కాస్సేపు అక్షరాలు
ఆరుబయట ఆరేసిన వెలుతురు మైదానంలో
పచ్చిక వాస్తవాల ఊహలు నెమరువేస్తూ
రంగులను పలవరిస్తూ
నదినీటి తాకిడిలో గులకరాళ్లగలగలై
నిశ్శ్బ్దంగానేనినదిస్తున్నవేళ ….
యావత్ ప్రపంచ సౌందర్య స్వేచ్చకు సంకెళ్లు వేస్తూ
మూడో పాదంలా మొలిచిన విషక్రిమి
కనిపించని కత్తులూ కరవాలాలూపట్టుకు
మృత్యుహేల సాగిస్తున్న క్షణాన …
గోరువెచ్చనిప్రేమప్రవాహాన స్నిగ్ధ వలయాలుగా
గడిచిన యుగాల మధ్య
కంట్లోనలకలుగా కలతలు రేపిన చారిత్రిక ఘట్టాలు
ఒకదాని వెనక ఒకటి చేతులు కట్టుకుని
శిలా విగ్రహాలై ఎదుట క్షణం మెరిసి
మురిసిసమసి పోయిన మరకలు
వెన్నుతట్టి ధైర్యం ఉగ్గుపాలు తాగించినట్టు
నిజమే
ఎన్ని తాకిళ్ళకుఎదురునిలిచి
స్థిరపడిన జాతి నాది!
పరిసరాలు చిలికి చిలికిపైకెగసిన గరళాలు
కుత్తుక నడుమ బిగించి కొనసాగే మనుగడ కదా మనది
ఆశల ఎదురుచూపులుఅద్దలుగాతగిలించుకు
ఓపిక మెత్తని పట్టు తువ్వాళ్ళ మధ్య
జీవితాన్ని అద్దుకుంటూ
వెనకెనకే అనుసరిస్తూ
నీడల సందుల మధ్య దోబూచులాడే
బూచి నేస్తాల చేతులకందకుండా
అమృత భాండానికి సాగించే అన్వేషణే కదా తుది గమ్యం
పుట్టిన క్షణం మొదలు రేపటి జాతికి
బాట చదును చేసే పరిశ్రమే కదా ఉనికి
పదండి ఒంటిగా కాదు కదిలి సాగాలి
పదికాలాల మనిషి చరిత్ర నిలిపేందుకు
పదండి ముందుకు.