Home కథలు అంతా మనవాళ్ళే (నాటకం)

అంతా మనవాళ్ళే (నాటకం)

by kudikala Janardhan

1వ రంగము .

(తెర లేచేసరికి రంగాలంకరణ : రంగనాథం నివాస భవనం. గది చుట్టూ అనేక మేలైన పరికరములచే అమర్చబడి వుంటుంది. విలువైన వస్త్రములు – పట్టుదోవతి, పట్టు లాల్చి, భుజముపై ఉత్తరీయము ధరించి సోఫా కుర్చీలో కూర్చుని దినపత్రిక చదువుతుంటాడు. నిముషము వరకు నిశబ్దం)

శారద : (కాఫీ కప్పుతో ప్రవేశించును. భర్త కందిస్తూ) ఏమిటో ఈరోజు అంత శ్రద్ధగా చదువుచున్నారు.

రంగనాథం : (మౌనం)…………….

శారద : (భుజం తట్టి) మిమ్మల్నే !

రంగనాథం : (పేపరు చదువుతూ- చూడకుండానే) ఆఁ దానాలకు ధర్మాలకు డబ్బేమయిన అవసర మయ్యిందనుకుంటా!

శారద : మీరు అలాగే అనుకుంటారు – నేను ఎలాగో అడుగుతుంటాను. నేను ఎప్పుడన్న మందలిస్తే చాలు డబ్బు కోసమే వచ్చిందనుకొంటారు. ఏమండి!

రంగనాథం : ఏమిటే !

శారద : నాకేమయిన డబ్బు జబ్బనుకున్నారా !

రంగనాథం : లేకుంటే నాకనుకున్నావా !

శారద : మాటలు మాత్రం బాగా నేర్చారు. ఇకనన్న పేపరు చదువు కాస్త ఆపుతారా !

రంగనాథం : ఎందుకో అంత అవసరం!

శారద : కాఫీ చల్లారిపోతుంది. వెంకయ్య ఇంకా రాలేదని చూస్తున్నారా. నేనే తెచ్చానండి కాఫీ. దయచేసి కాస్త తీసుకోండి !

రంగనాథం : (పేపరు ప్రక్కకు పెట్టి భార్యకేసి చూస్తూ) వెంకయ్య ఏమయ్యాడు – నీవు తెచ్చావు కాఫీ.

శారద : ముందు కాఫీ తీసుకోండి. మీ ప్రశ్నలకు జవాబులు చెప్తాను. (కాఫీ అందిస్తుంది. రంగనాథం త్రాగుతుంటాడు) పాపం భార్య ఆరోగ్యం బాగులేదట. నేను వెళ్ళమన్నాను.

రంగనాథం : నాకు బాగా తెలుసు. వాడు అడిగి వుంటాడు నీవు వెళ్ళమని వుంటావు. ఇంటి నౌకర్లను యింటికి పంపి వంటావార్పు నువ్వు చెయ్యి.

శారద : మన పని మనం చేసుకుంటే తప్పేముందని….

రంగనాథం : ఇంట్లో నౌకర్లెందుకు? జీతాలు దండుగ.

శారద : అస్తమానము పేదలంటేనే ఎందుకండి అలా తీసి పారేస్తారు.

రంగనాథం : అడిగిందల్లా నీవిలానే తీరుస్తుండు. నౌకర్లంతా నెత్తికెక్కి కూర్చుంటారు. (కాఫీ త్రాగేసి టేబుల్ పై పెట్టుతాడు). శారదా! నీవు యిలా అందరికి అలుసిస్తూంటే రానురాను వారు మనల్ని చులకనగా చూస్తారు. ఇదిగో మరొకటి చెప్పుచున్నాను. అడిగినవారికి లేదనకుండా ఇచ్చే దానకర్ణుని విధానముందే అది పూర్తిగా మానాలి.

శారద : అదేమిటండీ! ఈ ఆస్తినంతా మనం పోయేనాడు కట్టుకు పోతామా? పది మందితో మంచి అనిపించుకోవడమేగా మనిషికి కావలసింది.

రంగనాథం : అదేంటే! లేనివాడు లేకేడిస్తే – ఉన్నవాడు ఉండి ఏడ్చినట్లు. నీ ధర్మసూత్రాలు కాస్త  తగ్గించడం మంచిది. ఆఁ అన్నట్లు మన బాబుమోహన్ రాజేక్కడ? ఇంత మటుకు రాలేదు. నిన్న సాయంత్రం పోయినవాడు – ఇంకా రాలేదు.

శారద : స్నేహితుల యింటికి పోయి వుంటాడు. అస్తమానం వాడి మీదే మీ దృష్టియంతయు.

రంగనాథం : కట్టుకున్న దానిమీద వుండే దృష్టి కొడుకు పుట్టేవరకేనే. అయినా అంత గొప్ప స్నేహితులెవరాని.

శారద : ఎందుకొచ్చిందో సందేహం ?

రంగనాథం : ఆఁ మరేమి లేదు. రాత్రి భోజనం పెట్టి పడుకో పెట్టేవారు కూడా ఇంకా వున్నారన్నమాట.

శారద : మంచి మనసున్న వారిని ఎక్కడైనా ఎవరైనా ఆదరిస్తారు – ఆశ్రయమిస్తారు.

రంగనాథం : నీ నీతులకేం గాని ఈమధ్య వాడు రెండు రోజులైనా రావడం లేదు. నీతో చెప్పే వెళుతున్నాడా?

శారద : అదేంటండి! వాడికి ఆమాత్రం స్వేచ్ఛ లేదా!

రంగనాథం : నీ సమర్థనకేంగాని యింతకు వాడెక్కడికి వెళ్ళాడు.

శారద : స్నేహితుల యింటికి వెళ్ళాడని చెప్పానుగా !

రంగనాథం : (చీదరింపుతో) శారదా !

శారద: ఎందుకండి అంత కోపగించుకుంటారు. ఏమో ముంచుకు పోయినట్లు!

రంగనాథం : ముంచుకు పోవాలా! పోతుంటే చూస్తూ వుండాలా !!

శారద: అది కాదండి!

రంగనాథం : అది కాదని, యిది కాదని అసలు విషయాన్ని కప్పి పుచ్చుటకు ప్రయత్నించకు. మళ్ళీ ఆ మాలవాడలకు వెళ్ళాడనుకొంటా! ఏమే ! మాట్లాడవేం! ప్రహ్లాదునికి లీలావతి తల్లి లాగా రాజుకు నీవు తోడన్నట్లు – నేను అనుకుంటూనే వున్నాను. ఏదో ఒక్కగాను ఒక్క కొడుకు గదా అని.. అడిగింది లేదనకుండా అన్నీ తీరుస్తుంటే… యిదా వాడు నాకు చూపే కృతజ్ఞత. అసలు నీకు బుద్ధి లేదు. నీ గారాబము వలననే వాడిలా మారుతున్నాడు.

శారద : అదేమిటండి అలా బాధపడుతున్నారు – వాడి సుఖ సంతోషములే గదా మనకు కావలసింది.

రంగనాథం : అది కాదు శారదా ! పెద్దవాడు గదా అని స్వేచ్ఛగా తిరగనిస్తుంటే … ఆఁ దానికేం గాని కనీసం వేళకైనా వచ్చి భోజనము చేస్తున్నాడా ?

శారద : చేస్తున్నాడుగా !

రంగనాథం : అబద్దాలతో నిజాన్ని కప్పి పుచ్చవచ్చు. కాని నిజం నిలకడ మీద తెలుస్తుందని మాత్రం మర్చిపోకు.

శారద : ఇంతకు ఏమయిందని యింత ఆందోళన పడుతున్నారు.

రంగనాథం : పెళ్ళీడు వచ్చినవాడు యిలా యింటిపట్టున లేకపోతే వీడికి ఎవరైనా పిల్లనిస్తారా?

శారద : పిల్లలకేం కరువండి ! కో- అంటే కోటి మంది యిస్తారు. బాబు గూర్చి మీకింత పట్టింపు……

రంగనాథం : “బాబు” (వల్లి పల్కును), బాబా! పిచ్చిదానా! వాడింకా పాలు త్రాగే పసి పిల్లవాడను కున్నావా? ఇరవై ఏళ్ళ యువకుడే !

శారద : ఇరవై ఏళ్ళ వాడైనా – అరవై ఏళ్ళ వాడైనా కన్నవారికి ఎంతైనా చిన్నవాడే కదండి?

రంగనాథం : ఆఁ చాలు చాలు గీతోపదేశం. అసలు వాడికి పెళ్ళే వద్దనేలావున్నావు.

శారద : అదేంటండీ !! పెళ్ళి వద్దనే తల్లి వుంటుందా ఎక్కడైనా… అయినా (ఏదో ఆలోచించి)….

రంగనాథం : అదేంటి పానకంలో పుడకలా – నీ ఆలోచనకేదో అడొచ్చినట్లుంది.

శారద : ఆఁ మరేమి లేదు. మన బాబును ఒకసారి అడిగి…

రంగనాథం : “పెండ్లి” చేయమంటావు.

శారద: ఔనండి.

రంగనాథం : శారదా! కాపరానికొచ్చి యిరవై అయిదేళ్ళయినా నీకు లోకజ్ఞానమే రాలేదు. ఓ పిచ్చిదానా! పెండ్లి చేసేది పెద్దలు.

శారద : చేసుకునేది పిల్లలు.

రంగనాథం : ఆమాత్రం తెలుసులేవే !

శారద : అది కాదండి ! ఈ రోజులు చేసుకొనే పిల్లల యిష్టాయిష్టాలతో పెళ్ళిళ్ళు జరిగేది – ఆగిపోయేది.

రంగనాథం : ఇదిగో శారదా! నీవెన్నయినా చెప్ప. నా యిష్టప్రకారమే పెళ్ళి జరగాలి. రాజు నా కన్నకొడుకు. వాడు నా మాట దాటడు. ఒకవేళ దాటినా పెండ్లి విషయంలో మాత్రం దాటలేడు. నాకు మాత్రం నమ్మకం వుంది. అయినా వాడి యిష్టప్రకారం వాడు నడిస్తే నా విలువేది? లోకంలో నాకు మానమర్యాదలు వుంటాయా?? ఈ లోకులు మర్యాదగా బ్రతికే వారినే వేలెత్తి చూపుతుంది. అందరూ భయపడవలసింది ఒక్క ఈ లోకానికే శారదా! ఒక్క ఈ లోకానికే !

శారద : లోకానికి భయపడి శోకాన్ని తెచ్చి పెట్టుకోవడం అది మనిషి పిరికితనానికి నిదర్శనం. లోకానికి భయపడవలసిన పని లేదు. లోకులు కాకులండి. ఎప్పుడూ అరుస్తుండడమే వాటి పని.

రంగనాథం : కాకులు అరవడమే కాదు అప్పుడప్పుడు కరుస్తాయి కూడా.

శారద : గోరంతదాన్ని కొండంత చేసుకొని ఎందుకండి మీకీ ఆలోచనలు… ఒక దిక్కు ఆరోగ్యం పాడవుతుంటేను. అది సరే గాని ఎక్కడన్న పిల్లను మాట్లాడినట్లు పెండ్లికి అంత తొందర పడుతున్నారు.

రంగనాథం: పిల్లా లేదు జెల్లా లేదు. కాసేపు వూరుకుంటావా లేదా! నేను చెప్పేది ఒకటి నువ్వు చేసేది ఒకటి. ఇంత మాత్రమయినా అర్థము చేసుకోకుంటే ఎలాగే నీకు.

శారద: అది కాదండి.

రంగనాథం : ఏదీ.. కాదు గాని నీవూర్కుంటావా లేదా! నా తలరాత. నీవంటి భార్యారత్నాలు వుంటే…

శారద: మీలాంటి భర్తల పనులు జరగవంటారు అంతేనా? ఇంతకు ఆడపిల్లలు కరువవుతారనా మీ ఆరాటం.

రంగనాథం: ఆడపిల్లలకేం కరువు – మన పరువు నిలబెట్టుకోవాలంటే తగిన సంబంధము దొరకొద్దూ….

శారద :(అర్థమయినట్లు) ఓహో అదా మీ దూరాలోచన.

రంగనాథం : ఇంకా నయం దురాలోచనంటావనుకున్నా !

శారద :మీ మాటలకేం గాని, మనంత ఆస్తిపాస్తులున్న సంబంధమా! ఏమండి అంతా మనంత ఆస్తి వున్న వాళ్ళుంటే మనకింత గౌరవ మర్యాదలు ఎలా వస్తాయి.

రంగనాథం : అదికాదు శారద! గ్రుడ్డి కంటే మెల్ల మేలు అన్నట్లు కొద్దో గొప్పో….

శారద : కొద్దో గొప్పో కేం కర్మమండి బిర్లా బిడ్డనే తెచ్చి కన్నకొడుక్కు కళ్యాణం చేయి – నేను వద్దంటానా!

రంగనాథం : ఏది కాదన్నావని.

శారద : ఇంత చిన్న విషయానికి అంత రాద్ధాంతమా !

రంగనాథం : నీ వేదాంతానికేం గాని మీ ఆడువారికి చెప్పి చేయడమే బుద్ధితక్కువనుకుంట.

శారద : ఏమన్న అంటే యిది వరస. ఏమండి! బుద్ధిమంతురాలైన కోడలు కంటె మనకు కావలసింది యింకేముంది.

రంగనాథం : మనకే కాదే అందరికి కావలసింది అదేగా !

శారద: మన రాజు మాత్రం అలాంటి కోడలును తేడనా!

రంగనాథం : శారదా ! మీ ఆడువారి బుద్ధి పోనిచ్చావ్ కావు. నేను యిన్ని చెప్పుతున్నా పెండ్లి విషయం వాడికే వదలమంటున్నావు. గుడ్డి చుట్టు తిరిగి గుళ్ళోకొచ్చినట్లుంది.

శారద : ప్రేమించిన అమ్మాయికి అన్యాయం చేసి, యిష్టం లేని పెళ్ళి చేసుకొని నరకమనుభవించ మంటారా!

రంగనాథం : (వత్తి పల్కును) శా…ర…దా..! ఏమిటి నీ మాటలు. నాకు అర్థము కావడం లేదు. అమ్మాయి ఎవరు? అన్యాయం ఎవరికి??

శారద : మన రాజు…. (చెప్పలేకపోతుంది)

రంగనాథం : ఆఁ రాజు… చెప్పవే !

శారద : ఒక అమ్మాయిని ప్రేమించాడండి. మాట కూడా యిచ్చాడట అంతే కాదు….

రంగనాథం : (వత్తి పల్కుతూ గట్టిగా) శా…ర…దా !

రంగనాథం : ఇక ఆపు శారదా! యిక ఆపు. నా మానం మర్యాదలన్ని మంట గలిశాయి. అటు అంటరాని మాల మాదిగలను అంటుకుంటూ ఇటు చేయరాని పనులు కూడా చేస్తున్నాడు. నా కడుపులో చిచ్చు పెడుతున్నాడు. వంశోద్ధారకుడని, మనల్ని ఉద్ధరిస్తాడని మురిసిపోయాను. నా ఆశలు నిరాశలుగా చేస్తున్నాడు. నా పరువు మర్యాదల్ని మంట గలుపుతున్నాడు! ఇక ఈ రంగనాథం నలుగుర్లో ఎలా తిరుగగలడు, ఎలా తలెత్తుకుని నడువగలడు ! అసలు ఎలా జీవించగలడు!

శారద : ఏమండి అంతమాట అనకండి. మీ పరువు పోతే నా పరువు మాత్రం వుంటుందా !

రంగనాథం : లేదు శారదా ! నీకు తెలీదు. నీవు ఆడదానివి. అందులోను గడప దాటి రానిదానివి. నీకెలా తెలుస్తుంది బయటి ప్రపంచం.

శారద : నా మాట వినండి!

రంగనాథం : నీ మాట వినబట్టే నేడిలా అవుతుంది. (కోపంతోను) శారదా ! నువ్వు యిక్కడి నుండి వెళ్ళు.

శారద : కావలసి వున్నది కాకమానదు. దీనికి యింత బాధపడేదెందు కండి.

రంగనాథం : కావలసి యున్నది కాదు. యిది కావాలని చేసింది. మనకు మనమే అలా చేయించు కున్నది. దీనికంతకు నీవే కారణం.

శారద : వాడి ఆదర్శమే వాడికి మనకు మధ్య అఘాతమై పోయింది. దానికి మనమే కాదు ఎవరూ ఏమీ చేయలేరండి !

రంగనాథం : ఔను. వాడిది ఆదర్శము నీకది ఆనందము. మీ ఆదర్శ ఆనందాలే నాకు ఆవేదనను తెచ్చి పెట్టింది. శారదా ! కన్నతండ్రి మాట కాదని వున్న కులగౌరవాన్ని కాలదన్ని మరో కన్నెపిల్లను పెళ్ళాడటము ఆదర్శమా? లేక ఆస్తి అంతస్తులను అంతకంటె వీడి తల్లిదండ్రుల మాన మర్యాదల్ని లెక్కచేయక తన యిష్టానుసారముగా నడుచుకొనడం కూడా ఆదర్శమా?? మాట్లాడవేం. శారదా ! ఔను ఎలా మాట్లాడుతావు. కట్టుకున్న వాడికన్న కన్న కొడుకంటేనే నీకు యిష్టం.

శారద : పేదల నాదుకుంటూ పేరు సంపాదిస్తుంటే మనం ఆనందించాలే గాని అవమానమెందు కనుకోవాలి.

