వచన కవిత్వాన్ని ఉమ్మగిల్లనీయకుండ
వడ్డిస్తున్నారు అందరూ అని ఎగాదిగా చూడకండి
మార్మికత సంక్లిష్టత ప్రతీకలు లేకుండా కవిత్వమా అనుకోకండి
అవార్డు రివార్డుల కోసంకాదు
తాడిత పీడితుల కొరకే
సామాన్య జనుల కొరకే కవిత్వం
వాడుక భాష పచనం కాని వచన కవితలనకండి
సమాజ మనుగడకోసమే సామాన్యుల మాటలు కవితా వాహిని అయ్యేది
ఎవరేమన్నా కిమ్మనకుండా కవిత్వ బాటలో పోయేటోళ్లం
పద్యాన్ని అలంకార సమాసాల నింపకుండ
జిగిబిగి లేకున్నా గజిబిజి లేకుండా ఉండాలనుకుంటాము
పద ఫలహారాలు పంచుతున్నామనుకోని పరిహాసాలాడకండి
జరుగుబాటుకో తిరుగుబాటుకో రాయడం లేదు
జరిగిన వాస్తవాలను
వాడుక భాషలో రాసేటోళ్లం పెదవుల మీద చిరునవ్వుల భాషణ చేయటం
కాగితాలపై అందమైన ఆదర్శ కవిత్వం కురిపించడం
మనసు కుళ్లు కుతంత్రాలతో
కుతకుతలతో
తోటి కవుల అంతర్గత యుద్ధాలను కోరడం చేయం
కుల మత వర్గ విభేదాల కవిత్వ కుంపటులను రగిలించము
ఒకే భావజాలంలోనూ అంతర్యుద్ధాలనూ కోరము
భక్తి శృంగార భావకవులలో మతాలతో మనుషులు వేరై రాజకీయపు టెత్తులు కవుల హృదయాల్లో తిష్టవేసుకున్న కవులున్నా
అనైక్యత సృష్టించం
ఐక్యత చెడగొట్టం
కవులందరూ కాగితాల పెదవులపై కవితలవుతారు
ఎవరికి అర్థం కాని కవులుంటారు
ఎవరి ధోరణిలలో వారు ఉంటారు
సమాజ శ్రేయస్సొక్కటే అసలు నినాదమై
వినూత్న పోకడల బాటలేసుకుంటాం
వాద వివాదాల పోత పోసుకుంటాం
అసలు జనానికి అందాలన్నదేకాక
అస్సలు అంతరాలు లేకపోలేదుసుమా!
అందరు కవులొక్కతీరేకారుసుమా!
తోటి కవుల తొక్కి పైకెక్కి మహాకవులు ఉన్నారు!
తోటి కవులు పైకెదగాలని అక్కున చేర్చుకునే కవులూ ఉన్నారు!
కాల ప్రవాహానికి నిలిచే కవులున్నారు జన కవులున్నారు
స్వార్థం వీడి కవిత్వ సాంగత్యం కోరే కవులూ ఉన్నారు
ఉన్నమాటకు ఎవరు ఉలిక్కిపడక
అన్న మాటలను ఆలోచించండి
అందుకే అందరిని కోరుతున్న-
ఎడ్డీయకుండ్రి!
కవితా టపాసులు ఎడ్డీయకుండ్రి!!