పూలతోటలెన్నో ఉంటయి.పూలెన్నో పూస్తయి.అందులో వర్ధిల్లేవి ఎన్ని.పరిమళాలు వెదజల్లేవి ఎన్ని.నందివర్ధనం కనబడడం అరుదు,అందునా నెలనెలా నెలవంకలా కనబడడం ఆశ్చర్యం,అద్భుతం.
వివేకవంతులైన వివేక సర్వీస్ సొసైటీ ,అప్పాజోస్యుల ఛారిటబుల్ ట్రస్ట్ వారి సంయుక్త నిర్వహణలో నిర్వహించిన ‘ నెలా నెలా నందివర్ధనం ‘ సభా కార్యక్రమములో ఈ రోజు 84 వ నందివర్ధనము గా తానూ ఒక సుగంధ ద్రవ్యమైన ఒక విశిష్ట వ్యక్తి, ,తెలుగు చదువును,తెలుగు రాతను చరిత్ర కావ్యంగా మలచిన శ్రీ కొమర్రాజు వెంకట లక్ష్మణరావు గారి చరిత్రను శోధించి సాధించి సభలో సంధించిన ప్రముఖ రచయిత,సంపాదకురాలు డా : కొండపల్లి నీహారిణి గారికి అభినందనలు.
ఒకరి చరిత్ర గురించి ఒక నిండు సభలో మీరు వచ్చి చెప్పాలన్న సాహిత్యాభిమానుల కోరికను కాదనలేక వందల కిలోమీటర్ల దూరం పయనించడానికి సిద్ధమైన నీహారిణి గారి వెంబడి నేను , నా భార్య జ్యోతి రథానికి జోడు గుఱ్ఱాల లాగా హైద్రాబాదు అల్మాస్ గూడా శ్రీ శ్రీ హోమ్స్ లోని శ్రీ కొండపల్లి శేషగిరిరావు ఆర్ట్ గ్యాలరీ నుండి పొద్దున నాలుగు గంటలకు బాపట్ల కు బయలుదేరినం.యుద్ధం చేసేది ఎంత వీరుడైనా రధ సారధి సమయస్ఫూర్తి కలవాడు కాకపోతే చాలా కష్టం.మా రథ సారధి డ్రయివర్ ప్రభాకర్ అనుభవం ,అతని కవితా పిపాస తోడుగా బయలుదేరి బంకులో కారుకు కడుపునిండా మేత తినిపించుకున్నాం . సూర్యాపేట దగ్గరలో గల Hotel 7 లో ఇడ్లీ వడ తిని చాయ తాగి బాపట్ల కు బయలుదేరినం.నిజంగా Hotel 7 అదొక Heaven.చాలా శుభ్రంగా వున్నది.అక్కడ సినిమా నటులు కూడా ఆగి తిని పోతరు అని విన్నది నిజమేననడానికి మా ముందు Table దగ్గర కూర్చుని టిఫిన్ చేసిన సినీ నటుడు రాజా రవీంద్ర గారు నిజం చేసినరు.ఆయనను చూడడం కొత్త అనుభూతిని నింపింది.
Hotel 7 దగ్గర సెలవు తీసుకొని విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకోవడానికి నిర్ణయించుకున్నాం .దొరికిన ఆ మాత్రం అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి మేము సిద్ధమై దర్శనం గావించుకుని , దగ్గరలో గల మంగళగిరి పానకాల స్వామిని చూసి పానకం ఆయనకు పోసి మేము తాగి అధ్భుతమైన గోపురం చూసి అమరావతి చేరుకున్నం.
అమరావతిలో అమరలింగేశ్వరుని దర్శించి , మౌనముద్ర లో కూర్చుని నిలువెత్తు ఆదర్శంగా కనిపించిన బుధ్ధుని చూసి అక్కడ ఆర్య వైశ్య హోటల్లో ఒనగాయ ( చింతకాయ ) పచ్చడి తో కూడిన భోజనం చేసి బాపట్లకు బండి కట్టినం.అక్కడ మేము బసచేయడానికి Kavuri Grand లో రూము ఏర్పాటు చేసిండ్రు. ‘ కావూరి వారి సత్రం ‘ (Lodge ) చాలా నీట్ గా వుంది.అక్కడకు మేము చేరుకునేసరికి సభా నిర్వాహకులలో ఒకరైన సాహిత్యాభిమాని శీలం శ్రీనివాస్ గారు సభా సమన్వయకర్త గా సాదర స్వాగతం పలికినరు.