రంగనాథం : అవును. కులం తక్కువదాన్ని చేసుకోవడం అవమానం కాదు ఆనందము కదూ. పేదలట – పేరటి-హుఁ యివ్వాల తాడోపేడో తేలాలి. వాడి యిష్టాయిష్టాలతో నాకు నిమిత్తం లేదు. నాకు అనుకూలంగా లేనివారికి ఈ యింట్లో వుండటానికి అర్హత లేదు.

శారద: ఏమండి! తొందర పడకండి.

రంగనాథం : తొందర నాది కాదు వాడిది. నీ గారాల బాబుదే !

శారద : మీ పట్టింపులు మానండి. ఈ ఒక్కసారికి క్షమించండి వాడిని.

రంగనాథం : నా పట్టింపు కన్న వాడి పట్టింపు నాకన్న రెట్టింపు. నేను చెప్పినట్లు వింటేనే గాని నా యింట్లో స్థానం.

శారద : అదేంటండి ! మీ మాటలు. అయ్యో భగవంతుడా ! అటు కన్నకొడుకు – యిటు కట్టుకున్న భర్త. నేను ఎవర్ని సమర్థించాలి, ఎవర్నని సమాధాన పరచాలి.

రంగనాథం : శారద ! చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభం లేదు. పరిస్థితి అప్పుడే చెయ్యి దాటి పోయింది. నీరు రానప్పుడే కట్ట వెయ్యాల్సి వుండేది.

(తెరలో : “వీడవోయి జాతి భేదము” – “తోడ్పడవోయి ఖ్యాతి కోసము”)

(పాట విని) అదుగో వాడు వస్తున్నాడు.

శారద : అయ్యో నేనేమి చేయాలో నాకెటు తోచటము లేదు.

రంగనాథం : నీవుంటే నాకూ తోచదు. నీవు లోనికెళ్ళు శారద !

శారద : ఏమండి ! వాడిప్పుడే రావడం. భోజనం చేసిన తర్వాత అన్నీ అడుగుదురు గాని.

రంగనాథం : తర్వాత విషయం ఆ తర్వాతనే ముందు లోనికి వెళ్ళమంటున్నాను.

శారద : ఏమండి, వాడు ఎప్పుడు తిన్నాడో ఏమో !

రంగనాథం : ఆకలి నీకవుతున్నదా, వాడికా! లోనికి వెళ్ళుమంటుంటే వినిపించుట లేదా ! (గట్టిగా) శారదా !

(శారద లోనికి వెళ్ళుతుంది. రంగనాథం నిలుచుని పచార్లు కొడుతుండగా మోహన్ రాజు ప్రవేశం)

రంగనాథం : (ఒకవైపు ఏదో చూస్తూ ఆలోచిస్తుంటాడు)

మోహన్ రాజు : (ప్రేమతో) అమ్మా !

రంగనాథం : అమ్మా లేదు బొమ్మా లేదు నువ్విలా రారా ! (శారద వస్తుంది ) నిన్నే చెప్తుంటె నీక్కాదు లోనికెళ్ళు! (శారద లోనికి పోతుంది)

మోహన్ రాజు: (భయపడుతుంటాడు)

రంగనాథం : తండ్రి అంటే అంత భయమా లేక ఇదంత అభినయమా ! ఏరా మాట్లాడవేం? నవ భారతదేశ పౌరుడవు. నీకెందుకురా భయము. ఆఁ ఎక్కడినుండి రావడం ఇంట్లో ఎవర్నడిగి పోవడం.

మోహన్ రాజు : (మౌనం)

రంగనాథం : మాట్లాడవేం రా! అవున్లే, ఆ మాలమాదిగలకు నీతిబోధలు చేసి చేసి అలసి వుంటావు. ఆ అడ్డమైన వాళ్ళతో నీకేం పని రా.

మోహన్ రాజు : నాన్నా!……

రంగనాథం: ఎందుకురా వాళ్ళంటె అంత ప్రేమ.

మోహన్ రాజు : ఏమిటి నాన్నా! మీరంటున్నది.

రంగనాథం : అర్థము కాలేదా? లేక అర్థమయ్యే తెలియనట్లు అడుగుతున్నావా? ఒరె! మనది పరువు గల కుటుంబం – పరువుగానే బ్రతకాలి.

మోహన్ రాజు : ఇంతకు నేను చేసింది ఏమిటి నాన్న ! అంత నీచంగా నేనేమైన ప్రవర్తించానా !

రంగనాథం : ఇంతవరకు ప్రవర్తించలేదు కాని యిప్పుడిప్పుడే అలా ప్రవర్తిస్తున్నావు.

మోహన్ రాజు : ఏమిటో అది తెలుసుకోవచ్చా.

రంగనాథం : నీవు చేసే పని నీకే తెలియదన్నమాట. ఒరే, రాజు! మన కులం ఏమిటి? సంఘంలో మనకున్న స్థానమేమిటో తెలిసియుండి కూడా నీవిలా తిరగడము అంత మంచిది కాదు బాబు.

మోహన్ రాజు : నాన్నగారు చెప్పేదేదో సూటిగా చెప్పండి. నా తప్పును నేనే సరిదిద్దుకొంటాను.

రంగనాథం : నీవు చేసేది తప్పో ఒప్పో కాని అది మన గౌరవ మర్యాదలకే ముప్పు తెచ్చేలా వుందిరా. నీవు తురకలకు, క్రైస్తవులకు సహాయము చేసినా, వారితో స్నేహం చేసినా యింతకాలము సహిస్తూ, ఓర్పు వహిస్తూ వచ్చాను. కాని రానురాను నీవు ఆ మాలమాదిగలతో స్నేహము కుదుర్చుకోవడమే కాక – రాత్రియనక, పగలనక వారి యిళ్ళళ్ళోనే కాలాన్ని వృథా చేయడము, అన్నము లేక చిక్కిపోవడము నేను సహించలేనురా.

మోహన్ రాజు : ఒక్క కొడుక్కే అన్నము తినడం లేదని బాధ పడుతున్నారే! ఇంక ఆ అన్నమే కరువు అక్కడ ప్రతి యింటి ఆలుబిడ్డలు ఎలా ఆకలి బాధలు అనుభవిస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి నాన్న !

రంగనాథం : నాకే బుద్ధి చెప్తున్నావన్న మాట.

మోహన్ రాజు : లేదు. ఉన్న విషయాన్ని విన్నవిస్తున్నాను.

రంగనాథం : నోర్ముయ్ రా. శ్రీరంగ నీతులు చెప్పొచ్చావ్. (ఆజ్ఞాపించినట్లు). ఒరే రాజు! ఇక నుండి అడ్డమైన వాళ్ళనంటుకుంటు నాకు తలవంపు లేవైన తెచ్చిపెట్టితివా చూడు.

మోహన్ రాజు : మీకు తలవంపా! నాన్న! మీరనేది ….

రంగనాథం : నేనొక్కన్నే కాదురా మన బంధుమిత్రులందరు అంటున్నారు. మరేమిటో కాదు నీకు పిచ్చి పట్టిందని.

మోహన్ రాజు : నాకు పిచ్చి పట్టిందా?

రంగనాథం : లేకుంటే నీవు చేసే పనులు మంచివంటావా! ఒరే! అయ్యిందేదో అయిపోయింది. ఇక నుండి నీవా గూడెంలోకి పోరాదు.

మోహన్ రాజు : మనుషులను వీడినంత తేలిక కాదు నాన్న మనసులను మరల్చుకోవడము. అయినా నాన్న! అవియన్ని పాతకాలపు తెగలు. ఇది ఆధునిక యుగం. అణుశక్తి సాధించాము. అమరులకు అసాధ్యమైన కార్యములెన్నింటినో అవలీలగ సాధిస్తున్నాము. అంతే కాదు. చంద్రలోకము దర్శించిన శుభదినములు. నాన్నా! పండుగ దినములు మరువలేని పర్వ దినములు.

రంగనాథం : రాజూ! చంద్రలోక దర్శనమే కాదురా రేపు ఇంద్రలోకమును సందర్శించినా ఈ కులాలు- మతాలు ఒకటి కావు. ఏ జాతిపిట్టలు ఆ జాతి గూడులోనే వుంటాయి – వుండాలి కూడ. కాకులు కలకాలం కష్టపడినా కోయిలలు కావు – కాలేవు.

మోహన్ రాజు: నాన్నా! జాతి ఒకటి అదే మానవజాతి. “అంతా మనవాళ్ళే!” నాన్నా “అంతా మనవాళ్ళే”!

రంగనాథం : చాళ్లే! నీ సూక్తులు నీవూను. ఒరె ! చిరిగిన ఆకులతో విస్తరి చేయకు ఎందుకంటే అది చేసినా నిరుపయోగం ఫలితం శూన్యం.

మోహన్ రాజు: కావచ్చు నాన్నా. కాదనలేను. కాని….

రంగనాథం: ఒరె! ఇంతకు నా మాట వింటావా? లేదా?

మోహన్ రాజు: మీ మాట నేనెప్పుడు దాటలేదు. ఈ విషయంలో మాత్రం….

రంగనాథం : దాటుతానంటావా? ఒరె నీవెంతో బుద్ధిమంతుడవనుకున్నాను. కాని యిలా నాకెదురు మాట్లాడుతావని కలలో కూడా అనుకోలేదు. (బుజ్జగిస్తూ) నీకెందుకురా ఈ బాధంతా! అయినా… అందరూ సమానమే. “అంతా మనవాళ్ళే”నని చెప్పేది సాధువులు – ముక్తిని గోరే భక్తులురా, నీలాంటి కుర్రవాళ్ళు కాదురా. ఇకనైనా ఆ నీచుల స్నేహాన్ని వీడరా !

మోహన్ రాజు: క్షమించండి నాన్న – మీ మాట కాదంటున్నందుకు!

రంగనాథం : (కోపం – అరుపు) రాజు! నాకిప్పుడు అర్థమైందిరా నీ సంగతి. ఔను! ఊరకే అన్నారా గాడిదకేం తెలుసు గంధపు వాసనని. స్వర్గ సుఖాలనుభవించడానికి సంపదయున్నా… కాళ్ళు కడిగి కన్యనిచ్చి పెండ్లి చేసే పెళ్ళి సంబంధాన్ని వరకట్నంగా వచ్చే 50 వేల ఆస్తిని అందుకోక ఎందుకూ కొరగాని వానిగా అఘోరిస్తున్నావు.

మోహన్ రాజు : చివరికి మిగిలేది ధనం కాదు మంచితనం మంచి నాన్న ! మనిషి మంచి మనిషిగా బ్రతకడానికి అర్హతనిచ్చేది కూడ ఆ మంచియే.

రంగనాథం : ఆపరా నీ అధిక ప్రసంగం. హిరణ్యకశిపునకు ప్రహ్లాదుడు నీతులు బోధించినట్లుంది నీ తీరు. ఆశలు, ఆశయాలు నెరవేర్చుకోవడానికి యిదేమైనా ద్వాపరయుగమను కున్నావా? ఒరే! యిది కలియుగమన్నమాట మర్చిపోకు.

మోహన్ రాజు : అదే నేను చెప్పబోయేది. యుగాలు మారుతున్నాయి పరిస్థితులను బట్టి కాలమూ మారుతున్నది. అలాగే మనుషులు కూడా మారాలి – వారిలో నాటుకుపోయిన ప్రాచీన దురాచారాలు, బూజుపట్టిన మన సంప్రదాయాలు అన్నీ మారాలి మనిషి మనిషికి భేదం లేక ఏచోట వున్నా “అంతా మనవాళ్ళే”నన్న ఏకైక నినాదం అందరి నోటా రావాలి. అప్పుడే నా జీవితానికి ప్రశాంతి.

రంగనాథం : నాకు మాత్రం అశాంతి తప్పదంటావు.

మోహన్ రాజు : ఇందులో మీకు అశాంతి కల్గించేదేమిటి నాన్న!

రంగనాథం : తాను చేసే పని పరులకు మంచిదే అని భావించడం మూర్ఖత్వం. నీ పిచ్చిపిచ్చి మాటలు యికనైన కట్టిపెట్టి మంచిగా వుంటావా లేదా?

మోహన్ రాజు : నాన్నా! అన్నీ తెల్సిన మీరే యిలా అనడం ఏమంత బాగులేదు. మంచి ఏమిటో, చెడు ఏమిటో నాకూ తెలుసు. నాన్నా పవిత్రమైన ఆశయాన్ని పదిమందికి ఫలితం అందించే ఈ తరుణంలో మీరు ప్రతీదానికి అడ్డురావడం…….

రంగనాథం : మంచిది కాదా! హుఁ…. అనుభవము లేని కుర్రాడివి. ఏ తండ్రీ తన కొడుకు చెడిపోతుంటే చూడలేడు. చెడిపోవాలని కూడా చూడడు. మంచి మార్గంలో పెట్టడానికే ప్రయత్నిస్తుంటాడు. ఏ పుణ్యాలు చేసినా, ఏ పాపానికి ఒడిగట్టినా తన సంతాన సంతోషానికే, తన సంసార ఆనందానికేరా. తండ్రియైన వాడికి వుండే బాధలు- బాధ్యతలు నీకెలా తెలుస్తాయిరా. కావడి మోసేవాడికే తెలుస్తుంది దాని బరువు. చూచేవాడికేం తెలుస్తుంది. పెద్దలు చెప్పే నీతులు నీవే వల్లిస్తుంటే ఆ పెద్దలిక చెప్పేది ఏముందిరా.

మోహన్ రాజు : పెద్దలట పెద్దలు. పెద్దలు పేరుకే గాని బుద్ధులన్నీ వేరు నాన్న! వేరు. నానాటికి మనలో కులమత విభేదాలు ఎలా చెలరేగి విజృంభిస్తున్నాయో చూస్తూ – కాలు మీద కాలు వేసుకొని కాలం వెలిబుచ్చేవారా పెద్దలు? నీచ కులమని కొందర్ని సంఘానికి దూరంగా వుంచుతున్నా పెదవి కదపనైనా కదపక మౌనవ్రతం పట్టినవారు పెద్దలా? ఎవరు నాన్నా పెద్దలు. ఈ కుల మతాలను సృష్టించినది మనుషులు – మన తోటి మనుషులు నాన్న! ఇవి కుల మతాలు కావు – ఈ కులమతాలు కొందరు ప్రబుద్ధులు కల్పించిన విషచక్రాలు, సృష్టించిన సుడిగుండాలు.

రంగనాథం : ఆ సుడిగుండంలో పడ్డ వారెవరైనా బ్రతికి బయటపడటం అసంభవం.

మోహన్ రాజు : లేదు సంభవమే. మానవుడు తల్చుకుంటే సుడిగుండమే కాదు యమగండం కూడా తప్పించుకోగలడు.

రంగనాథం : రాజు! నీవెన్నైనా చెప్పు. మన ఇంటి గౌరవం మీద నీకేమాత్రం అభిమానం వున్నా నేను చెప్పినట్లు చెయ్. రేపో మాపో పెళ్ళి కావలసి వున్నవాడివి. అనవసరంగా నీ బంగారు భవిష్యత్తుకు విపత్తు తెచ్చి పెట్టుకోకు.

మోహన్ రాజు : నాకు పెళ్ళి నిశ్చయించారా ?

రంగనాథం : లేకుంటె – సంసారానికి బదులు సన్యాసం పుచ్చుకుంటావా?

మోహన్ రాజు : లేదు నాన్న! నాతో ఒక్కమాటైనా చెప్పలేదే?

రంగనాథం : నీ యిష్టాయిష్టాలతో నాకు పనిలేదు.

మోహన్ రాజు : ఇందులో ఒకరికి ఇష్టమేమిటి – మరొకరికి నష్టమేమిటి?

రంగనాథం : అయితే రంగాపురం జమీందారులు జగన్నాథం కూతురు ధనలక్ష్మి మన హోదాకు తగిన అమ్మాయి. ఈ సంబంధము మనకు అన్నివిధాల మంచిది. ఏమంటావ్?

మోహన్ రాజు : నాన్న! అంతులేని వరకట్నాలనాశించి వధూవరుల సంసారాన్ని నరకంగా మార్చకండి! పండు వెన్నెల్లాంటి బ్రతుకుల్ని నిండు అమావాస్యగా చేయకండి! నన్ను నమ్ముకున్న నా…“శాంతి”కి అన్యాయం చేయలేను.

రంగనాథం : ఎవరా శాంతి? చెప్పవేం రా?

మోహన్ రాజు : నాకు మనసిచ్చిన అమ్మాయి.

రంగనాథం : (బాధపడుతూంటాడు) ఆమె కులం ఏమిటి గోత్రమేమిటి?

మోహన్ రాజు : ప్రేమకే కాదు పెళ్ళికైనా కావలసింది కులగోత్రాలు కావు. గుణగణాలు ముఖ్యం.

రంగనాథం : నీ అతితెల్వికేం గాని యింతకు వారిది ఏ కులం?

మోహన్ రాజు : చెప్పితే బాధపడుతారేమో !

రంగనాథం: నెత్తిన బండపెట్టి బరువుగా వున్నదా?… అని అడిగినట్లుంది. అయినా నా బాధ నాకేగా. ఆ అమ్మాయి ఏ కులంవాళ్ళు?

మోహన్ రాజు : “మాలవాళ్ళు”

రంగనాథం : రాజు (అంటూ గట్టిగా అరుస్తాడు. అంతా నీ యిష్టమే అనుకున్నావా? నీ పెళ్ళి చేసే తల్లిదండ్రులు చచ్చారనుకున్నావా?

