Imitation బహుశా తెలుగులో దీనర్ధం అనుకరణ అనుకుంటా. దేశాలు మారినా సంస్కృతి మారదు. పిల్లలు అల్లరి చేస్తుంటే రకరకాల Cartoon shows పెట్టి కాసేపు వాళ్ళ అల్లరి నుండి ఉపశమనం పొందడానికి కొత్త Shows వెదుకుటలో భాగంగా ఈ మధ్య TV లో రామాయణం సంబంధించిన Animation Movie పెడితే గత నాలుగు రోజులుగా ఆ Show చూస్తున్న పిలగాడు దానిలో మొత్తం లీనమయి ఇంట్లో రకరకాల యుద్ధవిద్యలు ప్రదర్శిస్తున్నడు. ఇంగ్లీష్ లో ఏవేవో యుద్ధానికి సంబంధించిన మాటలు మాట్లాడుతూ ఇల్లంతా తిరుగుతుంటే ఆ యుద్ధానికి ముందటి కవ్వింపులు అర్ధం కాలేదు గానీ పిలగాడు డైలాగ్ కొట్టే తీరుని బట్టి ఇది తప్పకుండా ఈ Animation Movie ప్రభావమే అని అర్ధమయింది.
ఎనుకటికి బాలమిత్ర , చందమామ పుస్తకాల్లో కవర్ పేజీపై వేసిన విక్రమార్కుని బొమ్మలు , రామాయణ , మహాభారత పాత్రల చిత్రాలు అలాగే వివిధ దేవుళ్ల బొమ్మలు పిల్లలనే గాక పెద్దలను సైతం బాగా ఆకర్షించేవి. లోపలి పేజీల్లో కూడా ఒక్కో కథకు ఒక్కో చిత్రం బహు ముచ్చటగా ఉండేవి. కాగా ఆ రామాయణం షో చూసిన పిలగాడు ఆంజనేయుడు సంజీవనీ పర్వతాన్ని ఎత్తుకొచ్చే సీన్ ను అనుకరణ చేస్తూ ఇంట్లో వున్న బరువైన వస్తువులను పైకి ఎత్తి హావభావాలతో హంగామా చేస్తున్నడు. రామరావణ యుద్ధం దృశ్యాలు, ఒకరిపై ఒకరు వాళ్ళు వేసుకునే వ్యంగ్యాస్త్రాలు, బాణాల ప్రదర్శనలు ముమ్మరంగా నడుస్తున్నయి.
ఇవన్నీ చూస్తుంటే చిన్నప్పుడు బడికి పొయొచ్చినాక స్కూల్లో టీచర్స్ చేసినట్లుగా ఆక్షన్స్ చేయడం , వాళ్ళు స్టూడెంట్స్ ను ప్రశ్నలు అడిగే విధానం , వాళ్ళ ను కట్టె పట్టుకుని కొట్టినట్లు Action చేయడం లాంటివన్నీ గుర్తుకొచ్చినయి. దాదాపు ఈ ఆటలన్నీ అందరూ వాళ్ళ వాళ్ళ చిన్నతనంలో ఆడినవే.
చివరకు ఈ Imitation అనేది ఎక్కడిదాకా పోయిందంటే Jewellery ని కూడా వదల్లేదు…
Chandu Pendyala
Chandu Pendyala
చెందు పెండ్యాల కవి , రచయిత, గాయకుడు, ప్రైవేట్ సంస్థ ఉద్యోగి , సాహిత్యాభిమాని. 9848594290
ఎడ్లబండ్లు ఎనుకకు పట్టినయి
గా సందుల ఏడికెల్లో ఓ పెద్ద కోపు పట్టుకొని ఇమానం ల కెల్లి
ఓ యాబయి మంది దాక దిగిండ్రు. అందరు లైనుబడ నిల్సోని సప్పట్లు కొట్టుకుంట,
శిన్న పొల్లగాల్లను ముద్దు పెట్టుకున్నట్లు ఆ కోపుకు ముద్దు పెట్టుకొని
ఆల్లను కార్లల్ల ఎక్కిచ్చి ఇండ్లల్లకు సాగనంపిర్రు.