అక్కడ ఒక గంట రెస్ట్ తీసుకుని చాయ తాగి బాపట్ల దగ్గరలో గల ఒక వృద్ధాశ్రమములో నిర్వహించే ‘ నెలనెలా నందివర్ధనం ‘ మినీ సభకు వెదుళ్ళపల్లి మీదుగా శ్రీనివాస్ గారి వెంట పోయి సాయంత్రం 6 గంటలకు సభా ప్రాంగణం చేరుకున్నం. ప్రముఖ సాహితీవేత్త అప్పాజోస్యుల సత్యనారాయణ గారు ఎంతో
ఆత్మీయంగా పలకరించారు. అక్కడ నిర్వాహకులు అందించిన చీరాల స్పెషల్ బాదుషా , వేడి వేడి చిన్న సమూసాలు, నెయ్యి వేసిన ఇడ్లీ తిన్నాం.తర్వాత వేడి వేడి టీ తాగి సభికులకు కేటాయంచిన కుర్చీలలో కూర్చున్నం.
సభ ప్రారంభమైంది. ఈ సంస్థ వారు నిర్వహించే వేదిక పైన కేవలం ఆ రోజు ముఖ్యుల గురించే మాట్లాడే వక్త ఒక్కరే కూర్చోవడం జరుగుతుంది.సభలో కొమర్రాజు వెంకట లక్ష్మణరావు గారి గురించి డా : కొండపల్లి నీహారిణి గారు ఇచ్చిన ఉపన్యాసం ఏ ఆయాసము లేకుండా అందరు హాయిగా వినడం జరిగింది. లక్ష్మణరావు గారు తెలుగు భాషా వ్యాప్తికి మరియు ఇతర భాషల కొరకు చేసిన కృషిని సోదాహరణంగా వివరించిన తీరు సభికులను ఆకట్టుకుంది.
చప్పట్లతో అభినందనలు తెలిపారు.
సభ ముగియగానే అందరితో మాట్లాడి, వారు ఇచ్చిన గ్రంథాలను, పుస్తకాలనూ తీసుకొని , సెలవు తీసుకుని బయలుదేరాం.
బాపట్ల లోని ‘ బొమ్మరిల్లు ‘ రెస్టారెంట్ కు పోయి పులుకాలు పన్నీరు కూర్మాతో తిని మాకై కేటాయించిన లాడ్జ్ లో రెస్ట్ తీసుకున్నం.
పొద్దున్నే లేసి దగ్గరలో బీచ్ వున్నది చూద్దాం అని ప్రభాకర్ చెప్పకపోతె ‘ సూర్యలంక ‘ బీచ్ చూసే అదృష్టం కోల్పోతుమనుకుంటా.సముద్రపు అలల అల్లరిని తనివితీరా చూసి ఒక అరగంట దూరంలో వున్న ‘ జిల్లెలమూడి ‘ కి బయలుదేరినం.జిల్లెలమూడి అమ్మ అంటే ఓ కాలాన ఒక వెలుగు వెలిగింది.మా చిన్నప్పుడు మా అమ్మ తోని అక్కడకు పోయినమని మా చిన్నక్కయ్య ( నీహారిణి ) చెప్పింది. జిల్లెల్లమూడి అమ్మ ఇప్పుడు లేకున్నా అక్కడ ఆమె ఆనవాళ్లు చెదిరిపోలేదు. ఇప్పటికి అక్కడ సేవా కార్యక్రమాలు,భజనలు కొనసాగుతూనే వున్నాయి.
అక్కడి నుండి పెదనందిపాడు మీదుగా చిలకలూరిపేటకు చేరినం.అక్కడ టిఫిన్ , టీ కానిచ్చి పిడుగురాళ్ళ , దామరచెర్ల దాటి మిర్యాలగూడ దగ్గరికి వచ్చేసరికి నేను కొన్నేళ్లు జాబ్ చేసిన ఆఫీసు యజమానులు మా Chairman Sir , MD Sir ఊరు గదా అని ఒక్కసారి మనసు పులకించి నా సంతోషాన్ని కారులో వున్న వారితో పంచుకున్న.మధ్యలో ‘ తిప్పర్తి ‘ తగిలింది.మా చిన్నప్పుడు వరంగల్ నుండి వచ్చి అక్కడ దిగి ఎడ్లబంఢిలో మా మేనమామల ఊరు గోపాలపురం చేరేవారం. ఆపాతమధురాల్లాంటి ఆ పాత ముచ్చట్లు ఎన్నో పంచుకున్నాం. ఇక ముందుకు కదిలి నార్కట్ పల్లిలో ‘ వివేరా ‘ హోటల్ దగ్గర ఆగి టీ తాగి ‘ చకినాలు ‘ కొనుక్కొని హైద్రాబాద్ కు చేరినం…