ఒక మహత్తరమైన యాత్రకు వెళ్ళండి!
……..
మందిరాలేవీ కనబడని ఆ సుందర క్షేత్రంలో
కొందరు మహాత్ములు మసలాడిన తేజస్సు స్పృశిస్తుంది.
సమున్నత మంచుశిఖరాల శ్వేత మార్గంలో
వారి పాదముద్రల అలికిడి వినవస్తుంది!
కన్నవారిని,కళత్రాన్ని,కంటిపాపల్ని..
ఇంటి ఆకాశంలో ఒంటరి చుక్కలుగా పొదిగి
జాతి కంటకాల్ని మాపేందుకు వారక్కడ ‘విధి’గా సంచరిస్తారు.
…….
మంచు బట్టలు ఒంటికి చుట్టుకుని…
వాస్తవాధీన రేఖ వెంట
సమర సిద్ధులై యుద్ధవిమానాల మీద కదలాడుతున్న
కార్యశూరులు కొందరా రణస్థలిలో తటస్థిస్తారు.
నిర్జన ప్రాంతాల నెత్తురు కొలనుల్లో
వికసిత పద్మాలై మీ కంటబడినపుడు
ఆ మహామూర్తుల పాదధూళిని నుదుట ధరించండి.
అది మన దేశ సౌభాగ్య సూచికగా తెలుసుకోండి!
…….
దేహాల నుండి చిప్పిల్లుతున్న నెత్తుటి ధారలు
మనల్ని రక్షించేందుకు వారు గీచిన రక్షారేఖలుగా గుర్తెరగండి.
కంటకాల్ని.. కంచెదాటి లోనికి రానివ్వని కరుణా మూర్తులై
ఆయుధ దారులైన కొందరు దేవుళ్ళు నిత్యమూ
పొద్దు పొలిమేరలో పహారా కాస్తుంటారు.
యధాలాపంగా వారు ఎదురైనప్పుడు
ఎంత మాత్రమూ ఉదాసీనత ప్రదర్శించక
మండుతున్న వారి గుండె గాయాలపై
సమస్త ప్రేమతత్వాన్నీ ప్రోదిచేసిన ఆత్మీయ వాక్యాన్ని
లేపనంగా పూసి అది జాతి కానుకగా నివేదించండి.
……..
మానవరూపంలో మసలాడుతుంటారు కదా
చెమ్మగిల్లిన కంటి భాష వారి గుండెలోతుల్ని స్పృశించగలదు.
నిశ్చింతగా నిద్రిస్తున్న సమస్త జాతి మనోనిబ్బరమూ
వారున్నారన్న నమ్మకమేనని చెప్పి
వారి తలపుల్ని పాదుకుల్లా తలకెత్తుకుని మరలిరండి.