తెల్లారి నాలుగు తొవ్వల్ల వున్న శాయ బండికాడికి పోయి పొద్దుగాల పిండిన
అద్దషేరు బర్రెపాలు పోసి పైసలడిగితె కాసేపు ఆగమని కసిరిచ్చుకున్నడు .
అయ్యో గట్ల గంజిలీగను తీసేసినట్లు తీసేత్తానవేందన్నా అని అంటే …..
రేపటి సంది పాలు బంజేయి పక్కన పెద్ద మార్కెటు పడ్డది
వాల్లు నెలకోసారి పైసలియ్యమంటాండ్రు నువ్వేమో ఆగవు ,
దినాం వచ్చి కూకుంటవు అనె!
ఇంతల ఆడ అందరు మబ్బుల మొకాన సూస్తాండ్రు
ఆయనడిగె ….
ఏమన్నా తప్పుడు ఆనలు గిన పడతానయా గింతంత జివాల్లకు
తోపులల్ల నీల్లన్న వస్తయి అని !
ఏ ఊకో ఆనలు లేవు పాడు లేవు పైన మబ్బులల్ల కెల్లి కిందికి ఎవరో వస్తాన్నరట
గందుకోసం చూస్తానం నువు కూడ చూడు అనిరి! .
ఇగ ఆయన రోజు గొడ్లు గాసుకుంట , శేనుకు నీల్లు పెట్టుకుంట
పైన సప్పుడు గాంగనె మబ్బులల్ల జూత్తె ఇమానాలు కనబడుతనే వుండె ,
ఇంట్ల TV డబ్బాలల్ల గవే ముచ్చట్లాయె …
ఇప్పుడు రిచ్చాలేడున్నయి ?అన్ని అంతరిచ్చాలేనాయె !
ఇగ కొత్తగ ఇనుడేంది సూసుడేంది.?
రైలుబండ్ల సప్పుడు ముంగట ఎడ్లబండ్ల సప్పుడు ఎట్లయినా ఇనిపియ్యదు
అది ఎరుకున్న ముచ్చటేనాయె అని శెద్దరు కోసం ఎనుకులాడిండు కూర్పాట్ల పడుదామని….
కాని ఎంతకు నిర్ద పట్టి సత్తలేదట , ఇగెట్లయినా ఇయాల గాకపోతె రేపు ఎవుసం బూములు ,
ఇంటి పక్కపంట పెరట్ల జాగలన్ని ఇమానాలు దిగేటానికి , రైలు టేషన్ లకు ఇచ్చి
ఇగ పరాగతుగ నడింట్ల మోకాల్లు మలుసుకుని కూసునుడేనాయె !
తలపులల్ల దుక్కం ఎవరు కనిపెడ్తరు
కండ్లు కాయలుగాసే మనుసులేడున్నయ్ !
ఎట్లయినా పొల్లగాల్లు అందరు ఏరే దేశాల పట్క పోతనే వున్నరు,
ఈడున్న పొల్లగాల్లేమొ ఏడ వింటర్నేషనల్ బడులున్నయాని…
ఎండ్ల వాల్ల పిల్లల్ని షరీకు చెయ్యాల్నని
ఇశారించేదానికే వున్న టయామ్ అంత అయిపోతాండె !
కాలం గుప్పిటవట్టిన కొండచిలువంటి కోరికలేనాయె!
ఇగ పంటలు లేవు , పెంటలు లేవు
ఇండ్లల్ల గ్యాసు మంటలు , ఇంటి పక్కపంట గుళ్ళల్ల గంటలు…
అయినా ఇగ ఆల్ల ఇంటిపొంటనే ఇమానాలు దిగినాక మబ్బుల మొకాన జూసుడెందుకు ?
