తున్న ఫ్లాట్ ఓనర్స్ మండిపడి ఎవరిని అడిగి చేస్తున్నారు ఈ ఏర్పాట్లన్నీ అని కమిటీ వాళ్ళని నిలదీసారు! అసలే కరోనా భయంతో ఓప్రక్క వణికి చస్తుంటే మళ్ళీ ఇదో ఆపద తెచ్చి పెట్టారేంటని ఒక్కసారిగా విరుచుకు పడ్డారు. కానీ మొండివాడు రాజుకన్నా బలవంతుడన్నట్లు , వీళ్ళు ఇలా గర్జిస్తునే ఉన్నారు…..కమిటీ మాత్రం మేం అన్ని జాగ్రత్తలూ తీసుకుంటాం, కంగారు పడకండి అంటూ, గణేసుని కూడ తెచ్చి ప్రతిష్ఠించేసారు. ఇదంతా గమనిస్తున్న ప్రతి పక్షాలు గట్టిగా హెచ్చరించాయి. ఏమైనా జరగకూడనిది జరిగితే మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని అల్టిమేటమ్ ఇచ్చారు.
దాంతో భయపడ్డ ఈ కొత్త కమిటీ వాళ్ళు వినాయకుడి దగ్గరకు ఎవరూ వెళ్ళకుండా బ్యారికేడ్స్ కట్టేసి, పిల్లలెవరూకూడ దగ్గరకు వెళ్ళకుండా ఇద్దరు సిక్యూరిటీ వాళ్ళని కాపలా ఉంచి, ఎవరూ అక్కడ గుమి గూడకుండా చూస్తూ ఉండమని ఆదేశాలు జారీ చేసారు. అది కాక ఉదయం సాయంత్రం యధావిధిగా పూజ కావించి , పూజారి వెళ్ళి పోవడానికి కుదుర్చుకున్నారు. అంతే కాదు పోలీస్ పెట్రోలింగ్ కూడ అరేంజ్ చేసారు.
ఇంతకీ మన గణనాధుడు మాత్రం, భక్తులులేక గిజ గిజలాడుతున్నట్లుగా అనిపించింది.భక్తులతో కళకళలాడే మంటపాలలో ప్రతిష్ఠించబడి , రోజూ నైవేద్యాలూ ప్రసాదాలతో , మరెన్నో సాంస్కృతిక కార్యకలాపాలతో అందరినీ అలరించాల్సిన గణపతి బిక్కు బిక్కుమంటూ గడపసాగాడు పోలీసు కస్టడీలో…….! అది చూసిన ఫ్లాట్స్లో నివసించే జనాలకు చాలా బాధ, జాలీ రెండు కలిగాయి.ఇక ఆ వినాయకుడ్ని దేవుడే కాపాడుగాక అనుకుని చేసేదేమీలేక పాపం గణేశుడు అని మనస్సులో అనుకుంటూ మౌనంగా ఉండి పోయారు.అయినా దేవతలకే తప్పటంలేదు కష్టాలు మరి మానవమాత్రులమైన మనమెంత అని అనిపించడం లేదూ ఈ కథ చదివాక!!!
అంకితం
————-
అన్ని విఘ్నాలనూ తొలగించే విఘ్నేశ్వరుడికి ఈ చిట్టి కథ అంకితం.
మాధవ పెద్ది ఉష