మోహన్ రాజు : నాన్నా!

రంగనాథం : నాన్నట నాన్న! ఈ నాన్న మీద నీకు గౌరవం ఏమాత్రం వున్నా నీవీ పని చేసేవాడివా? నీవు అసలు కొడుకువే కావురా !

మోహన్ రాజు : నాన్నా అంతమాట అనకండి.

రంగనాథం : నేనెంత చెప్పినా నీలో రవ్వంత మార్పు రావడం లేదు. ఒరె ! వర్ణాంతర వివాహము చేసుకొని దీనజనుల నుద్ధరించు మహాపురుషుడవా? లేక అంటుతనము లేదని లోకానికి చాటి చెప్ప పుట్టిన రెండవ మహాత్మాగాంధీవా? రాజు ! ఇంతకు నీ ఉద్దేశ్య మేమిటి? నీ ఈ మొండి పట్టేమిటి ?

మోహన్ రాజు : ఇదివరకే చెప్పాను నాన్న ! ఈ లోకంలో నివసించే మానవులది ఒకే ఒక జాతిగా అందరూ గుర్తించాలి. “అంతా మనవాళ్ళే”నని ప్రతి ఒక్కరు భావించాలి. అందుకోసమే నా ఈ పట్టుదల. ఒక్కమాటలో చెప్పాలంటే “అంతా మనవాళ్ళ”న్నదే నా జీవిత సిద్ధాంతము.

రంగనాథం : ఆపరా నీ రాద్ధాంతము. రాజు ! కన్నతండ్రి నైనందుకు కడసారి చెప్తున్నాను. ఇకనైన నా మాట విని మనసు మార్చుకుంటావా? లేదా?

మోహన్ రాజు : వేషం కాదు నాన్నా! మాటిమాటికి మార్చుకోవడానికి. మనసు మనస్సే నాన్న!

రంగనాథం : రాజు ! (అరుపు) ఇక ఒక్క క్షణం కూడ నా యింట్లో వుండటానికి వీల్లేదు.

 (ఇంతలో శారద దుఃఖముతో హడావుడిగా పరిగెత్తుకు వస్తుంది)

శారద : ఏమండి ! మీరేం చేస్తున్నారో మీకే తెలుస్తు లేదు.

రంగనాథం : తెలిసే చేస్తున్నాను. నయాన, భయాన చెప్పినా వినని వాడికి తగిన శిక్ష యిది ఒక్కటే! శారద నీవు అనవసరంగా అడ్డురాకు లోనికి వెళ్ళు ముందు. (రాజుతో) ఇంకా ఎందుకున్నావురా! చేసిన ఘనకార్యం చాలు. వెళ్ళు.

మోహన్ రాజు : నాన్నా!

రంగనాథం : ఆ మాట అనడానికి నీకిప్పుడు అర్హత లేదు. తక్షణం బయటకు వెళ్ళు.

శారద: ఎంత మూర్ఖుడైనను వాన్ని యింటి నుండి వెళ్ళగొట్టడం ఏమంత బాగు లేదండి.

రంగనాథం : నీతులు చాలించు. ఒరే రాజు! “అంతా మనవాళ్ళే”నని ఈ లోకానికి చాటి ఆ లోకుల నోటి నుండి కూడ యిదే మాట వచ్చిననాడే నా గుమ్మంలో అడుగు పెట్టు. అంతవరకు నీకు ఈ యింటి ద్వారాలు బంధింపబడి యుంటాయి.

శారద : బాబూ (రాజును తడుముతూ) బాబు. నీ ఆనందం కోసమేగా మేమింత సంపాదించింది. ఇదంతా నీవులేక వుండి ప్రయోజనం లేదు.

మోహన్ రాజు :అమ్మా ! నా ఆనందం కోసం నా పవిత్ర ఆశయాన్ని వదులుకోను.

రంగనాథం : చూచావా శారద! వాడికి అమ్మానాన్నలకన్న మిన్నయైన ఆత్మీయులెందరో వున్నారు. వాడిది పాషాణ హృదయము. దానిని నీ కన్నీటితో కరిగించలేవు. వాడు మన కడుపున చెడబుట్టాడె! చెడబుట్టాడు.

శారద :ఏమండి !

రంగనాథం : ఔను శారద. వాడు అసలు మనకు పుట్టనే లేదనుకో. ఒరే ! సిగ్గు లేకపోతె సరి. ఇంకా వున్నావా! వెళ్ళురా వెళ్ళు! వెళ్ళేముందు ఇది ఒక్కటి మాత్రం మర్చిపోకు. నా ఆస్తిలో పైసా కూడా రాదు.

మోహన్ రాజు : ఆస్తి మీద నాకెన్నడు ఆశ లేదు.

రంగనాథం : చాలు చాలురా – ముందు బయటకు వెళ్ళి మరీ మాట్లాడు. హుఁ వెళ్ళరా !

శారద: బాబూ !

మోహన్ రాజు :మంచిది నాన్నా! మీ మనస్సును కష్టపెట్ట దలుచుకోలేదు. (అంటూ వెళుతుంటాడు- శారద “బాబూ!” అంటుంది. రంగనాథం ఆమెను చేయిపట్టి ఆపుతాడు. తెర పడుతుంది.)

1వ రంగము అయిపోయింది.

— రెండవ రంగము –

(తెర లేచేసరికి రంగాలంకరణ : నాల్గు కుర్చీలు ఒక రౌండు టేబుల్ అమర్చబడి యుంటాయి. ఒక కుర్చీలో కూర్చొని ప్రకాశ్ “హిస్టరీ” బుక్ చదువుతుంటాడు. మరొక కుర్చీలో కిశోర్ దినపత్రిక చదువుతుంటాడు. కొద్ది క్షణాల తర్వాత సత్యం క్రాఫ్ చేసుకుంటు కూనిరాగాలు పాడుతూ ప్రవేశం – వీలైతే సినిమా పాటనే పాడటం చాలా బాగుంటుంది)

ప్రకాశ్ : (పాట విని- చదువును ఆపి) సత్యం! (అని పిలుస్తాడు)

సత్యం : (ప్రకాశ్ మాట వినిపించుకోడు. అలాగే కూనిరాగం తీస్తుంటాడు.)

ప్రకాశ్ : ఒరే సత్యం ! (అరుపు)

సత్యం : ఏమిట్రా మధ్య నీ గోల.

ప్రకాశ్ : ఆ గోలనే ఆపమంటున్నాను.

సత్యం : పాట పాడటం ఒక గోలా !

ప్రకాశ్ : అది సరేగాని చదువుకునే టైంలో పాటలు పాడొద్దని ఎన్నిసార్లు చెప్పానురా.

సత్యం : ఎన్నిసార్లు చెప్పావో నేనేమన్న లెక్క పెట్టానా !

ప్రకాశ్ : (చిరాగ్గా) అది కాదురా !

సత్యం : ఏది కాదురా (అంటూ హేళనగా మాట్లాడుతాడు చచ్చినవారు మహాత్మాగాంధీ కారా? బ్రతికున్నది ఇందిరాగాంధి కాదా? (అంటూ తిరిగి మరో కూనిరాగం)

ప్రకాశ్ : (కోపంతో) చెప్తుంటే నీక్కాదు. ఆపరా నీ పాట.

సత్యం : అనకురా ఆ మాట.

ప్రకాశ్ : ఎందుకురా యిలా పిచ్చివేషాలు వేస్తుంటావు పిచ్చివానిలా?

సత్యం : ఎంత పిచ్చివేషాలు వేసినా ఆ పిచ్చి తుగ్లక్ అంతటివాన్ని మాత్రం కానురా. ఎంతైనా మనలాంటి అంటే నీకు కోపం వస్తుందేమో! ఆఁ నాలాంటి వారంతా జూనియర్ తుగ్లకులే.

ప్రకాశ్ : నీ తెల్వికి సంతోషించా గాని ఇకనైనా చదువుకోనిస్తావా లేదా?

సత్యం : చదవకుండా నిన్నేమైనా ఆపినానా.

ప్రకాశ్ : ఒరే ! ప్రతిరోజు తిట్లు తినడమే నీకో ఆచారం అయినట్లుంది.

సత్యం : ఏమి చేయనురా అది నా గ్రహచారం.

ప్రకాశ్: అది నీ గ్రహచారం కాదు, నా గ్రహచారం.

సత్యం : అదేమిట్రోయ్ ! నా గ్రహచారానికి నేను విచారిస్తుంటే, అది నాదికాదని దాన్ని నీదిగా భావిస్తున్నావు. అహా! హా! ఒరె! నీ ఆదర్శానికి నా అభినందనలు (చేతులు జోడించును).

ప్రకాశ్ : హాస్యము అన్నివేళలా చేయడం అంత మంచిది కాదు.

సత్యం : హాస్యమా! నేను… ఆ… కాదు కాదు హాస్యము చేస్తున్నాన?

ప్రకాశ్ : ఒరె! నీ పద్ధతి నాకేం నచ్చటం లేదు, అర్థము కావడము లేదు. (కోపముగా చూస్తాడు)

సత్యం : దేశాన్ని యేలే మంత్రుల పద్ధతులే ప్రజలకు అర్థము కాని ఈరోజుల్లో – నా పద్ధతి నీకర్థము కాకపోవడం, నచ్చకపోవడమూ…. సహజమే !

ప్రకాశ్ : (కోపం తో) సత్యం! అనవసరంగా వృథా మాటలతో కాలాన్ని గడపటం కన్న రోజూ ఒక గంటసేపయినా కూర్చుని చదివితే నీవూ బాగుపడతావు నేను బాగుపడతాను.

సత్యం : ఇంకా బాగుపడటం ఏమిట్రా! మూడుసార్లు ఈ బి.ఏ.లో ఫేయిలయినవారికి – అందులో మనలాంటి వారికి మోక్షము లేదురా! ఏమంటావురా?

ప్రకాశ్ : నోర్ముయ్ మంటాను. నీ విధానం చూస్తుంటే కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెడగొట్టినట్లుంది.

సత్యం : అయితే నీవు కూడ…. గాడిదవేనన్నమాట !

కిశోర్ : (పేపరు చదువుచున్నవాడు అకస్మాత్తుగా)

సత్యం : “వండర్ ఫుల్  వండర్ ఫుల్ “… (లేచి ఇద్దరి దగ్గరికి వస్తాడు)

ప్రకాశ్ : (కోపంతో) కిశోర్ ! వొళ్ళు ఎలా వుంది.

సత్యం : “వొళ్ళు”- ఇండియన్ ఇంకా వుంది. అంటే నల్లగా !

కిశోర్ : (సత్యంతో) నేనేమన్నానురా. అత్తమీది కోపం దుత్తమీద చూపినట్లు నా మీద కోపం చూపుతున్నాడు.

సత్యం : కోపం కాదురా అది మన పాలిటి శాపం.

ప్రకాశ్ : మీ శాపం కాదు. నేను చేసికొన్న మహాపాపం !

కిశోర్ : ఇంతకు నేనేమన్నారా! ప్రకాశ్! నామీద అంత కోపం.

సత్యం : ముందేవాడు తోక తొక్కిన పాము. దానికెదురు తిరగడం అంత మంచిది కాదురా.

కిశోర్ : ఒరే సత్యం! నువ్వూరుకోరా! ప్రకాశ్! నేనమన్నారా ?

సత్యం : నీవన్నమాట నీకే తెలియకుంటే రేపెలా బ్రతుకుతావురా !

ప్రకాశ్ : తినటనికి తిండి దండిగా వున్నప్పుడు మూల్గే ముసలమ్మ మూన్నెల్లు ఎక్కువే బ్రతుకుతుందిరా! నోర్ముయ్యరా !

సత్యం : (కిశోర్) ఒరే నీకా చెప్పింది.

కిశోర్ : లేదు. నీకు మైనస్ కాదుకాదు నీకు ప్లస్ నాకు.

సత్యం : ఆహాహా! What a wonderful Joke ….(ఏదో జ్ఞాపకం వచ్చినట్లు) ఆఁ వచ్చింది వచ్చింది.

కిశోర్ : బుద్ధియా !

సత్యం : లేదు లేదు – నీమీద ప్రకాశ్కు ఎందుకు కోపం వచ్చిందో ! – ఆ మాట నాకు జ్ఞాపకానికి వచ్చింది.

కిశోర్ : ఏమిట్రా అది? చెప్పరా బాబూ! చెప్పరా?

సత్యం : ఇంతవరకు మేము మాట్లాడుతుండగా “Wonderful Wonderful” అన్నావు. జ్ఞాపకమున్నదా?

కిశోర్ : ఓహోహో! అదట్రా ప్రకాశ్! ఇంతదానికి ఎంత టైమ్ వేస్ట్ అయ్యిందో చూడండి. ఒరే! చూడండిరా (ఇద్దరూ చూస్తారు కిశోర్ చదువుతుంటాడు) “పరీక్షల రద్దుకు ప్రభుత్వ యోచన” (పేపరు ముడిసి) జిల్లా పరిషత్తు పరీక్షలే కాక మన కాలేజీల పరీక్షలు కూడ రద్దు చేస్తే…

సత్యం : చదవవలసిన బాధ తగ్గుతుంది కదా అనుకొని….

ప్రకాశ్ : “Wonderful” అంటూ అరిచాడు. ఇదిగోండి మీకిదే చెప్తున్నాను. బుద్ధిమంతులుగా చదువుకుంటె చదువుకోండి – యిలా అనవసరంగా మరొకర్ని చెడగొట్టడం అంత మంచిది కాదు.

సత్యం : ఏమిటీ! “అంతా మంచిది కాదా” అయితే కొంత మంచిదేనన్నమాట.

కిశోర్ : అన్నమాట ఏమిటి వున్నమాటే!

ప్రకాశ్ : (విసుగెత్తి) నన్నీ యింట్లో వుండమంటారా లేక మీరిద్దరే వుంటారా? ఏదో ఒకటి చెప్పండి.

సత్యం : ఆఁ ఆఁ ఆఁ ఎంతమాట ఎంతమాట! మేము… నిన్ను.. విడచి… వుండటమా Impossible ! That is very danger to me… and also to Kishore My dear friend Prakash !

ప్రకాశ్: అసలు మీతో సావాసం చేయడం సాహసముతో కూడినది. నా సహనము పనికిరాదు. అయినా మీతో వాదులాట నాకెందుకు.

కిశోర్ : అంటే…. మాకు అవసరమనుకున్నావా?

సత్యం : అన్నట్టేగా !

ప్రకాశ్ : ఒరె! నన్ను విసిగించకండి. ఇప్పటికే మీ స్నేహం వలన ఈ బి.ఏ.లో మూడు సార్లు నేనూ తప్పాను. ఇదే కడసారి ఈసారియైనా పాసు కాకుంటె నేనేకాదు నా కుటుంబ పరిస్థితులే తల్లక్రిందులౌతవి. సినిమాలు చూడటం – షికార్లకెల్లడం వల్లనేగా మనం ఫేలయ్యింది.

సత్యం : లేదురా. ఎగ్జామ్ హాల్ ల్లో ఎంత స్ట్రిక్టుగా చూసారు అంత స్ట్రిక్టుగా చూడటం వల్లనే నకలు రాయలేక పోయాము.

కిశోర్ : ఫేల్ అయ్యాము.

సత్యం: ఇందులో మనం చేసిన తప్పేమి లేదు ఏమంటావు కిశోర్ !

కిశోర్ : ఔనురా సత్యం !

సత్యం : చావు బ్రతుకుల మధ్యనున్న రోగులనే డాక్టర్స్ అంత స్ట్రిక్టుగా చూడరు – ఒరె! నకలు వ్రాయడం మన విద్యార్థుల జన్మహక్కు

ప్రకాశ్ : (విసుగుగా) ఒరె సత్యం! మీ స్నేహం చేయడమే నేను చేసిన పెద్ద నేరంరా!

సత్యం : ఒరె ! అంత ఘోరంగా మాట్లాడకురా !

ప్రకాశ్ : (కోపంతో) అసలు మీ ఉద్దేశ్యమేమిట్రా ?

కిశోర్ : ఉద్దేశ్యము సదుద్దేశ్యమైనా నీకు మాత్రం దురుద్దేశ్యముగానే అనిపిస్తుంది.

సత్యం : ఊర్కోరా కిశోర్! “వాడు Clever Student -ఈ మూమెంట్లో అందులోను పరీక్షలు యింకా పది రోజులు వున్న ఈ సమయములో వాడితో విరోధం మనకు అంతకంటే మన బి.ఏ. పరీక్షకు చాలా ప్రమాదం” అని …నా .. అభిప్రాయం.

కిశోర్ : ఔనురా! “ఈసారి ప్యాసవడమే ట్రబుల్ – వీడితో విరోధం పెట్టుకుంటే అదికాస్త డబుల్ అవుతుందని” నా సలహా (పేపరు మూస్తాడు).

ప్రకాశ్ : (విసుగుతో) మీతో కలిసి వుండటం నా బుద్ధి తక్కువ (అంటూ బయటకు వెళ్ళిపోతాడు)

సత్యం: మాకు మాత్రం ఎక్కువా !

కిశోర్ : (పేపరు చూస్తూ) ఒరె! ఇది చూడు (చదువుతాడు). “పేదలకు బంజరుభూములు పంచుటకు ప్రభుత్వ నిర్ణయం పలువురి హర్షం” – అబ్బ ఎన్నాళ్ళకు మన సభుత్వం ప్రజా ప్రభుత్వమని పించుకుంటోందిరా.