ఇగ ఎనుకట శిన్నప్పుడు జాతరలల్ల ఇమానం బొమ్మలు ,
ఎలికాప్టర్లు కొనుక్కొని ఆడుకున్నట్లేనాయె…
గుండె పండు పండిపోతాంటె
గల్మట్ల కూసోని మంచికోసం ఎదురుసూసుడేనాయె…
అని ఓ అమ్మ పిలుపు,బాబూ ఎప్పుడూ ఆటలేనా కాస్త చదువుకోండిరా పరీక్షలు వస్తున్నయిరా అని అదే ఊళ్ళో కిరాయికి వుంటూ ఆ ఊరి ప్రభుత్వ బడిలో పాఠాలు చెప్పే సారు,అమ్మ పిలిచినా రాలేదు ఇంటికి అని కోప్పడే సోదరుడు , ఇంత మంది ఇన్ని తీరులుగ మందలించినా ఆట నుండి అర అడుగు కూడా ముందుకు వేయనివ్వని చిన్నప్పటి ఆటలు మనసును పొరలు పొరలుగా మెలిబెడుతుంటే బాల్యపు బడుద్దాయి చేష్టలు,అల్లరులు,మరి ముఖ్యంగా ఆడిన ఆటలు “అరటాకు లాంటి కాగితంలో ఆరబోయక తప్పదు”.

పక్క పక్కన ఇండ్లు,ఇండ్లను ఆనుకుని గుడిసెలు , అక్కడక్కడ అద్దాల మిద్దెలు అన్నిటిని అనుసంధానం చేస్తూ వాడలు , మధ్య మధ్య సన్నని సందులతో కూడిన పల్లెలు.ఆ పల్లెలో ఇంటికిద్దరు అన్నదమ్ములు ఇంటికిద్దరు అక్కచెల్లెలు.భారము లేని చదువులు,సమయాన్ని లెక్కించని లెక్కలు.
ఇవన్నీ ఆటలకు అనుకూలించే అంశాలు.
“దాగుడు మూతలు దండాకోర్ పిల్లీ ఎలుక భద్రం కోర్ ఎక్కడి దొంగలు అక్కడనే గప్ చుప్ ” అని గోడ చాటుకు పోయి పది లెక్కపెట్టేసరికి దోస్తులంతా తలుపుల చాటుకు,గడ్డివాముల చాటుకు దాచుకుంటే లెక్కపెట్టినతను దొరకబట్టకుంటే వెనుక నుండి పోయి వీపులో కొడితే వాడు మళ్ళా లెక్కబెట్టాలె”.
” చిర్రా గోనె అనే ఆటలో రెండు వైపులా కొచ్చెగా చెక్కిన చిన్న కర్రనే చిర్ర.గోనె అంటే పొడవాటి కర్ర.ముందుగా చిన్న రంధ్రం ( బద్ది ) తవ్వి చిర్రను బద్దికి అడ్డంగా పెట్టి గోనెతో

చిర్రను లేపి కొడితే అది పైకి ఎగరగానే అదే గోనెతో గట్టిగ కొడితే దానిని అవతలి వాడు పట్టుకుంటే కొట్టిన వాడు అవుటయినట్లు”.
” బొంగరం అయితే అది రయ్యిన తిరుగుతూ కాలాన్ని కూడా తిప్పేది.దానితో నేలతో పాటు అరచేతిలో కూడా తిప్పిన అనుభవాలు”
” నీ నేలంత తొక్కి తొక్కి పాడుచేస్త, రాయి రంగన్న , కట్టెలమోపు అనే హుషారైన ఆట”
” వినవే బాలా నా ప్రేమ గోల”
తొక్కుడు బిళ్ళ ఆడా రావే ” అని హాస్య నటుడు రేలంగి హీరోయిన్ తో పాతాళభైరవి సినిమాలో సరదాగా ఆడుతూ పాడే పాటలోని ఆ తొక్కుడు బిళ్ళ ఆటలో చిన్న’ పెంకాసు’ ను నాలికకు అద్దుకుని ఎనిమిది డబ్బాలు గీసి ఆ పెంకాసును అందులో వేసి దానిని కదిలిస్తూ కుంటుతూ ఆడే ఆట “.
