మబ్బుల్లోంచి నేలకు రాలితే వాననుకున్నా
కొండల్లోంచి చెంగున దూకితే జలపాతమనుకున్నా
గులకరాళ్లపై గుసగుసలాడితే వాగనీ
కొండరాళ్లపై పరవళ్ళు తొక్కితే సెలయేరనీ
పేర్లేవేవో పెట్టుకున్నా
సైకత సీమల్ని సవరిస్తూ
పచ్చికబయళ్లని పలకరిస్తూ పరుగులెత్తి
చెలికత్తెల్ని దరికి చేర్చుకుంటూ పొంగులెత్తి
నిండుగర్భిణిలా నెమ్మదించి
తరళ గంభీర ప్రవాహమైనపుడు
‘అది నది కదా’ అనుకున్నా
అంబరాన్నంటాలని ఎగసెగసి పడితే
ఆ సంబరాన్ని చూసీ …
బడబాగ్ని కీలల్ని గర్భంలో దాచి కల్లోలపడితే
ఆ సంక్షోభాన్ని గమనించీ …
ఆ అనంత చైతన్యాన్నే సాగరమంటారని తెలుసుకున్నా
చలికి హిమమై కురిస్తే నీహారమనుకున్నా
వేడికి వ్యాకోచించి నింగికెగస్తే బాష్పమనుకున్నా
భిన్నరూపాల్లో కనిపిస్తూ కరుణ కురిపించే
ఆ జీవన దాతని-
ఒకే అణువెత్తిన అనేక అవతారాలుగా
అర్ధం చేసుకోలేకపోయా
తిరస్కరించినా వెంటపడుతూ
తృణీకరించినా తీర్ధమందిస్తూ,
యుగయుగాలుగా నిర్లక్ష్యం చేసినా
ఆదరించి దాహార్తిని తీరుస్తూ
నా చుట్టూ తిరుగుతుంటే….
అమ్మని కసురుకునే ఆకతాయి బిడ్డనై అలక్ష్యం చేశా
సీతమ్మలా భూమి లోలోపలకీ,
యోగమాయలా ఆకాశంలో పైపైకీ
అందకుండా వెళ్లిపోతుంటే
ఇపుడు తెలుస్తోంది….
ఆమె లేకుంటే నాకు మనుగడే లేదని!