సత్యం : పల్లె ప్రజల పేర్లతో ఈనాటి పెత్తందార్లు ఎంతమంది ఆ భూముల్ని ఆక్రమించరో మనము చూడకపోతామా ?

కిశోర్ : (పేపరు చూస్తూ) “పట్టపగలు బ్యాంకు దోపిడి” –

సత్యం : పట్టపగలు బ్యాంకు దోపిడీలు – అర్ధరాత్రి హత్యలు, అర్ధము లేని ఆత్మహత్యలు. అంతులేని అవినీతులు – తంతు తెలియని కుతంత్రాలు మొదలగునవి మన భారత ప్రజా ప్రభుత్వ లక్షణాలు – అందుకే అక్షరాలా అవి నిత్యం జరుగుతున్నాయి.

కిశోర్ : (పేపరు చూస్తూ) “కనిపించుట లేదు”

సత్యం : అక్షరాలా !

కిశోర్ : అది కాదురా. ఈ ఫోటోలో వున్నది మన మోహన్ రాజులా వున్నట్టుంది.

సత్యం : (ఫోటో చూసి) Correct, cent percent correct. ఎంత అదృష్టవంతుడురా – పేపర్లో వాడి ఫోటో పడింది.

కిశోర్ : (పేపరు చదువుతాడు) “బాబూ! మోహన్ రాజు!! నీవు యిల్లు విడిచి వెళ్ళినప్పటి నుండి మీ అమ్మ ఆరోగ్యం దెబ్బతిన్నది. ఆమె నీకోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నది. బాబు! నీ యిష్టానికి నేను అడ్డురాను. ఈ ప్రకటన చూచిన తక్షణమే తిరిగి రావలసింది గాను- తప్పక వస్తావని ఎంతో ఆశిస్తున్నాను.                                    ఇట్లు మీ తండ్రి గారు

రంగనాధం, రాజాభవనం, హన్మకొండ, వరంగల్లు.

సత్యం : అదేమిట్రోయ్! ఆస్తి, అంతస్తు గల కుటుంబములో ఏమిటీ విపరీతం….

కిశోర్ : ఆస్తి, అంతస్తు వుంటె ఏం లాభంరా! అనుభవించే అదృష్టం వుండొద్దూ.

సత్యం : అదృష్టం అందర్ని వరిస్తుందా! ఆఁ అన్నట్లు వాడు ఎక్కడికి పోయి వుంటాడు (ఆలోచిస్తుంటాడు)

కిశోర్ : వాడు సమైఖ్యతావాది. ఎక్కడైనా వుంటాడు. ఇంతలో ప్రకాశ్ లోనినుండి ప్రవేశం)

ప్రకాశ్: ఇంకా మీ చర్చలు పూర్తి కాలేదా?

కిశోర్ : (పేపరు ప్రకాశ్ కిస్తూ) ఒరే ! మోహన్ రాజు యింటినుండి వెళ్ళిపోయాడట. (ప్రకాశ్ పేపరు – అందులోని వార్తను లోలోపల చదువుతుంటాడు)

సత్యం : తిండిలేక ఒకడేడుస్తుంటే – తినలేక ఒకడేడిసినట్లుంది.

ప్రకాశ్ : ఒరె! ఇదేదో అర్థంకాక వుంది. మనం వాన్ని కలుసుకోవాలి.

సత్యం: ఎక్కడున్నాడని కలుసుకోవడం !

(మోహన్ రాజు ప్రవేశం చాలా నీరసంగా వుంటాడు. అందరూ ఒకేసారి చూస్తారు. క్షణం వరకు ఎవరినోట మాటరాదు. అందరు మోహన్ దగ్గరకు వస్తారు)

ప్రకాశ్ : (సంతోషంతో) మోహన్ !

మోహన్ రాజు: (ఆనందముతో) ప్రకాశ్ !

సత్యం : ఒరె! నిలుచుండే మాట్లాడడం దేనికి? మోహన్ కూర్చోరా! (కుర్చీ చూపుతాడు, అందరూ కూర్చుంటారు.)

మోహన్ రాజు : మనం అంతా కల్సుకొని ఎన్నాళ్ళైందిరా….

కిశోర్ : ఎన్నేళ్లేమిటి? మూడు సంవత్సరాలేగా….

ప్రకాశ్ : కిశోర్! (జేబులో నుండి రూపాయి తీస్తు) ప్లీజ్! నాల్గు కాఫీలు పట్రా! (చేతికి డబ్బిస్తాడు).

సత్యం : (పోతున్న కిశోర్) కాస్త తొందరగా రారా! అతిథి మర్యాదలకు ఇండియన్ టైము అక్కరకు రాదు. ఫాలో ఇన్ ఫారన్ టైము. (కిశోర్ వెళ్ళిపోవును).

మోహన్ రాజు : సత్యం ! ఇంకా నీ పద్ధతి మారలేదనుకుంటా !

సత్యం : అనుకోరా! యింకా అనుకో.

ప్రకాశ్: ఈ సత్యం మారడం అసత్యం.

మోహన్ రాజు : ఒరె! మూడుసార్లు దండయాత్ర కొట్టినా యింకా నీకు | బుద్ధి రాలేదురా!

సత్యం : నేను బి.ఏ.లో మూడుసార్లేగా దండయాత్ర చేసింది. మన దేశచరిత్రలో మహమ్మదు గజనీ 17 సార్లు దండయాత్రలు చేసినా యింకా అతనికి బుద్ధి తీరలేదట – అతని లెక్కలో నేనో లెక్కా…

ప్రకాశ్: ఒరె! మోహన్! వీడితో మనం వాదించలేము. అది సరెగాని.. నీవు యింటి నుండి వెళ్ళివచ్చినట్లు ఇదిగో (పేపరులో చూపిస్తు) మీ నాన్న ప్రకటన చేసినాడు.

(మోహన్ రాజు లేచును. తర్వాత ప్రకాశ్, సత్యం లేచెదరు.)

సత్యం : అదేమిట్రా! ఏం జరిగింది. నీవు ఎందుకిలా రావలసి వచ్చిందిరా !

మోహన్ రాజు : అదంతా ఎందుకు లేరా !

సత్యం : పోని కొంతన్నా చెప్పరా !

ప్రకాశ్ : అదెమిట్రా మేము పరాయివాళ్ళమా! స్నేహితుని కష్టసుఖాలు పంచుకోవటానికి మాకా అర్హత లేదా ?

మోహన్ రాజు: ప్రకాశ్! అంతమాట అనకు. అర్హతయే కాదు హక్కు వుంది. దాన్ని పొందే అధికారమూ వుంది.

ప్రకాశ్ : అయితే అసలు జరిగిందేమిటో చెప్పరా.

సత్యం : ఫస్ట్ నుండి లాస్ట్ వరకు వున్నది వున్నట్లు చెప్పాలి.

మోహన్ రాజు : నేను చేసే పనులు నేను ఆశించే ఆశయాలు ఇంట్లో మా నాన్నగారికి ఏమంత యిష్టము లేదు. పైగా యింటి నుండి వెళ్ళమన్నారు కూడ.

ప్రకాశ్: చెట్టుకు కాయలు బరువా! మోహన్! నీ మనస్తత్వం నాకు తెలియనది కాదు. నీవేదో అసాధారణమైన ఆదర్శపు ఆశయం కోసం ప్రాకులాడి వుంటావు మీ నాన్న….

సత్యం : దానికి బ్రేకు వేసి వుంటాడు.

ప్రకాశ్ : అంతమాత్రానికే యిల్లు విడిచి రావలసి వచ్చిందా?

మోహన్ రాజు : మనిషికి కావలసింది మంచితనం. కులం, మతం పేరిట జరిగే దారుణాలు నశించాలి. మనిషి మనిషిగా బ్రతకాలి! సమైక్యంబుగా బ్రతకాలి. నవసమాజం నెలకొనాలి. అందులకై ప్రతివారు “అంతా మనవాళ్ళే”నని ఒకరినొకరి ఆదరించుకోవాలి. అప్పుడు నా జీవితానికి సుఖము, శాంతి. అందుకే నా జీవితాన్ని అంకితం చేసాను.

సత్యం : మహాత్ములు మాత్రమే నీవన్నయి అన్ని సాధిస్తారు. మనం మామూలు మనుషులం.

మోహన్ రాజు : మహాత్ములందరు మానవులేనన్న విషయాన్ని మర్చిపోకు.

ప్రకాశ్ : ఆశయం ఎంత మంచిదయినా అనుసరించే వారున్నప్పుడే దానికి విలువ. అయినా మంచిని కోరేవారికి విలువేకాదు నిలువ నీడే కరువైపోయింది.

సత్యం : బ్రతుకే బరువై పోయింది.

మోహన్ రాజు : ఉన్న వుత్సాహాన్ని నిరుత్సాహపరుచుటకు మాత్రం ప్రయత్నించకండి.

ప్రకాశ్: నీలో వున్నది ఉత్సాహము కాదు – ఉద్రేకం.

మోహన్ రాజు: ఔను ఉద్రేకమే. గాంధీజీ స్వాతంత్ర్య సమరం జరిపించడం, స్వరాజ్యము తేవటం ఉద్రేకమేగా !

సత్యం : అంతటి ఆ మహాత్మునికి లభించిన బహుమానం – ఏమిచ్చారో తెలుసుగా?

ప్రకాశ్ : ఔనురా మోహన్! మహాత్ములన్న వాళ్ళంతా మట్టిలో కలిసారు యిక మనమెంతరా!

మోహన్ రాజు : నాకు తోడుగా ఉంటారన్న నమ్మకంతోనే నేను మీ నీడ చేరాను. ప్రోత్సాహపరచ వలసిన మీరే నన్ను నిరుత్సాహపరచటం – నా దురదృష్టం.

ప్రకాశ్ : లేదురా. అందని పండ్లనాశించితే లభిస్తాయా?

మోహన్ రాజు : “అందరాని వాటిని పొందటానికి నిచ్చెన” వుందని మర్చిపోతున్నారు.

సత్యం : ప్రకాశ్! వీడి పట్టు ఉడుం పట్టురా.

ప్రకాశ్: ఒరె! మావలన నీకేం సహాయమైనా చేస్తానికి సిద్ధం.

మోహన్ రాజు : మిమ్ములను బలవంతం చేయడం అంతమంచిది కాదు. (వెళ్ళిపోతూ) వెళ్ళివస్తారా!

ప్రకాశ్ : (చేయి పట్టుకొని) నీకేమయినా పిచ్చి పట్టిందా! ఒరె! ఆపదలో ఆదుకున్నవాడె ఆప్తుడు, నిజమైన నేస్తుడు. నీది ఆపద కాదు. పవిత్ర ఆదర్శ ఆశయం అలాంటి సత్కార్యములో పాలు పంచుకోవటం కన్న మాకు కావలసింది ఏమిటి?

సత్యం: ఇంతకు మనం చేయవలసిన దేమిటి?

మోహన్ రాజు : చెప్తాను. (ఇంతలో కిశోర్ నాల్గు కాఫీలతో ప్రవేశం)

ప్రకాశ్ : అదుగో కిశోర్ కూడ వచ్చాడు.

సత్యం : ఫస్ట్ కాఫీ త్రాగి ఆ తర్వాతనే అన్నీ మాట్లాడుకోవచ్చు. (కిశోర్ అందరికి కాఫీ యిచ్చి తానొకటి త్రాగుతుంటారు)

మోహన్ రాజు : మనం ముందు ఒక సంఘాన్ని స్థాపించాలి. తర్వాత చాలా మందిని సభ్యులుగా చేర్పించాలి – ఆ తర్వాత మానవజాతి ఒకే జాతియని – “అంతా మనవాళ్ళే”నని లోకానికి చాటాలి. ఏమంటారు?

ప్రకాశ్: అయితే సంఘానికి పేరు…….

సత్యం : ఎన్.టి.ఆర్. అభిమాన సంఘమనియో లేక అక్కినేని అభిమాన సంఘమనియో పెడితే అటు – యిటు డబ్బు వస్తుంది.

కిశోర్ : ఒరె! అవి అభిమాన సంఘాలు కావు – అక్రమ సంఘాలు.

మోహన్ రాజు : (అందరు కాఫీలు త్రాగి టేబుల్ పై ఖాళీ కప్పుడు పెట్టెదరు) “ఆదర్శ యువజన సంఘము” అని పెడితే బాగుంటుందని నా అభిప్రాయం.

సత్యం : నీ అభిప్రాయానికి మా ఆమోదం లభించినట్టే !

మోహన్ రాజు : అంతకంటే నాకు కావలసింది ఏమిటిరా…..

ప్రకాశ్ : నీ ఆదర్శ ఆశయానికి ఏ ఆటంకం అడ్డురాకుండ ఈ మిత్రత్రయం – నిరంతరం అభ్యంతరం పెట్టకుండ పూర్తి సహకారం యిస్తుంది.

సత్యం : ఇప్పటికే చాలా లేట్ అయినది. ఆలస్యంగా అన్నం తింటే టేస్ట్ ఉండదు. ఆ టేస్ట్ లేని అన్నం తినడం వేస్ట్.

ప్రకాశ్ : పదరా హోటల్ కెల్లి మీల్స్ చేసివస్తాం.

(అందరూ వెళ్ళిపోదురు)

“తెర పడును”

మూడవ రంగము .

(తెర లేచేసరికి రంగాలంకరణ : లక్ష్మీపతి భవనం చూడముచ్చటైన వివిధ అలంకరణలతో ఆకర్షింపబడుతుంది. లక్ష్మీపతి సోఫాలో కూర్చుని ఏదో ఆలోచిస్తూ వుంటాడు. కొద్ది క్షణాల్లో దయానందం చేతిలో ఫైల్లు పట్టుకొని ప్రవేశిస్తాడు.)

దయానందం: ప్రెసిడెంటు గారూ….

లక్ష్మీపతి : ఓహో దయానందం మీరా ! రా!…. కూర్చో!! (కూర్చోడు)

దయానందం : ఆ ఆదర్శసంఘం చేయబట్టి మనకు ఇప్పటికే చాలా నష్టం వచ్చిందండి. అటు పైసా నష్టం – యిటు పరువూ నష్టం. ధర్మపురి పంచాయతి ప్రెసిడెంటు – సాక్షాత్తు ఆపద్బాంధవుడు – పేదల పాలిటి పెన్నిధిని నా ముందు, అందులోనూ.. ప్రజల సమక్షంబులో….

లక్ష్మీపతి : జరిగినదాన్ని గుర్తుకు తేకుంటే ఆనాటి నుండి నాలో ప్రతీకార వాంఛ దినదినము ప్రేరేపిస్తున్నది.

దయానందం : ఇదిగోండి ప్రెసిడెంటు గారు ! ఆ మోహన్ రాజును వాడి సంఘాన్ని స్మశానంగా మారిస్తేనే గాని మన పనులు జరుగకుండా వున్నవి. ఇక వూరుకుంటే లాభం లేదు.

లక్ష్మీపతి : (లేచి) వూర్కుంటె ఎలాగంటూ.. కూర్చుంటే ఎలాగయ్యా ! ఏదైనా మార్గం ఆలోచించాలి గాని. చెప్పితే విననివాన్ని చెడగా చూడాలి.

దయానందం : బాగా చెప్పారు ప్రెసిడెంటు గారు !

లక్ష్మీపతి : బాగా చెప్పడానికేం గాని, నీవే ఆలోచించి చెప్పవయ్యా !

దయానందం : ఆఁ ఆఁ నా ఆలోచన మీకన్న గొప్పదా! మీరు ఆలోచించి చెప్పాలే గాని – బ్రహ్మదేవుడే ఎదిరించలేడు – అసలు తిరుగే వుండదు.

లక్ష్మీపతి : అది సరేగాని, మన చెప్పుచేతల్లో వుండె లక్షణాలు మోహన్ రాజులో ఏమైనా వున్నాయా అని.

దయానందం : అంటే…..

లక్ష్మీపతి : నీవు “అంటే” అంటేనే నాకు మంట. అదేనయ్యా 5 వేలు ఇస్తే…

దయానందం: కాసులా…

లక్ష్మీపతి : లేకుంటే పెంకాసులనుకున్నావా!

దయానందం : పైసలకు లొంగేవాడు కాడు.

లక్ష్మీపతి : ప్రయత్నించినా…..

దయానందం :ఫలితం దొరకదు.

లక్ష్మీపతి : అయితే యమలోకానికి పంపించడమే మంచిదంటావా !

దయానందం : మంచిదే కాదు దాన్ని మించినదే లేదంటాను. అది సరేగాని మరి.. మరి.. మరి..

లక్ష్మీపతి : ఏమిటయ్యా పానకంలో పుడకలాగా ! ఆ చెప్పేది ఏదో సూటిగా చెప్పరాదు.

దయానందం : ఆఁ మరేమి లేదు. బెల్లం చుట్టు ఈగల్లాగ ప్రజలు వాడి చుట్టే తిరుగుతున్నారు. దీనివలన మనకు….

లక్ష్మీపతి : దయానందం ! నీ బుర్ర మట్టి బుర్రే. ఆ బెల్లాన్ని తీసి వేయడానికేగా మనం చేసే పని….

దయానందం : కానీ, ఎంతమంది కళ్ళను మూయగలము. కోర్టులో మనపై కేసు పెడితే….

