వాడు బంతి వెంట పరుగెడుతాడు
వాడి పసి పాదాలను ముద్దాడడానికి
బంతి వాడి వెంట పరిగెడుతుంది
పరిగెడుతూ పరిగెడుతూ
దబ్బున పడిపోతాడు
తడియారని దుఃఖాన్ని మోస్తున్న పచ్చిక
వాడిని అల్లుకుని సేద తీరుతుంది
వాడూ, సూర్యుడు
కాసేపు దాగుడుమూతలు ఆడుకుంటారు
వెండి మేఘం వెనుక నక్కి ఒకరూ
చెట్టుచాటు దాగి ఒకరూ
ఒకరికొకరు కనబడక కలవరపడ్తారు
అలసిపోయిన వాడి నుదుటిపై
సూర్యుడు చెమట ముద్దై మెరుస్తాడు
లోపల ఊపిరాడక
మైదానంలోకి వచ్చిన గాలి
వాడి కేరింతలకు పులకరించి
చల్లగా ఒళ్ళు విరుచుకుంటుంది
వాడి ఊపిరి విసనకర్రలతో
ఆరిపోతున్న జీవితాన్ని వెచ్చబెట్టుకుంటుంది
చెదిరిన వాడి జుట్టులోంచి
శంకరాభరణ రాగం ఆలపిస్తుంది
అదిగో
ఆ గేటు బయట
వాడి కోసం
జీవితం వలలుపన్ని ఎదురుచూస్తోంది
రేపు వచ్చినప్పుడు
జీవితాన్ని లొంగదీసుకునేందుకు
ఈ పచ్చికతో తాడును పేనడం నేర్పి పంపాలి.