” చింత గింజలతో ఆడే ఓనగుంటల ఆట”
” కచ్చకాయల ఆట “
” గోలీలాట లో రంగురంగుల గోలీలు రకరకాల సైజులతో ఎక్కువగా పిల్లలు ఆడే ఆట అది”.
ఇటువంటి ఎన్నో ఆటలు నాడు పిల్లలకు ఎంతో ఉల్లాసాన్ని ఇచ్చేవి.ఖర్చు తక్కువతో తల్లిదండ్రులకు భారం కాకుండా,తోటి సమాజానికి హాని జరుగకుండా ఆడిన ఆటలు నేటి పిల్లలకు కూడా నేర్పితే కొంతైనా ఆరోగ్యకరమైన సమాజాన్ని తయారుచేయగలమేమో…


పూలతోటలెన్నో ఉంటయి.పూలెన్నో పూస్తయి.అందులో వర్ధిల్లేవి ఎన్ని.పరిమళాలు వెదజల్లేవి ఎన్ని.నందివర్ధనం కనబడడం అరుదు,అందునా నెలనెలా నెలవంకలా కనబడడం ఆశ్చర్యం,అద్భుతం.
వివేకవంతులైన వివేక సర్వీస్ సొసైటీ ,అప్పాజోస్యుల ఛారిటబుల్ ట్రస్ట్ వారి సంయుక్త నిర్వహణలో నిర్వహించిన ‘ నెలా నెలా నందివర్ధనం ‘ సభా కార్యక్రమములో ఈ రోజు 84 వ నందివర్ధనము గా తానూ ఒక సుగంధ ద్రవ్యమైన ఒక విశిష్ట వ్యక్తి, ,తెలుగు చదువును,తెలుగు రాతను చరిత్ర కావ్యంగా మలచిన శ్రీ కొమర్రాజు వెంకట లక్ష్మణరావు గారి చరిత్రను శోధించి సాధించి సభలో సంధించిన ప్రముఖ రచయిత,సంపాదకురాలు డా : కొండపల్లి నీహారిణి గారికి అభినందనలు.

ఒకరి చరిత్ర గురించి ఒక నిండు సభలో మీరు వచ్చి చెప్పాలన్న సాహిత్యాభిమానుల కోరికను కాదనలేక వందల కిలోమీటర్ల దూరం పయనించడానికి సిద్ధమైన నీహారిణి గారి వెంబడి నేను , నా భార్య జ్యోతి రథానికి జోడు గుఱ్ఱాల లాగా హైద్రాబాదు అల్మాస్ గూడా శ్రీ శ్రీ హోమ్స్ లోని శ్రీ కొండపల్లి శేషగిరిరావు ఆర్ట్ గ్యాలరీ నుండి పొద్దున నాలుగు గంటలకు బాపట్ల కు బయలుదేరినం.యుద్ధం చేసేది ఎంత వీరుడైనా రధ సారధి సమయస్ఫూర్తి కలవాడు కాకపోతే చాలా కష్టం.మా రథ సారధి డ్రయివర్ ప్రభాకర్ అనుభవం ,అతని కవితా పిపాస తోడుగా బయలుదేరి బంకులో కారుకు కడుపునిండా మేత తినిపించుకున్నాం . సూర్యాపేట దగ్గరలో గల Hotel 7 లో ఇడ్లీ వడ తిని చాయ తాగి బాపట్ల కు బయలుదేరినం.నిజంగా Hotel 7 అదొక Heaven.చాలా శుభ్రంగా వున్నది.అక్కడ సినిమా నటులు కూడా ఆగి తిని పోతరు అని విన్నది నిజమేననడానికి మా ముందు Table దగ్గర కూర్చుని టిఫిన్ చేసిన సినీ నటుడు రాజా రవీంద్ర గారు నిజం చేసినరు.ఆయనను చూడడం కొత్త అనుభూతిని నింపింది.