లక్ష్మీపతి : హంతకునికి హత్య చేయడమే పని, మరోటి తెలియదు. కాని ఆ పని చేయించేవాడు అన్నీ ఆలోచించే చేస్తాడు దయానందం !

దయానందం : అయ్యా !….

లక్ష్మీపతి : ఇన్నేళ్ళనుంచి నా పర్సనల్ సెక్రటరీగా వున్నావు. యింతమాత్రమైనా తెలుసుకోకుంటె ఎలాగయ్యా నీకు. కోర్టులో దావా వేస్తే మనలాంటి వారికి నష్టము కష్టము ఏమాత్రము రాదు. లక్ష యిస్తే లాయర్ మన దిక్కు, కోర్టు కేసును కొట్టి వేస్తుంది – ఎలా వుంది పథకం.

దయానందం : అసలు మీరు సుప్రీంకోర్టులో వుండవలసిన వారండి.

లక్ష్మీపతి : ఎందుకు? పార్లమెంటులో పాసైనవి కొట్టివేయడానికా ?

దయానందం : ప్రెసిడెంటు గారు! మరి…. ఆఁ యిచ్చేది నా భత్యానికి కాదు, మనం చేయబోవు కార్యానికి అడ్వాన్సు….

లక్ష్మీపతి : నీకా!… యిక కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదినట్లే ! (ఇంతలో కిశోర్ ప్రవేశం)

కిశోర్ : ప్రెసిడెంటు లక్ష్మీపతి గారు! మోహన్ రాజు మిమ్ములను కల్సుకోవడానికి వచ్చాడు.

లక్ష్మీపతి : వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లు తానే వచ్చాడన్నమాట. లోనికి రమ్మను.

కిశోర్ : దయానందం గారు! మీరు కూడ వుండాలి…. మీతో మాకు చాలా అవసరం. (అంటూ వెళ్ళిపోతాడు)

దయానందం: (భయపడుతూ) ప్రెసిడెంటు గారు! ఎందుకు వచ్చినట్లు?

లక్ష్మీపతి : అవసరము వస్తే అడుక్కు తినేవాడి దగ్గరికి కూడా పోవలసి వస్తుందయ్యా! (మోహన్ రాజు, సత్యం వస్తారు.)

మోహన్ రాజు (ప్రవేశిస్తూ) పోవలసివస్తుందంటున్నారు…. ఎవరో !

లక్ష్మీపతి : ఎవరు ఎప్పుడు పోతారో – ఎక్కడికి పోతారో ఎవరు చెప్పగలరు?

మోహన్ రాజు చెప్పినట్లు జరుగుతుందా? చెప్పితే !

లక్ష్మీపతి : ఇంతకు మీరు ఎందుకు వచ్చినట్లు?

సత్యం: కనపడటం లేదా?

లక్ష్మీపతి : : ఆఁ అహంకారం కూడ అవలంబిస్తున్నారా?

మోహన్ రాజు : అహంకారం అధికారులకు వుంటుంది.

సత్యం: అది వారికి అలంకారం కూడ.

లక్ష్మీపతి : అసలు మీరు ఏ ఉద్దేశ్యముతో వచ్చినట్లు? మాట్లాడరేం?? ఎందుకు వచ్చారు?? ఏం పని??

సత్యం : లక్ష్మీపతి గారు! యిది ఇంటర్వ్యూ కాదండి మీ ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి.

లక్ష్మీపతి: ఎవరు నువ్వు? నేనెవర్ననుకొని మాట్లాడుతున్నావు?

సత్యం : మీరెవరో నాకు మాత్రమే కాదు, ఈ ధర్మపురి పంచాయితీ ప్రెసిడెంటు – ఈ గ్రామానికి ఏకైక లక్షాధికారులు-కాని నేను ఎవరినో తెలుసా? మంచివారికి మంచివాన్ని వంచకులకు వంచేవాన్ని.

దయానందం : (భయపడి ప్రెసిడెంటు గారు! నాకు సెలవియ్యండి. (వెళ్ళిపోవును)

సత్యం : గుమ్మడికాయ దొంగంటే భుజాలు తడుముకున్నట్లున్నది.

లక్ష్మీపతి: (కోపంతో) హేయ్ !

మోహన్ రాజు: లక్ష్మీపతి గారు! హేయ్! అరె, ఒరె అంటే పడటానికి మేము మీ యింటి నౌకర్లము కాము.

సత్యం : మనిషికి పేరుంటుందని మర్చిపోకండి నా పేరు “సత్యం”.

లక్ష్మీపతి : అదే… పైత్యం చేసినట్లుంది.

సత్యం :ఔనండి. అక్రమంగా సంపాదించే అన్నం అరగక అజీర్ణం – ఆ తర్వాత పైత్యం చేసిందండి.

లక్ష్మీపతి: మోహన్ రాజు! నీ స్నేహితుడి పద్ధతి, మాట్లాడే రీతి బాగులేదు.

మోహన్ రాజు: కూటికి పేదోళ్ళు వున్నారు. కానీ, మాటలకు పేదోళ్ళు లేరు.

లక్ష్మీపతి : మోహన్ రాజ్ ! ఆనాడు నడివీధిలో పరువు తీయ ప్రయత్నించావు. ఈనాడు సరాసరి యింటికే వచ్చి నాకే నీతిబోధలు చేస్తున్నావు. మాలాంటి వారితో మీకు వైరము అంత మంచిది కాదు. చిన్నవారంటూ వూరుకుంటుంటే నెత్తికెక్కుతున్నారు. ప్రజాసేవలోనే పరమార్ధముందని నేనీ పదవిలో వున్నాను. అయినా నేనెంత చెప్పినా అరణ్య రోధనే అవుతుంది. చందాల పేరుతో వందలకు వందలను విందులకు వినియోగిస్తూ ప్రజా బాగోగులు చూడలేని ప్రజాద్రోహిని మాత్రం కాను.

సత్యం : అన్యాయంగా అమాయకుల నోళ్ళు కొట్టి కోట్లకు కోట్లు కూడబెట్టి మేడలు, మిద్దెలు కట్టే మూర్ఖులం కాము.

లక్ష్మీపతి : ఎవర్ని ఉద్దేశించి అంటున్నావో నాకు తెలుసు ఈలాంటి వారికి ఎలాంటి సన్మానము చేయాలో కూడా బాగా తెలుసు.

మోహన్ రాజు : సన్మానము మాకెందుకండి – సమానముగా చూస్తే అంతే చాలు.

లక్ష్మీపతి : లేదు. మా తృప్తి కోసం.

సత్యం: ఇది పాతకాలం కాదు. అక్రమాలకు, దారుణాలకు దాసోహమనటం. చేసే పాపపు పనులకు ప్రాయశ్చితం యిక్కడే అనుభవించాలి, అనుభవిస్తున్నారు కూడ. అందుకే మన పరిధి దాటి ప్రయత్నించటం ఎట్టి స్థితిలో కూడ మంచిది కాదు.

లక్ష్మీపతి : మీ అదిరింపులకు, బెదిరింపులకు అదిరి, చెదిరిపోయే వ్యక్తి కాదు ఈ ధర్మపురి పంచాయతి ప్రెసిడెంటంటె !

సత్యం : ప్రెసిడెంటు కాబట్టియే కాదండి మీకీ గౌరవ మర్యాదలు.

లక్ష్మీపతి : లేకుంటే ఏం చేసేవాళ్ళో!… హద్దు మీరుతున్నారు.

మోహన్ రాజు: మీరుతున్నది మీరు.

లక్ష్మీపతి: పెద్దల ముందు బుద్ధిగా ఉండటం చాలా మంచిదంటాను.

మోహన్ రాజు : ఉc మీరా పెద్దలు?

సత్యం :కాదు. పీల్చుకు తినే గ్రద్దలు.

లక్ష్మీపతి : మందబలం చూసుకొని మొరుగుతున్న కుక్కలు.

సత్యం : ఆ కుక్కలకున్న విశ్వాసము కొందరికి ఉండదట.

లక్ష్మీపతి : మ్రింగ మెతుకు లేనివారికి మీసాలకు సంపెంగ నూనె అన్నట్లు…

మోహన్ రాజు : కూటికి కొరగానివాళ్ళు కోటికి పడగెత్తే వారిని ఎదిరించడమనియా… మీ వుద్దేశ్యం.

లక్ష్మీపతి : ఔను. చాకిరి చేసే బ్రతికేవాళ్ళకు – గొడ్డుచాకిరి చేసి బ్రతికే వారికి యింత పోకడ ఎందుకంటాను?

మోహన్ రాజు : లక్ష్మీపతి గారు! పొరబడుతున్నారు. అడ్డమైన వారికైనా గొడ్డుచాకిరి చేయడం పిరికితనం కాదు- పేదరికం.

లక్ష్మీపతి : నా యింటికి వచ్చి నా పరువూ-మర్యాదల్ని మంట గలుపుతారా? కోర్టులో పరువు నష్టం దావా వేసి మిమ్మల్ని నామరూపాలు లేకుండా చేస్తాను, చూడు!

సత్యం : ప్రెసిడెంటు గారు! ప్రతిజ్ఞలు చేసి నెగ్గించుకోవడానికి యిది ద్వాపర, త్రేతాయుగాలు కావండి! ఇది కలియుగం.

లక్ష్మీపతి : సత్యం! నోరును కాస్త అదుపులో పెట్టు.

మోహన్ రాజు: లక్ష్మీపతి గారు! వాడితో ఏమిటండి, నేను చెప్పేది వినండి.

లక్ష్మీపతి : నీవు చెప్పేది – నేను వినేది ఏమీ లేదు. హైకోర్టే కాదు, సుప్రీంకోర్టైనా సరే మీ అంతు తేల్చందే నేను నిద్రపోవుట కల్ల.

మోహన్ రాజు: చట్టాలు, శాసనాలు మానవుడు చెడిపోకుండా ఉండటానికి మాత్రమే సృష్టించుకున్నాం గాని, ఆ నియమాలతో మనిషిని చెడగొడతామనుకోవటం అన్యాయమండి.

సత్యం : ఎందుకైనా మంచిది. మీరన్నట్లు కోర్టులో దావా వేయండి. అన్నీ బయటపడటానికి అవకాశం ఉంది… మావే లెండి.

లక్ష్మీపతి : బెదిరిస్తున్నారా?

మోహన్ రాజు: ఈ కుక్కలు బెదిరించినా బెదిరేవారు కారుగా.

లక్ష్మీపతి : మోహన్ రాజ్ ! పెద్దా, చిన్నా భేదం లేకుండా మాట్లాడుతున్నారు.

మోహన్ రాజు: పెత్తనం చలాయించేవారా పెద్దలు? లేక వయసు మళ్ళినవారా పెద్దలు?

సత్యం : బుద్ధి నేర్చిన ప్రతివాడు పెద్దమనిషే !

మోహన్ రాజు: లక్ష్మీపతి గారు మీతో వాదులాట మాకెందుకు? గత నెలక్రితం వచ్చిన కరువు కాటకాలకు గురియైన ఈ ధర్మపురి సమితి గ్రామాలకు వచ్చిన ధనసహాయం విషయంలో కొన్ని విషయాలు అడగటానికి వచ్చాము.

లక్ష్మీపతి : ఆఁ ఆఁ అడగటా….ని…కి వచ్చారా?

సత్యం : మిమ్మల్ని మా వాటా అడగటానికనుకున్నారా?

లక్ష్మీపతి : నేను మాట్లాడుతున్నది నీతో కాదు.

మోహన్ రాజు: సత్యం! నువ్వూరుకో! చెప్పండి ప్రెసిడెంటుగారు! అక్కడ ఆకలి బాధలతో ప్రజలు,

ఇక్కడ మీరేమో పట్టింపు లేకుండా వుండటం….

లక్ష్మీపతి : నీకు తెలియనిది ఏముంది? ఒక్క గ్రామమనా చూసేది. అయినా యిదంతా నీకు తెలిసిన విషయమేగా – ఆఁ లెక్కలు అడిగారుగా… ఇప్పటికి 50 వేల రూపాయలు ఖర్చు అయినవి.

సత్యం : అన్యాయం, అక్రమం, అవినీతి

మోహన్ రాజు: అంత తొందరెందుకురా? కాస్త ఓపిక పట్టు. ఏమండి ! 25 వేలయినా ఖర్చయినట్లు కనపడటం లేదు, మీరేమో…..

సత్యం : ఖర్చులు కంటికి కనపడవు వారి లెక్కల బుక్కుల్లో……

మోహన్ రాజు: మిమ్మల్ని అడిగేవారు లేరు గదాయని యిష్టం వచ్చినట్లు లెక్కలు తీస్తారు.

లక్ష్మీపతి : తింటూ రుచి అడగటం ఎందుకు? తెలిసీ అడగటం దేనికి ??

మోహన్ రాజు: ఇంతకు 50 వేలు ఖర్చయినవా?…

లక్ష్మీపతి : అబద్ధం చెప్పటం నా జీవితంలోనేలేదు.

సత్యం : ఔనౌను, మీరు సత్యహరిశ్చంద్రుని సంతతి వారనుకొంట.

లక్ష్మీపతి : సత్యం జాగ్రత్తగా మాట్లాడటం నేర్చుకో!…

మోహన్ రాజు: మీరు నేర్పవలసినది మాకేమీ లేదు. అయినా తక్కినవారి విషయం?

సత్యం : తమ పార్టీవారి – విందులకు, వినోదాలకు.

మోహన్ రాజు: అన్యాయాలకైనా ఒక హద్దుండాలి.

లక్ష్మీపతి : అసలు మీరెవరు? నన్ను లెక్కలడగటానికి ?

మోహన్ రాజు: అనాధ ప్రజానీకానికి ఆదరణ కావాలని, సుఖ దుఃఖాలను సమానంగా అందరూ అనుభవించాలని కోరే “ఆదర్శ యువజన సంఘ” ప్రతినిధులం.

సత్యం : “అంతా మనవాళ్ళే”నని అందరికీ సమాన హక్కులు కావాలని కోరే….

లక్ష్మీపతి : సమైఖ్యతావాదులు …..

మోహన్ రాజు: లక్ష్మీపతి గారు! మాకు కావలసింది లెక్కలు కావు. డొక్కలు నిండాలి. ఏది క్రమంగా జరుగకపోయినా అడిగే హక్కు ప్రజలకు వుంది. చెప్పే బాధ్యత మీది.

లక్ష్మీపతి : ప్రజా ప్రభుత్వమంటే పదవిలోనున్న వారిని, అధికారులను హద్దూ పద్దూ లేకుండా అడిగితే సమాధానమిచ్చేది కాదు ప్రభుత్వం – ఎప్పుడూ ప్రభుత్వమే !

మోహన్ రాజు: హుఁ “ప్రజా…. ప్ర..భు…త్వం”. “ప్రజా ప్రభుత్వం” కాదు మీలాంటి వారి కొరకు వెలసిన “ప్రభూ ప్రభుత్వం”. “అధికార దాహంతో కోరికల ప్రవాహములో కొట్టుకు పోతూ సామాన్యునికి సాయం చేస్తానంటూ వేదికలపై బల్లగుద్ది వాదనలు చేసే ప్రగల్భ ప్రజా ప్రతినిధుల కొరకు ప్రజా ప్రభుత్వం”…

“సామాన్య ప్రజల కళ్ళను కాసులతో కప్పి, విజయం సాధించి “వచ్చిన” లంచాలతో, ఆర్జించిన సంపాదనతో “వెచ్చగా” తన ఆలుబిడ్డలతో “పచ్చగా జీవించే “తుచ్ఛపు” నేటి ప్రజాప్రతినిధుల కొరకు ప్రజా ప్రభుత్వం”……

“మంచి” మాటలతో మచ్చిక చేసుకుని “కుంచి”త భావాలతో “వంచించి” తమ స్వార్థమునే పరమార్థముగా “ఎంచు”కునే ప్రజా“వంచ”కులైన నేటి ప్రజా ప్రతినిధుల కొరకు ఈనాటి ఈ సర్వ…సత్తాక.. గణ…తంత్ర.. ప్రజా.. స్వామ్యములోని ఈనాడు నెలకొన్న ప్రజా ప్రభుత్వం…. ఇది ప్రభుత్వం కాదు. దానిపేరుతో నడుస్తున్న పశుత్వం – రాక్షసత్వం – అసమానత్వం.

లక్ష్మీపతి : మోహన్ రాజ్ ! ఉడుకు రక్తపు ఉద్రేకంతో ఉరకలు వేస్తున్నావు – అనరాని మాటలు అంటున్నావు.

సత్యం : ఇవి అనరాని మాటలు కావు – మీరు వినరాని మాటలు.

లక్ష్మీపతి : స్వతంత్ర భారత పౌరుడవన్న విషయం మర్చిపోతున్నావు. అందరిమీద పెద్దరికం చలాయించడానికి, విమర్శిస్తానికి కాదు ప్రభుత్వమిచ్చిన “వాక్” స్వాతంత్ర్యం.

మోహన్ రాజు: (వత్తి పల్కును) స్వా…తం…త్రం… ఏది స్వాతంత్ర్యం? అధికారుల అడుగులకు మడుగులొత్తటమా, లేక పెత్తందార్ల దారుణాలకు దాసులై వారు చెప్పే తప్పుడు పనులను గతిలేక ఒప్పుకుంటు తన జీవితాన్ని నరకప్రాయంగా మార్చుకొనటానికా, జాతిపిత గాంధీజీ, నవభారత నిర్మాత నెహ్రూజీల వంటి త్యాగధనులు సాధించి మనకిచ్చిన స్వాతంత్ర్యం యిదేనా? ఆ మహానుభావులు ఆశించిన రామరాజ్యం యిదేనా?

