Home కవితలు (సం) దేశం

(సం) దేశం

by Raprolu Sudarshan

అమ్మా భారతీ! మాయమ్మా భారతీ॥
విస్మరించక స్మరిస్తుంది నిన్ను ఈ నేల
అమృత మహోత్సవ వేళ

భారత్‌, పరిసర ప్రాంతాలు ఏక దేహంగా
ఖండ లక్షణాలతో ఉపఖండ పరిమాణమై
అనాదిగా మానవావతరణ పరిణామాలతో
ద్రావిడ, ఆర్య జాత్యాదులను నీ అమూల్య
గర్భాన ధరించి తరించి, తరింపజేస్తున్నవ్‌

జన పదాలుగా, మహా జనపదాలుగా,
రాజ్యాలు వీరభోజ్యాలుగా విస్తరిస్తూ
వేదాల పురాణాదుల పురుడుపోసుకున్నవ్‌

నాలుగు వర్ణాల హైందవ వృక్షరాజానివైనవ్‌
హింసను ద్వేషిస్తూ, అహింసను ఆరాధించే
జైన, బౌద్ధ మతాది నదీపాయల పారించినవ్‌
శైవ, వైష్ణవాల పరస్పర దాడుల భరించినవ్‌

ముస్లింల, ఆంగ్లేయాదుల రాజ్యంగా మారి
కబీర్‌దాస్‌, వేమనాదుల భావ చైతన్యంతో
ఆర్యసాజ్‌, బ్రహ్మ సమాజాదుల వెలుగుల్లో
స్వాతంత్య్ర ఆకాంక్ష పుష్పాలు పూయించినవ్‌

ఎందరో సర్వమూ ఫణంగా సమర్పించి
ఇంకెందరో ప్రాణాల్ని సైతం అర్పించి
దేశానికి స్వాతంత్య్రాన్ని సాధించి
భిన్న విభిన్న జాతుల మతాల పుష్పగుచ్ఛ
లౌకిక రాజ్యంగా మార్చిన దేశభక్తుల దేశాన
డెబ్భై ఐదు వసంతాలుగా స్వేచ్ఛ వికసిస్తూ
మత సహనానికి మారు పేరైన తరుణాన
మౌఢ్య విషయ విషాల విశాల విస్తరణతో
మానవత్వానికే ప్రాధాన్యమిచ్చే వారు
దేశద్రోహులు, సంఘ వ్యతిరేకులుగా చిత్రిత,
చిత్రహింసల గమనాన్ని గమనిస్తున్నవ్‌

దేశమే దేహం, దేహమే దేశంగా పరిగణిస్తూ
ద్వేషాన్ని విద్వేషాన్ని ప్రదర్శించక
దేహాన ఏ భాగాలు నిమ్నోన్నతలు కానట్లే
దేశాన ఏ వ్యక్తులూ నీచోన్నతులు కారనే స్ఫురణ స్ఫూర్తితో
పర్యావరణాన సమశీతోష్ణం వాంఛనీయమైనట్లే
సర్వ మానవుల పట్ల సమభావనే చాటుతూ
మమ్మల్ని మేమే సంస్కరించుకోవాలనే
సందేశాన్ని దేశం ఆదేశంగా
అమృత మహోత్సవాన అందిస్తున్నవ్‌
అమ్మా భారతీ! మాయమ్మా భారతీ!!

You may also like

Leave a Comment