Hotel 7 దగ్గర సెలవు తీసుకొని విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకోవడానికి నిర్ణయించుకున్నాం .దొరికిన ఆ మాత్రం అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి మేము సిద్ధమై దర్శనం గావించుకుని , దగ్గరలో గల మంగళగిరి పానకాల స్వామిని చూసి పానకం ఆయనకు పోసి మేము తాగి అధ్భుతమైన గోపురం చూసి అమరావతి చేరుకున్నం.
అమరావతిలో అమరలింగేశ్వరుని దర్శించి , మౌనముద్ర లో కూర్చుని నిలువెత్తు ఆదర్శంగా కనిపించిన బుధ్ధుని చూసి అక్కడ ఆర్య వైశ్య హోటల్లో ఒనగాయ ( చింతకాయ ) పచ్చడి తో కూడిన భోజనం చేసి బాపట్లకు బండి కట్టినం.అక్కడ మేము బసచేయడానికి Kavuri Grand లో రూము ఏర్పాటు చేసిండ్రు. ‘ కావూరి వారి సత్రం ‘ (Lodge ) చాలా నీట్ గా వుంది.అక్కడకు మేము చేరుకునేసరికి సభా నిర్వాహకులలో ఒకరైన సాహిత్యాభిమాని శీలం శ్రీనివాస్ గారు సభా సమన్వయకర్త గా సాదర స్వాగతం పలికినరు.
అక్కడ ఒక గంట రెస్ట్ తీసుకుని చాయ తాగి బాపట్ల దగ్గరలో గల ఒక వృద్ధాశ్రమములో నిర్వహించే ‘ నెలనెలా నందివర్ధనం ‘ మినీ సభకు వెదుళ్ళపల్లి మీదుగా శ్రీనివాస్ గారి వెంట పోయి సాయంత్రం 6 గంటలకు సభా ప్రాంగణం చేరుకున్నం. ప్రముఖ సాహితీవేత్త అప్పాజోస్యుల సత్యనారాయణ గారు ఎంతో

ఆత్మీయంగా పలకరించారు. అక్కడ నిర్వాహకులు అందించిన చీరాల స్పెషల్ బాదుషా , వేడి వేడి చిన్న సమూసాలు, నెయ్యి వేసిన ఇడ్లీ తిన్నాం.తర్వాత వేడి వేడి టీ తాగి సభికులకు కేటాయంచిన కుర్చీలలో కూర్చున్నం.
సభ ప్రారంభమైంది. ఈ సంస్థ వారు నిర్వహించే వేదిక పైన కేవలం ఆ రోజు ముఖ్యుల గురించే మాట్లాడే వక్త ఒక్కరే కూర్చోవడం జరుగుతుంది.సభలో కొమర్రాజు వెంకట లక్ష్మణరావు గారి గురించి డా : కొండపల్లి నీహారిణి గారు ఇచ్చిన ఉపన్యాసం ఏ ఆయాసము లేకుండా అందరు హాయిగా వినడం జరిగింది. లక్ష్మణరావు గారు తెలుగు భాషా వ్యాప్తికి మరియు ఇతర భాషల కొరకు చేసిన కృషిని సోదాహరణంగా వివరించిన తీరు సభికులను ఆకట్టుకుంది.
చప్పట్లతో అభినందనలు తెలిపారు.
సభ ముగియగానే అందరితో మాట్లాడి, వారు ఇచ్చిన గ్రంథాలను, పుస్తకాలనూ తీసుకొని , సెలవు తీసుకుని బయలుదేరాం.
బాపట్ల లోని ‘ బొమ్మరిల్లు ‘ రెస్టారెంట్ కు పోయి పులుకాలు పన్నీరు కూర్మాతో తిని మాకై కేటాయించిన లాడ్జ్ లో రెస్ట్ తీసుకున్నం.