సత్యం : వారు కోరింది రామరాజ్యం – ఈనాడు వెలిసింది క్షామరాజ్యం.

మోహన్ రాజు: “కట్టెల” కొరకు “గుట్టల”నెక్కి, “పెక్కు యిక్కట్టులు” పడుతూ, “వీపుల” మీద “మోపులు” మోసే కష్టజీవులకు అందుతున్నదా స్వాతంత్య్రం?

కలిగిన కండర బలాలతో భూమిని దూదిగా చేసి, రక్తాన్ని “పిండి”, నవధాన్యాలు “పండించి”, ధనికుల ధాన్యపు “గొట్టాలను” దట్టముగా నింపి, అర్ధాకలితో అలమటించే రైతు సోదరులకు అందుతున్నదా స్వాతంత్య్రం?

సంపన్నుల యిళ్ళలో వెట్టిచాకిరి చేయుచూ, పులిని చూచిన జింక “పిల్లలు”లాగా, అదిరి, బెదిరి “వొల్లును” విల్లులా వంచి తన సర్వస్వాన్ని అర్పించే కూలీ జీవులకు అందుతున్నదా స్వాతంత్ర్యం?

కటిక దరిద్రాన్ని అనుభవిస్తూ, దినమొక యుగముగా గడుపుతూ, “పొట్ట”లోకి పిడికెడు అన్నాన్ని “నెట్టు”కుంటు దిక్కులేని పక్షుల్లా బ్రతికే రిక్షావాళ్లకు అందుతున్నదా స్వాతంత్ర్యం?

లోహములను గంటల తరబడి “మరిగించి”, వెన్నలా “కరిగించి” చాలీచాలని జీతాలతో జీవితాలను వెలిబుచ్చే కార్మికలోకానికి అందుతున్న స్వాతంత్య్రం?

తమ స్వార్థమే పరమపూజ్యముగా – అదే తమ పరమార్థముగా భావించి, అందులకు నిదర్శనముగా అక్రమాలు చేయుచు, అవినీతులకు ఒడిగట్టెడి వారికి, ప్రజా ప్రతినిధుల పేర చలామణి అవుతున్న ప్రజాద్రోహులకే స్వాతంత్ర్యం వచ్చింది. లక్ష్మీపతి గారు! పేదలకు యింకా స్వాతంత్ర్యము రాలేదు.

లక్ష్మీపతి : నీ ఉపన్యాసం చాలు గాని వచ్చినదారి పట్టండి.

సత్యం: చెవిటివారి ముందు శంఖం ఊదితే లాభం లేదు.

లక్ష్మీపతి : నేను చేసిన ప్రజా ద్రోహమేమిటో కోర్టుకెల్లి విన్నవించుకోండి. కాని యిలా నాతో వాదులాడితే లాభం లేదు.

మోహన్ రాజు: ప్రతి మనిషి యొక్క మనసు ఒక కోర్టేనండి !

లక్ష్మీపతి : అధిక ప్రసంగాలు ఆపండి.

సత్యం: ఈనాడు కాకున్నా ఏనాటికైనా మీ అక్రమాలు అంతరించే రోజు రాకపోదు – మేము చూడకపోము.

లక్ష్మీపతి : మర్యాదగా చెప్తున్నాను – పోతారా లేక పోలీసుల్ని పిలవమంటారా?

మోహన్ రాజు: మీకంత శ్రమ ఎందుకు? మేమే పోతాము.

సత్యం : ఎందుకంటే – పోలీసుల్ని పిలవాలంటే ఫోను చెయ్యాలి- కొంత టైమ్ కూడ పడుతుంది.

మోహన్ రాజు : పదరా సత్యం! ప్రెసిడెంటు గారు వెళ్ళొస్తాం.

(మోహన్ రాజు – సత్యం నిష్క్రమణం)

లక్ష్మీపతి : (ఆవేశం ఆపుకోలేక) వచ్చిపోయే దానికి యిది ధర్మసత్రమనుకున్నారా! వెళ్ళండిరా వెళ్ళండి. మళ్ళీ రావలసిన కష్టాన్ని తప్పిస్తాను. మోహన్ రాజ్ ! పులితో చెలగాటమాడుతున్నావు. పగబట్టిన త్రాచుపాము కాటువేయక మానదు.

(దయానందం ప్రవేశం)

దయానందం : అయ్యా ! ప్రెసిడెంటు గారూ !….

లక్ష్మీపతి : (వెటకారంగా) వచ్చారా దయానందం గారూ….

దయానందం : వచ్చానండి.

లక్ష్మీపతి : ఆ మోహన్ రాజు, వాడి స్నేహితుడు నన్నెన్నెన్ని మాటలన్నారో చూసారుగా…

దయానందం : అంతా విన్నానండి.

లక్ష్మీపతి : ఆఁ మీకు చూసే ధైర్యం లేదని నాకు తెలుసులెండి. ఏదో సాకు చెప్పటం లోపలినుండి చూస్తూ, అంతా వినటం నీకు మామూలేగా.. దయానందం !

దయానందం : అయ్యా !

లక్ష్మీపతి : ఇంత పిరికైతే ఎలాగయ్యా ! నిన్ను సెక్రటరిగా పెట్టుకున్నందుకు నాకు ఎలాగుందో తెలుసా?….

దయానందం : చెప్పితే కదండీ తెలిసేది.

లక్ష్మీపతి : కొరివితో తలగోక్కున్నట్లుంది.

దయానందం : అమ్మమ్మమ్మ.. అంత మాట అనకండి. మీరు ప్రెసిడెంటుగా ఎన్నిక కావటానికి నేను ఎన్నెన్ని….

లక్ష్మీపతి : ఆర్గుర్ని హత్య చేయటానికి అరలక్ష ఖర్చు పెట్టించావు, పైగా 5వేలు తీసుకున్నావు.. అంతేగా !… ఆఁ రంగడున్నాడా?

దయానందం : మొన్ననే కదండీ, వీరయ్య కొడుకుని చంపి జైలుకెళ్లింది.

లక్ష్మీపతి : షూఁ… అంతగా అరవకయ్య, మోహన్ రాజుకు కూడ….

దయానందం : కైలాసం చూపమంటారా ? మీరు అనడము నేను కాదనటమూ! మీ మాట కాదన్న వారికి ఫలితం అదేగా….

లక్ష్మీపతి : సింగన్ని పిలువు.

దయానందం : (లోనికి వెళ్ళి సింగన్ని తోలుకు వచ్చాడు)

సింగన్న : బాబుగారు ! ఎందుకో పిలిచారు. ఏ పని అంటే ఆ పని చేయడం ఈ సింగన్నకు అలవాటే!

లక్ష్మీపతి : అంతటి సాహసవంతుడవనియేగా, నీకు ఈ పని వప్పు చెప్పుచున్నది. (ప్రక్క జేబులోంచి రెండు నోట్లకట్టలు తీసి యిస్తూ) యిదిగో నీ కష్టానికి అడ్వాన్సుగా రెండొందలు. (తీసుకుంటాడు).

సింగన్న : చెప్పండి బాబు ! ఏమిటీ మామూలు పనే అనుకుంటా.

దయానందం : అన్నట్టే…

సింగన్న : ఎవడా అదృష్టవంతుడు?

లక్ష్మీపతి : ఆదర్శ యువజన సంఘ స్థాపకుడు, దానికి అధ్యక్షుడు, ఆపద్బాంధవుడు, అనాథలకు ఆత్మీయుడు “మోహన్ రాజు”

సింగన్న : మంచిది బాబు గారు (వెళ్ళబోతాడు)

లక్ష్మీపతి : సింగా! వాడు వచ్చిపోయింది యిప్పుడే ! ఈ పని జరగవలసింది ఈరోజు కాదు. మూడు రోజుల్లోగా…

సింగన్న: ముగింపు. (వెళ్ళిపోతాడు)

దయానందం : ప్రెసిడెంటు గారు! (నీళ్ళు నములుతూ) నా కానుక ఏదో కొద్దో గొప్పో…..

లక్ష్మీపతి: తప్పుతుందా? (జేబు నుండి ఒక నోట్ల కట్ట తీసి యిస్తాడు. దయానందం కళ్ళ కద్దుకుంటాడు. తన హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుంటు)

దయానందం : ఇక నాకూ సెలవు యిప్పిస్తే!

లక్ష్మీపతి : వెళ్ళిరా ! ఇదిగో దయానందం ! ఈరోజు రాత్రి మీటింగు వుంది. మన కమిటీ సభ్యుల్ని మా యింటికి రమ్మను, రాత్రికి నీవు కూడ రావాలి.

దయానందం : (భయముతో) నే…నా!

లక్ష్మీపతి : నీవు లేకుంటే ఎలా సెక్రటివి. ఆ! తప్పక రావాలి.

దయానందం : మంచిదండి! (వెళ్ళిపోతాడు)

(లక్ష్మీపతి లోనికి వెళ్ళిపోతుండగా)

తెర పడును.

  • నాలుగవ రంగము —

(తెర లేచేసరికి అలంకరణ ఎదురు గోడకు బోర్డు – బోర్డులో యిలా వ్రాసి వుంటుంది. “ఆదర్శ యువజన సంఘము” క్రింద “ధర్మపురి” అని వుంటుంది. దాని క్రిందనే గాంధీ మహాత్ముని పటము – ఇరువైపుల నెహ్రూ, శాస్త్రీల ఫోటోలు వుంటాయి. పటాలకు రంగుల పూలదండలు వేసి వుంటాయి. గది అంతా అలంకరింపబడినట్లు వుంటుంది. నాల్గు కుర్చీలు వుంటాయి. ఒక టేబుల్ దానిపై కొన్ని పుస్తకాలు సర్ది పెట్టినట్లుంటుంది. కొద్ది క్షణాలు నిశ్శబ్దం)

(ప్రకాశ్, కిశోర్ ల ప్రవేశం. ఒక చేతి సంచిలో టెంకాయ, అగర్ బత్తీ పొడి, హారతి కర్పూరం, కొన్ని పూలు మొ||గు పూజా సామాగ్రితో కిశోర్, ప్రకాశ్ వెనుక వస్తాడు).

ప్రకాశ్ : మోహన్, సత్యం యింకా రానట్టున్నారు! కిశోర్! ఆ బ్యాగ్ ఆ టేబుల్ పై పెట్టి మోహన్ ను తొందరగా రమ్మను.

కిశోర్: (బ్యాగ్ ను పెట్టి) ఎక్కడున్నాడురా ?

ప్రకాశ్ : సూరయ్య యింటికి పోయివుంటాడు. మనకు యింకా చాలా కార్యక్రమాలున్నవి. వెళ్ళిరా.

(కిశోర్ వెళ్ళిపోవును. ప్రకాశ్ బ్యాగ్ లో నుంచి టెంకాయ తీసి పొట్టు వొలుస్తుంటాడు. కొద్ది క్షణాల తర్వాత మోహన్ రాజు, సత్యం ప్రవేశిస్తారు.)

మోహన్ రాజు: ఎప్పుడొచ్చావురా ప్రకాశ్?

ప్రకాశ్: యిప్పుడేరా !

సత్యం : కిశోర్ ఎక్కడ?

ప్రకాశ్ : మీ వద్దకు రాలేదా?

మోహన్ రాజు: ఎక్కడికి తోలిచ్చావురా ?

ప్రకాశ్ : సూరయ్య యింటికి.

కిశోర్ : (ప్రవేశిస్తూ -అందర్ని చూసి) ఒరే ! ఎక్కడున్నారూ… తిరిగి తిరిగి…

సత్యం : తిన్న అన్నం అరిగిపోయింది. కాఫీ త్రాగకపోయావా?

ప్రకాశ్ : టెంకాయ పొట్టు తీయడం అయిపోతుంది. కాఫీ త్రాగించమని మరొకనికి టోపీ వేయడం వాడిచేత కాదు. అయినా వాడికి అలాంటివారు దొరకరు కూడా.

సత్యం : 55 కోట్ల భారతీయులలో ఒక్క కాఫీ పైసలు భరించుకునే పుణ్యాత్ముడు కూడా లేడా..? ఇదీ ఒక దేశమా ?

ప్రకాశ్: సందేహమా? (టెంకాయను శుభ్రపరుస్తుంటాడు)

మోహన్ రాజు: మీ యిద్దరికి ఎప్పుడూ వాదులాటలే… (చేతివంక చూసి) ఇప్పటికే చాలా ఆలస్యమయినది. ప్రకాశ్! అన్నీ తెచ్చారా?

ప్రకాశ్ : అదిగో ఆ బ్యాగులో వున్నది.

(మోహన్ రాజు లోపలికెల్లి ఒక పళ్లెరము తెచ్చి అందులో టెంకాయ, అగర్బత్తుల పొడి, కర్పూరం, పూలు పెట్టాడు. ఎడమవైపు ప్రకాశ్, కిశోర్ – కుడివైపు సత్యం ఉంటారు. అందరూ మనసులో ఏవేవో కోరుకుంటూ మహాత్మునకు నమస్కారములు పెట్టెదరు. మోహన్ రాజు అగర్వత్తులు ముట్టిస్తాడు. హారతి వెలిగించి, పూల వర్షం కురిపిస్తాడు. తర్వాత టెంకాయ కొట్టుతాడు).

సత్యం: మహాత్మాగాంధీకి…..

అందరు : “జై”

ప్రకాశ్: ఆదర్శ యువజన సంఘానికి….

అందరు : “జై”

సత్యం: “ఆదర్శ యువజన సంఘం”

అందరు : “వర్ధిల్లాలి”

మోహన్ రాజు: (హారతి యివ్వగా అందరూ స్వీకరిస్తారు. హారతిని ప్రక్కకు పెట్టి) ప్రకాశ్, సత్యం, కిశోర్! మిమ్ములను స్నేహితులుగా పొందటము నా అదృష్టమురా. నా ఆదర్శ ఆశయ సాధన కోసం మీ చదువును కూడ లెక్కచేయక నాకు చేస్తున్న మీ ఆదరణ, చూపిస్తున్న అభిమానానికి ఎలా కృతజ్ఞత చెప్పాలో నాకు తెలియటం లేదురా !

ప్రకాశ్ : మోహన్! “విద్య నేర్చేది కేవలం ఉద్యోగ సాధనకు మాత్రమే అయి వుండకూడదు. దానివలన సంపాదించిన విజ్ఞానము అజ్ఞానముతో అలమటించే ప్రజానీకానికి వెలుగు చూపేదిగా వుండాలి”రా.

సత్యం : ఔనురా. నీ ఆదర్శ ఆశయ సాధనలో మాకు అవకాశం కల్పించి – మాకు ఆనంద జీవితాన్ని అందించావు.

కిశోర్ : నీ పవిత్ర ఆశయం తరతరాలకు ఫలితాన్ని అందించాలని నేను ఆ భగవంతుని కోరుకుంటున్నాను.

మోహన్ రాజు: (ఆనందముతో) మీ ఆదర్శ స్నేహానికి నేను ఆనందిస్తూ, అభినందిస్తున్నానురా. ఆఁ మరిచే పోయాను. కిశోర్! ఇన్విటేషన్ కార్డ్స్ అందరికి పంచావా? వచ్చే జనవరి 30 తారీఖే మన సంఘపు వార్షికోత్సవము.

కిశోర్ : ఇంకా కొన్ని వున్నవిరా.

ప్రకాశ్ : అవికూడా తొందరగా పంచిరా. రిహార్సల్సు పెట్టాలి.

మోహన్ రాజు: వాడిది ఓ పాట వుంది కదరా – అది ముందు పాడి వెళ్ళరా. ఎందుకంటె నీవు వచ్చేసరికి కనీసం మూడు గంటలైనా కావచ్చు.

సత్యం : ఈ కిశోర్ పాడితే హిందీలో కిశోర్ కుమార్ పాడినట్లే! (హేళన చేయ ప్రయత్నిస్తాడు) అనుకుంట !

ప్రకాశ్ : ఈ సత్యం పాడితే తెలుగులో మాదవపెద్ది సత్యం పాడినట్లే!

మోహన్ రాజు: మీ మాటలకేం గాని.. కిశోర్ కానివ్వరా (అంటూ రిహార్సల్సు ఫైలు తీస్తుంటాడు)

కిశోర్ : మోహన్! తక్కిన రిహార్సల్సు కానివ్వు ముందు నేను వచ్చినంక నా రిహార్సల్సు చూస్తావు గాని వెళ్ళొస్తా (అంటూ డ్రాయర్ తీసి అందులోని కార్డులను తీసుకొని వెళ్తాడు).

సత్యం : ఒరే కిశోర్! తొందరగా రారా – లేకుంటే నాకు బోర్ కొడుతుంది.

ప్రకాశ్ : కిశోర్ లేనప్పుడు షిశోర్ కెళ్ళు – బోర్ పోతుంది.

మోహన్ రాజు: ఒరె ఇంతరు రిహార్సల్సు కానిస్తారా లేదా? – ప్రకాశ్! ఏమిట్రా నీవూ సత్యంగా మారుతున్నావు.

సత్యం : అయితే యింకేం “అభినవ సత్యం”అని ఒక బిరుదు ప్రదానం చెయ్యాల్సిందే !

మోహన్ రాజు: ఒరే సత్యం! నువ్వు కాస్త వూర్కుంటావా లేదా? ఆఁ రెడీగా వుండు. ఆఁ మొదలు పెట్టు. నీ రిహార్సల్సు చూస్తాను.

ప్రకాశ్: (కూర్చుని చూస్తుంటాడు)

మోహన్ రాజు: (రిహార్సల్సు చూస్తుంటాడు – మధ్య మధ్య అందిస్తూ ఉంటాడు)

సత్యం : భళా దుస్సాశనా ! భళా !! (ఉచిత రీతిలో రాదు)

మోహన్ రాజు: అలా కాదురా కాస్త గట్టిగాను, గంభీరముగాను – సగర్వముగా పలకాలి. చూడు “భళా దుశ్శాసనా ! భళా!!” (ఉచిత రీతిలో వస్తుంది)

సత్యం : (అదే రీతిలో) “భళా దుశ్శాసనా ! భళా!!” (కుర్చీ ప్రక్కగా, కాస్త ముందు నుండి స్త్రీ కంఠంతో) “దుర్మార్గుడా ! పతివ్రతనని తెలిసీ పరాభవించుతావా !” (కుర్చీని సింహాసనముగా భావించి) “క్షమించు పాంచాలి. ఒక్క ఆడదాన్ని ఐదుగురు భార్యగా పొందినటువంటి నీ భర్తల వంటి వెర్రివాన్ని మీరు నాకు కల్గించిన మానసిక వేదన కన్నా గొప్పగా నా పరాభవము. అదిగో చూడు పులుల వంటి నీ పతులు పిల్లులుగానున్నారు” – (కుర్చీ నుండి లేచి ప్రక్కగా నిలిచి) “దుర్యోధనా!” (గట్టి అరుపు) – (తిరిగి యథాస్థానమునకు వచ్చి) “ఓహో… భీమా! నీవా. రోషము వచ్చినట్లుంది.” (కుర్చీ దిగి దానికేసి చూస్తూ) “సుయోధనా! ఏనాడో రానున్న చావును ఈనాడే కోరుకుంటున్నావు.” (కుర్చీ ఎక్కి) “చాలించు భీమా! నీ నీతివచనాలు. బెబ్బులిని బెదిరించ బోకు. నీవిప్పుడు నా పాదాక్రాంతుడవు. తక్కిన నీ సోదరులు నా సేవకులు. ద్రౌపది నా పాదదాసి. అనవసరముగా నా అభీష్టానికి అడ్డువచ్చి కోరి కష్టాలు తెచ్చుకోకు.” (కుర్చీ దిగి) “దుర్యోధనా! కురు సామ్రాజ్య సార్వభౌముడనని విర్రవీగకు. పాలివాడవయినందున నీ మేలుకోరి చెప్తున్నాను విను” (కుర్చీ ఎక్కి గర్జిస్తూ) “హేయ్! ఒక బానిస.. నా మేలుకోరి చెప్పుటయు – నను హెచ్చరింటయా! భీమా! పులికి పిల్లికి పొత్తు కుదరదు. పాలివాడు పాములాంటి వాడు. పాలు పోసి పెంచినా కాటు వేయక మానదు. నీవా నాకు చెప్పుచున్నావు. లేదు. మాట తప్పుచున్నావు. జూదములో చేసుకున్న ఒడంబడికను ఉల్లంఘిస్తున్నావు. హుఁ ధర్మరాజు అనుంగు సోదరులలో అగ్రజుడవైన నీవా ఈరోజు ధర్మాన్ని అతిక్రమించుట. ఆహా! ఎంతకు దిగజారిపోయింది మీలో ధర్మం.” (కుర్చీ దిగి దానికేసి చూస్తూ) “దుర్యోధనా! శాంతి సింహాన్ని కవ్విస్తున్నావు” (కుర్చీ ఎక్కి “లేదు. నిద్రబోయిన బెబ్బులిని లేపుతున్నావు” (చప్పట్లు కొట్టి) “ఎవరక్కడ?” (కుర్చీ దిగి యుండి) “సుయోధనా! అధర్మానికి పాల్పడితివా అరక్షణం కాదు నిన్ను అంతమొందించడానికి” (కుర్చీలో వుండి) “చాలించు నీ భీరములు. కౌంతేయా! నీవిప్పుడు నా చేతి కీలుబొమ్మవి. ఆడించినట్లు ఆడాల్సిందే గాని….’ (కుర్చీ దిగి) “అగ్రజా, ధర్మనందనా! అనుమతించండి.. ఈ దూర్తుని అంతు తేలుస్తాను”. (కుర్చీ ఎక్కి) “భీమా! నీ అగ్రజుడు అనుంగు సోదరులు ఈ రారాజుకు బానిసలన్న విషయం మర్చిపోతున్నావు” (కుర్చీ దిగి) “లేదు. ఏనాటికైనా నీ మరణం నావల్లనే కల్గుతుందని నీవూ మర్చిపోకు” (హేళనగా) “రా..రా..జూ!” (కుర్చీ దిగి శాంతంగా ధర్మరాజుగా) “భీమసేనా! శాంతించు. ఆడిన మాట తప్పటం ధర్మం కాదు.” (కుర్చీ దిగియుండియే) “శాంతి… శాంతి… అగ్రజా! యిది శాంతి గాదు వట్టి భ్రాంతి” (కుర్చీ ఎక్కి “కౌంతేయా! అనవసరముగా నా ఆగ్రహానికి లోనై ఆపదలకు, అవమానాలకు పాలుగాకు” (కుర్చీ దిగి) “ఓరీ దుష్ట… దు..ర్యో.. ధనా!” (తొందరగా కుర్చీ ఎక్కి మిక్కిలి గాంభీరముగా వీరరసముట్టిపడగా) “హేయ్! సకల సామంతరాజులు సేవించుచుండ, శత సోదరులకు అగ్రజుడనై, బహు బంధు, మిత్ర, పరివార సమేతుడనై, అఖండ భూమండలంలో ప్రచండ పరాక్రమవంతుడని పేరుగొన్న… ఈ కురు సామ్రాజ్యాధిపతిని – యింత మంది సభాసభ్యుల ముందు అవమానమా ! మానధనుడైన ఈ సుయోధన చక్రవర్తి సహించటమా ! నాకు జరిగిన ఈ పరాభవానికి ప్రతీకారం చేసి తీరుతాను. ఓరీ బానిస! ఈ నిండు సభలోనా గుండె పగిలేటట్లు “దుష్ట దుర్యోధనా” అంటూ సంబోధించెదవా! చూడు దానికి ఫలితం. మీ అందరి ముందే ఈ సభా సమక్షంబులోనే మీ భార్యను పరాభవించెద గాక… (గట్టిగా) దుశ్శాసనా! (కుర్చీ దిగి ప్రక్కనే ) – “అగ్రజా! ఆనతి”. (కుర్చీ ఎక్కి) “జాగు చేయక ఈ పాంచాలి కట్టుపుట్టంబులు లాగి నాకు మదీయ బంధువులకు నేత్రోత్సవము కలిగింపు” (కుర్చీ దిగి ప్రక్కగా నిలిచి) “చిత్తము. రావే పంచభర్తకి పాంచాలి!” (ఏడుస్తూ) “కరుణామయులారా కాపాడండి! అన్యాయాన్ని అరికట్టండి! స్వామీ ధర్మప్రభూ ! ఈ మగనాలికి జరుగుచున్న పరాభవాన్ని చూస్తూ కూడా మౌనముగా నున్నారా! ఓ సభాసదులారా! ఆడదాన్ని! పాండురాజు కోడలిని, రండి అన్యాయాన్ని ఎదిరించండి. అయ్యో! పతివ్రతలు పరాభవానికి బలి కావాలా? హే కృష్ణా! ముకుందా!! మురారీ!!! అనాధ రక్షణ ! ఆపద్భాందవా!! ఆదుకో దేవా!!! కృష్ణా ! కృష్ణా !! కృష్ణా !!! కృష్ణా!!!! కృష్ణా!!!!!” (అంటూ తనచుట్టూ తాను తిరుగుతాడు. మోహన్రాజు, ప్రకాశ్ చప్పట్లు కొట్టుతారు)

మోహన్ రాజు: ఆఁ తర్వాత బుర్రకథను కూడ రిహార్సల్సు చూద్దాం.

సత్యం : బుర్రకథ తర్వాతగాని ముందు భోజనము చేద్దాం పదండి !

ప్రకాశ్ : కిశోర్ కూడా రానీయ్. అందరం ఒకేసారి చేద్దాం.

సత్యం : అల్లుడు వచ్చేదాక అమావాస్య ఆగుతుందా? నాకు ఆకలి మండిపోతోందిరా.

మోహన్ రాజు: ప్రకాశ్! నువ్వు, సత్యం వెళ్ళి భోజనం చేసి రండి.

సత్యం: పదరా ప్రకాశ్ !

ప్రకాశ్: ‘మోహన్’ నీవు……

మోహన్ రాజు: మన వార్షికోత్సవమునకు వచ్చే మంత్రులకు – ఇతరు నాయకులను మెమోరాండము రాయాలి. ఒక అరగంటలోనే వస్తా.. మీరు వెళ్ళి రాండి ముందు.

సత్యం: పదరా. (ప్రకాశ్, సత్యం నిష్క్రమణం)

(మోహన్ రాజు ఒక పేపరు-పెన్ను తీసుకొని రాస్తుంటాడు. దాదాపు రెండు నిమిషాలు గడిచిపోతుంది. ఇంతలో సింగన్న చేతిలో కత్తి పట్టుకొని భయంకరముగా మోహన్ వెనుకగా అవకాశం కోసం ఎదిరి చూస్తుంటాడు – నిముషం గడుస్తుంది. సింగన్న వ్రాస్తున్న మోహన్ రాజు గుండెలో కత్తితో పొడిచి, వెళ్ళిపోతాడు).

మోహన్ రాజు: (రక్తం ఏకధారంగా స్రవిస్తూ తెల్లని బట్టలను ఎఱ్ఱగా మారుస్తుంది. ఆయాసముతో) అమ్మా! ఆఁ…ఆఁc…. అమ్మా! (సోలుతూ) మీ మాట దాటి వచ్చిన.. మీ.. కొడుక్కు… చూసారా అమ్మా ! నాన్నగారు !! ఫలితం.. నా ప్రాణత్యాగం. (బాధతో) అయినా నాకు… బాధ ఒక్కటేనమ్మా ! అది నా.. ఆయువు.. తీరిందని.. కాదు. నా ఆదర్శాన్ని, నా ఆశయాన్ని నెరవేర్చ…క ముందే పోతున్నానని… ప్రకాశ్ !… సత్యం !… కిశోర్! ఈనాటితో …నాకు మీతో ఋణం తీరింది. నా ఆదర్శ సాధన కోసం మీ చదువును కూడ… లెక్క…. చేయక… నాతో సహకరించి.. నందుకు..మరోకమారు అభినందిస్తున్నాను. అమ్మా ! నా ఆదర్శం కోసం… మీకు… పుత్రశోకం…కలిగించి నందులకు… మన్నించమ్మా ! (అధికమైన బాధతో) అమ్మా!… అంతా మనవాళ్ళే నమ్మా! అంతా మనవాళ్ళేనమ్మా (హఠాత్తుగా) అమ్మా! (ఆ అరుపుతోనే ప్రాణం విడుస్తాడు)

—బ్యాక్ గ్రౌండులో పాట—

అయ్యో… మానవజ్యోతి ఆరిపోయిందీ…

అంతా మనవాళ్ళే నన్నవాదం మిగిలింది.

ఓ… పేదల పాలిటి పెన్నిధి

చేరితివా దేవుని సన్నిధి                                 II ఓ… II

జాతులు లేవని మతాలు లేవని

మానవజాతి ఒకటేనని

మహిలో చాటావు ఈ భారతభూమిలో చాటావు

ఈ… లోకం… వి..డి..చా..వు – మాకు శో..కం.. పెట్టావు

(ప్రకాశ్, సత్యం, కిశోర్ ప్రవేశిస్తారు. అందరూ మోహన్ శవాన్ని చూస్తారు. గుండె ఆగిపోయినట్లవుతుంది)

ప్రకాశ్ : (గట్టిగా) మోహన్ ! (అని అరుస్తాడు. అందరూ చుట్టూ వుండి బాధపడుతూ దుఃఖి స్తుంటారు.) ఎంత పని జరిగినదిరా !!

కిశోర్ : మోహన్ ! ఇన్విటేషన్ కార్డ్స్ అన్నీ పంచానురా.. యింకేం పని చెప్పు చేయాలో చెప్పరా.

సత్యం : మాట్లాడరా మోహన్ ! నన్ను సొంత సోదరునిగా చూసావు. నీ తమ్మునితో మాట్లాడరా మోహన్ ! (లేచి ముందుకు వచ్చి ఏదో ఆలోచిస్తుండగా తెరలో లక్ష్మీపతి మాటలు వినబడుతవి).

“ఎవరు ఎప్పుడు పోతారో – ఎక్కడికి పోతారో ఎవరు చెప్పగలరు”.

“ఈలాంటి వారికి ఎలాంటి సన్మానము చేయాలో కూడా బాగా తెలుసు” (ఇదే రెండు సార్లు వినవస్తవి).

(మోహన్ రక్తాన్ని తీసి) మోహన్! నీ ప్రాణం తీసిన వానికి – తీయించిన వానికి తగిన శిక్ష వేయనిదే మేము నిద్రపోము – మోహన్ నిద్రపోము. (అందరూ విచారిస్తుండగా)

XXX తెర పడును xxx

—అయిదవ రంగము —

(అంతా మూడవ రంగం వలనే – వీలైతే డ్రెస్సు మార్చుకోవచ్చు. లక్ష్మీపతి పచార్లు చేస్తుంటాడు. దయానందం నిల్చుని వుంటాడు. కొంతకాలం నిశ్శబ్దం)

దయానందం: అయ్యా ! ప్రెసిడెంటు గారు !!

లక్ష్మీపతి : ఇదిగో నీకెన్నిసార్లు చెప్పినా కుక్కతోక వంకరన్నట్లు నీ బుద్ధి పోనిచ్చావు కాదు. నోరు మూసుకొని పడివుండు. లేదా ఇంటికన్న వెళ్ళు. అనవసరంగా నన్ను విసిగించకు.

దయానందం : పెద్దలు. నన్ను నీళ్ళ ముంచినా, పాల ముంచినా అంతా మీ దయ.

లక్ష్మీపతి : (చిరాగ్గా) దయానందం !

దయానందం : అయ్యా !

లక్ష్మీపతి : నేను దేవున్ని అనుకున్నారా ?

దయానందం : మీరు అంతకన్నా గొప్పవారు. ఆ దేవుడు కరుణ చూపుతాడే కాని వచ్చి కాపాడలేడు. మీరు ఆపద్భాందవుడు.

లక్ష్మీపతి :  ఆ ఆపద్భాంధవులకు కూడ ఆపద వస్తుందని మరచిపోతున్నావు.

దయానందం : మీరలా అంటే నా భార్యాపిల్లలకు నేను దూరమవుతానండి.

లక్ష్మీపతి : నాకూ వున్నారయ్యా భార్యాపిల్లలు.

దయానందం : అది కాదండి. మీరు ఎలాగయినా చలాయించుకోగలరు. ఇంత ఆస్తి, పాస్తులున్నవారు.

లక్ష్మీపతి : ఇంతకు నీ భయమేమిటి దయానందం ?

దయానందం : మీకు తెలియంది ఏముంది ప్రెసిడెంటు గారు! ఈ రోజుకు ఎనిమిది రోజులు – గత మంగళవాడం నాడు పోయినవాడు…

లక్ష్మీపతి : సింగడా ?

దయానందం: ఔనండి.

లక్ష్మీపతి : అదేగదయ్యా నేను ఆలోచించేది. త్రాగుబోతు వెదవ ఇంతకు చెప్పింది చేసాడో లేక ఏ కల్లు దుకాణాలలో రాజ్యమేలుతున్నాడో…?

దయానందం: లేదండి. వాడు చెప్పింది చేసాడు.

లక్ష్మీపతి : అయితే నీకు భయమెందుకు?

దయానందం : అది కాదండి. మన యింటికి రోజు ఆ పోలీసువారు వచ్చిపోతుంటే…

లక్ష్మీపతి : వాళ్ళు మనకు బంధువులే. రమ్మంటేనే రారు, పొమ్మంటే పోరు. అది వారి ఉద్యోగం.

దయానందం : ఏమో? వారికి మనపైనే అనుమానం కలిగిందని నా నమ్మకం.

లక్ష్మీపతి : అలాంటి అనుమానమే వస్తే మనం బహుమానం కొద్దో గొప్పో యివ్వాల్సి వస్తుంది. అంతే.

దయానందం : ప్రెసిడెంటు గారు! ఎందుకో నాకు భయమవుతున్నది.

లక్ష్మీపతి : దయానందం గారూ! (హేళనగా అంటాడు)

దయానందం : అయ్యా! ప్రెసిడెంటు గారు !!

లక్ష్మీపతి : ఇప్పుడే యింత భయపడితే ముందుముందు మన పనులు జరగడం చాలా కష్టం.

దయానందం : మన పనులకన్నా ముందు మన పని జరిగేలా వుంది.

లక్ష్మీపతి : ఇలాంటి ధైర్యం నాకు చెప్పటానికేనా నీవు వచ్చింది?