పొద్దున్నే లేసి దగ్గరలో బీచ్ వున్నది చూద్దాం అని ప్రభాకర్ చెప్పకపోతె ‘ సూర్యలంక ‘ బీచ్ చూసే అదృష్టం కోల్పోతుమనుకుంటా.సముద్రపు అలల అల్లరిని తనివితీరా చూసి ఒక అరగంట దూరంలో వున్న ‘ జిల్లెలమూడి ‘ కి బయలుదేరినం.జిల్లెలమూడి అమ్మ అంటే ఓ కాలాన ఒక వెలుగు వెలిగింది.మా చిన్నప్పుడు మా అమ్మ తోని అక్కడకు పోయినమని మా చిన్నక్కయ్య ( నీహారిణి ) చెప్పింది. జిల్లెల్లమూడి అమ్మ ఇప్పుడు లేకున్నా అక్కడ ఆమె ఆనవాళ్లు చెదిరిపోలేదు. ఇప్పటికి అక్కడ సేవా కార్యక్రమాలు,భజనలు కొనసాగుతూనే వున్నాయి.
అక్కడి నుండి పెదనందిపాడు మీదుగా చిలకలూరిపేటకు చేరినం.అక్కడ టిఫిన్ , టీ కానిచ్చి పిడుగురాళ్ళ , దామరచెర్ల దాటి మిర్యాలగూడ దగ్గరికి వచ్చేసరికి నేను కొన్నేళ్లు జాబ్ చేసిన ఆఫీసు యజమానులు మా Chairman Sir , MD Sir ఊరు గదా అని ఒక్కసారి మనసు పులకించి నా సంతోషాన్ని కారులో వున్న వారితో పంచుకున్న.మధ్యలో ‘ తిప్పర్తి ‘ తగిలింది.మా చిన్నప్పుడు వరంగల్ నుండి వచ్చి అక్కడ దిగి ఎడ్లబంఢిలో మా మేనమామల ఊరు గోపాలపురం చేరేవారం. ఆపాతమధురాల్లాంటి ఆ పాత ముచ్చట్లు ఎన్నో పంచుకున్నాం. ఇక ముందుకు కదిలి నార్కట్ పల్లిలో ‘ వివేరా ‘ హోటల్ దగ్గర ఆగి టీ తాగి ‘ చకినాలు ‘ కొనుక్కొని హైద్రాబాద్ కు చేరినం…




ఎవరయినా తన ముందుకు
రావాలని కోరిక
వచ్చిన వారి చిత్ర విచిత్ర
ముఖ కవళికలను
చూడాలని తపన
తీరొక్క మంది
తీరుతెన్నులు
తేరిపారా తన మెరుపులో బంధించాలని ఆశ
వివిధ భంగిమలను తనలో
బధ్రపరుచుకోవాలన్న ఎదురుచూపులు
తన ముందుకు వచ్చేవారు
నవ్వుతూ నాట్యం చేయాలని
దు:ఖాన్ని దువ్వెనల దులుపాలని
పట్టులంగా వేసుకున్న గారాల పట్టిని
తన గోళం లో బంధించాలని
పట్టుధోతి కట్టుకున్న చినరాయుని
చిద్విలాసం కనాలని
లేలేత లేడిపిల్లలంటి భావాలకు గాలం వేయాలని
ఆనంద రూపాల
అందాలను అద్దుకోవాలని
నూనూగు మీసాల
కుర్రతనం చూడాలని
తను శుభ్రంగా ముస్తాబయి
ఎదుటివారిని తనలా
తనలో చూసుకోవాలని ఉందనంటది…
అడుగులకు ఆదరువైన అమ్మ
అందరిని పిలిచింది
మనిషి పుట్టిండు జంతు జాతి పుట్టింది
చెట్టు చేమ లు వెలసినయి
నదీ జలాలు పారినయి ఆకలి ఆరంభమైంది
వీసమంత మనిషి మనసు
గాసంకోసం తిరిగిండు
బతుకు బాట వెదికింది
పోడు ఎవుసం మొదలైంది భూములు బావురుమనని
భూసారం బుగ్గి కాని