దయానందం : లేదండి. రాత్రులు ఏవేవో కలలు వస్తున్నాయి. ఆ కలలలో మనం…

లక్ష్మీపతి : : ఆఁ మనం చెప్పవేం ఆగిపోయావు.

దయానందం : జైలు కెళ్ళినట్లు – ప్రజలు మనల్ని తిట్టినట్లండి.

లక్ష్మీపతి : ప్రజలు తిట్టకుంటే ముద్దు పెట్టుకుంటారా?

దయానందం : ఆ తిట్లు తినటం మనకు అలవాటేననుకోండి… మనం కారాగారానికి వెళ్ళినట్లు కూడా వచ్చిందండి.

లక్ష్మీపతి : అది ప్రజాద్రోహులకు మాత్రమే కారాగారము. నిజానికి అది కార్మాగారముతో సమానం. దాని వలన ఎంతోమందికి ప్రభుత్వోద్యోగాలు దొరుకుతున్నాయి దయానందం!

దయానందం : అయ్యా !

లక్ష్మీపతి : శ్రీకృష్ణుని అంతటివాడే అందు జన్మించాడు. అలాంటప్పుడు మనం వెళ్ళి వుండటానికి యింత భయమెందుకు?

దయానందం : ఏమోనండి. నా బ్రతుకంతా మీ చేతుల్లో వుంది.

లక్ష్మీపతి : (జేబులో నుండి సిగరెట్టు తీసి నోట్లో పెడ్తాడు. దయానందం తన జేబులో నుండి సిగర్ లైటు తీసి అంటిస్తాడు. లక్ష్మీపతి త్రాగుతూ) దయానందం నీకేం భయం లేదు.

దయానందం : అలా అభయమిచ్చారు నాకంతే చాలు.

 (లోపలి నుండి పిలుపు : “లక్ష్మీపతిగారూ ! లక్ష్మీపతి గారూ!! అన్న మాటలు వినిపిస్తాయి) (దయానందం భయపడుతూ) ఇన్స్పెక్టర్ వచ్చినట్టుంది.

లక్ష్మీపతి : లోపలికి రండి సార్. (ఇన్స్ పెక్టర్, ఇద్దరు కానిస్టేబుల్స్ వస్తారు) నమస్కారం సార్ !

దయానందం: న..మ.. స్కా..రం.. సార్ !

ఎస్.ఐ. : నమస్కారం

నమస్కారం

లక్ష్మీపతి : కూర్చోండి సారు ! (కుర్చీ చూపిస్తాడు)

ఎస్.ఐ. : క్షమించండి. ఐ ఆమ్ ఇన్ డ్యూటీ.

దయానందం: (వణుకుతుంటాడు)

ఎస్.ఐ. : దయానందం గారు వణుకుతున్నారు. జబ్బు ఏమైనా….

దయానందం : జబ్బేమి కాదండి. కాస్త జలుబు చేసింది. అంతే.

ఎస్.ఐ. : లక్ష్మీపతి గారు! మోహన్రాజు హత్య కేసుతో మీకు సంబంధం వున్నట్లు.. మాకు అనుమానం వుంది.

లక్ష్మీపతి : మీకు అనుమానమా ?

ఎస్.ఐ. : మాకు కాదు… ప్రజలకు.

లక్ష్మీపతి : ప్రజలలో పలురకాల మనుషులుంటారు. ద్వేషం మీద పగబట్టి యిలా లేనిపోని అనుమానాలు కల్పిస్తుంటారు.

ఎస్.ఐ. : దానికేం గాని, మీకు మోహన్ రాజుకు గత మంగళవారం ఏదో తీవ్ర ఘర్షణ అయినట్టుంది.

లక్ష్మీపతి : ఇలాంటి ఘర్షణలు యిదివరకెన్నియో జరిగినవి.

ఎస్.ఐ. : ఇదివరకు జరిగినవాటితో మాకు పని లేదు. గత ఎనిమిది రోజుల క్రితం మీకు, మోహన్ రాజుకు ఘర్షణ అయినదా? లేదా?

లక్ష్మీపతి : అంటే మీ అభిప్రాయం ?

ఎస్.ఐ. : అభిప్రాయాలతో మాకు పనిలేదు. అనుమానం వున్నవారిని అరెస్టు చేయటం మా విధి. దట్బాల్!

లక్ష్మీపతి : అయితే మీరు వచ్చినది….

ఎస్.ఐ. : అయామ్ వెరీ సారీ. మిమ్మల్ని అరెస్టు చేయడానికి….

దయానందం : (భయంతో తడబడుతూ) అ…….రె… ష్ణా ! ధర్మపురి పంచాయతి ప్రెసిడెంటు గారిని కూడ….

ఎస్.ఐ. : పంచాయతి ప్రెసిడెంటునే కాదు, అనుమానం కలిగితే ఇండియా ప్రెసిడెంటును, ప్రైమ్ మినిష్టర్ ను కూడ అరెస్టు చేయడానికి మాకు హక్కు వుంది అధికారమూ వుంది.

లక్ష్మీపతి : అనుమానానికైనా ఒక ఆధారం కావాలి. అకారణంగా పెద్దల్ని అనుమానించి అవమానపరచటం అంత మంచిది కాదు.

ఎస్.ఐ. : ఆధారాలు చూపి, అరెస్టు చెయ్యవలసిన అవసరం మాకు లేదు. ఆధారాలు లేక అందర్ని అరెస్టు చేసేంతటి అంధులం కాదు. అయినా అదృష్టము కొద్ది ఆధారం కూడ అందుబాటులోనుంది. వన్ వన్ సిక్స్! త్రి నాట్ త్రి !! మనకు దొరికిన ఆధారాన్ని తీసుకురండి (పోలీసులు వెళ్ళెదరు)

(లక్ష్మీపతి, దయానందం భయముతోను, ఆశ్చర్యముతోను చూస్తుండగా పోలీసులు సింగన్ని పట్టుకొని వచ్చెదరు)

ఎస్.ఐ. : ఇప్పుడేమంటారు. ఆధారమే కాదు. అందుకు ప్రబల సాక్ష్యం. మాట్లాడరేం లక్ష్మీపతి గారు? సింగన్న మాకు అంతా చెప్పినాడు. మీవంటి మేకవన్నె మనుషులను లెక్క పెట్టక ప్రతి కేసులోను అమాయకులనే మా డిపార్టుమెంటు వారు అరెస్టు చేయటం పరిపాటి అయిపోయింది. ప్రజా నాయకుల్లో కూడా మీలాంటి వారు వున్నారంటే అది మన దేశానికి, మన ప్రజా ప్రభుత్వానికి సిగ్గుచేటు (ఇంతలో ప్రకాశ్, సత్యం, కిశోర్, రంగనాధం, శారదల ప్రవేశం)

సత్యం : నమస్కారం ఇన్ స్పెక్టర్ గారు !

ఎస్.ఐ. : నమస్కారం ! సత్యం నీ అనుమానమే నిజం అయ్యింది. లక్ష్మీపతి గారి మీదయున్న అభిమానముతోనే నేనింత వరకు అరెస్టు చేయలేదు.

ప్రకాశ్ : ఇప్పటికైనా చేసినందుకు మీకు కృతజ్ఞులం.

ఎస్.ఐ. : కృతజ్ఞతలు చెప్పవలసింది మేము. ఈ హత్యకేసులో మాకు నిరంతరం మీరు చేసిన సహాయానికి మేము చెప్పుకోవాలి.

కిశోర్ : అక్రమాలను అణచటంలో అందరికి బాధ్యత కలదు.

ఎస్.ఐ. : మీ “ఆదర్శ యువజన సంఘము”నకు తగ్గట్టుగానే అన్నావు.

సత్యం : రంగనాథం గారు! అదుగో మీ ముద్దుబిడ్డను పొట్టన పెట్టుకున్న పెద్ద… మనిషి. అమ్మా ! శారదమ్మ గారు!! మీకు పుత్రశోకం పెట్టిన నిజమైన ప్రజా…నాయకుడు. (రంగనాథం, శారద విచారిస్తుంటారు.)

ఎస్.ఐ. : రంగనాథం గారు! మీరిద్దరూ మాతోనే రండి. మీ స్టేట్ మెంట్ మాకు చాలా అవసరం.

రంగనాథం : మంచిదండి ! (ఇన్ స్పెక్టర్ పోలీసులతో)

ఎస్.ఐ. : వీన్ని వ్యానులో నుంచి వీరిద్దర్ని అరెస్టు చేయండి.

(((పోలీసులు వచ్చెదరు)))

దయానందం : (భయపడుతూ) నేను ఏమన్నానండి. నాకు ఈ కేసుతో రవ్వంత సంబంధం లేదండి.

ఎస్.ఐ. : రవ్వంత సంబంధం వున్నవారితో మాకు పనిలేదు. మీకు ఈ కేసులో చాలా సంబంధం వున్నట్టు మాకు తెలుసు. హుఁ చూస్తారేం అరెస్టు చేయండి. (అరెస్టు చేస్తారు) కమాన్ (పోలీసులు లక్ష్మీపతిని, దయానందాన్ని తీసుకు పోతుంటారు) సత్యం! మీరు ముగ్గురు కూడ స్టేషన్కు రండి.

సత్యం : ఓ.కే. సార్ ! (ఇన్ స్పెక్టర్ వెళ్ళిపోతాడు)

రంగనాథం : బాబు సత్యం ! మీరు మా వూరుకు రావాలి. ఒక్క కొడుకును పోగొట్టుకున్నా. భగవంతుడు నాకు ముగ్గురు కొడుకుల్ని యిచ్చాడు. మీలో నా మోహన్ను చూస్తూ కాలం గడుపుతాను.

ప్రకాశ్ : బాబు గారు! మా స్నేహితుని ఆదర్శ ఆశయాన్ని లోకానికి చాటటానికే మేము మా జీవితాన్ని గడప దలుచుకున్నాము.

కిశోర్ : ఆదర్శ యువజన సంఘమే మాకు మోహన్ వదిలిపెట్టిన సంపద. దాని ఆదర్శాల ఆచరణమే మా జీవిత కర్తవ్యము.

రంగనాథం : మీ ఆదర్శ స్నేహానికి నేనెంతో అభినందిస్తున్నాను. వాడు లేని సంపద నాకెందుకు బాబు. నా ఆస్తినంతా మీ సంఘానికి విరాళంగా వ్రాస్తున్నాను.

సత్యం : బాబు గారూ !…

రంగనాథం : ఔను బాబు. నాకు ఆస్తి, అంతస్తుల మీదయున్న వ్యామోహమే – నా కన్న కొడుకునే పోగొట్టుకునేలా చేసింది. నావంటి తండ్రి ఈలోకంలో ఎవ్వరూ లేరు. ఉండరాదు కూడా (బాధ పడును.)

ప్రకాశ్ : ఇందులో మీరు చేసింది ఏముంది? అంత బాధపడుతున్నారు. అంతా విధి విలాసం.

రంగనాథం : (వత్తి పల్కును) “విధి… విలా…సం” – కాదు. అంతా మనిషిలోనే వుంది. అన్నింటికి మానవుడే కారణం బాబు ! మానవుడే కారణం. నా చేజేతులా నా వంశాంకురాన్ని తెంచుకున్నాను. నా మూర్ఖత్వం వల్లనే నా మోహన్ బలియయ్యాడు బాబూ ! బలియయ్యాడు (చాలా బాధ పడుతుంటాడు)

శారద : ఏమండి ! ఎందుకు బాధ పడుతున్నారు. (ఏడుస్తూ) మీ పంతం వల్లనేగా ఇంత ఘోరం జరిగింది. మనమెంత ఏడిస్తే మాత్రం బాబు తిరిగొస్తాడా ! చెప్పండి ?

రంగనాథం : శారదా ! నీకు పుత్రశోకం కలిగించింది నేను. నా జీవితానికిక శాంతి లేదు – శారదా! శాంతి లేదు. నా ఆవేశంలో వాడి ఆదర్శాన్ని గుర్తించలేకపోయాను. కన్న కొడుకునే కాదన్న కసాయివాణ్ణి.

శారద : ఏమండి ! అంతమాట అనకండి.

సత్యం : ఇదిగోండి బాబాయి గారు ! మంచిని కోరిన మహాత్ములకు దొరికే ఫలితం మట్టిపాలు కావలసిందే. ఈ లోకంలో అన్యాయానికే ముందుస్థానం. దాన్ని ఎదిరించువాడు అందుకు ఆహుతి కాక తప్పదు.

రంగనాథం : బాబు! ఏమిటి మీరంటున్నది?

ప్రకాశ్ : ఔనండి. అనుభవశాలులు. మీకు తెలియనిది ఏముంటుంది? గాంధీ మహాత్ముని అంతటివాడే అంతమయ్యాడు. ఇదిగోండి, మీరు కని, పెంచి పెద్ద చేసారు. మేము వాడితో ఆరేండ్లు సావాసం చేసాము. మాకు మాత్రం దుఃఖం లేదా? జరిగేది జరక్క మానదు.

కిశోర్ : సత్యం ! చాలా టైమ్ అయ్యింది. పదండి స్టేషన్ కెళ్లి స్టేట్ మెంట్ యివ్వాలి.

రంగనాథం : బాబూ సత్యం ! మీరు కూడ వరంగల్లుకు రావాలి.

సత్యం : “వరంగల్లు”కా ! ఎందుకండి? మాకు యిక్కడ చాలా పనులుంటాయి.

రంగనాథం : అది నిజమే బాబు ! కాని….

సత్యం : మరేమిటండి ? అంత అవసరమేముంది ?

రంగనాథం : అవసరమే బాబు! ఎంత ఆస్తి వుంటే ఏం లాభం? సుఖం కన్న ముఖ్యం శాంతి. శాంతి లేని యిల్లు స్మశానం లాంటిది. మా బాబు పోయినప్పటినుండియే జీవచ్ఛవము ల్లాగా బ్రతికాము. ఉన్న ఒక్కగానొక్క ఆధారాన్ని కూడ పోగొట్టుకున్నాము. ఎవరి కోసం బాబు ఆస్తి? ఏం చెయ్యాలి?

శారద: అందుకే బాబు. మీరు ముగ్గురు రండి. అంతా కలిసి వుందాం. మా మనస్సులు కాస్త కుదుట పడుతవి.

ప్రకాశ్ : అమ్మా! మీరు మరోలా అనుకోనంటే ఒక్కటి చెప్పెద.

శారద: చెప్పు బాబు !

ప్రకాశ్ : మోహన్ రాజు ఆత్మశాంతికి – వాడి జీవిత లక్ష్యానికి పాటుపడటమే మేము చేయవలసిన పని. ఆదర్శ సంఘాలు వూరూరా స్థాపించి.. నవ భారతాన్ని నవనందనంగా మార్చాలి. బూజు పట్టిన వర్ణ విభేధాలు భూస్థాపితం చేయాలి.

సత్యం : అన్యాయానికి పాల్పడే అవినీతిపరులను అణచాలి. ఆదర్శ సంఘాల ద్వారా “అంతా మనవాళ్ళే”నన్న నినాదాన్ని ఎలుగెత్తి చాటాలి.

కిశోర్ : ఇట్టి కర్తవ్య నిర్వహణలో ఎట్టి ఒడిదుడుకులు జరగకుండా చేయడమే మా లక్ష్యము.

రంగనాథం : మీ అందరి ఆశయం ఒక్కటేగా ! ఆ ఆశయసాధనకే నా సంపదను విరాళము యివ్వదలుచుకున్నాను. కనీసం ఈ విధంగానైనా నా కుమారునికి నేను సహాయము చేసిన వాణ్ణి అవుతాను. ఏమంటారు? బాబు.

ప్రకాశ్: సత్యం ! ఏమంటావురా?

కిశోర్ : ఇంకా అనేది, వినేది ఏముందిరా ? పెద్దలు చెప్తుంటేనూ…

సత్యం: మీ మాట కాదంటానా? అలాగే నండి.

శారద : పదండి బాబు. నాకన్న కొడుకులాగే మిమ్మల్ని చూసుకుంటాను. వానికి ఆత్మశాంతి కలగాలన్నా, నాకు పుత్రశోకం లేకుండా చేయాలన్నా మీరు తప్పక రావాలి. అక్కడే మీరు సంఘాన్ని స్థాపించండి బాబు.

సత్యం : అలాగేనమ్మా ! మోహన్ ! చూసావా నీ తల్లిదండ్రులు నీ ఆదర్శానికి ఆస్తిని విరాళంగా మన ఆదర్శ యువజన సంఘానికి సమర్పించారు. ఇకనుండి మన ఆదర్శ సంఘము విరామము లేకుండా మన ఆశయాన్ని అందరికి చాటుతుంది.

కులాలు, మతాలు పేద, ధనిక భేదాలు లేవని కలిసికట్టుగా బ్రతకమని ఈ లోకానికి ప్రబోధం చేస్తాం!

“అంతా మనవాళ్ళే మోహన్ అంతా మనవాళ్ళే”

ఊరూర మన సంఘానికి అనుబంధ సంఘాల్ని ఎన్నియో స్థాపించుతాము. కలకాలం నిలిచేలా పాటుపడతాము. నీ ఆత్మశాంతికి – ఈ విశ్వశాంతికి మారుపేరుగా మన సంఘం పని చేస్తుంది. “అంతా మనవాళ్ళే”నన్నదే మన సంఘ సిద్ధాంతాలలో మొదటిది. పదండి….

(అందరూ వెళుతుండగా…)

Xxx తెర పడును xxx

You may also like

Leave a Comment