పంటలు పండించె తెలివినబడ్డరు
గొర్రె పిల్లల మందలు
మడిమడికి తిరిగినవి
అర్ధ రాతిరి యాల్ల
కుక్కలు వాటిని కాపాడే
సైనికులయినవి
గొంగడి కొప్పెరలు
మోతుకాకు సుట్టలు
జకుముకి నిప్పులు
కంది పొరక మంటలు
నిదుర కాచినవి
జొన్న కొయ్యకాల్లు
కొర్రాల్లు అయినవి
చిమ్మని చీకట్లో
మిణుగురు పురుగులు
కందీల్లు అయినవి
ముల్లు కర్రలు
విల్లంబులైనవి
పంది కూనల కసువు
భూపసిడి అయ్యింది
కోడిపిల్లల పెంట
కొంగుబంగారమయ్యింది
దొడ్డెడు గొడ్ల పెంట
బండి పొనుక నింపుకొని పొలాలకు జాతర కట్టినవి
పెంట కుప్పలు
చెలకల అలికినవి
ఎద్దు తిరిగిన నేల
ఎగిరి దునికింది
రాగాలు తీస్తూ వంగి
పొలం నాట్లు వేసిన
రైతు కూలీలందరు రోగాలు
లేని పంట పండించినరు
భూమాత కాక తగ్గించినరు
ప్రపంచానికి చల్లదనం
అనే ధనం ఇచ్చిండ్రు
గత చరిత్రను మరచిన
ఆధునిక మానవులు
ధరణి దహించకముందే
విచిత్ర రోగాల
విలయతాండవం
విజృంభించకముందే
మత్తు నుండి మేల్కొనకపోతే
జగత్తులో ఉత్తమ జాతి
అని చెప్పుకునే మానవజాతి
తమకు తాము జప్తు కాక తప్పదు…
సంవత్సరానికి
ద్వితీయ సంతానం
ఇంటికి రెండో బిడ్డ
రూపుకు చిన్నది
ఇరువది ఎనిమిది
రోజుల నెల బాల ఇది
నాలుగేళ్ల కోసారి
కొసరు వడ్డిస్తది
లీప్ ఇయర్
తన సార్థక నామధేయం
బరువు బాధ్యత లేదు
పండుగల మోత లేదు
ఉరుకు పరుగు లేదు
ఉరుము మెరుపు రాదు
చలి లేదు వేడి లేదు
చక్కని వాతావరణం
ముడుచుకోదు
మూలకు ఉండదు
ఎండకు ఎండదు
వానకు తడువదు
తెలుగు హేమంత
శిశిర ఋతువుల చుట్టం
ఫాల్ ఫీల్ ఇచ్చే సీజన్
ఫీవర్ రాదు
పవర్ పోదు
పబ్లిసిటీ ఉండదు
ఉద్యోగస్తుడికి ఉపకారి
పనిదినాలు సెలవుదినాలు
సమ వాటా కలిగి వుంటది
పిల్లలకు పరీక్షలుండయి
తల్లిదండ్రులకు ఫీజుల
పరీక్షలుండయి
అందరికి ఫిదా ఇది
ఫికరు లేని ఫిబ్రవరి…
పుట్టినపుడు పురుడు
పెరుగుతాడు ఈ చందురుడు
చిన్నతనాన నాన్నను చూస్తూ ఎదుగు
బాల్య యౌవనాల దరువు
తరగుదలలేని వెలుగుల సూరీడు
పెరిగి అవుతాడు పౌరుడు
పెరుగుతుంటే బెదరడు
చదువు తనకు అవదు బరువు
ఉద్యోగం తనదైన ఆదరువు
జోడు కోసం వెతుకు యువకుడు
పెళ్లికి సిద్ధమయ్యే వరుడు
పెళ్లికి ముందు పొగరు
పెళ్లి అయినాక తగ్గును వగరు
పెళ్లికి ముందు సోమరుడు
పెళ్ళయినాక పామరుడు.
సంసార యుద్ధానికి సిద్ధమయే వీరుడు
నిత్యపోరాటాల యోధుడు
అలసినా విడువని శ్రామికుడు
చివరకు గెలిచే విజయుడు…
